AUCHITHYAM | Volume-06 | Issue-14 | December 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలు: "విజిబిలిటీ" సమస్యలు
(Online Telugu Research Journals: Visibility Challenges)
డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ
పోస్ట్-డాక్టోరల్ ఫెలో (NTS-I, CIIL),
తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వకళాపరిషత్
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
సెల్: +91 9247859580, Email: rpsarma9247@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 01.11.2025 ఎంపిక (D.O.A): 30.11.2025 ప్రచురణ (D.O.P): 01.12.2025
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధన ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికల ‘విజిబిలిటీ’ సమస్యలను విశ్లేషిస్తుంది. భారతీయ పరిశోధనలు డిజిటల్ మాధ్యమానికి మారుతున్నప్పటికీ, తెలుగులో ఈ పరివర్తన నెమ్మదిగా సాగుతోంది. ఆన్లైన్ ప్రచురణల విస్తృతవ్యాప్తి, విద్యారంగంలో పరిశోధన ప్రమాణాలు- సాంకేతికత పట్ల పెరుగుతున్న శ్రద్ధ ఈ అధ్యయనానికి ముఖ్య ప్రేరణ. తెలుగులో ప్రచురించిన పరిశోధన వ్యాసాలు ప్రధాన సెర్చ్ ఇంజన్లు, గ్లోబల్ అకడమిక్ డేటాబేస్‌లలో కనిపించకపోవడం పరిశోధనసమస్య. పూర్వ పరిశోధనలు అంతర్జాతీయ ఇండెక్సింగ్ ప్రమాణాలు, మెటాడేటా ప్రాముఖ్యత వివరించినప్పటికీ, భారతీయ భాషల్లోని ఓపెన్ యాక్సెస్ కంటెంట్ సాంకేతికమైన లోపాలు, వాటి సవరణలు అరుదుగా అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ఐదు ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలను (ఔచిత్యమ్, సాహిత్యతరంగిణి, జ్యానవి, లాంగ్వేజ్ ఇన్ ఇండియా, అక్షరసూర్య) ఎంపిక చేసుకోవడమైంది. వీటి వెబ్‌సైట్ల నిర్మాణం, నిర్వహణలోని సాంకేతికాంశాలు, వ్యాసరచన స్వరూపం, పరిశోధన పద్ధతులు, విషయగతమైన అంశాలు విశ్లేషించడమైనది. సెర్చ్ ఇంజన్లలో వ్యాసాల విజిబిలిటీ సమస్యలు అంచనా వేయడమే ఈ పరిశోధన పద్ధతి. ప్రాథమిక, ద్వితీయ శ్రేణి సమాచారం సేకరించారు. చాలా పత్రికలు సాధారణ వెబ్ టెక్నాలజీలు వాడుతున్నాయని, సరైన HTML మెటాడేటా లేకపోవడం, PDFలలో బిబ్లియోగ్రాఫిక్ వివరాలు లోపించడం, స్పష్టమైన సైట్ నావిగేషన్ లేకపోవడం వంటి సాంకేతికలోపాలు ప్రధానసమస్యలని పరిశోధన వెల్లడించింది. కొన్ని పత్రికలు ఓపెన్ జర్నల్ సిస్టమ్స్ (OJS) వంటి ఆధునిక ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నప్పటికీ, Google Scholar మార్గదర్శకాలను పూర్తిగా పాటించడం లేదు. Language in India పత్రిక మాత్రం అంతర్జాతీయ డేటాబేస్లలో స్థిరంగా ఇండెక్స్ అవుతూ, మెరుగైన విజిబిలిటీ కలిగి ఉంది. ఈ లోపాలు విద్యా పరిశోధన రంగ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయి. భవిష్యత్తు పరిశోధనల నిమిత్తం ప్రతి వ్యాసానికి Google Scholar నిర్దేశించిన 'citation_' మెటాట్యాగులు కలిగిన ప్రత్యేక అబ్స్ట్రాక్ట్ పేజీలను సృష్టించడం, స్పష్టమైన సైట్ నావిగేషన్, PDF మొదటి పేజీలో పూర్తి వివరాలు పొందుపరచడం, సెర్చ్ ఇంజన్ క్రాలింగ్‌ను నిరోధించకుండా పబ్లిక్ యాక్సెస్ కల్పించడం వంటి సాంకేతిక సవరణలు సూచించడమైనది. సాధారణ పరిశోధకులు వినియోగించగల “ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాధనం” అభివృద్ధికి ఈ పరిశోధనవ్యాసం దోహదపడుతుంది.
Keywords: ఆన్లైన్ తెలుగు పత్రికలు, పరిశోధన విజిబిలిటీ, సెర్చ్ ఇంజిన్ ఇండెక్సింగ్, అకడమిక్ డేటాబేస్‌లు, మెటాడేటా సమస్యలు, ఓపెన్ జర్నల్ సిస్టమ్స్, సాంకేతికలోపాలు, తెలుగు అకడమిక్ రచనలు.
1. ప్రవేశిక
భారతీయ పరిశోధనపత్రికలు క్రమంగా ఆన్లైన్ మాధ్యమంలో అవతరిస్తున్నాయి. ఇతరభాషల పరిశోధనపత్రికలతో పోలిస్తే తెలుగులో ఈ పరివర్తన మందకొడిగానే ఉంది. అకాడమీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనసంస్థలు, పబ్లిషింగ్ వ్యవస్థలు ఆన్లైన్ పత్రికల కంటే ప్రింట్ పత్రికల నిర్వహణ, ప్రచురణలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అసంఖ్యాకంగా ఉన్న ఈ ప్రింట్ పత్రికలలో శాస్త్రీయ పరిశోధన ప్రచురణలకు స్థానం తక్కువ. ఉన్నతవిద్యాసంస్థలలో విద్యావ్యవస్థ, పరిశోధన పద్ధతులలో విప్లవాత్మకమైన మార్పులు సంతరించుకోవడం; పరిశోధకులలో, ఆచార్యులలో, అధికారులలో పరిశోధన ప్రమాణాలపై, సాంకేతికతలపై శ్రద్ధాసక్తులు పెరగడం; ఆన్లైన్ మాధ్యమం బహుళ ప్రయోజనాలను కలిగి ఉందని అవగాహన పెంపొందడం వంటి అనేక కారణాల వల్ల కొన్నేళ్ళుగా ఆన్లైన్ పత్రికలు నెలకొల్పడానికి, నిర్వహించడానికి విద్యా-పరిశోధన రంగాల ప్రముఖులు, నిపుణులు మొగ్గు చూపుతున్నారు. ప్రింట్ మాధ్యమంలో వెలువడే పరిశోధన ప్రచురణల కంటే ఆన్లైన్లో అందుబాటులో ఉండే సమాచారానికి వ్యాప్తి ఎక్కువ. రీసెర్చి కమ్యూనిటీలో ఒక నెట్వర్క్ ఏర్పడటానికి, పరస్పర సమచార వినిమయానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పరిశోధనపత్రికలలో ప్రచురణలకు ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది.
ఇప్పుడిప్పుడే సాంకేతిక వనరులు కూడగట్టుకుని ఎదుగుతున్న తెలుగు పరిశోధనరంగంలో ప్రయోగాత్మకంగా కొన్ని ఆన్లైన్ పత్రికలు ఊపిరిపోసుకుంటున్నాయి. సామాజికమాధ్యమాలలో తెలుగులో విమర్శ వ్యాసాలు, సృజనాత్మక రచనలు చేయటం ఏనాటినుండో అలవాటుపడ్డ వారికి ఈ ఆన్లైన్ పత్రికలకు రాయడం మరింత సౌకర్యంగా ఉన్నప్పటికీ, పరిశోధన వ్యాసాలు రాయడంలో సంక్లిష్టమైన శైలీభేదాలున్నాయి. విద్యాపరమైన, వృత్తిగతమైన ప్రయోజనాల కోసం ఉన్నత విద్యాసంస్థల విశ్వవిద్యాలయ బోధకులు, పరిశోధకులు కొన్ని మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంది.
అయితే అన్లైన్లో ప్రచురించబడ్డ ప్రతి వ్యాసం ఆయా పత్రికల వెబ్సైట్ల వరకే పరిమితమౌతున్నాయి తప్ప, సుప్రసిద్ధమైన సెర్చ్ ఇంజన్లతోను, గ్లోబల్ అకడిమిక్ – రీసెర్చ్ డేటాబేస్లతోను అనుసంధానం కావడం లేదు. ప్రస్తుత పరిశోధనవ్యాసం- ఆన్లైన్ పరిశోధన వ్యాసాల విజిబిలిటీలో ఎలాంటి సాంకేతిక సమస్యలున్నాయి? సెర్చ్ ఇంజన్లలో వెతికితే కనిపిస్తున్నాయా? డేటాబేస్లు, రిపోజిటరీలలో నిక్షిప్తమవుతున్నాయా? వంటి అంశాలను అధ్యయనాత్మకంగా చర్చిస్తుంది.
