headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. ‘నేను నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్నాను’ దీర్ఘ కవిత: చారిత్రక, సామాజిక అనుశీలన

డా. తాడూరి రవీందర్

ప్రిన్సిపాల్,
ప్రభుత్వ బి.సి.గురుకుల కళాశాల,
సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9949946607, Email: ravinder.thaduri@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ కథా రచయిత అయిన కె.వి.నరేందర్ గారు రాసిన "నేను నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్నాను " అనే దీర్ఘ కవిత లో మనందరికీ తెలిసిన నాగమ్మను గురించి మనకు తెలియని చారిత్రక వాస్తవాలు ఆత్మకథాత్మకత తో రీతిలో ఆవిష్కరించబడ్డాయి. ఈ దీర్ఘ కవిత ఆధారంగా భారతదేశపు తొలి మహిళా మంత్రిణి అయిన నాగమ్మ జీవితంలోని అసలు కోణాలు, ఆమెపై జరిగిన చారిత్రక కుట్రలు, పలనాటి యుద్ధం ను, ఆనాటి పరిస్థతులలో స్త్రీజాతి మనుగడను పరిశీలించడం, నాగమ్మ చివరి దశలో ఏమైపోయింది? ఎక్కడ మరణించింది? అనే విషయాలను తెలియ జేయడం ఈ వ్యాస ప్రధానోద్దేశం. నాయకురాలు నాగమ్మ జీవితంలోని వాస్తవ సంఘటనలు అని కవి ఉటంకిస్తూ సృజించిన కవిత్వంకు ప్రామాణిక ఆధారాలు, చరిత్ర గ్రంథాల లోని నిరూపణలు ఎలా బలాన్ని చేకూరుస్తున్నాయో తెలియచెయ్యడం, ప్రస్తుత తెలంగాణ లోని జగిత్యాలకు, పల్నాటి యుద్ధం ద్వారా ప్రపంచానికే పరిచయమైన నాగమ్మకు గల సంబంధం గురించి కవి తన కవితల్లో ఆక్షరీకరించిన విధానాన్ని చారిత్రక విశ్లేషణ పద్దతిలో పరిశీలించి, నాగమ్మ జీవితం వెనుక గల దాగిన సత్యాలను నేటి తరాలకు తెలియచెయ్యడం నా పరిశోధన ప్రధాన ఉద్దేశం.

Keywords: నాయకురాలు నాగమ్మ, పల్నాటి యుద్ధం, నాగమ్మ మరణం, చారిత్రక కుట్రలు, దీర్ఘ కవిత, నలగామ రాజు, బ్రహ్మ నాయుడు, ఆరవెల్లి, అనుగు రాజు, కొండలరాయుడు.

1. ఉపోద్ఘాతం:

కె.వి.నరేందర్ పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా, గొల్లపెల్లి మండలం, చిల్వాకోడూరు గ్రామంలో జన్మించారు. ఈయన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. వీరికి 2016 లో ప్రాణాంతకమైన పార్కిన్సన్ వ్యాధి సోకడం, దాని వలన మరణం అంచుల దాకా వెళ్ళడం, శస్త్రచికిత్స అనంతరం శరీరాన్ని కదిలించలేని స్థితిలో జీవనం కొనసాగించడం  విచారకరం. అయినప్పటికీ వారు ఇప్పటికీ కథలు రాస్తూ ఉండడం, కవిత్వ సృజన గావిస్తూ ఉండడం అనేది సాహిత్య సృజన పట్ల వారికి గల గాఢమైన ప్రేమను, అభిలాషను చాటుతుంది.. నరేందర్ గారు ఇప్పటి వరకు 150 పైగా కథలతో, 13 కథా సంపుటాల ను, నాలుగు నవలలను, రెండు దీర్ఘ కవితా సంపుటాలను, ఒక చారిత్రక పరిశోధన గ్రంథను  వెలువరించారు. వారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ కథా రచయిత పురస్కారం, నాటక రచనలో 'నంది' అవార్డు, ‘శిథిల స్వర్గం' నవలకు గాను ఉత్తమ నవలా రచయిత పురస్కారం  వరించాయి.

2. కె.వి. నరేందర్ - కవిత్వం :

ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ ప్రభావంతో రచనా వ్యాసంగం వైపు తన దృష్టిని మరల్చిన నరేందర్ మొదట కవిత్వమే రాశాడు. కథకుడిగా, నవలా రచయిగా ఎంతో ప్రసిద్ధి పొందినప్పటికీ కవిత్వం పై మక్కువతో "నేను రుద్రవీణను….. జగిత్యాలని", "నేను నాయకురాలు నాగమ్మను మాట్టాడుతున్నాను" అనే రెండు గొప్ప దీర్ఘకవితలను అందించారు. వీరి కవితలన్నీ ఎంతో భావయుక్తంగా, ఉద్వేగ పూరితంగా, తట్టి లేపే విధంగా ఉంటాయి.

మనం రోజు చూస్తున్న సమాజం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. నిశ్చలమైన కొలనులోకి రాయి విసిరితే, నిర్విరామంగా అలలు పుడుతూ ఒడ్డుకు విస్తరించినట్టు, ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమాజం గూర్చి నిశిత పరిశీలకులు తమ కోణం నుండి వ్యాఖ్యానించినపుడు మనలోను సంక్షోభ తరంగాలు పుడుతాయి. ముఖ్యంగా సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కవిత్వం రాసే కవి భావాలు చూసినప్పుడు మనల్నొక అశాంతి వెంటాడుతుంది"1 అంటారు ఆచార్య బన్న అయిలయ్య.

