headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

3. నెమలి కన్నులు: దళిత జీవన పరిణామాలు

వొటారికారి సందీప్

పరిశోధకులు, తెలుగుశాఖ,
హైదరాబాద్ విశ్వ విద్యాలయం
గచ్చిబౌలి, రంగారెడ్డి,తెలంగాణ.
సెల్: +91 9390280093, Email: sandeepkumarv2903@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.10.2025        ఎంపిక (D.O.A): 20.11.2025        ప్రచురణ (D.O.P): 01.12.2025


వ్యాససంగ్రహం:

సమాజాన్ని ఏ వ్యక్తి కూడా నేరుగా తనంతటతాను అర్థం చేసుకోలేడు. అలా అర్ధం చేసుకోవాలంటే అందుకు అతనికి తన జీవితకాలం కూడా సరిపోదు. కాగా సమాజం రెండు అంత్యాల మధ్య ఉన్న ఒక సరళ రేఖ లాంటిది కాదు. అది విభిన్న దొంతరల సమూహం. అనేక కోణాలను కలిగి ఉన్న సంఘర్షణ క్షేత్రం. కాబట్టి ఇట్లాంటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అనేక కారకాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అవి శాసనాలు, నాణాలు, కట్టడాలు. అయితే వీటన్నిటితోపాటు అతి ముఖ్యమైనది సాహిత్యం కూడా. ఎందుకంటే మాక్సిమ్ గోర్కి అభిప్రాయం ప్రకారం “సాహిత్యం సమాజాన్ని చూపించే దర్పణం లాంటిది”. ఎందుకంటే సాహిత్యమే సమకాలీన సమాజాన్ని రికార్డు చేస్తుంది. చరిత్రకారులకు కావలసిన కాల రేఖను నిక్కచ్చిగా అందిస్తుంది. అట్లాగ సాహిత్యంలో చరిత్రను రికార్డు చేసే ప్రక్రియల్లో ‘స్వీయ చరిత్ర’ అతి ముఖ్యమైనది. దీనిని ‘ఆత్మకథ’ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ స్వీయ చరిత్ర పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన ఆధునిక సాహితీ ప్రక్రియ. సామాన్యంగా అన్ని స్వీయ చరిత్రలు ఒకే లాగా ఉండవు. అందుకు కారణం ఇతరుల ఆత్మకథలతో పోల్చుకుంటే దళితుల ఆత్మకథల్లో దుఃఖం, వేదన ప్రధానంగా ఉంటుంది. వాస్తవానికి ఇవే అప్పటి సమకాలీన సమాజానికి చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇలా ఇవి తెలుగు సాహిత్యంలోకి చాలా అరుదుగా వస్తుంటాయి. అట్లాగా అరుదుగా వచ్చిన ఇప్పటి స్వీయ చరిత్రే ఈ ‘నెమలికన్నులు’. ఈ నెమలి కన్నులు ఆత్మకథ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు. ఇది మొదట్లో భూమిపుత్ర పత్రికలో ప్రతివారం ప్రచురించబడి 2023వ సంవత్సరంలో పుస్తక రూపంలో ముద్రితమైంది. ఇప్పుడు ఈ ఆత్మ కథను దళిత జీవిత పరిణామ క్రమంలో పరిశీలించి ఫలితంశాలను ఈ పరిశోధన వ్యాసంగా తెలుపుతున్నాను. ఇందుకోసం నెమలికన్నులు ఆత్మకథ తో దళిత చరిత్రను పునర్ మూల్యాంకనం చేసి దళిత జీవితాల్లో విద్య ప్రాముఖ్యతను వివరించడం ఈ వ్యాస పరిమితి. మూల గ్రంథంగా నెమలి కన్నులు ఆత్మకథ, అట్లాగే తెలుగులో స్వీయ చరిత్రలు, మా నాయన బాలయ్య, తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్ కంపెనీ పాలన, దళితుల చరిత్ర, అంబేద్కర్ రచనలు, ఇతర అంతర్జాల సమాచారాలు మొదలైనవి ఈ వ్యాసరచనకు ద్వితీయ ఆకారాలుగా తోడ్పడ్డాయి. కాబట్టి ఆయా ఆకారాలలో తెలిపిన దళిత జీవిత చరిత్రను సాంస్కృతిక, సామాజిక, విద్యా ప్రభావాలతో గుణాత్మక పరిశోధన పద్ధతిలో విశ్లేషించడం జరిగింది. సామాజిక వ్యవస్థలో దళిత జీవిత పరిణామ క్రమం ఎలా ఉంది? వారి ఉన్నతికి విద్య ఎలా తోడ్పడిందో తెలుసుకోవాలనుకునేవారికి ఈ వ్యాసం ప్రామాణికమవుతుందని చెప్పవచ్చు.

Keywords: సమాజం, స్వీయ చరిత్ర, ఆత్మకథ, నెమలి కన్నులు, దళిత జీవిత పరిణామ క్రమం, విద్య ప్రాముఖ్యత

1. ప్రవేశిక

పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన అనేక ప్రక్రియలలో స్వీయ చరిత్ర ఒకటి. దీనిని 'ఆత్మకథ', 'ఆత్మ చరిత్ర', 'అనుభవాలు జ్ఞాపకాలు', 'గత స్మృతులు' అని (అక్కిరాజు, రమాపతిరావు) కూడా పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక సమాజంలోని వివిధ కాల పరిస్థితులు, పరిణామాలు వాటి క్రమబద్ధతను ఈ స్వీయ చరిత్రలే రికార్డు చేస్తాయి.

రచయిత తన జీవితాన్ని సింహావలోకనం చేసుకొని తాను సాధించినవి, అధిగమించిన అనర్ధాలు, అపార్థాలు, మొత్తం జీవిత ప్రయాణ దిశను పునరాలోచన చేసుకొని కార్యనిమగ్నుడై చేసే రచన స్వాత్మార్పణ బుద్ధితో (పలికేడిది / పలికించెడు వాడది) ఉండకూడదు. తాను ఒక కాలానికి సంబంధించిన చరిత్రను (సామాజిక పరిస్థితులను) రికార్డు చేస్తున్నాననే పూర్తి స్పృహతో సత్యాన్నే చెప్పాలి. అప్పుడే ఆ రచన పరిపూర్ణత సంతరించుకుంటుంది. కాబట్టి కల్పించి చెప్పిన విషయం కన్నా యదార్థంగా చెప్పిన విషయమే ఇతరులకు దారి దీపం అవుతుంది (Truth is stronger than fiction). ఈ కోవలోనే అప్పటి సామాజిక పరిస్థితులను తన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెమలి కన్నులలో ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ రచయిత చేసిన ఈ నెమలి కన్నులు ఆత్మకథ (బాల్యం) ఇంతకుముందు వివరించినట్లు భూమిపుత్ర దినపత్రికలో ధారావాహికగా వచ్చి అనేకమంది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తరువాతే 2023లో ముద్రణ పొంది పుస్తక రూపంలోకి వచ్చింది. ప్రధానంగా ఈ ఆత్మకథలో వారి జీవితపు మొదటి భాగం బాల్యానికి సంబంధించిన విషయాలే కనిపిస్తాయి. స్వతహాగా కవి అయిన ఏ వ్యక్తి కూడా గతానుభవాల (nostalgia) నుండి బయటపడలేడు. అందుకే ప్రతి కవి తన కవితలోనో, రచనలలోనో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ నెమలి కన్నులలో కూడా వీరు మొదటి భాగంగా కేవలం బాల్యాన్ని మాత్రమే వివరించారు. అయితే ఈ మొదటి సంచికను చారిత్రక కోణంలో పరిశీలించి అప్పటి సామాజిక, సాంస్కృతిక పరిణామాలు ఎలా ఉన్నాయి? దానిపై విద్య ప్రభావం ఎలా ఉందో అన్వయించి చెప్పడం వల్ల ఈ దేశ దళిత జీవితాలలో ఉన్న వేదన బహిర్గతమై, దానిని రూపుమాపే యౌగికంగా విద్య ఎంతటి ప్రాముఖ్యతను కనబరుస్తుందో మనకు అర్థమవుతుంది.

