headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ఆధునిక తెలుగు కవిత్వం: విద్యా ప్రతిఫలనాలు

డా. అంకే శ్రీనివాస్

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అనంతపురము
అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9652471652, Email: ankesreenivas@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆధునిక వచన కవులు విద్యా సమస్యలను, విద్యార్థుల సంఘర్షణలను అనేక సందర్బాలలో తమకవిత్వం ద్వారా వ్యక్తీకరించారు. విద్య ప్రధాన లక్ష్యం ఉపాధి మాత్రమే కాదని, విద్య అంతిమ లక్ష్యం జ్ఞాన సముపార్జనని ఈ వ్యాసం వివరిస్తుంది. విద్య గురించి ఆయా కవుల స్పందనలమీద విమర్శకులు ఇంతకుముందు ఎవరు విశ్లేషించినట్టు లేదు. విద్య మౌళిక లక్ష్యాలను, కవుల ఆశించిన విధానాన్ని ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. వచన కవులు విద్య యొక్క మౌళిక లక్ష్యాలను తమ కవిత్వంలో చర్చించారు. అనేకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. విద్యార్జన విద్యార్థులకు, తల్లితండ్రులకు ఎంత భారంగా మారిపోయిందో నిలదీస్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ ప్రాంతాల కవులు కొన్ని సమస్యలను సమాజం ముందు ఉంచుతున్నారు. బాలకార్మికులకు విద్య అందకపోవడం, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఇబ్బందులు,ఒత్తిడితో కూడిన పరీక్షా విధానం, వివక్షకు గురియిన దళిత విద్యార్థులు, విద్యార్జనలో ఎదురుకొంటున్న సమస్యలు, వారి తరుపున కవులు లేవనేతతున్నాప్రశ్నలు ఈ వ్యాసంలో చర్చించడం జరిగింది.

Keywords: సామాజిక ఆర్థిక ప్రగతి, శాస్త్రీయవిద్య, సంపూర్ణ అక్షరాస్యత, మిషనరీ స్కూలు వ్యవస్థ, భాష ఒక ప్రాదేశిక అభివ్యక్తి.

1. ఉపోద్ఘాతం:

ఆధునిక కవిత్వం సమాజానికి ప్రతిబింబం. విద్య మానవ ప్రగతికి అవసరం. విద్యా విధానాలను విద్యాబోధనలోని భావోద్వేగాలను ఆధునిక కవులు అద్భుతంగా ఆవిష్కరించారు. విద్యా బోధనలో భిన్న సాంస్కృతిక సామాజిక ఇబ్బందులను కవులు సమస్యలను తెలియజేశారు. పరిష్కార మార్గాలను కూడా సూచించారు. ఆధునిక జీవితంలో విద్యార్జన, విద్యాబోధన చాలా సంఘర్షణాత్మకంగా వున్నదని తెలుగు కవిత్వం తెలియజేస్తోంది. బోధనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులను కూడా కవులు తెలియజేస్తున్నారు.

"దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణమవుతుంది" - డి.యస్. కొఠారి. 

దేశ సామాజిక రాజకీయ ఆర్థిక సామాజిక ప్రగతికి విద్య మూలధాతువు. ప్రాథమిక స్థాయి నుండీ అత్యున్నతమైన స్నాతకోత్తర స్థాయి వరకూ విలువలతో కూడిన విద్య చదలచీకటి కదలబారించగలదు. బాల్యానికి గొప్ప భవిష్యత్తుని విద్యమాత్రమే అందించగలదు. ఆధునిక కవిత్వం మౌళికలక్ష్యం కూడా సామాజిక ఆర్థిక ప్రగతే!

"కవుల 

పిల్లలూ 

ఏ దేశానికైనా ప్రాణ వీచికలు1 (ఎగరాల్సిన సమయం బాలసుధాకరమౌళి)'

బాలల భవిష్యత్తును కవిత్వం కలలుకంటుంది. “నేటి పిల్లలే రేపటి పౌరులు” అన్న మాట దేశం యొక్క సామాజిక భవిష్యత్తుని వివరిస్తుంది. 'ఉత్తమపౌరుడు ఉత్తమ రాజ్యాన్ని సృష్టిస్తాడు' అన్న తత్త్వవేత్త మాట ప్రకారం ఉత్తమపౌరుడు తరగతి గదిలోనే తయారవుతాడు. ఉత్తమపౌరుడు ఉత్తమరాజ్యాన్ని సృష్టించినట్లే ఉత్తమరాజ్యం కూడా ఉత్తమపౌరున్ని సృష్టిస్తుంది. ఇది సామాజిక ప్రగతిశీలత కలిగిన విద్య వల్లనే సాధ్యమవుతుంది.