ఒక కవి మనందరం చూసే దానికంటే భిన్నమైన కోణంలో సమాజాన్ని దర్శించి, దాని పట్ల మన యొక్క బాధ్యతను, జాగరూకతను తన కలం ద్వారా గుర్తు చేస్తాడు. కాబట్టి ఆధునిక సాహిత్యంలో వచన కవిత్వం అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. సమాజాన్ని చైతన్యవంతం చేసింది. ఆ విధంగా తన చేత్తో ఉన్న సమాజాన్ని తట్టి లేపుతూ,జాగరూకత కలిగిస్తూ నరేందర్ గారు ఈ దీర్ఘ కవితను రాశారు. తన పురిటి గడ్డ జగిత్యాలను, అక్కడి ఆడబిడ్డ నాగమ్మను, ఆమె త్యాగాన్ని, గొప్ప తనాన్ని ప్రపంచానికి తెలియచెయ్యాలి అనే గొప్ప సంకల్పం తో ఈ రచనకు పూనుకున్నారు.

3.  నాయకురాలు నాగమ్మ జీవితచరిత్ర - వాస్తవాలు:

మనందరికీ నాయకురాలు నాగమ్మ తెలుసు. మధ్యయుగాల చరిత్ర తొలినాళ్ళలో ఆంధ్ర దేశంలో జరిగిన పల్నాటి యుద్ధం గురించి కథలు, జానపద కళారీతులు, భిక్షుక గాయకుల పాటలు, శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర, అదే విధంగా తెలుగు పాత చలనచిత్రాలు వంటి వనరుల ద్వారా మనము నాగమ్మ గురించి తెలుసుకున్నాము. అయితే వీటన్నింటిలోను నాగమ్మ ప్రతినాయకురాలే. కుట్రలు, కుతంత్రాలు, మంత్ర తంత్రాల ద్వారా యుద్ధంలో గెలిచిన స్త్రీ లాగానే మనకు పరిచయం. కానీ నిజమైన చారిత్రక పరిశీలన, పరిశోధనలు ఆమెను ఈ దేశపు తొలి మహిళా మంత్రిగా పరిగణిస్తున్నాయి. అద్భుతమైన పాలనా పటిమ గల వ్యూహ కర్తగా యుద్ధ విద్యల్లో ఆరితేరి, న్యాయం కోసం పోరాడే క్రమంలో తీవ్రమైన అపనిందలకు, చారిత్రక వక్రీకరణలకు గురైందని చరిత్ర తెలుపుతున్నది.

నాగమ్మ గురించి చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పినప్పటికీ జన బాహుళ్యంలో ఆమెను ప్రతినాయకురాలిగా ప్రచారం చేయడం శోచనీయం. "వెలనాటి ప్రభుత్వ ప్రతినిధులుగా గురజాల వెళ్ళిన దొడ్డనాయుడు, అతని కొడుకు బ్రహ్మనాయుడు స్థానిక ప్రజలపై అత్యాచారాలు జరపడమేగాక అనుగు రాజు పట్ల సైతం అవిధేయులయినారు. వారిని ప్రతిఘటించడానికి రెడ్డి నాగమ్మ స్థానిక ప్రజల నాయకురాలై, అనుగురాజుకు అనంతరం రాజైన నలగామ రాజుకు మంత్రిణి అయింది. ఇది సహింపని బ్రహ్మనాయుడు మలిదేవాదులను రెచ్చగొట్టి పలనాటి రాజ్య విభజనకు కారకుడయినాడు".2 అని డాక్టర్ బి.యస్.యల్. హనుమంతురావు గారి మాటలు నాగమ్మ గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి.

నాగమ్మ జన్మస్థలం జగిత్యాల పక్కన అరవెల్లి గ్రామం. ఇది పెగడపల్లి మండలంలో ఉంది. నాగమ్మ ఏడేండ్ల వయసులోనే తన కుటుంబంతో పాటు తన మేనమాను ఊరికి వలస వెళ్ళింది. అలా ఆరవెల్లి ఆడబిడ్డ అయిన ఆమె కరువు నేపథ్యంలో పల్నాడులోని జిట్టమాగాలపాడుకు వెళ్ళి స్థిరపడింది. తాను చిన్నప్పటి నుండే అన్ని రకాల విద్యలు, యుద్ధ కళల్లో ఆరితేరింది. నలగామ రాజుకు మంత్రిగా ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రి అయింది. ఎంతో నేర్పుతో, పాలనా పటిమతో ప్రజల గొంతుకయ్యింది. కాకతీయులు, హాయసాలులు, కోటరాజుల మద్దతు కూడగట్టింది. ఆంధ్ర భారతంగా కీర్తికెక్కన పల్నాటియుద్ధంలో నలగామ రాజుకు విజయాన్నందించింది. కాని ఆ యుద్ధానంతరం ఆమెను ఒక కుట్రదారుగా, విషపు మహిళగా అపనిందల పాల్టేస్తే, వివక్షకు గురిచేస్తే అది భరించలేక, బరువెక్కిన హృదయంతో తన పుట్టిన గడ్డ అయిన జగిత్యాల జిల్లా ఆరవెల్లికి వస్తుంది. ఇక్కడ కూడా కొండల్రాయుడు అతని ముఠా తన గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారి పక్షాన పోరాడింది. వారిలో చైతన్యాన్ని నింపింది. వారి కష్టాలను దూరం చేసింది. ఇక్కడే కన్నుమూసింది. ప్రజల గుండెల్లో దేవతయ్యింది. తన ఊరిలోని ప్రజలు ఆమెకు గుడికట్ట దేవతగా పూజిస్తున్నారు.

అయితే తెలంగాణలో మాత్రం తమ బిడ్డ అయిన నాగమ్మ గురించి పరిశోధన గాని, చరిత్ర గాని, కావ్యం గాని రాయబడలేదు. ఇక్కడ నాగమ్మ చరిత్ర పూర్తిగా విస్మరించబడింది. వెలను కులస్థుడైన కొండల్రాయుడిని గొప్ప వాడిగా చిత్రించడానికి, ఇక్కడ కూడా నాగమ్మను కొండల్రాయుడు పాతాళంలోకి తొక్కేసినట్లు, ఆమెను ఒక కుట్రదారుగానే ఇక్కడి బుడగ జంగాల పాటల్లో కొండల్రాయుడిని కీర్తించటం ఒక వివక్ష, కుట్రగా భావించవచ్చు.