2. పూర్వాధ్యయనాల సమీక్ష
పరిశోధన పత్రాలు, వ్యాసాలు, సదస్సు వ్యాససంకలనాల ముద్రిత ప్రతులు తామరతంపర్లుగా వెలువడుతూనే ఉన్నాయి. దాదాపు రెండు- మూడు దశాబ్దాలుగా ఒకటి రెండు ఆన్లైన్ బహుళ భాషా పత్రికలు నడుస్తున్నా, వీటిలో తెలుగు పరిశోధన ప్రచురణలు మాత్రం అరకొరగానే జరిగాయి. భారతీయ భాషలలో అత్యున్నత ప్రమాణాలున్న విద్యా/ సైద్ధాంతిక విషయ సంపద ప్రచురించబడుతున్నా, అది గూగుల్, బింగ్, యాహూ వంటి సెర్చ్ ఇంజన్లలోకానీ, గూగుల్-స్కాలర్ వంటి గ్లోబల్ డేటాబేస్లలో కానీ కనిపించడం లేదు. ఈ విధంగా ఇండక్స్ కాకపోవడానికి కారణాలను పూర్వ అధ్యయనాలు పేర్కొన్నాయి:
పూర్వపరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రామాణికమైన పరిశోధనను, విద్యా సంబంధ విషయాలను ఎలా ఇండక్స్ చేస్తారనే ప్రమాణాల గురించి వివరంగా చెప్పాయి. సెర్చ్ ఇంజిన్‌లో మన కంటెంట్ ఎలా కనిపిస్తుందనే దానిపై మెటాడేటా నాణ్యత ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా వివరించాయి. వెబ్‌సైట్ కంటెంట్ బాగా కనిపించేలా చేసే సాధారణ పద్ధతుల గురించి కూడా అధ్యయనాలు జరిగాయి. కానీ భారతీయ భాషలలో ఉచితంగా అందుబాటులో ఉండే కంటెంట్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలున్నాయి, వాటిని ఎలా సవరించాలనే విషయాలపై ప్రత్యేక పరిశోధనలు ఎక్కువగా జరగలేదు. వెబ్‌సైట్లు, పరిశోధన వ్యాసాల మెటాడేటా నిర్వహణపై జరిగిన పరిశోధనలు ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాయి. తెలుగు కంటెంట్‌కు సరైన ట్యాగులు, అవసర సమాచారం పొందుపరచకపోతే, సెర్చ్ ఇంజిన్‌లు దాన్ని గుర్తించలేవు. ఈ సమస్య ఆంగ్లేతర భాషలలో ప్రచురించినప్పుడు మరింత ఎక్కువ. భారతీయ భాషలలో సరైన ప్రచురణ సాధనాలు లేకపోవడం, వ్యాసరచయితలు, సంపాదకులు పరిశోధన పద్ధతులను కఠినంగా పాటించకపోవడమే ఇందుకు ప్రధాన హేతువు. మెటాడేటా ఏ భాషలో ఇస్తామో, ఆ భాషలోనే పూర్తి వ్యాసం ఉండడం అవసరం. ఆ రెండూ సరిపోలకపోతే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్‌లు గందరగోళానికి గురై, “క్రాల్” చేయకపోవడం వల్ల ఆ కంటెంట్ ప్రపంచానికి కనబడకుండా అజ్ఞాతంగానే ఉండిపోతోంది.
పూర్వ అధ్యయనాలు సాప్ట్వేర్ పరంగా ఒక సమస్యను పేర్కొన్నాయి. పరిశోధన వ్యాసం ఇంటర్నెట్‌లో అన్వేషణ సాధనాల ద్వారా వెతికే అందరికీ కనబడాలంటే, చదవగలిగే టెక్స్ట్ రూపంలో వ్యాసాన్ని పొందుపరచడం, లేదా కంప్యూటర్ చదవగలిగే పీడీఎఫ్‌లను ఉంచడం చేయాలి. కానీ కొందరు పబ్లిషర్స్ పత్రిక వెబ్‌సైట్లలో వీటికి బదులు కేవలం స్కాన్ చేసిన ఇమేజి ఫైళ్ళను వాడడమో, లేదా క్లిష్టమైన ‘జావాస్క్రిప్ట్ నావిగేషన్’లను ఉపయోగించడం చేస్తుంటారు. ఇలాంటి పనులు సెర్చ్ ఇంజిన్‌లను నిరోధిస్తాయి. ఈ విధంగా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ (గూగుల్ సెర్చ్ సెంట్రల్ డాక్యుమెంటేషన్) తెలుగు పరిశోధన వ్యాసాలను ప్రచురించే పత్రికల యాజమాన్యం, సంపాదకవర్గం, టెక్నికల్ టీం, ఆచార్యులు, పరిశోధకుల కోసం ఈ విజిబిలిటీకి సంబంధించిన లోపాలను కనుగొనే ప్రత్యేక సాధనం అందుబాటులో లేదు. అలాంటి సాధనం ఉంటే దాన్ని స్వయంగా వాడుకుని, ఏ లోపాలున్నాయి, వాటిని ఎలా సరిచేయాలి అనే నివేదిక పొందవచ్చు. ప్రచురణకు ముందే వెబ్‌సైట్ స్థాయిలోగానీ, వ్యాస స్వరూపంలోగానీ తగిన జాగ్రత్తలు తీసుకుని, సవరణలు చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా ఆయా పరిశోధన కృషి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
3. పరిశోధన సమస్య
తెలుగు పరిశోధన పత్రికలలోని వ్యాసాలు గూగుల్, గూగుల్-స్కాలర్ వంటి సెర్చ్ ఇంజన్లలో, డేటాబేస్లలో కనిపించకపోవడం విద్యా పరిశోధన రంగాల అభివృద్ధికి, గుర్తింపుకు గొడ్డలిపెట్టు. పరిశోధన ప్రచురణల విజిబిలిటీలో ఆంగ్లభాష- భారతీయభాషల మధ్య ఎంతో వ్యత్యాసముండడం గమనార్హం. సాంకేతికాంశాలు, పరిశోధన పద్ధతులలోను, వ్యాస స్వరూపంలోను ప్రమాణాలు - ఏకరూపత లేకపోవడం, రాసే విషయంలోనే నాణ్యత లోపించడం వంటివి ఇండెక్సింగ్ సమస్యలకు మౌలిక కారణాలు.
4. జరగవలసిన కృషి
విజిబిలిటీ దృష్ట్యా తెలుగు పరిశోధన పత్రికలను మదింపు చేస్తూ ఒక అధ్యయనం జరగాలి. ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికలలో ప్రచురించే అన్ని వ్యాసాలను “అంతర్జాతీయ ఇండెక్సింగ్ మార్గదర్శకాలకు” సరిపోయేలా తీర్చిదిద్దాలి. పత్రికల వెబ్‌సైట్లు, పరిశోధన వ్యాస స్వరూపం లక్షిత మార్గదర్శకాలతో పోలిస్తే ఎలాంటి సవరణలు అవసరమో తక్షణమే గుర్తించడానికి సామాన్య పరిశోధకుడు కూడా వాడుకోదగిన ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాధనాన్ని రూపొందించాలి.
5. పరిశోధన పద్ధతి
సెర్చ్ ఇంజన్లు, డేటాబేస్లలో ఆన్లైన్ తెలుగు పరిశోధన వ్యాసాల విజిబిలిటీ సమస్యలు తెలుసుకోవడం కోసం కొన్ని పత్రికలు, పరిశోధన వ్యాసాలను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిశోధనకు ఐదు ఆన్లైన్ పరిశోధన పత్రికలను ఎంపిక చేయడమైంది. అవి: 1. లాంగ్వేజ్ ఇన్ ఇండియా (2000), 2. ఔచిత్యమ్ (2020), 3. అక్షరసూర్య (2022), 4. జ్యానవి (2025), 5. సాహిత్యతరంగిణి (2024). ఇవన్నీ ఆన్లైన్ వేదికల్లో స్థిరంగా నిర్వహింపబడుతున్న తెలుగు, బహుళభాషాపరిశోధన పత్రికలు.
6. ఆన్లైన్ తెలుగు పరిశోధన పత్రికల విజిబిలిటీ సమస్యలు
ఎంపికచేసుకున్న ఐదు పత్రికల విజిబిలిటీకి సంబంధించి మూడు రకాల అంశాలను పరిశీలించవలసి ఉంది: 1. వెబ్‌సైట్ల నిర్మాణం, నిర్వహణ సాంకేతికాంశాలు; 2. వ్యాసరచన స్వరూపం, పరిశోధన పద్ధతులు; 3. విషయ అంశాలు. ఈ పత్రికలన్నీ పీర్-రివ్యూడ్ జర్నళ్ళే. అన్ని జర్నళ్ళకు ప్రత్యేకమైన వెబ్‌సైట్లున్నాయి. ఇందులో మూడు జర్నళ్ళు ఆంధ్రరాష్ట్రం నుండి వెలువడుతుండగా, ఒకటి కర్నాటక, మరొకటి అమెరికా నుండి ప్రచురించబడుతున్నాయి. మూడు నెలవారీ పత్రికలు కాగా, రెండు త్రైమాసిక పత్రికలు. అన్ని పత్రికలలో వెబ్‌సైట్ నిర్మాణంలోను, ప్రచురణ మార్గదర్శకాలలోను, శైలీపత్రాలలోను ఎన్నో వ్యత్యాసాలు కనబడుతున్నాయి.
