AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
3. అన్నమాచార్య సంకీర్తనలు: రామాయణ, భారత ఇతివృత్తాంశాలు

డా. టి. గిరిజాశేషమాంబ
అధ్యాపకురాలు, అకడెమిక్ కన్సల్టెంట్,
సంగీత విభాగము, శ్రీ వేంకటేశ్వర యునివర్సిటి,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492861661, Email: girijaseshamamba@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యచరిత్రలో అనేకమంది వాగ్గేయకారులు వివిధ రకాలైన సాహిత్య రచనలను మనకు అందించారు. సంగీతం, సాహిత్యం, భక్తి మూడింటిని మేళవించి భగవదర్పితంగా రచనలు చేసి కృతకృత్యులైన మహోన్నతులు తెలుగు సారస్వతప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులున్నారు. ముఖ్యంగా పదకవితాపితామహుడు, వాగ్గేయకారుడైన అన్నమయ్య భక్తి, శృంగారం, వైరాగ్యం, వేదాంత సంబంధ విషయాలు, రామాయణభారతేతిహాస పూర్వకమైన అంశాలను తన రచనలలో పొందుపరచి, వీరికి ముందు లేనటువంటి సాహిత్య రీతులను వీరి రచనల ద్వారా అందించడం ఒక విశేషంగా చెప్పవచ్చు. అన్నమాచార్య సంకీర్తనలలో రామాయణ, భారతేతివృత్తాలు ఏవిధంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి, విశ్లేషించడం అందించడం ఈ పరిశోధనావ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యగ్రంథాల ద్వారా, వివిధలక్షణగ్రంధాల ద్వారా అంతర్జాలలో లభించిన ప్రామాణికవిషయాల ద్వారా ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. అన్నమాచార్య రచనాప్రాభవాన్ని అర్థంచేసుకోవడానికి ఒక ముఖ్యసాధనంగా ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.
Keywords: సాహిత్యము, సంకీర్తనలు, రామాయణము, భారతము, జీవితచరిత్ర.
1. ఉపోద్ఘాతం:
అన్నమయ్య వేదవిజ్ఞానం, శాస్త్రవైదుష్యం, పౌరాణిక జ్ఞానం అనంతం. సంకీర్తనా రచనా నైపుణ్యం అనుపమానం. చూసే చూపునుబట్టి అన్నమయ్య సంకీర్తనలు మనకు సమాచారాన్ని అందిస్తాయి. అన్నమయ్య ప్రతిభ అమోఘం కావడంలో ఆయనకు సమస్తవిషయాలు కరతలామాలకాలై సంకీర్తనల్లో ఒదిగిపోయాయి. అన్నయమ్య సంకీర్తనలు ఐతిహాసకులకు ఇతిహాసాలుగా స్పురిస్తాయి. రామాయణ, భారతాలు మన ఇతిహాసాలు. వాస్తవ సంఘటనలకు అక్షరరూపమే ఇతిహాసం. అన్నమయ్య సంకీర్తనల్లో ప్రతిబింబించిన రామాయణ, మహాభారతాలకు సంబంధించిన అంశాల్లోని విశిష్టతను, తాత్త్వికతను అధ్యయనం చేయడం ఇటు సాహిత్యకులకు, సంగీతజ్ఞులకు ఎంతగానో ఉపయోగకరం.
2. రామాయణ, భారత ఇతివృత్త కీర్తనలు:
రామాయణము, మహాభారతం ఏవిధంగా చెప్పబడినాయో వివరిస్తూ అన్నమాచార్యుల వారు రచించిన ఒక కీర్తన ఈ విధంగా సాగింది.
