headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. ‘దేవరగట్టు’కథ: కర్నూలు ప్రాంతీయసంస్కృతి, సంప్రదాయం

కె. వెంకటస్వామి

పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9052961440, Email: swamy.ma82@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

మన తెలుగు ఆధునిక సమాజంలో సామాజిక జీవనం విభిన్నమైనటు వంటి సంస్కృతులకు, సంప్రదాయాలకు నిలయం. ప్రజా జీవనంలో ప్రాంతీయ సంస్కృతులనేవి ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటాయి. కర్నూలు జిల్లా,మరియు ఉభయ తెలుగు రాష్త్రాల ప్రజలకు బాగా గుర్తుండే సంప్రదాయ ఉత్సవం దేవరగట్టు బన్ని ఉత్సవం లేదా కర్రల సమరం. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున తెలుగువారి చూపంతా దేవరగట్టు కర్రల సమరం మీదనే ఉంటుంది. పండుగ ఉత్సవాన్ని ఎందుకు కర్రల సమరంగా పిలుస్తారు, దాని ప్రత్యేకత ఏమిటి అనేది ప్రజలందరి మదిలో మెలిగేటు వంటి ప్రశ్న. దేవరగట్టు బన్ని ఉత్సవం గురించి విమర్శకులు, ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకొనుట వలన ప్రముఖ కథా రచయిత జి.వెంకటకృష్ణ దేవరగట్టు బన్ని ఉత్సవం గురించి కథగా తీర్చిదిద్ది, తెలుగు కథా సాహిత్యానికి అందించాడు. దేవరగట్టు కథను పరిశోధనా దృష్టితో విశ్లేషణాత్మక పద్ధతిలో విశ్లేషించడం వలన కథాసాహిత్యంలో ప్రాంతీయసంస్కృతి, సంప్రదాయాలలో వైవిధ్యము, ప్రాంతీయంగా వారి ఆచార వ్యవహారాల తీరు తెలుస్తుంది. దేవరగట్టు వంటి కథను పరిశోధనా దృష్టతో విశ్లేషించడం వలన సమాజంలో పాతుకొని పోయిన మూడ విశ్వాసాలు, మూడ నమ్మకాలు, హింస వంటి సంఘటనలను రూపుమాపవచ్చుననేది ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సంస్కృతి, సంప్రదాయాల చాటుగా జరిగే ఫాక్షన్ గొడవలను నియంత్రించడానికి ముందస్తు ప్రణాళికలను రూపొందిచుకొనుటకు వీలుగా ఉంటుంది.

Keywords: దేవరగట్టు, బన్నిఉత్సవం, కర్నూలుజిల్లా, జి.వెంకటకృష్ణ, గొరవయ్యల నృత్యం, పల్లకోత్సవం, రక్తతర్పణం, దేవరగట్టు భవిష్యవాణి, సంస్కృతి-సంప్రదాయం, ప్రాంతీయత.

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వచ్చాయి. సాహిత్యప్రక్రియల్లో కవిత్వం, గేయం, కథానిక, నవల, నాటకంగా వెల్లివిరిసినవి. ఈ సాహిత్య ప్రక్రియలన్ని ఉద్భవించడాని లేదా రచించబడటానికి ముఖ్యమైన కారణం చరిత్ర, సంస్కృతి, సంపదాయాలే. ఆయా ప్రాంతాలకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టాలు, సంస్కృతికాంశాలు సాహిత్యంలో వస్తువులుగా మారుతాయి. ఒక్కొక ప్రాంతానికి, ఒక్కొక రకమైన చారిత్రక రూపాలు, సంస్కృతిక అభిప్రాయాలు, జీవన వ్యవహారికశైలి ఉంటుంది. విభిన్నమైన ప్రాంతీయాంశాలను, సామాజిక అంశాలకు వస్తువు రూపాన్ని కల్పించేది సాహిత్యం, రచయిత తన చుట్టూ ఉన్న విషయాలను, తను చూసిన అంశాలను, తన జీవితం అనుభవించిన అనుభవాలు సాహిత్య ప్రక్రియలుగా రూపొందించడం సాహిత్యం, సామాజిక జీవితాన్ని ఒక్కొక్కసారి భౌగోళిక పరమైన సరిహద్దులు, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వాతావరణం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేయబడిన అంశాలే ఆ సమాజంలో ప్రత్యేకమైనవిగా గుర్తింపు పొందుతాయి. సాహిత్యప్రక్రియల్లో ప్రభావితం చేయబడిన అంశం రచయితల శైలిని బట్టి కవిత్వం, గేయం, కథానిక, నవల, నాటకం వంటి రూపాల్లో సమాజానికి చేరువ అవుతుంది.

