headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. నల్లమల ప్రాంత పుణ్యక్షేత్రాలు: చెంచుల చరిత్ర - గేయ సాహిత్యం

డా. కప్పెర కృష్ణగోపాల్

అధ్యాపకుడు
శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొండనాగుల,
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9490899811, Email: kapperakrishnagopal@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

నల్లమల్ల ప్రాంత చెంచుల చరిత్రను తెలియజేసే పుణ్యక్షేత్రాలు, సాహిత్యము ను. చెంచుల ద్వారా స్వీకరించిన మౌఖిక సాహిత్యం. నల్లమల అటవీ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలు చెంచుల ఆధీనంలో ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలు. ఈ పుణ్యక్షేత్రాలు అడవిలో కొండ కోనల్లోని పచ్చని ప్రకృతి రమణీయ అందాలతో చూపరులను ఎంతో ఆకట్టుకునే ప్రదేశాలుగా చెప్పబడుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను చూడడానికి వచ్చిన సమాజం చెంచులతో మమేకమవుతున్నారు. అలా మమేకం కావడం వలన బాహ్య ప్రపంచంలోని ప్రజలకు మరియు చెంచులకు సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇలా సంబంధాలు ఏర్పడడం ద్వారా సమాజంలోని ఒడిదుడుకులను చెంచులు కూడా గ్రహిస్తున్నారు. వారు ఈ సమాజంతో మమేకమవుతున్నారు మంచి చెడులు తెలుసుకోగలుగుతున్నారు. అమాయకులైన చెంచులు వీరు నివసించే అడవిలో పుణ్యక్షేత్రాలు ఉండడం వలన వీరే అధిపతులుగా, పూజారులుగా కొనసాగుతున్నారు. వీరు శ్రీశైల చెంచు మల్లన్న చరిత్ర, అహోబిల లక్ష్మీ నరసింహ , చెంచులక్ష్మి చరిత్ర, మరియు సలేశ్వరం, మల్లెల తీర్థం పుణ్యక్షేత్రాల చరిత్ర వీరు కథలు గాను గేయాల రూపంలో పాడుతారు.ఈ సభ్య సమాజానికి ఇట్టి పుణ్యక్షేత్రాల చరిత్రను పరిచయం చేసిన మొదటి వారు గా చెంచుల వారిని చెప్పుకోవచ్చు.

Keywords: నల్లమల ప్రాంత చెంచుల చరిత్రను తెలియజేసే పుణ్యక్షేత్రాలు, చెంచుల దైవభక్తి, శ్రీ శైల క్షేత్ర చెంచు మల్లన్న ఆదిమ చరిత్ర, అహోబిలం చెంచులక్ష్మి చరిత్ర, స్థల మహత్యాలు, పుష్కర తీర్థాలు, గేయాలు.

1. ఉపోద్ఘాతం:

నల్లమల ప్రాంత చెంచులు నిరక్షరాస్యులు. రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్నవారు. అడవి తల్లి ఒడిలో నివసిస్తున్న చీకటిలోని చిరుదీపాలు. అమాయకపు జీవచ్ఛవాలు. అంతరించిపోతున్న ఆదిమ జాతి తెగవారు. వీరు ప్రధాన వృత్తిగా పోడు వ్యవసాయం, వేటాడటం. అడవిలో ఉన్న కందమూలాలను సేకరించి ఆహారంగా సేకరించడం, అడవిలోని చెట్ల జిగురును సేకరించి అమ్మడం వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించడం జరుగుతుంది.

వీరిలో దైవభక్తి మెండుగా ఉంటుంది. వీరు (శివున్ని) చెంచు మల్లన్నను తన సతి పార్వతీదేవిని (భ్రమరాంబ) ఎక్కువగా వారి ఇంటి ఇలవేల్పుగా భావించి కొలుస్తారు. వీరు భ్రమరాంబ దేవిని మల్లెలమ్మగా పిలుచుకొంటారు. ఆ తల్లిని కొలుస్తారు. అలాగే చెంచు ఆడపడుచు అయిన చెంచులక్ష్మి మా ఇంటి ఆడపడచు అని మా ఇంటి ఆడపడచును శ్రీశ్రీ లక్ష్మీసమేతుడైన నారసింహుడు వివాహం చేసుకున్నాడు అని అందువలన ఆ లక్ష్మీ నరసింహస్వామి మా అల్లుడు అని మనసా, వాచా, కర్మణా చెంచులు ఆరాధిస్తారు.

ఇక గేయ సాహిత్య విషయానికి వస్తే చెంచులు మంచి సంగీత ప్రియులు శివుని, నరసింహస్వామిని ఆరాధిస్తూ ఎన్నో గేయాలు వ్రాశారు, పాడారు. వీరు మంచి కళాతృష్ణ దాగి ఉన్నవారు. కానీ వీరి ప్రతిభ ఈ ప్రపంచానికి తెలియదు.

వీరి నుండే తంత్రి, వాద్యం, కిన్నెర, మద్దెల, గుమ్మెట, గజ్జలు, హర్మోనియం, జనించాయి అని నల్లమల ప్రాంత 65 సం॥ దేవ చెంచు అప్పపూర్‌, లింగాల మండలం చెంచు గురవయ్య గారు తెలియజేశాడు. (ఈ పరిశోధనాత్మక వ్యాసం మౌఖిక సాహిత్యవ్యాసం, సేకరణ: ‘డా॥ కె.కృష్ణగోపాల్‌  చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన, 2019)

నల్లమల అడవి చెంచులతో పరిశోధకుడు డా. కృష్ణ గోపాల్.

 

వేటాడడానికి వెళ్తున్న చెంచు.

 

వేట ముగిసిన తర్వాత మాంసాన్ని తీసుకువెళ్తున్న చెంచు.

 

చెంచులు నివసించే గుడిసె

 

చెంచుగూడెం. (పెంట) కొమ్మన్ పెంట, శ్రీశైలం.

2. చెంచుల దైవభక్తి:

చెంచులకు దైవభక్తి మెండుగా ఉందని చెప్పవచ్చు. వీరు ఎక్కువగా శివుణ్ణి, గారెలపోషమ్మ, కాళికాదేవి (భవానీమాత = బ్రహ్మరాంబ (పార్వతీదేవిని) ఎక్కువగా పూజిస్తారు. నాగమ్మ, పాముల పుట్టను వీరు ఆరాధిస్తారు. నాదస్వరం యొక్క రాగంతో ఊదుతూ పుట్టకు పసుపు, కుంకుమ సమర్పిస్తారు. పెళ్ళిళ్ళప్పుడు పుట్టమట్టితో పందిరి గుంజలకు అరుగులు వేస్తారు. ఈ విధంగా వేస్తే పెళ్ళి నిర్వహణ సక్రమంగా జరుగుతుంది. ఎటువంటి ఆటంకం కలుగదు. నాగదేవత చల్లగా చూస్తుంది అని వారి నమ్మకం. పుట్టమన్ను తెచ్చేటప్పుడు నాగదేవతకు మొక్కి తోగి తెస్తారు. పుట్ట క్రింది భాగంలో కొద్దిగా తోగి తీసుకపోయి, ఇంటి దగ్గర ఉన్న మట్టిలో పుట్టమన్నును కొద్ది కొద్దిగా కలిపి పెళ్ళిపందిరి గుంజలకు కట్టలుగా వేస్తారు.

చెంచులు ఎక్కడైన ఊర్ల ప్రయాణం వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని తమ ఇష్టదైవమైన లింగమయ్యను (శివున్ని) ప్రార్ధించి బయలుదేరుతారు. ఉదయము తెల్లవారుజామున, అడవి వనరుల కోసం, మరియు వేటాడడానికి వెళ్ళే సమయంలో లింగమయ్యను ప్రార్థించి నీకు నైవేద్యము ఒండి పెడతాము తండ్రి మాకు శికారి (వేట) బాగా కావాలని దీవించు తండ్రి అని మ్రొక్కి (దండం) పెట్టి వెళతారు.