రాగం - చారుకేసి; తాళం - ఆది
పల్లవి:
పేరు నారాయణుడవు బెంబాడి చేతలు నీవి
నోరు మూసుకున్న బోదు నున్నవి నీ సుద్దులు ॥
చరణం:
వేసులు మాకు జెప్పి విన భారతముగాగ
మోస నీపాల ముచ్చమి మొదలుగాను
రంతుల వాల్మీకి చెప్పి రామాయణముగాను
చెప్పి రామాయణముగాను
సంతగా తాటకాదుల జంపినడెల్లా (అధ్యాత్మ సంకీర్తనలు - సంపుటం 2)
మహాభారత కథాంశాన్ని, రామావతారంలో రాముడు ప్రదర్శించిన లీలలను, తాటకాదులను చంపిన విధానాన్ని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో వివరించారు. [6]
3. రామాయణసంకీర్తనలు:
అన్నమయ్య రామాయణ సంబంధిత సంకీర్తనలు ఎన్నింటిలో రచించారు. ఒక సంకీర్తనలో రాముని గుణగణాలను రామునిబాణ ప్రాశస్తి, కొన్ని సంకీర్తనలలో ఆంజనేయుని ప్రస్తావన ఇలా రచనలు చేసారు.[7]
రామకథనంతటిని ఒకే ఒక్క సంకీర్తనలో వివరించారు అన్నమయ్య.
రాగం - శుద్ధసావేరి; తాళం - ఆది
పల్లవి:
రాముడిదే లోకాభిరాముడితడు
గోమున పరశురామకోపమార్చె
చరణం(1):
యీతడే తాటకి జంపె యీపిన్నవాడా
ఆతల సుబాహు గొట్టి యజ్ఞము గాచె
చేతనే యీ కొమారుడా శివునివిల్లు విరిచె
సీతమ్మ బెండ్లాడె చెప్ప గొత్త కదవె ॥
చరణం(2):
మన కౌసల్య కొడుకా మాయామృగము నేసె
దనుజుల విరాధుని తానె చెరిచె
తనుమాడె నేడుదాళ్ళు తోడనే వాలి నడచె
చరణం(3): రావణు జంపి సీత మరల దెచ్చెను… (అధ్యాత్మ సంకీర్తనలు - సంపుటి 3)
శ్రీరాముడు అయోధ్యనాధుడైన దశరధుని పుత్రుడు. విశ్వామిత్రుని కోరిక మేరకు రామ లక్ష్మణులని యాగ సంరక్షణార్థం దశరథుడు పంపించాడు. విశ్వామిత్రుని సూచన మేరకు రామ లక్ష్మణులు మారీచ సుబాహులని సంహరించారు. ఆ తరువాత తాటకిని సంహరించాడు. శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడినాడు. తరువాత వనవాసంలో మాయామృగాన్ని కొట్టినాడు. విరాధుడనే రాక్షసుని బాణంతో కొట్టి శాపవిమోచనం కలిగించాడు. (విరాధుడు పూర్వజన్మలో తుంబురుడు. కుబేరుని శాపంవల్ల రాక్షస రూపాన్ని పొందాడు. రామబాణంలో పూర్వరూపాన్ని ధరించాడు) తరువాత వాలిని సంహరించాడు. వారధికట్టి రావణుని జంపి సీతను తీసుకువచ్చాడు.
‘‘రామాయణ’’గాథ మొత్తాన్ని రామావతార విశేషాన్ని, రాముని తత్త్వాన్ని ఈ సంకీర్తనలో వివరించారు అన్నమయ్య. ఇలా ఈ ఒక్క సంకీర్తనలో రామగాథను మొత్తం ప్రస్తావించటం అన్నమయ్య సాహిత్య వైదుష్యాన్ని తెలుపుతున్నది.
ఒక్కో సంకీర్తనలో రామాయణంలోని కొన్ని కొన్ని ప్రత్యేక ఘట్టాలని పొందుపరుస్తూ అన్నమయ్య పలు సంకీర్తనలు రచించారు. ప్రతీ సంకీర్తనలునూ శ్రీరాముని అవతారతత్త్వాన్ని ప్రతిబింబింప చేశారు అన్నయ్య.
ఈ సంకీర్తనలో అన్నమయ్య మరి కొన్ని విషయాలను ప్రస్తావించాడు.