నేటి ఆధునిక సాహిత్యంలో రచయితలు, సామాజిక జీవితంలో ఏదైతే సమస్య కొత్తగా కనిపిస్తుందో, దానిని సాహిత్య ప్రక్రియలోకి మార్చడంలో నూతన ఉత్సాహంతో ఉంటారు. కథాసాహిత్యంలో ఆధునిక సమాజంలో ప్రత్యేకమైన వస్తువును ఎన్నుకొని రచనలు చేయడంలో కర్నూలుజిల్లా కథారచయితలల్లో ముందు వరుసలో ఉండే రచయిత జి. వెంకటకృష్ణ. ప్రాంతీయ జీవన సరళి, శైలి, ఆచారవ్యహారాలు, బాగా తెలిసిన రచయిత కావడం వలన ప్రాంతీయ కథావస్తువులు రూపాన్ని కల్పించి, జీవాన్ని పోశాడు. ఇతని రచనలు కవిత్వం, కథలలో చాలా వరకు రచించబడినా తన కథాసాహిత్యంలో అత్యంత గుర్తింపు తెచ్చిన కథ మాత్రం “దేవరగట్టు”. ఈ కథను రచయిత రాయడానికి కారణం కథా వస్తువును కళ్ళెదుట్టే ప్రత్యక్షంగా చూసి, అనుభవంతో రాసినదిగా గుర్తింపు పొందినది. దేవరగట్టు కథలో జి. వెంకటకృష్ణ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలో విభిన్నమైనటు వంటి ప్రాంతీయసంప్రదాయాన్ని తెలియజేశాడు. విభిన్నమైనటు వంటి సంస్కృతిలో మిగిలిన తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు  ఏయే అంశాలలో విభిన్నమైనదో అని తెలియ జేయడం ఈ వ్యాసాంశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

దసరా అంటేనే తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయంలో శరనవరాత్రులు, దుర్గాదేవి తొమ్మిది అవతారికలతో పూజలందు కోవడం. దేశం మొత్తం కోలాహాలంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంట్లిపాది సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. దసరా నవరాత్రుల్లో ఆదిపరాశక్తి తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది రకాలైన రూపాలతో పూజలందుకొని, భక్తులను తరింపజేస్తుంది. ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శలు జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూ లు జిల్లా ఆలూరు మండలంలోని దేవరగట్టు ఉత్సవం మాత్రం భిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకం మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు దసరా అంటే స్ఫురించేది మొట్టమొదట దేవరగట్టు బన్ని ఉత్సవం. దీనికి ఇప్పుడున్న సాంకేతిక కాలంలో “కర్రలసమరం” గా పిలుస్తారు. ఎందుకు ఇంత ప్రత్యేకమైన పండుగ అంటే ఉత్సాహంగా, ఆనందంగా ఉండాల్సిన రోజున, రక్తాన్ని చవి చూస్తున్న సంప్రదాయంగా దేవరగట్టులో ఉండటమే. కర్రల సమరంగా పిలిచే బన్ని ఉత్సవం పూర్వ కాలంలో ఒక ఆట మాత్రమే కాలపరిస్థితుల్లో ఈ ఉత్సవం ఆట కాస్త ఉత్సవ సమరంగా మారిందని స్థానికల అభిప్రాయం. దేవరగట్టు కొండపైన తాబేలు రూపంతో వెలసిన మాళమల్లేశ్వరునికి దసరా సందర్భంగా కళ్యాణోత్సవం అనంతరం ఈ బన్ని ఉత్సవం ఆర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో మొదలై ఉదయం గొరవయ్యల నృత్యం, గొలుసు తెంపుటతో ముగుస్తుంది. ఈ బన్ని ఉత్సవం ఒకప్పుడు మూడు గ్రామాల ప్రజలు మాత్రమే జరుపుకునే వారు. అక్కడి స్థానికులు మాత్రమే పాల్గొనేవారు. నేడు కొన్ని వేల మంది ఈ ఉత్సవం చూడటానికి వస్తున్నారు. బన్ని ఉత్సవం జరిగేటప్పుడు ఎక్కవ తోపులాట జరగటం, కరలకు తలలు తగిలి గాయపడుతున్నారు. అంతే కానీ ఇది కర్రల యుద్ధం కాదు అని స్థానిక ప్రజలు వాక్కుగా రచయిత తెలియజేశాడు.

2. రచయిత జీవితరేఖలు:

కర్నూలు జిల్లాలోని వివిధ కులాల మాండలికాన్ని, యాసని, ప్రాంతీయ స్పృహను అద్భుతంగా పట్టుకున్న కవి, కథకుడు జి.వెంకటకృష్ణ వృతిరీత్యా కర్నూలు సమగ్ర సహకార అభివృద్ధి ప్రణాళికలో ప్రాజెక్టు ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ పని చేస్తున్న సుప్రసిద్ధ కథకులు. 1965లో అనంతపురం జిల్లాలోని బూడిద గడ్డ పల్లిలో జన్మించాడు. వృతిరిత్యా కర్నూలులోనే స్థిరపడి కర్నూలు కథా రచయితల్లో ప్రముఖ కథారచయిత పేరు పొందాడు. కర్నూలు జిల్లా సాహిత్యాన్ని ఎన్నో సేవలను చేశాడు, చేస్తూనే ఉన్నాడు. వీరి సాహిత్య సేవలో లోగొంతుక(2000) కవితా సంపుటి, గరుడస్తంభం(2005)లో తొలి కథాసంకలనం, కర్నూలు జిల్లాను ముంచెత్తిన తుంగభద్ర వరద(2009)లో వరదా మనిషి అనే దీర్ఘకవితను, (2010)లో దున్నే కొద్ది దుఃఖం, కొన్ని రంగులు ఒక పద్యం అనే కవితో సంకలనాలు, చిలుకలు వాలిన చెట్టు కథా సంపుటిని ప్రచురించారు. హంద్రీగానం(2016)అనే దీర్ఘకవితను, చినుకుదేవి (2014)లో కవిత్వాన్ని, దేవరగట్టు(2018)లో కథా సంకలనాన్ని ప్రచురించి కలం అనే సేద్యానికి నిరంతరం ఆపని సాహితీ కృషీవలుడుగా గుర్తింపు పొందాడు. సాహిత్య సేవకు గాను జాతీయ స్థాయిలో ఢిల్లీ తెలుగు అకాడమి పురస్కారాన్ని, కొన్ని రంగులు ఒక పద్యం అనే కవితా సంకలనానికి సినారే పురష్కారాన్ని అందుకున్నాడు. రచయిత కర్నూలు జిల్లా ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ దృక్పథంలో కథా వస్తువును ఇతివృత్తాలును, పాత్రలను, బలహీన వర్గాల భావోద్వేగాలను, స్త్రీ పాత్రలను, ప్రాంతీయ యాసను ఏమాత్రం తప్పు దోవలు పట్టకుండా తీర్చిద్దిన వైనం వెంకటకృష్ణగారి కథల్లో కనిపిస్తుందనడానికి దేవరగట్టు, వీరగళ్ళు, వజ్రం, ఉబ్బిన కన్ను, జొరం, కిటికీ, నీకంట్లో నీవేలు, కురిసిన మనసు, వసుధ, విభజన రేఖలు, వర్తమానం, ఒక కథగా మారాలనుకున్న తల్లి, శయ్యాగారము, స్మృతి వంటి కథలు స్పష్టతను పాఠకుడికి కల్గిస్తాయి. ప్రతి కథలో వాస్తవిక కర్నూలు జిల్లా ప్రాంతీయ జీవితానుభవాలకే పట్టం కట్టినట్లుగా, పాత్రలన్నీ నేరుగా పాఠకునితోనే సంభాషించే అనుభూతిని కల్గిస్తాయి.

3. సంస్కృతి:

కాలం కాగితంపై ఒక జాతి కలిసికట్టుగా చేసే సంతకం సంస్కృతి. ఒకతరం మరొక తరానికి అందించే జీవన సందేశం ఉన్నతమైన విలువలలో పుట్టె ఉదాంతమైన సాగరసంఘమానికి నిత్యం పరితపిస్తూ ఉంటుంది సంస్కృతికి భాషే పునాది సంస్కృతిని విస్మరించిన వారికి భవిష్యత్ లేనట్లే అని తెలియజేసేది. భాషను కాదంటే సంస్కృతిని కాదనట్టి సకల ఆచార, వ్యవహారాల,జీవన విలువల సమ్మేళనమే సంస్కృతి జాతి చారిత్రక పునాదులనులనే పాఠాలను నిత్యం మనం చేసుకుంటూ వర్తమాన విషయాలను కైవసం చేసుకుంటూ ఉన్నతమైన ఆశయాలతో విలువంచే భవిష్యత్ కార్య చరణను రూపొందించుకోవడానికి సంస్కృతి సహాకరిస్తుంది.జాతి మాట్లాల్లో బాషలోనూ,సంగీతం,సాహిత్యం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం మొదలగు కళారూపాల్లో కట్టు,బొట్టు,పలకరింపు,ఆదరణ వంటి సాంప్రదాయక, ఆచార, వ్యవహారాల్లోనూ, సంస్కృతి ప్రతిబించిస్తుంది. తరతరాలుగా జాతి పరంగా వస్తున్న వారసత్వాన్ని, ఆలోచనల్ని, ఆశయాలను, ఆదర్శాలను తనలో ప్రతిఫలిస్తుంది. సంస్కృతి సాగిపోయే ప్రవాహం లాంటిది, మారుతున్న కాలంలో పాత విషయాలను తనలో దాచుకొని, కొత్త విషయాలను వ్యక్తపరుస్తూ భిన్నరుచులు, అభిరుచులు, అభిప్రాయాల సమాహారమే సంస్కృతి.