2. సాహిత్య సమీక్ష

ఇప్పటి వరకు నెమలి కన్నులుపై “ఓ స్వాక్నికుడి సంఘర్షణ వెలుగురేఖలే నెమలి కన్నులు”, “నిజాయితీకి నజరానా నెమలి కన్నులు”, “దళిత జీవిత స్రవంతి – నెమలి కన్నులు”, “ఆత్మగౌరవపు ఆత్మకథ నెమలి కన్నులు”, Dr. J.V. చలపతి రావు గారి “Nemali Kannulu Autobiography: A Distinctive Discourse in Caste–Education Theory” (అముద్రితం) వంటి వ్యాసాలు వచ్చాయి. ఇవన్నీ ఆత్మకథలోని సంఘర్షణలు, దళిత వాతావరణం, వెంకటేశ్వరరావు పట్టుదల, వృత్తి మార్పు గురించి మాత్రమే చర్చించాయి. అయితే తెలుగు దళిత జీవితం ఎలా పరిణామం చెందింది? ఆ పరిణామంలో విద్య ఎంత కీలకమైంది? అనే ప్రశ్న మాత్రం స్పష్టంగా ఎవరూ ప్రస్తావించలేదు. ఈ వ్యాసంలో నేను ఆ ఖాళీని పూరిస్తూ దళిత జీవిత మార్పు–విద్య సంబంధాన్ని నెమలి కన్నులు ఆధారంగా ప్రయత్నం చేస్తాను.

3. కథాసంగ్రహం

ఈ ఆత్మకథ "నిజంగా నేను నా ఆత్మకథ రాయాలా? తరుముకొచ్చే అవమానపు అగ్నిపర్వతాలు నా ఉద్వేగాలని ఒడిసిపట్టి నేను రాయగలనా?" అని (దార్ల 4) వాక్యాలతో ప్రారంభమైనప్పటికీ, దీనిని పూర్తిగా చదివిన పాఠకుడు మాత్రం అసలు వీరు ఇంత ఉద్వేగ భరితంగా, తమ వ్యక్తిగత అవమానాలు, అనుభవాలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించడానికి అన్నీ ఒక్కసారిగా గుర్తుచేసుకొని ఎంత మానసిక సంఘర్షణను అనుభవించి ఉంటారోనని అనుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ నెమలి కన్నులు ఆత్మకథ (బాల్యం) మొదటి సంచికలో రచయిత దార్ల వెంకటేశ్వరరావు తమ స్వగ్రామమైన చెయ్యరు అగ్రహారంలో వారి కుటుంబం నిలవడానికి భూమి ఎలా వచ్చిందో, వారి ఇంటి పేరు ఎలా ఏర్పడిందో తెలుపుతారు. అలానే ఆ ఊరి సామాజిక పరిస్థితులను వివరిస్తూ దానిలో భాగంగానే కోనసీమ విశేషాలను పరిచయం చేస్తారు. ఆ ఊరిలో ఉన్న గుమ్మడి చెరువు, దేవాలయాలు, చర్చిలు అన్ని గుర్తు చేసుకుంటారు. ఈ జ్ఞాపకాల్లోనే మునుగుతూ ముంజకాయల్ని నైపుణ్యంతో కోస్తున్న తన తండ్రి పనితీరుకు "అబ్బాయి నీ దగ్గర ఉన్న రహస్యం ఏంటో చెప్పు" అని (దార్ల 15) తమ తండ్రిని ఊరివాళ్లంతా పొడిగిన సందర్భాన్ని మళ్లీ పసి హృదయంతో జ్ఞప్తి చేసుకొని మురిసిపోతాడు. తన తండ్రి చేపలకు వలవేసింది, కొబ్బరికాయలు దించింది, చిన్నప్పుడు తను ఇష్టంగా తిన్న వాయికుడుం - ఇవన్నీ తలుచుకుంటూనే తమ పేర్లు ఇష్ట ప్రకారం ఎందుకుండవో వివరిస్తాడు. బాల్యంలో వెన్నెలను చూస్తూ నిద్రపోని వారంటూ ఎవరూ ఉండరని అంతా అనుకునే విషయమే కదా! ఈ ఆత్మకథలో ఈయన కూడా చందమామను చూస్తూ, దాని చుట్టూ ఉండే నక్షత్రాలను చూస్తూ అనేక కథలు విన్నానని అందులో భాగంగా అరంజోతి (అరుంధతి) ఎవరో తన తల్లి ద్వారా తెలుసుకున్నానని చెబుతుంటాడు. అలాగే తనకు పాఠశాలలో ఎదురైన చేదు అనుభవాలు, సాధించిన విజయాలు, ఇబ్బంది పెట్టిన అవమానాలు (పాలేరు తనం), కుల ధ్రువీకరణపత్రానికి సమాజం చూపిన చిన్న చూపు, హాస్టల్ అనుభవాలు - ఇవన్నీ ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ, బాల్య సన్నివేశాల్లోకి మనల్ని లాక్కెళతారు. ఇది మొత్తంగా నెమలి కన్నులు (బాల్యం) సంచికలోని వారి జీవితపు ప్రథమాంక విశేషాలు.

4. దళితజీవితం: పరిణామం

ఈ ఆత్మకథలో రచయిత దార్ల వెంకటేశ్వరరావు తమ గ్రామాన్ని పరిచయం చేస్తున్నప్పుడే తనది దళిత కుటుంబంగా చెబుతాడు. "మన వాళ్ళు ఎవరు చూసిన ఊరికి చివరిలోనే ఇల్లు కట్టుకుంటున్నారెందుకు" అని (దార్ల 11) తనకు చిన్న వయసులో అనిపించిన ప్రశ్నతోనే సమాజంలో దళితులకు ఉన్న స్థానం ఎలాంటిదో చెప్పకనే చెబుతాడు.

నిజానికి భారతీయ సమాజమంతా కూడా విభిన్న కులాలతో వడికిన ఒక సామాజిక వస్త్రం లాంటిదని చెప్పవచ్చు. ఇందుకు మూలాలను మనం మనుస్మృతి అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు,

"లోకానం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరూపదతః
బ్రాహ్మణం, క్షత్రియం, వైశ్యం శూద్రంచ నిరవర్తయత్ " (31 శ్లో, ప్ర.అధ్యాయం, నల్లందిఘల్ 287)

దీని ద్వారా లోక అభివృద్ధి కొరకు ముఖము, బాహువులు, ఉరువుల నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఏర్పడితే, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారని తెలుపబడింది. అయితే నాలుగు వర్ణాలుగా ఉన్న ఈ వ్యవస్థ చూడటానికి అచ్చంగా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇందులో బ్రాహ్మణులు పైన ఉంటే, శూద్రులు కింద ఉంటారు. ఇలా పైనుంచి కిందికి ఉన్న ఈ వ్యవస్థలో పైనున్నవారు కింద ఉన్న వర్ణాల వారి స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అట్లాగే వారి వారి వర్ణాల వారిని (సవర్ణులను) అనులోమ వివాహం చేసుకోవచ్చు కానీ, విలోమ వివాహాలకు అర్హత లేదు. ఒకవేళ అట్లాంటి వివాహాలు జరిగి వర్ణసంకరణ అయితే తద్వారా పుట్టిన వారు అంత్యజులు, చండాలురు అవుతారు. అయితే మారుతున్న సమాజ దృష్ట్యా తదనంతర కాలంలో వీరినే (అస్పృశ్య) దళిత కులాలుగా పిలిచారు.

అయితే ధర్మసూత్రాలు, మనుచరిత్ర, బ్రాహ్మణ గ్రంథాలు వంటి వాటిలో శూద్రుల ప్రస్తావన తప్ప అంటరాని వారి ప్రస్తావన కనిపించదు. వీటన్నింటి కన్నా ముందుగానే, మౌర్యుల కాలంలో బౌద్ధ, జైన సాహిత్యాలలో చండాలుర ప్రస్తావన కనిపిస్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థలో అంటరానివారిని చేర్చలేదని కౌటిల్యుడు పేర్కొంటే, చేర్చినట్టుగా పాణిని తెలిపాడు. ఇక మనువు నాలుగు వర్ణాల వారితో పాటు అంత్యజులను వేరుగా చూపించాడు (చిన్నారావు 9).

