AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. గురజాడ, దాశరథి కథలు: కవిత్వాంశాలు

డా. సంగి రమేష్
ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9440447737, Email: rameshsangi.sangi@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కథకు, కవిత్వానికి మధ్య ఒక సన్నని విభజనరేఖ ఉన్నది. దాన్ని చేరిపేసినవారు ఉన్నారు. పాటించినవారూ ఉన్నారు. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉన్న మాట వాస్తవం. ప్రాచీన కాలం నాటి సాహిత్యంలో చూసినా కవిత్వంలో కథ కనిపిస్తుంది. కథల్లో కవిత్వం కనిపిస్తుంది. ఆధునిక తెలుగు కథల్లో కూడా ఈ కవిత్వపు ఛాయా కనిపిస్తుంది. మన కథకులలో చాలా మంది కవులు కావడం వలన వారు రాసిన కథల్లో అనివార్యంగా ఈ కవిత్వం అక్కడక్కడ తొంగి చూస్తుంది. కథకు ఒక చక్కని వాతావరణాన్ని, గాఢతను కల్పించడానికి కథల్లో కవిత్వం చాల కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణ వచనంలో ఎన్నో పేజీల్లో చెప్పలేని విషయాన్ని కొన్ని కవితా వాక్యాల్లో చాలా బలంగా చెప్పవచ్చు. అందుకే మన తెలుగు కథకులు ఆ మాటకు వస్తే భారతీయ భాషలలోని అనేక మంది కథకులు తమ కథల్లో కవిత్వాన్ని ఎంతో ఒడుపుగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో గురజాడ, దాశరథి కథల్లోని కవిత్వ ఛాయల్నిఎత్తి చూపడమే ఈ వ్యాస ఉద్దేశం. ఈ పరిశోధనా వ్యాసంలో విశ్లేషణ పద్ధతిని పాటించడం జరిగింది.
Keywords: కథ, కవిత్వం, గురజాడ, దాశరథి, గాఢత, కథా వాతావరణం.
1. ఉపోద్ఘాతం:
ప్రాచీన కాలంలో కవిత్వానికి, కథకు విడదీయరాని సంబంధం ఉండేది. పురాణేతిహాసాలన్నీ కథతో కూడుకున్నవే. ప్రబంధాల్లోని పెద్ద కథ నవలగా, లఘుకావ్యాల్లోని చిన్న కథ ఆధునిక కాలంలో కథానికగా పరిణమించాయని వాదించే వారు లేకపోలేదు. నేటి కాలంలో కవిత్వం నుంచి కథ విడివడిoది. ఇప్పుడు కథలేని శుద్ధ కవిత్వం వెలువడుతోంది.
ఆధునిక కాలంలో కవిత్వానికి కథకు ఉండే సంబంధం గీతిక (Lyric)కు కథకు ఉండే సంబంధంలాంటిది. విషయ ప్రధానమైన కథలో కవితాభివ్యక్తికి అంతగా చోటుండకపోవచ్చు. కాని కథ నుంచి కవిత్వాన్ని పూర్తిగా వెలివేయడం అంత మంచిది కాదు. కథా వస్తువు ఎంపికలో, సన్నివేశాల కల్పనలో, పాత్రోన్మీలనంలో, వాతావరణ చిత్రణలోని Space ను కవిత్వం భర్తీ చేయగలుగుతుంది. కథలో ఒకానొక ‘మూడ్’ను సృష్టించి రచయిత దాన్ని Sustain చేయడానికి కవిత్వం ఎంతో దోహదం చేస్తుంది. కవి అయిన కథకుడు చక్కని కథను రాయగలుగుతాడు. ఒక రచయిత కవి, కథకుడు రెండూ అయినప్పుడు అతని రచనల్లో ఈ రెంటి ప్రభావం పరస్పరం పడుతుంది. కవిత్వం మీద కథ ప్రభావం కంటె, కథ మీద కవిత్వ ప్రభావం ఎక్కువ పడుతుంది. మేధావితనం తక్కువ, భావుకత ఎక్కువ ఉండే కథకుల రచనల్లో కవిత్వం ఎక్కువ తొంగి చూస్తుందనే అభిప్రాయం ఒకటుంది. కవిత నుంచి పుట్టిన కథలున్నాయి. కథ నుంచి పుట్టిన కథలున్నాయి.