4. కర్నూలు జిల్లా సంస్కృతి:

కర్నూలులో అనుసరించే సంప్రదాయాలు మరియు ఆచారాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఉన్నప్పటికి కొన్ని సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ మూడు ప్రధాన మతాల సంప్రదాయాలు మరియు తత్వాలు, అనగా హిందూ మతం, ఇస్లాం మరియు క్రైస్తవ మతం, మధ్యయుగ బౌద్ధమతంలోని కొన్ని అంశాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన మిశ్రమం. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయనృత్యరూపం, అయితే ఈ ప్రాంతం వీరనాట్యం, బుట్ట బొమ్మలు, డప్పు, తప్పెట గుళ్లు, ధింసా మరియు కోలాటం వంటి ఇతర నృత్య రూపాలకు కూడా ప్రసిద్ధి చెందింది. హరికథ లేదా కథా కాలక్షేపం అనేది మతపరమైన ఇతివృత్తాన్ని అన్వేషించే కథాకథనం. హరికథ సాధారణంగా ఒక సాధువు జీవితం లేదా భారతీయ ఇతిహాసంలోని కథ ఆధారంగా ఈ ప్రాంతంలో ఉద్భవించింది. హంపయ్య పున్నమి రోజున చిన్నహోత్తూరు తన్నుల ఉత్సవం, కైరుప్పలలో పిడకల సమరం, మద్దికెరలో గుర్రాల పారువేట ఉత్సవం, సంతేకుళ్ళూరులో హోలీ రోజు రథీమన్మధుల ఉత్సవం,దసరా సందర్భంగా జరిగే బన్ని పండుగ కర్నూలు జిల్లా ప్రత్యేకమైన సంస్కృతికి, సాంప్రదాయాలకు నిదర్శనంగా కనిపిస్తాయి.

5. దేవరగట్టు స్థలప్రాశస్త్యం:- 

పూర్వం ఈ ప్రాంతానికి హిరణ్యకారణ్యంగా పిలువబడేది. ఈ అరణ్యంలో మునిపల్లెలు ఉండేవి. అరణ్యంలో మునుల ఆశ్రమాలలో జీవనం కొనసాగుతుండేది. అరణ్యంలో మణిమాల్లాసురుడు, మాయావిలు అన్నదమ్ములు ఇద్దరూ రాక్షసులు అవ్వడంతో ముని పల్లె మునులు చేసే యజ్ఞాలు, తపస్సులు రాక్షస వీరుల అంతానికై పన్నిన కుట్రగా, బావించేవారు. మణిమల్లాసురుడి తమ్ముడు మాయావీ మాటలలో-

“అన్నా మహా వీర యీ మునులు వారి వెంట సురలూ ఒక వ్యూహం, తపస్సు పేరిట ముందు వచ్చెడి వారు మునులు, వారి వెనువెంటనే సురలూ, కొడవలి, గొడ్డలి చేదాల్చిన హరులూ, గదఖడ్గాదులను, భుజాన విల్లంబులతో, నాగలి చేతపట్టిన బలాధములూ, మునుల తపస్సు ఒక నెపము అడొచ్చే అసుర జాతిని నిర్ములించడమే లక్ష్యం. యీ కుట్రను ముక్కలు చేయందే మనకు మనగడ లేదు"-1

అని అన్నను మునుల నాశనానికి పంపాడు, మునుల పల్లెలకు రక్షకుడు కాలభైరవుడు. మాల్లాసురుడికి, కాలభైరవుడికి పోరాటం జరుగుతుంది. పరమశివుని అంశ కలిగిన కాలభైరవుడు తన బాణంతోసంధిస్తే మల్లాసురుని దేహం నుండి రక్తం బొట్టు నేలరాలుతుంది. నేలరాలిన రక్తం చుక్క నుండి మరొక యేధుడు పుట్టడం, అలా ఎన్ని రక్తపు చుక్కలు నేల పడితే అంతమంది యోధులు పుట్టి ఎదురు నిలబడటంతో భైరవుడు అలసిపోతాడు. తాభేలు రూపంలో ఉన్న పరమేశ్వరుణి స్మరిస్తే ఘృతమారిని తలంచు అని చెప్పినట్టుగా ప్రతీక. భైరవుడు పరమేశ్వరుణి ఆజ్ఞనమేరకు ఘృతమారి ఆవాహనం చేసుకొని మణి మల్లాసురుడి రక్తాన్ని నేలకు తాకుండా అడ్డుకుంటే మల్లాసుండి రక్తం భైరవుడి బాణాలకి శిలా రూపంగా మారి కొండమీద రక్త పడిగా, రక్తగుండ్లుగా పిలువబడుతున్నాయి. వాటి శాంతి కోసమే మాళమల్లేశ్వరస్వామి ఆలయ పూజారి తన పిక్కలనుండి రక్తాన్ని అర్పిస్తాడు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో, అమ్మవారు కూడా మహిసాసురుడిన మర్థించడానికి అవతరించిన రూపంగా, దేవరగట్టు ప్రాంతంలో కూడా మణిమల్లాసురుడిని సంహరించుడానికి శక్తి స్వరూపిణిని ఘృతమారిని భైరవుడు ఆహ్వానించినట్లుగా స్థల ప్రాశస్త్యం బట్టి తెలుస్తుంది.

