AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. దివ్యాంగుల కథలు : చైతన్యం
పుప్పాల రూపులు
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8639144711, Email: prupulu@gmail.com
ఆచార్య జర్రా అప్పారావు
ప్రొఫెసర్ & హెడ్, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492495813, Email: drraojarra@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 01.11.2025 ఎంపిక (D.O.A): 30.11.2025 ప్రచురణ (D.O.P): 01.12.2025
వ్యాససంగ్రహం:
జీవితం చాలా చిన్నది. దానిలో అనుక్షణం సంతృప్తితో బతకాలని కోరుకునే వారు ఉండరు. ఇక సాధారణ వ్యక్తులు కన్నా భిన్నంగా గడపాల్సి రావడం పట్ల ఆవేదన ఉండవచ్చు.కానీ అవయవాలు లోపం సహకరించనప్పుడు, అనుకున్న విధంగా ఉండలేకపోతున్నామనే లోటు ఉంటుంది. ఏ తప్పు లేకుండానే విధి శాసిస్తే అందరిలా మేమెందుకు లేమనే ప్రశ్న వారిదవ్వచ్చు.దీంతో తమ పనులు చేసుకోలేక ఇతరులపై ప్రతి నిమిషం ఆధారపడే విధంగా ఉండటం విరక్తికి దారితీస్తుంది.అలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే వైనాలు నిరాశకు నిస్పృహకు లోను చేస్తుంటాయి. ఈ సంఘర్షణలు అధిక ప్రభావం చూపితే ఒక్కోసారి ఆత్మహత్యలకు దారి తీయవచ్చు.అలాగే ఈసడింపులు భరించలేక,తన వల్ల తనవారికి మనోవేదన ఎందుకనుకోవడమో కూడా వారిని మానసికంగా కృంగదీస్తుంటాయి. అలాంటప్పుడు కన్నవారో, తోబుట్టువులో, స్నేహితులో,ఆ నిరాశల్ని పారద్రోలి నువ్వు అందరిలాంటివాడివేనని తెలియజేయాలి. అందరిలా ఏది సాధించాలన్న కొంత కృషి పట్టుదల ఉంటే చాలు అన్నట్లు బ్రతుకులో ఆశావాదాన్ని నింపి గమ్యాన్ని నిర్దేశించాలి. అలా ఆత్మ విశ్వాసాన్ని తట్టిలేపుతూ వారిని నిలబెట్టే యత్నం చేయాలి. అటువంటి చైతన్యవంతమైన కథలను ఈ పరిశోధన పత్రంలో నేను విశ్లేషించడం జరిగింది, నిర్మాణాత్మక పరిశోధన పద్ధతి ద్వారా ఈ పరిశోధన పత్రాన్ని రాయడం జరిగింది. చిక్కా హరీష్ కుమార్ గారు "వికలాంగుల సాహిత్యం - సామాజిక చైతన్యం" అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడం జరిగింది.
Keywords: దివ్యాంగులు, ఆత్మవిశ్వాసం, చైతన్యం, స్ఫూర్తి, ధైర్యం, ఆత్మభిమానం, వైకల్యం
1. ప్రవేశిక
చైతన్యం అంటే ఒక కదలిక. ఎక్కడైతే మార్పు ఆశించబడుతుందో, అక్కడ ఆ మార్పుపై కృషి జరుగుతుంది. అది ఒకరి నుండి ప్రారంభం కావచ్చు, కొందరు కలిసి ఒక గుంపు ద్వారా కావచ్చు. కోరుకున్న పరిణామం, అభ్యుదయం ఆశిస్తూ చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం చేస్తుంది. ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారిన, ప్రాచీన నుండి నవీనతకు పయనించిన పరిణామం ఒక మార్పుగా నిలిచింది. అలాగే ఎక్కడ పీడన ఉంటుందో అక్కడ తిరుగుబాటే చైతన్యంగా మారుతుంది. దేని చేత దేన్ని సాధించలేక ఉన్నామో, దాన్నే గమ్యంగా చేసుకొని సాధించి చూపడం. అంటే పురోగమనం, అభివృద్ధి వైపు ఏరి కోరి సాగించే ప్రయత్నమే చైతన్యం. ఆ మార్గం స్ఫూర్తిని అందిస్తుంది. నిజానికి అది అంత సులువు కాదు. అక్కడ దావాగ్ని రగిలి ఒక నిర్ణయానికి, నిశ్చయానికి బీజం వేస్తుంది. అది మొలకెత్తి ఆకులు తొడిగి ఎదగడం కేవలం కృషిని అనుసరిస్తుంది. ఆ కృషి ఎంత ప్రతిభావంతంగా ఉంటే అంత త్వరగా ఫలపుష్పాదులు దక్కుతాయి. ఒక విజయాన్ని అందిస్తుంది. అక్కడ ఆరాటం, పోరాటం, తెగువ వంటివన్నీ ప్రతిఫలిస్తాయి. అలా తిమిరం అనే బాధ తొలగించబడి వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. బతుకు పంట పండి మార్గదర్శకం అవుతుంది. తపనతో పడే కష్టమే ఫలితమై ప్రశంసలను, సుఖసంతోషాలను, ఆధారాలను అందించి పడిన బాధలను మరిపించి మురిపిస్తుంది.