పాఠం చెప్పడమంటే
యుద్ధాన్ని నిర్వహించడం
నేను నాతో
నేను నా పిల్లలతో
తరగతి గది
నాకు యుద్ధభూమి
ధర్మయుద్ధం తెలిసిన వాడే
గురితో పాఠం చెప్పగలదని నా నమ్మకం"2 (తరగతి గదిలో బా.సు, మౌళి)

కవి ఉపాధ్యాయుని నైతిక బాధ్యతను కవిత్వం చేశారు. విద్య భయంకొలిపే భవిష్యత్తుని జయించే స్థైర్యాన్నివ్వగలదు. ఉపాధ్యాయుడు పసిపిల్లల కనురెప్పల మీద ఉపాధ్యాయుడు అందమైన కళల (కలల) చిత్రపటం చిత్రించగలడు. గురువంటే నోరు శిష్యుడంటే చెవులు. గురువు శిష్యుని జ్ఞానదాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెఱువు.

“పట్టాలపక్కన నడిచి వెళ్తున్న చిన్నపిల్లలంటే భయం
చేతుల వేళ్ళ చివర ఎర్రబడుతున్న చిన్నపిల్లల చేతులంటే భయం
చేతుల వేళ్ళ చివర ఎర్రబడుతున్న ఆకాశం కత్తి అంచన్నాభయమే
పిల్లల భుజాన వేళ్ళాడుతున్న సంచులంటే భయం
పలకలమీద జన్మిస్తున్న అక్షరాలనదులంటే భయం"3 (భయపడినవాడు, భారమతి-శివారెడ్డి)

ఎందుకు భయం? ఎవరికి భయం ? విద్య ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్న పుట్టకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే! ప్రశ్నతల్లి సమాధానం సంతానం. ప్యూడల్ తత్త్వమున్న వారికి విద్య అంటే ఖచ్చితంగా భయమే! అందుకే ప్యూడల్ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యత గురించి ప్రచారం చేస్తాయి, లక్ష్యమంటున్నాయి తప్ప శాస్త్రీయమైన సంపూర్ణ విద్య గురించి మాట్లాడటం లేదు.

2. బాలకార్మికవ్యవస్థ - విద్య:

ప్రపంచీకరణ వల్ల మానవసంబంధాలు ధ్వంసమవుతున్నాయి. విద్యావిధానం తీవ్ర సంఘర్షణను ఎదుర్కొంటోంది అనేకమంది పసిపిల్లలు కూడా విద్యకు దూరమవుతున్నారు.

“అనేకానేక సంక్షోభాలు
జీవితాన్ని కుదిపేశాక
బ్రతకడమన్నదే ఆఖరి సమస్య
ఎవరికి ఎవరు
ఏమీ కానప్పుడూ సొంత రక్తంలో పరాయితనం"4 (స్ట్రీట్ చిల్డ్రన్ - ఆకురాలు కాలం మహేజాబీన్)'

వీధిబాలల పట్ల సమాజానికి కనీస నైతిక బాధ్యత కూడా లేదు. బాల్యం నుండే బతుకుపోరాటం మొదలవుతుంది. “దినగండం నూరేళ్ళ ఆయుష్షు" గా సాగుతోంది. రోజురోజుకూ బాలకార్మిక వ్యవస్థ ఎక్కువవుతోంది.

“చేజారిన టీకప్పు పగిలి
వెయ్యి ముక్కలయి విస్తరించినప్పుడు
గిల్లడానికి బుగ్గల్లేని పాలిపోయిన చెంపల్ని
యజమాని చేతికి అందిస్తాడు
కామత్తులో కాలు మోపినప్పుడల్లా
కాఫీ కప్పులు తీస్తూకానీ బడికెళ్లి బలపం పట్టాల్సిన వయసులో
బాల్యంకోల్పోయి బాసన్లు కడుగుతూగానీ కనిపిస్తాడు”5 (చెదిరిన బాల్యం - ఎస్. షమీఉల్లా)'

బాల్యం చెదిరిన పసివాడి వ్యధార్థమైన యధార్థ దృశ్యం. దేశంలో ప్రతిచోటా ప్రత్యక్షమవుతోంది. ఆధునిక సమాజం సామాజిక బాధ్యతకు దూరమవుతోంది. వీధివేషం వేస్తున్న బాలున్ని గురించి-

"బాలాంజనేయుల్ని కోతిలానే బ్రతకనిస్తామా?
లేక వీరాంజనేయుల్లా ఎదగనిస్తామా?
ఈ ప్రశ్నకు జవాబు తెలిశాకే
మనం ప్రగతి గురించి మాట్లాడుకుందా” 6 (బాలాంజనేయులు - చం)