రాగం - ద్విజావంతి; తాళం - ఆది
పల్లవి:
కౌసల్యా నందనరామ కమలాప్తకులరామ.. - అనే కీర్తనలో
చరణం(1):
‘‘మునుపు దశరథరాముడవై తమ్ములు నీవు
జనించి తాటక జంపి, హరివిల్లు విరచి
సీత, పెండ్లాడి అనుమతి పరశురామునిచే గైకొంటివి’’
చరణం(2): సుప్పనీతి శిక్షించి సొరిది రుషులగాచి
అపుడే ఖరదూషణాదుల గొట్టి
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి
ప్పి హనుమంతు బంటుగా నేలుకొంటివి
చరణం(3):
సొలసి వాలి నడచి సుగ్రీవు గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయు రావణు గెల్చి విభీషణుని మన్నించి
చెలగిత వయోధ్యలో శ్రీవేంకటేశుడా ॥ (అధ్యాత్మ సంకీర్తనలు - సంపుటి 1, 2)
ఈ సంకీర్తనలో పరశురాముని వృత్తాంతాన్ని పొందుపరచారు అన్నమయ్య. [6]
శ్రీరామ, పరశురాముల వృత్తాంతాన్ని ఈ సంకీర్తనలో ప్రస్తావించాడు. శూర్పణఖను శిక్షించిన విషయాన్ని హనుమంతుని బంటుగా చేసుకొన్న అంశాన్ని, సుగ్రీవునితో మైత్రిని, విభీషణుని మన్నించిన విషయాన్ని ఈ సంకీర్తనలో పొందుపరచారు అన్నమయ్య.
మరొక సంకీర్తనలో అన్నమయ్య శ్రీరాముని శరణాగత వాత్సల్యాన్ని వివరిస్తూ-
రాగం - హిందోళ; తాళం - ఆది
‘‘కాకాసురు దోషము కడకుపరిహరించి
చేకొంటివి శరణంటే చేరి మడుగు
యీకడ మా నేరములు యింతకంటే నెక్కుడా
నీకే నే శరణంటి నీవు మమ్ము గాతువు’’ (అధ్యాత్మ సంకీర్తనలు, 1 నుండి 4 సంపుటి)
అని రచించారు. తనపట్ల తప్పుచేసిన వారిని కూడ శ్రీరాముడు రక్షిస్తాడనటానికి కాకాసుర వృత్తాంతం నిదర్శనంగా నిలుస్తుంది.
మరొక సంకీర్తనలో అన్నమయ్య-
రాగం - ఖరహరప్రియ ; తాళం - ఆది
‘‘అంటరాని గద్దకుల మంటి జటాయువుకు నీ
వంటి పరలోక కృత్యములు సేసితివి
యిరవైన శబరి రుచులివియె నైవేద్యమై’’ (అధ్యాత్మ సంకీర్తనలు, 1 నుండి 4 సంపుటి)
అని రచించారు. జటాయువుకు శ్రీరాముడు అపకర్మలు గావించిన వృత్తాంతాన్ని, శబరి రుచిచూసి సమర్పించిన పళ్ళను స్వీకరించిన విషయాన్ని ఈ సంకీర్తనలో వర్ణించటమే గాక శ్రీరాముని భక్తవాత్సల్యాన్ని ప్రకటింప చేశారు అన్నమయ్య.
శ్రీరాముని సర్వలక్షణ తత్త్వాన్ని వివరిస్తూ అన్నమయ్య రచించిన మరొక సంకీర్తన.
రాగం - ముఖారి ; తాళం - ఆది
పల్లవి:
‘‘రామూడు లోకాభిరాముడు త్రైలుక్య
ధాముడు రణరంగభీముడు వాడే’’
చరణం 1:
వరుడు సేతకు ఫలాధరుడు మహాగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవక శుభకురుడు వాడే ॥ (అధ్యాత్మ సంకీర్తనల సంపుటి, 1 నుండి 4)
‘‘అంత్యాను ప్రాస’’ విన్యాసంలో సాగిన ఈ సంకీర్తనలో శ్రీరాముని విశేషణాల ద్వారా, శ్రీరాముని తత్త్వాన్ని ప్రతిబింబింపజేశాడు అన్నమయ్య. రణ రంగంలో భయంకరుడని చెప్పడం ద్వారా యుద్ధభూమిలో తిరుగు లేనివాడని, అలాగే ‘‘మహాగ్రపుశరుడు’’ అనే విశేషాన్ని ప్రయోగించడం ద్వారా అమోఘమైన రామబాణం యొక్క గొప్పతనాన్ని స్పష్టపరచారు అన్నమయ్య ‘‘రాక్షస సంహరుడు’’ అనటం ద్వారా దుష్టశిక్షణ తత్త్వాన్ని, ‘‘సేవక శుభకరుడు’’ అని చెప్పడం ద్వారా తనను సేవించే శిష్యులకు మేలు చేకూర్చుతాడనే విషయాన్ని ఇలా ఈ సంకీర్తనమంతా శ్రీరాముని విశిష్టగుణాలని వివరించటం జరిగింది అన్నమయ్య.[5]
రామకథను పలు సంకీర్తనలలో వర్ణించిన అన్నమయ్య రామభక్తుడైన ఆంజనేయుని గూర్చి కూడ ఎన్నో సంకీర్తనలలో వివరిస్తారు.