తన మిత్రుడైన సంగవేని రవీంద్ర, నరేందర్ ”తెలంగాణ గడీలు” చారిత్రక పరిశోధనలో భాగంగా కొడిమ్యాల గడీకి వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు సరేందర్ సూచన మేరకు ఆరవెల్లికి వెళతారు. ”దాదాపు ఊరవతల వుంది నాయకురాలు నాగమ్మ గుడి. పైకి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇల్లులాగే ఉంది. గుడి గోడలపై ఉన్న బొమ్మలు చూపుల్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఏ దేవుడి గర్భగుడిలోనైనా విగ్రహం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. కానీ ఈ నాగమ్మ గర్భగుడి మాత్రం దాదాపు మూడు గజాల లోతులో ఉంది అన్నారు" సంగెవేని రవీంద్ర. ఆ గ్రామంలో తిరిగి వివరాలు తెలుసుకొని, ఆమె చరిత్రపై వచ్చిన పుస్తకాలను సమీక్షించి, పల్నాదుకు వెళ్ళి ఆమె గురించిన అనేక వాస్తవాలు తెలుసుకున్నారు.

"అప్పుడు నరేందర్ నిర్ణయించాడు. దీన్ని నాగమ్మ చెప్పుకున్నట్టుగా ఆత్మాశ్రిత స్వగతంగా, కవితాత్మకంగా చెబుదామని ... దీర్ఘకవిత అని కాకుండా ఆత్మ కవిత అనీ ట్యాగ్ పెడదామన్నాడు. నరేందర్ ఒక నిర్ణయం తీసుకున్నాక అమలు పరచడమే తరువాయి. రెండు మూడు రోజుల్లోనే ఇదిగో మీ చేతులో ఉన్న ఈ దీర్ఘకవిత పురుడు పోసుకుంది3 అంటారు రవీంద్ర ముందుమాటలో.

అంటే తెలంగాణ ఆడబిడ్డ అయిన నాగమ్మ చరిత్రను ఇక్కడి ప్రజల ముందుంచాలని, ఆమెకు జరిగిన అన్యాయాన్ని, వివక్షను ఆమె మాట్లాడినట్లే చెప్పించాలని ఈ ప్రయత్నం చేశారు. ఆత్మకవితగా మన ముందుంచారు. ఇప్పుడు ఈ దీర్ఘకవితను గురించి విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాను.

4. దీర్ఘ కవిత -చారిత్రక, సామాజిక విశ్లేషణ :

"రక్త కాసారం లోంచి
అగ్ని కమలంగా వచ్చిన
తెలంగాణ బిడ్డని
చీకట్లు చీల్చాల్చిన కొక్కొరొకో
కత్తుల్లోంచి రాలిపడ్డ
నెత్తుటి చుక్కని
నాదిప్పుడు అరణ్యగర్జన నన్ను మాట్లాడనీయండి
తలుపు చాటు ఇల్లాల్ని
కావాల్సిందాన్ని.....
రోకలి బండను బగ్గును చేసే
రోహిణీ కార్తెనెందుకయ్యాను...?
చరిత్ర పుటల్లో
ప్రతినాయకురాలిగా
రణభూమి నెత్తుటి వాసన
గుండె పగిలిన కన్నీటి వాసన
కలిస్తే నా జీవితముయింది
నా అస్తిత్వం కోసం
మనసు పెనుగులాడుతున్న
యుద్ధ స్పృహ ... లోనే ఉన్నాను"

బ్రహ్మనాయుడిని, కొండల్రాయుడిని గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించే సమయంలో తనను అపనిందల పాట్టేసిన పాత చరిత్రను తుడిపేసి, తనదైన నిజమైన చరిత్రను బయటకి తీయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. యుద్ధానికి కన్నీటి జీవితానికి అంకితమై పోయిన తన జీవితాన్ని నేటి మహిళలకు ఆయుధంగా అందించాల్సిన అనివార్యతను తెలుపుతుంది.

ఇలా మొదటి వాక్యాలే నాగమ్మ ఆత్మగౌరవ ప్రకటనని చూపిస్తున్నాయి. ఆమెకు ఎంతో అన్యాయం జరిగిందనీ, తన గురించి తన వారికి తెలియాలనే తపనతో మాట్లాడినట్లు ఉన్నాయీపంక్తులు.

"ఊరు విడిచిన గుండె
భళ్ళున పగిలిన కూరాడు కుండ
ఒక్కటే.
వలసతో కన్నీటి విలువ తెలిసిందాన్ని
యుద్ధంలో 'కత్తి విలువ
తెలిసిందాన్ని"

నాగమ్మ తన ఊరు ఆరవెల్లిని వదిలి జిట్టమాంగాలపాడుకు తండ్రితో పాటు వలస వెళుతుంది. అలా వలస వెళ్ళటంలోని బాధను అనుభవించింది. యుద్ధంలో అరితేరింది. అయినా ఊరు వదిలిపోవటం ఎంతో బాధను మిగులుస్తుంది అని ఇక్కడ రాయడం సంగేవేని రవీంద్ర గారి జీవితంను ప్రతిబింబిస్తుంది. ఆయన కూడా జగత్యాలనొదిలి, ఉపాధి కోసం వలసవెళ్ళి ముంబయిలో స్థిరపడినవాడే.