కొఠారి కమీషన్ 1966లో చెప్పిన "దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణమవుతుంది" అన్నమాటకు అర్థం లేకుండా పోతోంది. బాలల సామాజిక భద్రత, ప్రగతి పురోగమనంలో వుంటేనే దేశం పురోగమిస్తున్నట్లు! బాల్యం భవిష్యత్తు, యవ్వనం వర్తమానం, వృద్ధాప్యం భూతం' అన్న ఎఱుక గలిగిన పాలనావ్యవస్థ లేకపోవడం దేశ దురదృష్టకరం. క్రీ.శ. 2022లో భారత రాజ్యాంగానికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ ప్రకరణగా ఒక అంశాన్ని చేర్చారు. 6-14 సం|| మధ్యనున్న పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ఈ ప్రకరణ చెబుతోంది. ఇది ప్రాథమిక హక్కు కూడా! అంతేగాక ప్రయివేటు పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25% బలహీన వర్గాలకు కేటాయించాలని ఈ సవరణ వివరిస్తోంది. ఈ కోటా కింద ఒక్క సీటు కూడా ఖాళీగా వుండకూడదని స్పష్టం చేస్తోంది. ఇది 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే దేశంలో వాస్తవం వేరుగా వుంది. నేటికీ నిత్యం ఎదురవుతున్న వీధిబాలుల సంఖ్య లక్షల్లోనే వుంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అహర్నిశలూ కృషిచేస్తున్న కైలాస్ సత్యార్థికి నోబెల్ బహుమతి రావడమంటే ఈ దేశంలో బాలకార్మికవ్యవస్థ ఏస్థాయిలో వుందో అర్థమవుతుంది. అవిద్యావంతులవుతున్న పిల్లలు ఎందరున్నారో విదితమవుతోంది.

బాలికల పరిస్థితి మరీ ఘోరం. ఒక వేళ పాఠశాలకు బాలికలు వస్తూవున్నప్పటికీ పదవ తరగతిలోపే వివాహమవుతుండటం దేశంలో చాలా సాధారణ విషయం. ఆ పెళ్ళిని నిరాకరించే శక్తి ఆ పసిబిడ్డలకుండదు.

"చీకటి మబ్బు తెరల్ని చీల్చి
ఒకకోయిల సూర్యున్ని నిద్రలేపినట్లు
ప్రార్థనలో నిలబడి నువ్వు 'నేటి సూక్తి'ని చదివేదానివి కదా!
అంతలోనే అసంపూర్తిగా పుస్తకాలను వదలి
ఎక్కడికమ్మా మరోపూర్ణమ్మవై పోయావు”7 (తెగిపోయిన ఊయల - తైదల అంజయ్య)

బాలికా వివాహాలు భారతదేశ భవిష్యత్తుని ప్రశ్నిస్తున్న బాణాలు. ఈ సమస్యకు తల్లిదండ్రుల అవిద్య మాత్రమే కారణం కాదు ప్రభుత్వ దౌర్భల్య కోణం కూడా! అందరికీ విద్య అన్ని సమస్యల 'కీ' విద్య! కాని అందరికీ అలభ్యం!

3. కార్పొరేట్ విధానంలో విద్య:

"కసాయి గుండెల కిరాతకానికి చెల్లిస్తోంది మూల్యం భారీగా బాల్యం” 8 (మెరుపుతీగలు-పి.ఎల్.శ్రీనివాస రెడ్డి) 

పాఠశాలలకు వెళ్తున్న పిల్లల పరిస్థితి మరో విధమైనది.

“పొలానికి వ్యవసాయానికి పొంతన లేదు
ఆరాటానికీ ఆశకు అవధుల్లేవు
కడుపుచించుకు పుట్టిన పిల్లల పట్ల
కేవలం యజమాన్య పాత్ర పోషిస్తాం
వేళకింత ఆహారం నీళ్ళు పెట్టి
సమయానికిన్ని పుస్తకాలు నోటుబుక్కులూ ఇచ్చి
ముక్కుపచ్చలారని వయసుల్ని
కటిక చేదు మయం చేస్తాం
పిల్లలకూ మనకూ
ఒక వ్యాపార ఒడంబడిక ఇనుపతెర
బొడ్డుచెంబుతో పెదవుల్ని తడిపేబదులు
బకెట్నీళ్ళు ముందుంచుతాం
ఫక్తు స్కూలు పుస్తకాలు హెూ వర్కుకి
టీచర్లూ ట్యూషన్లూ
పరీక్షా సమయం
చదువు చదువు చదువు
వాళ్ళ తేజోవంతమైన అభిరుచుల్నిండా
మర్రినీడలా ఊడల్ని దించుతుంటాం
మనిషిలోని వెలుగుదారుల్ని తెరవాల్సిన
చదువు పుస్తకం నిండా రూపాయలక్కట్టక్కట్టలు
ఏరెసిడెన్షియల్ పాఠశాల దగ్గర
సెలవు 'ములాఖత్' చూసినా
జరిగిన ఘోర రైలు ప్రమాదం
హాహాకారాలు మిన్ను ముడుతుంటాయి
పిల్లల కన్నీళ్ళతో దేశం తగలబడుతోంది 9 (కొత్తపంట - జూకంటి జగన్నాథం)

