AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. శ్రీరాముని రథోత్సవం: మట్టి బుడిగీల ప్రయోజనాలు

ఆచార్య గెంజి అరుణ
శాఖాధ్యక్షులు, విదేశీ భాషలు & భాషాశాస్త్రవిభాగం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి -517502, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9014484988, Email: arunasatesh@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు పుట్టినిల్లు మన భారతదేశం. సంస్కృతి సంప్రదాయాలను మన పండగలు ఉత్సవాలు తిరునాళ్లు తెలియజేస్తాయి. ఈ వ్యాసంలో విషయాలు క్షేత్రపర్యటన చేసి సేకరించివి, పూర్వపరిశోధనల్లోని పొందుపరిచినవి. జానపదవిజ్ఞానాన్ని ఐదు భాగాలుగా విభజించగా, అందులోని సాంఘికజానపద ఆచారాలు, జానపదవస్తుసంస్కృతి కిందకు ప్రస్తుత పరిశోధనాంశం చేరుతుంది. శ్రీరామనవమి పండుగకు తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో జరిగే రథోత్సవాన్ని తిరుపతిలో నివసించే వారు భక్తిశ్రద్ధలతో ఏ విధంగా జరుపుకుంటారనే విషయాలను క్షేత్రపర్యటనలో సేకరించిన అంశాలపై పరిశోధనాత్మక విశ్లేషణలు ఈ వ్యాసంలో ఉన్నాయి. ఉత్సవంనాడు అమ్మబడే ప్రత్యేకమైన మట్టిపాత్రలు, వాటితోపాటు పిల్లలు ఆడుకునే బుడిగీలకు సంబంధించిన విషయాలు, ప్రయోజనాలు మొదలైన అంశాలను చర్చించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. మన సంస్కృతిసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు మరుగున పడిపోకుండా,వారసత్వంగా భావితరాలకు అందించాలనే ఆశయంతో ఈ పరిశోధనవ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, ఆచార వ్యవహారాలు, రథోత్సవం, భక్తిశ్రద్ధలు మట్టి బుడిగీలు, ఉత్సాహం, పానకం, విసనకర్రలు. మానసిక పరిపక్వత.
1. ఉపోద్ఘాతం:
సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పండుగలు. పండుగ అంటేనే ఆనందం, సంతోషం, ఉత్సాహం, భక్తి భావం, శ్రద్ధా అన్నీ కలగలిపి ఉంటాయి.పూర్వ పరిశోధకులు జానపద విజ్ఞానాన్ని ఐదు భాగాలు విభజించారు. అవి జానపదసాహిత్యం, సాంఘిక జానపద ఆచారాలు, వస్తు సంస్కృతి, జానపద కళలు, జానపదుల భాష .అందులో సాంఘిక జానపద ఆచారాలలో జానపద సాంఘిక ఆచారాలు ఒక భాగం. ఈ భాగంలో మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే
కార్యక్రమాలు,నమ్మకాలు మూఢ విశ్వాసాలు,పండుగలు జాతరలు రాగా ఆటలు, వినోదాలు మరో భాగంగా ఉన్నాయి.
(క్షేత్ర పర్యటనలో భాగంగా కోదండ రామాలయం ముందు వ్యాసకర్త)
“తరతరాలుగా జన సమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు సంప్రదాయాలు క్రియ రూపాన్ని దాల్చగా పండగలు ఏర్పడ్డాయి.” (ఆంధ్రుల జానపద విజ్ఞానం, పుట: 296) పండుగకు పర్యాయపదాలుగా ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలను చెప్పుకోవచ్చు.
హిందువుల పండుగలలో శ్రీరామనవమి పండుగ ఒకటి. హిందువులు పూజించే వైష్ణవ దేవుళ్లలో శ్రీరామచంద్రుడు ఒకరు. చైత్ర శుద్ధ నవమి నాడు వచ్చే ఈ పండుగకు ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అతి ముఖ్యమైనది. ఈ రథోత్సవాన్ని తిరుపతి వాసులంతా చాలా పవిత్రంగా, ముఖ్యంగా జరుపుకుంటారు.