క్రీ.శ. 5వ శతాబ్దానికి వచ్చేసరికి కఠినమైన ఆదేశిక సూత్రాలు, సిద్ధాంతపరమైన న్యాయశాస్త్ర గ్రంథాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ కాలంలో భారతదేశానికి విచ్చేసిన చైనా యాత్రికులు ఫాహియాన్, హ్యూయాన్ త్సాంగ్ తమ రచనలలో వీరిని నీచ వృత్తులు చేసేవారిగా, బహిష్కృతులుగా, ఉరిశిక్ష అమలుపరిచే వారిగా (ఉదా: మృచ్చకటికం నాటకం) పేర్కొన్నారు. తరువాత గుప్తుల కాలంలో, ఈ అంత్యజులు/చండాలులు నగరాల వెలుపల నివసించేవారు. వారు వస్తున్నప్పుడు కర్రతో శబ్దం చేసి అందరికీ తమ రాకను తెలియజేసేవారు (చిన్నారావు 11). ఈ విధానం కేవలం రాజరిక వ్యవస్థలోనే కాకుండా జైన సాహిత్యాలలోనూ కనిపిస్తుంది. అక్కడ జంగితాలు (జన్మతః అంటరానివారు), కర్మజంగితాలు (అంటరాని దేహం కలిగిన వికలాంగులు) అని రెండు రకాలుగా పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యాలలో మాత్రం చండాలులు, వేనలు, నిషాదులు, పుక్కాసులు పుట్టుకరీత్యా హీనజాతులుగా వివరించబడ్డారు.

ఈ వ్యవస్థను వివరించడానికి క్రీ.శ 11 వరకు శాసనాలు మాత్రమే ఆధారంగా ఉన్నాయి తప్ప సాహిత్యం అంతగా లభ్యం లేదు. క్రీస్తుశకం 14వ శతాబ్దంలో హిందూ పురాణాల అనువాదం మొదలై బౌద్ధ ప్రాబల్యం తగ్గింది. ఫలితంగా జైనం ఉత్థాన స్థితిని చేరుకుంది. అప్పుడు విద్యావ్యవస్థలో బ్రాహ్మణుల కన్నా బౌద్ధ, జైన పాఠశాలలకే ప్రాముఖ్యత ఉండేది. కానీ ‘రాజరాజ నరేంద్రుడు’ వంటి రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానంగా ఇవ్వడం ప్రారంభించిన తర్వాత, వైదిక వర్ణాశ్రమ ధర్మాలు మరలా బలంగా స్థిరపడ్డాయి. క్రీ.శ 14-15వ శతాబ్దాలలో మను చరిత్ర, కళాపూర్ణోదయం వంటి రచనలతో సాహిత్య వస్తువంతా మత ప్రధానంగానే మారింది. అదే సమయంలో కవులు అగ్రహారాల కోసం పోటీ పడి పురాణాలను కేంద్రంగా తీసుకొని రచనలు చేయడంతో సామాజిక వాస్తవాలు సాహిత్యాలలో తగ్గిపోయాయి. ఈ కాలంలోనే అంటరాని వ్యవస్థను బలపరిచి శిక్షలను విధించడం మొదలైంది (చిన్నారావు 13).

అయితే సమాజం ఎప్పుడూ నిద్రాణంగా ఉండదు. అదే సమయంలో సమాంతరంగా ప్రతిఘటించే వ్యవస్థలు కూడా ఏర్పడి సామాజిక రుగ్మతలను ఖండిస్తాయి. అందుకు ఉదాహరణలే, క్రీ.శ. 8వ శతాబ్దంలో వచ్చిన భక్తి ఉద్యమం, 11వ శతాబ్దంలో వచ్చిన లింగాయత ఉద్యమం (కన్నడ ప్రాంతం), 13వ శతాబ్దపు మహానుభావ ఉద్యమం (మహారాష్ట్ర), 15వ శతాబ్దపు సిక్కు ఉద్యమం మొదలైనవి. సాహిత్య పరంగా 17వ శతాబ్దంలో వేమన సమాజంలోని దురాచారాలను విమర్శిస్తూ అనేక పద్యాలు రచించాడు. 18–19వ శతాబ్దాల వరకు అంటరానివారి బాధలను కథావస్తువుగా ఎవరూ పెద్దగా చెప్పలేదు. అందుకు ప్రధాన కారణం అప్పటికే తెలుగులో పాశ్చాత్య ప్రభావం ప్రారంభం కావడం.

19వ శతాబ్దం చివరిలో మూడు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి:

  1. బ్రిటిష్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు,
  2. అగ్రవర్ణాలవారి దురాచారాలపై ఖండన,
  3. దళితుల స్వీయ చైతన్యోదయం.

దీనికి కారణం బ్రిటిష్ మిషనరీలు దళితులను క్రైస్తవ్యంలో చేర్చుకోవడమే. 20వ శతాబ్దంలో ఆది హిందూ సమాజం, జాషువా రచనలు, అంబేద్కర్ భావజాలం దళిత సమాజాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా చైతన్యవంతం చేశాయి. ఇక 20 శతాబ్దంలో ‘ఆది హిందూ సమాజం’, జాషువా రచనలు, అంబేద్కర్ భావజాలం దళిత సమాజాన్ని చైతన్యవంతం చేశాయి. మొత్తంగా ఇది దళిత జీవిత పరిణామ క్రమం.

అయితే, ఈ నెమలి కన్నులు ఆత్మకథని ఈ చారిత్రక కోణంలో పరిశీలించినప్పుడు 70వ దశకం తర్వాత కోస్తా ప్రాంతంలోని దళిత జీవితాలు ఎలా ఉన్నాయో పాఠకుడికి అర్థమవుతుంది. ఒక సందర్భంలో రచయిత దార్ల వెంకటేశ్వర రావు ఇలా అంటారు:

"దళితులకు దేవాలయ ప్రవేశం లేదని చెప్పలేం కానీ, దళితులు ఎవరు ఆ దేవాలయాల్లోకి వెళ్లి అందరితో కలిసి కల్యాణోత్సవాలు పూజలు చేస్తారని మాత్రం గట్టిగా చెప్పలేం"

" మాకు ప్రవేశం ఉందని చెప్పడానికి తప్ప వాళ్ళ ముఖాన్ని చూస్తే మనది కాని చోటుకో దేవాలయానికో వెళ్తున్నట్టుగా కనిపిస్తాయి. అందువల్ల దళితులు అత్యధికంగా చర్చిలోకి వెళ్తుంటారు" (దార్ల 12-13)

తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే 70వ దశకం తర్వాత కూడా దేశంలో కులం ఎలా వేళ్ళూనుకొని ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

5. రచనాశైలి

స్వీయ చరిత్రలు ఆత్మకథలు ఒక కాలపు పరిస్థితులను, పరిణామాలను రికార్డు చేస్తాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే దాన్ని అభివ్యక్తం చేస్తున్న రచయిత తన జీవిత గాథను తానే స్వయంగా చెబుతున్నాననే (అక్కిరాజు, రమాపతిరావు) స్పృహ కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఆత్మకథ యదార్థవంతంగా ఉండి వారు నడిచి వచ్చిన దారి ఇతరుల మార్గానికి కరదీపికలవుతాయి. అందుకోసం రచయితలు తమ ఆత్మకథను ఆత్మాశ్రయ పద్ధతిలో నడిపిస్తూ, ఉత్తమ పురుష (నేను అనే దగ్గర ఆ రచయిత అని స్పృహ పాఠకులకు వచ్చేలా)ను ప్రధానంగా ఎంచుకుంటారు. ఈ నెమలి కన్నులలోనూ రచయిత ఈ విధానాన్నే అనుసరించాడు. సాధారణంగా దళిత జీవితాలలో వేదన ఉంటుంది. ఆ వేదనను సహజ వ్యక్తీకరణలో చెబితేనే పాఠకుడికి సదరు దళితుల బాధ అర్థమవుతుంది. అందుకోసం రచయిత మాండలిక పదాలను (ఆకుమడి, అడ్డపొగ, కంప, కనికలు, బేటాలు, తొరాలు, నీలకచ్చికలు, మడదకొక్కులు, తేగలు) సహజంగా వినియోగిస్తాడు. ఇది ఈ నెమలి కన్నులు ఆత్మకథలోనే కాదు తెలంగాణ దళిత (మాదిగ) ఆత్మకథ అయిన ‘మా నాయన బాలయ్య’లోనూ, చారిత్రక సాక్ష్యమైన దాశరథి రంగాచార్యుల ‘చిల్లర దేవుళ్ల’లోనూ, ఎండ్లూరి వారి ‘మల్లె మొగ్గల గొడుగు’ మాదిగ కథలలోనూ కనిపిస్తుంది. ఈ అంశం స్థానికతను గుర్తించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక సందర్భంలో "పోనీవ్వే.. ఆయనకేదో పెట్టాలనిపించింది.. వాళ్ల కొడుకులా అనుకున్నారేమో అన్నాడు నాన్న " అని (దార్ల 39) దార్ల వెంకటేశ్వర రావు తమ తండ్రి పాత్రను చెబుతున్నప్పుడు అతని శైలిలోనే ఆ మాటలను పలికించిన తీరు ‘వైయుక్తిక శైలిగా’ కనిపిస్తుంది.