అడవిలో ఎటువంటి క్రూరమృగం మాకంట్లో పడకూడదు, అలాగే వాటి కంట్లో మేము కనపడకూడదు అని దేవున్ని (శివున్ని) ప్రార్థించి వెళుతారు. ఈ విధంగా ప్రార్థిస్తే ఎటువంటి క్రూరమృగం దాడిచేయదు. వాటి నుండి దేవుడు రక్షిస్తున్నాడు అనేది వారి ప్రగాఢ విశ్వాసము.
అడవిలో ఉండే జీవులైన పెద్దపులి, నెమలి, పాములను (నాగుపాము) వీరు మొక్కుతుంటారు మరియు పూజిస్తారు. వీరి ఇళ్ళల్లో కూడా దేవుళ్ళ పటాలు పెట్టి లేదా గుండ్రని రాళ్ళకు కుంకుమ పసుపుపూసి ప్రతిష్టించి, దీప ధూపాలను వెలిగించి నైవేద్యము సమర్పించి పూజచేస్తారు. వీరికి పరమశివుడు అంటే అమితభక్తి. ఈ దేవుని పేరునే చెంచులు వివిధ రకాలుగా పిలుచుకొంటారు. అలాగే శివయ్య పత్ని అయిన పార్వతిదేవిని కూడా వీరు మారుపేర్లతో పిలుచుకొంటారు. చెంచుల ఇలవేల్పుగా శివయ్యను, భ్రమరాంబను కొలుస్తారు. 

3. చెంచుల దేవతల పేర్లు :

చెంచులు శివయ్య, బ్రహ్మరాంబ (పార్వతి) దేవిని వివిధ రకాలుగా మారుపేర్లతో పిలుచుకొంటారు. వారిని అమితభక్తితో పూజిస్తారు.

చెంచులక్ష్మీ, గారెల పోషమ్మ, గారెల మైసమ్మ, ఈదమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ,, మల్లమ్మ, బౌరమ్మ (బ్రహ్మరాంబ) మొదలైన పేర్లతో, కాళికామాత పార్వతీదేవిని కొలుస్తారు.
భయన్న (భైరవుడు), పోతురాజు, పులి ఈరడు, లింగమయ్య, గుర్వయ్య, శివయ్య, నరసింహుడు, రాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరస్వామి మొదలైన పురుషదేవతలను కొలుస్తారు. తమ ఇలవేల్పు అయిన శివున్ని - భయన్న (భైరవుడు), పోతురాజు, పులి ఈరుడు, లింగమయ్య, గుర్వయ్య, శివయ్య మొదలగున్న మారుపేర్లతో ఆ స్వామిని కొలుస్తారు. కొందరు చెంచులు, రామున్ని, శ్రీకృష్ణున్ని, నరసింహున్ని, వెంకటేశ్వరస్వామిని విష్ణురూపాయ పేర్లలతో ఉన్న భగవంతున్ని ప్రార్థిస్తారు. వందశాతం మందిలో వీరు ఎక్కువగా శివున్నే ఆరాధిస్తారు. 

4. చెంచుల పూజావిధానం :

చెంచులు దైవభక్తి కలవారు. వీరు తెల్లవారుజామున గుడిసెకాడి కోడి లేదా అడవికోడి కూయంగానే లేచి చెలిమెలో లేదా పారే సెలయేటిలో కుంకుడుకాయలు శరీరానికి రుద్దుకొని స్నానం చేస్తారు. చెంచుల కులపెద్ద అయిన వ్యక్తి మాత్రమే. పూజావిధానంలో పాల్గొంటారు. నల్లమల్ల ప్రాంతంలోని చాలా ప్రదేశాలలో కొండలలో శివుని యొక్క దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. శివయ్య చెంచుల కులదేవునిగా పూజిస్తారు. దేవాలయం దగ్గర చెంచుకులపెద్దనే పూజారిగా (అర్చకుడి)గా బాధ్యతలు నిర్వహిస్తాడు. ఉదా - కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని సలేశ్వరం, ఉమామహేశ్వరం. కాని ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం చెంచు కులపెద్దకు మంత్రోచ్చరణ రాని కారణంగా పూజ నిర్వహించలేరని దేవాలయానికి సహాయ కార్యక్రమంలో పాల్గొనేలాచేసి, పూజావిధానం నుండి తొలగించడం జరిగింది. నల్లమల్ల ప్రాంతంలోని ఎండోమెంట్‌ దేవాదాయ ధర్మాదాయశాఖవారి ఆధీనంలో లేని గుడులలో మాత్రమే చెంచులు పూజాకార్యక్రమము నిర్వర్తిస్తున్నారు. ఉదా - సలేశ్వరం దేవస్థానం (నల్లమల్ల మహబూబ్‌నగర్‌ జిల్లా) లింగాల మండలంలో ఉన్న దేవాలయం చెంచుల ఆధీనంలో కొనసాగుతుంది. సలేశ్వరం జాతర పేరుమీదుగా వచ్చిన (హుండీ) - డబ్బులు ఆ ప్రాంతానికి చెందిన చెంచులు అందరు పంచుకుంటారు. ముందు ఉండి కార్యక్రమం నడిపించిన పెద్దలు కొద్దిగా ఎక్కువ డబ్బులు స్వీకరిస్తారు. చెంచు కులపెద్ద పూజారి. కొలనులో లేదా సెలయేటిలో స్నానం చేసి మొలకు చిన్నని బట్ట ధరించి శరీరానికి చేతులకు, విబూధిని మూడు శివుని నామాలుగా పూసుకొని నుదురుకు శివుని మూడోకన్నులా కుంకుమ బొట్టు ధరించి అడ్డంగా మూడు నామాలు పూసుకొని దేవునికి అడవి మల్లెలు, మోదుగపుష్పాలు, నేరడిపత్రి మొదలగున్నవి దేవునికి సమర్పించి, అన్నాన్నే నైవేద్యంగా నేరడి ఆకులో దేవునికి సమర్పిస్తారు. దైవదర్శనానికి వచ్చిన చెంచులకు నుదురుకు తెల్లని విబూదిని పూసి ప్రసాదాన్ని ఇచ్చి పంపిస్తాడు. చెంచుల కులపెద్ద పూజారి ప్రధాన అర్చకుడు. దేవునిని వచ్చే ఆదాయం ముందుగా కులపెద్దలు మరియు కొద్దిగంత అక్షరజ్ఞానం ఉన్నవారు. 50% (యాభైశాతం) పంచుకుంటారు. మిగతా 50% (యాభైశాతం) అక్కడ ప్రజలను కంట్రోల్‌ చేసిన చెంచులు ఇతర కులస్తులకు రోజువారీ కూలీగా డబ్బులు చెల్లిస్తారు. (మౌఖిక సేకరణ: డా॥ కె.కృష్ణగోపాల్‌, చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన, పుట:29, 31)

5. చెంచుల ఆధీనంలో ఉన్న నల్లమల్ల ప్రాంత దేవస్థానాలు - పుణ్యక్షేత్రాలు :

5.1 శ్రీశైల చెంచు మల్లన్న చరిత్ర :

ఆధునిక చరిత్ర (కర్నూలు జిల్లా, సున్నిపెంట మండలం) శ్రీశైలం.

‘‘వాగర్థా వివసంప్రక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’

మానవ సృష్టికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు మా నమస్సుమాంజలి. ప్రపంచం విశాలమైనది. కాలం అనంతమైనంది. విశాల ప్రపంచంలో, అనంత కాల ప్రవాహంలో మానవ జన్మ మహోన్నతమైన మానవుడు దర్శించినంతనే మోక్షాన్ని ప్రాప్తింపచేసే పుణ్యప్రదేశం శ్రీశైల మహాక్షేత్రం, శ్రీశైల మల్లికార్జున లింగం ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి. నల్లమల కొండల్లోని శ్రీపర్వతం మీద నిలిచి ప్రజలను చల్లగా చూచే కరుణామయుడు మహాదేవుడు.

శ్రీశైల పుణ్యక్షేత్రం మహిలో వెలసిన కైలాసమని ఆస్తిక హైందవ భావన. ఈ క్షేత్రములో ప్రతి అంగుళము పుణ్యస్థలమే. సాక్షాత్తు పరమశివుడు కూడా శ్రీశైలాన్ని స్థిరనివాసంగా చేసుకోవడంవల్లనే బ్రహ్మహత్య క్రతు విధ్వంసము సోదరీ సుత సంహరములాంటి పాపాల నుండి విముక్తుడైనాడని మన సాహిత్యం చెబుతుంది. అనేక దేవాలయాలతో, శిఖరాలతో, తీర్థరాజాలతో ప్రకృతి రమణీయ కథలో వెలుగొందుతున్న శ్రీశైలక్షేత్రం ఓ పుణ్యనిధి.