"చివరికి యుద్ధంలో పరాజితనన్నారు.
జీవితాన్ని గెలిచిందాన్ని
యుద్ధ మెంత?"
"ఎన్నెన్ని రక్తపు వెన్నెలని చూశాను
ఎన్నెన్ని వెన్నెల్లో రక్తాన్ని చూశాను"

పై పంక్తులు నాగమ్మకు ఆపాదించిన రక్త పిపాసితను, రాజ్యకాంక్షను తెలియజేస్తున్నాయి. బ్రహ్మనాయుడికి ఉదాత్త చరిత్రను సృష్టించడానికి నాగమ్మను అసత్య ప్రచారాలకు బలిజేశారు. పల్నాడు విభజనకు నాగమ్మే కారణమని అపఖ్యాతి కట్టబెట్టారు. కోడి పందాల్లో గెలిస్తే ఆమెను మంత్రగత్తె అని దుష్ప్రచారం చేశారు. మాచర్ల రాజ్యాన్ని గెలిస్తే కుతంత్రంతో గెలిచినదని ఆ విజయాన్ని కూడా మసకబార్చారు. రాయబారిగా వచ్చిన అలరాజును హత్య చేసిందని హత్యానేరం మోపారు. అందుకే-

"మాచర్ల రాజ్యాన్ని గెలిచినప్పుడు
పెదాల మీద దరహాసమే తప్ప
గుండె లోతుల్లో ఏదో అసంతృప్తి
చరిత్రలో నా పాదముద్రల్ని
రక్తసిక్తం చేశారు.
పాదాలకి పూసుకున్న
గోరింటాకుని కూడా
అదిగదిగో పులి చంపిన లేడి
నెత్తురని ప్రచారం చేశారు
అనుక్షణం అలలు దండెత్తినట్టు నాకు
రాజ్యకాంక్షని ఆపాదించారు."

నాగమ్మను అణువణువునా అపనిందల పాల్చేసిన బ్రహ్మనాయుడి వర్గం అసలు వాస్తవాలను ప్రపంచం ముందుకు రాకుండా జాగ్రత్త పడింది. కానీ చరిత్ర దాచేస్తే దాగని సత్యం. "వెయ్యేళ్ళ కిందట ఒక స్త్రీ మంత్రి ఎలా అయ్యింది? ఎందుకయ్యింది? నిలదొక్కుకుని తనని తాను ఎలా నిరూపించుకుంది? ఏమేమి ఎదుర్కోంది? ఒక అద్భుతం... రుద్రమదేవి మహారాజు కూతురు. రాజ్యం వారసత్వం, పాలనా సామర్థ్యం తండ్రి శిక్షణలో లభించింది. కాని వ్యవసాయ కుటుంబంలో పుట్టి వైధవ్యంలో ఉండి మంత్రి కావటం, వ్యూహాలు, సమర్థ పాలన యుద్ధ నైపుణ్యం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం, ఆలోచిస్తే ఎంత గొప్ప మనిషి ఉండాలి నాగమ్మ? ఎంత సామర్థ్యం, తెలివి ఉండాలి? ఎంత శ్రమ చేసి ఉండాలి? ఆంక్షల్ని, అధిపత్యాల్ని ధిక్కరించినందుకు ఆమెను నాయకురాలి పాత్ర నుండి లాగి పారేసి ప్రతినాయకునిగా ముద్ర వేసి కసి తీర్చుకుండా మన సమాజం? ఒక స్త్రీ సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఏర్పడితే దానికి దుష్టత్వాన్ని ప్రసాదించి సంతృప్తి చెందిందా  మనువు భావాల్ని పుణికి పుచ్చుకున్న పెత్తనం?" వలస వివక్షకు గురైన నాగమ్మ ఆవేదనను ఆర్థంగా, హృదయాలు బరువెక్కే విధంగా పై పంక్తుల్లో పలికించారు కవి.

"900 ఏళ్ళ నుంచి
దేహమంతా
పచ్చి మట్టికుండలానే వుంది.
యుద్ధం ఒక వ్యసనంగా మారితే
వెలుగు అతిథిలా మారి
చీకటి శాశ్వతంగా ఆక్రమించినట్టు"

దాదాపు తొమ్మిది శతాబ్దాలుగా చీకటిలోకి నెట్టబడిన నాయకురాలు చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని కవి ఉద్దేశం.

రాజు సంపదను తన బంధువుల దగ్గర దాచిపెట్టిన బ్రహ్మనాయుడి కుతంత్రాలను బయటపెట్టి ఆ ధనాన్ని రాజప్రాసాదానికి తెప్పిస్తుంది నాగమ్మ.బ్రహ్మనాయుడు తన కులం బాగుండాలని,మిగతా వారిని అందుకు పావులుగా వాడు కుంటాడు. కాని బ్రహ్మనాయుడే కుల వివక్షను రూపుమాపడానికి కృషి చేశాడనీ, నాయకురాలు నాగమ్మే కుతంత్రాలు చేసిందని ప్రచారం జరిగింది. "చాపకూటి సిద్ధాంత కర్తగా బ్రహ్మనాయునికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభించాయి. చాపకూటితో సమతావాదిగా పేరు పొందాడు. గొప్ప సంస్కరణ వాదిగా ప్రచారం జరిగింది. అయితే పల్నాటి చరిత్ర పై వచ్చిన పూర్వ ప్రామాణిక గ్రంథాలలో వాటి రచయితలు, కవులు ఎక్కడా చాపకూటి ప్రస్తావన చేసిన దాఖలాలు లేవు. జానపదుల కథనాల్లో కూడా చోటు లభించలేదు. తొలి రచన అయిన శ్రీనాథుని పలనాటి వీర చరిత్రలోనూ, తదనంతర కొండయ్య ద్విపద కావ్యంలోనూ వెల్లడి చేయలేదు. బ్రహ్మనాయుడిపై అభిమానంతో రచనలు సాగించిన తొలితరం కవులు, రచయితలు ఆయన శ్రీ మహావిష్ణువు, శ్రీ కృష్ణుని అవతారమని దివ్యత్వాన్ని, మహిమలను అంటగట్టి చెప్పుకొచ్చారు"  తప్ప బ్రహ్మనాయుడు, బాలచంద్రుడే పల్నాటి సామ్రాజ్యంలో విబేధాలు, వైషమ్యాలు సృష్టించి విభజనకు కారణమయ్యారనేది చారిత్రక సత్యం.