స్వీయచరిత్ర అంటే సాధారణంగా అందరికీ వచనమే గుర్తుకు వచ్చినా, మండపాక పార్వతీశం కవి, తిరుపతి వేంకట కవుల వంటి పద్య కృతులు, గుర్రం జాషువ, తుమ్మల సీతారామమూర్తి, పెన్మత్స సత్యనారాయణ రాజు లాంటి ఆధునికుల్లోనైనా పద్యకృతులు లేకపోలేవు. కాబట్టి ఆత్మ కథలు పద్యమా? వచనమా? అన్నది పక్కకు పెడితే అది పాఠకుడికి చేరవేసే మాధ్యమమే కానీ ఖచ్చితంగా పాటించవలసిన నియమం కాదని తెలుస్తుంది. అందుకే నెమలి కన్నులు ఆత్మకథలో రచయిత తన అనుభవాలను ఒక్కొక్క ఘట్టంగా వివరిస్తూ కవితాత్మక శైలిలో ఆలంకారికంగా తెలియజేశారు.

స్వతహాగా ఈ రచయిత అలంకార శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు, ప్రాచీన సాహిత్యాన్ని చదువుకున్న విద్యావంతులు. కనుక, ఈ నెమలి కన్నులలో లీలగా ఆలంకారిక లక్షణాలు కనబడుతూనే ఉంటాయి. అయితే, ఇక్కడే దార్ల వెంకటేశ్వరరావు గారి ఈ ‘నెమలి కన్నులు’ ఆత్మకథలో వారికి కలిగిన జీళ్ళ వర్షం అనుభూతిని గమనించవలసిన అవసరం ఉంది. అందులో తనకిష్టమైన జీళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటే, అతను ఇలా వివరించాడు:

“పడుకున్నప్పుడు ఒక అర్ధరాత్రి అమాంతంగా ఇంటి కప్పుకు పెద్ద రంధ్రం పడిపోతుంది. జీసస్ పుట్టిన పశువుల పాకలోకి రెక్కలున్న తెల్లని వస్త్రాలు ధరించిన దేవతలు... వాళ్లు వచ్చే ముందు పెద్ద కాంతి కిరణాలు అలాగే వెదజల్లుకుంటూ వస్తున్నట్టు ఇంటికి పైకప్పు నుండి ఒక వెలుగు వచ్చిందని” (దార్ల 49)

ఇలా తన స్వాప్నిక అనుభవాన్ని ఆలంకారికంగా వివరించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ ఉదాహరణను కూడా గమనించినపుడు తన బాల్యాన్ని ఆయన పదేపదే గుర్తుకు చేసుకుంటూ, బాల్యం అనే ఒకే ఉపమానానికి అనేక ఉపమేయాలతో ఉల్లేఖరించిన తీరు కనిపిస్తుంది. ఇలా ఈ ఆత్మకథ అంతా మాండలికంలోనూ, ఆలంకారిక లక్షణాలతోనూ, ఆత్మాశ్రయ పద్ధతిలోనూ, వైయుక్తిక శైలిని అనుసరిస్తున్నట్టుగా విభిన్న లక్షణాల సంగ్రహంగా కనిపిస్తుంది.

“బాల్యం ఒక చలమ లాంటిది!
బాల్యం ఒక సముద్రం లాంటిది!
బాల్యం ఒక అవకాశం లాంటిది!” (దార్ల 175)

6. సాంస్కృతిక ప్రభావం

ఒక జాతి అభివృద్ధి మార్గంలో నడిచే రీతి సంస్కృతి అవుతుంది. వ్యక్తిగా చేసే ప్రయత్నం సంస్కారమవుతుంది. చేసే వ్యక్తి సంస్కారి అవుతాడు. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది ద్విజుడు చెప్పిన కర్మను యధావిధిగా పాటించేవాడు. రెండవది దురాచారాన్ని ఎండగట్టేవాడు. ప్రస్తుతం సంస్కృతి, సంస్కరణలు రెండూ ఒకేలా వినియోగించబడుతున్నాయి (ఖండవల్లి 2). ఇప్పుడు దీనిని బట్టి ఒక జాతి తన అభివృద్ధి కోసం ఏ రీతిని అనుసరిస్తుందో తెలుసుకుంటే ఆ జాతి సంస్కృతి అర్థమైనట్లే కదా! ఈ నెమలి కన్నులు ఆత్మకథలో 70-80వ దశకం నాటి కోనసీమ పరిస్థితులలో దళితులు దేవాలయాలకు వెళ్లలేకపోయేవారని ఫలితంగా చర్చిలకు వెళుతున్నారని అందుకే ఆ గ్రామంలో మూడు చర్చిలు ఏర్పడ్డాయని రచయిత దార్ల వెంకటేశ్వర రావు వివరణలో తెలుస్తుంది.

అయితే, ఈ 70, 80వ దశకాల్లో కోనసీమలోని హిందూ సమాజం దళిత క్రైస్తవ్యులుగా మారడానికి గల ప్రధాన కారణం "మానవుల వలే బ్రతికే హక్కు ఏ మతంలో లేదో ఆ మతాన్ని విడనాడటం కంటే గత్యంతరం లేదు" అని చెప్పిన అంబేద్కర్ భావజాలమే (విజయభారతి 238). ఎందుకంటే ఈ కోనసీమలోని రాజమండ్రి ప్రాంతం నుంచే మాకొద్దీ నల్ల దొరతనం అని వినిపించిన కుసుమ ధర్మన్న లాంటి వారున్నారు. అట్లాగే జాషువా రచనలు, అంబేద్కర్ వాదాలు త్వరగా అర్థం చేసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఆత్మగౌరవం విషయంలో అంబేద్కర్ వాదాన్ని అనుసరించారని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి తాను ఉన్న సమాజం నుండి ఆశించినంత ఆత్మగౌరవం లభించదో, తన ఆత్మాభిమానానికి భంగం వాటిల్లిందని అనిపిస్తుందో అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యామ్నాయ దారినే వెతుక్కుంటాడు. అట్లాగే తనకు తన చుట్టూ ఉన్న సమాజం నుండి ఏ సహాయం అందకపోయినా ఇంకో దారిని కనిపెడుతూనే ఉంటాడు. అచ్చంగా ఇట్లాంటి పరిస్థితే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోనే కాదు యావత్ భారతదేశంలోని దళిత జీవితాలలో కనిపిస్తుంది.

ఉదాహరణకు నెమలి కన్నులలో దార్ల వెంకటేశ్వర రావు చెప్పిన క్రైస్తవ మార్పిడిని, ఎండ్లూరి సుధాకర్ తన మల్లె మొగ్గల గొడుగులోని కరువు కథ ద్వారా ఇలా వివరిస్తాడు:

"రామయ్య గుళ్లోకి రానీయకుండా తరిమిపారానికితే యేసయ్య మన గూడేలకొచ్చి మన భుజాల మీద చేతులేసి గుండెల కత్తుకుండయ్య " (ఎండ్లూరి 103)

ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు కరువు వల్ల, ఆదరించిన దొరల వల్ల ఎలా ప్రభువు నమ్మకంలోకి వచ్చారో తెలిపారు.

ఇక దళిత సమస్య అనేది ఏ ప్రాంతంలో ఉన్నా సరే, అది పాత ప్రశ్నకు సవాలుతో కూడిన కొత్త సమాధానాన్ని అందించడమే అవుతుంది. ఎందుకంటే ఈ మార్పిడులు కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే కాదు తెలంగాణ ప్రాంతంలోనూ కొనసాగిందని సాహిత్య పరంగా రికార్డు చేసిన చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అయితే అది క్రైస్తవ్యంలోకి కాదు తెలంగాణ పాలకుల ఇస్లాం అనుసరణ, ప్రజలను (దళితులను) భూమి ఇస్తామంటూ బలవంతపు మత మార్పిడులకు గురిచేసింది. అయితే కొంతమంది ప్రజలు మాత్రం కనీసం తాము అనుభవిస్తున్న (వెట్టి) సామాజిక వివక్ష నుండి బయటపడవచ్చని ఆలోచించి మతం మార్చుకున్నారు (రంగాచార్య 22).