నేటి విద్యావిధానంలో వైజ్ఞానిక దృష్టికన్నా మార్కులు ర్యాంకుల దృష్టి ఎక్కువ. విద్య అంటే ఉ పాధి ఒక్కటే కాదు. విద్యాసముపార్జనలో ఉపాధి ఒక పార్శ్వం మాత్రమే! కాని ఉపాధికల్పనే ప్రాథమిక లక్ష్యం అనేభావన సమాజంలో వేళ్ళూనుకుంది. దీనివల్ల విద్య యొక్క అంతిమ లక్ష్యమైన జ్ఞానసముపార్జన విద్యార్థికి అందటం లేదు. 'సముద్రం' అనే కథలో పాపినేని శివశంకర్ గారు చెప్పిన ఒక అంశం! మంచి అధ్యయనశీలి, ప్రజలతో మమేకమైన సామాజిక ఉద్యమ బుద్ధిజీవిని 'పుస్తకాలిస్టమా! మనుష్యులిష్టమా' అంటే 'గొప్ప పుస్తకాలు మనుష్యుల్ని ప్రేమించమనే చెబుతాయి" 10 అంటాడు' అయితే ప్రస్తుతం వైజ్ఞానిక దృక్పథం లోపించడం శోచనీయం.

మన విద్యావిధానం ఎలా వుంటుందో 'పెన్నేటిపాట' కావ్యంలోని కొన్ని దృశ్యాలు స్పష్టంగా వివరిస్తాయి రంగారెడ్డి నిరుపేదగా మారి రంగడిగా పెద్దిరెడ్డి ఇంట్లో పనిమనిషిగా బతుకుతుంటాడు.

“యీ యింట నున్నంతసేపు
కోయన్న కోటిసామాను
యీయిల్లు దాటితేనేమో
రాయెత్తితే రాయి నేను" అని రంగడు భావిస్తుంటాడు. 11

కారణం పెద్దిరెడ్డి విద్యావంతుడు. నిరంతరం భక్తితో భాగవత పారాయణం చేస్తుంటాడు. ఆ ఇంటి ఇల్లాలి కళ్ళలో నిత్యం మల్లెలు పూస్తుంటాయి కొడుకు ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి వచ్చాడు. పోయిన సంవత్సరమే కూతురు సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. “ఎక్కడనూ మలినమన్నదే లేదు" విశ్వంగారు చాలా ధ్వన్యాత్మకంగా చెప్పారు. పెద్దిరెడ్డి భాగవతాన్ని చదివి భగవంతున్ని ప్రార్థిస్తాడు. సాటిమనిషి కష్టాలు పట్టించుకోడు. కొడుకు ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు. సామాజిక ప్రజాస్వామ్య దృక్పథం లేదు. కూతురు సోషియాలజీలో పట్టా పొందింది. కానీ సోషియల్ రెస్పాన్స్బలిటీ లేదు. ఇక భార్య కళ్ళలో నిత్యం మల్లెలే పూస్తుంటాయి. కన్నీళ్ళు కాదు. అందుకే ఇంటిలో 'ఆత్మయే శూన్యమిచట' అని విశ్వం ప్రత్యేకంగా చెప్పారు. ఈ కావ్యదృశ్యం భారతదేశ విద్యావ్యవస్థకు సూక్ష్మరూపం.

“పెద్దగా నేర్పిందేమీ లేదు
పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్దించాను”12  (రజనీ గంధ - పాపినేని శివశంకర్)

విద్యావంతుడు కావడమంటే జ్ఞానవంతుడు కావడం. సామాజిక బాధ్యతను గుర్తెరగడం.

4. పరీక్షల విధానం:

మనపరీక్షా విధానం కూడా సక్రమంగా లేదు.