నాగులేరు పొడువునా ఆరువేల అశ్వదళాల్ని, మూడువేల కాల్బలాన్ని వుంచుతుంది నాగమ్మ. కానీ ఎలాగైనా నాగమ్మ చేతిలో ఓడిపోతానని కుయుక్తితో నాయుడు ఆడదానితో యుద్ధం చేయనని, అందుకే నాగమ్మను క్షమించి వదిలేసి, ప్రాణభిక్ష పెట్టాడని దుష్ప్రచారం చేశారు. భీకరంగా జరిగిన ఆ పోరులో నాగమ్మ గెలిచినా, అది బ్రహ్మనాయుడు ప్రాణభిక్ష పెట్టడం వలననే జరిగిందని ఆమె గెలుపును కూడా పురుషాషకారంతో అప్రతిష్ఠ పాలుజేశారు.

"ఈ వేయి మరణాల
కాటు వాసన నుంచి...
దూరంగా... దూరాతి దూరంగా
నేను పుట్టిన గడ్డ మీదికి
పురుడు పోసుకున్న ఆరవెల్లికి
నా మట్టి మీద
నా మరణం సుమధుర
జ్ఞాపకం కావాలని వచ్చాను."

యుద్ధంలో ఓడిపోతానని తెలిసిన నాయుడు, ఆడదానితో యుద్ధం చేయనని వెనుదిరిగిపోతుంటే, పుట్టపై నిలబడి ఓటమిని ఒప్పుకొమ్మని అంటుంది నాగమ్మ. అలా యుద్ధంలో గెలిచిన నాగమ్మను హంతకురాలిగా, యుద్ధ పిపాసిగా, పల్నాడు విభజనకు సూత్రధారిగా, ఎందరో యుద్ధంలో చనిపోవడానికి కారణమైన వ్యక్తిగా అపనిందల పాలుజేస్తే ఆ వివక్షను, ప్రచారాన్ని తట్టుకొలేని నాగమ్మ, పల్నాడు ప్రాంతాన్ని వదిలేసి తన పుట్టినగడ్డ అయిన ఆరవెల్లికి వస్తుంది. చివరి రోజులు తన ఊరిలో, తన గ్రామస్థుల మధ్య గడిపి, ఆ మట్టి ఒడిలోనే కన్నుమూయాలనే ఆశతో ఆరవెల్లికి చేరుకుంటుంది.

కానీ ఆరవెల్లికి చేరుకోగానే ఆక్కడి ప్రజల కష్టాలను విని ఆమె మనసు తల్లడిల్లుతుంది. కొండల్రాయుడు, అతని అనుచరులైన బందిపోటు దొంగల అకృత్యాలతో అరవెల్లి గ్రామం బిక్కుబిక్కు మంటూ బతుకుతున్న రోజులవి. బందిపోటుల నుండి తమను, తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం గ్రామస్థులందరిని చైతన్యవంతుల్ని చేస్తుంది నాగమ్మ. గ్రామస్థులకు, యువకులకు కత్తియుద్ధాలు, కర్రసాములు నేర్పుతుంది. ఆరవెల్లి రక్షకురాలయ్యింది. తన తండ్రిని చంపిన కటారి జింకన్ని చంపడానికి, కొండల్రాయుడు సైన్యంతో వస్తే. అతడిని ఎదుర్కొని, జింకన్ని, ఊరిని రక్షిస్తుంది.

"వయసుడిగి పోతున్న దశలో
ఇరవైయ్యేడేళ్ళు దుడుకు రక్తపు
కొండల్రాయున్ని ఎదిరించాను
ఓడి గెలిచానో.... గెలిచి ఓడానో
గ్రామస్థుల గుండెల్లో దేవతయ్యాను
కానీ ఇక్కడా ఏదో కుట్ర"

వృధ్ధాప్యంలో కూడా కొండల్రాయుడిని ఎదిరించి ఊరిని కాపాడుకుంటుంది నాగమ్మ. కాని ఇక్కడ కూడా పురుషాధిక్యమే గెలిచింది. కొండల్రాయుడు తొక్కితే నాగమ్మ పాతాళ లోకం పోయిందని తొమ్మిది వందల ఏళ్ళుగా దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. వాస్తవానికి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం, ఊరిని రక్షించిన అనంతరం, నాగమ్మ సజీవ సమాధి అయింది. అదే ప్రదేశంలో అందుకు గుర్తుగా మూడు గజాల లోతులో ఆమె విగ్రహం ప్రతిష్టించారు. కాని కొండల్రాయుడు పాతాళానికి తొక్కడం వల్లే, ఆ విగ్రహలను అలా లోతులో నెలకొల్పారు అని కొన్ని కథలు పుట్టుకొచ్చాయి. ఇలాశతాబ్దాలుగా స్త్రీని, పురుషాధిక్యత ఎలా అణచివేస్తున్నదో అని. ఇకనైనా కళ్ళు తెరవాలని ఆకాంక్షిస్తుంది నాగమ్మ.

"బిడ్డలారా ! యుద్ధమంటే
మృత్యువుకి ప్రేమలేఖ
రాయటం కానే కాదు
కాకూడదు కూడా
ఇది నాకు పల్నాడు నేర్పిన పాఠం
స్వేచ్ఛ వ్యాపించాలి
ఎరుపు కాదు
పచ్చదనం పరిమళించాలి"

అని ఆకాంక్షను నాగమ్మ వెలిబుచ్చినట్లు  ఇక్కడ పంక్తుల్లో కవిత్వీకరించారు. పల్నాడు యుద్ధంలో రక్తపాతం, కుట్రలు, కుతంత్రాలను చూసిన నాగమ్మకు యుద్ధమంటే విరక్తి కలిగింది. చివరి దశలో తన జన్మభూమికి వెళ్ళి శాంతిని, పచ్చదనాన్ని, పచ్చని బతుకును పరివ్యాపింపజేయాలి అని అనుకుంటుంది. ఇక్కడా అదే పరిస్థితి ఉండటంతో గ్రామస్థుల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. రక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్పుతుంది. యుద్ధం కాకుండా, తిరుగుబాటు నింపుతుంది. దేవతగా అందరి గుండెల్లో నిలిచిపోతుంది.