6. దేవరగట్టు - సంస్కృతి సంప్రాదాయం:

దసరా పండుగ రోజున బన్ని ఉత్సవం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంత ప్రజలకు ఉత్కంఠతతో ఎదురు చూసేలా చేస్తుంది. వేలాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న సమయంలో అర్థరాత్రి పన్నెండు గంటర సమయంలో

“డుర్ర్....గోపరాక్.…డుర్ర్.…డుర్ర్….గోపరాక్ అంటూ లయబద్దంగా పెను కేకలు వేస్తూ వేలాది గొంతులు పలకడంతో చిమ్మ చీకట్లో రెండు కొండల మధ్య ఉన్న నిశ్శబ్ధ అరణ్యంలో యుద్ధానికి సన్నద్ధమా?”-2

అని అన్నటుగా, ఆదొక యుద్ధోన్మాదపుకి పిలుపును ఇచ్చినట్లుగా అడవి యొక్క నిశ్శబ్దంతో యుద్ధఘోష లాగా వినిపిస్తూ వేలాది వెదురు కర్రలు సర్రుమని శబ్దం చేస్తూ, గాల్లో విన్యాసం చేస్తూ ఉత్సనం ఆరంభమవుతుంది. మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు పల్లకిలో వస్తూ ఉంటే, దానికి నాలుగు దిక్కులు సంరక్షకులుగా వేలాది మంది వెదురు కరలతో “హరహర మహాదేవ మహామాళ మల్లేశ్వరా” అనే స్తోత్రాలను పలుకుతూ, డప్పుల మోతలు, ఢమరుక నాదాలు, భగభగ మని మండే నెగళ్లు, కాగడాలు చేతపట్టుకొని నినాదాలతో, హాహాకారాలూ, హరహర మహదేవ నినాదాలు, గోపరాక్ గోపరాక్ హెచ్చరికలతో కళ్ళముందున సముద్రపు అలలు ఒక సారి ముందుకు వచ్చి మళ్ళీ వెనకకు ఎలా తిరిగి వెళ్ళతాయో అలా అలలు, అలలులాగా తొక్కుకుంటూ, తోసుకుంటూ వెళ్ళుతుంటే ఒక ప్రళయణ లాగ కనిపిస్తుంది. ఈ బన్ని ఉత్సవంలో కర్రలు పూర్వకాలంలో అడవులోన కౄరమృగాల నుండి రక్షణకై ఉపయోగించే వారు, తరువాత, తరువాత కాలంలో సుళవాయి, ఎల్లార్తి, కురుకుంద, గ్రామస్తులు మాళ్ళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్ర హమూర్తులను లాక్కొవాలనే సంకల్పంతో ఉండటం వలన కర్రలను రక్షణగా అడ్డుపెట్టెవారు, ప్రస్తుత కాలంలో కొన్నివేల మంది రాక పెరగడం, తోపులాటలు, తొక్కిసలాటలు, కొంత మంది తమ కక్ష సాదింపులకు, రాజకీయాల స్వార్థం కొరకు అడ్డాగా మార్చుకున్నారు. అనే వాస్తవాన్ని గ్రామస్తుల మాటగా చెప్పుతున్నారు. కర్రలు తగిన వారికి బండారం పుస్తారు, బండారం రాస్తే ఎంతటి గాయమైనా నయమవుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో ఉంది. అయినప్పటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందస్తు జాగ్రతల్లో వైద్యం, రక్షణ, నియంత్రణలు ఏర్పాటు చేయడంతో ‘బన్ని’ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

7. దేవరగట్టు పల్లకోత్సవం:

మాళమల్లేశ్వర్లస్వామి వెలసిన పుణ్యక్షేత్రం దేవరగట్టు. పార్వతీపరమేశ్వరులను ఈ పేర్లతో కొలుస్తారు. ఎత్తైన కొండపైన ఉండే గుహాలో మాళమల్లేశ్వర్లస్వామి వారు కొలవుదీరిన స్థలం. ప్రతి తెలుగు సంప్రదాయ పండుగలకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి సంవత్సరం దసరాకి మాత్రం రెండు రోజుల పాటుగా ఉత్సవం జరుగుతుంది. ఉత్సవానికి ముందు రోజున కొత్తపేట, నెరణికి గ్రామస్థులు ఆలయ అర్చకుల సమక్షంలో ఉత్సవ విగ్రహమూర్తులకు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అర్థరాత్రి పన్నెండు గంటలకు జరిపించి స్వామి అమ్మవార్లు పల్లకిలో బయలు దేరుతారు. పల్లకిని కొండ క్రింద ఉండే బసవేశ్వర కట్టకు వచ్చే సమయంలో చుట్టు ప్రక్కల ఉండే పది గ్రామాల ప్రజలు ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు, ఉత్సవమూర్తు కోసం జరిగే ఉత్సవం బన్ని ఉత్సవం. ఏ గ్రామం అయితే దక్కించుకుంటుంది ఆ ఊరి వారికి మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్సవ మూర్తుల విగ్రహాల కోసం పోటీ పడే గ్రామాల్లో అరికెర, సుళ్ళవాయి, కురుకుంద, ఎలార్తి, చిన్నహ్యట, పెద్దహ్యట, హోళగుంద గ్రామాలు పాల్గొంటాయి. ఉత్సవ మూర్తులను వేరే గ్రామస్తుల చేతిలో వెళ్ళకుండా ఉండేందుకు నేరణికి, నెరణికి తాండ, కొత్తకోట గ్రామ ప్రజలు వారిలో ఎన్ని గొడవలు, అంతర్గత మనస్పర్థలు ఉన్నా? అన్నింటిని మరచి, మూడు గ్రామాల ప్రజలు ‘పాల’ బాస చేసి బన్ని ఉత్సవానికి బయలు దేరు తారు.