ఇప్పుడీ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల కంటే బయటకు వెళ్తే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలలో కూడా మత మార్పిడుల ప్రభావం ఎలా భిన్నంగా ఉందో గమనించవచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో అంబేద్కర్ ఆలోచనల ప్రేరణతో దళితులు బౌద్ధాన్ని స్వీకరించగా, కేరళలో సమాజ వివక్షల నేపథ్యంలో క్రైస్తవ మతం విస్తరించింది. భౌగోళిక పరిధి మారుతుంటే అక్కడి పాలక వర్గ నిర్ణయాలు, సామాజిక ఒత్తిళ్లు, వివక్షలు ప్రజల సంస్కృతిని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.

ఇక ఒక కొత్త సంస్కృతి పాత స్థానిక సంప్రదాయాలతో కలిసిపోయినప్పుడు అది కొత్త ధోరణికి దారితీస్తుంది. భారతదేశంలో క్యాథలిక్ క్రైస్తవ సంప్రదాయాలు కూడా భక్తి, సూఫీ ఉద్యమాల ప్రభావం పొంది స్థానికతను అలవరచుకున్నాయి. అందువల్ల ఫ్రాన్సిస్ జేవియర్ వంటి సంతుల పట్ల భక్తి భావంతో బలి, రక్త ఆచారాలు చర్చిలలో చోటుచేసుకున్నాయి. మధురై మిషన్ ఈ స్థానిక ఆచారాల ఆధారంగా అనేక కేథలిక్ సమాజాలను ఏర్పరచింది. ఫలితంగా యూరోపియన్ క్యాథలిక్ సంప్రదాయం నుంచి విడివడి, స్థానిక కులవ్యవస్థల ముద్రలతో కూడిన ప్రత్యేక సాంస్కృతిక రూపం ఏర్పడింది (అడపా, సత్యనారాయణ 186).

ఇలాంటి సాంస్కృతిక కలయికల జాడ ‘నెమలి కన్నులు’ నవలలో కూడా కనిపిస్తుంది. రచయిత తన గ్రామంలో మూడు చర్చీలు ఉన్నాయని చెప్పిన వివరంలో, చర్చి వ్యవస్థలోని అంతర్లీన కులస్థితులు, ఆచార విభేదాలు, అన్యమతాచారాల జోక్యం ఎంత లోతుగా వ్యాపించాయో మనకు అర్థమవుతుంది. 

7. సామాజిక సమస్యలు

7.1. విద్య

'మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి విద్య ఒక్కటే ఆsయుధంగా పనిచేస్తుందని' నెల్సన్ మండేలా చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం. ఎప్పుడైతే దళిత సమాజం ఈ విద్యను అందుకుంటుందో వారి సామాజిక స్థితిగతులలోనూ, వ్యక్తిగత క్రమశిక్షణలోనూ చాలా మార్పులు వస్తాయి. తద్వారా సహజంగానే సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న భేదాన్ని ప్రశ్నించడానికి వారిలో ఆలోచన మొదలవుతుంది. కానీ ఆధిపత్య కులాలు ఇలా ఆలోచించడానికి అవకాశాన్ని ఇవ్వవు. అందుకొరకు దళిత స్పృహను అదుపుదల చేయడానికి విద్యను ఎప్పుడు వారు దూరం చేస్తూనే ఉంటారు. అచ్చంగా ఇట్లాంటి సందర్భమే నెమలి కన్నులు ఆత్మకథలోనూ దార్ల వెంకటేశ్వర రావుకు ఎదురవుతుంది. "నీకు సీటివ్వరిని చెప్పాం కదా.... రాదంతే" అని (దార్ల 62) వారి స్నేహితులు తనని ఇబ్బంది పెడుతుంటారు. ప్రత్యుత్తరంగా ఈయన కూడా మీ బంధువులు పంచాయతీ మెంబర్లుగా ఉన్నారు అందుకే మీకు సీటు వచ్చిందేమో 'పోనీలే నేను ఇంకో చోట చదువుకుంటాను' అనే సమాధానమిస్తాడు. దీనివల్ల 70, 80 దశకంలోని కోనసీమ ప్రాంతాలలో ఒక సామాన్య దళిత విద్యార్థి పాఠశాలలో చదవడానికి కూడా ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలో, పైనున్నవారు ఎంత ఇబ్బంది పెట్టేవారో రేఖామాత్రంగా ఈ నెమలి కన్నులు చెప్పకనే చెబుతుంది.

7.2. భూమి

దళితులు సాధారణంగానే ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాలలో ఏ ప్రాబల్యం లేని నిరాధారులు. వారికి కావలసిన కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ కోసం ఎడతెగని పోరాటం చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఎవరైనా దయతో ఇచ్చిన భూమి మాత్రమే వారి పాలిట జీవనధారం అవుతుంది. ఈ నెమలి కన్నులు కథలో చెయ్యరు అగ్రహారానికి పొలిమేరలో ఉన్న చెరువుగట్టు పోరంబోకు భూమిగా మారి చెరువంతా పాడైపోతుంది. చుట్టూ చెట్ల మొదలు పెరిగిపోయి రైతులు పొలాల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా ఆ పాడుబడిన భూమిని ఎవరో ఒకరు వాడుకుంటే అక్కడ దారి ఏర్పడి వాడుకలోకి వస్తుందని అమాంతంగా పుట్టుకొచ్చిన ప్రేమతో గ్రామ కరణం, మునుసబులు "దానిలో గుడిసెలేసుకోండ్రా' అని (దార్ల 7) భూమిని ఇవ్వడం ద్వారా ఆ ప్రాంత దళిత కుటుంబాలు అక్కడే స్థిరపడతాయి.

అచ్చు ఇలాగే పాలకుల దయాదాక్షిన్యాలతో భూమి పొందినా కూడా సమాజంలోని వివిధ వర్గాల వారి వివక్ష వల్ల వారి హక్కును కోల్పోయిన దాఖలాలు, పేదరికం అనుభవించిన పరిస్థితులు మా నాయన బాలయ్య ఆత్మకథలోని నరసయ్య పాత్రలో యధాతథంగా కనిపిస్తుంది. అట్లాగే చిల్లర దేవుళ్లలోనూ ఇస్లాంను స్వీకరించిన దళితులకు భూమి వస్తే వారు ఇక తమ దగ్గరికి వెట్టి చేయడానికి రారని వారిని ఎలానైనా అదుపు చేయాలని రామిరెడ్డి దొర ఆలోచించిన తీరులో దళిత సమాజం పట్ల వివక్ష ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది. అదే రీతిన మా నాయన బాలయ్య ఆత్మకథలోని నరసయ్య పాత్ర మాదిరిగానే మల్లె మొగ్గల గొడుగు కథలలో నిజాం మాదిగ వాళ్ళ కళా నైపుణ్యానికి ప్రతీకలైన చెప్పులను చూసి మురిసిపోతూ కొంత భూమిని వారికి ఇనాంగా ఇస్తాడు. కానీ అది సమాజంలోని వివిధ వర్గాల వారు దిగమింగుకోలేక వివక్షను చూపిస్తూ వారిని అణచివేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి దళిత సమాజ ఉన్నతి కేవలం దళితులపైనే కాదు వారిని శాసించే ఆధిపత్య కులాలపై కూడా ఉంటుందని తెలుస్తుంది.

7.3. దుర్భర పరిస్థితి

ఆకలి, ఆకలి......ఆకలి. ఇది కేవలం మాట కాదు. వర్ణ, వర్గ భేదాలు లేకుండా అందరినీ శాసించి, ఆడించే బహు చిత్రమైన రూపం. అయితే దళిత సమాజంలో దీని ప్రభావం మరింత ఎక్కువ. ఆకలి సమస్య గురించి కూటి కోసం కూలి కోసం పట్టణాలలో బతుకుదామనే బాటసారి కవితలో శ్రీ శ్రీ చెప్పిన ప్రతి మాట నెమలి కన్నులలో ఆకలి వేదనగా కనిపిస్తుంది. ఈ ఆత్మకథలో దార్ల వెంకటేశ్వరరావు తన బాల్య స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ తన ఆకలి తీర్చుకోవడానికి ఉప్మా పెడతారనే ఆశతో పనికి వెళ్ళిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటారు. అట్లే ఇంకో సందర్భంలో తన అన్న పాలేరు తనానికి వంతుగా పనికి వెళ్ళినప్పుడు మధ్యాహ్న సమయంలో ఆ యజమానులు భోజనం పెట్టి నీళ్ళ కోసం పశువుల తొట్టి వాడుకోవాలని చెబుతారు. అప్పుడు ఆ పసి హృదయం ఎంత కలిచివేయబడిందో ఈ ఆత్మకథను చదివే ప్రతీ పాఠకుడికి తెలిసిపోతుంది. ఇలాగే మల్లె మొగ్గల గొడుగులో ఒకానొక సందర్భంలో తీవ్ర కరువుతో తినడానికి తిండి లేక, పిల్లలకు పాలు ఇవ్వలేక మట్టి తిన్నారనే సందర్భం కనిపిస్తుంది. మా నాయన బాలయ్యలోనూ బాలయ్య తన చాలీచాలని జీతంతో కడుపు మాడ్చుకున్న సందర్భాలను చెబుతాడు. ఇలా ప్రాంతం ఏదైనా దాదాపు దళిత జీవితాలు అన్నీ ఒకదానితో ఒకటి బింబ ప్రతిబింబాలుగానే ఉండి తీవ్ర దుఃఖాన్ని అనుభవించాయని తెలుస్తుంది.