5.మహిళాసాధికారతకు తల్లివేరు నాగమ్మ:

నరేందర్ గారి ఈ దీర్ఘ కవితను పరిశీలిస్తే నేటి ఆధునిక మహిళ పరిపాలన రంగం వైపు,రాజ్యాధికారంవైపు అడుగులు ధైర్యంగా వేయడానికి కావలసిన చారిత్రక ఆలంబన నాగమ్మ జీవితం నుండి లభిస్తుంది అని చెప్పవచ్చు.మహిళా రాజకీయాలకు నాగమ్మ ఆద్యురాలు. మహిళా రాజకీయాల మూలాలు వెతుక్కుంటూ చరిత్రలోకి వెళితే ఆమెవద్దే లభిస్తాయి. తొలి మహా మంత్రిణి. మధ్యయుగాల మహిళాధిక్కార స్వరం. ఆమెకు పూర్వం గానీ, ఆమె సమకాలంలో గానీ, ఆమె అనంతరం నేటి వరకు నాయకురాలు అనే గౌరవం మరో మహిళామూర్తికి లభించకపోవడం ఆమెకున్న విశేష ప్రతిభ. అన్నింటికీ మించి శాంతిదూత. ఒక వ్యవసాయిక రైతుకుటుంబం నుండి వచ్చి అసాధారణ స్థానాన్ని పొందిన ఆమె చెరిగిపోని చారిత్రక చిహ్నం.

800 సంవత్సరాలక్రితమే 12వ శతాబ్దిలో ఎటువంటి రాచరిక, రాజకీయ నేపథ్యాలు, పారంపర్యాలు లేకుండా స్వయం కృషితో, మొక్కవోని ధైర్యంతో, అచంచల విశ్వాసంతో, అద్భుతమైన మేధస్సుతో, స్వాభిమానంతో మహా మంత్రిణిగా ఎదిగిన వైనం మనల్ని అబ్బురపరుస్తుంది. ప్రత్యర్ధుల కుట్రలను ఛేదించుకుంటూ రాజ్యాన్ని, రాజుని బలోపేతం చేసింది. పల్నాడు ప్రజల సౌభాగ్యం కోసం కడదాకా కృషి చేసింది. తండ్రి హత్యకుగురై, మామ యుద్ధంలో మరణించి, భర్త అకాల మృత్యువాత పడి ఒంటరి అయినా దేశ రక్షణకు, సమాజ సంక్షేమానికి ఎనలేని విధంగా కృషిచేసింది విద్రోహ శక్తుల ఆటలు కట్టించి పల్నాడును సమైక్యంగా ఉంచేందుకు పాటుపడింది. విశేషమైన వ్యక్తిత్వం కలిగిన ఆమెపై కొన్ని శతాబ్దాలుగా దుష్ప్రచారం కమ్ముకుంటూనే వుంది. అనన్య సామాన్యమైన సుగుణాలు, ధర్మనిరతి కలిగిన నాయకురాలు నాగమ్మను ప్రణాళికాబద్దంగా చీకటి తెరల వెనుకకు నెట్టారు. ఇతిహాసపు చీకటి కోణాల అట్టడుగుకు చేర్చారు. కుట్రదారుగా, వంచకిగా, దోషిగా, నేరస్థురాలిగా, హంతకురాలిగా చిత్రీకరించారు. లేనిపోని అపవాదుల నెన్నింటినో అంటగట్టారు. ప్రత్యర్థులు, శత్రువులు తాము వొడిగట్టిన దారుణాలు కూడా నాయకురాలిపైకి మళ్ళించారు. ఎలాంటి విచారణలు, రుజువులు, సాక్ష్యాలు లేకుండానే ఆమెను దోషిగా, నేరస్థురాలిగా ముద్రవేశారు, తీర్పులిచ్చారు. అయినా నాగమ్మ ఎక్కడా వెనుకడుగు వేయలేదు.

పల్నాటిచరిత్రలో సంఘటనలను ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ వెళితే నాయకురాలిలో గొప్పమహిళా ప్రభావశీలిని దర్శిస్తాము. అనంతమైన వెలుతురు కనిపిస్తుంది. గొప్పరాజకీయ వేత్తను, పరిపాలనాదక్షతను కనుగొంటాము. ఆమెలో మూర్తీభవించిన అమ్మతనం సాటి మనుషులపట్ల విలువలు, యుద్ధవ్యతిరేకత గోచరిస్తాయి. చిన్నతనంలోనే ఖడ్గ విద్యలో నేర్పరియైనా ఎప్పుడూకూడా దానికి పనికల్పించని శాంతి దూత. ఐదు భాషలలో ప్రవేశం, సంగీతంలో ప్రావీణ్యం సాధించిన కార్యదీక్షా పరాయణి. మహా మంత్రిణిగా పదవిలోకి రాకమునుపే ఆమె మంచితీర్పరి, పెద్దమనిషి అని పల్నాడు కితాబిచ్చింది. నూరు మంది మేధావుల మేధస్సు, నూరు మంది యోధుల ధైర్యసాహసం, నూరు మంది శూరుల ప్రతాపం కలిసి నాయకురాలిగా రూపం తీసుకున్నాయి.

