AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. శ్రామికగేయాలు: వస్తుసంస్కృతి

డా. దాసర విజయకుమారి
సహాయ అధ్యాపకులు, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 9491877705, Email: dasara.vijayakumari@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
జానపదులు పాడే శ్రామిక గేయాలలో వారు వ్యవసాయం చేసేటప్పుడు వినియోగించే వస్తువులు, పండించే ధాన్యపు పేర్లు, ఆభరణాలు, చీరలు, జాలరులు పాడే గేయాలలో చేపల రకాలు మొదలైన అంశాలు ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి. ఈ అంశాలను పరిశోధన రూపంలో పొందుపరచడం వల్ల భవిష్యత్తరాలకు వీటిని అందించిన వారమవుతాం. ఈ దిశగా విద్యార్థులతో పరిశోధన చేయించాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ప్రాంతీయ పరమైన సంస్కృతి సంప్రదాయాలు, ప్రజలు వినియోగించే వస్తుసంస్కృతి వెలుగులోకి వస్తుంది. ఆయా వస్తువులను ఒక్కొక్క ప్రాంతంలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. భాషాపరమైన అంశాలు వెల్లడి అవుతాయి. ఈ శ్రామిక గేయాలలో గుర్తించిన వివిధ రకాల వస్తువుల, చేపల, చీరల, మరియు ధాన్య సంబంధమైన పదాలు నాగరిక సమాజానికి తెలియజెేేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. ముద్రింప బడిన గేయాలను ఆధారంగా చేసుకుని రాయడం జరిగింది. ఈ పరిశోధన Richard M. Dorson చేసిన వర్గీకరణలోని వస్తు సంస్కృతి అనే విభాగం కిందికి వస్తుంది.
Keywords: జానపద గేయాలు (Folk songs), జానపద సాహిత్యం (Folk literature), జానపద విజ్ఞానం (Folklore), మౌఖిక జానపద విజ్ఞానం(Oral folklore), వస్తు సంస్కృతి (Material culture), సాంఘిక జానపద ఆచారాలు(Social folk customs), జానపద ప్రదర్శన కళలు (Performing arts)
1. ఉపోద్ఘాతం:
జానపద గేయాలు, (FOLK SONGS) జానపద సాహిత్యం (FOLK LITERATURE) జానపద విజ్ఞానం (FOLK LORE) అనే పదాలు విడదీయరానివి ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ మూడు పదాలు “volkslied” అను జర్మను భాష పదం నుండి వెలువడ్డాయి. జానపద సాహిత్యం జానపద విజ్ఞానంలో ఒక భాగం. క్రీ. శ. 1846 లో W J Thoms “The Athenaeum” అనే పత్రికకు జాబు రాస్తు popular Antiquaries and popular literature అనే మాటలకు బదులుగా “folklore” అనే మాటలను వాడవలసినదిగా సూచించారు. ఈ జానపద విజ్ఞానమనే పదం మొదట ఆచార వ్వవహారాలకు, మూఢవిశ్వాసాలకు సంబంధించినది. ఆ తరువాత విస్తృతమైంది. పాశ్చాత్య నృ శాస్త్రవేత్తలయిన (Anthropologists) Tylor, Frazer మొదలైన వారి పరిశోధనల ఫలితంగా ఈ అర్థం మరింత వ్తిస్తృతమైంది. వీరందరి కంటే ముందు క్రీ.శ 1812 Jacob Grimm and Wilhelm Grimm సోదరులు జానపద విజ్ఞానానికి సంబంధించిన కొన్ని గ్రంధాలను ప్రకటించారు. వాటి సారాంశమే మనగా జానపద కథా వాజ్ఞ్మయము, మూఢ విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, మంత్ర తంత్రాలు, పొడుపు కథలు, సామెతలు, వినోదాలు, వేడుకలు, ఆటలు మొదలైన అనేక విషయాలు జానపద విజ్ఞానంలో చేరతాయి.
“Maria Leach” రాసిన “Standard Dictionary of Folklore Mythology and legend” అను నిఘంటువులో 21 మంది పండితులు చెప్పిన “Folklore” అనే పదానికి వివిధ నిర్వచనాలను తెలిపారు. మానవ జీవితానికి చెందిన అన్ని విషయాలు జానపద విజ్ఞానంలో చేరతాయి. (రామరాజు, బిరుదురాజు. 2015. పుట.9)
“జానపదం, విజ్ఞానం- ఈ రెండింటినీ నిర్వచించడం సాధ్యమే అయినప్పటికి జానపద విజ్ఞానం అంటే ఏమిటో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి కూడ అర్థం చేసుకునే విధంగా చెప్పవచ్చు. ఒక సమాన లక్షణాన్ని పంచుకునే వారు అయి ఉండాలి. వాళ్ళను కలిపేది ఏదైనా కావచ్చు. ఒక సమూహం కావడానికి సమానమైన వృత్తి, భాష,లేదా మతం ఏదైనా వారివి అని చెప్పుకునే కొన్ని సంప్రదాయాలు ఉండడం ముఖ్యం.”1 అని Alan Dundes “ The Study of Folklore” అనే గ్రంథంలో నిర్వచించారు.