8. విద్యాప్రభావం

"మీ బానిసత్వాన్ని మీరే తొలగించుకోవాలి. మీ జీవితాల్లో మార్పు రావాలని మీ పిల్లలు విద్యావంతులై సంఘంలో గౌరవ మర్యాదలు పొందాలంటే ఆ ప్రయత్నం మీరే చేయాలి" అని (విజయభారతి 235) అంబేద్కర్ మాటలు నెమలి కన్నులు, మా నాయన బాలయ్య ఆత్మకథలలో నిజమని నిరూపిస్తాయి.

ఈ రెండు ఆత్మకథలలోనూ రచయితలు ఇద్దరు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారైనా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఒకేలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్న వారే. అయితే వీరిద్దరూ కూడా తమ పరిస్థితికి కృంగిపోకుండా చిన్నప్పటినుండే విద్య పట్ల అమితమైన ప్రేమను పెంచుకున్నారు. అందులో భాగంగానే " చదువు అంటే నాకు మహా ప్రాణం కనబడ్డ ప్రతి కాగితాన్ని చదివేవాన్ని చేతిలో సుద్ద ముక్కో, కనిక ముక్కో ఉంటే ప్రతి గోడ మీద ఏదో ఒకటి రాస్తుండేవాణ్ణి " అని (దార్ల 110) తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అట్లాగే ప్రతి దానిలో ముందుండాలనే సంకల్పాన్ని ఏర్పరుచుకున్నందుకే తానెప్పుడు "అక్షరం ఒకవైపు, అన్నం మరొకవైపు పెడితే, నేను అక్షరాన్ని హత్తుకుంటాను ఆబగా" అని మరొక సందర్భంలో చెబుతుంటారు.2 ఇది ‘నాకు పుస్తకం కన్నా మంచి మిత్రుడు లేడని’ నెపోలియన్ బోనాపార్టే లాంటి మాటలను గుర్తుచేస్తుంది. నిజంగా బాల్యంలోనే చదువు పట్ల అంత ఇష్టం లేకపోతే అంచెలంచెలుగా ఎదిగి వారు ఈ స్థితిని చేరుండేవారు కాదు కదా! ఒక సందర్భంలో తనకు పాఠశాలలో సీటు ఇవ్వకపోయినా ఇంకో దగ్గర చదువుకుంటానని, స్కూలుకు వెళ్లినప్పుడల్లా రోడ్లు నాతో మాట్లాడతాయని నేను రోడ్లతో మాట్లాడతానని చెప్పుకోవడంలో తాను చదువు కోసం ఎదుర్కొన్న సవాళ్ళను ఎంత ఇష్టంగా తీసుకున్నాడో అర్థమవుతుంది. అలాగే పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ కొనివ్వం అన్నప్పుడు ఇంట్లో వారు "నువ్వు అంత కష్టపడడం ఎందుకు మనకున్న గేదెల్ని మేపు చిన్నన్నయ్య లాగే నువ్వు ఎవరో ఒక దగ్గర పాలేరుగా ఉండు నీకే కష్టం ఉండదు కదా" అని (దార్ల 72) చెబుతుంటే, తనకు పుస్తకం కొనడానికి "ఈ వేళ నుండి ఒక పూట తినడం మానేస్తాను ఎన్ని రోజులు మానేస్తే నా పుస్తకాలని వస్తాయి" అని (దార్ల 65) సమాధానంలో వారికి చదువు మీద ఎంత ఇష్టం ఉందో తెలిసిపోతుంది. ఇలా కఠినమైన తన (మాదిగ) దళిత జీవితంలో కోరుకున్న విద్య తేలికగా లభించకపోయినప్పటికీ, పట్టుదలతో పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వైబి సత్యనారాయణ (మా నాయన బాలయ్య), ఎండ్లూరి సుధాకర్ (మల్లె మొగ్గల గొడుగు) కనిపిస్తారు. కాబట్టి వీరి కథల ద్వారా దళిత జీవితాలలోని సంక్లిష్ట పరిస్థితులన్నీ వికాస స్థితిని చేరుకోడానికి ఉన్నత విద్య ఎలా కీలక పాత్ర పోషిస్తుందో, దానికి ఎంత కృషి చేయవలసిన అవసరం ఉందో ఈ ఆత్మకథలే రుజువు చేస్తాయి.

9. దళిత జీవితాలలో వైరుధ్య సంఘర్షణలు

కులం కేంద్రంగా ఉన్న ఈ సమాజంలో దళితులు ఎప్పుడూ పరస్పర సంఘర్షణకు లోనవుతూనే ఉంటారు. ఈ సంఘర్షణ భాగంగానే ఈ కుల చట్రం నుండి బయటపడటానికి వారు ఇతర మతాలవైపు మొగ్గు చూపుతారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు:

  1. సామాజిక హోదా కోసం
  2. క్రైస్తవ మిషనరీలు అంటరానితనాన్ని ఎండగడుతూ బోధించడం.

అయితే ఇలా ఇతర మతాల వైపు మొగ్గు చూపడాన్ని అదుపు చేయడానికే కాలక్రమంలో హిందూ సమాజం సాంస్కృతిక సంస్కరణలను పరిచయం చేసింది. ఆ పరిణామ క్రమాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు దళిత సమాజం ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందో సుస్పష్టమవుతుంది.

దళిత సమాజంలో ఉన్న వేదన ప్రాంతాన్ని బట్టి మారకపోయినా దాన్ని ప్రతిఘటించే విధానం మాత్రం ప్రాంతాన్ని బట్టే మారుతుంది. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్ర వంటి ప్రాంతాలలో దళితుల ఉన్నతి కోసం క్రైస్తవ మిషనరీలు ఆది నుండే సహాయం చేశాయి. కానీ తెలంగాణ ప్రాంతాన్ని పరిశీలిస్తే క్రైస్తవ వ్యాప్తి కన్నా ఇస్లాం మత వ్యాప్తి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం 'అంజుమన్ తబ్లిగ్' పేరుతో నిజాం ప్రభుత్వం బలవంతపు మతమార్పిడులు చేయడమే (చండ్ర రాజేశ్వర రావు 8; అడపా సత్యనారాయణ 316). అయితే ఈ ప్రాంతంలో దళిత స్పృహ లేదా అంటే 1906 సం.లో జగన్ మిత్రమండలి, 1913-38 వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుద్ధ జయంతి జరిపడంతో బౌద్ధ ప్రచారాలు, 1922 నుంచి 37 వరకు మాన్య సంఘం, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, మాతంగా సభ, జాంబవ సేవ సమితి వంటి ఎన్నో సంఘాలు ఏర్పడి దళితులను చైతన్యం చేశాయి. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ అంబేద్కర్ గా పిలవబడిన బి.ఎస్ వెంకట్రావు లాంటివారు ద్రవిడ సంఘం, ఆది హిందూ మహాసభ అంబేద్కర్ యూత్ (అరిగె రామస్వామి తో కలిసి) దళిత చైతన్యానికి కృషి చేశారు (అడపా సత్యనారాయణ 320). ఇదంతా ప్రాథమిక స్థాయిలో అద్భుతంగా జరిగిన కృషి అని ఎవరు కాదనలేని నిజం. అయితే తెలంగాణలో ఒక వైపు దేశముఖ్, రజాకర్, నిజాం పీడన, బలవంతపు మతమార్పిడులు, మళ్లీ హిందూ సమాజానికి ఆహ్వానించే 'శుద్ధి కార్యక్రమాల' ఫలితంగా 1938లో దూల్పేట్ వంటి అల్లర్లు జరిగాయి. ఇక మరొక సమస్య పెచ్చు మీరిన భూస్వామ్య విధానంతో వెట్టి, భగేలా చేయించుకోవడం. దీనితో విసిగిపోయిన ప్రజలు తమ పంథాను విప్లవ మార్గంలోనే ఎంచుకున్నారు. దాని ప్రతిరూపమే 1946 నుండి 51 వరకు కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అయితే ఇది 40వ దశకం చివరి ప్రాంతంలో జరిగిందే కదా అనుకుంటే పొరపాటు అవుతుంది. 70వ దశకం చివర్లో జరిగిన నక్సల్ ఉద్యమం కూడా దీనికి కొనసాగింపుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెండింటిలో కమ్యూనిస్టులే పాల్గొన్నప్పటికీ మొదటిసారి దక్షిణ తెలంగాణ చైతన్యవంతమైతే రెండవసారి ఉత్తర తెలంగాణ చైతన్యవంతమైంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత స్పృహ కేవలం విప్లవ స్పృహ లేదా దళిత విప్లవ స్పృహ అని అనవచ్చు (నరసయ్య 257).