చంద్రవతి అనే భక్తురాలు ఈ స్వామిని అనునిత్యం మల్లికా పుష్పాలతో అర్పించేదట! అందువలనే ఈ స్వామికి మల్లికార్జునస్వామి అనేపేరు సుప్రసిద్ధమైనదంటారు. అష్టాదశ మహాశక్తులలో ప్రధానమగు భ్రామరీ శక్తి శ్రీశైల క్షేత్రములో భ్రమరాంబా రూపమున అవతరించినది. భ్రమరం అంటే తుమ్మెద అని అర్థం. అది సార్థకం చేస్తున్నట్టుగా భ్రమరాంబాదేవి గుడి గోడ వద్ద ఉన్న రంధ్రం దగ్గర చెవిపెట్టి ఆలకిస్తే ఎప్పుడూ భ్రమరనాదం వినవస్తుంది.

సుప్రసిద్ధమైన క్షేత్రమైన శ్రీశైలంలోనే శంకరాచార్యుల వారు తపస్సుచేసి అద్వైత జ్ఞానాన్ని పొంది భారతదేశంలో వైదికధర్మాన్ని, ఆధ్యాత్మికతను పునరాజ్జీవనము చేశారు. సుప్రసిద్ధ బౌద్ధమతాచార్యుడు, ఆచార్య నాగార్జునుడు శ్రీశైలాన్ని దర్శించి పులకించిపోయాడట! చక్రవర్తులైన శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, ఈ దేవాలయానికి కట్టుదిట్టమైన గోపురాలను నిర్మించి ఆలయాభివృద్ధికి ఎంతో సహాయం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ :

శ్రీశైల క్షేత్రానికి ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానదిపైన ఎత్తైన కొండల నడుమ జలజలా జాలువారే జలపాతంనకు ఆనకట్టవేసి నీటిని ఆపి జలవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జలవిద్యుత్‌ కేంద్రాలు, ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం కర్నూలు జిల్లాకు (6) ఆరు గేట్లు, మహాబూబ్‌నగర్‌ జిల్లాకు (6) ఆరు గేట్లను కలిపి మొత్తం ప్రాజెక్ట్‌ (12) పన్నెండు గేట్లతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణమును అప్పటి (మాజీ) ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు నిర్మింపచేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరు గారు నిర్మాణ రూపకల్పన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ను నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్‌ ప్రభుత్వంవారు నామకరణం చేశారు.

శ్రీశైలానికి ఆనుకొని ఉన్న కృష్ణానదిలో వివిధ రాష్ట్రాల నుంచి మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు పాపాలు పోవాలి అనే ఆశతో, నమ్మకంతో పాపనాశనంగా భావించి కృష్ణానదిలో స్నానం చేస్తారు. భక్తుల వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని దేవునికి తలనీలాలు సమర్పిస్తారు.

 

శ్రీశైల చెంచు మల్లన్న దేవస్థానం.

 

శ్రీశైల మల్లన్న దేవస్థానము మొదటి పూజారి దేవ చెంచు.

శ్రీశైల మల్లన్న దేవస్థానంలో నీ మ్యూజియంలో భద్రపరిచిన దేవ చెంచు ప్రతిమ.

 
5.2 శ్రీశైల క్షేత్రం - చెంచుమల్లన్న ఆదిమ చరిత్ర :

కొద్ది మాత్రం నీరును తన శిరస్సుపై అభిషేకించిన భక్తులను కరుణించి, వారి అభీష్టాలను నెరవేర్చే భోళాశంకరుడు దట్టమైన అడవిలోని శ్రీశైలంలో స్వయంభువుగా వెలిసాడు. శక్తి స్వరూపిణిjైున జగదాంబిక కూడా భ్రమరాంబికా దేవిగా భక్తుల పూజలను అందుకుంటోంది.

పూర్వం శ్రీశైలేశ్వరుడి దర్శనార్ధం రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి శ్రీశైలానికి వచ్చారు. కాగా వారికి శివలింగం దగ్గర ఒక బక్కపాటి నల్లటి మనిషి కనిపించాడు. అతనికి మాటలు రావు. వచ్చిరాని మాటలతో రామునికి ఎదో సమాధానమిచ్చాడు. దానిని అర్థం చేసుకొన్న శ్రీరాముడు అతనిని పూజారిగా గుర్తించాడు. సీత, లక్ష్మణులను చూపుతూ ఆదిమానవుడు ఇతనే అని చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి భక్తితో పూజచేయగా శివుడు సాక్షాత్కారమయ్యాడు.

శ్రీరామచంద్రమూర్తి పూజ ముగించుకొని తిరిగి వస్తుండగా దారిలో ఒక చెట్టు క్రింద ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయితో ఉన్న ఒక ఆడమనిషి కనిపించారు. శ్రీరాముడు పలుకరించగా వారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. భయంతో పారిపోవడానికి చూస్తుండగా రాముడు రాజు దుస్తులను తీసి సాధారణ వ్యక్తిగా కనిపించాడు. అపుడు వారు రాముడి దగ్గరకు వచ్చారు. శివుని దగ్గర మేము పూజ చేస్తుంటాము. పూజారిగా ఉన్నది నా భర్త అని పూజారి భార్య సమాధానమిచ్చింది. శ్రీరాముడు వాళ్ళను మీరు ఇక్కడే ఉండండి అని శ్రీశైలం అప్పగించి వెళ్ళాడు. రాముడు వెళ్ళిపోయిన కొన్ని రోజులకు ఈ చెంచు పూజారిల దగ్గరకు 6 సంవత్సరముల అమ్మాయి ఎక్కడనుండో వచ్చి, మీ అమ్మాయిని అని చెప్పింది. నాకు శివుడు అంటే మహాభక్తి అంటూ వివరించింది. కాగా వారు ఆ అమ్మాయికి భ్రమరాంబ అని పేరు పెట్టుకున్నారు. చెంచు పూజారులు భ్రమరాంబకు అడవిలోని పలురకాల పండ్లు, గడ్డలు, తేనెపెట్టి వాళ్ళ పిల్లలతోపాటు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. క్రమంగా అమ్మాయి పెద్దదయింది. మల్లిఖార్జునస్వామి ఆ అమ్మాయి మీద మనసుపడి భ్రమరాంబదేవిని పెళ్ళిచేసుకొన్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత సీతాదేవితో లింగ ప్రతిష్ఠ చేయించేందుకై శ్రీరామచంద్రమూర్తి శ్రీశైలం చేరుకున్నాడు. కాగా ఇంతకు ముందటి చెంచు పూజారి మళ్ళీ తన భార్య పిల్లలతో కనిపించినాడు. శ్రీరాముడు వారితో మాట్లాడుతూ... శివుడు మీలోనే ఉన్నాడు. మీరంతా శివుడిని భక్తిగా ఆరాధించండని చెప్పాడు. తదుపరి సీతాదేవితో లింగప్రతిష్ట గావించి గుడిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఇక నుండి గుడి మీదేనని సెలవిచ్చాడు. కాగా నాటి నుండి చెంచులు వంశానుసారంగా శివుడిని భక్తిగా ఆరాధించుకున్నారు. శివునిగుడికి ఎడమవైపున, మహాభారతం కథకులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ప్రతిష్టించిన శివలింగాలు అగుపిస్తాయి. వీరు నల్లమల్ల ప్రాంతానికి వనవాసం వచ్చి అక్కడ తపస్సుచేసి శివుని అనుగ్రహం పొందారు అని దేవ చెంచు పూజారి వివరించాడు.