Richard M Dorson విజ్ఞానాన్ని నాలుగు తరగతులుగా విభజించారు. అవి 1. మౌఖిక జానపద విజ్ఞానం(Oral folklore) 2. వస్తు సంస్కృతి( Material culture) 3. సాంఘిక జానపద ఆచారాలు (social Folk customs) 4. జానపద ప్రదర్శన కళలు(Performing Arts). మౌఖిక ప్రచారంలో ఉన్న జానపద శ్రామిక గేయాలలో ప్రస్ఫుటంగా కనిపించే వస్తు సంస్కృతి గురించి చర్చించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్ధేశం.
R.S.Boggs జానపద విజ్ఞాన వర్గీకరణను ఇంగ్లీషులోని పెద్ద అక్షరాలతో సూచించారు.
- A. GENERAL FOLKLORE-సామాన్య జానపద విజ్ఞానం.
- B. PROSE NARRATIVE - గద్య కథనం
- C. BALLAD - కథాగేయం, SONG - గేయం, DANCE-నృత్యం, GAME - ఆట, MUSIC - సంగీతం, VERSE - గద్య
- D. DRAMA - నాటకం
- F. CUSTOM - ఆచారం, FESTIVAL- ఉత్సవం
- G.GEOGRAPHY - భూగోళం
- L. LANGUAGE - భాష
- M. ART - కళ, CRAFTS - చేతి పనులు, ARCHITECTURE - వాస్తువు
- N. FOOD - ఆహారం, DRINK - పానీయం
- P. BELIEF - నమ్మకం
- S. SPEECH- వాక్కు
- V. PROVERB - సామెత
- RIDDLE - పొడుపు కథ
ఈ గణాలను కొన్ని వర్గాలుగా విభజించారు. ఉదాహరణకు B200 - పురాణం, B400 - ఐతిహ్యం, B600 - కథ (సుందరం, ఆర్వీయస్. 2004. పుట.5,6.)
పై వర్గీకరణ ప్రకారం జానపద వస్తుసంస్కృతి లోగల ప్రతి వస్తువుని పరిశీలించడం కష్టతరమైన విషయమని భావించి, ఆర్వీ.యస్. సుందరం జానపద వస్తు సంస్కృతిని నాలుగు విభాగాలుగా విభజించారు.
- ఆహార పద్ధతులు - పాత్రలు, వంటలు, పిండి వంటలు మొదలైనవి.
- దుస్తులు - ఆభరణాలు - వస్త్ర ధారణ, అలంకరణ విధానాలు మొదలైనవి.
- చిత్రలేఖనం - శిల్పం - బొమ్మలు, గృహ నిర్మాణం మొదలైనవి.
- ఇతరవస్తువులు, నాణెములు, వృత్తిపరికరాలు మొదలైనవి. (ఆర్వీ.యస్. సుందరం.2004. పుట.364)
జానపదుల వస్తుసంస్కృతి అనగా ఆహార పద్ధతులు, దుస్తులు, ఆభరణాలు, చిత్ర లేఖనం, శిల్పం, ఇతర వస్తువులు నాణెములు, వృత్తి సంబంధమైన పరికరాలు మొదలైనవి పై విభాగాలుగా గుర్తించి పరిశోధన చేయవచ్చు.
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు జానపద పరిశోధకులు అంగీకరించిన R.S.BOGGS వర్గీకరణలో మౌఖిక జానపద కథలను చేర్చాలని, జానపదుల సాహిత్యం లాగే జానపదుల సాహిత్య విమర్శ కూడ మౌఖికమేనని పేర్కొన్నారు. ఆధునిక విమర్శ లక్షణాలతో పోలిస్తే దానిలోని విమర్శ స్థాయి ప్రాథమికంగా ఉంటుందని, విశ్లేషణ, సమన్వయం గుర్తించదగినంతగా ఉంటాయని తెలియజేశారు. మార్గ సాహిత్య విమర్శలో కనిపించే లక్షణ స్థిరీకరణ భాషా ప్రామాణికత్వం లాంటివి లేకపోయినా వారు ఆలోచనా శక్తిలో ఏమాత్రం తక్కువ కాదని ఆచార్య ఇనాక్ గారు తన “జానపదుల సాహిత్యవిమర్శ” అనే గ్రంథంలో పేర్కొన్నారు. కొందరు కవుల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కథల రూపంలో ప్రచారంలో ఉంటాయి. వాటిని సాహిత్య చరిత్రలో పేర్కొనరు కాని, కొన్ని గ్రంథాలలో కనిపిస్తాయి. వాటిని ‘సాహిత్య విమర్శ కథలు’ అనే కొత్తదైన సాహిత్య సిద్ధాంత ప్రతిపాదన చేశారు. జన వ్యవహారంలో ఉన్న సాహిత్య సంబంధమైన కథలను కూడ గ్రహించి, వీటిని జానపదుల సాహిత్య విమర్శ కథలుగా ప్రకటించారు. జానపద పరిశోధనలో ఇదొక కొత్త ఆలోచన. దీని ఆధారంగా ప్రపంచ జానపద కథల వర్గీకరణలో సాహిత్య విమర్శ కథకు ఒక గుర్తింపు లభిస్తుంది. ఆచార్య ఇనాక్ గారు చేసిన ఈ ప్రతిపాదన జానపద సాహిత్యానికి నవ్య ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఈ దిశగా జానపద సాహిత్యంలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది.
