AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. ‘కాలజ్ఞాని’ కాళికాంబ సప్తశతి: తాత్త్వికత

ఆచార్య ఆర్. రాజేశ్వరమ్మ
శాఖాధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి - 517502, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9491420180, Email: rajeswarammar180@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
రాయలసీమ పేరు వినగానే కరువులు, కక్షలతోపాటు తత్త్వవేత్తలు, యోగులు, అవధూతలు గుర్తుకువస్తారు. రాయలసీమలో కాలజ్ఞానిగా, తొలిసమాజకవులలో ఒకరిగా, ఆస్థానేతరకవిగా, ఆత్మజ్ఞాన ప్రబోధకులుగా ప్రసిద్ది పొందినవారు పోతులూరి వీరబ్రహ్మం. వీరి రచన “కాళికాంబ సప్తశతి" ఆధారంగా వీరి బోధనల్లోని తాత్త్వికతను వివరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వైశాఖ శుద్ధ దశమినాడు వీరబ్రహ్మం 'జీవసమాధి' అయ్యారు. ఆ రోజును వీరి ఆరాధనోత్సవంగా దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం 'మే' నెల 18 వ తారీఖున నిర్వహింపడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన పద్యాల ద్వారా వారి తాత్వికతను గుర్తు చేసుకొని, మరింత జ్ఞానవంతులుగా మారడానికి వారి శతకపద్యాలు ఎలా దోహదం చేస్తాయో ఈ వ్యాసం నిరూపిస్తుంది. పూర్వవిమర్శకుల అభిప్రాయాలు, వ్యాసాలు, వివిధ పరిశోధనలు ఈ వ్యాసరచనకు ప్రధాన ఆకరాలు. వీరి పద్యాలలో ఆత్మసంబంధ, దైవసంబంధ, గురుభక్తిసంబధ, నైతికవిషయసంబంధాది తాత్త్విక అంశాలను పేర్కొంటూ, విశ్లేషణాత్మకపద్ధతిలో ఈ పరిశోధనవ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: కాలజ్ఞానం, తాత్వికత, సమాజకవి, జీవసమాధి, హంసకాళికాoబ
1. ఉపోద్ఘాతం:
“యోగులందెన్న వేమనయోగి యోగి,
శిష్యులందెన్న సిద్దయ్య పూర్ణమూర్తి,
గురువులందెన్న శ్రీ వీరగురుడు గురువు,
మతములెందన్న వేదాంతమతము మతము."
అని ఎవరో అనుభవజ్ఞుడైన భక్తుడు చెప్పిన పద్యమిది. వేమన వంటి యోగి, సిద్ధయ్య వంటి శిష్యుడు, వీరబ్రహ్మం వంటి గురువు, వేదాంతం వంటి మతం మరొకటి ఉండదని, పరిపూర్ణతకు ఈ నలుగురిని చెప్పుకోనవచ్చునని విశ్వాసంతో చాటిన పద్యమిది.
ఆంధ్రదేశంలో ‘కాలజ్ఞాని' అనగానే స్ఫురణకు వచ్చే వారు వీరబ్రహంగారు. వీరి కంటే ముందు కాలజ్ఞానులుగా భవిష్య పురాణకర్త వ్యాసుడు, కన్నడ కవి సర్వజ్ఞ, ఫ్రెంచి దేశీయుడు నోస్ట్రడామస్ మొ॥ వారు కాలజ్ఞానులుగా ప్రసిద్ద పొందారు - "కాలజ్ఞానo ' అంటే కాలగతిని తెలుసుకోవడమే అని అర్ధం. రాగల కాలలలో కాగల విషయాలను తమ దృష్ట్పితో దర్శించి తపస్సు,యోగం ద్వారా తాము తెలుసుకున్న భావాలను సత్యాలను తమ తత్వాలలో, రచనల్లో అభివ్యక్తీకరించారు.