6. నాయకురాలు చరిత్రపై కుట్రలు:

సాధారణంగా యుద్ధంలో గెలుపొందిన వారి చరిత్ర వెలుగులు సంతరించుకుంటుంది. వారే గొప్పగా ప్రచారం చేసుకుంటారు. కవులు, రచయితలతో వ్రాయించుకోవడానికి విజయం పొందిన వారికే అవకాశం మెండు. పల్నాటి చరిత్ర అందుకు భిన్నంగా ప్రజలలోకి వెళ్ళడం విడ్డూరంగా తోస్తుంది. యుద్ధానంతరం మళ్ళీ సింహాసనం చేపట్టిన నలగామ రాజు, విరాగియై తన అపార ఆస్థిపాస్తులను సైతం వదలి తిరిగి జన్మస్థలికి వెళ్ళిన నాయకురాలు చరిత్ర గతులలో అపఖ్యాతి పొందడం విచిత్రం అనిపిస్తుంది. ఒక పధకం ప్రకారం చారిత్రక గాథను వ్రాసిన అనేక మంది రచయితలు, కవులు ముఖ్యంగా నాయకురాలిపై అకారణ ద్వేషాన్ని వెళ్ళగక్కారు.

ఎంత మంది, ఎన్ని రకాలుగా నాయకురాలిని ప్రతినాయకురాలిగా స్థిరపరచడానికి ప్రయత్నించినా సత్యశోధన ముందు తల వంచక తప్పలేదు. డా.బి.యస్.ఎల్ హనుమంతరావు పరిశోధన ప్రకారం పల్నాటి ప్రజల సౌభాగ్యాన్ని ఛిద్రం చేస్తున్న తండ్రీ కొడుకుల ఆగడాలను నిలువరించడానికే ఆమె మంత్రి పదవిని స్వీకరించింది అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కానీ తన పగ తీర్చుకోవడం కోసం కపట పన్నాగం తో మంత్రి పదవి చేజిక్కించుకుంది అని విషపు ప్రచారాలు రాజ్యమేలాయి. చెన్నకేశవస్వామి స్వప్నదర్శన ఆజ్ఞానుసారం పలనాటి వీరచరిత్ర రచన చేపట్టిన శ్రీనాథమహాకవి కావ్యం పూర్తయిన పిదప ఆయనేశపించాడట. అదో విడ్డూరం. కావ్యం నిమ్న జాతుల పాలవునుగాక అంటూ విసిరి కొట్టాడట. ఇదో కట్టుకథ. కల్లుపోరు, బాలచంద్రయుద్ధం ఘట్టాలు లభించాకనే బ్రహ్మనాయుడు, బాలచంద్రుల అనేక దురాగతాలు వెలుగు చూశాయి. నాయకురాలి ద్విగుణీకృత సుగుణాలు వెల్లడయ్యాయి. మొత్తం కావ్యం లభిస్తే నాయకురాలు మరింత పునీతగా లోకంముందు సాక్షాత్కరించేది. ఆ భయంతోనే నాయకురాలి వ్యతిరేకులు శ్రీనాథుని కావ్యాన్ని నాశనం చేసివుంటారని ధృఢంగా నమ్మవచ్చు.

7. నాగమ్మమరణం-వక్రీకరించబడిన త్యాగం:

నాయకురాలు పల్నాటి యుద్ధానంతరం విరాగియై ఆస్తిపాస్తులను, సంపదలను, పదవీ వ్యామోహాన్ని వీడి తను జన్మించిన జగిత్యాల జిల్లా పెగడపల్లిమండలంలోని ఆరవెల్లి కి చేరింది. అక్కడి గ్రామస్తులందరికి తన గురించి పరిచయం చేసుకుని వారి ఆదరణ పొంది కాలం గడుపుతుంది. ఆ గ్రామంపై తరచూ దాడులు చేస్తూ దోపిడీలు చేసే బందిపోటు ముఠాని, ప్రజలందరిని ఏకంచేసి ఎదుర్కొనడమే కాక మట్టుబెట్టి గ్రామానికి ఆ ముఠా నుండి విముక్తి కలిగించిందని ఒక కథనం. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఆమెను దేవతలా భావించేవారు. ఆమె అనంతరం అక్కడి ప్రజలు ఆమెకు ఒక దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. వచ్చిన చిక్కంతా ఏమిటంటే నాగమ్మ గుడి భూగర్భంలో సుమారు మూడు గజాల లోతులో వుంది. ఆ ఆలయంలో నాయకురాలి విగ్రహం మొక్కులు, పూజలందుకుంటుంది. ఆలయం భూగర్భంలో వుండటం మూలంగా దానిచుట్టూ ఒక కథని అల్లారు.  బల్మూరి కొండల్రాయుడి మేనమామలు పొలసరాయుళ్ళట. వీరు కొండల్రాయుడి తండ్రిని హతమార్చారట. మేనమామలపై కత్తిగట్టి ప్రతీకారం తీర్చుకునే సందర్భంలో వారి అనుచరుడైన కఠారిజింకడిపై హత్యాయత్నం చేసిన కొండల్రాయుడిని నాయకురాలు అడ్డుకుందట. ఈ మేరకు తన గుర్రంతో కొండల్రాయుడు నాయకురాలిని తొక్కిస్తే ఆమె భూమిలోకి పది అడుగుల మేర కూరుకుపోయిందని కొండల్రాయుడి వీరగాథా రసవత్తర కల్పన.