రాగం - మలహరి ; తాళం - ఆది
పల్లవి:
నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క
వేలనే యక్షుని తెగవేసెగా నీబంటు
చరణం 1:
ఉంగరమెగరవేసి యుద్ధంలో పడకుండ
నింగికి చేయిచాచే నీబంటు
చెంగున జలధిదాటి జంటుమాలి నేలమీద
కుంగదొక్కి పదముల గుమ్మెగా నీబంటు
చరణం 2:
వెట్టగా రావణు రొమ్ము విరంగ చేతనే గుద్దె. (అధ్యాత్మ సం. సంపుటి, 1 నుండి 4)
ఆంజనేయుని తత్త్వాన్ని వర్ణిస్తూ ఉంగరాన్ని పైకి ఎగురవేసి సముద్రంలో పడకుండా చేతితో పట్టుకొన్నట్లు వర్ణించాడు. జంబుమాలిని హనుమంతుడు కుంగదొక్కాడని అన్నమయ్య అచ్చతెలుగు పదాల్లో వర్ణించాడు.
అలాగే వివిధ వైష్ణవక్షేత్రాలలో వెలసిన హనుమంతుని అన్నమయ్య పలు సంకీర్తనలలో వర్ణించాడు. కలశాపురుంలోని హనుమంతుని తత్త్వాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలు ఈ విధంగా ప్రస్తుతించాడు.
రాగం - అమృతవర్షిణి ; తాళం - ఆది
పల్లవి:
కలశాపురముకాడ గంధపుమాకులనీడు
అలరేవు మేలు మేలు హనుమంతరాయ (అన్నమయ్య సం. సంపుటి 1, పీటికలు-18)
4. మహాభారత ఇతివృత్తకీర్తనలు:
మహాభారత కథ అత్యంత విస్తృతమైనది. బహుపాత్రయుతమైనది కావటం వల్ల అన్నమయ్య ఒక సంకీర్తనలో మహాభారతాన్ని ఇమడ్చకుండా ఆయా సంకీర్తనలలో మహాభారత సన్నివేశాల్ని, పాత్రల్ని ప్రస్తావిస్తారు.
శ్రీకృష్ణుని జన్మను వర్ణిస్తూ అన్నమయ్య శ్రీకృష్ణుడు ఏయేపాత్రలతో ఎలాంటి బంధుత్వాన్ని కలిగి ఉన్నాడో ఈ విధంగా వర్ణించారు.
రాగం - హంసధ్వని ; తాళం - ఆది
పల్లవి :
అడర శ్రావణబహుళాష్ణమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడుగదరే ॥
చరణం 1:
గొంతిదేవి మేనల్లుడు గోపసతులమగుడు
పంతపు పాండవులకు బావమరిది
వంతుతో వసుదేవ దేవకుల కుమారుడు
ఇంతటి కృష్ణుడు జనియించి నీడుగదరే
చరణం 1:
బలరాముని తమ్ముడు పంచసాయకుని తండ్రి
మలసి మేలైన అభిమన్యుని మామ
లాలి సాత్యకి సుభద్రకు తోబుట్టినయన్ని (అన్నమయ్య సం. సంపుటి 1, పీటికలు-18)
శ్రీకృష్ణునికి ఇతర పాత్రలతో ఉన్న బాంధవ్యం ఈ కీర్తనలో వివరించారు అన్నమయ్య. [4]
శ్రీకృష్ణునికి భక్తులపట్ల ఉండే పక్షపాతాన్ని వివరిస్తూ ఆయనకు దాస్యం చేసేవారిపట్ల ఆయనే దాసుడై ఉంటాడని అన్నమయ్య ఒక సంకీర్తనలో స్పష్టం చేశారు.