దళిత దృక్పథం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మొదటి దళిత స్పృహను అర్థం చేసుకోవాలి. కేవలం కుల సమస్యలు రాసినంత మాత్రాన ఏది దళిత కవిత్వం కాదు. అట్లాగే సమస్యను విశ్లేషిస్తే పరిష్కరించుకోవాలనేది విప్లవ కవిత్వం. కాబట్టి రెండింటి మధ్య ఉన్న సన్నని పొర ఏంటో తెలుసుకొని పూలే, అంబేద్కర్ వాదాల తాత్విక భూమికను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో చారువాక, లోకాయత వాదాల నుంచి బుద్ధిజం మీదగా బసవేశ్వరుని వరకు, ఆ తర్వాత భక్తి, సూఫీ ఉద్యమాలు, పూలే, అంబేద్కర్ తత్వాలన్నీ సమకాలీన సమాజాన్ని ప్రతిఘటిస్తూ చేసిన దేశీయ వాస్తవిక చైతన్య స్పృహతో వచ్చినవే అని గుర్తుంచుకోవాలి. తద్వారా దళిత స్పృహ ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ దేశంలో కులం ఎంతటి పై అంతస్తులో ఉంటే అన్ని హక్కులు దక్కుతాయి. ఎంత తక్కువ అంతస్తులో ఉంటే అన్ని తక్కువ హక్కులు దక్కుతాయని అంబేద్కర్ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే, మనిషికి సంక్రమించే విలువలు వారి వృత్తులు అన్నీ వారి కులాల ఆధారంగానే ఉన్నాయని తెలిసిపోతుంది. ఇదే వాస్తవానికి బ్రాహ్మణవాద పునాది. కాబట్టి ఇక్కడ ఆర్థిక రాజకీయ సమానత్వం కోరేవాళ్లు ఆటంకంగా ఉన్న కుల వ్యవస్థను మొదట నిర్మూలించవలసిన అవసరం ఉంటుంది (నరసయ్య 258). కాబట్టి సమాజం ముందు కుల నిర్మూలనను రూపుమాపాలి. అయితే ఇంతకుముందు ప్రస్తావించుకున్న తెలంగాణ పరిణామ క్రమంలో ముందు ఉన్న కుల నిర్మూలన పోరాటం కన్నా, వర్గ పోరాటాలను తుడిచి వేయడానికి ఇక్కడి దళిత సమాజం ఆసక్తి చూపించింది. అందువల్లే 40వ దశకం తర్వాత తెలంగాణలో దళిత స్పృహ కాస్త సడలిపోయిందని చెప్పవచ్చు.

ఇక ఆంధ్ర ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటే ఇది తెలంగాణకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సంఘసంస్కరణ చర్యలు, బావులు తవ్వించడం, దళితులను సంఘటితం చేయడం, సమావేశాలు ఏర్పరచుకోవడం, దత్తత లాంటి ఎన్నో కార్యక్రమాలతో మొదలై క్రైస్తవ మిషనరీల సహాయంతో త్వరగానే విద్యా విషయాలను తెలుసుకున్నారు. దానికి తోడుగా ముద్రణ అందుబాటులోకి రావడం వల్ల ఎప్పుడు స్పృహతో కూడిన విషయాలను చర్చించుకున్నారు. ఇందుకు వీరు ఒకే మార్గంలో వెళ్లలేదు. అవసరాన్ని బట్టి వేరువేరు మార్గాలలో ప్రయాణించారు. అవి, గాంధీ పర్యటన ప్రభావంతో గాంధీ మార్గం, ఆది ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవడం, అంబేద్కర్ భావజాలంతో ముందుకెళ్లడం. గమనించాలి గాని చిత్రంగా జాషువాలో ఈ మూడు లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఈ దళిత స్పృహని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా రెండు కారణాలను అనుకోవచ్చు:

  1. ఆర్థిక అసమానతలు, అంటరానితనం, అశాస్త్రీయ, హేతుబద్ధ మత విశ్వాసాలు, బానిసత్వ తిరుగుబాటు కోసం జరిగేవి.
  2. దళిత ఇతరుల నుండి తమ ముద్రను చెరిపేసుకోవడానికి తమకంటూ సొంత ఉనికిని చాటుకోవడానికి చేసే ఉద్యమాలు.

ఇలా దళిత సమాజం ఎక్కడ ఉన్న వేదన ఒకేలా ఉన్నప్పటికీ దానిని ప్రతిఘటించే విషయం మాత్రం అక్కడి సామాజిక రాజకీయ కారణాల వల్ల మారుతూ ఉంటాయని తెలుస్తుంది.

10. ప్రతిఫలించిన అంబేద్కర్ ఆశయాలు

"Not failure but low aim is crime" - కొంచెం కోసం ఆశించడం వైఫల్యం కన్నా నేరమే అవుతుంది. మన ఆశయం ఎప్పుడు అత్యున్నతంగా ఉండాలని (విజయభారతి 235) అంబేద్కర్ మహద్ చెరువు సత్యాగ్రహం కోసం చెప్పిన ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఆ ప్రేరణే మనల్ని ఉన్నత స్థితికి చేరవేస్తుంది. అందుకు కళ్ళ ముందున్న అతి పెద్ద ఉదాహరణే దార్ల వెంకటేశ్వరరావు జీవితం. నెమలి కన్నులలో దార్ల వెంకటేశ్వరరావు గురువైన రాజు గారు మీరేమవ్వాలనుకుంటున్నారని తరగతిలో అందరిని అడిగితే పోలీసు, డాక్టరు, కలెక్టర్ అవుతానని అంతా సమాధానం చెబుతుంటే తను మాత్రం నిక్కచ్చిగా ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నానని బదులు ఇస్తాడు. దానికి అందరూ నవ్వుతారు. కానీ తను మాత్రం సిగ్గుపడకుండా అదే అవుతానని పట్టుదలతో ఉంటాడు. ఇక ఆ పట్టుదలతోనే వారు శ్రమించి ప్రొఫెసర్ స్థాయిని కూడా చేరుకున్నారు. ఈ విధంగా తమ ప్రయాణంలో ఎవరు ఏమనుకున్నా సరే మనిషికి అత్యున్నతమైన ఆశయం ఉండాలని అంబేద్కర్ చెప్పిన మాటలను దార్ల వెంకటేశ్వరరావు తన జీవితం ద్వారా నిజం చేశారని తెలుస్తుంది.

మరొక సందర్భంలో దార్ల వెంకటేశ్వరరావు ఇలా అంటారు:

మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు
మా తాత కూలికెళ్ళేవాడు
మా అయ్యేమో అక్షరం కోసం ఆశగా ఎదురు చూసేవాడు
నేనిప్పుడు కవిత్వం రాస్తున్నాను
రేపు నా కొడుకు ప్రొఫెసర్ అవుతాడు!
(దార్ల, నెమలి కన్నులు (కవిత్వం) 80)

అని ఉన్నత ఆశయంతో పాటు విద్య మాత్రమే దళిత సమాజాన్ని ఉన్నతీకరిస్తుందని చెబుతూనే దళిత సమాజం తరతరాలుగా ఎలా ఉందో పరిచయం చేస్తారు. నిజానికి ఈ నాలుగైదు వాక్యాలు చాలు తరతరాలుగా దళిత సమాజం ఎలాంటి స్థితిని అనుభవిస్తుందో విద్య ఎంత దూరమైందో తెలుసుకోవడానికి.