జానపద సాహిత్యాన్ని అమెరికా జానపద విజ్ఞానవేత్త Alan Dundes ప్రతిపాదించిన oral literary criticism - మౌఖిక సాహిత్య విమర్శ విధానంలో మౌఖిక సాహిత్యం పై జానపదుల విమర్శను పరిశీలించాలని ఆచార్య రావి ప్రేమలత గారు తెలుగు సాహిత్య విమర్శ దర్శనం విజ్ఞాన సర్వస్వం. సంపుటం.11 నందు జానపద సాహిత్య విమర్శ అనే వ్యాసంలో పేర్కొన్నారు.
2. వ్యవసాయ సంబంధ గేయాలు – వస్తు సంస్కృతి:
రైతులు వ్యవసాయపు పనులు మొదలు పెట్టినప్పటి నుండి పంట చేతికి వచ్చేంత వరకు చేసే ప్రతి పనిని గేయాలతో మొదలు పెట్టి తమ శ్రమను మరచి పోతుంటారు. వారు చేసే పనులలో ఉపయోగించే వస్తువుల గురించి, ధాన్యం మొదలైన వాటిని శ్రామికగేయాలలో ప్రస్తావిస్తూ ఉంటారు.
2.1 వ్యవసాయ సంబంధ వస్తువులు - కొలమానాలు:
ఈ కింది గేయంలో వ్యవసాయం చేయడానికి కావలసిన వస్తువులు, కొలమానం మొదలైనవి వెల్లడి అవుతాయి.
ఊరికి ఉత్తరాన వూడాల మర్రి
ఊడాల మఱ్ఱి కింద వుత్తమూడి చవికె II ఒలియా II
-------------------------
--------------------------------
గిద్దెడు ముత్యాలు గిలకలా కొలిమి
అరసోల ముత్యాలు అనురారె కొలిమి II ఒలియా II
సోలెడు ముత్యాల చోద్యంపు కొలిమి
తవ్వెడు ముత్యాల అలరినా కొలిమి
మానెడు ముత్యాల తరిచినా కొలిమి
------------------------------
అడ్డెడు ముత్యాల అలరినా కొలిమి
తూమెడు ముత్యాల తూగెనే కొలిమి II ఒలియాII
------------------------------
ఊదేటి తిత్తులూ ఉరుములాబోలు
వేసేటి సమ్మెట్లు పిడుగులాబోలు
-----------------------------
పాలుబోసి గొడ్డళ్ళు పదును లెక్కించి
------------------------
అసలు చిక్కుడు కాయ అలసంద పప్పు II ఒలియాII
పచ్చజొన్నన్నంబు ఎఱ్ఱావు పెరుగు
----------------------------
మూడామడలబోయి ములకలా గొట్టి
నాలుగామడల బోయి నాగళ్ళు గొట్టి
ఏడామడలుబోయి ఏడికలు గొట్టి
కొట్టిన సామాన్లు బళ్ళకెత్తేరు IIఒలియాII
---------------------------
చేసిరి నాగళ్ళు చేలుదున్నంగ
దందాల పగ్గాలు దబ్బునా లాగి
దూలాలపై గొర్లు దుమ్ము దుల్పేరు
వేసేనే కోటేళ్ళు విత్తు వేయంగ IIఒలియాII
-----------------------------
శ్రీరాముడు గొఱ్ఱుబట్టి, సీత యెదబట్టి
రఘు రాముడు గొఱ్ఱుబట్ట రంభ యెదబట్ట
---------------------------
రంభ బెట్టిన యెద రాజనాలే పండు
వెండి తూముల కింద వెల్లడము పండు
పైడి తూముల కింద పాలరికి పండు
రాగి తూముల క్రింద రాజనాలే పండు IIఒలియాII
వెండిపిడి కొడవళ్ళు వెయివేలు జేసు
పైడి పిడి కొడవళ్ళు పదివేలు జేసు
కోసేటి గుబ్బలి వేసేటి ఓదె
మాచేను ముందట మారేళ్ళు గలవు
మారేళ్ళు పూపత్రి గణపతికి పూజ
మాచేను ముందట మామిళ్ళు గలవు II ఒలియాII ( మిన్నేరు, 1968.పుట-419,420)
పై గేయంలో చవికె అనగా గ్రామదేవతలను నెలకొల్పిన నలుచదరపు చావిడి. దానికి చుట్టు గోడలుండవు. గ్రామ దేవతాలయము (నెల్లూరు, తెలంగాణ) కొలిమి, గిద్దెడు అరసోల, సోలెడు, తవ్వెడు, మానెడు అడ్డెడు, తూమెడు మొదలైన కొలమానాలకి సంబంధించిన వస్తువుల పేర్లు తెలియవస్తున్నాయి. సమ్మెట్లు, గొడ్డళ్ళు, మూడామడలు, నాలుగామడలు వంటి దూరాన్ని లెక్కించే పదాలు, ఆమడ అనగా 4 క్రోసులు, 8మైళ్ళు, మరియు 13 కిలో మీటర్లు. ఏటికలు అనగా నాగటి కొయ్య, పాపటము-వేరు, కుఱ్ఱు, తూము అంటే పంట కాలువలలో నీరు సక్రమంగా ప్రవహించడానికి సిమ్మెంటు ఇసుక కలిపి పోత పోసిన ఒక పెద్ద గొట్టం వంటిది. రాజనాల, పాలరిక ధాన్యానికి చెందిన రకాలు. మామిళ్ళు, మారేళ్ళు మొదలైన వృక్ష సంబంధమైన పదాలు కలవు.