6.1 వెబ్‌సైట్ల నిర్మాణం, నిర్వహణ సాంకేతికాంశాలు
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ‘ఔచిత్యమ్’, ‘సాహిత్యతరంగిణి’, ‘లాంగ్వేజ్ ఇన్ ఇండియా’ మూడు పత్రికల వెబ్‌సైట్లు సాధారణ వెబ్-టెక్నాలజీల ఆధారంగా నిర్మించబడి, ఇతర స్టాటిక్ సైట్లలాగానే నిర్వహించబడుతున్నాయి. ఈ పత్రికలు ఎలాంటి ప్రత్యేకమైన ’జర్నల్ మానేజిమెంట్ సాఫ్ట్వేర్లు’ ఉపయోగించడం లేదు. కొన్ని కేవలం పీడిఎఫ్ రూపంలో వ్యాసాలను పొందుపరిస్తే, మరికొన్ని పీడిఎఫ్ లతో పాటు టెక్స్ట్ రూపంలో కూడా వ్యాసాలను ఉంచుతున్నాయి. హెచ్.టి.ఎం.ఎల్., పి.హెచ్.పి. వంటి స్ర్కిప్టింగ్ భాషల సహాయంతో ఈ వెబ్‌సైట్లను రూపొందించారు. గూగుల్, గూగుల్-స్కాలర్లకు సంబంధించి ఉండవలసిన ఎలాంటి ‘మెటాడేటా’ ఈ వెబ్ పేజీలు, పీడిఎఫ్ ఫైళ్ళలో లేవు. ప్రతి వ్యాసానికి వేరువేరుగా పీడిఎఫ్ ఫైళ్ళలో ఉండాల్సిన ‘డాక్యుమెంట్ ప్రాపర్టీస్’ కూడా ఈ మూడు పత్రికల వ్యాసాలలో కనిపించడం లేదు.
6.1.1 ఔచిత్యమ్ పత్రిక వెబ్‌సైట్ టెక్నాలజీ
auchithyam.com వెబ్‌సైట్ స్టాటిక్, సెమీ-స్టాటిక్ సైట్‌గా పనిచేస్తుంది. ఇందులో హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3 (తెలుగు యూనికోడ్ ఫాంట్లతో సహా) ఉన్నాయి. సెర్చ్ డెమోలు, సబ్మిషన్ లింకుల కోసం చాలా తక్కువ జావాస్క్రిప్ట్ ఉంది. నోడ్.జేఎస్, లేదా పైథాన్ ఫ్రేమ్‌వర్క్‌ల వంటి సర్వర్-సైడ్ భాషల ఆనవాళ్లు లేవు. పేజీలు సాధారణ పీహెచ్‌పీ ఎక్స్‌టెన్షన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఫాంల కోసం పూర్తి డైనమిక్-బ్యాకెండ్ కాకుండా తేలికైన కస్టమ్ స్క్రిప్టింగ్ ఉపయోగిస్తుంది. సీడీఎన్‌లు, అనలిటిక్స్ ట్రాకర్లు, రియాక్ట్ వంటి ఆధునిక ఫ్రేమ్‌వర్క్‌లు లేవు. మెటాడేటాలో "ఔచిత్యమ్" అనే టైటిల్ ట్యాగ్ ఉంది. ఇది తెలుగు పరిశోధన కోసం ఆప్టిమైజ్ చేసిన సాధారణ మెటా వివరాలు కలిగి ఉంది. కానీ పరిశోధన వ్యాసాల కోసం Open Graph, Twitter Cards, schema.org లేవు. పేజీలలో ఇష్యూల కోసం కానానికల్ లింకులు ఉన్నాయి (ఉదా: /2025/jun_2025/toc/), robots.txt-ఫ్రెండ్లీ స్ట్రక్చర్‌లు ఉన్నాయి. ఇన్‌లైన్ కాపీరైట్ నోటీసులు, రచయిత డిస్‌క్లెయిమర్లు కూడా ఉన్నాయి. JSON-LD లేదా బహుభాషలకు అవసరమైన అధునాతనమైన ఎస్ఈఓ అంశాలు లేవు. ఈ జర్నల్ యూజీసీ-కేర్ లిస్టెడ్ (గ్రూప్ 1, ఆర్ట్స్ హ్యుమానిటీస్)గా ఒకప్పుడు ఉంది. వెరిఫికేషన్ లింకులు ఉన్నాయి. డేటాసెట్ల కోసం OpenAIRE వంటి టూల్స్ గురించి ప్రస్తావన ఉంది కానీ Scopus, Web of Science, DOAJతో ప్రత్యక్ష ఇంటిగ్రేషన్ లేదు. పటిష్ఠమైన పీర్-రివ్యూడ్ వ్యవస్థ ఉంది. తెలుగు పరిశోధన విజిబిలిటీపై దృష్టి పెడుతుంది. అయితే PubMed Central, శోధగంగ వంటి ప్రపంచ రిపోజిటరీలతో సంబంధాలు లేవు. కానీ Zenodo అంతర్జాతీయ రిపోజిటరీతో ఔచిత్యమ్ పత్రిక ప్రత్యక్షంగా అనుసంధానించబడింది.
ఓపెన్ జర్నల్ సిస్టమ్స్ (OJS) వంటి జర్నల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌తో ఈ సైట్ పనిచేయడం లేదు. OJS లక్షణాలు (/index.php, లాగిన్ పోర్టల్స్, వర్క్‌ఫ్లో డాష్‌బోర్డ్‌లు వంటివి) లేకపోవడం చూస్తే ఇమెయిల్ సబ్మిషన్స్, గూగుల్ ఫారమ్స్ లింకులు, పీహెచ్‌పీ ట్రాకర్ల ద్వారా మాన్యువల్ ప్రాసెస్‌లు జరుగుతున్నాయని తెలుస్తుంది. పరిశోధనల ట్రాకింగ్ కస్టమ్ పీహెచ్‌పీ పేజీలను ఉపయోగిస్తుంది. నెలవారీ సంచికలలో వ్యాసాలకు టెక్ట్స్ విధానంతో పాటు, పీడీఎఫ్ డౌన్‌లోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
6.1.2 సాహిత్యతరంగిణి పత్రిక వెబ్‌సైట్ టెక్నాలజీ
sahithyatharangini.com ఒక సాధారణమైన స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ సైట్‌గా పనిచేస్తుంది. ఇది తెలుగు కంటెంట్ కోసమే ఆప్టిమైజ్ చేయబడిన వెబ్‌సైట్. యూనికోడ్ తెలుగు లిపితో, సాధారణ హెచ్‌టీఎంఎల్-5 తో సైట్ నిర్మాణం కనిపిస్తోంది. లేఅవుట్ టైపోగ్రఫీ కోసం ఇన్‌లైన్ సీఎస్ఎస్ మాత్రమే ఉంది. జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్‌లు, పీహెచ్‌పీ, నోడ్.జేఎస్ వంటి సర్వర్-సైడ్ స్క్రిప్టింగ్, ఫారాలు, ట్రాకర్ల వంటి డైనమిక్ ఎలిమెంట్స్ ఏవీ ఈ పత్రికలో లేవు. ఇది ఆధునిక బిల్డ్ టూల్స్ లేదా సీడీఎన్‌లు లేకుండా, మాన్యువల్ హెచ్‌టీఎంఎల్ ఎడిటింగ్‌తో నడుస్తున్న పత్రిక. జర్నల్ వివరణలు, పీర్-రివ్యూ ప్రాసెస్‌ల సమాచారం వెబ్‌సైట్లో ఉంది. టెక్స్ట్ పేజీల కన్నా పీడిఎఫ్ లుగా వ్యాసాలు ప్రచురితమౌతున్నాయి. మెటాడేటా చాలా సాధారణంగా ఉంది. "సాహిత్యతరంగిణి తెలుగు పరిశోధనా పత్రిక" అనే టైటిల్ ట్యాగ్ తెలుగు పరిశోధన విజిబిలిటీ కోసం రూపొందించబడింది. కానీ మెటా వివరణలు, కీవర్డ్స్, Open Graph ట్యాగ్‌లు, లేదా విద్యాసంబంధ వ్యాసాల కోసం schema.org మార్కప్ లేవు. కానానికల్ యూఆర్ఎల్స్, వ్యూపోర్ట్ సెట్టింగ్స్, రోబోట్స్ మెటా డైరెక్టివ్స్ లేవు.