ఇలా అభివ్యక్తిరించిన వారిలో పోతులూరి వీరబ్రహ్మం ఒకరు. వీరు అభివ్యక్తీరించిన అంశాలలో ఆత్మ సంబంథమైనవిగా, దైవసంబంధంగా, గురుభక్తి సంబంధంగా, నైతిక ధర్మాలపరంగా తనదైన శైలిలో పద్యాల రూపంలో, తత్వాలరూపంలో వ్యక్తీకరించారు. వీటితో పాటు ఆనాటి సమాజంలోని మూఢవిశ్వాసాలను, విగ్రహారాధనను ఖండిచారు. స్త్రీప్రాముఖ్యాన్ని, గురుభక్తిని, 'కుకవులగురించి, విద్య పరమార్ధాన్ని, సంకుచితమనస్తత్వంపట్ల నిరసన, సత్యవాక్కుకు గల ప్రాధాన్యం మొ. అంశాల పట్ల వీరబ్రహ్మం గారి అభిప్రాయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం పరిచయం:
వీరబ్రహ్మం గంగానదితీరంలో బ్రహ్మాండపురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు జన్మించారని జనశ్రుతి. అతి పిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పవడంతో యనమదల వీరభోజయాచార్యులు, వీరపాపాంబల చేత పెంచబడినాడని ప్రసిద్ది. ఆ తర్వాత కర్నూలుజిల్లా బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో ఆవులు కాస్తూ జీవించాడని, ఆసమయంలోనే కాలజ్ఞానాన్ని రాశాడని, ఆమెకు, ఆమె భర్త కు కాలజ్ఞాన బోధ చేశారని జీవిత చరిత్ర ద్వారా తెలుస్తున్నాయి. వీరికాలం 1608-1693 ప్రాంతానికి చెందిన వారని చరిత్రకారుల అభిప్రాయం. వీరు వైశాఖశుద్ధదశమినాడు కడపజిల్లా కందిమల్లయ్య పల్లెగ్రామంలో 'జీవసమాధి' అయ్యారు. బ్రతికుండగానే అవసానదశలో సమాధి అయ్యారు. హిందూమతంలో జీవన్ముక్తిని, ముస్లిం సమాధితో జోడించి, "జీవసమాధి” అనే సంప్రదాయం వీరబ్రహ్మంతోనే ప్రారంభమై ఉండవచ్చని పండితుల అభిప్రాయం.
3. రచనలు:
కాలజ్ఞానవచన తత్వాలు, ద్విపదతత్వాలు, సౌజన్యపత్రిక, జీవైక్యబోధ, సిద్ధగురుబోధ, కాళికాంబ పద్యరత్నమాల, కాలజ్ఞాన గోవిందవాక్యాలు, కాళికాంబ సప్తశతి మొ. ఉన్నాయి.
4. పూర్వ పరిశోధనలు:
- బ్రహ్మoగారి రచనలను పరిష్కరించి వెలుగులోకి తీసుకువచ్చిన వారిలో ప్రధానంగా కొండవీటి వెంకటకవి, శ్రీ వాసిలి వెంకట నరసింహారావు, ర్యాలీ వీరభద్రేశ్వర స్వామి, గంగరాజు, కృష్ణమూర్తి, రంగయ్య, స్వర్ణ సుబ్రమణ్యకవి, జవంగుల నాగేశ్వరరావు మొ. వారు.
- బ్రహ్మoగారి పై వివిధ విశ్వవిద్యాలయాలలో 4 పిహెచ్.డి.లు, 3 ఎం.ఫిల్ లు వచ్చాయి.
- కన్నెగంటి రాజమల్లాచారి ‘ వీరబ్రహ్మంగారి జీవితం రచనలు-పరిశీలన’ అనే అంశం పై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం-1986
- యండ్లవల్లి పాoడురంగాచార్యూలు ‘శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు -సమగ్ర పరిశోధన’ మద్రాసు విశ్వవిద్యాలయం -1989
- మర్రి వెంకట నరసింహారెడ్డి ‘పోతులూరి వీరబ్రహ్మం- కాలజ్ఞానం’ ఉస్మానియా విశ్వవిద్యాలయం – 1991
- మూల మల్లికార్జునరెడ్డి ‘వీరబ్రహేంద్ర పద్యరచనలు– తాత్విక విశ్లేషణ’ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం- 2006 లో పరిశోధనలు వచ్చాయి.
- వీరితో పాటు రాళ్ళపల్లి, కొండూరు వీరరాఘవాచార్యులు, మీగడ నరసింహారెడ్డి, కె.కె రంగనాథాచార్యులు, కొండవీటి వెంకటకవి, కె .సుందరయ్య, ఎన్.గోపి మొ, వారు విమర్శనాత్మక వ్యాసాలను వెలువరించారు.