సాహిత్యం ఎప్పుడు సమాజహితాన్ని కోరుతుంది. అందులోనూ ఆధునిక సాహిత్యం శ్రేయస్సును ఆశించి పరిపుష్పం కాబడింది. సమాజానికి ఏది కావాలో దాన్ని అందించి అభివృద్ధి పథానికి పంపడమే ప్రధానం. అందుకే సమాజ వస్తువులే ప్రక్రియలోనికి చేరి తిరిగి సమాజాన్నే తాకుతుండడం గమనించగలం. ఇక కథా ప్రక్రియ అతి సులభంగా అందరికీ చేరగల సామర్థ్యం కలది. అందుకే దేనినైనా తనలో ఇముడుచుకొని ప్రయోజనాలను సమకూరుస్తుంది. జీవన చిత్రణలే కథలుగా రూపొందితే రచయితలు నలుదిక్కులనూ నిశితంగా పరిశీలిస్తున్నారని అర్థం. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ లోటుపాట్లను గమనిస్తున్నారని అర్థం. దీంతో అనుభవాలన్నీ ఊహలకు జోడించబడితే దాని ఫలితం పరమార్థమై ఒక మంచి ఉద్దేశంతో కథ వెలువడుతుంది. అందుకై సమస్యలు శోధింపబడి అవి తీరడానికి తగిన చైతన్యం అక్షరమై ప్రకాశిస్తాయి. ఇలాంటి తరుణాల్లో 'కాదేది కథలో అనర్హం' అన్నట్లు ఎక్కడ బలహీనతలు ఉన్నాయో కలాలు మరలి బలాన్ని సమకూర్చే యత్నానికి పాటుపడతాయి. అలాంటి ప్రయత్నమే అంగవైకల్యం సంబంధించిన కథల్లో కనిపించింది. చీకటి బతుకులు ఎవరికి పట్టనివి అయినప్పుడు సాహిత్యం వాటిని పొదిలి పట్టుకుంటుంది. 'నేనున్నాననే' భరోసా అందిస్తూ వారి జీవితాల్లో చైతన్యాన్ని నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తాయి. వికలాంగుల సమస్యల కారణాలను వెతికి, మార్పును కోరి వారి తరఫున కలాలు పనిచేస్తాయి. చైతన్యాలను వెతికి తీస్తూ మరే భయం వద్దంటూ ముందుకు ఎలా నడవాలో ప్రబోధించాయి. ఎక్కడ ఆ పరిణామాలు స్ఫూర్తిదాయకంగా ఉన్న వాటిని వెతికి పట్టుకొచ్చి దివ్యాంగులను చైతన్య పరుస్తాయి. అంగవికలాంగుల పట్ల కుటుంబాలు, సమాజం ఎలా ఉండాలో తెలియపరుస్తుండడం గొప్ప విశేషం. ఇదే కాకుండా వికలాంగులలోని స్ఫూర్తిని సాధారణ జనులకు అందించి వారి గమ్యాన్ని నిర్దేశించడం అభినందనీయం.
ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అందరూ వెక్కిరించినా, వెనక్కి లాగినా, వైకల్యం అడ్డుగా ఉన్నా, అన్నిటిని దాటి వెళ్లేవాడు విజయుడు. అతని పట్టుదల, కృషి సరైన ఫలితాన్ని అందించి సమస్యల్ని పారద్రోలగలవు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో కదిలితే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా జీవితాలను నిలుపుకోగలరు. ఎవరి ఆసరా లేకుండా తానే మరెందరికి ఆసరాగా మారడానికి తగిన దారి దొరుకుతుంది. అలాంటి చైతన్యవంతమైన ఒక కథను ఈ క్రింద పరిశీలిద్దాం.