శివరాత్రిని చెంచులు అమితమైన భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినాన వారు ఎక్కడ ఉన్నా స్వామి దర్శనానికై తమ ఆవాసాల నుండి కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. వీరిలో పిల్లాపాపలతోపాటుగా నడవలేని స్థితిలో ఉన్న ముసలివారు సైతం కొండలు గుట్టలు దాటుకుని శ్రీశైలేశ్వరుడిని దర్శించుకోవడం విశేషం. ఇది చెంచులకు శివుడిపై ఉన్న ఆరాధన, భక్తిభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

రెడ్డిరాజులు కూడా చెంచుల భక్తి భావానికి ఆశ్చర్యచకితులై వారిని మహాశివభక్తులుగా అభివర్ణించారు. అంతేకాక శ్రీశైలేశ్వరుడికి ప్రథమ పూజ చెంచులచే చేయించేవారని చెబుతుంటారు. అలా జరగని పక్షంలో శివుడికి శక్తి సమకూరదని కథలుగా చెప్పుకుంటుంటారు. నవాబు పరిపాలనలో కూడా చెంచులు శివునికిగాని గుడికిగాని ఎలాంటి ప్రమాదం లేకుండా శ్రీశైల మల్లన్న దేవస్థానాన్ని కాపాడారు అని చెంచులు చెబుతుంటారు.

తదనుగుణంగానే భ్రమరాంబదేవిని చెంచు భ్రమరాంబగా, మల్లికార్జునస్వామిని చెంచు మల్లన్నగా పిలుస్తుంటారు. అంతేకాక చెంచు గూడేలన్ని శ్రీశైలం పరిధిలో ఉండడం విశేషం.

(కాగా ఈ చరిత్రనంతటినీ పాలుట్లగూడెంలోని మండ్లి పాపమ్మ అనే 75 సంవత్సరాల ముదుసలి చెప్పినట్లుగా శ్రీ నిమ్మ ఈదన్న, 66 సం॥, దేవచెంచు, పాలుట్ల గూడెం, కర్నూలు జిల్లా నివాసి వివరించాడు. 02-02-2013)

5.3 అహోబిలం చెంచులక్ష్మినరసింహస్వామి చరిత్ర :

నల్లమల్ల అటవీ ప్రాంతం చెంచులకు ఆలవాలం. పూర్వం అక్కడ నివసించే సిఖనాయకుడు వేటలో మొనగాడుగా పేరుపొందాడు. అంతేకాక గొప్ప శివభక్తుడు కూడా. ఎప్పుడూ శివధ్యానస్మరణ అతని లోకంగా ఉండేవాడు. తన కూతురైన చెంచులక్ష్మిని అల్లారుముద్దుగా పెంచుకునేవాడు. చెంచులక్ష్మి సుమారు 12 సంవత్సరాల చిరుప్రాయంలోనే తండ్రి వెంట అడవికి వేటకు వెళ్ళేది. ఒక మారు తండ్రి వేటకై ఎర్రమల అడవులకు వెళ్ళగా, తను నల్లమల అడవులను బయలుదేరింది. వేటలో అలసిన చెంచులక్ష్మి తునికి చెట్టుపైకి చేరి తునికి పండ్లు తినసాగింది. అదే సమయంలో దేవదేవుడైన విష్ణుమూర్తి కూడా (మానవరూపంలో ఉన్న నరహరి) అదే సమయంలో అడవుల్లో సంచరిస్తున్నాడు. కాగా ఈయన తన ఆకలిని ఓర్చుకోలేక చెంచులక్ష్మి తిని పడవేసిన తునికి పండ్ల ఒక్కలు (తొక్కలు) తినసాగాడు. అది గమనించిన చెంచులక్ష్మి ఎవరయ్యా నీవు ? చెట్టుమీద ఇన్ని పండ్లు ఉండగా, నేను తిని పడవేసిన ఒక్కలు తింటున్నావు? రోతి మనిషిలా ఉన్నావు ? అంటూ ప్రశ్నించింది. దానికి సమాధానంగా మహావిష్ణువు - నీవు తిన్న ఒక్కలు చాలా రుచిగా ఉన్నాయి, అందుకే తింటున్నాను అని బదులు పలుకుతూ... ఆమెను చెట్టు దిగి కిందకు రమ్మన్నాడు.

నేను రాను. మా అయ్య వేటకు ఎర్రమలకు పోయాడు. తను వచ్చిన దాకా నేను చెట్టు దిగను అంది చెంచిత.

నీవు క్రిందకు రాకుంటే నేను పైకి వస్తాను. నన్ను వివాహమాడాల్సిందే అని పలికిన నరహరి మాటలకు చెంచులక్ష్మి భయపడిరది. ఇదుగో ఎవ్వరు నీవు ? నా జోలికి రావద్దు. వస్తే అంబులతో నిన్ను చంపుతాను. ఈ విషయం మా అయ్యకి తెలిస్తే నన్ను చంపుతాడు అని చెంచులక్ష్మి బెదిరించింది. కాని దానికి ప్రతిగా నరసింహస్వామి చెట్టు అంత ఎత్తు పెరిగి తన వెంట్రుకలతో చెంచులక్ష్మిని బంధించుకొని అహోబిలంకు చేరుకున్నాడు.

కాని క్రమక్రమంగా చెంచులక్ష్మి నరసింహస్వామిని ప్రేమించసాగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక చెంచులు వారిని నానామాటలు అన్నారు. పంచాయితీ నిర్వహించి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాల్సిందిగా నరసింహస్వామిని కోరారు. వారి గూడెంలోనే స్థిర నివాసం ఉండాలన్నారు. మాంసం, అడవి దుంపలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు. దానికి స్వామి సానుకూలంగా స్పందించాడు. అంతేకాక అడవిలో ఉన్న దేవస్థానాలు, కొన్ని ముఖ్యమైన మాన్యాలు, నగరాలు మీకు వ్రాసి ఇస్తున్నాను. నల్లమలలో ఉన్న దేవాలయాల్లో ముందు మీరు పూజ చేసిన తరువాతనే మిగతావారు పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుందని చెంచులకు వరాన్ని ప్రసాదించాడు. తన పూజకు గాను చీర, రవిక, పూలు, ఇప్పపూల సారా తీసుకొని వస్తేనే గుడిలో ఉంటానన్నాడు.

కాగా నాటి నుండి చెంచులు దేవచెంచులుగా పరిగణింపబడుతున్నారని నల్లమల్ల చెంచులు అనాదిగా ప్రచారంలో ఉన్న కథను చెప్పుకుంటున్నారు. అంతేకాక సాక్షాత్తూ భగవంతుడే తమ ఇంటి అల్లుడిగా ఉంటున్నందుకు గర్వకారణంగా ఆనందంగా ఉంటుందన్నారు. 

చెంచులక్ష్మి విగ్రహం

(ఈ కథ విషయాన్ని దేవ చెంచు, 80 సం॥రాల పండు ముసలి వ్యక్తి, ఉడుతనూరి లింగయ్య, మన్ననూర్‌ గ్రామము, అమ్రాబాద్‌ మండలం, మహబూబ్‌ నగర్‌ జిల్లా గారు వివరించారు.) 

5.4 చెంచుల దైవం సలేశ్వర పుణ్యక్షేత్రం చరిత్ర :

ఈ సలేశ్వర పుణ్యక్షేత్రం నల్లమల ప్రాంతంలోని చెంచుల ఆధీనంలో ఉన్న పుణ్యక్షేత్రం. మహబూబ్నగర్‌ జిల్లా లింగాల మండలంలో ఉంది. సలేశ్వరం వెళ్ళాలి అంటే రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి.

1) ఒకటవ మార్గం: అచ్చంపేట మండలంమీదుగా 25 కిలోమీటర్లు దాటిన తరువాత లింగాల మండలం వస్తుంది. అచటి నుండి కాలినడకన పది (10) కిలోమీటర్లు అప్పాపూర్‌ పెంటకు నడిచి అచట నుండి కనీసం (5) ఐదు కిలోమీటర్లు కాలినడక నడిస్తే సలేశ్వర పుణ్యక్షేత్రం వస్తుంది.

2) రెండవ మార్గం: మహబూబ్‌ నగర్‌ జిల్లా శ్రీశైలం రోడ్‌, అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ గ్రామం రహదారి నుండి 25 మైళ్ళదూరం బస్సు ప్రయాణంచేసి అక్కడి నుండి రాంపూర్‌ పెంట సమీపంలోని రెండు (2) కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం ఉంది.