శ్రీపాద వాతావరణ చిత్రణకు కవిత్వాన్ని తెలివిగా వాడుకున్నాడు. కథకుడైన చలం ‘కవిగా చలం’గా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కథా వస్తువే కవిత్వమై ‘ఓ పువ్వు పూసింది’. కవిత్వం మీద ఎనలేని అభిమానం ఉండి కూడా దాన్ని కథకు దూరంగా ఉంచిన వాడు కొడవటిగంటి కుటుంబరావు. కవిత్వాన్ని కథా వస్తువుని బుచ్చిబాబు బ్యాలెన్స్ చేశాడు. రావిశాస్త్రి వచనానికి కవిత్వానికి మధ్యన ఉండే సరిహద్దుల్ని చెరిపివేశాడు. చాసో ‘మాతృహృదయం’, దిగంబర కవి నగ్నముని రాసిన ‘విలోమకథ’, ‘సిమెంట్ సంతతి’ చదివితే కవిత్వంతో కథను ఎంత పరిపుష్టం చేయవచ్చో తెలిసివస్తుంది.
2. గురజాడ కథలు - కవిత్వం:
గురజాడ, దాశరథిలు ఇద్దరూ కవులు, కథకులు రెండూ కావడం మూలంగా వారు రాసిన కథల్లో అనివార్యంగానే కవిత్వం తొంగి చూసింది.
2.1 మీపేరేమిటి?
‘మీ పేరేమిటి?’ కథలో “గురువుగారూ మేమూ కలిసినప్పుడల్లా స్వర్గ ఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది”1 అంటాడు ఒకచోట. దీని వలన రచయిత గురు శిష్యుల కలయిక ఎంత మాధుర్యంగా ఉంటుందో చెప్తాడు. దానికి మంచి పోలికను తేవడంలో కవిత్వం లీలగా కనిపిస్తుంది. ఇదే కథలో మరోచోట ‘‘దేవతలు పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టు చెదిరి వెలిగెను”2 అంటాడు. ఆ సమయంలో ఆకాశాన చుక్కలు ఎలా వున్నాయో చెప్తూ రచయిత ఆ సందర్భాన్ని మరింత వెలిగిస్తాడు. ఇందులోనే వేరొక చోట ‘‘ఆ ఉభయుల కీర్తి దిగ్దంతులకు వెల్ల వేసినది”3 అంటాడు. కీర్తి దిగంతాలను తాకడంతో అక్కడ తెల్లదనం వెల్లివిరియడంలోనే కవిత్వం దాగి ఉంది. ఇంకోచోట ‘‘శరభయ్యకు కంట్లో మిరపకాయలు రాసుకున్నట్లు వుండెను”4 అంటాడు. శరభయ్యలో కలిగిన ఈర్ష్య, అసూయలను చెప్పడానికి ఇంతకంటే గొప్ప కవితాత్మక పోలిక మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కథలోనే ‘పెళుసు గొంతుక’5, ‘మాట మీద నడుస్తారు6.’ లాంటి కవితా ప్రయోగాలు కనిపిస్తాయి.
2.2. దిద్దుబాటు:
‘దిద్దుబాటు’ కథ శీర్షికలోనే కవిత్వం పొంగి పొర్లుతుంది. ‘కమలిని’ అనే పేరు కన్నా దిద్దుబాటు పేరులో ఒక కవితాత్మకత మనకు తెలియకుండానే మన మనుసుకు తాకుతుంది. ఈ కథలో అతి తక్కువ కవితా వాక్యాలున్నా, ఉన్నవి కూడా చాలా కవితా గంభీరతతో ఉన్నాయి. ‘‘గదినీ, అతని మనస్సును కూడ చీకటి క్రమ్మెను”7 అని ఉంటుంది. కథలోని గోపాల్రావు ఇంటికి వచ్చేసరికి భార్య కమలిని ఇంట్లో లేదు. ఆ సమయంలో ఇల్లే కాదు, అతని మనసును కూడా చీకటే ఆవరించి పోయిందని ఆ పరిస్థితిలో గోపాల్రావు మానసిక స్థితిని వ్యక్త పరచడానికి ఈ వాక్యాన్ని చాలా ఒడుపుగా ప్రయోగించాడు రచయిత.