8. బన్ని ఉత్సవం:

దేవరగట్టు పైన తాబేలు అవతారంలో వెలసిన మాళమల్లేశ్వర్లస్వామి కళ్యాణానికి కొత్తకోట, నెరణికి, నెరణికి తాండ గ్రామస్తులు ప్రతిజ్ఞ బూని రాత్రి పదుకొండు గంటల సమయంలో తాము బయలు దేరుతున్నాము అనే సంకేతానికి గుర్తుగా ఒక ఔటును పేల్చి సంకేతం ఇస్తారు. గ్రామంలో ప్రతి యువకుడు వెదురు కర్రను చేతబట్టి, తలపాగను చుట్టి నుదుటి మీద విభూది నామములతో 'హరహర మహదేవ మహామాళ మల్లేశ్వరా’ అనే శ్లోకం పలుకుతూ, భగభగ మండే సెగళ్లు, కాగడాలు, డప్పుల మోతలతో, ఢమరుక శబ్దాలతో ఆ ప్రాంతం మొత్తం హోరుమనే శబ్దంతో బహు పరాక్..…బహు పరాక్  డుర్ర్....గోపరాక్.…డుర్ర్.…డుర్ర్….గోపరాక్ అని భీతిని కొలిపే ధ్వనితో ఒక వరద ప్రవాహంలో మానవ ప్రవాహం కొన్ని వేల కర్రను గాల్లోకి లేపుకొని విలయతాండవం చేస్తూ వస్తున్న ఆ జనప్రవాహాన్ని చూసి రోమాలు నిక్కబొడుకొంటాయి, ఒళ్ళంతా జలగదద్దరిల్లుతుంది, కొత్తకోట, నేరణి గ్రామస్థులు బసవనకట్ట, సింహసనకట్ట మీదుగా కొండపైకి ఉండే 360 మెట్ల నుండి దేవాలయం చేరుకున్న తరువాత కళ్యాణోత్సవం జరుగుతుంది. మాళమల్లేశ్వర్లస్వామి కళ్యాణం ఆనంతరం కొండ క్రింది ఉన్న బసవన్న ఆసనం దగ్గరకు వచ్చేటప్పుడు విగ్రహాలని ఎవ్వరూ తాక కూడదని, పరాయి వాళ్ళ చేతికి దక్కకూడదనే ఉద్దేశ్యంతో బన్ని ఉత్సవం ఆడుతారు. రచయిత వివేచనతో బన్ని ఉత్సవం గురించి ఒక భక్తుడైన పెద్దాయనను ఇలా మీరు దైవం పేరుతో తలలు పగలకొట్టుడడం మంచిదేనా  అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా

“ఎవురు సెప్పిరి సారూ, మా బన్ని ఉత్సవం శత్రువులు ఆడుకునే ఆటకాదు, కర్ణాటకం నుండి మహారాష్ట్ర నుండి లక్షలాదిగా జనాలు సూడ్డానికి కొస్తారు యీ తావుకి, తోపులాటకి జరగ మంటే జరగదా.…అడవి గాబట్టి పురుగూపుట్రా కోసరం కర్రలు తెచ్చుకుంటారు జనాలు, తోసుకుంటున్నప్పుడు తలకి తగుల్తాయి, పల్లకి వూరేగింపు జరిగేటప్పుడు విగ్రహాలు ఎవరుపడితే వాళ్ళు తాక్కండా కాపలాగా కర్రలతో అడ్డుకుంటాము, ఎవుర్న కొట్టము సారూ అందరూ భక్తులే గదా”-3

అని సమాధానము ఇవ్వడంతో బన్ని ఉత్సవం సమరం కాదు, సాంప్రదాయకంగా మూడు గ్రామాల ప్రజలు ఆడే ఒక ఆట అని వాస్తవిక విషయాన్ని రచయిత తెలియజేశాడు.

9. గొరవయ్యల నృత్యం:- 

బన్ని ఉత్సవం ముగిసిన తరువాత దేవరగట్టు సంప్రదాయంలో అత్యంత భక్తి పారవశ్యానికి నిదర్శనం గొరవయ్యల నృత్యం. గొరవయ్యల ఆట అనేది మాళమల్లేశ్వరునికి ఆరాధన లాంటిది. గొరవయ్యలు అందరూ సింహాసనం కట్టదగ్గరికి బన్ని ఉత్సవం ముగిసిన తరువాత ఉదయానికి అందరూ చేరుకుంటారు. నల్లటి కంబళ్లు భుజాన దిగేసుకొని నెత్తిన కంబడితో చేసిన కిరటం పెట్టుకొని, ఒక చేతిలో పిల్లన గ్రోవినీ, మరో చేతిలో ఢమరుకాన్ని పట్టు కొన్ని నాట్యం చేస్తూ, లయబద్ధంగా ఢమరుకం, త్రాచులనైనా తలలు వూగించే వేణుగానంతో నాట్యమాడుతున్న నల్లని కంబళ్ల ‘వనం’తో రచయిత గొరవయ్యల ఆటను, వారి కళను, సంస్కృతిని, సంపు దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు.