“పరీక్షా పేపర్ల గదుల్లో
పిల్లలు ఇరుక్కుపోతూ ఇరుక్కుపోతూ
బట్టి జవాబుగానే కుదించుకపోతున్నారు”13 (పరీక్షగదిలో - బాలసుధాకర మౌళి)

“శక్తులన్నీ జ్ఞాపకశక్తికే ఆలంబకై నిలుస్తాయి" 14 (పరీక్షా సమయం - కొప్పర్తి)

ఈ సందర్భంలో మందరపు హైమవతి గారి 'రెక్కలు కత్తిరించిన బాల్యం" కర్రా కార్తికేయశర్మగారి కొన్ని కవితలూ ప్రస్తావించాలి. విస్తృతి భీతి వలన సాధ్యం కావడం లేదు. ర్యాంకులు, మార్కుల సంఘర్షణలో సమిధలై సమాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. నిరంతరం విద్యార్థుల ఆత్మహత్యల్ని చూస్తుంటాము. పత్రికల్లో చదువుతుంటాం. ఇవన్నీ కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల్లోనే జరుగుతున్నాయన్న విషయం మనకు తెలుసు. కార్పొరేట్ వర్గాలకు సంపాదన మీదున్నంత శ్రద్ధ చదువు మీద వుండదు. “ఈదేశంలో బడి పెట్టినా గుడికట్టినా గడించడం కోసమే"15 (మెరుపు తీగలు) విద్యార్థులు చదువుకునే వయసులో చదువు కొంటున్నారు మహాకవి తిక్కన సోమయాజి శతాబ్దాల కింద చెప్పిన ఈ మాటలు ఎంతగొప్పవి.

కం॥ జ్ఞానము కేవల కృపన
       జ్ఞానికి నుపదేశవిధి ప్రకాశము సేయం
       గానది సకల ధరిత్రీ
       దానమ్మున కంటె నధికతర ఫలదమగున్ (శాంతి పర్వం 4-255)

ఉచితంగా విద్యాబోధన చేయాలన్న కవిమాట ప్రస్తుత పాలకులు గాలికొదిలేశారు.
పిల్లల పుస్తకాలు, క్యారియర్ల మోత గాడిదమోతను తలపిస్తోంది. వారి లేలేత శరీరాలు పుస్తకాల సంచుల్ని దేశ భవిష్యత్తుగా మోస్తున్నారు యంటారు శేషేంద్ర.

"మీరు పుస్తకాలు పట్టుకొని
పోతుంటే బాబు మీరు శిలువలు
మోసుకొని పోతున్న బాలక్రీస్తుల్లా కనిపిస్తారు” 16 అంటారు.

ఎన్ని కమీషన్లు కమిటీలు వేసినా ఈ గాడిద మోతను తప్పించలేక పోతున్నారు. మెడకు గుదిబండగా తయారయిన ఈ గాడిదమోత నుండి పిల్లల్ని రక్షించాలని రాజ్యసభలో ప్రఖ్యాత రచయిత ఆర్.కె. నారాయణ్ దశాబ్దాల కిందటే బాధపడ్డారు. పట్టించుకున్నదెవ్వరు? కమీషన్లు సిఫారస్లు కాగితాలకే పరిమిత మవుతున్నాయి.

ఈ విద్యావిధానం ఆంగ్లేయులు స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటు చేసినది. దాన్నే స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగిస్తున్నారు. జాతీయోద్యమం తనదైన ఒక విద్యావిధానాన్ని సృష్టించుకోలేకపోయింది. వలస పాలకులు ఏర్పరచిన విధానాన్నే ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. ఈ విద్యా విధానం వలస పాలకులైన ఆంగ్లేయులు తమ ప్రయోజనాల్ని దృష్టిలో వుంచుకొని ఏర్పాటు చేసినది. ఇందులో ప్రధానమైనది ఆంగ్లమాధ్యమం, భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టిన థామస్ చామింగ్టన్ మెకాలే మినిట్స్లోని ఈ మాటలు వినండి.

"We must at present do our best to from a class who may be interpreters between us and millions whom we govern, a class of persons, Indians in blood and colours, but, English in test, opinions in morals and in intelect"

(శరీర రంగు, ఆకారంలో భారతీయులుగా, అభిరుచుల్లో, అభిప్రాయాలన్నింటిలో ఆంగ్లేయులుగా వుండే ఒక ప్రత్యేక వర్గాన్ని మనకూ, మనం పరిపాలించే మిలియన్ల ప్రజలకూ మధ్య అనుసంధానంగా నిర్మించుకొనేందుకు మనం తీవ్రంగా కృషి చేయాలి)

(అంతర్జాల వేదిక ఆధారంగా ) దీనివల్ల భారతీయ జీవన విధానం, భారతీయ భాషలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

“అన్ని పరీక్షలూ బెంచిమీదే కూర్చొని రాసినా
ఒక్క తెలుగు పరీక్ష మాత్రం
అమ్మఒడిలో కూర్చొని రాస్తున్నట్లుంటుంది"17 (పరీక్షా సమయం కొప్పర్తి)

“ఆ కావచ్చు
ఇ, ఉ ఏదైనా కావచ్చు
ఒక అక్షరాన్ని చిత్రించినప్పుడే
ఒక జాతి వికసించడం ప్రారంభమైంది" 18 (కవి నిర్మాణం - కొప్పర్తి)

ఒక భాష ఒక ప్రాదేశిక అభివ్యక్తి, ప్రజల వాహిక. ఒక జీవన సంస్కృతి. ఒక భాష గురించి మాట్లాడటమంటే ఒకజాతి గురించి ఆజాతి సంస్కృతి గురించి మాట్లాడటం. ఒక ప్రాంత ప్రజలు ఒక భాషను వ్యక్తీకరిస్తే ఆ భాష ఆ ప్రజల్ని వ్యక్తీకరిస్తుంది. తెలుగుభాషను తెలుగుజాతి నిర్లక్ష్యం చేయడమంటే తన సాంస్కృతిక మూలాల్ని ధ్వంసం చేసుకోవడమే.