ఇక కథ ముగింపులో ‘‘అచట మంచం కింద నుండి అమృత నిష్యందినియగు కలకల నగవును, కరకంకణముల హృద్యారావమును విననయ్యెను.’’8 ఈ చివరి కవితా వాక్యమే తెలుగు కథకు దిక్సూచిలా నిలిచిపోయింది. కవిత్వంలోనే కాదు, కథలో కూడా ధ్వని ప్రాణప్రదమైందని నిరూపించిన వాక్యం ఇది. ఈ కవితాత్మక వాక్యంతో ముగియడం వలననే ఈ కథకు చాలా బలం చేకూరింది. ఎన్నో పేరాల్లో కూడా చెప్పలేనంత ఒడుపుగా చివరి ఒక్క వాక్యంతో చెప్పడం కనిపిస్తుంది.
2.3 మెటిల్డా:
మెరుపు తీగ లాంటి ‘మెటిల్డా’నే కాదు కథ కూడా మెరుపుతీగలాగానే ఉంటుంది. కథంతా ఒక నిగూఢ కవితా వాక్యాలతో కదిలిపోతుంది. ‘మేని సొంపు నెమలి పింఛం వలె ఒడలును కమ్మి”9 అంటూ ఆమె శరీర కాంతి ఎంత సొగసైనదో చెప్తాడు. మెటిల్డాను వర్ణించే ఈ సన్నివేషంలో పడిన వాక్యాలన్ని ఇంచు మించు కవితాత్మకంగానే సాగిపోయాయి. “మల్లెపువ్వులాంటి బట్టలు కట్టి బడికి పోతూ, మెటిల్డా ఇంటి ఎదుట జాలంగా నడుస్తూ ఉంటిని.’’10 అంటాడు. గంధర్వ కన్నెలాంటి మెటిల్డాను చూడడానికి ఈ మాత్రం ముస్తాబు అవసరమే. మల్లెపూవులాంటి బట్టలు కట్టడం కూడా ఇక్కడ బాగా నప్పుతుంది.
2.4 సంస్కర్త హృదయం & సౌదామిని:
సంస్కర్త హృదయం’లో కూడా కవితాంశ ఉంది. కథలో వాడిన కవితా వాక్యాలు తక్కువే అయినా స్థూలంగా ఈ కథ నిండా కవిత్వాంశ తొంగి చూస్తుంది. ‘మతము`విమతము’, ‘సౌదామిని’కథల్లో కూడా కవితా వాక్యాలు తక్కువ. అయితే ఓవరాల్‌గా ఈ కథలు కూడా కవిత్వపు ఛాయలు కనిపించే కథలే.
3. దాశరథి కథాశరధి - కవిత్వం:
డా॥ దాశరథి కృష్ణమాచార్య రాసిన కథలు చాలా తక్కువ. ఆయన రాసిన కథలు నాలుగే. అందులో ఒకటి అనువాద కథ. మూడు స్వతంత్ర కథలు. ఈ నాలుగు కథలు ఎంతో వస్తువైవిధ్యంతో ఉన్నాయి. దాశరథి కవిత్వంలో ఎలా ఉత్తేజకరంగా విప్లవ భావాలను పలికించగలడో, మైదానంలో ప్రవహించే నదీ ప్రవాహంలాంటి కథల్లో కూడా అంతే ప్రతిభావంతంగా విప్లవ భావాలను ఎత్తి చూపగలడు. దాశరథి కవిత్వం ఎంత ప్రవాహ వేగంతో ఉంటుందో కథ అంత మెత్తగా, గంగమ్మ తల్లి చల్లగా ప్రవహిస్తూనే గట్లు కోసినంత లలితంగా ఉంటుంది. ఆయన కవిత్వంలోలాగే ఆయన కథల్లో కూడా అంగారం, శృంగారం సమానంగా ఉంటాయి.