5. బ్రహ్మంగారి విశిష్టత - తాత్త్వికబోధ:
శ్రీ పోతులూరి వీరబ్రహ్మం తత్వవేత్త. సమాజానికి తత్వవేత్తలు ఒక మార్గనిర్దేశం చేస్తారు. తత్వవేత్తలు తాము నివసిస్తున్న సమాజంలోని మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా ప్రవర్తించడం బాగులేదు. సమాజానికి ఆరోగ్యకరం కాదు. దీనిని సరిదిద్దుదామని భావించి రచన చేయడం తత్త్వ రచయితల ప్రత్యేకత.
తాను దర్శించిన దానిని అభివ్యక్తీకరించడo తాత్వికుని లక్షణం. ఇలా ‘ఫిలాసఫీ' అనేది ఆలోచనకు సంబంధించినది. ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు చెప్పు కోవడం ఫిలాసఫీలో భాగం. అయితే పాఠకుడి సందేహాలను నివృత్తి చేసేవిధంగా సమస్యకు పరిష్కారాన్ని చూపించేది తాత్వికం. బ్రహ్మంగారి తాత్వికత ఈ క్రింది అంశాల ద్వారా వివరించుకోవచ్చు. వాటిలో-
5.1 ఆత్మ సంబంధమైనవి:
ఆధ్యాత్మిక పరమైన అంశాలలో ఆత్మ,పరమాత్మల గురించి, అద్వైతం గురించి-
“అన్ని తనువులందు ఆత్మయొక్కయటి అని
చర్చ చేసి పలువురర్భకులుగ
వారి వారి యిచ్చవచ్చినట్లుoదురు” (కాళికాంబ సప్తశతి - 92వ పద్యం)
"అఖిల భూతములకు ఆత్మ యొక్కటియని
గుర్తెరిoగి మెలగు గుణికి నెందు
మొహ శోకములు సమూలమ్ముగా దెగు" ( 93 వ పద్యం)
అని వీర బ్రహ్మంగారు ప్రాణులందు, అన్ని శరీరాలయందు ఆత్మ ఒకటేనని చర్చ చేసిన వారే సమాజం లో అంటుకొన్న జాడ్యాల కారణంగా భయపడి వారికి బుద్దిపుట్టినట్లు ఆచరణ లో సర్వప్రాణులు సమానమనే భావనకు ప్రాముఖ్యత నివ్వలేదనే సత్యాన్ని వెల్లడించారు.
5.2 దైవ సంబంధమైనవి:
భగవంతునికి వివిధరూపాలు లేవని చెప్పి, అసలు భగవంతుడు నిర్గుణుడని, రూపనామ క్రియారహితుడని చెబుతూ-
"నిగ్రహమ్ము లేని నిర్భాగ్యులెల్లరు
విగ్రహముల కెల్ల విందుచేసి
భోగభాగ్యములను బొంద కాంక్షింతురు. (16వ పద్యం)
మరొక చోట-
"నిర్విశేషమైన నిర్గుణబ్రహ్మమ్ము
సగణముగను బోధ సలిపి జనుల
జడుల చేసినారు మిడిమిడి జ్ఞానులు
కాళికాంబ హంస కాళికాంబ.” (614వ పద్యం)
అంటూ భగవంతునికి రూపమే లేనప్పుడు అందులో శివుడని, విష్ణువని భేదాలు కల్పించి పూజించుట మూర్ఖత్వమే అవుతుందని పోతులూరి వాదన. మిడి మిడి జ్ఞానులు తమ స్వార్థంతో జనులను ఆలోచింపనీయకుండా జడులుగా మార్చారాని తెలియజేశారు. 'హంస' శబ్దం “సోఅహం"జపం వల్ల జన్మించేదని సంప్రదాయార్థం. హకారానికి ఈశ్వరుడనీ, సకారానికి అచిత్తు అయిన ప్రకృతి అనీ, రెండక్షరాల నడుమానున్నఈ పూర్ణానుస్వరం ఈశ్వర ప్రకృతుల తాదాత్మనిరూపకమైన జీవుడని అర్ధం చెప్పారు.కాలికాoబ పదం జగన్మాత అయిన కాలికాదేవిని తెలిపేది గా ఈ పద్యాలలో ఉపయోగించిన తీరును బట్టి తెలుస్తుంది.