సలేశ్వరక్షేత్రంలో లింగమయ్య స్వామి కొలువై ఉన్నాడు. లింగమయ్యస్వామి చెంచులు భక్తిశ్రద్ధలతో తమ ఆరాధ్యదైవంగా పూజిస్తారు. లింగమయ్య స్వామి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో తమ హృదయాలలో కొలువైన స్వామికి నమస్కరిస్తారు.

సలేశ్వరం ప్రయాణం భక్తులకు ఓ మంచి అనుభూతిని మిగిలిస్తుంది. వేలాది అడుగుల లోతైన లోయలో ఇరుకైన కొండదరులపై ప్రయాణిస్తూ ముందుకుసాగుతారు.

సలేశ్వర పుణ్యక్షేత్రము వెళ్లే ముఖద్వారం.

5.5. పుష్కర తీర్థాలు :

ఏడాది పొడవునా నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతం ఏటా చైత్ర పౌర్ణమికి భక్త జనసందోహంతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ప్రారంభం అవుతాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా లక్షమందికి పైగా భక్తులు సలేశ్వరం లింగమయ్యస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. పచ్చని చెట్టు ఎగిసిపడే జలపాతాలు, ఎత్తైన కొండలు, లోతైన గుహలు, పక్షుల కిలకిలరావాలు అరుదైన వన్యప్రాణులు, లేడి పరుగులు, నెమలమ్మ నాట్యాలు చిరుతపులుల గాండ్రిరపుల శబ్దాలు వింటూ భయము, సంతోషాల మధ్యన భక్తులు ముందుకు సాగుతారు.

ఈ ప్రాంతం ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. 300 (మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై నుంచి ఏడాది పొడవునా జాలువారే జలపాతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చల్లని పిల్లగాలి వీస్తూ ఉంటే పచ్చని తివాచీపరచినట్లుగా ఉన్న అడవి నునేలేత రెమ్మలను చూస్తూ భక్తులు ముందుకు సాగుతారు.

సలేశ్వర పుణ్యక్షేత్ర జలపాతం, పుష్కర తీర్థం.

స్థల మహాత్మ్యం :

ఈ ప్రాంతంలో సర్వేశ్వర తీర్థం, పుష్కర తీర్థం అనే రెండు తీర్థాలు ఉన్నాయి. సుమారు 900 అడుగుల వైశాల్యం కలిగిన సర్వేశ్వర తీర్థానికి పుష్కర తీర్థం నుంచి నీరు చేరుతుంది. ఇక్కడి గుండంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 35 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న కొండగుహలో చెంచుల ఆరాధ్యదైవమైన లింగమయ్య స్వామి కొలువుదీరాడు. ఆలయానికి ముందుభాగంలో 10 అడుగుల కింద సలేశ్వరం తీర్థం ఉంది.

ప్రత్యేక వేడుకలు :

ఏటా చైత్ర పౌర్ణమికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. వేడుకలను చెంచులు ఏర్పాట్లు చేస్తారు. ఉత్సవాలు ముగిసేవరకు 24 గంటలు భక్తులు స్వామిని దర్శించుకొనే అవకాశం               ఉంది. భక్తులు అక్కడ ఉండటానికి ఎలాంటి వసతులు ఉండవు. స్వామిని దర్శించుకొని రాంపూర్‌ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడికి వెళ్ళే భక్తులు వస్తున్నా లింగమయ్య అంటూ తిరిగి వెళ్ళేవారు పోతున్నా లింగమయ్యా అంటూ అప్పనాలు చెప్పటంతో ఈ ప్రాంతం భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. దాతలు రాంపూర్‌ పెంట వద్ద తాగునీటి వసతి, అన్నదానం నిర్వహిస్తారు.

చెంచుల భక్తి :

చెంచులు లింగమయ్య స్వామిని తమకులదైవంగా కొలుస్తారు. లింగమయ్య స్వామి దగ్గర చెంచు కులపెద్ద దేవచెంచు ఎంతో నిష్టతో తీర్ధంలో స్నానం చేసి వంటి, నుదురుకు విబూది ధరించి పూజకార్యక్రమం నిర్వహిస్తాడు. వచ్చిన ఇతర భక్తులకు చెంచుకులం వారికి (దైవం) లింగమయ్య స్వామి పేరు మీద వచ్చే ఆదాయంలో అన్నదానంచేస్తారు. ఈ విధానం ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తారు.

లింగమయ్యస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను సురక్షితంగా ఉండటానికి, కరసేవకులను (వాలెంటీర్లను) ఏర్పాటుచేసి ఎవ్వరికి ప్రమాదం జరగకుండా చెంచులు చూస్తారు.
రాత్రివెన్నెలలో ప్రజలు నడిచివస్తారు. వారికి (బాట) రహదారిలో విద్యుత్‌ తీగల సహాయంతో పై కొండపై నుండి అనగా రాంపూర్‌ ప్రాంతం నుండి లింగమయ్యస్వామి దేవస్థానం వరకు ట్యూబులైట్లను వెలిగిస్తారు. భక్తులు కాలిబాటలో దైవదర్శనానికి వచ్చే మార్గంలో 60 అడుగుల దూరంలో ఒక్కొక్క వాలెంటీర్ను ఏర్పాటుచేస్తారు. వీరు భక్తులకు ఎటువంటి ప్రమాదం లేకుండా, రాకుండా తమ వంతు కృషిచేస్తారు. ఇలా సేవచేసిన వాలెంటీర్లకు, రోజుకు 250 లేదా 300 రూపాయలు చెల్లిస్తారు. ఈ విధమైన దైవకార్యక్రమాన్ని సర్వమూ చూసుకునేది ఆ ప్రాంతం నల్లమల చెంచులు. వీరు గొప్ప నిజాయితీ కలిగిన దైవభక్తి కలవారు.

సలేశ్వరం పుణ్యక్షేత్రంలోని కొండ దరిలో ఉన్న పిడికెడు శివ లింగం.

 

రాత్రి సమయం దీపాల వెలుగులో సలేశ్వర పుణ్యక్షేత్రంలోని  శివలింగం.

(ఈ కథ విషయాన్ని వివరించిన వారు తోకల మల్లయ్య చెంచు గురుస్వామి (పూజారి) సలేశ్వరం, లింగాల (మండలం) 68 సం॥, నాగర్‌ కర్నూల్‌ జిల్లా, 26-03-2014.) 

చెంచుల మల్లెల తీర్థ పుణ్యక్షేత్ర చరిత్ర:

ఈ మల్లెలతీర్థ పుణ్యక్షేత్ర ప్రాంతము నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నల్లమల ప్రాంతములో కొలువై ఉన్నది.

తెలంగాణ రాష్ట్రంలోని ఒకటవ మార్గం: హైదరాబాద్‌ నుండి అమ్రాబాద్‌ మండలంలోని మన్నానూర్‌ గ్రామం మీదుగా శ్రీశైలంరోడ్‌ మార్గాన వటవర్లపల్లి ఉంటుంది. దానికి సమీపాన మల్లెలతీర్థ పుణ్యక్షేత్రం ఉంది. హైదరాబాద్‌ నుండి మల్లెలతీర్థానికి 185 కి.మీ. దూరంలో ఉంది. ఇక అమ్రాబాద్‌ మండలంలోని నున్ననూర్‌ గ్రామం నుండి వటవర్లపల్లి మీదుగా మల్లెలతీర్ధ పుణ్యక్షేత్రానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రెండవ మార్గం : మహబూబ్‌ నగర్‌ జిల్లా నుండి నాగర్‌ కర్నూల్‌ జిల్లా మీదుగా అచ్చంపేట మార్గాన మల్లెలతీర్థం 114 కి.మీ దూరంలో ఉంది. ఇక వనపర్తి జిల్లా నుండి బిజ్నపల్లి మండలం మార్గాన మల్లెలతీర్థం 108 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆంధ్రరాష్ట్రం గుండా మూడవ మార్గం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతమైన శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి మల్లెల తీర్ధ పుణ్యక్షేత్రమునకు దూరము 58 కిలోమీటర్లు మాత్రమే.
పైన తెలియజేసిన మూడు మార్గాల నుండి రోడ్‌ రవాణా సంస్థవారి బస్సు సౌకర్యము లభిస్తుంది.