రాగం - మోహన ; తాళం - ఆది
‘‘యిందరి పాలిటికిని ఈశ్వరుడ వేలికవు
వందవై యర్జును బండి బంటవైతివి
వందనకు నేలే దేవతలకే దొరవు (అధ్యాత్మ సంకీర్తనలు సంపుటి 4)
అందపు నీదాసులకు నన్నిటా దాసుడవు’’ - అని అర్జునుని రథసారధ్య విషయాన్ని, శ్రీకృష్ణుని భక్త వాత్సల్యతను అన్నమయ్య ప్రస్తావించాడు.
ద్రౌపదీ వస్త్రాపరణ వృత్తాంతాన్ని స్మరిస్తూ అన్నమయ్య ఒక సంకీర్తనలో ‘‘ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు బీరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు’’ అని ద్రౌపది తనను రక్షించమని వేడుకొన్నట్లు ఈ కీర్తనలో వివరిస్తారు.[1]
శ్రీకృష్ణుని అవతారం దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని తెలుపుతూ అన్నమయ్య ఒక సంకీర్తన రచించాడు.
రాగం - హిందోళం ; తాళం - ఆది
పల్లవి :
‘‘ఎంతకత నడిపితి వేమి జోలి బెట్టితివి
చింతించ లోకములు నీ చేతివే కావా’’
చరణం:
కౌరవుల పాండవుల కలహము వెట్టనేల
నేరిచి సారధ్యము నెరపనేలా
కోరి భూభార మణచే కొరకైతే నీచే చక్ర
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా । (అధ్యాత్మ సం. సంపుటి 1,2,3) [3]
శ్రీకృష్ణుని గూర్చి అన్నమయ్య ‘‘ఎంత కత నడిపితివి’’ అని అద్భుతంగా చెప్పారు. కౌరవ పాండవులకు కలహం పెట్టిదుష్ట శిక్షణ, శిష్టరక్షణను చేసినట్లు భావించిన అన్నమయ్య ప్రతిభ అనన్య సామాన్యం.
శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని గూర్చి వివరిస్తూ అన్నమయ్య ఈ విధంగా రచించారు.
రాగం - కాపీ ; తాళం - ఆది
‘‘అనంత సూర్యచంద్రులు అనంతవాయువులును
అనంత నక్షత్రములనంత మేరువులు
కొనలు సాగేనన్నిటి కూటువ గూడుకొన్నట్లు
అనంతుడొక్కడే మించీనాది మూరితి’’ (ఆధ్యాత్మిక సం. సంపుటి 1 నుంచి 4) [2]
అని వర్ణించారు.
5. ముగింపు:
- ప్రపంచసాహిత్యచరిత్రలోనే ప్రజల భాషలో పదకవిత్వం వ్రాసి ప్రపంచానికి అందించిన ప్రయోగశీలుడు అన్నమయ్య. భగవంతుని ఉనికిని, సమాజపు ఉనికిని విస్మరించకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని బహుముఖీనంగా వ్యాఖ్యానిస్తూ సాధించిన ఫలితాలను సమాజానికి, దేవునికి సమర్పించిన దార్శినికుడు.
- ఈ వ్యాసంలో చర్చించిన రామాయణ, భారతాంశ ఇతివృత్త రచనలు ప్రతి ఒక్కటీ ఒక ప్రత్యేక రచనగా నిలుస్తాయి. భక్తి, శృంగార, వైరాగ్య రనచలు చేసిన అన్నమయ్య పురాణ, ఇతిహాసాలను కూడా తన రచనలలో ఇమిడ్చి రచించారు అని ఈ వ్యాసంలోని విశ్లేషణాంశాల ద్వారా తెలుస్తుంది.