శివ బండారు బండారు తలలో మల్లయ్య
యీబూది బండారు తలలో
శ్రీశైల మల్లయ యీబూది
శివమనందియీశుని యీబూది !!బండారు!!
గట్టు మల్లయ్య సామి బండారు.
మాగంగు మారమ్మ దేవి బండారు.
మైలారు లింగయ్య బండారు
మాగంటి ఈశుని బండారు.
తిరుపతితో తిమ్మమ్మ బండారు
శివ సామి గోవింద రాజుని బండారు
నువ్వెక్క లాడేనే బండారు.
వైభోగమాడేనే బండారు.-4 

అంటూ పాట, పాడుతూ ఉత్సవంలో గొరవయ్యలు నృత్య ప్రదర్శనలిస్తారు. ప్రతి సంవత్సరము బన్ని ఉత్సవం ముగింపు గొరవయ్యల ఆటతో రాక్షస గుండ్ల దగ్గర యిచ్చే రక్త తర్పణంతో ముగుస్తుంది.

10. రక్త తర్పణం:- 

“హర హర మహాదేవ మాళమల్లేశ్వర" అనే నామస్మరణతో దిక్కులు పిక్క టిల్లేలా వినబడుతుంది. అశేషమైన భక్తజన సంద్రముతో రక్తపడి దగ్గర రక్తగుండ్లుని పిలిచే ప్రదేశంలో మాళమల్లేశ్వర ఆలయ పూజారీ తన రక్తాన్ని ఇవ్వడం పూర్వకాలం నుండి వంశపారం పక్ష్యంగా వస్తున్న ఆచారమిది. రక్తతర్పణం చరిత్రను రచయిత నాటక రూపకంగా తెలియజేయడంతో ప్రాంతీయంగా ఉండే సంప్రదాయాలు, సంస్కృతి, విషయాలపట్ల అసక్తిని వ్యక్తపరిచాడు. పూర్వ దేవరగట్టు ప్రాంతమంతా అడవి. ఈ అడవిలో మణిమల్లాసురుడనే రాక్షసుడు. తన బలము చేత హిరణ్యకారణ్యంగా పిలువబడే ప్రాంతం అంతా తన ఆదీనంలో ఉంచుకున్నాడు. మునిపల్లెలు మాత్రం మునుల తపోయజ్ఞయాగాదులతో ఉండేవారు, మునులు చేసే యజ్ఞాలు, తపస్సులు తమ రాక్షస జాతి అండా నికని బావించి, మణిమాల్లాసురుడు మునిక్షేత్రాలవైపు వచ్చి మునులకు కాపలగా ఉండే భైరవుడితో పోరాడుతాడు. యుద్ధంలో మణిమల్లాసురుడు భైరవుడి బాణాలు తాకి తాకి శిలలుగా మారిపోయాడు. ప్రతి సంవత్సరం దసరా రోజున శిలపై రక్తం బొట్టు పడితేగానీ ఆ ప్రాంతమంతా ప్రశాంతముగా ఉండదని కాలం, చరిత్ర, ప్రజలు చెప్పుకుంటున్న మాటగా వినిపిస్తుంది. అందుకే సంప్రదాయం ప్రకారం ఆలయం

“పూజారి శూలాన్ని ఒక పిక్కడు కసక్కున గుచ్చుకొని, ఉబికివస్తున్న రక్తాన్ని రాక్ష గుండ్లక అర్పించాడు. ఆ రక్తం తాకి సూర్యుడి కిరణాలు ఆరు లోకమంతా వ్యాపిస్తున్నాయి. పూజారి రెండవ శూలాన్ని రెండో పిక్కకు గుచ్చుకొని పొంగి వస్తున్న రకాన్ని యివో సండుకు తర్పణం గావించాడు”.-5 ఈ సంప్రదాయాన్ని కన్నులారా చూసిన భక్తుల హరహర మహాదేవా నామస్మరణతో కొండ ప్రాంతమంతా మారుపోతుంది.

11. దేవరగట్టు- భవిష్యవాణి:

రచయిత. జి. వెంకటకృష్ణ దేవరగట్టు సంప్రదాయంలో ప్రతి విషయాన్ని దగ్గర నుండే ప్రత్యక్షంగా చూసి తరించిన అనుభవం కల్లిన రచయిత కాబట్టి కథలో డాను ఎన్నుకొన్న కథా వస్తువును ఎక్కడా విస్మరించ కుండా పొలదికగా నిర్మించాడు. దేవరగట్టు మాళ్ళమల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలల్లో మూడవ రోజు ముగింపు ఉత్సవాల్లో అత్యంత అసక్తిని, ఆతృతను కలిగించేది భవిష్యవాణి.రక్త తర్పణం చేసిన పూజారి సింహవం కట్టకు ఉన్న యినుప గొలుసును తెంచి నాట్యం చేస్తాడు. తరువాత తెలుగు, కన్నడం కలగలసిన మార్మిక భాషతో ఆ సంవత్సరం జరగబోమే మంచి, చెడుల గురించి, పంటలు, వర్షాలు, నవధాన్యాలలో దిగుబడులు, ధరలు, గురించి చెప్పుతాడు. వచ్చిన భక్తులు అని రానున్న రోజుల్లో కచ్చితంగా జరుగుతాయని, నిజం అవుతుందని నమ్ముతారు, అదే భవిష్యవాణిగా చాలామంది ప్రజలు భావించడంగా ఈ సాంప్రదాయం నేటికి కొన్న సాగుతుంది. అయితే రచయిత సుక్ష్మంగా, లోతుగా ఆలోచించి భవిష్యవాణిలో చెప్పినట్టు