5. దళిత సమస్య – విద్య:

ఇందు మరొక పార్శాన్ని కూడా చూడాలి. భారతదేశం కులాల నిర్మితం. భారతదేశ సామాజిక నిర్మాణం వర్ణవ్యవస్థ మీద నిర్మాణమయ్యింది.

“నావెనుక వేదమంత్రాలు నినదిస్తుంటే
నా చెవుల్లో సీసం పొగల గావు కేకలు తాండవిస్తుంటాయి”19 (ఆత్మకథ – ఎండ్లూరి సుధాకర్)

అన్న దళిత కవి దృక్కోణాన్ని కూడా చర్చించుకోవాలి. ఈ దేశంలో దళితులు పాఠశాలకు వెళ్తున్నారంటే ఆంగ్లేయుల ప్రోత్సాహం వల్లనే! వేల సంవత్సరాలు సమాజానికి దూరంగా బ్రతికిన దళితుల్ని క్రైస్తవం చేరదీసిందన్నది చారిత్రక వాస్తవం. దళితుల విద్యాభివృద్ధిలో మిషనరీస్కూల్ల పాత్ర చాలా ముఖ్యమైనది.

“మ్లేచ్చితమన్నా సరే
మమ్మల్ని మ్లేచ్చులన్నా సరే
మెకాలేకు వందనాలు చెబుతాం
పుట్టిన మాపసిపిల్లల చెవుల్లో ఏబిసిడిలే ఉచ్ఛరిస్తాం...
జాతితో సమైక్యం కాలేనప్పుడు
నీతిలో సమతుల్యం లేనప్పుడు
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ దళితుల కోసం వ్రాయనప్పుడు
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ళపిల్లల్ని
సమానత్వం ప్లాట్ ఫారాల మీద
సివంగిలా తరిమికొట్టే దెవడి భాష
దేశమంటేకులమే.
దేశీయ భాషలంటే యాగ్గీకమే ఒకడు చెండాలుడట
ఒకడు అగ్నిహోత్రావధానుడట
ఏంభాషలు. ఇవి?
అంటరానితల్లిని అమ్మన్నాతప్పు
నీయమ్మన్నా ఒప్పు
ఈ నుడికారాల్నింక మ్యూజియంల్లోకి
ఈ భాషా దయ్యాల్నింక గురుకులాల్లోకి ... తరిమిపడెయ్యాలి....
కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ
చేతులతో మలన్నెత్తించిన భాష
సజీవ దహనం కావాలి" 20 (మాకు భాష కావాలి- తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్)

ఈ దుఃఖం వేల సంవ్సతరాలది. ఈ ఆవేశం యుగాలనాటిది. ఒక సామాజిక వర్గ అభివృద్ధిని చెప్పుల కింద తొక్కిపట్టినప్పుడు ఆక్రోశం ఇలానే వుంటుంది. ఆ సామాజిక చైతన్యం కూడా ఇలానే వుంటుంది. శంభూకుడి తలతెగిన సమయం నుండీ కలలు కనడం కూడా శాపమై భయానకమైన దుర్బలత్వాన్ని దళితజాతి అనుభవిస్తోంది. విద్యకు వేల సంవత్సరాల నుండీ దూరంగా వుంచి 'విద్య లేని వాడు వింత పశువు' అని చెప్పడం ఈ దేశ సంస్కృతికే చెల్లింది. మరి! విద్యలేని వాడు వింత పశువా? విద్య లేకుండా చేసిన వాడు వింత పశువా?