3.1 మోదుగుపూలు:
దాశరథి రాసిన మొదటి కథ ‘నిప్పుపూలు. ‘మోదుగుపూలకు ‘నిప్పుపూలు’ అని పేరుపెట్టడంలోనే ఎంతో కవిత్వం దాగి ఉంది. వీటినే మహాకవి కాళిదాసు ‘అగ్నిపుష్పాలు’ అన్నాడు. రక్తతర్పణం చేసిన ఉద్యమకారులకు ప్రతీకలే ఈ నిప్పుపూలు. ఈ కథంతా నైజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనం అయిన తరువాత జాగీర్దార్ల వ్యవస్థ కుప్పకూలాక జాగీర్దార్ల భార్యల దీన పరిస్థితికి అద్దం పడుతుంది.
జాగీర్దార్ అక్తర్ జంగ్ భార్య అయిన బేగం సాహిబా ఒకనాడు ఎక్కడో పల్లెటూళ్లో ఉన్న తన బంగళాకు వచ్చినపుడు “పడమర వైపు విచ్చుకొన్న బంగళా కిటికీలలోనించి ఎర్రటి సాయంత్రం కనబడుతున్నది”11 అని వర్ణించాడు దాశరథి. పడమర ఆకాశానికి అవతలగా ఎర్రగా పూచిన మోదుగుపూల గుంపు వలన బేగంకు ఆ సాయంత్రం అలా కనిపించింది.
ఇంకా ‘‘మోదుగు మొగ్గల్లో చల్లారని నిప్పు. ముట్టుకున్నా కాలని ఆ చల్లని నిప్పుతో అరణ్యం ఎంత అందంగా వుంది!!’’12 అన్నాడు. “ఎరుపు ఉద్యమానికి ప్రతీక. అడవిలో పూచే పల్లె ప్రజలు ఆదరించే ఎర్రని మోదుగులు శాంతియుత పోరాటానికి ప్రతీక అంటాడు దాశరథి. మరి ఆ కవి రచయిత శాంతి అహిoసలను ప్రేమించేవాడు. ఎప్పటికైనా రక్తపాతం కన్నా శాంతి అహింసలు జయిస్తాయని నమ్మిన గాంధేయుడు దాశరథి. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని ఆ తర్వాత వచ్చిన మార్పులను దాశరథి ఈ కథలో బేగం పాత్ర ప్రధానంగా చేసి ప్రతీకాత్మకంగా రచించాడు. ప్రతీకాత్మకత చిత్రణలో దాశరథి ఈ కథలో మంచి శిల్పాన్ని సాధించాడు.”13 అంటారు డా. ముదిగంటి సుజాతారెడ్డి.
కథ కొంచెం ముందుకు జరిగిన తరువాత ‘‘కొప్పులో నాలుగు మోదుగు మొగ్గలు చెక్కింది. పడమటి ఆకాశం గౌరి కొప్పులో నవ్వింది”14 అన్నాడు. విశాలమైన ఆకాశాన్ని తీసుకొచ్చి కొప్పులో నవ్వ్వింది అని చెప్పిన ఈ వాక్యంలో ఎంతో కవిత్వపు కాంతి ప్రకాశించింది. కథ ఇంకా కొంచెం జరిగిన తరువాత ‘‘తూరుపు ఆకాశం, సబ్బుతో నల్లని మొహం తోముకుంటోంది.. గాలి దెబ్బకు నాట్యం చేసే దీపజ్వాలలు”15 అని కొనసాగుతుంది. ఆకాశం నిండా రాత్రి నుంచి పరచుకున్న నల్లని చీకటి ఉషోదయం కాగానే సబ్బుతో కడుక్కున్న నల్లని మొహంలాగా తళతళ లాడిందని చెప్పడానికి ఎంతో కవితాత్మకమైన వాక్యాన్ని ప్రయోగించాడు రచయిత.
“దాశరథి మహాకవి. అందువల్ల కవిత్వ సంబంధమైన తళుకులు వచన ప్రక్రియ అయిన కథలో కూడా కనిపిస్తాయి. ప్రధానంగా ‘నిప్పుపూలు' అనే కథ పేరులో కూడా కవితాత్మకత ఉంది. మార్చి నెలలో పూసే మోదుగుపూలు ముదురు ఎరుపులో అగ్నిశిఖల్లాగా కనిపిస్తాయి. ‘పూచిన మోదుగుoబువులు పుక్కిటి నుండి వసంత రాజు రక్తాచమనంబుసేయు” అంటారు రుధిర సంధ్య కవితలో.”16 అంటూ దాశరథి రచించిన ‘నిప్పుపూలు' కథ గొప్పదనాన్ని వివరిస్తారు డా. అమ్మంగి వేణుగోపాల్. ఇలా కథంతా ఎక్కడ వీలైతే అక్కడ కవిత్వం తొంగిచూస్తుంది. కథకుడు కవి కావడం వలన సాధారణంగా చెప్పే సందర్భంలో కూడా కవితాత్మకంగా చెప్పడం వలన కథకు ఒక గాఢత వచ్చింది.