అంబేద్కర్ ఆశయాలు అనగానే గుర్తుకు వచ్చేది “బోధించు, సమీకరించు, పోరాడు” అనే బోధనామృతమైన మాటలు. ఈ విషయంలో దార్ల వెంకటేశ్వరరావు తాను నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మర్చిపోలేదు. అంబేద్కర్ చూపిన ‘payback to society’ అనే మాటలను నిజం చేస్తూ వారి నాన్నగారి పేరు మీద సాహిత్యంలో ఉత్తమమైన విద్యార్థులకు బంగారు పతకంతో ప్రోత్సహించడమే కాకుండా, పేద దళిత విద్యార్థులు ఉన్నతమైన విద్యను పొందుకున్నప్పుడే వారి జీవితంలో వెలుగు వస్తుందని గ్రహించి వారు ఉన్నత విద్యాలయాలలో ప్రవేశం పొందడానికి తన వంతుగా సెలవులు దొరికిన ప్రతిసారి ప్రవేశ పరీక్షలను ఎలా అధిగమించాలో క్లాసులు నిర్వహించి బోధిస్తుంటారు. ఇలా వీరు తాను నడిచి వచ్చిన దారిని ఎప్పుడు మర్చిపోకుండా తిరిగి సమాజం కోసం తన జ్ఞానాన్ని, సమయాన్ని వెచ్చిస్తూ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని చెప్పవచ్చు.

ఉపసంహారం

ఈ నెమలి కన్నులు ఆత్మకథ ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు జీవిత ప్రతిబింబం మాత్రమే కాదు, అది సమకాలిన సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే బతుకు పాఠంగా కనిపిస్తుంది. ఈ ఆత్మకథ దళితుల సామాజిక ఘర్షణ మాత్రమే కాదు సాంస్కృతిక ఘర్షణ కూడా అని తెలుపుతుంది. ఇందులోని ప్రతీ వాక్యం వారి స్మృతి ప్రవాహం నుండి వచ్చిందే కనుక, జీవితాన్ని మలుచుకోడానికి విద్య ఎలా తోడ్పడుతుందో దళిత సమాజాలు గ్రహించాలని, అట్లాగే ఇది బాల్యానికి సంబంధించిన సంచిక మాత్రమే గనుక అసలు వారు యవ్వనంలో ఎలా ఉన్నారు, కుర్రతనంలో కలిగే ఆలోచనలను, భావజాలాన్ని ఎలా అధిగమించి ఎదిగారో తెలియజేసి పాఠకలోకాన్ని జాగృత పరచవలసిన బాధ్యత వారిపై ఉన్నదని గుర్తుచేస్తున్నాను, ఇక చివరగా ఈ వ్యాసం ద్వారా తెలుగు సాహితీ లోకానికి ఇట్లాంటి రచనలు విరివిగా వచ్చినపుడే సమాజంలో ఉన్న లోటుపాట్లు, విద్య గొప్పతనం బయటపడి సామాజిక నూతన మార్పు సాధ్యమవుతుంది. గనుక సమాజంపై బాధ్యతతో అంబేద్కర్ ఆశయాన్ని స్పూర్తిగా తీసుకొని దళిత సమాజం విద్య వైపు అడుగులు వేసి అభివృద్ధి వైపు కొనసాగాలని ఈ వ్యాసం ద్వారా ఆశిస్తున్నాను.

  • 'నెమలి కన్నులు' ఆత్మకథ దార్ల వెంకటేశ్వరరావు బాల్య జీవితాన్ని, దళిత సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తుంది.
  • దళిత జీవితాలలో విద్యకున్న ప్రాముఖ్యతను, అది సామాజిక మార్పుకు ఎలా దోహదపడుతుందో ఈ రచన స్పష్టం చేస్తుంది.
  • సామాజిక, సాంస్కృతిక ఘర్షణలు, మత మార్పిడుల ప్రభావాలు, భూమి సమస్యలు, దుర్భరమైన జీవన పరిస్థితులు వంటి దళిత జీవిత సవాళ్లను ఆత్మకథ వివరిస్తుంది.
  • అంబేద్కర్ ఆశయాలు, ముఖ్యంగా విద్య ద్వారా సాధికారత, దళిత సమాజంలో చైతన్యాన్ని ఎలా తీసుకువచ్చాయో ఈ రచన విశ్లేషిస్తుంది.
  • దళిత సాహిత్యం సమాజ లోటుపాట్లను, విద్య గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చి, సామాజిక అభివృద్ధికి ప్రేరణనిస్తుందని వ్యాసం ముగిస్తుంది.

సూచికలు

  1. నల్లందిఘల్, లక్ష్మీ నరసింహాచార్యులు. మనుస్మృతి. పు. 287.
  2. దార్ల, వెంకటేశ్వరరావు. సాహితీ సౌగంధి. పు. 185.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అడపా, సత్యనారాయణ. ద్యావనపల్లి సత్యనారాయణ. తెలంగాణ-చరిత్ర-సంస్కృతి ఉద్యమాలు. తెలంగాణ పబ్లికేషన్స్, 2023.
  2. అడపా, సత్యనారాయణ (సంపా). తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్, కంపెనీ పాలన (క్రీ.శ 1724 - 1857). ఎమెస్కో పబ్లికేషన్స్, 2015.
  3. అక్కిరాజు, రమాపతిరావు. తెలుగులో స్వీయ చరిత్రలు. యువ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, 1984.
  4. జి., లక్ష్మీ నరసయ్య. దళిత స్పృహ: తెలంగాణ పరిణామం. వివేక ప్రచురణలు, 2010.
  5. చిన్నారావు, యాగటి. మందార ప్రభాకర్ (అను). ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర (1900-1950). 3వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2011.
  6. చిన్నారావు, యాగటి. ఎస్.సుబ్రహ్మణ్యం (అను). ఆంధ్ర ప్రదేశ్ నూరేళ్ళ దళిత ఉద్యమం సంక్షిప్త చరిత్ర. 1వ ముద్రణ, సమాంతర ఫౌండేషన్, 2012.
  7. చండ్ర, రాజేశ్వర రావు., గౌడ్, రాజ బహుదూర్., గిరిప్రసాద్, నల్లమల. చారిత్రాత్మక తెలంగాణ పోరాటం. 2వ ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1987.
  8. దాశరథి, రంగాచార్య. చిల్లర దేవుళ్ళు. 4వ ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2001.
  9. దార్ల, వెంకటేశ్వరరావు. నెమలి కన్నులు. 1వ ముద్రణ, కస్తూరి విజయం పబ్లికేషన్స్, 2023.
  10. దార్ల, వెంకటేశ్వరరావు. నెమలి కన్నులు (కవిత్వం). 2వ ముద్రణ, మంజుశ్రీ ప్రచురణలు, 2016.
  11. దార్ల, వెంకటేశ్వరరావు. సాహితీ సౌగంధి. 1వ ముద్రణ, మంజుశ్రీ ప్రచురణలు, 2016.
  12. నల్లందిఘల్, లక్ష్మీ నరసింహాచార్యులు. మనుస్మృతి. 1వ ముద్రణ, గాయత్రీ ప్రచురణలు, 2000.
  13. ఖండవల్లి, లక్ష్మీరంజనం. సంస్కృతి చర్చ: ఒక విశ్లేషణ. ఆదర్శ ప్రచురణలు, 1999.
  14. బి., విజయభారతి. బాబాసాహెబ్ అంబేద్కర్. 3వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1990.
  15. వై., రామాకృష్ణ రావు. ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య స్రవంతి (stream of consciousness in modern Telugu literature). 1వ ముద్రణ, వేదిక సాహితీ సాంస్కృతిక సంస్థ, 1987.
  16. సత్యనారాయణ, ఎస్వీ. (సంపా). దళితవాద వివాదాలు. 2వ ముద్రణ, నవచేతన పబ్లిషింగ్ హౌస్, 2019.
  17. సత్యనారాయణ, వై.బి. పి.సత్యవతి (అను). మా నాయన బాలయ్య. 1వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2013.
  18. సుధాకర్, ఎండ్లూరి. మల్లె మొగ్గల గొడుగు మాదిగ కతలు. 1వ ముద్రణ, దండోరా ప్రచురణలు, 1999.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]