ఈ గేయంలో కొలమానాలకు సంబంధించిన అంశాలు, కొలతలకు ఉపయోగించే వస్తువులు, ధాన్యాలు, వృక్షాలు మొదలైన పేర్లు గలవు.
ఏటికేతంబెట్టి ఎయిపుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరుగరన్నా నేను
----------------------------
కాల్జేయి కడుక్కోని కట్టమీద గూసుంటే
--------------------------------
చుక్కపొద్దున లేచి బొక్కెనెత్తుకు పోంగ
బొక్కబోర్లా పడితిరన్నా
పక్కలిరుగా పడితిరన్నా (త్రివేణి, 2006. పుట- 162)
పై గేయంలో రైతు సంవత్సర కాలం కష్టపడి పంటను పండిస్తే గ్రామాధికారి, అతని కొడుకు దోచుకుపోతుంటారని, అతని దీన స్థితిని వ్యక్తం చేస్తున్నాడు. ఇందులో ఏతం రైతు చిన్న, చిన్న కాలువలలోని నీటిని పంట చేనులోకి తోడడానికి ఏతం ను ఉపయోగిస్తాడు. పుట్లు అనగా ధాన్యాన్ని కొలుస్తారు. బొక్కెన అంటే బకెట్ నీటిని నిల్వ చేయడానికి నిత్యం వాడే వస్తువు.
బెల్లు తీస్తూ పాడే గేయం:
బెడ్డతియ్యే నడ్డిపిల్ల, గట్టువెయ్యి చక్కగాను
గునమేస్తాకాచుకోయే గుడ్డిదానానడ్డిపిల్ల IIబెడ్డII
-----------------------------
బెల్లు తీస్తే పొలములన్నీ గుల్లలయ్యి పంటపండు IIబెడ్డII
పంటపండి గాదెనిండు, పొదుపుగాను పొట్టనిండు (మిన్నేరు, 1968.పుట – 435)
వేసవి కాలంలో రైతులు పొలం గట్లు సరిచేసుకోవడం, కాలువల్లోని పూడికలను తీయడం, పంట చేనులో పై పొరను తొలగిస్తూ మట్టి గడ్డలు తవ్వడం వంటి పనులు చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల భూమి గుల్లగా మారి పంట బాగా పండుతుంది. ఆ సందర్భంగా రైతులు ఇటువంటి పాటలు పాడతారు. ఇక్కడ బెల్లు, బెడ్డ, గునపం, గాదె వంటి పదాలు గలవు, బెడ్డ-మట్టి గెడ్డ, గునపం- మట్టిని తవ్వడానికి ఉపయోగించే ఇనుప వస్తువు. దీనిని కొన్ని ప్రాంతాలలో ‘పలుగు’ అనికూడా అంటారు. గాదె అనగా ధాన్యాన్ని నిలవ చేయడానికి వినియోగించే వస్తువు. దీనిని వెదురు బద్దలతో అల్లుతారు.
2.2 మగ్గం – పాట:
అగ్గువాయెరా ముక్తి - అగ్గువాయెరాయిట్లు
మగ్గాము బట్టకు నేత – మరిగినేసే వారికెల్ల
వేదాంత సారమిది – వెలసి పడుదుదడపాలె
సాదాంతమనియేటి కుంచెతో - సరిచెయ్యవలె
------------------------------------------------
గంటానాదం యమడించి- గజ్జ లు పల్కాకు గట్టి
ఒంటి స్తంభం మేడలోపల – ఒనర నేసే వారికెల్ల
నగవుల తిమ్మప్పగురుని- నమ్మిమడతవేయవలె
తగచెలిమిఒక్కాటిజేసి- దట్టించే వారికెల్ల (మిన్నేరు, 1968. పుట-435,436)
ఒకటి, రెండు గేయాలు ఆర్వీ. యస్. సుందరం గారు తెలిపిన నాల్గవ విభాగమైన “ఇతర వస్తువులు” కిందికి వస్తుంది.