“తెలుగు వారి పండుగలను ఒక్కొక్కసారి ప్రత్యేకంగా వివరించడం కష్టం ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు కూడా ఒక విధంగా పండుగలే. నోములు వ్రతాలు పండుగలు కావని ఎవరనగలరు? అయినా మనం వాడుకునే పదాలను బట్టి వీటిలోనే కొన్నింటిని పండుగలని, కొన్నింటిని ఉత్సవాలని పిలవడం జరుగుతున్నది”. (ఆంధ్రుల జానపద విజ్ఞానం, పుట: 299).
కోదండ రామస్వామి తేరు అంటే ఒక పెద్ద పండగలాగా ఉంటుంది. అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంది.
(కోదండరాముని రథోత్సవం)
2. పూజావిధానం:
రాముల వారి రథోత్సవం రోజున అందరూ నిద్రలేచి తల స్నానాలు గావించుకుని పరమ పవిత్రంగా రాముల వారిని రథం పైన దర్శించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఆలయానికి వెళ్తారు. రాములవారి రథాన్ని లాగడానికి ఎంతో ఉత్సాహపడుతారు. ఒకరికొకరు సహాయ సహకారాలతో అందరు కలిసి రాముల వారి రథాన్ని మాడ వీధుల్లో ఊరేగింపుగా లాగుతారు. ఇసుక వేస్తే రాలనంత జనం స్వామివారిని దర్శించుకుంటారు. రధం లాగడానికి ఆడా మగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతిఒక్కరూ రధాన్ని లాగుతారు.రథం లాగడం వారి పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. రథం లాగేటప్పుడు రథంపైన ఉప్పు మిరియాలను భక్తులు చల్లుతారు. మిరియాలు చల్లడం వల్ల శరీరంపై వచ్చే “పులిపిర్లు పోతాయని నమ్ముతారు. అలాగే రథంపై చల్లిన మిరియాలను ఏరుకొని తింటే రోగాలు పోతాయని నమ్ముతారు”. (జి. సరస్వతి,(70), కేశవయాని గుంట, తిరుపతి).
భక్తి పారవశ్యంతో గోవిందా! గోవిందా! అని నామ స్మరణ చేస్తూ అలాగే జై శ్రీ రామా, జై శ్రీరామా అని అంటూ భక్తులు రథాన్ని ఉత్సాహంగా లాగడం చేస్తారు. రథం లాగడం కూడా భక్తిలో ఒక భాగమే. రథం లాగే భక్తులు సంతోషంతో పులకించి పోతారు. ఏదో ఒక విధంగా స్వామివారికి సేవ చేసుకోవడం భక్తులు వారి భాగ్యంగా భావిస్తారు.రథం లాగి పూర్తయి యదాస్థానానికి రథం చేరిన తర్వాత భక్తులు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొడతారు.యథాస్థానానికి చేరిన తర్వాత ప్రజల సందర్శనార్థం సీతా లక్ష్మణ సమేత రాముల వారిని రథం పైనే చాలా సేపు ఉంచడం జరుగుతుంది.
రథంపై స్వామి వారిని దర్శించుకోడానికి స్నేహితులతో చుట్టాలతో కలిసి వెళ్ళడం జరుగుతుంది.
3. దానధర్మాలు చేయడం:
ఏదో ఒక విధంగా స్వామివారి సేవకు పాత్రులు కావాలని భక్తులకు కోరికగా ఉంటుంది. అందులో భాగంగానే అనేక రకాలైన దానధర్మాలు చేస్తారు రాముల వారి రథోత్సవం నాడు కూడా కింది విధంగా దానధర్మాలు చేస్తారు.
3.1. పానకం:
శ్రీరాముడి రథోత్సవం రోజున మాడ వీధుల్లో వచ్చిన భక్తులకు పానకం పంచుతారు.పానకం పంచడం కూడా స్వామివారి సేవలో ఒక భాగంగా భావిస్తారు. వేసవికాలం అప్పుడే ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి చలువ చేయడానికి, దాహార్తిని తీర్చడానికి అక్కడి స్థానికులు ఉత్సవానికి వచ్చే భక్తులకు పానకం పంచే ఆచారం ఉంది. భక్తులందరూ పానకాన్ని దేవుడి ప్రసాదంగా భావించి భక్తి పూర్వకంగా స్వీకరిస్తారు.”పానకం పంచే ఆచారం పూర్వ కాలం నుంచి వస్తున్నది.నీటిలో బెల్లాన్ని వేసి కరిగించి అందులో నిమ్మకాయ రసం, యాలుకల పొడి కలిపి పానకం తయారు చేస్తారు” (వీరమ్మ. డి. ( 67), అనంత వీధి, తిరుపతి).