3.2 తెలంగాణ అమర వీరుని రక్తాంజలి:
దాశరథి రాసిన రెండవ కథ ‘తెలంగాణ అమర వీరుని రక్తాంజలి. దాశరథి చాలా చిన్న వయసు నుంచే నిజాం పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఈసడిoచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు రాసిన కవిత్వం, పద్యాలు, పాటలు ప్రజలను చైతన్య పరిచాయి. 1947లో నిజాం సర్కార్ దాశరథిని అరెస్టు చేసి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జైళ్లలో ఉంచింది. నిజామాబాద్ జైలులో దాశరథి అనుభవించిన శారీరక, మానసిక హింసలకు అక్షర రూపమే ఈ కథ. ఈ కథలోని కథానాయకుడు విశ్వం ఒక విధంగా దాశరథే. కథ ఎత్తుగడనే మంచి కవితా వాక్యంతో మొదలవుతుంది.
‘‘రక్తం కారుస్తున్న పశ్చిమాకాశం కిటికీలో నుంచి భయంకరంగా కనిపిస్తున్నది.’’17 అని కథలోని భీభత్స రస ప్రసక్తిని ముందే చెప్పేస్తాడు కథకుడు. విశ్వంను అక్కడి రజాకారులు కొట్టినపుడు ‘‘దవడల్లో నుంచి వచ్చే నెత్తురు కనిపించకుండా చీకటి అడ్డం వచ్చింది”18 అని వర్ణించాడు.
అంటే జైలులో దాడి చీకటిలో జరిగిందని చెప్తూనే విప్లవం కనిపించకుండా దౌర్జన్యం అనే చీకటి ప్రయత్నించిందని చెప్పడానికి ఈ వాక్యాన్ని ప్రయోగించినట్లు అర్థం అవుతుంది. ఆ రోజు రాత్రి ‘‘ఎన్నడూ లేనంత లోతుగా నిద్రపోయాడు విశ్వం.”19 అంటే విశ్వం ఎంతో అలసి పోయి చాలా గాఢoగా నిద్రపోయాడని చెప్పడానికి ‘లోతుగా' అనే మాటను కవితాత్మకంగా వాడుకున్నాడు.
“సూర్యగోళాన్ని తనవైపు లాక్కుంటున్నాడు…”20 నిరంతరం మండే స్వభావమున్న సూర్యుడిని తన వైపు లాక్కుంటున్నాడు అని చెప్పడంతో విప్లవాన్ని, ఉద్యమాన్ని తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకున్నాడని చెప్తున్నాడు రచయిత. “డొక్క వెన్నంటిన పేదరైతు కళ్ళలో మిరుగుళ్ళను వూది వూది మంటచేసి కాగడా వెలిగించి కింకోటి శిఖరానికి నిప్పు ముట్టిస్తున్నాడు విశ్వం…” 21 ఉద్యమాన్ని ఎలా రగిలించాడో చెప్పడానికి ఈ వాక్యం ఎంతో కవితాత్మకంగా తోడ్పడింది.
తను రాజేసిన మంట ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి రచయిత ఆ మంటను ఆకలితో అలమటించిపోతున్న పేదరైతుల కళ్ళలోని నెత్తుటి జీర నుంచి తీసుకోవడం గమనార్హం. “రక్తాణువులకు తిరుగుబాటు బోధిస్తున్నాడు…”22 జైలులోని ప్రతి మనిషిలో ఉద్యమాన్ని రగిలిoచాడని చెప్పడానికి ఈ వాక్యం ఎంతో దోహదం చేసింది. స్తబ్దంగా ఉన్న జైలులోని ఖైదీలందరూ ఉద్యమోన్ముఖులయ్యారు అనే ధ్వని ఇందులో కనిపిస్తుంది.