“యీ హింస ఆగేదాకా తను రక్త తర్పణం యీస్తూ వుంటానని మణిమల్లా సురల దాహం తీరేదాకా రక్తం పారుతూనే వుంటుందంట, దేవుళ్ల రాజ్యంలో రక్తం పారి తీరాలంట, ఆ రక్తంతో తడిస్తేనే పానలు కురుస్తాయంట, పంటులు పండు తాయంట, పశులు పాలు యిస్తాయంట”-6

అనేది మానవజాతికి ఒకింత మూడనమ్మకంగా విమర్శ దృష్టితో తెలయజేయడం ఆయనలో ఉన్న సామాజిక విశ్లేషణతకు అద్దం పడుతుంది.

12. ముగింపు:

  • దేవరగట్టు ఉత్సవం,బన్ని ఉత్సవంగా చుట్టూ ప్రక్కల ఎంత ప్రాచుర్యం పొందినదో అంతే ప్రత్యేకమైన సంస్కృతి,సంప్రదాయం,ప్రాంతీయ స్పృహ కల్గినదిగా పేరు పొందినది.
  • చుట్టు పక్కల ఉండే ఏ రాష్ట్రాలలో కూడా ఇలాంటి సంప్రదాయం లేదు. కేవలం కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామికి మాత్రమే చెందుతుంది. 
  • బన్ని ఉత్సవం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన తెలుగువారి ప్రాంతీయ సంస్కృతి,సంప్రదాయంగా గుర్తింపు పొంది తెలుగు వారి సంప్రదాయాల్లో విన్నూతంగా దసరా పండుగలు జరుపు కోవడంలో చెప్పుకోదగినది. 
  • బన్ని ఉత్సవం,గొరవయ్య నృత్యం, గొలుసు తెంచుట వంటివాటిని వీక్షించడం కోసం కొన్ని వేల మంది భక్తులు రావడంతో ప్రజలకు సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఎంత గౌరవం, ఉందనే విషయాన్ని చెప్పడంలో రచయిత స్పష్టతను ఇచ్చాడు.

13. పాదసూచికలు:

  1. దేవరగట్టు- జి.వెంకటకృష్ణా, పుట:23
  2. పైదే, పుట:16
  3. పైదే, పుట:26
  4. గొరవయ్యల నృత్యం - డా.బెల్లం కొండ నాగేశ్వరరావు, పుట:03
  5. దేవరగట్టు- జి.వెంకటకృష్ణా, పుట:35
  6. పైదే,పుట:35

14. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణారావు, వై.వి. ప్రసాద్,ఏటుకూరి. ఆంధ్రప్రదేశ్ దర్శిని. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు,1998
  2. గోపాల్ రెడ్డి, కొప్పులు. మన కర్నూలు జిల్లా. మహాత్మ ప్రెస్ కర్నూలు, 2014
  3. చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. మన నవలలు మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2013
  4. నారాయణ స్వామి, బండి. రాయలసీమ సమాజం సాహిత్యం. పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2019.
  5. పూర్ణచందు, జి.వి. కృష్ణా తీరం చరిత్ర సంస్కృతి  సమాజం. ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ, విజయవాడ, 2016
  6. రాధాకృష్ణ, బూదరాజు. తెలుగు మాండలికాలు కర్నూలు జిల్లా.  తెలుగు అకాడమి, హైదరాబాదు,1984
  7. రామానుజరావు, దేవులపల్లి. సుబ్రహ్మణ్యం,జి.వి. తెలుగులో పరిశోధన. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి, హైదరాబాదు, 1983
  8. వెంకటకృష్ణ, జి. దేవరగట్టు  జి వెంకటకృష్ణ కథలు. లిఖిత ప్రెస్, హైదరాబాద్, 2017.
  9. శర్మ, జె.యస్.ఆర్.కె. శ్యామసుందరశాస్త్రి, వై.యస్. కర్నూలు జిల్లా సంస్కృతి విశేషాలు ప్రాచీనసాహిత్య పరిషత్, కర్నూలు,1997.
  10. శ్రీదేవి, కె. సీమకథ అస్థిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2016.
  11. హరికిషన్, ఎం. కర్నూలు జిల్లా చరిత్ర. దీప్తి ప్రచురణలు, విజయవాడ, 2012
  12. హరికిషన్, ఎం. కర్నూలు కథ. దీప్తి ప్రచురణలు, విజయవాడ, 2020.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]