అగ్రవర్ణాల పిల్లలు ఆంగ్లమాధ్యమంలో ఎక్కువగా చదువుతున్నారు. అణగారిన వర్గాల పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆ ప్రాంతీయ భాషల్లో చదువుకుంటూండటం స్పష్టమైన సామాజిక వైరుధ్యం! తిరిగి ఆ అగ్రవర్ణాలే తెలుగును రక్షించాలని ఉద్యమాలకు నాయకత్వం వహించడంలోని అర్థం ఏమిటి? ఈ ద్వంద నీతిని కంచె ఐలయ్య వంటివారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

“ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో
కాలం నా ఆత్మకథను
పాఠ్య గ్రంథంగా చదువుకుంటుంది”21 (ఆత్మకథ – ఎండ్లూరి సుధాకర్)

నిజానికి వీళ్ళెవరికీ తెలుగుభాష పట్ల ద్వేషం లేదని మనం గుర్తుంచుకోవాలి. ఛీకొట్టడానికి అక్షరం అంటరానిది కాదు. ద్వంద్వ నీతినే విమర్శిస్తున్నారు. అందరికీ సమతుల్యత వుండాలి.
ప్రస్తుతం విశ్వవిద్యాలయాలకు రాల్లెత్తిన కులాల పిల్లలెవరూ యూనివర్శిట గేటు దాట లేని పరిస్థితి.

"పేద విద్యార్థి జీవితం
అర్ధరాత్రి శ్మశానంలో మొరిగె
కుక్క అరుపులాగుంటుంది.
కులం ప్రాతిపదికను ప్రతిభ కొలచబడుతుంది.
వర్శిటీ విద్యార్థి మెదడు తెగిన ఏకలవ్యుడు"22 (క్లౌడ్ సీడింగ్ - అంకే శ్రీనివాస్)

చదువు సంస్కారన్నివ్వాలి. కాని విశ్వవిద్యాలయాల్లో కులం ఒక ప్రధాన సమస్య.

“ఉప్పు సముద్రాన్ని వడగట్టి
మంచినీటిని ప్రసాదించే మేఘం
సరిహద్దులు దాటి వర్షిస్తోంది
యూనివర్శిటీ మేధోబానిసత్వాన్ని తయారు చేసి ఎగుమతి చేస్తున్న దళారి
నిరుద్యోగాన్ని ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీ"23 (క్లౌడ్ సీడింగ్ -)

ఈ దేశం ఖర్చుతో చదువుకున్న విద్యార్థులు విదేశాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నారు. కొన్ని సంవత్సరాల కింద కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా వున్న సమయంలో గులాం నబీ ఆజాద్ గారు ఒక్క వైద్య విద్యార్థి వైద్యుడుగా తయారు కావడానికి అక్షరాల పద్నాలుగు లక్షల భారత ప్రభుత్వానికి ఖర్చవుతోందని, వైద్య విద్య పూర్తికాగానే వైద్యులు విదేశాలకు ఎగిరిపోతున్నారని” పార్లమెంటులో ప్రకటించారు. అన్నిరంగాల్లో జరుగుతున్న ఈ బ్రెయిన్ డ్రెయిన్ ని ఆపలేక పోవడమంటే ఈదేశ ప్రగతిని గాలికొదలడమే! ప్రపంచీకరణ వల్ల విదేశాలకు వలస పోవడం ఒక ప్రధానమైన ఆకర్షణ! ఇదే సమయంలో విశ్వవిద్యాలయాలిస్తున్న పట్టలూ ఎందుకూ కొరగాకుండా పోయి నిరుద్యోగసమస్య తీవ్రమవుతోంది. ఏకాలంలోనైనా పాలకవర్గాలకు అనుకూలమైన విద్యావిధానమే అమల్లో వుంటుంది. బహుళజాతి సంస్థలకు అవసరమైన సామగ్రి తరగతి గదుల్లో తయారవుతోంది. ఈ దేశానికుపయోగపడే విద్యావిధానం కావాలి. విద్య జీవన ప్రగతికి మూలధాతువు.

"నువ్వు నిజంగా పాదం చెప్పాలంటే
నీనుంచి ఒక సరికొత్త ఆలోచన మొక్క
చీల్చుకు రావాలి
విశాల గగనం వైపు అదిశాఖోపశాఖలుగా
విస్తరించాలి
భూమ్మీద అత్యంత ఫలవర్థకమైన నేలేంటే 24 ((తరగతి గదిలో బా.సు. మౌళి)

తరగతి గది వేయి సృజనాత్మక ఆలోచనల కూడలి భావోద్వేగాల రంగస్థలం. విద్య ప్రజ్ఞకు ఇచ్చే శిక్షణ. ఒక సారవంతమైన పంటకు అసవరమైన సేద్యం. ఇదే ప్రస్తుతానికి అవసరం ఆవశ్యకం

6. ముగింపు:

విద్య వ్యాపారీకరణ వల్ల విద్యార్థులకు సరైన విద్య అందకపోగా, వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆధునిక కవులు తేల్చి చెబుతున్నారు. అదే సమయంలో బాల కార్మిక సమస్య పరిష్కారం కాకుండా సంపూర్ణ విద్య అనే లక్ష్యం కూడా నెరవేరదని హెచ్చరిస్తున్నారు. అభ్యసించిన జ్ఞానాన్ని ప్రస్తుత పరీక్షా విధానం ఏ విధంగానూ కొలబద్ద కాదని కవుల భావన.సమకాలీన విద్యా విధానాల వల్ల దళితులకు సహేతుకమైన శాస్త్రీయ విద్య అద

అందడం లేదని ఆధునిక కవిత్వం వాపోతోంది.