పై గేయంలో మగ్గం నేసే కార్మికులు వేదాంత పరమైన విషయాలను ప్రస్తావించారు. దీనిలో అగ్గువ, గంటానాదం, గజ్జలుపలక మొదలైన పదాలు గలవు. అగ్గువ అంటే తక్కువ అని అర్థం.
2.3 పడవ పాట:
“తూరుపున మెయిలు బట్టె - తుమ్మలమ్మ చెరువు నిండె
బంక జెల్లు బయలుపడే, జెల్లనిస్తా గిల్లనియ్యె
చేపనిస్తాచేరనియ్యి, చెరువులోని చేపలన్ని
చెదరిపోయె పిల్లచూచి జెల్లనిస్తా గిల్లనియ్యి
పావలిస్తా పారిపోకు బేడ యిస్తా బెదరిపోకు
అణాయిస్తా అదిరిపోకు, -------------" (మిన్నేరు, 1968. పుట – 436)
పై గేయం లంగరు నీటిలో నుంచి బయటకు లాగేటప్పుడు జాలరులు పాడుతుంటారు. దీనిలో జెల్ల, పావలా, బేడ, అణా మొదలైన పదాలున్నాయి. ఇక్కడ జెల్ల అంటే చేపలలో ఒక జాతికి చెందినది. పావలా 25 పైసలు. బేడ 12 పైసలు, అణా ఆరు పైసలు. ఈ నాణాలు నేటి పిల్లలకు తెలియదు.
చేపలు పట్టేటప్పుడు పాడే పాటజాలరులు నదులు, కాలువలు, చెరువులో వల వేసి చేపలు పట్టేటప్పుడు ఈ కింది గేయం పాడుతారు.
గంతులేసి గండుమీన, పరుగులెత్తే పండుగొప్ప
వాలలాడే వాల్గు చేప, ఒరిగి యెగిరె ఒంజిపిల్ల
రోసమేల రొయ్యపిల్ల, కపటమేలా కట్టచేప
మిట్టిపడెడి మట్టగిడస, చూపులేలా చుక్కపరిగి
కోపమేలా కొర్రమీన, బోగమేలా బొచ్చి పరిగి
చేతగానిచేదు పరిగి వొరిగి వొరిగే వడ్లముక్కు
బిగువులేల బిళ్ళమోసు మోసం చేసే మోసు పిల్ల
నసుగులాచే యిసుకదొందు, బెదిరి యెగిరే బేడిసిపిల్ల
రండి, రండి, నా వలల్లో పడండి. (మిన్నేరు. పుట. 443)
ఇది ఆర్వీ. యస్. సుందరం తెలిపిన మొదటి విభాగమైన “ఆహార పద్ధతులు” అనే విభాగంలో చేరుతుంది.
పై గేయంలో చేపలలో ఎన్ని రకాలున్నాయో తెలుస్తుంది. గండుమీన, పండుగప్ప, వాల్గు చేప, ఒంజిరం, రొయ్యలు, కట్టచేప, మట్టగిడస, చుక్కపరిగి, కొర్రమీను, బొచ్చిపరిగి, చేదు పరిగి, వడ్లముక్కు చేప, బిళ్ళమోసు, యిసుకదొందు మొదలైన చేపలు వలలో పడ్డాయని జానపదులు పాటగా పాడుకుంటూ ఉంటారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన వారికి మాత్రమే చేపల రకాలు తెలుస్తాయి. పట్టణాలలో ఉండే వారికి ఇవి తెలిసే అవకాశం లేదు. ఈ సాహిత్యం ద్వారా నాగరిక సమాజానికి వీటిని తెలియజెప్పవచ్చు.
2.4 ఆభరణాలు తెలిపే గేయం:
జానపద స్త్రీలు పని చేసేటప్పుడు ఉజ్జీలు వేసుకుని సంవాదం పాటలు పాడుకుంటూ ఉంటారు.
కింది గేయంలో పిన్ని, కూతురు పెట్టుకున్న ఆభరణాల గురించి ప్రశ్నించడం కనబడుతుంది.
నాయుడోళ్ళింటికాడ! నల్లతుమ్మ చెట్టుకాడ
నాయుడేమన్నాడే పిల్లా!