“దేశమంతా రాజద్రోహులే. దేశాన్ని జైల్లో కట్టేశాడు నిజాం..’’23 నిజాం నిరంకుశత్వాన్ని యావత్ తెలంగాణ వ్యతిరేకించింది. ప్రజలందరూ ఉద్యమంలో దిగిపోయారు. అందుకే నిజాం ప్రజలందరినీ జైలులో బంధిoచడానికి ప్రయత్నించాడు. దానితో తెలంగాణ అంతా జైలులో ఉండిపోయింది. ఈ కథలోనే ఒకచోట ‘‘లాఠీలు రక్తం తాగుతున్నై’, ‘ఆకాశం నోరు తెరిచింది’24 అంటాడు. “దాశరథి పంచ కావ్యాలు చదువుకున్న వ్యుత్పన్నుడు. ప్రకృతి మానవీయ స్పందనను వర్ణించటం ద్వారా ఒక సన్నివేశాన్ని లేదా సంఘటనను బలోపేతం చేయటం కవిత్వ ధోరణి ఉన్న రచయితల తత్త్వం.”25 అంటారు డా. అమ్మంగి వేణుగోపాల్.
ఇలా ఈ కథంతా కవితాత్మక వర్ణన ఉండడం వలన కథంతా ఎంతో గాఢంగా నడుస్తుంది. రచయిత, పాఠకుడిలో ఆశించిన కదలిక సులభంగా కలుగుతుంది. నిరంకుశత్వానికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మధ్య జరిగిన సంఘర్షణకు ఈ కథ ఒక నెత్తుటి జెండా. ప్రకృతికి మానవీయ స్పందనలను ఆపాదించడం వలన కథలోని ఆయా సన్నివేశాలు, సంఘటనలు ఎంతో హృద్యంగా కనిపిస్తాయి.
3.3 వెన్నెల్లో చీకటి:
దాశరథి రాసిన అనువాద కథ ‘వెన్నెల్లో చీకటి’. ఇదొక పంజాబీ కథ. ఈ కథ మూల రచయిత కర్తార్‌సింగ్ దుగ్గల్. భర్తతో అనురాగ బంధం లేని ఒక వివాహిత స్త్రీ ప్రేమ కథే ‘వెన్నెల్లో చీకటి’. ఈ కథలో మాలినీ అనే తల్లి, మున్నీ అనే కూతురుంటారు. వీరే ఈ కథలో ప్రధాన పాత్రలు.
‘‘ఇప్పటికీ తన అందం చూచి తన కోసం ఏడు సముద్రాలవతలి వింత పుష్పం తేవడానికైనా వెనుదీయని వాడొకడున్నాడు. కొండలు కరిగించి తేనె వాగులను ప్రవహింపజేయగలవాడూ ఉన్నాడు. ఎవరతడు?’’26 అని తన మీద మనసుపడ్డ ముత్యాల బేరగాడి గురించి ఆలోచిస్తుంది మాలిని. వసంతాలు గడిచిపోతున్నా తరగని తన అందం చూసి తనకే ముచ్చటేస్తుంది మాలినికి. ఇంత అందాన్ని వలచిన ప్రియుడి కోసం ధార పోయకపోతే ఎలా? పైగా వాడు వలపు జలపాతంలో ముంచి తెల్చేవాడు. ఇంతటి భావాన్ని ఎంతో పొయెటిక్ గా చెప్పడం దాశరథికే చెల్లింది.