ఈ వ్యాసంలో చర్చించిన విషయాల ద్వారా వెలువడిన అంశాలను పాయింట్ల వారీగా ముగింపులో తెలియజేయాలి. ఈ పరిమితులు, భావిపరిశోధకులకు సూచనలు కూడా తెలియజేయాలి.

7. పాదసూచికలు:

  1. బాలసుధాకర మౌళి, ఎగరాల్సిన సమయం, పేజి 4-6, 2014
  2. బాలసుధాకర మౌళి, ఎగరాల్సిన సమయం, పేజి 4-6, 2014
  3. కె. శివారెడ్డి, భారమితి, శివారెడ్డి కవిత, పేజి 4,5
  4. మహేజాబిన్, ఆకురాలుకాలం, పేజి 4-6, 2014
  5. ఎస్. షమీవుల్లా - సాహిత్యనేత్రం అక్టోబర్-డిసెంబర్ 1995
  6. వి. చంద్రశేఖర శాస్త్రి, ఒక కత్తులవంతెన, పేజి 76-79, 2008
  7. తైదల అంజయ్య, ఎర్రమట్టి బండి, పేజి 120-121, 2012
  8. పి.ఎల్. శ్రీనివాసరెడ్డి, మెరుపుతీగలు, పేజి 15-16, 2018.
  9. జూకంటి జగన్నాథం కవిత్వం రెండవ సంపుటి, పేజి 4-6, 2018
  10. పాపినేని శివశంకర్ సగం తెరిచిన తలుపు పేజి 110, 2008
  11.  విద్వాన్ విశ్వం, పెన్నేటిపాట పేజి 42, 2015
  12. పాపినేటి శివశంకర్ రజనీ గంధ, పేజి 110, 2013
  13. బాలసుధాకర మౌళి, ఎగరాల్సిన సమయం పేజి 16, 2014
  14. కొప్పర్తి వెంకటరమణమూర్తి, విషాద మోహనం పేజి 14, 2003
  15. పి.ఎల్. శ్రీనివాసరెడ్డి, మెరుపుతీగలు, పేజి 37, 2009
  16. గుంటూరు శేషేంద్రశర్మ- ఆధునిక మహాభారతం,
  17. కొప్పర్తి వెంకటరమణమూర్తి, యాభై ఏళ్ళవాన, పేజి 75-66,
  18. కొప్పర్తి వెంకటరమణమూర్తి, విషాద మోహనం పేజి 44, - 2003
  19. ఎండ్లూరి సుధాకర్ నల్లద్రాక్ష పందిరి, 2023
  20. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, మకు భాష కావాలి - 2023
  21. ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్ష పందిరి, పేజి 14, 2023
  22. శ్రీనివాస్ అంకే, సాహిత్య ప్రస్థానం , - జనవరి 2012
  23. శ్రీనివాస్ అంకే, సాహిత్య ప్రస్థానం , - జనవరి 2012
  24. బాలసుధాకర మౌళి, ఎగారాల్సిన సమయం, పేజి 3-4, 2014.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అప్సర్, వంశీకృష్ణ - అనేక సారంగబుక్స్ డిసెంబర్ 2010.
  2. కృష్ణకుమార్, విద్య - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అక్టోబర్ 2011.
  3. కృష్ణమూర్తి, జె. జిడ్డుకృష్ణమూర్తి దృష్టి పథంలో విద్య, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2013.
  4. గిజుభాయి సంపుటాలు ప్రజాశక్తి, హైదరాబాద్, 2005
  5. నారాయణ బి.వి. విద్యార్థి చింతామణి, నీల కమల్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2012,
  6. పాలోప్రెయిరె, విముక్తి - విద్య, ప్రజాశక్తి, హైదరాబాద్, సెప్టెంబర్ 2022.
  7. ప్రభాకర్, ఎ.కె. - బహుళ- పర్స్పెక్టివ్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2018
  8. బాలగోపాల్, రిజర్వేషన్లు పర్స్పెక్టివ్, హైదరాబాద్, 2013.
  9. బాలగోపాల్, మతతత్వంపై బాలగోపాల్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అక్టోబర్ 2010.
  10. రామారావు పడాల, భారత రాజ్యాంగం, పడాల రామారెడ్డి లా కాలేజ్ - 2014
  11. శాస్త్రి, యం.వి.ఆర్, మన చదువులు దుర్గా ప్రచురణలు, హైదరాబాద్ 2005.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]