Scopus, Web of Science, DOAJ, EBSCOHost, లేదా UGC-CARE వంటి ప్రపంచ ఇండెక్సింగ్ ఏజెన్సీలతో ఎలాంటి అనుసంధానాలు సైట్‌లో, అటాచ్‌మెంట్‌లలో ప్రస్తావించబడలేదు. ఇది ఓపెన్-యాక్సెస్, పీర్-రివ్యూడ్ తెలుగు సాహిత్య జర్నల్‌గా కనిపిస్తుంది. శోధగంగ, PubMed Central, OpenAIRE వంటి రిపోజిటరీ ఇంటిగ్రేషన్ల ఆధారాలు లేవు. అధికారికంగా మేజర్ ఇండెక్సింగ్ వివరాలు లేవు. DOI వ్యవస్థ కనిపిస్తోంది. IF ను కూడా గత రెండేళ్ళకు పేర్కొంటోంది. ఈ పత్రిక సైట్ ఓపెన్ జర్నల్ సిస్టమ్స్ (OJS) వంటి ఏ జర్నల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ లేకుండా నడుస్తోంది. OJS పాత్స్, లాగిన్ పోర్టల్స్, సబ్మిషన్ డాష్‌బోర్డ్‌లు, వర్క్‌ఫ్లో టూల్స్ ఏవీ కనిపించవు. ఇమెయిల్ సబ్మిషన్ల ద్వారా వ్యాససమర్పణ, ప్రచురణలు జరుగుతున్నాయి.
6.1.3 లాంగ్వేజ్ ఇన్ ఇండియా పత్రిక వెబ్‌సైట్ టెక్నాలజీ
languageinindia.com వెబ్‌సైట్ చాలా సాధారణమైన స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ పేజీలతో పనిచేస్తుంది. ఈ పత్రిక నెలకొల్పి పాతిక సంవత్సరాలు అయినప్పటికీ ఆప్టిమైజ్ చేయని వెబ్ నిర్మాణాన్నే ఈ పత్రిక ప్రతిబింబిస్తోంది. ఇందులో కంటెంట్- కొన్ని టెక్ట్స్, కొన్ని పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది. ఇన్‌లైన్ లింకులు ఉన్నాయి. కానీ జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ లాంటి డైనమిక్ స్క్రిప్టింగ్ భాషలు కానీ, రియాక్ట్, జాంగో వంటి ఫ్రేమ్‌వర్క్‌ల ఉపయోగం కానీ కనిపించడం లేదు. బూట్‌స్ట్రాప్ వంటి సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌లు, ఆధునికమైన బిల్డ్ టూల్స్ లేవు. ఈ అంశాల పరిశీలన వల్ల ఇది సాధారణమైన మాన్యువల్గా నిర్వహించబడుతున్న స్టాటిక్ సైట్‌గా చెప్పవచ్చు. వర్డ్‌ప్రెస్ డబ్ల్యూపీ-కంటెంట్ పాత్స్, ఓజేఎస్ లాగిన్ పోర్టల్స్ వంటి సీఎంఎస్-స్పెసిఫిక్ జాడలు ఎక్కడా లేవు. అంటే స్వయంచాలక జర్నల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ లేకుండా.. కస్టమ్ స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ డెవలప్‌మెంట్‌తో మాత్రమే ఈ పత్రిక వెబ్‌సైట్ రూపొందించారని స్పష్టమైంది.
ఈ పత్రిక వెబ్‌సైట్లో మెటాడేటా చాలా తక్కువగా ఉంది. కేవలం "LANGUAGE IN INDIA" అనే సాధారణ టైటిల్ ట్యాగ్ మాత్రమే ఉంది. విద్యాసంబంధ వ్యాసాల కోసం schema.org, Open Graph, JSON-LD వంటి నిర్మాణాత్మక డేటా ఏమీ లేదు. కాపీరైట్ నోటీసులు ఇన్‌లైన్‌గా కనిపిస్తున్నాయి, కానీ మెటా కీవర్డ్స్, వివరణలు, లేదా విద్యాసంబంధ సైట్‌లలో సాధారణంగా ఉండే “డబ్లిన్ కోర్ ఎలిమెంట్స్” ఏవీ లేవు. పేజీలలో “కానానికల్ ట్యాగ్‌లు”, “రోబోట్స్ మెటా”, వ్యూపోర్ట్ సెట్టింగ్స్ లేవు.
లాంగ్వేజ్ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్త ఇండెక్సింగ్ ఏజెన్సీలతో అనుసంధానించబడి ఉంది. వాటిలో EBSCOHost, ProQuest (Linguistics and Language Behavior Abstracts), MLA International Bibliography, Gale Research/Cengage Learning, Cabell's Directory ఉన్నాయి. ఇది ఒక ఓపెన్ యాక్సెస్ జర్నల్. పరిశోధన వ్యాసాలన్నిటినీ పీర్-రివ్యూ తర్వాతే ప్రచురిస్తారు. ఈ పత్రిక ప్రచురణలు అన్నీ ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయ లైబ్రరీలలో అందుబాటులో ఉంటాయి. DOAJ, Scopus లతో ఇంకా అనుసంధానింపబడలేదు. కానీ గూగుల్, గూగుల్-స్కాలర్ లలో ఇండెక్స్ అవుతున్న సుప్రసిద్ధ పత్రిక ఇది.
6.1.4 జ్యానవి పత్రిక వెబ్‌సైట్ టెక్నాలజీ
ఈ పత్రిక కార్యకలాపాలన్నీ 'jyanavispmvv.in' అనే ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా జరుగుతాయి. దీని నిర్వహణకు 'ఓపెన్ జర్నల్ సిస్టమ్స్' అనే ఆధునిక సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. ఈ పత్రికకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు పరిశీలిస్తే దీని పేరు 'జ్యానవి - ఎస్.పి.ఎం.వి.వి జర్నల్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ సబ్జెక్ట్స్'. ఇది 2025 జనవరిలో ప్రారంభమైంది. ఏడాదికి నాలుగు సార్లు వెలువడే ఈ పత్రికను తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నడిపిస్తోంది. ఇది ఇంగ్లీష్, తెలుగు భాషలలో సామాజిక శాస్త్రాలు, అలాగే ఇతర అంశాలపై పరిశోధన వ్యాసాలను ప్రచురిస్తుంది.
ప్రస్తుతానికి ఈ పత్రికకు ఐ.ఎస్.ఎస్.ఎన్ తప్ప అంతర్జాతీయ స్థాయి ఇండెక్సింగ్ సంస్థల ఆమోదం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. వ్యాసాలకు ఇచ్చే డి.ఓ.ఐ సంఖ్యలు కూడా కనిపించడం లేదు. పత్రిక నడపడానికి మాత్రం 'ఓపెన్ జర్నల్ సిస్టమ్స్' వెర్షన్ 3.4.0.8 వాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వ్యాసాలను పంపడం, పరిశీలించడం, పాత సంచికలను భద్రపరచడం వంటి పనులన్నీ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతాయి. గూగుల్, గూగుల్-స్కాలర్లలో ఇండెక్స్ అవుతున్న చక్కని పత్రిక ఇది.
6.1.5 అక్షరసూర్య పత్రిక వెబ్‌సైట్ టెక్నాలజీ
అక్షరసూర్య.కామ్ (aksharasurya.com) వెబ్‌సైట్ ప్రధానంగా 'ఓపెన్ జర్నల్ సిస్టమ్స్' అనే సాంకేతిక విధానంతో నడుస్తోంది. ఇది పరిశోధన వ్యాసాలను ప్రచురించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్. ఈ సైట్ చిరునామాను గమనిస్తే అది పి.హెచ్.పి అనే కంప్యూటర్ భాషతో తయారైందని, అందులో సమాచారాన్ని భద్రపరచడానికి డేటాబేస్ వాడుతున్నారని సులభంగా అర్థమవుతుంది. కొత్త వ్యాసాలు చదవడం, పాతసంచికలు చూడటం, లాగిన్ అవ్వడం వంటి సదుపాయాలు అన్నీ ఈ పద్ధతిలోనే ఉన్నాయి.
ఇక్కడ ప్రచురించే ప్రతి వ్యాసానికి సంబంధించి స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉన్నాయి. పత్రిక పేరు, దాని గుర్తింపు సంఖ్య, ప్రచురణ తేదీ వంటి ముఖ్యమైన సమాచారం ఇందులో కనిపిస్తుంది. ఇది నెలకు ఒకసారి వెలువడే బహుభాషా పత్రిక. ఇందులో ప్రచురితమయ్యే వ్యాసాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించే 'క్రియేటివ్ కామన్స్' నిబంధనల ప్రకారం చదువుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఈ పత్రికకు అధికారికంగా 2583-620X అనే ఐ.ఎస్.ఎస్.ఎన్ సంఖ్య ఉంది. పరిశోధన పత్రాల నాణ్యతను తెలిపే ఏ.బి.సి.డి ఇండెక్స్, ఆర్.పి.ఆర్.ఐ వంటి సంస్థల జాబితాలలో కూడా ఈ పత్రిక చోటు సంపాదించుకుంది. ఈ వివరాలన్నీ చూస్తే ఇది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నడుస్తున్న ఆన్‌లైన్ పరిశోధన పత్రిక అని స్పష్టమవుతోంది. గూగుల్, గూగుల్-స్కాలర్ లలో ఇండెక్స్ అవుతున్న విశిష్ట పత్రిక ఇది.