3.2 విసనకర్రలు పంచడం:
“రథోత్సవం నాడు కొంతమంది భక్తులు విసనకర్రలు పంచేవారు. వేసవి కాలంలో వేడికి విసురు కోవడానికి విసనకర్రలను పంచేవారు” (కే. రాజయ్య (65), పరసాలవీధి, తిరుపతి).
వెదురుతో చేసిన విసన కర్రలను పంచేవారు. ఇప్పుడు విసనకర్రతో విసురుకునేవారు చాలా తక్కువ. కరెంట్ పోతే బయట గాలికి కూర్చొనే వారే తక్కువ. అప్పటి కాలంలో బయట చల్ల గాలికి సాయం వేళల్లో మధ్యాహ్న వేళలో చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటూ గాలికోసం విసన కర్రలతో విసురుకునే వాళ్ళు. ఇప్పుడు విసనకర్రలు కనబడటమే చాలా అరుదుగా ఉంది. కొంతమంది పిల్లలకు విసనకర్ర అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. వెదురుతో కాకుండా తర్వాత ప్లాస్టిక్ విసనకర్రలు వచ్చాయి. పూర్వ కాలం సీలింగ్ ఫ్యాన్స్ లేని కాలంలో ప్రతి ఇంట్లో నూ విసన కర్రలు ఉండేవి. ఈ విసనకర్రలు పూర్వం శుభకార్యాలలో కూడా విసురుకోవడానికి ఇచ్చేవారు.
3.3 అంగళ్లు పెట్టడం:
ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలకు అంగళ్లు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ”ఇంతకు ముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో జాతరలు జరిగేవి. లక్షలాది ప్రజలు ఒక్క చోట చేరేవారు తర్వాత తర్వాత ఇవి ఒక్కొక్క పల్లెకు ప్రత్యేకమైన పండుగలుగా మారిపోయాయి. దేవుడు కొంత ప్రభావశాలి అనుకుంటే ఒక్క దినం జాతర రెండు దినాలకు మూడు దినాలకు వ్యాపిస్తుంది. దీనితోబాటు కేవలం ధార్మిక వాతావరణం కాక జన సమూహానికి తగ్గట్టుగా వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి. జాతర ఉత్సవాలు అనగానే బొమ్మలు అమ్మేవాళ్లు, తిండి దినుసులు అమ్మేవాళ్లు, వినోద కార్య కలాపాలతో డబ్బు చేసుకునేవారు, బొమ్మలు ఆడించేవారు, రంకుల రాట్నాల వారు అందరూ తయారవుతారు” (ఆంధ్రుల జానపద విజ్ఞానం, పుట:316). ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారికి కావాల్సిన వస్తువులను అక్కడ తీసుకోవడం జరుగుతుంది. తినుబండారాలు ఇంటికి కావాల్సిన వస్తువులు, ఆట వస్తువులు వంటివి కనబడతాయి. రోడ్డుకి ఇరు వైపులా కళ్లు మిరుమిట్లు గొలిపేలాగా తాత్కాలిక అంగళ్లను పెడతారు.ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువును కొనడం ఒక ఆచారంగా సంప్రదాయంగా వస్తోంది.
(మట్టి పాత్రల అమ్మకం)
3.4 తినుబండారాలు:
రాముల వారి ఉత్సవంలో అనేక రకాలైన తిరు బండారాలు దర్శనమిస్తాయి. అందులో పీచు మిఠాయిలు, కమర కట్ట, ఢిల్లీ పాకు, తీపి బూందీ, కారా బూందీ, తీపి మురుకులు, బొరుగులు, నిమ్మకాయ షోడా, అల్లం బర్ఫీ, కొబ్బరి బర్ఫీలు, లడ్డులు వంటి తినుబండారాలు దర్శనమిస్తాయి. వచ్చిన భక్తులు సరదాగా వాటిని కనుక్కొని తింటారు.
3.4 ఇంటికి కావాల్సిన వస్తువులు:
ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ జానపద వస్తు సంస్కృతి కిందకు వస్తాయి. ఉత్సవాలు తిరునాళ్లలో ఇంటికి కావాల్సిన వస్తువులు అనేకం కనిపిస్తాయి ఎందుకంటే భక్తులు ఆ చోటకు వచ్చినప్పుడు వాటిని చూసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది.ఇంటికి కావాల్సిన వస్తువుల్లో గరిటెలు, పాత్రలు. గిన్నెలు,తట్టలు రకరకాల బుట్టలు చీపుర, చేట వంటివి కొనుక్కుంటారు.