----------------------------------------
కరణం గారింటి కాడ! కారుయునగ చెట్టుకాడ
కాసులు పేరిస్తానన్నాడమ్మా
---------------------------------
మునసబు గారింటికాడ! ముందర దరవాజ కాడ
ముక్కు పుడక లిస్తానన్నాడమ్మాII
----------------------------------------------
కిందివి కడియాలు! మీదవి పావడాలు
నెత్తిమీద నాగరము! ఏ దేవుడిచ్చాడె పిల్లా
కాళ్ళకు కడియాలు! ఏళ్ళకు మట్టెలు
నాయుడెప్పుడిచ్చాడే పిల్లా! (మిన్నేరు. పుట. 455)
శ్రమ జీవులు పని చేసేటప్పుడు వారి అలసట పోవడానికి, వారు పెట్టుకునే, ఆభరణాలు, కట్టుకునే చీరలు ఎవరిచ్చారే అని ఎదుటి స్త్రీలను ఆటపట్టిస్తూ ఉంటారు. అటువంటిదే పై గేయం. దీనిలో స్త్రీలు మెడలో వేసుకునే కాసుల పేరు, ముక్కు కి అలంకరించుకునే ముక్కుపుడక, కాళ్ళ కడియాలు, మెట్టెలు, మీద పావడ, నెత్తిమీద పెట్టుకునే నాగరము మొదలైన ఆభరణాలు గురించి తెలుస్తుంది. గ్రామాలలో స్త్రీలు పై ఆభరణాలను అలంకరించుకుంటూ ఉంటారు. పట్టణంలో నివసించే వారికి కొంత మందికి నాగరం, కడియాలు తెలియకపోవచ్చు. సమాజంలో ముత్తైదువ అయిన స్త్రీ కాళ్ళకు కడియాలు, మెట్టెలు, ముక్కుపుడక, తలమీద నాగరము, మెడలో కాసులపేరు తప్పని సరిగా అలకరించుకోవాలనే నమ్మకం ప్రగాఢంగా ఉంది.
2.5 ఆకుతీతలో పాడే పాట:
కాట్రేడు సీరెగట్టి
గోటేసిన రైకదొడిగి
మాలచ్చోవిగ నుంటాయే
చూస్తుంటె నా మనసు సోలిపోదుందే
కందుకూరు చిన్నదాన
కాటేరు కోక దానా
కట్టు చెంగుల మీద
సజ్జాకు పసరేడదే (మిన్నేరు. పుట.369)
నాలుగు, ఐదు గేయాలు ఆర్వీయస్ సుందరం గారు చెప్పిన దుస్తులు, ఆభరణాలు అనే రెండవ విభాగం కిందికి వస్తాయి.
కాట్రేడు వేటను వృత్తిగా గల వారు ఆరాధ్య దేవతగా పూజిస్తారు. స్త్రీలు సంతానం కోసం కూడా ఈ దేవతను పూజిస్తారు. ఆమెకు ప్రతినిధిగా కాటమరాజు పేరు ప్రజలలో వ్యాప్తి లోకి వచ్చింది. కాట్రేడు దేవత, కాటమరాజు మృతవీరుడు.
కొంత మంది స్త్రీలకు సాధారణంగా సంభవించే ప్రదర (ఎర్రబట్ట) అనే వ్యాధి కాటేరి అనే క్షుద్ర దేవత వల్ల కలుగుతుందని ప్రజల విశ్వాసం. ప్రదర వ్యాధి రెండు రకాలు. 1. కాటేరు. 2. రక్త కాటేరు. మొదటిది దేవత వలన, రెండవది రక్త కాటేరు వలన కలుగుతుందని జానపదుల నమ్మకం. ఈ వ్యాధి మంత్ర ప్రయోగం వల్ల వస్తుందని కొందరు నమ్ముతారు.
కాటేరు కోక- ఈ వ్యాధి వచ్చిన వారు అంచులకు నీలి తెగరు గళ్ళు ఉండే విధంగా వడికిన నూలుతో చీరను నేయించి, అమావాస్య రోజు పొద్దున, ఈ రోగం గల స్త్రీ ఇంటి బయట వసారాలో పొంగలిబెట్టి, దానితోబాటు ఒక కోడిని బలి యిచ్చి, వాటిని చాకలికి యిచ్చి పంపివేసి, ఆ తరువాత ఆ చీరను కట్టుకుంటుంది. అలా చేయడం వల్ల ఆ వ్యాధి నయమవుతుందని పల్లెవాసుల నమ్మకం. అలాగే సంతానం కలగడానికి స్త్రీలు నాగులకోక ధరించి పాములున్న పుట్టకి పూజిస్తారు. నాగుల కోక అంటే తెల్లనూలు మీద ఎర్ర నూలు గళ్ళతో నేసినది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెల్లనూలు పై ఎరుపు గళ్ళు గల తువ్వాలును నాగుల చవితి నాడు పుట్టపై కప్పుతారు. ఆ తరువాత దానిని ఇంటికి తెచ్చుకుని వాడుకుంటారు. వారు దీనిని నాగుల గావంచి అంటారు.