పట్టిక: 1 ఎంపిక చేసుకున్న పత్రికలు: వివిధ అంశాలు
| పత్రిక | సాధారణ వ్యాస స్వరూపం | పరిశోధనపద్ధతి | ISSN, ఇండక్సింగ్ సమాచారం |
| ఔచిత్యమ్ | పూర్తి యూనికోడ్ తెలుగు, సాహిత్య / భాషా పరిశోధన; ఫార్మల్ శైలి, సైటేషన్, రిఫరెన్సులు ఉన్న టెంప్లేట్ బలంగా సూచించబడింది. | ప్రామాణిక పరిశోధన పద్ధతులు, వారాల పీర్ రివ్యూ, టెంప్లేట్, హామీపత్రం ద్వారా పరిశోధన పద్ధతి బలపరడం; విధానం క్లాసికల్ హ్యూమానిటీస్ రీతిలో ఉంటుంది. | ISSN, ROAD, COSMOS, ABCD వంటి ఇండెక్స్‌లలో నమోదు; రీసెర్చ్ స్టాండర్డ్స్ పై దృష్టి. |
| సాహిత్యతరంగిణి | తెలుగు పరిశోధన వ్యాసాలు, కాన్ఫరెన్స్ స్పెషల్ ఇష్యూలు; వెబ్ పేజీలో భావ వ్యాఖ్యనాత్మక, వివరణాత్మక శైలి. | పీర్ రివ్యూ స్టెప్‌లను 7 దశలుగా స్పష్టంగా వివరిస్తుంది; వ్యాసాల్లో పద్ధతి సెక్షన్ ఉండే అవకాశం ఎక్కువ, కానీ టెంప్లేట్/సైటేషన్ స్టాండర్డ్ వివరాలు పరిమితంగా కనిపిస్తాయి. | ISSN, SJIF ఇంపాక్ట్ ఫ్యాక్టర్, “Indexed in Google Scholar etc” అని పేర్కొనడం; ప్రైవేట్ మెట్రిక్ / ఇండెక్స్‌లపై ఆధార పడుతున్నట్టు తెలుస్తుంది. |
| జ్యానవి (SPMVV) | బహుశాఖా వ్యాసాలు (సోషియల్ సైన్సెస్, మీడియా స్టడీస్, ఎడ్యుకేషన్ మొదలైనవి); ప్రతి వ్యాసం పేజీ మొత్తానికి ఆన్‌లైన్ HTML+PDF, అకడమిక్ ఇంగ్లిష్ స్టైల్. | OJS ప్లాట్‌ఫామ్‌లో పబ్లిష్ కావడం వల్ల Abstract, Keywords, Introduction, Methodology, వంటి కాన్వెన్షనల్ IMRaD / near-IMRaD రూపం పాటిస్తున్న వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. | ISSN, విశ్వవిద్యాలయ పత్రికగా స్పష్టం; బ్రాడ్ అంతర్జాతీయ ఇండెక్స్‌లను వెబ్‌సైట్‌లో ముందుగా ప్రస్తావించ లేదు. |
| Language in India | భారీ ఆన్‌లైన్ ఆర్కైవ్; మోనోగ్రాఫ్‌లు, థీసిస్‌లు, సెమినార్ ప్రొసీడింగ్స్, వ్యాసాలు – అన్నీ బహుళ ఫార్మాట్లలో; భాషాశాస్త్రం, ELT, సాహిత్యం, సామాజిక శాస్త్రాలు. | చాలా వ్యాసాలు/డిసర్టేషన్‌లు క్లాసిక్ థీసిస్ స్ట్రక్చర్‌తో (పద్ధతి, డేటా, అనాలిసిస్, బిబ్లియోగ్రఫీ) ఉంటాయి; అయినా సంపాదక ప్రమాణం రచయిత/సెమినార్ స్థాయిపైన ఆధారపడి స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. | ISSN; 2001 నుంచి నిరంతర ఆర్కైవ్, ప్రపంచ వ్యాప్తంగా అందు బాటులో ఉంది; అనేక యూనివర్సిటీ థీసిస్‌లు, రిపోర్టులు హోస్ట్ చేయడం వలన డోక్యుమెంటేషన్ ప్లాట్‌ఫామ్ కూడా. |
| అక్షరసూర్య | OJS మీద మల్టీడిసిప్లినరీ జర్నల్; తాజా సంచికలో థీమ్ ఆధారిత వ్యాసాలు (Viksit Bharat 2047); రీసెర్చ్ ఆర్టికిల్స్‌లో Abstract, కీలక పదాలు, శీర్షిక ఆధారంగా పాలసీ / ఎకనామిక్స్ / సోషియల్ స్టడీస్ తరహా. | OJS మెటాడేటా + “qualitative research article” లక్ష్యంగా పీర్ రివ్యూ; అనేక వ్యాసాలు డిస్క్రిప్టివ్ / అనలిటికల్ స్టడీస్, కానీ సాధారణంగా సోషియల్ సైన్స్ హ్యూమానిటీస్ మిక్స్డ్ మెథడ్ / డాక్యుమెంటరీ అనాలిసిస్ రీతిలో. | E‑ISSN, ISSN పోర్టల్, ABCD Index, ఇతర ప్రైవేట్ ఇండెక్స్‌లలో నమోదు; OJS ద్వారా మెటాడేటా ఎక్స్‌పోర్ట్, లైసెన్స్ CC‑BY 4.0. |
6.2 వ్యాసరచన స్వరూపం, పరిశోధన పద్ధతులు
ఔచిత్యమ్ వెబ్‌సైట్‌లో కనిపించే వ్యాసాలలో శీర్షిక సూటిగా ఉంటుంది. రచయిత పేరు, హోదా, సంస్థ వివరాలు మొదట ఉంటాయి. చాలావరకు సారాంశం, కీలక పదాలు ఉంటాయి. ప్రధాన భాగం ఉపశీర్షికలతో ఉండి, భాష గౌరవభావంతో సరళంగా ఉంటుంది. ఉదాహరణలు, చారిత్రక పరిచయాలు, పూర్వ పరిశోధనల సూచనలు కనిపిస్తాయి. చివరలో గ్రంథసూచిక ఇస్తారు. పద్ధతి విషయానికి వస్తే ఎక్కువ వ్యాసాలు గుణాత్మక విశ్లేషణ పద్ధతిని అనుసరిస్తాయి. పాఠ్య విశ్లేషణ, తులనాత్మక అధ్యయనం, సిద్ధాంత పరమైన చర్చ ఎక్కువగా కనిపిస్తుంది. శాంపిల్ ఎంపిక, గణాంక లెక్కల వంటి అంశాలు తక్కువగా కనిపిస్తాయి. హ్యూమానిటీస్ రంగానికి తగినట్లు గ్రంథ ఆధారిత పరిశీలనను ముఖ్యంగా తీసుకుంటారు. నిర్దిష్టమైన పీర్ రివ్యూ వ్యవస్థ ఉంది.
సాహిత్యతరంగిణి పత్రికలో వ్యాస స్వరూపంలో సాహిత్య విమర్శ కనిపిస్తుంది. శీర్షికలు భావోద్వేగం కలిగించేలా ఉంటాయి. ముందుగా అంశ పరిచయం, తరువాత రచయితలు ఎంపిక చేసిన కవిత, కథ, నవలలు ఏమిటో సులభంగా చెబుతారు. వాక్య నిర్మాణం పెద్ద పెద్ద వాక్యాల కంటే మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. అడుగడుగునా ఉదాహరణలతో విశ్లేషణ కొనసాగుతుంది. ఈ పత్రిక వెబ్‌పేజీలో పీయర్ రివ్యూ దశలు స్పష్టంగా వివరించారు. వ్యాసం మొదట ప్రాథమిక పరిశీలన దాటాలి. తరువాత నిపుణులు సూచనలు ఇస్తారు. రచయిత మార్పులు చేసి తిరిగి పంపాలి. ఎడిటర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానంవల్ల తక్కువ తప్పులు, కొంచెం మెరుగైన నాణ్యత కలిగిన వ్యాసాలు వస్తాయి.
జ్యానవి జర్నల్ వెబ్‌సైట్‌లో కనిపించే వ్యాసాలు యూనివర్సిటీ స్థాయి మల్టీడిసిప్లినరీ పరిశోధన స్థాయిలో, తెలుగుతోపాటు చాలా వ్యాసాలు ఇంగ్లీషు భాషలో ఉంటాయి. Abstract, Keywords భాగాలు స్పష్టంగా ముందు ఉంటాయి. తరువాత Introduction, Objectives, Methodology, Discussion, Findings, Conclusion వంటి భాగాలు వరుసగా కనిపిస్తాయి. ఈ నిర్మాణం సామాజిక శాస్త్రాలు, విద్య, మీడియా స్టడీస్ వంటి రంగాలకు బాగా సరిపోతుంది. Methodology భాగంలో శాంపిల్ ఎంతమంది పై తీసుకున్నారు, ఏ టూల్స్ వాడారు, ప్రశ్నపత్రం వాడారా లేదా అనేది సంక్షిప్తంగా చెబుతారు. కొన్నిసార్లు పట్టికలు కూడా ఇస్తారు. పీడీఎఫ్ రూపంలో వ్యాసాలు అందుబాటులో ఉంటాయి. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉండటం వల్ల కనీస అకడమిక్ ఇంటిగ్రిటీని కాపాడే జాగ్రత్త కనిపిస్తుంది.