స్థల పురాణం :

కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రెండోవ ప్రతాపరుద్రుడు పుణ్యక్షేత్రాలను దర్శించే క్రమంలో శ్రీశైలం వెళ్తూ వటవర్ల పల్లి గ్రామంలో బసచేశారు. వీరు దైవ దర్శనార్థం వెళ్ళే సమయంలో ‘ఎండాకాలం’ కావడంతో చుట్టు ప్రక్కల చుక్కనీరు లభించని స్థితిలో ఈ ప్రాంతం ఉంది. రాజుగారు ఈ చుట్టు ప్రక్కల ఎచటనైనా నీరు లభిస్తుందేమో వెతికి రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు చుట్టుప్రక్కల వెతకగా అడవిలో ఎనిమిది మైళ్ళదూరంలో ఒక జలపాతము ఉంది, అచట నీరు ఎత్తైన కొండల నుండి దుముకుతుంది అని వివరించారు.

అది విన్న మహారాజు మందీమార్బలంతో అచటికి వెళ్ళి చూడగా ఆశ్చర్యానికి గురైనాడు. ఆ ఎత్తు ప్రాంతము నుండి నీరు క్రిందికి దూకుతున్న దృశ్యం చూసి ఆనందపరవశుడై ఎత్తు ప్రాంతం నుండి క్రింది లోతట్లు ప్రాంతం వరకు రమారమి 350 మెట్లు నిర్మింపచేశాడు. కాని ప్రస్తుతకాలంలో కొన్ని మెట్లు పడిపోయి శిథిలావస్థకు గురైనాయి. మహారాజు ఆ మెట్లమార్గాన (క్రిందికి) లోతట్టు ప్రాంతానికి వెళ్ళిచూడగా ఆ లోయ ప్రాంతము పచ్చని చెట్లతో పారే సెలయేటితో, పక్షుల కిలకిలరావాలతో జంతువుల అరుపులతో మనసుకు ఎంతో ఆహ్లదాన్ని కలిగించే విధంగా ఆ ప్రాంతం పచ్చని పైరులా అగుపించింది. ఆ మరుక్షణమే దైవాధీనముగా తలంచి తపోవనంగా ఉన్న ఆ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా నిదిరిస్తున్న ప్రభువుగారికి కలలో శివుడు ప్రత్యక్షమై ఈ స్థలము భక్తుల కోరికలు తీర్చే తీర్థంగా విలసిల్లుచున్నది. ఇచట త్రాగిన తీర్థము శరీరానికి పట్టిన రోగ రుగ్మతలు తొలగిపోతాయి. కావునా, నను సేవించిన వారికి సిరిసంపదలు తులతూగుతాయి. పట్టినదల్లా బంగారమవుతుంది. శాంతి, సంపద లభిస్తుంది. నీయొక్క నామము కీర్తి ప్రతిష్టలతో నిలిచిపోతుంది. ఇచట లింగ ప్రతిష్ట చేయి అని చెప్పగా ! కాసేపటికి కల చెదిరింది. దైవాజ్ఞగా భావించి, మహారాజు అచట లింగ ప్రతిష్టచేశాడు. ఆ విధంగా మహారాజు లింగ ప్రతిష్టచేసి దైవాన్ని ప్రార్థించి అడవి మార్గాన శ్రీశైలం వెళ్ళాడు.  ఆ తరువాత నీటి యొక్క జలధార రెట్టింపు కాగా నీటితోపాటుగా అడవి మల్లెలు కలిసి శివలింగముపై పడేవట. అందువల్లే ఆ ప్రాంతాన్ని మల్లెల తీర్థం అనే పేరు సార్థకం అయ్యిందని అచట ఉన్న, చెంచులు, మరియు చెంచు గురవయ్యగారు స్థలపురాణాన్ని వివరించారు.

మల్లెల తీర్థంలోని (నీటిని) తీర్థాన్ని త్రాగినవారికి ఆయురారోగ్యము లభిస్తుంది. నిత్యయవ్వనుల్లా విలసిల్లుతారు అనే ఒక నమ్మకం ఉంది. 

మల్లెల తీర్థ జలపాతం.

 

మల్లెల తీర్థం పుణ్యక్షేత్రం జల ధార వద్ద పరిశోధకుడు డా. కృష్ణ గోపాల్.

 

మల్లెల తీర్థ దేవస్థానం.

(ఈ స్థలలో పురాణం వివరించిన వారు : అప్పపురం తోకల పెద్ద లింగయ్య, లింగాల మండలం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా, 20-04-2014).

6. చెంచుల వారి భక్తి గేయసాహిత్యం: 

6.1 శ్రీశైల మల్లేశా  (భక్తిగేయం)

శ్రీశైల మల్లేశా ! నువ్వు కంటికి కానరావేమయ్యా
పాలధార, పంచధార ఎందున్నావు
పాతాళగంగలో జలకాలాడావా
నిత్యమైన కోవెలలో కొలువుతీరి వున్నావా
నీ భక్తుల నందరికి దీవించుతున్నావా ॥ శ్రీశైల ఓ మల్లేశా ॥ 
జల జల పారే సెలయేరులందు తిరిగేవా
జారుడు బండలపై కొలువుతీరి వున్నావా
నిన్ను చూసి కోయిలమ్మ పాటపాడేనా
అందమైన ఆ నెమలి ఆటలాడేనా
ముచ్చటైన కుందేళ్ళు నీ చుట్టు తిరిగేనా
అందమైన పావురాళ్ళు నిన్నుకోరి నవ్వేనా
నువ్వు జీవరాసులు దీవించే దేవుడవయ్యా   ॥ శ్రీశైల ఓ మల్లేశా ॥ 
పదితలల రావణాసురునికి వరమునే ఇచ్చేవే
లోకాన్ని భస్మంచేయు బస్మాసురునికి వరమునే ఇచ్చేవే
రాక్షసులకే కనిపించి వరము నువ్వు ఇచ్చేవే
ఈనాటి మానవులకు నువ్వు కనిపించి కనికరించకున్నావు ॥ శ్రీశైల ఓ మల్లేశా ॥

సందర్భం :

చెంచుల ఇష్టదైవం శ్రీశైల మల్లేశుడు. వీరు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. చెంచు నరసింహ అహోబిలం స్థానికవాసి గొప్ప శివయ్య భక్తుడు. తన స్వామిని తలచుకొంటూ తన ఆత్మలో శివనామస్మరణ చేస్తూ వ్రాసుకొని పాడిన గేయం ఇది. చెంచు వారోత్సవాలు (2013) సందర్భంగా పాడిన భక్తిగేయం. చెంచు వారోత్సవాలు శ్రీశైల సన్నిధిలో జరిగాయి.

వివరణ :

శ్రీశైల మల్లేశా ఎచట ఉన్నావు, కంటికి కనపడవు, పాలధార, పంచధారలో ఉన్నావా! లేక పాతాళగంగలో జలకాలాడుతున్నావా (స్నానం చేస్తూ ఆడుకుంటున్నావా!) లేదా, నిత్యం పూజించే నీ గుడిలోనే ఉన్నావా ! నీ భక్తులును దీవిస్తున్నావా ! జలజల పారే సెలయేరులందు తిరుగుతున్నావా.! జారుడుబండపై తిరుగుతున్నావా ! నిన్ను చూసి కోయిలమ్మ పాట పాడుతుందా! అందమైన నెమలి ఆటలాడునా ! ముచ్చటైన కుందేళ్ళు నీ చుట్టూ తిరుగుచున్నవా ! అందమైన పావురాళ్ళు నిన్ను కోరుకుంటున్నాయా ! నువ్వు జీవరాశులను దీవించే దేవుడవయ్యా, రాక్షసులైన రావణాసురునికి, భస్మాసురులకు వరమునే ఇచ్చావే వారి కంటికి కనిపించావే ఈనాటి మానవులకు కనిపించి ‘‘ కనికరించుకున్నావు. ఇది ఎక్కడి న్యాయం దేవా ! శ్రీశైల మల్లేశా కనిపించవయ్యా అని భక్తుడు కోరుకున్నాడు. ఇది భక్తి రస ప్రధానమైన గేయం.