పిల్లలు పుట్టి చనిపోతుంటే స్త్రీలు ‘చెంచు పేరంటాలు కోక’ కట్టుకుంటారు. అనగా ఎర్రతొగరుగళ్లు అంగుళం వెడల్పుగాను నిట్ట నిలువు పట్టెలతోను నేస్తారు. పక్కమీద కూడ పరుచుకుంటారు. అందువల్ల వారి సంతానం చిరాయువు గా వర్ధిల్లుతుందని ప్రజలు నమ్ముతారు. శిశువులను చంపడానికి ఎన్నెమ్మ, కాటేరు – ఎల్లమ్మ వస్తారని విశ్వసిస్తారు. ఏకవీర – పరశురాముడు తన తల్లి రేణుకాదేవి తలను నరకినపుడు అది మాహురము అనే గ్రామంలో పడిందని. అందువల్ల మారెమ్మ అనే పేరు వచ్చింది. ఈ దేవతను చాణుక్య సీమలో ఎన్నమ్మ అని, నెల్లూరు ప్రాంతాన మారెమ్మ, రాయలసీమ, తెలంగాణలో ఎల్లమ్మ అని జానపదులు పేర్కొంటారు. రేణుకా దేవి కథను, రాయలసీమ పల్లెలలో ‘బవినీళ్లు’ “జవనిక, జవుకుజమిడిలి” అనే వాద్యాన్ని వినియోగించి రెండు రోజులు చెబుతారు. ఈ కథ అలంపురీ మహాత్మ్యంలో ఉందని తెలుస్తుంది. ఆమెను సంతానాన్ని ఇచ్చే దేవతగా వారు పూజిస్తారు.
కాట్రేడు అనగా వనదేవత. వేటకు వెళ్ళే వారు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఈమెను ప్రార్థిస్తారు. జానపదులు ఏదైనా చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఆ చెట్టుకు నమస్కరిస్తారు. అది వారి వన దేవత అయిన కాట్రేడు కి చెందుతుందని వారి విశ్వాసం.
సబ్జాకు- ఈ ఆకుని రుద్రజడ ఆకు అని కూడ అంటారు. ఇది మంచి సువాసన వస్తుంది. శరీర తాపాన్ని తగ్గించి చలువ చేస్తుంది. జానపదులు చెవి నొప్పి వచ్చినపుడు ఈ ఆకు రసాన్ని ఒకటి, రెండు చుక్కలు చెవిలో వేస్తారు. వేసవి కాలంలో చలువ చేయడానికి సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగుతుంటారు. ఆధునిక సమాజంలో ఊబకాయం తగ్గడానికి వీటిని విరివి గా వినియోగిస్తున్నారు. ఈ ఆకును షిరిడీ సాయిబాబా కు దండగా కట్టి అలంకరిస్తూ ఉంటారు. జానపదులు పాడుకునే పై గేయం వల్ల ఈ విషయాలన్ని చర్చించడానికి అవకాశం ఏర్పడింది.
3. ముగింపు:
- జానపద వస్తు సంస్కృతే వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. వీరి సంస్కృతిలో జనజీవనం ప్రతిబింబిస్తుంది. జానపదులు వివిధ రకాల పనులు చేస్తు, వారి శ్రమను మరిచి పోవడానికి పాటలను పాడు కొంటూ ఉంటారు. వాటిలో సంస్కృతితో బాటు వస్తు సంస్కృతి కూడ తెలుస్తుంది. వ్యవసాయ సంబంధ పనులు చేసేటప్పుడు వివిధ సందర్భాలలో వేర్వేరు గేయాలను పాడతారు.
- వాటిలో ధాన్యపు రకాలు రాజనాల, పాలరికెలు, సామలు మొదలైనవి. నాగలి, కొడవలి, కఱ్ఱు, తూము, బొక్కెన, ఏతం మొదలైన పదాలు, కొలమానాలకి సంబంధించిన సోల, గిద్ద, అడ్డ, పుట్టు, మానె, తూమెడు మొదలైనవి, భూమి కొలతలకు చెందిన ఆమడ, క్రోసు, మైళ్ళు మొదలైన పదాలు తెలియ వస్తున్నాయి. బట్టలు నేసేటప్పుడు వినియోగించే మగ్గం, ఒంటి స్థంభం, గంటా నాదం, గజ్జల పలక మొదలైన పదాలు, పడవ పాటలలో చేపలలో రకాలు జెల్లలు మొదలైనవి, నాణాలకు చెందిన పావలా, అణా,బేడ మొదలైన పేర్లు ఈ నాటి విద్యార్థులకు కొంత మందికి తెలియదు. ఆ నాణాలు నేడు వాడుకలో లేకపోవడమే ప్రధాన కారణం.
- కొన్ని కొలమానాలు, తూకానికి సంబంధించిన వస్తువులు ప్రాంతాన్నిబట్టి మారుతుంటాయి. భూ సంబంధమైన కొలతలు ప్రాచీనమైనవి, ఆధునిక పద ప్రయోగాలు వేరుగా ఉన్నాయి. చేపలు వారు పాడే పాటలలో ఎన్ని రకాల చేపలుంటాయో తెలుస్తుంది. స్త్రీలు పనిచేసేటప్పుడు వారు పెట్టుకున్న నగల గురించి పాటగా పాడడం వల్ల ఆభరణాలు తెలిశాయి.