2. దివ్యాంగుల కథలలో చైతన్య కిరణాలు
2.1. గుర్తింపు
ఈ కథను ఆసియా బేగం రాశారు. ఇది డాక్టర్ నాగరాజు అసిలేటి ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన మేము సైతం కథా సంకలనంలో ప్రచురితమైంది. వికలాంగులకు చైతన్యాన్ని అందిస్తున్న ఈ కథ వారి ఎదుగుదలకు వైకల్యం అడ్డు కాదని చెప్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపే యత్నం చేసింది. రామాపురంలో నివసించే లక్ష్మికి రవి అనే కొడుకు పుడతాడు. పుట్టు అంధునిగా చీకటి బతుకును ఈడుస్తూ తన వైకల్యానికి చింతించేవాడు. ఇది గమనించిన తల్లి అతని లోపాన్ని తలుచుకొని వేదన చెందకుండా గుర్తింపు తెచ్చుకోవాలన్న ధ్యేయాన్ని ఏర్పరచుకోవాలని ప్రబోధిస్తుంది. ఎలాగైనా ఎదగాలన్న తపనతో వైకల్యాలను అధిగమించిన దివ్యాంగుల గురించి తెలియజేస్తుంది. వారి చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలని తల్లి మాటను రవి ఆకలింపు చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాడు.
దివ్యాంగులు అంటే అవయవలోపం కలిగిన వారిని అర్థం. ఆ లోపం వారిని మానసికంగా, శారీరకంగా కృంగదీసేలా ఉంటుంది. అందరిలా చూడలేకున్నానని, అందరిలా నడవలేకున్నానని, అందరిలా వినలేకున్నానని, అందరిలా రూపు లేదని, అందరిలా తాను ఎందుకు లేననే ఆలోచనలు ఏదో ఒక సమయంలో పీకుతుంటాయి. దీంతో అందరూ అన్ని చేయగలరు, కానీ తాను మాత్రం ఆధారపడుతూ ఏమీ చేయలేదన్న ఆసక్తికి లోనవుతారు. ఈ భావన వారిని విరక్తి చెందించి ఒక్కోసారి ఈ బతుకే వద్దనే ఆత్మహత్యలకు కూడా దారి తీయించగలదు. అలాంటివి జరగకుండా వారికి ధైర్యం చెప్పి, లోపం ఒక అడ్డు కాదనే మానసిక స్థైర్యాన్ని పెంచాలి. అలాగే తనను తాను ప్రేమించుకునేలా, తన లోపాన్ని లోటుగా చూసుకోకుండా ఉండేలా స్వీయ ప్రేరణను చేయాలి. ఇవన్నీ ముందుగా నిర్వర్తించాల్సిన విధి కన్నవారికి ఉంటుంది. ఎందుకంటే వారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ బాధ్యత వారిపై ఉంటుంది. అలాగే ఈ సమాజం కూడా వికలాంగుల పట్ల సానుకూల వాతావరణంలో ముందుకు నడిపించేలా ఉండాలి. లేదంటే వైకల్యం ఒక భారంగా సదరు దివ్యాంగుని మానసిక బలహీనుని చేయవచ్చు. ఆ విధముగా వేదన పడుతున్న రవి అనే కుర్రాడుతో అతని తల్లి లక్ష్మి పలికిన మాటలు వికలాంగులలో చైతన్యాన్ని నింపేలా వ్యక్తం అవుతున్నాయి.
నాయనా బాధపడకు పేడ పురుగులా…పేడలో దొర్లుతూ…ఇదే జీవితం అనుకోకు. మనిషై పుట్టాక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న రూట్లో ఆలోచించాలిగానీ…మనమూ ఇలాంటి సాహసాలు ఇంతకు మించిన సాహసాలు కూడా చేయగలుగుతాం. నీ జీవితంలో ఏదో ఒక దశలో దిశలో నెంబర్ వన్ గా ఎదిగి అభినందనలు అందుకునే ప్రయత్నం చేయాలి. (బేగం 50)
ఈ తల్లి తన కొడుకుకి చెప్తున్న బోధనల్లో వైకల్యం ఉందని దిగులు పడకు అనే ఓదార్పు ఉంది. పుట్టుక లోపాన్ని చూడకుండా, దాన్ని దాటి ఎలా అభివృద్ధి పథంలో ఎదగాలో అన్న ఆలోచనలు చేయాలన్న ప్రబోధం ఉంది. అందరికీ ఎంత లోకువైనా, సమస్యలు ఎదురైనా, గెలిచి మన ముందు వరుసలో నిలిచి అందరి చేత 'ఔరా!' అనిపించుకునేలా ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదల, ధ్యేయాన్ని పూని కదలాలనే మార్గదర్శకాన్ని అందించే ప్రయత్నం ఉంది. సంపూర్ణంగా చెప్పాలంటే, 'వికలాంగుడు' అన్నది హృదయంలో నుండి తుడిచివేసే, పురోగమనానికి మేము ఏమి తీసిపోము అనే విధంగా అన్ని సాధిస్తూ చైతన్య దీపికులు కావాలన్న ఆత్మబోధను అనుసరించాలి. దానికే స్వీయంగాను, వేరొకరి నుండి స్ఫూర్తిని పొందేలాగను తనని తాను నిద్ర లేపుకోవాలి. ఇదంతా జరిగేలా తగిన మానసిక సంసిద్ధతను రవి తల్లిలా అందించాలి. ఆమె తన అందమైన కొడుకుకి కళ్ళు లేవన్నది మరిచిపోవాలని కోరుకుంది. ప్రపంచం కళ్ళను తన వైపు తిరిగేలా ఒక ఉన్నత విజయపథంలో నిరూపించుకోవాలని కొడుక్కి నూరిపోసింది. ఆ స్ఫూర్తి వికలాంగులందరికీ అత్యంత అవసరం అని తలచిన రచయిత్రి లక్ష్మీ పాత్ర ద్వారా నిర్వర్తించడం ఆమెలోని సామాజిక బాధ్యతకు నిదర్శనం.