5.3 గురు భక్తి సంబంధమైనవి:
ఇంతకూ గురువు గొప్పా? యోగి గొప్పా? యోగం బాగుంటే యోగి గొప్ప. గౌరవం నిలుపుకుంటే గురువు గొప్ప. ఈ అర్ధం వచ్చే పద్యాలు 'కాళికాంబ సప్తశతి'లో వందకు పైగా ఉన్నాయి. భావవాద తాత్త్విక ధోరణిలోనే గురువు అనివార్య జ్ఞాన బోధకుడైనాడు. అలాంటి గురువును గురించి-
"తనువులోని వాడు తానాడి నట్లుండు
కానిపోని లేని క్రమము దప్పి
గురుని దీక్ష గొన్న కుదురును రోగమ్ము
కాళికాంబ హంస! కాళికాంబ!” (కాళికాంబ సప్తశతి 137వ పద్యం)
గురువు శిష్యుని ప్రయోజకుని చేయాలనే సంకల్పంతో ఎద్దుల ముక్కుతాడు మాదిరిగా వివిధ ఉపాయాల చేత, పనుల వల్ల కృషి చేసేటట్లు తీర్చిదిద్దడం కారణంగా ఆ శిష్యుడుకి చిత్తశుద్ధి కలుగుతుంది. లేని యెడల అలా తగిన సమయం లో వంచని యెడల సోమరితనంతో కపట బుద్దులు గా తయారవుతారని, సరియైన సమయంలోనే శిష్యుని గాడిలో పెట్టాలని తెలిపారు.
"గురుడు శిష్యుడన్న గుఱు తెఱుంగ వలె
గురుడు జ్యోతి శిష్యవరుడు ద్రష్ట
సద్గురుండు నిలుచు సవ్వాపసవ్యాల
కాళికాంబ హంస కాళికాంబ. (138 వ పద్యం)
అంతేగాక గురుశిష్యుల సంబంధాన్ని గురించి వివరిస్తూ గురువు నిరంతరం శిష్యునిగా గుర్తు పెట్టుకోవాలి. గురువు అజ్ఞానాన్ని పొగొట్టే దివ్యజ్యోతి. ఆ జ్యోతిని దర్శించే ద్రష్ట శిష్యుడు, ఏది సవ్యము, ఏది అపశవ్యమూ, ఏది మంచి, చెడు మార్గమో నిర్దేశిoచే వాడు గురువుని గురువు ఔన్నత్యాన్ని తెలియజేశాడు.
5.4 నైతిక ధర్మాలు గురిoచి:
మానవుని మనుగడను ఉత్థాన పథంలోకి తీసికొని వెళ్లు నైతిక ధర్మాలను కొన్నింటిని ఆయన కాళికాంబ సప్తశతిలో పేర్కొన్నారు.
"పుస్తకములు చదువ పూర్ణత్వ మబ్బదు
హృదయ సంపుటముల చదువవలయు"
అని మానవ మర్మజ్ఞులైన పోతులూరి కళ్ళముందు కదలాడే రకరకాల మనుషులను,వారి మనస్తత్వాలను తూర్పారబట్టి చూపారు. ఇంద్రియాతీతమైన పరతత్త్వాన్ని, ప్రాముఖ్యాన్ని గురించి, పొరలు విప్పి చూపారు.
"నిజము మీద భూమి నిలబడి యుండును
సత్యవాక్కు వలన జనత నడచు
సత్యమొకటే పాప సంహారముం జేయు
కాళికాంబ హంస కాళికాంబ.” (170 పద్యం)
ఈ భూమి స్థిరంగా కలకాలం నిలబడి ఉండాలన్నా. ఈ భూమి మీద ప్రజల జీవితం ఆనందంగా సుఖంగా సాగాలన్నా, చేసిన పాపాలు హరింపబడాలన్నా నిజమైన మాట మాట్లాడటం మీదనే ఆధారపడి ఉందని సత్యవాక్కుకుగల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. ఇదే విషయానికి గల విశిష్టతను గురించి ఆంధ్రమహాభారతంలో దుష్యంతోపాఖ్యానంలో శకుంతల సైతం వ్యక్తం చేసింది.
"వెలయుగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దులనిడి తూచగ సత్యము,
వలనను ములుసూపు గౌరవంబున పేర్మిన్" (ఆది, చతుర్ధ. 94వ పద్యం)
5.5 విగ్రహారాధనను గురించి:
పోతులూరి వీరబ్రహ్మంగారు విగ్రహారాధన గురించి తీవ్రంగా నిరసించారు. పై పై డాంభికాచారాలను ఖండించాడు.
"మాయ దేవుడాయె మనసు పూజారాయె
దొంగభక్తి యగరు ధూపమాయె
నాలి ముచ్చుదనమె నైవేధ్యమైపోయె
కాళికాంబ హంస కాళికాంబ.
"సాటి మానవునకు సాయమ్ము పడబోక
నల్లరాళ్లు తెచ్చి గుళ్లు కట్టి
మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడంబోదు
కాళికాంబ హంస కాళికాంబ.” (291వ పద్యం)
విగ్రహరూపంలో ఉన్న దేవుణ్ణి మొక్కేకంటే సాటి మానవుడికి సాయపడడం మంచిదన్నాడు.
"చెట్టు పుట్టలకును చేయెత్తి మ్రొక్కుచు
వట్టి మాటలిట్లు వదరనేల
దిట్టమైన గురుడు దేదీప్యమై యుండ
కాళికాంబ హంస కాళికాంబ“ (48వ పద్యం)
వీరబ్రహ్మం తాత్వికకవి మాత్రమే కాక, సమాజకవి కూడా. ఆనాటి సామాజికపరిస్థితుల దృష్ట్యా సమాజాన్ని, సమకాలీనపరిస్థితులను అర్థం చేసుకుని, సమాజంలోని రుగ్మతలను వేలెత్తి చూపి, వాటిని సవరించుకోమని తమదైన పద్దతిలో తమ రచనలు ద్వారా, బోధనలు ద్వారా వెలిబుచ్చిన వారిని ‘సమాజకవి’ అని పేర్కొనటం జరిగినది. ఈ నేపథ్యం వీరబ్రహ్మంను కూడా తొలి సమాజకవిగా పేర్కొనటం జరిగిoది.
6. ముగింపు:
- కులమతాల ఊబిలో కూరుకుపోయిన నేటిసమాజం జ్ఞానాన్ని పొంది, సంకుచితత్వాన్ని వీడి, అభ్యుదయభావన అలవాటు చేసుకోడానికి బ్రహ్మంగారి పద్యాలు తోడ్పడతాయని తేటతెల్లమైంది.
- కుల,మత,ప్రాంత తీవ్రదురహంకారంతో మసలుకునే మానవులు విశాలహృదయంతో ప్రజల మేలుకోసమే మతమని నమ్మాల్సిన అవసరాన్ని గుర్తించి మసలుకోవాలనే తత్త్వం ఈ పద్యాలు తెలుపుతున్నాయని స్పష్టమైంది.
- నిజం మాట్లాడటం కరువైన నేటి సమాజంలో సత్యవాక్కుకు గల ప్రాముఖ్యాన్ని సైతం ఈ పద్యాలు వెల్లడిస్తున్నాయి.
- బ్రహ్మంగారు 400సం॥ ముందు చెప్పిన బోధలు ప్రస్తుతసమాజంలోని ప్రతి ఒక్కరికి అనుసరణీయమైనవేనని ఈ పత్రం ద్వారా వెల్లడైంది.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖరరెడ్డి, రాచపాళెo వేమన కవిత్వం – సామాజికత. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ, 2017
- చంద్రశేఖరరెడ్డి, రాచపాళెo . వేమన కవిత్వం-ఇతర తత్వవేత్తలు. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ, 2017
- చంద్రశేఖరరెడ్డి, రాచపాళెo. వేమన కవిత్వం- ఇతర భారతీయకవులు. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ, 2017
- మల్లికార్జునరెడ్డి, మూల. పోతులూరి వీరబ్రహ్మం విమర్శవ్యాసాలు. సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప. సెప్టెంబర్, 2019
- రంగనాథాచార్యులు, కె.కె. తెలుగులో తొలి సమాజ కవులు. ఆంధ్రసారస్వతపరిషత్తు, తిలక్ రోడ్డు, హైదరాబాద్, 1983
- వెంకటనరసింహారావు, వాసిలి. (పరి.) పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం. వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠం, కందిమల్లయ్యపల్లి, వై.ఎస్.ఆర్ కడప జిల్లా, 2010
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.