(పాడినవారు: చెంచు ఎస్‌. నర్సింహ 46 సం॥, అహోబిలం, ఆళ్ళగడ్డ (మం), కర్నూలుజిల్లా, 28-02-2013)

6.2 ఏమమ్మా మల్లెలమా !

ఏమమ్మా అడవిలో ఉండే మల్లలమ్మ
సల్లంగా మమ్ములను కరునించవమ్మా
సల్లంగా మమ్ముల దీవించవమ్మా
పిల్లలము పెద్దలము నీ గుడికి వచ్చేమమ్మా
నిండు ఒక్క పొద్దుల తోటి నీ పూజను చేసేమమ్మా ॥ ఏమమ్మా అడవిలో ॥
టెంకాయలు అయినాగాని నీ గుడికే తెచ్చెమమ్మా
కోడిపుంజులైనా గాని నీ గుడికే తెచ్చెమమ్మా
మేకపోతులైనా గాని మీ గుడికే తెచ్చేమమ్మా
పొట్టెండ్లను అయినాగాని మీ గుడికే తెచ్చేమమ్మా ॥ ఏమమ్మా అడవిలో ॥ 
చెంచుగడ్డ తొవ్వినగాని మల్లలమ్మ అని తలచేము
జుంటు తేనేలేపిన గాని మల్లెలమ్మా అని తలచేము ॥ ఏమమ్మా అడవిలో ॥
పెద్ద తేనే లేపినగాని మల్లెలమ్మ అని తలచేము
తప్సి బంక తీసినగాని మల్లెలమ్మ అని తలచేము ॥ ఏమమ్మా అడవిలో ॥

సందర్భం :

జీవనవృత్తిని కొనసాగించడానికి చెంచులు అడవికి వెళ్తారు. అక్కడ ఎటువంటి ఆటంకాలు కీడు రాకూడదని అడవితల్లి మల్లలమ్మను ప్రార్ధించే సందర్భంలోనిది ఈ గేయం.

వివరణ :

ఏమమ్మ అడవిలో ఉండే మల్లలమ్మ, మమ్ములను చల్లంగా ఉండే విధంగా దీవించుతల్లి పిల్లలము-పెద్దలము నీ గుడికి వచ్చేమమ్మా ! పూర్తిగా ఒకరోజు ఉపవాసం ఉండి పూజచేస్తామమ్మా! టెంకాయలు తెచ్చి కొడతాము తల్లి నీ కొరకు కోడిపుంజును, లేదా మేకపోతును గాని, పొట్టెండ్లను గాని తెచ్చి నీకు సమర్పిస్తాము తల్లి! అడవికి వచ్చి చెంచుగడ్డ (మొరంగడ్డ) తొవ్వినగాని మల్లలమ్మా! అని తలచేము, జుంటు తేనె లేదా చిన్న తేనె లేపిన గాని మల్లలమ్మా ! అని తలచుకుంటాము పెద్దతేనె, తప్సిబంక తీసినగాని మల్లలమ్మా ! అని తలచుకుంటాము తల్తీ మల్లలమ్మా ! మమ్ములను సం ! అని అడవి దేవతను స్మరించుకుంటారు.

(పాడిన వారు : చెంచు వ్యల్లమ్మ 56 సం॥ సున్నిపెంట, శ్రీశైలం, కర్నూలు జిల్లా 27-03-2013) 

6.3 శ్రీశైల మల్లన్న (భక్తి జానపదం)

అన్నన్న మల్లన్న దేవుడు మల్లన్న, మాదేవుడు మల్లన్న
దండిగ మేము వచ్చేమయ్య అందుకోవయ్యా
చెంచుల పూజలు అందుకోవయ్యా
అడవి మల్లెపూలు తెచ్చి పూజలు చేసేము,
సామి నిన్నే వేడేము ॥ అన్నన్న మల్లన్న ॥
తులసి మాలలన్ని నీ మెడలో వేసేము
స్వామి నిన్నే వేడేము
దండిగ మేము వచ్చేమయ్య చెంచుల పూజలందుకోవయ్యా ॥ అన్నన్న మల్లన్న ॥  

పాతాళగంగలోన జలకాలాడేము స్వామి నిన్నే వేడెదము
దండిగ మేము వచ్చేమయ్య చెంచుల పూజలందుకోవయ్యా ॥ అన్నన్న మల్లన్న ॥ 
నలమల్ల నల్లనినేరెడి పండ్లు తెచ్చాము
ఆరగించి మమ్ము కాపాడయ్యా
దండిగ మేము వచ్చామయ్య చెంచుల పూజలందుకోవయ్యా॥ అన్నన్న మల్లన్న ॥ 
బిల్వ, మారెడి దళాలు తెచ్చాము
నీ పూజకు సమర్పించాము
మమ్ము ఆదుకోవయ్యా రక్షించయ్యా
దండిగ మేము వచ్చేమయ్య చెంచుల పూజలందుకోవయ్యా ॥ అన్నన్న మల్లన్న ॥
సిరియాలుని, తిన్నని కథలు విన్నావా
ధూర్జటి భక్తి కన్నావా, వారి కంటె గొప్ప భక్తి
మాలో ఉంది, కరుణించయ్యా, దయచూపయ్యా
కాపాడయ్యా, రక్షించయ్యా
దండిగ మేము వచ్చేమయ్య చెంచుల పూజలందుకోవయ్యా ॥ అన్నన్న మల్లన్న ॥

సందర్భం :

శ్రీశైల చెంచు మల్లన్నను శివరాత్రి పండుగనాడు స్మరిస్తూ పాడిన భక్తిరసప్రధాన గేయం. 

వివరణ :

ఓ అన్నా మల్లన్న మేము చాలా మందిమి నీ పూజ చేయడానికి వచ్చాము, మా చెంచుల పూజ అందుకోవయ్యా, నీ కోసం అడవి మల్లెపూలు తెచ్చాము, పూజలు చేశాము, తులసి మాలలన్ని మెడలో వేశాము, పాతాళగంగలో స్నానం చేసి వచ్చాము. స్వామి నిన్నే వేడుకుంటున్నాము. మా కోరికలు తీర్చు దేవా ! చాలామంది చెంచులము వచ్చాము, మా పూజ అందుకోవయ్యా నలమల్ల నల్లనేరెడి పండ్లు తెచ్చాము, ఆరగించి మమ్ము కాపాడయ్యా, బిల్వ, మారెడి దళాలు తెచ్చాము నీ పూజకు సమర్పించాము, మమ్ము ఆదుకోవయ్యా, రక్షించయ్యా. దండిగ మేము వచ్చాము. చెంచుల పూజ అందుకోవయ్యా, సిరియాలుని, తిన్నని కథలు విన్నావా! ధూర్జటి భక్తి కన్నావా ! వారి కంటె గొప్ప భక్తి మాలో ఉంది, కరుణించయ్యా, దయచూపయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా. చాలామందిమి వచ్చేమయ్యా చెంచుల పూజలందుకోవయ్యా, అన్నన్న మల్లన్న మా దేవుడు అని శ్రీశైల మల్లన్నను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 

(రచన, పాటన వారు: ఎస్‌. నర్సింహ సంగమేని, 46 సం॥ అహోబిలం, ఆళ్ళగడ్డ (మం), కర్నూలు జిల్లా, 25-04-2013)

6.4 జాతర

జాతరమ్మో జాతరో కళా జాతర
ఇది కల్లాకపటము ఎరుగని చెంచోళ్ళ జాతర
ఎండలనక వానలనక జంతువులతో జీవాలతో
పోరుచేసిన బతుకులే బతుకుతుంటే,
మాకాడ వెలసినాడు మమ్మెలే ముక్కంటుడు
మాచేతి పూజలందే మమ్మేలే మల్లేశ్వరుడు ॥ జాతరమ్మో, జాతర ॥
దుర్మార్గం రాక్షసుడు దుశ్చర్యలు జరుపుతుంటే సింహరూప
మెత్తినాడు రాక్షసున్ని చంపినాడు
మా చెంచు చిన్నారిని మనుమాడిన ఆ దేవుడు మమ్మేల
అహోబిలంలో సక్కంగా వెలసినాడు
ఇది ఆ దేవదేవుని నరసింహుడి జాతర, జాతరమ్మో,
జాతర, జాతరన్మో జాతర
కూడు లేక గుడ్డలేక రోగాలతో రొచ్చులతో బాధపడే చెంచోళ్ళు
ఆ చెంచోళ్ళను ఆదుకునే గిరిజన సంస్థ జాతర
జాతరమో జాతర, జాతరన్నో జాతర.