3.5 మట్టి పాత్రలు కొనడం:
రాముల వారి రథోత్సవం సమయంలో ఎక్కువగా కుండలు అమ్ముతారు. ఇప్పుడు అది చాలా తక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు రాముల వారి రథోత్సవానికి వచ్చి కుండలను కొనుక్కోవడం తప్పనిసరిగా ఉండేది.
”మాకు రాముల వారి రథోత్సవం అంటే చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రథోత్సవం నాడు ఇప్పుడు రామకృష్ణ పుష్కరిణి ఉన్న ప్రాంతంలో అప్పుడు మట్టి పాత్రలను అమ్మేవారు. మేము కుండలు కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం.ఎందుకంటే పుష్కరిణికి దగ్గర లో కుమ్మర వీధి ఉంది. దీన్నే కుమ్మరతోపు అని అంటారు. అక్కడ తయారు చేసే మట్టి పాత్రలను రథోత్సవం నాడు తీసుకొని వచ్చి విశేషంగా అమ్మేవారు.
వేసవి కాలం కనుక అప్పటి కాలంలోఆ ప్రాంతమంతా మట్టికుండలు కొనుక్కోవడానికి జనం కిటకిటలాడేవారు.మట్టికుండలతో పాటు మట్టి పాత్రలు, కూజాలు మూకుళ్లు వంటివాటితో పాటుగా పిల్లలు ఆడుకునేందుకు మట్టి బుడిగీలు అమ్మేవారు. రామకృష్ణ పుష్కరిణి ప్రాంతం కాస్త ఎత్తుగా ఉంటుంది. అప్పట్లో పుష్కరిణి చుట్టుపక్కలంతా మట్టితోనే దారి ఉండేది. ఎత్తుగా ఉన్న ఆ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లడానికి చాలా ఉత్సాహాన్ని కనబరిచేవాళ్ళం. (జి. ఎల్లమ్మ (72), నెహ్రూ వీధి, తిరుపతి).
ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పుష్కరిణి ఉద్యానవనంతో చుట్టుపక్కల రవాణా సౌకర్యంతో ప్రజలకు ఉపయోగపడుతోంది. ఆధునిక కాలం లో కుండల వినియోగం చాలా తగ్గింది. ఎందుకంటే ఫ్రిజ్‌లు ఆ స్థానంలో చోటు చేసుకున్నాయి. అందువల్ల కుండలను వాడడం తగ్గింది. కానీ ఆరోగ్యానికి కుండ నీళ్లు మంచిది. ప్రస్తుతం మళ్లీ చల్ల నీటికోసం కుండలను, వాడుకోవడానికి మట్టి పాత్రలను ఉపయోగించడం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది.
(క్షేత్ర పర్యటనలో విషయ సేకరణ చేస్తున్న వ్యాసకర్త)
3.6. ఆట వస్తువులు:
ఉత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు అలాంటి సమయాల్లో పిల్లల ఆట వస్తువులు ఎక్కువగా కనబడతాయి. అలాగే కోదండ రామస్వామి రథోత్సవం రోజున కూడా పిల్లల ఆట వస్తువులు అనేకం అమ్మడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు పెద్దలతో పాటు పిల్లలు కూడా వస్తారు. కాబట్టి ఆట వస్తువులను విరివిగా కొంటారు. బుడగలు, గోళీకాయలు వామన గుంటలాడే పెట్టే, పాచికలు, పరమపదసోపాన పటం,కోలాటం కర్రలు, రింగు బాలు, అనేక రకాల బంతులు చెక్కతోనూ, ప్లాస్టిక్ తో చేసిన అనేక బొమ్మలు, చెక్క బుడిగీలు మట్టి బుడిగీలు ఒకటేంటి అనేక రకాలు కనబడతాయి. వీటినన్నింటిని పిల్లలు సంతోషంగా కొనుక్కుంటారు. రాముల వారి రథోత్సవం నాడు మట్టి బుడిగీలు ప్రత్యేకంగా కనబడతాయి. మట్టి బుడిగీలలో చిన్న చిన్న కుండలు, అన్నం చేసుకునే పాత్రలు, చిన్న నీళ్లు తాగే లోటాలు, వాటి పైకి మూతలు వండుకోడానికి పొయ్యి, రోలు, విసుర్రాయి, సానరాయి వంటి పాత్రలన్నీ దర్శనమిస్తాయి. ఆడపిల్లలు మట్టి బుడిగీలు కొనుక్కోవడానికి చాలా ఉత్సాహపడుతారు. వాటితో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఆడపిల్లలు మట్టి బుడిగీలతో కింది విధంగా ఆడుకుంటారు.