సమాజాన్ని గమనించి చూస్తే వికలాంగులు తమలోని వైకల్యంపట్ల కలత చెందుతున్నారన్నది వాస్తవం. వారిలోని లోపాన్ని చూసుకుంటూ కుమిలిపోతున్నారు. తమ చుట్టూ ఉన్నవారిలా లేమనే వేదన ఒకవైపు, అందరూ అవహేళనగా చూస్తున్నారనే ఆత్మనూన్యత మరోవైపు, అందరికీ భారంగా మారానన్న దిగులు ఒకవైపు, తన భవిష్యత్తు ఏంటనే భయం, విరక్తి మరోవైపు ఇలా నాలుగు వైపుల నుండి చుట్టుముట్టే ఆలోచనలు వారిని ఆవేదనలకు గురి చేస్తుంటాయి. రవి కూడా అలాంటి భావనలకు సహజంగానే లోనయ్యాడు. కానీ అలాంటి తీరును గుర్తించి సరిచేయకుంటే ఆ నిరాశ విరక్తులుగా మారే ప్రమాదం ఉంది. అది గుర్తించాల్సిన విధి అతని చుట్టూ ఉన్నవారే. ఆ విధిని తల్లి చేత నిర్వర్తించడంలో ప్రతి తల్లి బిడ్డ వైకల్యాన్ని చూడక వాత్సల్యాన్నే చూపాలనే సందేశం ఉంది. బిడ్డను నడిపించే తొలి గురువు అమ్మే కనుక ఆమె చేత చైతన్యాన్ని వెల్లివిరిపించి చేయడం సబబు. ఇది ఒక రకంగా తల్లిని కూడా దిగులు చెందనీయక ఆమె బాధ్యతను గుర్తు చేయడంగాను చూడవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తల్లి పాత్ర చేత స్ఫూర్తిని రగిలించే వాక్యాలను ప్రేమగా, విధిగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించారనిపించింది. అలాగే ఆ బోధనను అనుసరించాల్సిన కర్తవ్యాన్ని వికలాంగులపరం చేస్తుండటం విశేషం. ఇది ఆత్మజ్ఞానంతో, ఒక కనువిప్పుతో, ఒక కదలికతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చేసే చైతన్యంగా విస్తృతపరచడం అభినందనీయం.
వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే వారెన్నో అద్భుతాలను సృష్టించగలరు. వారు ‘జననం ఒక సుప్రభాతం. మరణం ఒక సంధ్యారాగం’ అని కథలో చెప్పినట్లు తెలిస్తే అందరికన్నా ముందుండగలరు. జనన, మరణాలు ప్రతి ఒక్కరికి తప్పనివి. కానీ ఆ మధ్యకాలంలో తమ వంతుగా జీవితాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా మలుచుకున్నారు, ఏం సాధించారు అనేవి ప్రధానమవుతాయి. అలాంటి స్ఫూర్తిని ప్రస్తావిస్తూ నిజ జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేసి విజయ చక్రాలను అందుకుని కీర్తింపబడుతున్న వారి జీవన గాధల్ని వినిపించాలి. ఈ సూచనను అందించిన కథ ఒక ఆదర్శాన్ని చాటుకుంది.