తెలంగాణ చరిత్ర పరిశోధకుడైన 'మలయశ్రీ' తన తెలంగాణ చరిత్ర-సంస్కృతి, జనజీవనం అనే రచనలో 15వ అంశంగా పొందుపరిచిన ఆర్వెల్లి నాయకురాలు అనే అధ్యాయంలో కొన్ని వాస్తవాలను గుదిగుచ్చాడు. అవేంటంటే నాయకురాలు 12వ శతాబ్దానికి చెందిందని మనం ఇప్పటికే చెప్పుకొని వుండగా బల్మూరి కొండల్రాయుడు 17వ శతాబ్దానికి చెందినవాడని పేర్కొన్నాడు. నాయకురాలుది ఒకటవ ప్రతాపరుద్రదేవుని కాలం కాగా, బల్మూరి కొండల్రాయుడు సర్వాయి పాపన్నకు సమకాలికుడట. ఢిల్లీ మొగలా పాదుషా ఔరంగజేబు గోల్కొండను ఇదే కాలంలో జయించాడట. ఈ చారిత్రక సత్యాలను గమనించినపుడు నాయకురాలికి బల్మూరి కొండల్రాయుడికి మధ్య 500 సంవత్సరాల వ్యత్యాసం కనిపిస్తుంది. నాయకురాలు 5 శతాబ్దాలపాటు జీవించడానికి అవకాశం లేదు కదా? మరి కొండల్రాయుడు గుర్రంతో ఎట్లాతొక్కించినట్టు? అనేది విశ్లేషిస్తే కొండలరాయుడు కూడా బ్రహ్మనాయుడి సామాజిక వర్గపు వాడే కనుక చరిత్రను వక్రీకరించి వారి వారసులు వీరగాథలు రాయించుకున్నారు అని అర్థమవుతుంది .కానీ నాగమ్మ త్యాగం,పోరాటం ఆరవెల్లి గుడిలో పూజలు అందుకుంటున్న దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది.

8. ముగింపు:

  • కె.వి. నరేందర్ “నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్నాను" అనే ఈ దీర్గ కవిత ద్వారా కనుమరుగు అయిపోయిన తెలంగాణ ఆడబిడ్డ చరిత్రను ఆమె గొంతుద్వారా నే పలికించారు. నాగమ్మ పై జరిగిన కుట్రలను, చారిత్రకంగా ఆమె గొప్ప తనాన్ని చీకటిలోకి నెట్టివేసిన వైనాన్ని ఎంతో వేదనగా, ఆర్తిగా కవిత్వీకరించారు. అప్పటి వరకు ప్రతినాయకురాలిగా ఊహించుకొన్న నాయకురాలు పాత్రను సమున్నతంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయేవిధంగా అక్షరీకరించారు. 
  • చరిత్ర, ప్రామాణికవిమర్శగ్రంథాలు, స్థలసందర్శనల సహాయంతో తన రచనకు బలం చేకూర్చారు. ఏ రకంగా చూసిన నరేందర్ గారి ఈ దీర్ఘ కవిత్వం గొప్ప చారిత్రక వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచడమే గాక, స్త్రీవాదదృక్పథంతో చూస్తే ఒక సామాన్యమైన మహిళ, ప్రతి కూల పరిస్థితుల్లో అసమానమైన శక్తి, యుక్తులను ప్రదర్శించి, నేటి స్త్రీ జాత్రికి ఆదర్శంగా నిలిచిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు మన ముందుంచారు.
  • వారు చేసిన ఈ కృషి ఫలితంగా తెలంగాణ ప్రాంతవాసులు నాగమ్మ గొప్పదనాన్ని తెలుసుకోవడమే కాకుండా, ఆమె జన్మించిన ఆరవెల్లిని దర్శించుకోవడము, తమ ఆడబిడ్డగా ఆమెను గౌరవించడం జరుగుతుంది. అంటే సమాజ శ్రేయస్సును ఆకాంక్షించడమే కాకుండా, సమాజం గుడ్డిగా నమ్మే అనేక అంశాలను నిగ్గు దేల్చి, నిజనిజాలను నిక్కచ్చిగా చెప్పే గొప్ప పనిని సాహిత్య ప్రయోజనంగా నరేందర్ గారు తలకెత్తుకున్నారని చెప్పవచ్చును.

9. పాదసూచికలు:

  1. తెలంగాణ సాహిత్య పీఠికలు, బన్న అయిలయ్య,పుట .70.
  2. ఆంధ్రుల చరిత్ర, బి.ఎస్ .ఎల్ . హనుమంతరావు, పుట: 207
  3. నేను... మాట్లాడుతున్నాను, సంగవేని రవీంద్ర, ముందుమాట.
  4. తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ, వై.హెచ్.కె.మోహన రావు , పుట . 7 
  5. తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ, దేవి, (ముందుమాట).

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఉమాకాంతము, అక్కిరాజు. పల్నాటి వీరచరిత్రము. వాణీముద్రాక్షరశాల, బెజవాడ, 1911
  2. జగన్నాథాచార్యులు, బెజ్జంకి. పలనాటి వైభవం. బాలల రచయితల సంఘం, గుంటూరు, 2007
  3. ప్రభాకర రెడ్డి, కోడూరు. పల్నాటి భారతము. నవోదయ పబ్లిషర్స్, గుంటూరు. 2013
  4. ప్రభాకర్ రెడ్డి, కోడూరు. The battle of Palnad. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2011
  5. మలయశ్రీ, తెలంగాణాచరిత్ర, సంస్కృతి, జనజీవనం. సత్యార్థి పబ్లికేషన్స్, కరీంనగర్, 1995
  6. మోహనరావు, వై.హెచ్.కె. తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ. శ్రీలక్ష్మి ప్రెస్, గుంటూరు, 2011
  7. మోహన్ రావు, వై.హెచ్.కె. శాంతి దూత నాయకురాలు, స్ఫూర్తి పబ్లిషింగ్ హౌస్, గుంటూరు, 2015
  8. రవీంద్ర సంగెవేవి. నేను నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్నాను. సెప్టెంబర్, 2011
  9. వెంకట సుబ్బారావు, తంగిరాల. తెలుగు వీర గాథా కవిత్వము, ఎమెస్కో పబ్లిషర్స్, 2014.
  10. హనుమంతరావు, బి.ఎస్.ఎల్.  ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషగ్ హౌస్, హైదరాబాద్, 2003

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]