4. బుడిగీలతో ఆటలు:
ఆడపిల్లలు వంట పనుల్లో తల్లిని అనుకరిస్తారు. తల్లి చేసే పనులను చూసి వారు వంట నేర్చుకుంటారు చిన్న వయసులోనే సరదాగా వంట చేయాలనే ఉత్సాహం పిల్లలో ఉంటుంది. పిల్లలు ఆడుకునే బుడిగిలాటలో ముందుగా బుడిగీలన్నింటిని కడిగి ఆరబెట్టుకుంటారు. పిల్లలు అందరూ ఒకచోట చేరి ఇంటి ఇంటి చుట్టూ ఉన్న చెట్ల నుంచి రాలిన పుల్లలను ఏరు కొంటారు. ఒక చోట తెచ్చుకున్న మట్టి పొయ్యిని పెట్టి వెలిగించి అన్నప్రసాదం వండుతారు. ముందుగా. ఇంటిలో నుంచి కాస్త బియ్యం,కొంచెం బెల్లం తీసుకుని వస్తారు. తెచ్చిన కుండలో బియ్యాన్ని నానబెట్టి మరొక కుండని పొయ్యిపై పెట్టి అందులో కాస్త నీటిని పోసి ఎసరు పెట్టి అది కాగిన తర్వాత బియ్యం కడిగి యసర్లో వేస్తారు. బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసి కలుపుతారు. బియ్యం ఉడికిందా లేదా అని చూడటానికి అందరం పోటీ పడతారు. బెల్లం వేసి బాగా కలిపి అందులో కాస్త నెయ్యి వేస్తారు. బియ్యం ఉడికే వరకు మంట ఆరిపోకుండా చూసుకుంటూ పొయ్యి లో సన్నని పుల్లలను వేస్తూ ఉంటారు. అందర పొయ్యి చుట్టూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటారు. అందరు పొయ్యి చుట్టూ కూర్చొని ప్రసాదం వండడం పిల్లలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది . ప్రసాదం తయారైన తర్వాత దాన్ని అందరూ కూర్చొని పంచుకొని తింటారు. ఇంటిలో ఉన్న పెద్ద వాళ్ళకు కూడా ప్రసాదాన్ని పెడతారు. వాళ్ళు పిల్లలు వండిన ప్రసాదాన్ని తిని చాలా బాగుంది అని అంటారు. ఆ మాటకు పిల్లలు చాలా పొంగిపోతారు. తెచ్చుకున్న చిన్నచిన్న కుండల్లో నీళ్లు పోసి కాసేపు ఉంచి అవి చల్లబడ్డాక సరదాగా వాటిని తాగి ఆ చల్లదనానికి సంతోషపడతారు. అలాగే నిమ్మకాయలు తెచ్చుకొని వాటిలోని రసాన్ని పిండి చల్లని నీటిలో కలిపి అందులో కాస్త చక్కెరను వేసి నిమ్మరసాన్ని తయారు చేసి తాగుతారు.ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే పిల్లలకి చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి. విధంగా పిల్లలు మట్టి బుడిగీలతో ఆటలను ఆడుకుంటారు
5. ప్రయోజనాలు:
మన సంస్కృతిలో అనేక రకాలైన సాంఘిక సాంస్కృతిక అంశాలు చోటుచేసుకొని ఉన్నాయి. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రామువారి గుడికి వెళ్ళడంఅక్కడ భక్తులు చేసే సేవ చేసే దానాలు వంటివాటితో పాటు అక్కడ మట్టి బుడిగీలు కొనుక్కోవడం వంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఈ విషయాలను గనుక పరిశీలిస్తే అనేక రకాలైన ప్రయోజనాలు మనకు మన భావితరాలకు ఉపయోగపడతాయి.