- మరొక గేయంలో స్త్రీలకు కలిగే వ్యాధులు, వాటి నివారణ కోసం చేసే పూజలు కట్టుకునే చీరలు, అవలంభించే పద్ధతులతో బాటు, కాట్రేడు, కాటేరి దేవతలకు గల వ్యత్యాసం, ఏ సందర్భాలలో వారిని పూజిస్తారు మొదలైన విషయాలు వెల్లడి అయ్యాయి.
- భవిష్యత్తరాలకు ఈ పదాలు, పద్ధతులు తెలియాలంటే వీటన్నింటినీ బద్రపరుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. అది జానపద గేయ సేకరణతోనే సాధ్యపడుతుంది. ఇంకా విసురు పాటలు, దంపుడు పాటలు నాటుపాటలు, కోతలు కోసేటప్పుడు పాడేపాటలు, కుప్పలు నూర్చేటప్పుడు పాడే పాటలు మొదలైనవాటిలో కనుమరుగై పోతున్న వస్తు సంస్కృతి వెల్లడి అవుతుంది. ఇటువంటి జానపద విజ్ఞానాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరి పైనా ఉంది.
- జానపద సాహిత్యం పై పరిశోధన చేసేవారు Richard.M.Dorson వర్గీకరణను, R. S.Boggs వర్గీకరణను, R.V.S. సుందరం విభజనను. ఆచార్య రావి ప్రేమలత “జానపద సాహిత్య విమర్శ” అనే వ్యాసంలో పేర్కొన్న అంశాలను, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు “జానపదుల సాహిత్య విమర్శ కథలు” గుర్తించి వాటిని R.S.Boggs చేసిన వర్గీకరణలో చేర్చాలనే ప్రతిపాదన చేశారు. ఈ విషయాలనన్నింటిని పరిగణనలోకి తీసుకుని పరిశోధన చేయవలసిన ఆవశ్యకత ఉంది.
4. పాద సూచికలు:
- “It is possible, however, to define both folk and lore in such a way than even the beginner can understand what folklore is. The term "folk" can refer to any group of people whatsoever who share at least one common factor. It does not matter what the linking factor is — it could be a common occupation, language, or religion — but what is important is that a group formed for whatever reason will have some traditions which it calls its own.” (‘What is Folklore’, The Study of Folklore, Alan Dundes, pp.2, 1965.)
5. ఉపయుక్తగ్రంథసూచి:
- ఇనాక్, కొలకలూరి. 2010. జానపదుల సాహిత్య విమర్శ. జ్యోతి గ్రంథమాల, అనంతపురం, హైదరాబాదు, తిరుపతి.
- కూర్మారావు, బద్రి. 2015. కళింగాంధ్ర జానపద గేయాలు. బద్రి అప్పన్న స్మారక కళాపీఠం, రంగోయి మరియు సిక్కోలు బుక్ ట్రస్ట్.
- కృష్ణకుమారి, నాయని. 1974. జానపద గేయాలు సాంఘిక చరిత్ర. మురళీ పవర్ ప్రెస్ హైదరాబాదు.
- కృష్ణకుమారి, నాయని. 2007. తెలుగు జానపదగేయగాథలు. తెలుగు అకాడమి, పైదరాబాదు.
- గంగాధరం, నేదునూరి. 2006. త్రివేణి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- గంగాధరం, నేదునూరి. 1968. మిన్నేరు. ప్రాచీనగ్రంథావళి, రాజమహేంద్రవరం.
- గంగాధరం, నేదునూరి.1976. మున్నీరు. ప్రాచీన గ్రంధాళి, రాజమహేంద్రవరం.
- ప్రేమలత,రావి. 1991. తెలుగు స్త్రీల చిత్రలిపి. లేజర్ ప్రింటర్స్ 12 వ వీెెెెెధి, హిమాయత్ ననగర్, హైదరాబాదు.
- మునిరత్నం. 1992. చిత్తూరుజిల్లా జానపదగేయాలు సాంఘిక-సాంస్కృతిక పరిశీలన. సాహితీ ప్రచురణలు, తిరుపతి.
- మోహన్, జి.యస్. 1981. తెలుగు జానపద విజ్ఞాన వ్యాసావళి. శ్రీనివాస పబ్లికేషన్స్, మలయనూరు.
- మృణాళిని, సి. 2016. తెలుగు సాహిత్య విమర్శ దర్శనం. విజ్ఞాన సర్వస్వం (సంపుటం-11) కొమ్మర్రాజు విజ్ఞానసర్వస్వ కేంద్రం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- రామరాజు, బిరుదురాజు. 1990. తెలుగు జానపదగేయసాహిత్యం. జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాదు.
- సుందరం, ఆర్.వి. యస్. 2004. ఆంధ్రుల జానపదవిజ్ఞానం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- Alan Dandes. 1965. The study of folklore, University of California, Berkeley.
- Alan Dandes. 1989. Folklore Matters The University of Tennessee Press /Knoxville.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.