లాంగ్వేజ్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ భాషా పరిశోధనకు పెద్ద వేదిక. ప్రధాన కంటెంట్ ఇంగ్లీషులో ఉన్నా తెలుగు పై ఎన్నో వ్యాసాలు, థీసిస్‌లు, సదస్సు పత్రాల ప్రచురణలు ఉన్నాయి. తెలుగు భాషా అభివృద్ధి, బోధన, ద్విభాషాధ్యయనం, సాహిత్య విశ్లేషణ వంటి అంశాలపై పరిశోధన జరుగుతుంది. ఇందులో తెలుగు భాషపై ఆంగ్లంలోను, తెలుగులోను అకడమిక్ కంటెంట్ కనిపిస్తోంది.
అక్షరసూర్య పత్రిక మల్టీలింగ్వల్ జర్నల్. ప్రధానంగా కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలలో వ్యాసాలు తీసుకుంటున్నట్లు aims and scopeలో ఉంది. ప్రస్తుత కంటెంట్ చూస్తే కూడా ఎక్కువ వ్యాసాలు ఆ మూడు భాషలలోనే కనిపిస్తున్నాయి. తెలుగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రస్తుతం కనిపించదు. కానీ తొలినాటి సంచికలలో తెలుగులో వ్యాసాలు స్వీకరించి ప్రచురించారు. ఈ పత్రికలో తెలుగు అకడమిక్ కంటెంట్ కనిపిస్తోంది.
ఈ ఐదు పత్రికలన్నిటినీ కలిపి చూస్తే వ్యాసరచనలో రెండు పెద్ద విభాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఔచిత్యమ్, సాహిత్యతరంగిణి, కొంతవరకు లాంగ్వేజ్ ఇన్ ఇండియా సాహిత్య, భాషా పరిశోధనకు దగ్గరగా ఉండే గుణాత్మక పద్ధతిని అనుసరిస్తాయి. టెక్స్ట్‌లోని ఉటంకింపులు, శైలీ విశేషం, సిద్ధాంతాల ప్రయోగం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. పరిశోధన పద్ధతి అనే శీర్షిక తప్పనిసరిగా ఇవ్వకపోయినా రచన అంతటా పరిశోధన పద్ధతి అంతర్లీనంగా కనిపిస్తుంది. మరొకవైపు జ్యానవి, అక్షరసూర్య, లాంగ్వేజ్ ఇన్ ఇండియా లోని సోషియల్ సైన్స్ వ్యాసాలు IMRaD నిర్మాణాన్ని దగ్గరగా అనుసరిస్తాయి. Abstract నుంచి References వరకు ప్రతి భాగం స్పష్టంగా విడదీస్తారు. శాంపిల్, టూల్స్, గణాంకాల వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. రెండు విధానాలూ తమ తమ రంగానికి తగినట్టు ఉన్నాయని చెప్పవచ్చు. సామాన్య పాఠకుడికి కూడా మౌలికంగా అర్థమయ్యేలా ఉంటే సరిపోతుంది. ఒక చోట విశ్లేషణ ఎక్కువ, మరొక చోట గణాంకం, పట్టికలు ఎక్కువ కనిపిస్తాయి.
6.3 విషయగతమైన అంశాలు (స్కాలర్లీ కంటెంట్)
ఔచిత్యమ్‌లో పూర్తిగా విషయం శాస్త్రీయంగా కనిపిస్తుంది. ఈ పత్రిక స్వయంగా తాను “అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక” అని ప్రకటిస్తోంది. వ్యాసాలన్నీ తెలుగు భాషలో ఉంటాయి. ప్రాచీన ఆధునిక సాహిత్యాలు, భాషాశాస్త్రం, జానపదం, గిరిజన అధ్యయనాలు వంటి అంశాలపై నియతంగా పరిశోధన వ్యాసాలు ప్రచురించబడుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన తెలుగు అకడమిక్ కంటెంట్ కోసం ఇది ప్రాధాన్యం ఇస్తుందని చెప్పవచ్చు. అందుకు తగినట్టుగా ప్రామాణిక గ్రంథాల ఉటంకింపులు, రిఫరెన్సులు, క్షేత్రపర్యటన ఆధారాలు ఈ పత్రిక వ్యాసాలలో కనిపిస్తాయి.
సాహిత్యతరంగిణి పత్రిక పరిచయ వాక్యాలలో “తెలుగు సాహిత్యంలో అంతర్జాతీయ పీర్ రివ్యూ జర్నల్” అని స్పష్టంగా ఉంది. పత్రిక ఉద్దేశం తెలుగు సాహిత్యం, భాషా పరిధిలో జరుగుతున్న నిజమైన పరిశోధన కృషిని వ్యాసాలుగా ప్రచురించడం. అందుకే ప్రచురిత వ్యాసాలు తెలుగు పరిశోధనకు చెందినవే. సైద్ధాంతిక చర్చలు, రచనల విశ్లేషణ, కవిత్వం పరిశీలన వంటి అంశాలు ఎక్కువగా వస్తాయి. ఇది కూడా ప్రశస్తమైన తెలుగు అకడమిక్ కంటెంట్ ఇచ్చే జర్నల్.
జ్యానవి పత్రిక ప్రధానంగా ఇంగ్లీషు వ్యాసాలతో నడుస్తుంది. అయితే మునుపటి సంచికలలో, తాజా సంచికలోనూ, తెలుగు సాహిత్య వ్యాసం, తెలుగు భాషా పండితుని సమీక్షల గురించి ప్రస్తావన ఉంది. కొన్ని వ్యాసాలు ద్విభాషా రూపంలో తెలుగు, ఇంగ్లీష్ భాగాలు కలిపి ఉంటాయి. ప్రస్తుతం సంగీతం, నాట్య విభాగాల వారి పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇక్కడ తెలుగు అకడమిక్ కంటెంట్ పరిమిత స్థాయిలో మాత్రమే ఉంది. ఈ పత్రికకు ప్రధాన బలం మల్టీడిసిప్లినరీ ఇంగ్లీషు అకడమిక్ వ్యాసాలు.
లాంగ్వేజ్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ భాషా పరిశోధనకు పెద్ద వేదిక. ప్రధాన కంటెంట్ ఇంగ్లీషులో ఉన్నా తెలుగు పై ఎన్నో వ్యాసాలు, థీసిస్‌లు, సదస్సు పత్రాల ప్రచురణలు ఉన్నాయి. తెలుగు భాషా అభివృద్ధి, బోధన, ద్విభాషాధ్యయనం, సాహిత్య విశ్లేషణ వంటి అంశాలపై పరిశోధన జరుగుతుంది. ఇందులో తెలుగు భాషపై ఆంగ్లంలోను, తెలుగులోను అకడమిక్ కంటెంట్ కనిపిస్తోంది.
అక్షరసూర్య పత్రిక మల్టీలింగ్వల్ జర్నల్. ప్రధానంగా కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలలో వ్యాసాలు తీసుకుంటున్నట్లు aims and scopeలో ఉంది. ప్రస్తుత కంటెంట్ చూస్తే కూడా ఎక్కువ వ్యాసాలు ఆ మూడు భాషలలోనే కనిపిస్తున్నాయి. తెలుగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రస్తుతం కనిపించదు. కానీ తొలినాటి సంచికలలో తెలుగులో వ్యాసాలు స్వీకరించి ప్రచురించారు. ఈ పత్రికలో తెలుగు అకడమిక్ కంటెంట్ కనిపిస్తోంది.
ఈ ఐదు పత్రికల విషయ నాణ్యతను పరిశీలిస్తే అన్ని పత్రికలు తెలుగు అకడమిక్ కంటెంట్ నే ఎక్కువగా ప్రచురిస్తున్నట్లు స్పష్టమైంది.
7. విజిబిలిటీ మార్గదర్శకాలు – ఐదు పత్రికల స్థానం
ఏ సమాచారమైనా గూగుల్, గూగుల్-స్కాలర్లో ఇండెక్స్ కావడానికి రెండు కోణాలు ముఖ్యం. ఒకటి కంటెంట్ స్వరూపం. రెండవది సాంకేతిక నియమాలు. గూగుల్ స్కాలర్ మార్గదర్శకాల ప్రకారం వెబ్‌సైట్‌లో ఎక్కువ భాగం శాస్త్రీయ వ్యాసాలు, థీసిస్‌లు, టెక్నికల్ రిపోర్టులు ఉండాలి. వార్తలు, సాధారణ సమాచారం, మ్యాగజైన్ శైలిలోని కథనాలు, సామాన్య వ్యాసాలు ఉంటే గూగుల్-స్కాలర్‌లో స్థిరంగా ఇండెక్స్ కావు. ప్రతి వ్యాసానికి స్పష్టమైన టైటిల్, రచయిత, జర్నల్ పేరు, వాల్యూమ్, ఇష్యూ, సంవత్సరము, పేజీ పరిధి, సారాంశం, సూచనలు వంటి వివరాలు అందుబాటులో ఉండాలి. HTML కోడ్‌లో కూడా ఈ వివరాలు ప్రత్యేక meta ట్యాగుల రూపంలో ఇవ్వాలని గూగుల్-స్కాలర్ స్పష్టంగా చెబుతోంది. ఉదాహరణకు citation_title, citation_author, citation_journal_title, citation_volume, citation_issue, citation_firstpage, citation_lastpage, citation_publication_date వంటి ట్యాగులు. స్కాలర్ బాట్ వీటిని చదివి ఆటోమేటిక్‌గా రికార్డు సృష్టిస్తుంది. వ్యాసం pdf అయితే అందరూ సరళంగా చదవగలిగే విధంగా మొదటి పేజీలో పూర్తి స్థాయి బిబ్లియోగ్రాఫిక్ వివరాలు ఉండాలి.