“కాళ్లు చేతులు లేని మొండంతో నిక్ ఉజిసిక్ ప్రపంచ వ్యాప్తి ప్రేరణాత్మక ప్రసంగాలతో గుర్తింపు పొందాడు. కాళ్లు చేతులు లేకున్నా మాటనే తన వృద్ధి బాటకు ఎంచుకున్నాడు. ఫార్ములా వన్ లో కాళ్లను కోల్పోయినా అలెక్ జనార్ది నాలుగు ప్రపంచ టూరింగ్ కార్ ఛాంపియన్షిప్ విజయాలను గెలుచుకున్నాడు. అలాగే మూడు పారా ఒలంపిక్ బంగారు పతకాలను సైక్లింగ్ లో గెలుచుకున్నాడు. వీల్ చైర్స్ స్కేటరుగా అరోన్ పోథరింగ్ హామ్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.” ("వారి వైకల్యాన్ని అధిగమించడానికి")
ఇలాంటి వారి విజయాలకు వైకల్యం అడ్డు రాలేదు. ఈ ప్రేరణను రగిలించే దిశగా రుజువు చూపుతూ జీవితం పై ఆశను, గమ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రయత్నించాలి. సోదాహరణ యుక్తంగా తెలిపితే ఆ ఆలోచనలు 'నేను ఏదైనా సాధించి ప్రపంచం ముందు గర్వంగా నిలబడతాను' అనే దృక్పథాన్ని వికలాంగులలో పెంచుతాయి. అందుకే వారి జీవనతాలు, సంశయాలు పోగొడుతూ సరికొత్త చైతన్యంతో కదిలే తోడ్పాటును అందివ్వాలన్న విధికి ఈ కథను వేదిక చేయడం అభినందాత్మకం అనాలి.
2.2. తుది పయనం తొలి విజయం
ఈ కథను డాక్టర్ నాగరాజు అసిలేటి రాశారు. ఇది ఆయన సంపాదకత్వంలో వెలువడిన మేము సైతం కథా సంకలనంలో ప్రచురితమైంది. కథానాయకుడు, రామకృష్ణ బాల్య స్నేహితులు. ఇద్దరు ఒకే చోట పని చేస్తూ ఒకే ప్రాంతంలో వేరువేరు బహుళ అంతస్తులో నివసిస్తుండేవారు. కథానాయకుడు ఉండే చోట మీనాక్షి అనే ఒక మూగ బధిర యువతి ఇల్లు ఉండేది. ఆమెతో రోజు ఆమె తల్లి, తండ్రి, అన్న ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ, తిడుతూ, కొడుతూ ఉండేవారు. ఒక రోజు మీనాక్షి ఉత్తరం రాసి పెట్టి ఇంటి నుండి వెళ్లిపోతుంది. తన కాళ్లపై తాను నిలబడే దారి వెతుక్కుంటూ అక్కడ ఉండలేనని అందులో రాసి ఉంటుంది. ఒకసారి కథానాయకుడు, రామకృష్ణ ఉద్యోగ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్తారు. అక్కడ రైల్వే స్టేషన్లో మీనాక్షి కనిపిస్తుంది. తాను బి.ఎడ్ చదివి, డెఫ్ అండ్ డమ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నానని చెప్తుంది. ఆమె అంటే ఇష్టపడిన రామకృష్ణ ఆమెను పెళ్లాడతాడు.
దివ్యాంగ స్త్రీలలో చైతన్యాన్ని సూచిస్తున్న ఈ కథనం ఎంతో మార్గదర్శకంగా ఉంది. ఆడదంటే మామూలుగానే అలుసు. అందులోనూ అంగవైకల్యం ఉన్న ఆడపిల్లలంటే కన్నవారికి కూడా అలుసే. అనుక్షణం అదొక హింస. అయినా తన కాలపై నిలబడేందుకు వైకల్యంతో పాటు ఎవరితోనైనా పోరాడగలను అనుకుంటే అక్కడ చైతన్యం ఉందని లెక్క. అభిమానాన్ని దెబ్బతీస్తూ నీ బతుకుకి చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అంటూ మనసుపై కొడితే ఆ సమ్మెట పోట్లకు దూరంగా వెళ్లాలి. వారే అర్థం చేసుకోనప్పుడు, ఎవరైతే, ఏ సంస్థ అయితే వెలుగును అందించగలదో ఆ గొడుగు కిందకు చేరాల్సి ఉంటుంది. అనాథ అనిపించుకున్నా, అసాధ్యురాలై సాధించిందని మాట విన్నప్పుడు ఆ కష్ట ఫలితం గర్వంతో ఒప్పొంగేలా చేస్తుంది. ప్రతి ఒక్కరికి కుటుంబం ఒక బలం, స్నేహితులు ఒక ధైర్యం. వికలాంగుల విషయంలో అయితే కుటుంబం బలాన్ని, ధైర్యాన్ని అందిస్తూ వెన్ను తట్టాలి. వెన్ను కూల్చేలా ప్రవర్తించకూడదు. మీనాక్షికి వినబడదు, కనపడదు. కానీ ఆమెలో చదువుకోవాలనే ఆశ, నూతన పరిజ్ఞానంపై పట్టు సాధించాలనే జిజ్ఞాస ఉన్నాయి. ఆమె తెలివిని, తాపత్రయాన్ని ప్రోత్సహించని వారు ఇంట్లోనే ఉంటే అవి ఆమెకు పెద్ద సమస్య. ఆమె పై చదువుకు, శిక్షణకు డబ్బు దండగ అనే భావంతో పాటు, వికలాంగురాలు అంటే ఒక మూలన పడి ఉండాలన్న పెత్తనమే కనిపిస్తుంది. ఆమె చదువుకై పట్టిన పంతాన్ని ఈసడించి తిప్పి కొట్టడంలో వైకల్యం ఉంది. మనపై ఆధారపడింది, మనమేమన్నా మనమే దిక్కు అనే అహంభావం తప్ప బాధ్యతాయుతం లేదు. అలాంటప్పుడు ఆ ఇంటిని వీడి తన దారిలో వెళ్లాలనుకున్న మీనాక్షిలో ఒక వీరనారినే చూడగలం. బీఈడీ చేసి వికలాంగుల పాఠశాలలోనే ఉపాధ్యాయురాలుగా చేరిన మీనాక్షి వ్యక్తులతోను, పరిస్థితుల్లోనూ పోరాడి గెలిచింది. ఆమెలోని చైతన్యం ఆమెను ముందుకు నడిపించిందని చెప్పడంలో రచయిత అందించిన సందేశం మరెందరికో మార్గదర్శకం అయ్యేలా చేసింది. ఒక వికలాంగురాలు ఆత్మవిశ్వాసమే ఊపిరిగా కదిలిన ఆమె అనుకున్న గమనం వైపు వేసే అడుగులు భారమైనవే అయినా వాటిని అర్థం చేసుకుంటే ఆమె ఆ ఇంటికి ఒక వెలుగు అవుతుంది. మీనాక్షి ఇంట్లోని వారు దాన్ని గ్రహించని గుడ్డివారయ్యారు. ఆమె నిశ్చయాన్ని వినలేని బధిరత్వం వారిది. కానీ రామకృష్ణ వంటి వారికి అలాంటి చైతన్యాన్ని ఇష్టపడే పెద్ద మనసు ఉంటుంది. వైకల్యం పెళ్లికి అడ్డురాదంటూ చేయందించి తోడుగా నిలిచే విశాల హృదయం ఉంటుంది. యువతలో ఇలాంటి కదలిక ఉంటే దివ్యాంగుల జీవితాలు సంపూర్ణం కాగలవు. ఆమె చైతన్యాన్ని తెగ నరకాలన్న వారి నుండి తుది పయనమై ఆమెదైన ఉన్నత జీవనాన్ని చేరి తొలి విజయాన్ని అందుకుంది. ఇలాంటి విజయాలను అందుకునే అవగాహనలను అందిస్తూ 'ఎవరేమన్నా నీ దారిలో నీవు కదిలి నిరూపించుకోవాలి' అనే ఆకాంక్షకు ఈ కథ చైతన్య శిఖరం అని గ్రహించాను. 'స్త్రీ అబల కాదు, సబల' అని సాధారణ జనులు అనడం ఆధునిక కాలంలో ఒక ముందడుగు. అదే మాట ఒక దివ్యాంగురాలు అంటే అది పది అడుగుల లెక్కగా అభివర్ణించే దిశలో ఆలోచింప చేసిందనిపించింది.