- మొట్టమొదటగా వివరించిన రామాయణ సంకీర్తనలలో రామకథ ఇతివృత్తం మొత్తాన్ని ఒక సంకీర్తనలోనే పొందుపరచారు అన్నమయ్య. అలాగే ఆయా కీర్తనలకు ఉపయోగించిన రాగాలు, చారుకేసి, శుద్ధసావేరి, ముఖారి, వంటి రాగాలు కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రాదాన్యత కలిగిన రాగాలని ఆయా సాహిత్య రీతులకు అనుగుణంగా కూర్చటం జరిగింది.
- తరువాత విశ్లేషించిన మహాభారత ఇతివృత్తకీర్తనలు కూడా శ్రీకృష్ణుని లీలలను, క్రిష్ణతత్వాన్ని కీర్తనల రూపంలో మలచారు అన్నమయ్య. ఆ కీర్తనలకు ఉపయోగించిన హంసధ్వని, మోహన, హిందోళ రాగాలలో కూర్చడం వలన సాహిత్యం మరింత సోభాయమానంగా ప్రకటితం అవుతుంది.
- అన్నమయ్య రనచలు ఎంత విశ్లేషించినప్పటికీ వారి రచనలలోని భక్తిని, భావాన్ని అర్థంచేసుకున్నప్పుడే ఆ సాహిత్యం మనకు అవగతం అవుతుంది.
- అన్నమయ్య కీర్తనలలో సాహిత్యం పరిపూర్ణంగా వ్యక్తం అయ్యేందుకు అవసరం అయిన మాధ్యమం సంగీతం. ఇటు సంగీతసాహిత్యాలను రెండింటిని మేళవించి పాడినట్లయితే అన్నమయ్య రచనలలో భావం, సంగీతం సుస్పష్టంగా అవగతం కాగలదు.
6. పాదసూచికలు:
- శ్రీ మహాభారతం 2-35.
- తాళ్ళపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తనలు 2-469.
- తాళ్ళపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తనలు 3-355.
- భాగవతం 7-169
- అధ్యాత్మ సంకీర్తనలు పీఠికలు - 18.
- అన్నమయ్య సంకీర్తనలు సంపుటి 1 పీఠికలు - 18.
- తాళ్ళపాక పదసాహిత్యం - ఆధ్యాత్మిక సంకీర్తనలు - (1 నుండి 4 సంపుటాలు)
- అన్నమాచార్య జీవిత చరిత్ర ద్విపద - పుట - 11.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆనందమూర్తి, వేటూరి. తాళ్ళపాకకవుల పదకవితలు- భాషాప్రయోగవిశేషాలు. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1976
- కృష్ణమూర్తి, సాళ్వ. సంకీర్తనాలక్షణం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, చెన్నై, 1996
- గోవిందరాజు, చిట్రాజు. అన్నమయ్య బహుముఖప్రాభవం. సి.యస్.ప్రింటర్స్, తిరుపతి, 2010.
- చంద్రశేఖర్ రెడ్డి, మాండ్యం. అన్నమయ్య భాషాపరిశీలన, అజయ్ సుస్మితాప్రచురణలు, తిరుపతి, 2010.
- తాళ్ళపాక పదకవుల సంకీర్తనలు - 1 నుండి 29 సంపుటాలు. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1998.
- దక్షిణామూర్తి, శర్మ. పదకవితాపితామహస్య తాళ్ళపాక అన్నమాచార్యస్య సంస్కృతసంకీర్తనాః ఏకమధ్యయనమ్. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1997.
- లక్ష్మణయ్య, సముద్రాల. అన్నమాచార్య సంకీర్తనామృతం. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2000.
- విజయభారతి, బి. (పరి.) తెలుగు సాహిత్యకోశము, తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1980.
- వాణి, కేశర్ల. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు జీవిత చరిత్ర. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2000.
- శివారెడ్డి, ఎల్లూరి. తెలుగు వాగ్గేయకారులు అన్నమయ్య విలక్షణవ్యక్తిత్వం. ఆంధ్రసారస్వత పరిషత్, హైదరాబాద్, 2006.
- శోభాదేవి, ఆర్. అన్నమయ్య సంకీర్తనా సౌరభం. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2012.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద. రామాయణం. విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, హైదరాబాద్, 2007.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.