‘‘వెన్నెల వేపకొమ్మల్లోంచి జల్లించినట్లు మాలిని మీద కురుస్తున్నది. ఏవో ఏవో ఆలోచనలు మత్తెక్కినట్లవుతున్నది... చంద్రుడు మొత్తానికి మొత్తం మాలిని వసారాలోకి దిగివచ్చాడా అన్నట్లు వెన్నెల పుచ్చపువ్వులా విచ్చుకుంది... లక్ష స్వప్నాలను కనురెప్పల్లో నింపుకుని వసారాలోకి వచ్చి కూచుంది... చుక్కలన్నీ తన కొప్పులో రాలినట్టు మెరుస్తున్నాయి”27
విరహంలో ఉన్న ప్రేయసీ ప్రియులకు వెన్నెల మరింత తాపాన్ని పెంచే దినుసు. అందుకే వెన్నెలను ఆలంభనగా తీసుకొని అప్పటి మాలిని మానసిక స్థితిని ఎంతో కవితాత్మకంగా చెప్తాడు రచయిత. ప్రేమలో ఉన్నవారెవరైనా ఎన్నో కలలు కంటారు. ఆ కలలకు మరిన్ని రంగులద్దేది వెన్నెల. అందుకే రచయిత మాలిని పాత్రలో చెలరేగే ప్రతి భావాన్ని వెన్నెలతో ముడి పెట్టి చెప్తున్నాడు. ఇలాంటి సదర్భంలో అసంకల్పితంగానే కవితా వాక్యాలు దొర్లిపోతుంటాయి. ఈ విధంగా ఈ కథలోని కవితాత్మక వాక్యాలు కథనంతా కవిత్వ పరిమళంతో నింపేశాయి. వెన్నెలలాగా కథంతా ఇలాంటి కవితా వాక్యాలు నిండి ఉండడం, కథలోని గూఢత పాఠకునికి నిజంగానే మత్తెక్కినట్లవుతుంది.
మరోచోట ‘మున్నీ నడిచే దానిమ్మ కొమ్మలాగా’28 ఉంది అంటాడు. ‘ఇల్లంతా బావురుమంటుంది’29 అంటాడు. ‘మాలిని మాటలు విని రాయైపోయింది’30 అంటాడు. ఈ కవితా వాక్యాలే కథను పాఠకునికి మరింత దగ్గర చేస్తుంది.
3.4 బదరి:
సామాజికతను, మనోవైజ్ఞానికతను, జానపదసౌందర్యాన్ని మేళవించి దాశరథి రాసిన అద్భుతమైన కథ ‘బదరి’. ఈ కథలో కూడా అక్కడక్కడ కవిత్వ వాక్యాలు తొంగి చూసి కథకు కొత్త అందాన్ని ఆపాదించిపెడుతాయి.
‘‘ఆకాశంలో చుక్కలు కిటికీ చువ్వలు పట్టుకుని, గది లోపలికి దూరడానికి ప్రయత్నిస్తున్నాయి. దయ్యంలా జుట్టు విరబోసుకుని, ఆకాశం తన నల్లటి ఇనుప చేతుల్తో చుక్కల్ని వెనక్కి లాగుతోంది”31 అంటూ కవితాత్మకంగా కథను మొదలుపెట్టి కథకు ఒక చక్కని వాతావరణాన్ని సృష్టిస్తాడు రచయిత.
ఆకాశంలో వెన్నెల లేదు. రేపు అమావాస్య అంటే ఇవాళ వెన్నెల ఎందుకుంటుంది? కాబట్టి చుక్కలే తమ సన్నని వెలుతురుతో కిటికీ గుండా రఘు గదిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని నల్లని ఆకాశం చుక్కలను రఘు గదిలో దిగకుండా అడ్డుకుంటున్నది. ఈ వాక్యాల్లో భవిష్యత్ కథా సూచన కూడా ధ్వనిస్తుంది. కథంతా సరళ వ్యావహారిక భాషలో కొనసాగినా కథ నిండా ఇక్కడే అని చెప్పలేని ఒక విధమైన కవితా పరిమళం పర్చుకుని ఉంది.
4. ముగింపు:
కథకులు కవులు కావడం మూలంగా, కవులు కథకులు కావడం మూలంగా అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. కథకు, కవితకు మధ్యన ఒక ఉల్లిపొరలాంటి విభజనరేఖ ఒకటి ఉంటుంది. అయితే కొందరు రచయితలు దాన్ని చెరిపేసి కవిత్వాంశతోనే అద్భుతమైన కవితాత్మక కథలు రాస్తున్నారు. సమర్ధవంతమైన కథకుడు తన కథలో కవితాత్మక ప్రయోగాలు చేసేటపుడు చాలా జాగరూకత అవసరం లేదంటే మొదటికే మోసానికి వచ్చి అసలు రంగు బయటపడుతుంది.