2.3. గమ్యం
ఈ కథను డి. ప్రసూన శరత్ రాశారు. అందం, చదువు ఉన్న శ్వేత, ఆకాష్ ని ప్రేమించి పెళ్లికి ముందే గర్భం దాలుస్తుంది. ఈ విషయం తెలిసి ఆకాష్ ముఖం చాటేస్తాడు. దీంతో శ్వేత విషం తాగి చనిపోవాలని ఉద్యానవనానికి వెళుతుంది. ఆ పక్కన ఒక పసివాడి ఏడుపు విని వాడి వద్దకు వెళ్లగా ఒక 9 ఏళ్ల కాళ్లు చొచ్చుకుపోయిన కుర్రాడు వచ్చి ఆ పసివాడిని ఎత్తుకోబోతూ కింద పడతాడు. శ్వేతా ఆ కుర్రాన్ని లేపబోతుండగా వద్దని అతడే లేచి నిలుచుంటాడు. పసివాడి ఏడుపాపించి వాడి తల్లికి అప్పచెబుతాడు. అక్కడే ఉన్న ఒక పాప రాలి పడిన గులాబీ పూలన్నిటినీ ఏరుకుంటుంది. వాటిని తల్లికి ఇస్తే ఆమె వాటిని పొడిగా చేసి సౌందర్యశాలకు అమ్ముతుందని శ్వేతకు చెప్తుంది. ఒక నిర్ణయానికి వచ్చిన శ్వేత కడుపులోని బిడ్డను కని పెంచాలని విషం పడేస్తుంది. ఆ ఉద్యానవనంలో ఆకాష్ మరో యువతితో అశ్లీలంగా ప్రవర్తించబోగా ఆ యువతి అతడి చెంప పగలగొడుతుంది. అది చూసిన శ్వేతా అతడు వెనుక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
వికలాంగుల వలన ఇతరులు చైతన్యం పొందడం అనే అంశాన్ని కథ ఇముడ్చుకుంది. ఆశావాద దృక్పథం, మానవత్వం, పోరాటం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పుణికి పుచ్చుకున్న దివ్యాంగ కుర్రాడిని చూసి బతుకు పై విరక్తి చెందిన ఒక యువతి బ్రతుకుపై ఆశను పెంచుకోవడం ఈ కథ సారాంశం. మనిషికి కష్టాలు రావడం సహజం. కొందరు వాటిని కోరి తెచ్చుకుంటే కొందరు విధిచే వంచింపబడతారు. కానీ ఆ కష్టం, ఆ సమస్య ఎలా వచ్చినా కృంగిపోకుండా, కూలిపోతున్నా లేచి నిలబడి పోరాడటం ఆశావాద దృక్పథం. ఆ దృక్పథం ఉన్నవాడు ఎవరైనా గానీ తనకి కష్టం అనేది వచ్చిన తట్టుకొని సంతోషంగా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రతిదీ ఒక సవాల్ విసురుతుంది. అయినా దాన్ని స్వీకరిస్తూ, పరిష్కరిస్తూ, పట్టుదలతో అభివృద్ధి చెందాలన్న నిశ్చయంతోనే ఉండాలి. అలాగే ఉత్తమమైన మనిషి జన్మ లభించినందుకు సంతోషించాలి గానీ లోటును, లోపాలను చూడకుండా జన్మపై విరక్తిని పెంపొందించాలి అనుకోకూడదు. ఒక 9 ఏళ్ల వికలాంగ బాలుడులో ఉన్న చైతన్యం ఒక సాధారణ యువతిలో లేకపోవడానికి కారణం ఆమెలో లోపించిన ఆత్మవిశ్వాసం. తప్పు చేశానన్న భావన శ్వేత వంటి మానసిక బలహీనులది. ఏ తప్పు చేయకున్నా విధి వంచించిన వంచితులం కామంటూ ఆ విధిని ఎదిరించి నిలిచే ధైర్యం ఒక వికలాంగునిది. 9 ఏళ్ల బాలుని స్థితప్రజ్ఞత, స్వీకరించే తత్వం, 20 ఏళ్ల యువతికి లేకపోవడం ఇక్కడ గమనార్హం. తప్పు చేశానని, నమ్మి మోసపోయానని ఆమె వెనక్కి తల ఎత్తుకోలేనన్న భీతిని, ఆత్మన్యూనతను కలిగించింది. పోలియో తన కాలును లేకుండా చేసినా, తనను తాను నమ్ముకుని తల ఎత్తుకొని జీవితంపై ఆశతో చిగురించాలని అనుకోవడం వైకల్యం ఉన్నా ఎదురీదే తత్వం కుర్రాడుది.
ఎదగాలి అన్న వాడికి ఎదురయ్యే ప్రతికూలతలు ఒక లెక్క కాదు. అది దూదిపింజల మేఘాలు. అవి ఆ పోరాటానికి తలవంచి వర్షించే నూతన చిగురులను స్పృశిస్తూ జీవిస్తాయి. అవి సమస్యల ప్రతిరూపాలే కావచ్చు. వాటిని జయిస్తే అవి నేలజారి అనావాళ్లు లేకుండా ఇంకిపోతాయి. అదే వాటికి భయపడి తలవంచితే మొక్క వంటి జీవితాన్ని నేలలో పాతిపెట్టేయగలవు. ధైర్యం, ఆశావాదం, నేను పోరాడగలననే ఆత్మవిశ్వాసం, వెక్కిరించే లోకంతో నాకు పని లేదనే ధోరణి ఇవన్నీ ఒక వికలాంగులలో చూడగలం. అందుకే వైకల్యం అతన్ని నాలుగు గోడలకు పరిమితం చేయలేదు. చదువు, ఆటలు, పాటలతో జీవితాన్ని కథలోని కుర్రాడు ఆస్వాదిస్తాడు. కింద పడిన నా అంతట నేనే లేచి నిలబడతాననే ఆత్మగౌరవం అతడిని తట్టి లేపి నిలబెడుతుంది. బాధలోనూ ఇతరుల జాలి వద్దని తనను తానే కనులు విచ్చుకోమని వెన్ను చరుస్తుంది. కాళ్లు లేకున్నా, చేతులు లేకున్నా, కళ్ళు కనపడకున్నా, చెవులు వినిపించుకున్నా, కుష్టి అయినా, కురిపి అయినా అది శరీరానికే గానీ దృఢమైన మనసుకు కాదనే మనోనిబ్బరం ముఖ్యం. శ్వేత కుర్రాడులో అదే చూసింది. తోటలోని పాప తల్లి వైకల్యంతో ఇంటికి పరిమితమైనా తన చేతనైన పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ధైర్యంతో ఉంది. లోపాలున్నా తలెత్తుకొని నిలబడేవారు ఎవరెస్టు శిఖరాలు. అన్నీ ఉన్నా బిడ్డను పోషించుకునే సత్తా ఉన్నా బతుకును చాలించాలనుకున్న శ్వేత ఆలోచనలు పాతాళంలోనివి. వికలాంగుల్లోని చైతన్యం తనలో లేదని గుర్తించిన శ్వేత తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంది. చావటం పిరికితనం అని బతికి చూపించాలని నిర్ణయించుకుంది. అలాంటి స్ఫూర్తిని అందించడమనే ఉద్దేశ్యంతో ఉన్న ఈ కథ ఫలించిందనవచ్చు.