సందర్భం :

శ్రీశైల చెంచు మల్లన్న మరియు అహోబిలం నరసింహస్వామి జాతర జరిగే సమయంలో పాడిన గేయం ఇది.

వివరణ :

జాతరమ్మో జాతర కళా జాతర, ఏమి తెలియని అమాయకుల చెంచోళ్ళ జాతర. ఎండనక, వాననక జంతువులతో, జీవిలతో సావాసం చేస్తూ బతుకు వెళ్ళదీస్తూ ఉంటే మా దగ్గర వెలిశాడు, మా శ్రీశైలంలో వెలిశాడు మమ్ములను ఏలే మూడు కన్నుల మల్లేశ్వరుడు మాచేత పూజలందుకుంటున్నాడు. దుర్మార్గపు రాక్షసులు దుశ్చర్యలు చేస్తుంటే సింహరూపందాల్చి, రాక్షసుల్ని చంపినాడు. మా చెంచుపిల్ల లక్ష్మమ్మను మనుమాడిన (వివాహం) ఆ దేవుడు మమ్మేలే మాస్వామి నరసింహుడు అహోబిలంలో సక్కంగా వెలిశాడు. అతడి జాతరకు రండమ్మో రండి జాతరమ్మో జాతర. కూడు లేక గుడ్డ లేక రోగాలతో రొప్పులతో బాధపడే చెంచోళ్ళను ఆదుకునే గిరిజన సంస్థవారి జాతర. రండి చూడండి వారి యొక్క అభివృద్ధి పనులను, చూసి ఆనందించండి అంటూ చెంచులవారు పాడిన గేయం ఇది. ఈ గేయాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థవారు ఏర్పాటు చేసిన చెంచు వారోత్సవాలలో పాడిన భక్తిగేయం. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ వారోత్సవాలు 2013లో జరిగాయి. 

(రచన, పాడినవారు: ఎస్‌. నర్సింహ, సంగమేని), 46 సం. అహోబిలం, ఆళ్ళగడ్డ (మం), కర్నూలు జిల్లా, 26-04-2013) 

7. ముగింపు:

  • భారతదేశంలో నివసిస్తున్న నాగరిక జాతులతో పాటు ఆదిమ తెగలు ఈ నాటికి తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కుంటున్నాయి. ఆదిమ జాతుల్లో ఒకటైన చెంచులది విశిష్టమైన గిరిజన తెగ, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, వస్త్రదారణ, మాట తీరు ఇతర గిరిజన తెగలకు భిన్నంగా ఉంటుంది.
  • చెంచులు మొదట సంచార జీవులుగా వుండి తరువాత పెంటలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, నాగరిక సమాజానికి దూరంగా అడవిలోని గూడేలలో (తుండా (పెంట) నివసిస్తున్నారు.
  • వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి పరిధిలో ఉన్న దేవాలయాలలో వీరే పూజారులుగా ఉండి, పూజా విధానాలను నిర్వర్తిస్తారు. ఉదా: శ్రీశైలం, సలేశ్వరం, మల్లెల తీర్థం పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజు చెంచు దేవరనే మొదటి పూజ నిర్వహించిన తరువాత కార్యక్రమం పారంభం అవుతుంది. ముఖ్యంగా సలేశ్వర పుణ్య క్షేత్రం, మరియు మల్లెల తీర్థం పుణ్యక్షేత్రాలు వీరి ఆధీనంలో పూర్తిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆచట. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమినాడు చెంచుల జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతర పండుగ (5) ఐదు రోజుల వరకు ఉంటుంది.
  • ఇక చెంచుల వారి గేయ సాహిత్య విషయానికి వస్తే చెంచుల వారు గేయ సాహిత్య ప్రియులు. వీరు ఎక్కువగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. వీరు జనపదులది జానపద సాహిత్యమైతే, వీరిది ఈ చరాచర సృష్టి మెచ్చుకునే పదసాహిత్యం. వీరి యొక్క సాహిత్యంలో ఎంతో నిగూఢ అర్థ, తాత్పర్థ్యాలు, కథా విశేషాలతో కూడుకొని ఉన్న పదాల అల్లిక కనిపిస్తుంది. వీరు పెద్దగా చదువు కోకపోవచ్చును కాని జీవిత పాఠాలనే నేర్చుకున్న నివురు గప్పిన నిప్పులు సాహితీమూర్తులు. వీరు దైవ ఉత్సవాలలోను, పండుగలలోను, పోడు వ్యవసాయ సంబంధమైన పనులు చేసే సమయాలలో చెంచులు పాడే గేయాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే చెంచులు అంతరించిపోతున్న జాతులలో మొదటి వారు. వీరిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మర్చిపోరాదు. 

8. పాదసూచికలు:

చెంచుల చరిత్రను తెలియజేసే పుణ్యక్షేత్రాలు. గేయ సాహిత్యమును చెంచుల ద్వారా సేకరించిన మౌఖిక సాహిత్యం. సేకరణ: డాక్టర్. కృష్ణ గోపాల్. (చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన.) థి సె స్ గ్రంథం. అ ముద్రితం. 2018. పు.ట.29 నుండి 38.

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అహోబిలం జాతర గేయం పాడినవారు ఎస్ నరసింహ చెంచు 46 సంవత్సరాలు అహోబిలం, ఆళ్లగడ్డ మండలం. కర్నూలు జిల్లా, 28-02-2013
  2. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి చరిత్ర. ఉడుతనూరి లింగయ్య 60 సంవత్సరాలు అమ్రాబాద్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా.13-02-2013. సేకరణ డాక్టర్ కృష్ణ గోపాల్.
  3. ఏమమ్మా మల్లెలమ్మ. గేయం పాడినవారు చెంచు ఎస్ నరసింహ 46 సంవత్సరాలు అహోబిలం ఆళ్లగడ్డ మండలం కర్నూలు జిల్లా 28-02-2013.
  4. చెంచుల చరిత్రను తెలియజేసే పుణ్యక్షేత్రాలు. ఇది మౌఖిక సాహిత్యం మౌఖికంగా వివరించిన వారు చెంచు గురవయ్య 55 సంవత్సరాలు. సేకరణ డాక్టర్ కే కృష్ణ గోపాల్ చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన థిసెస్ గ్రంథం. పు. ట. 29,30,31.
  5. చెంచుల దైవం సలేశ్వరం పుణ్యక్షేత్ర చరిత్ర తోకల మల్లయ్య చెంచు గురు స్వామి ( పూజారి) 68 సంవత్సరాలు సలేశ్వరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా.26-03-2014.
  6. చెంచుల పుణ్యక్షేత్రం మల్లెల తీర్థం. తోకల పెద్ద లింగయ్య అప్పాపురం గ్రామం. లింగాల మండలం. కర్నూలు. జిల్లా. 20-04-2014.
  7. చెంచుల వారి భక్తి గేయం సాహిత్యం. శ్రీశైల మల్లేశా. పాడినవారు చెంచు ఎస్ నరసింహ 46 సంవత్సరాలు అహోబిలం ఆళ్లగడ్డ మండలం కర్నూలు జిల్లా.28-02-2013.
  8. నల్లమల ప్రాంత చెంచుల చరిత్రను తెలియజేసే పుణ్యక్షేత్రాలు, గేయ సాహిత్యం. ను పూర్తిగా చెంచుల ద్వారా సేకరించినటువంటి మౌఖిక సాహిత్యం.  సేకరించిన వారు: డాక్టర్ కే కృష్ణ గోపాల్.
  9. శ్రీశైల చెంచు మల్లన్న చరిత్ర మళ్లీ పాపమా 78 సంవత్సరాలు పాలుట్ల గ్రామం కర్నూలు జిల్లా 02-02-2013

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]