ఈ అయిదు పత్రికల స్థితి ఒక్కొక్కటి చూసుకుంటే ఔచిత్యమ్ UGC CARE లిస్టులో ఒకప్పుడు ఉండేది కాబట్టి ఈ పత్రిక వ్యాసాలు ఇప్పటికే చాలా యూనివర్శిటీ లైబ్రరీల డేటాబేసుల ద్వారా గూగుల్-స్కాలర్‌కి చేరే అవకాశం ఉంది. వెబ్‌సైట్ నిర్మాణం, వేరువేరుగా వ్యాసాలకు ప్రత్యేకమైన పేజీలు, స్థిరమైన శాశ్వతమైన లింకులు ఈ పత్రికలో ఉన్నాయి. ప్రతి వ్యాసం pdfలలో కూడా ఉంది. మొదటి పేజీలో శీర్షిక, రచయిత, ISSN, వాల్యూమ్, ఇష్యూ వంటి వివరాలున్నాయి. ఇవన్నీ స్కాలర్ కనుగొనడానికి సరిపోతాయి. అయితే HTML మెటాట్యాగులు ప్రత్యేకంగా రూపొందించబడితే ఇండెక్సింగ్ మరింత బలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సైట్ గూగుల్ వంటి అన్ని సెర్చి ఇంజన్లలో కనిపిస్తోంది కానీ ప్రత్యక్షంగా గూగుల్-స్కాలర్తో అనుసంధానం కాలేదు. విస్తృతమైన రిపోజిటరీలను వినియోగించడం వల్ల ఈ పత్రికకు భవిష్యత్తులో స్కాలర్ ఇండెక్సింగ్ జరుగుతున్నదని ఊహించవచ్చు.
సాహిత్యతరంగిణి గురించి ప్రచురణకర్త స్పష్టంగా “Indexed in Google Scholar, Academia, Internet Archives etc” అని ప్రకటించారు. pdf ఫైళ్ళలో కూడా పై మార్జిన్ వద్ద జర్నల్ పేరు, వాల్యూమ్, ఇష్యూ, పేజీ సంఖ్యలు ముద్రించారు. ఈ నిర్మాణం గూగుల్ స్కాలర్‌కు అనుకూలంగా ఉంటుంది. సైట్‌లో వ్యాసాలు రీసెర్చి పద్ధతులను అనుసరిస్తూనే ఉన్నాయి. గూగుల్-స్కాలర్‌లో కనీసం కొన్ని సంచికల వ్యాసాలు ఇప్పటికే కనిపించే అవకాశం ఉంది. కానీ కనిపించడం లేదు. భవిష్యత్తులో మరింత బలం కావాలంటే ప్రతి వ్యాసానికి ప్రత్యేక HTML అబ్స్ట్రాక్ట్ పేజీ, మెటాట్యాగులు, రిఫెరెన్సుల వంటి అమరిక ఉంటే తప్పకుండా అన్ని వ్యాసాల విజిబిలిటీ పెరుగుతుంది.
లాంగ్వేజ్ ఇన్ ఇండియా విషయానికి వస్తే ఇది ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ డేటాబేసుల్లో స్థిరంగా ఉంది. సైట్లోనే EBSCOHost, ProQuest, MLA International Bibliography, Gale Research, Cabell’s Directory లలో ఇండెక్సైందని స్పష్టంగా చెబుతోంది. ఈ డేటాబేసులన్నీ గూగుల్-స్కాలర్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి Language in India వ్యాసాలు స్కాలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా pdf ఫైళ్లకు scholar citations కూడా ఉంటాయి. కాబట్టి ఈ పత్రిక విషయంలో ఇండెక్సింగ్ సమస్య లేదు. వ్యాస నాణ్యత, ప్లాజరిజం నియంత్రణ, శైలీ మార్గదర్శకాలపైనే ఈ పత్రిక దృష్టి సారిస్తుంది.
అక్షరసూర్య, జ్యానవి రెండు కూడా OJS ఆధారిత వెబ్‌సైట్‌లు. OJS ప్లాట్‌ఫామ్ స్వయంగా గూగుల్-స్కాలర్ కోసం మెటాట్యాగులు ఇచ్చేలా డిజైన్ చేయబడింది. ఈ సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్‌లో కూడా ప్రత్యేక “Google Scholar” మార్గదర్శకాలు ఇచ్చారు. లేటెస్ట్ Aksharasurya వ్యాసాలను pdfలో చూస్తే టెక్స్ట్‌లో JSTOR, ProQuest, Google Scholar వంటి పదాలు సూచనలు భాగంలో ఉన్నాయి. అంటే రచయితలు ఇప్పటికే ఇతర స్కాలర్ సోర్సులను వినియోగిస్తున్నారని అర్థం. వెబ్‌సైట్ నుండి ఇండెక్సింగ్ ఇంకా బలంగా జరగాలంటే ప్రతి వ్యాసానికి అబ్స్ట్రాక్ట్ పేజీ HTMLలో ఉండాలి. access పరిమితులు ఉండకూడదు. robot.txt చేర్చి క్రాలింగులో వ్యాసాల పేజీలు బ్లాక్ అవకుండా చూసుకోవాలి. ఈ షరతులు Aksharasurya, Jyanavi రెండింటిలో పెద్దగా చేస్తున్నట్టు కనిపించదు. ప్రారంభదశలో ఉన్న జ్యానవి వ్యాసాలు స్కాలర్‌లో విస్తృతంగా కనిపించడానికి కారణం OJS ను ఉపయోగించడం, మిగతా అన్ని విషయాలలోను తగిన ప్రమాణాలు పాటించడంగా తెలుస్తోంది.
8. OJS జర్నళ్ళు – ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థల వల్ల విజిబిలిటీలో తేడాలు
కొన్ని పరిశోధన పత్రికల వెబ్సైట్లు (ఉదా. Naad–Nartan) OJS ద్వారా నిర్వహింపబడక పోయినప్పటికీ గూగుల్ స్కాలర్లో ఇండెక్స్ అవ్వడం కనిపిస్తోంది. గూగుల్-స్కాలరుకు OJS మాత్రమే ఉండాలని నియమం ఏమీ లేదు. మరే ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CMS) అయినా పరవాలేదు. ఆ వెబ్సైటుకు కావాల్సిన నిర్మాణం, యాక్సెస్ ఉంటే చాలు.
గూగుల్-స్కాలరుకు ముఖ్యంగా రెండు అవసరాలు ఉంటాయి. ఒకటి ప్రతి ఆర్టికల్‌కి ప్రత్యేక URL ఉండాలి. రెండోది ఒకే విధమైన శాస్త్రీయమైన ఫార్మాట్ ఉండాలి. టైటిల్, రచయిత పేరు, జర్నల్ పేరు, సంవత్సరంతో బిబ్లియోగ్రాఫిక్ సమాచారం ఆ పేజీలో స్పష్టంగా కనిపించాలి. PDFలలో టైటిల్, రచయిత వివరాలు, రిఫరెన్సులు సరిగ్గా లేఅవుట్‌లో ఉంటే క్రాలర్ వాటిని పేపర్‌గా గుర్తించ గలుగుతుంది. ఉదాహరణకు Naad–Nartan పత్రికలో PDFలు కూడా రీసెర్చి ఆర్టికల్ ఫార్మాట్‌లో ISSN, టైటిల్, రచయిత, అఫిలియేషన్, రిఫరెన్సులతో ఉన్నాయి. అందుకే గూగుల్-స్కాలర్ వాటిని శాస్త్రీయమైన పేపర్లుగా గుర్తించి ఇండెక్స్ చేస్తోంది. ఇంకో కారణం citation network. ఇతర వ్యాసకర్తల పేపర్లు, రిప్యూటెడ్ జర్నళ్ళు... ఈ Naad–Nartan లో ప్రచురించబడే పరిశోధన వ్యాసాలను "సైట్" చేస్తున్నాయి. బయట డేటాసెట్స్‌లో కూడా ఈ జర్నల్ పేరుతో సూచికలు, రిఫరెన్సులు ఉన్నాయి. ఈ సైటేషన్లు నాద్-నర్తన్ పత్రికను గూగుల్ స్కాలర్ గుర్తించేలా సహాయపడుతున్నాయి. తద్వారా కొత్త పేపర్లు కూడా క్రమంగా ఇండెక్స్ అవుతున్నాయి. కాబట్టి OJS వాడకపోయినా, Naad–Nartan వంటి జర్నల్ సైట్‌లో PDFలు పబ్లిక్‌గా యాక్సెస్‌య్యేలా ఉంచి, శాస్త్రీయ ఆర్టికల్ నిర్మాణం పాటించి, రెగ్యులర్ ఇష్యూలు ప్రచురించగలిగితే గూగుల్ స్కాలర్ తన క్రాలర్ ద్వారా వాటిని కనుగొని ఇండెక్స్ చేస్తుంది. OJS ఉండటం ఒక సౌకర్యం మాత్రమే గానీ, కచ్చితంగా వాడాలనే నియమం ఏమీ లేదని స్పష్టం అవుతోంది.