కథానిక తెలుగువారికి పరిచయమైన తొలి రోజుల నుంచి గురజాడను, కథానికా వికాస దశలో దాశరథిని ఆధునికంగా కలం పట్టుకున్న కథకులెంతో మంది అనుకరిస్తూనే ఉన్నారు. అందుకే వీరిద్దరి కథల్లోనే కాదు ఆ తరువాత వచ్చిన అనేక మంది తెలుగు కథకుల్లో ఈ కవితాత్మకథ తొంగి చూసి ఆయా కథలకు కొత్త ఫ్లేవర్‌ను తీసుకొచ్చి పాఠకులు మరిచిపోకుండా చేసింది.
సత్యం శంకరమంచి, వి.చంద్రశేఖరరావు, త్రిపుర, కెఎన్‌వై పతంజలి, అల్లం శేషగిరిరావు, పాపినేని శివశంకర్, పెద్దింటి అశోక్‌కుమార్, సతీష్‌చందర్, అఫ్సర్, ఖదీర్‌బాబు, మధురాంతకం నరేంద్ర, కుప్పిలి పద్మ, కె.ఎన్. మల్లీశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, పి. సత్యవతి, ఓల్గా, బెజ్జారపు రవీందర్, పసునూరి రవీందర్, కిరణ్ చర్ల, తదితరుల కథల్లో ఎన్నదగిన కవిత్వం ఉంది. పాఠకుకుడు ఆ దృష్టితో కథలను చదివితే ప్రతి కథలో కూడా ఎక్కడో ఒక దగ్గర కవిత్వం ఛాయ కనబడకపోదు.
5. పాదసూచికలు:
- గురజాడ రచనలు – కథానికలు. పుట. 3
- పైదే. పుట. 4
- పైదే. పుట. 5
- పైదే. పుట. 7
- పైదే. పుట. 4
- పైదే. పుట. 5
- పైదే. పుట. 16
- పైదే. పుట. 19
- పైదే. పుట. 25
- పైదే. పుట. 27
- ‘దాశరథి కృష్ణమాచార్య రచించిన కథలు - నాటికలు' పుట. 31
- పైదే.
- పైదే. పుట 20.
- పైదే. పుట. 33
- పైదే. పుట. 35
- ‘దాశరథి ‘నిప్పుపూలు' కథ గురించి' వ్యాసం, ఆంధ్రభూమి, 5 మే 2014
- ‘దాశరథి కృష్ణమాచార్య రచించిన కథలు - నాటికలు' పుట. 40
- పైదే.
- పైదే. పుట. 41
- పైదే
- పైదే
- పైదే
- పైదే. పుట. 44
- ‘రక్తాంజలి' కథ గురించి' వ్యాసం, జంబి, సాహిత్య త్రైమాస పత్రిక, జూలై -సెప్టెంబర్ 2014
- ‘దాశరథి కృష్ణమాచార్య రచించిన కథలు - నాటికలు' పుట. 49
- పైదే. పుట. 50, 51, 53
- పైదే. పుట. 50
- పైదే. పుట. 52
- పైదే. పుట. 54
- పైదే. పుట. 58
- పైదే
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, గురజాడ. గురజాడ రచనలు - కథానికలు. విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 1991.
- జలంధర్‌రెడ్డి, గంటా (సం). దాశరథి కృష్ణమాచార్య రచించిన కథలు - నాటికలు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి, హైదరాబాద్, 2014.
- జలంధర్‌రెడ్డి, గంటా (సం). మహాకవి దాశరథి సాహిత్య సమాలోచన. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి, హైదరాబాద్, 2014.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు-పోరంకి దక్షిణామూర్తి, హైదరాబాద్, 2009.
- నాగయ్య,జి, తెలుగు సాహిత్య సమీక్ష - నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 2004.
- నారాయణ సింగమనేని, (సంక), తెలుగు కథకులు కథన రీతులు, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.
- నారాయణ సింగమనేని, కథావరణం - పెన్నేటి పబ్లికేషన్స్, కడప, 2013.
- రాములు, బి.ఎస్., కథల బడి - కథాసాహిత్య అలంకార శాస్త్రం, విశాల సాహిత్య అకాడెమి, హైదరాబాద్, 1998.
- శివప్రసాద్, వల్లూరు, కథానిక -పాఠాలు, అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ, 2016.
- శ్రీధర్ వెల్దండి, తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం - సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కర్నూలు, 2015.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.