3. ఉపసంహారం
- వైకల్యం గల వ్యక్తుల విజయాలకు సంబంధించిన కథలు దివ్యాంగుల సమస్యలను తీర్చేలా ఉండటం వల్ల వారిలో తగిన చైతన్యం వెల్లివిరుస్తుంది.
- వికలాంగులు శారీరకంగా వైకల్యం కలిగి ఉండవచ్చు కానీ మానసికంగా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి జీవన పోరాటం ఎంతో మందికి ఆదర్శనీయం.
- వైకల్యాన్ని ఎత్తిచూపే పేరుకు బదులు దివ్యాంగులనే మర్యాదపూర్వక నామాన్ని ఉపయోగించడం సముచితం.
- సమాజం ఎంతగా అభివృద్ధి చెంది అధునాతనం చెందుతున్నా దివ్యాంగుల వెతలు మాత్రం తీరకపోవడం బాధాకరం. ప్రభుత్వం వారి రక్షణ కోసం చేసిన చట్టాలను వారికి తగిన సౌకర్యాలను సక్రమంగా అమలు చేయాలి.
- ఈ అధ్యయనం వికలాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో స్పష్టం చేసింది.
- సాహిత్యం, ముఖ్యంగా కథల ద్వారా, దివ్యాంగుల సాధికారతకు, సామాజిక అవగాహన పెంపుదలకు దోహదపడగలదని విశ్లేషించబడింది.
- కుటుంబం, సమాజం దివ్యాంగులకు అందించాల్సిన మానసిక మద్దతు ప్రాముఖ్యత ఈ కథల ద్వారా తెలియజేశారు.
- దివ్యాంగుల స్ఫూర్తిదాయక విజయ గాథలు ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాకుండా, వారిని కూడా పురోగమన పతంలో నడిపించగలవు.
4. ఉపయుక్త గ్రంథసూచి
- అసిలేటి, నాగరాజు, హరీష్ కుమార్ చిక్క, సంపాదకులు. మేము సైతం. చందు పబ్లికేషన్స్, 2017.
- ఎల్లయ్య, వేముల, శంకర్, సంపంగి, సంపాదకులు. అవిటి కథలు. [ప్రచురణకర్త వివరాలు లేవు], 2013.
- తాళ్లూరి, నాగేశ్వరరావు, హితశ్రీ, సంపాదకులు. శత వసంతాల తెలుగు కథ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2018.
- నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష. నవ్య పరిశోధక ప్రచురణలు, 2021.
- బేగం, ఆసియా. "గుర్తింపు." మేము సైతం, సం. నాగరాజు అసిలేటి, చందు పబ్లికేషన్స్, 2017, పు.
- రామారావు, ఎస్వీ. తెలుగులో సాహిత్య విమర్శ. పసిడి ప్రచురణలు, 2017.
- రెడ్డి, సి. నారాయణ. ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు ప్రయోగములు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2017.
- రమాపతిరావు, అక్కిరాజు, సంపాదకులు. తొలి మలితరం తెలుగు కథలు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, 2018.
- సోమయాజులు, చాగంటి. చాసో కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2023.
- "వారి వైకల్యాన్ని అధిగమించడానికి ఉదాహరణగా చెప్పుకొని ఎనిమిది ప్రసిద్ధ వ్యక్తులు." లైవ్ క్వికీ బ్లాగు, 18 ఫిబ్రవరి 2020.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