ఉపసంహారం
- తెలుగు ఆన్‌లైన్ పరిశోధన పత్రికలు మెరుగైన విజిబిలిటీ సాధించాలంటే సాంకేతిక, విషయపరమైన ప్రమాణాలు పాటించాలి.
- కొన్ని తెలుగు పత్రికలు వ్యాసాలను pdfగా అప్‌లోడ్ చేస్తున్నా HTML మెటాడేటా ఇవ్వడం లేదు. ఇది ప్రధాన సమస్య. గూగుల్ స్కాలర్ బాట్ pdf మొదటి పేజీ చదివి, ఏదోలా రికార్డు సృష్టించగలదు కానీ టైటిల్, రచయిత, జర్నల్ పేరు గుర్తుపట్టడంలో తప్పులు దొర్లుతాయి. దీనికి పరిష్కారంగా జర్నల్ వెబ్‌సైట్‌లో ప్రతి వ్యాసానికి చిన్న అబ్స్ట్రాక్ట్ పేజీ సృష్టించి, ఆ పేజీలో గూగుల్-స్కాలర్ సూచించిన “citation_” మెటాట్యాగులు పెట్టాలి.
- సైట్ నావిగేషన్ స్పష్టంగా లేక పోవడం, సంచికలకు ఆర్కైవ్ పేజీలు లేకపోవడం రెండవ సమస్య. స్కాలర్‌ను దృష్టిలో పెట్టుకొని సంవత్సరము, వాల్యూమ్, ఇష్యూ వారీగా లింకుల్ని ఇవ్వాలి.
- pdf సైజులు పెద్దగా ఉండడం, మొదటి పేజీలో సంచిక పూర్తి వివరాలు ఇవ్వకపోవడం మూడవ సమస్య. మొదటి పేజీలో జర్నల్ పేరు, వాల్యూమ్, ఇష్యూ, నెల, సంవత్సరము, పేజీ పరిధి, ISSN తప్పనిసరిగా ఉండేలా టెంప్లేట్లను మార్చుకోవాలి.
- సైట్ robot.txt ఫైలు ద్వారా search engine క్రాలింగ్‌ను నిరోధించడం, లాగిన్ చేస్తే కానీ వ్యాసాలు కనిపించకపోవడం వంటివి నాల్గవ సమస్య. గూగుల్ స్కాలర్‌కు ఫ్రీ యాక్సెస్ ఉండాలి. అంటే జర్నల్ కంటెంట్ పబ్లిక్ యాక్సెస్ ఉండేలా సాంకేతిక నిపుణులు చూసుకోవాలి.
- OJS వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి మెటాడేటా అమరిక, వ్యాసనిర్మాణ ప్రమాణాలను పెంపొందించవచ్చు. కానీ పటిష్టమైన సైట్ నిర్మాణం, వ్యాసస్వరూపం ఉంటే, ఏ వెబ్సైట్ ద్వారా అయినా విజిబిలిటీని సాధించవచ్చు.
- గూగుల్ స్కాలర్ వంటి ప్రపంచ డేటాబేస్‌లలో తెలుగు పరిశోధనలను చేర్చడం ద్వారా విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలి.
ఈ అయిదు పత్రికలలో Language in India, చాలా వరకు అక్షరసూర్య, కొంతవరకు సాహిత్యతరంగిణి పత్రికలు గూగుల్, గూగుల్ స్కాలర్ ఇండెక్స్ ప్రమాణాలను చేరువైనట్టు కనిపిస్తున్నాయి. ఔచిత్యమ్ పత్రికకు CARE స్థాయి వల్ల, Zenodo రిపోజిటరీ వల్ల గూగుల్ సెర్చ్ ఇంజన్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ, గూగుల్-స్కాలర్లో ఇండెక్స్ కావడానికి సరిపడా సాంకేతమైనసవరణలు చేసుకోవలసి ఉంది. రీచ్ ఎక్కువగా ఉండడం వల్ల పరోక్షంగా బలం ఉన్నా, పత్రిక మెటాడేటా మెరుగుపరిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది, విజిబిలిటీ పెరుగుతుంది. జ్యానవి కొత్త పత్రిక కాబట్టి OJS సెట్టింగులు సరైన విధంగా అవసరమైన మెటాట్యాగులు ఉత్పత్తి చేస్తున్నాయో లేదో టెక్నికల్‌గా చెక్ చేస్తూ ఉంటే, రాబోయే సంవత్సరాలలో గూగుల్-స్కాలర్ విజిబిలిటీ స్థిరంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ ఇండక్సులలో చోటు సంపాదించుకోగలదు.
పరిశోధనకు ఎంపిక చేసుకున్న ఆన్లైన్ పరిశోధన పత్రికలు
- AUCHITHYAM. “ఔచిత్యమ్ – అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక, https://www.auchithyam.com/. Accessed 1 Nov. 2025.
- Sahithyatharangini. “సాహిత్యతరంగిణి తెలుగు పరిశోధనా పత్రిక.” https://www.sahithyatharangini.com/. Accessed 1 Nov. 2025.
- Language in India – An International Online Monthly Research Journal. https://www.languageinindia.com/. Accessed 1 Nov. 2025.
- JYANAVI. “JYANAVI – SPMVV Journal of Multidisciplinary Subjects.” Sri Padmavati Mahila Visvavidyalayam, https://jyanavispmvv.in/index.php/files/index. Accessed 1 Nov. 2025.
- AKSHARASURYA. “AKSHARASURYA Multidisciplinary E-Journal.” Aksharasurya, 2024, https://aksharasurya.com/. Accessed 1 Nov. 2025
- Naad–Nartan. Journal of Dance & Music. https://naadnartan.in Accessed 1 Nov. 2025
References
Bhattacharya, P., Goyal, P., & Sarkar, S. (2018). Using communities of words derived from multilingual word vectors for cross-language information retrieval in Indian languages. ACM Transactions on Asian and Low-Resource Language Information Processing. https://doi.org/10.1145/3208358
Dutta, B. (n.d.). Metadata and Dublin Core (Module 34). INFLIBNET e-PG Pathshala: Library and Information Science. Retrieved from
https://ebooks.inflibnet.ac.in/lisp3/chapter/metadata-and-dublin-core/
Google Scholar. (n.d.). Inclusion guidelines for webmasters. Google. https://scholar.google.com/intl/en/scholar/inclusion.html
Google Scholar. (n.d.). Support for publishers. Google. https://scholar.google.com/intl/en/scholar/publishers.html
Google. "Search Central Documentation." Google Search Central, 2024, developers.google.com/search/docs/. Accessed 10 May 2024.
Jagarlamudi, J., & Kumaran, A. (2008). Cross-lingual information retrieval system for Indian languages. In CLEF 2007 Working Notes. CEUR Workshop Proceedings.
Leveling, J., & Jones, G. J. F. (2010). Sub-word indexing and blind relevance feedback for English, Bengali, Hindi, and Marathi IR. ACM Transactions on Asian Language Information Processing, 9(3). https://doi.org/10.1145/1838745.1838749
Marreddy, M., Oota, S. R., Vakada, L. S., Chinni, V. C., & Mamidi, R. (2022). Am I a resource-poor language? Data sets, embeddings, models and analysis for four different NLP tasks in Telugu language. In WWW '22 Companion (pp. 770-779). ACM. https://doi.org/10.1145/3531535
Narla, S., Koppula, V. K., & Suryanarayana, G. (2021). Information retrieval based on Telugu cross-language transliteration. In ICMLIP 2020 (pp. 343-350). Springer. https://doi.org/10.1007/978-981-33-4859-2_34
Pavan, K., Tandon, N., & Varma, V. (2010). Addressing challenges in automatic language identification of romanized text. arXiv preprint (workshop paper).
Raj, A. A., & Maganti, H. (2009). Transliteration based search engine for multilingual information access. In Proceedings of the 2009 Named Entities Workshop (pp. 15-19). ACL. https://doi.org/10.3115/1572433.1572436
Raju, N. V. G., Bhavya, S., Sai, R. K. C., & Vidya, R. V. (2011). An application of statistical indexing for searching and ranking of documents – A case study on Telugu script. International Journal of Computer Applications, 28(3), 22-27. https://doi.org/10.5120/3368-4651
Sankar, K. P., & Jawahar, C. V. (2006). Enabling search over large collections of Telugu document images – An automatic annotation based approach. In ICVGIP 2006 (pp. 837-848). Springer. https://doi.org/10.1007/11949619_75
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