5.1 భక్తి భావం పెరుగుతుంది: ఉత్సవాలు, తిరునాళ్లు మన సంస్కృతిలో ఒక భాగం. ఉత్స వాలకు, తిరునాళ్లకు వెళ్లడం వల్ల మనలో భక్తిభావం పెరుగుతుంది. ఆ ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం వల్ల పిల్లలకు సంస్కృతి వారసత్వం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
5.2 ఐకమత్యం: ఐకమత్యమే మహాభాగ్యం. కలిసి కట్టుగా ఉంటే ఏ పనైనా చేయవచ్చు. అందరూ కలిసి ఆనందంగా ఒక చోటకు వెళ్లడం అక్కడ స్వామివారి సేవ చేసుకోవడం వంటి పనుల వల్ల అది చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదే విధంగా పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం వల్ల ఐకమత్యం పెరుగుతుంది ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం వల్ల ఐకమత్యం కలుగుతుంది. వారి మధ్య స్నేహ భావం పెరగడానికి అవకాశం కలుగుతుంది.
5.3. మానసిక పరిపక్వత: పిల్లలందరూ కలిసి ఆడుకోవడం వల్ల మానసికంగా వారిలో ఎదుగుదల బాగా ఉంటుంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇప్పటి కాలంలో వేసవి సెలవులు వచ్చినా పిల్లలు ఆడుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన అరచేతిలో వైకుంఠంలాఉంది. సెల్‌ఫోన్లు లాబ్ టాప్‌లో ఇంటర్నెట్ వల్ల పిల్లల్లో ఎదుటి వారితో కలిసే మాట్లాడే విధానంపోతోంది వాటికి పిల్లలు అలవాటు పడిపోయి బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి ప్రస్తుతం చాలా తక్కువనే చెప్పవచ్చు. ఆడుకోవడానికి పిల్లలకు తల్లిదండ్రులే ఉత్సాహం కల్పించాలి. శారీరక శ్రమతో మానసిక పరిపక్వత బాగా పెరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కానీ విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానం ముప్పు కి దారితీస్తుంది
5.4 ఆలోచన శక్తి పెరగడం: ఆడుకోవడం వల్ల పిల్లల్లో ఆలోచనాశక్తి పెరుగుతుంది. అంటే వంటకు కావాల్సిన వస్తువులు ఏమి కావాలి వంట ఎలా చేయాలి, ఎలా చేస్తే వంట రుచిగా వస్తుంది అనే ఆలోచనలు పిల్లలు చేసినట్లు అన్ని ఆలోచనలు చేసే శక్తి పిల్లలకు కలుగుతుంది.
5.5 ఉత్సాహం కల్పించడం: చేసిన పనిని మెచ్చుకోవడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడ ప్రసాదం చేసి పెద్దలకు పెట్టడంతో వారు మెచ్చుకోవడంతో పిల్లల్లో ఎంతో సంతోషం కలిగింది. అలాగే పెద్దలతో పాటు పిల్లలు కూడా అనేక ప్రదేశాలకు తీసుకుని వెళ్లి వారిలో భక్తిభావాన్ని పెంపొందించి అటువైపుగా వెళ్లడానికి వారిలో ఉత్సాహాన్ని కల్పించాలి. అలా చేయడం వల్ల పిల్లలు ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం కలుగుతుంది.
5.6 సొంత ప్రణాళిక: ఆటలు ఆడుకొనేటప్పుడు వేసుకునే ప్రణాళిక వారి జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. చదువుకొనేటప్పుడు, చదువు తర్వాత జీవితాన్ని ఎలా మలచుకోవాలో కూడా ఆటలు నేర్పుతాయి.
5.7 ఓపిక, సహనం: ఆడవారంటేనే సహన వంతులు, ఓపికస్తులు అనే ఒక నానుడి. ఈ ఓపిక సహనం పిల్లలు చిన్నప్పటి నుంచే వారి ఆటలు ద్వారా నేర్చుకుంటారు. ఓపికగా వారి ఆటలో వంట చేసేటప్పుడు పుల్లలు ఏరుకోవడం, అందరూ కూర్చొని గుంపుగా మంట ఆరిపోకుండా వంట చేయడం అన్నం ఉడికేంత వరకు ఓపికగా ఉండటం వంటివన్నీ ఆడ వారే చేయగలరు.
5.8. వ్యాయామం కలగటం: బుడిగీలాటలో పిల్లలు రక రకాలైన పనులు చేస్తూ ఉంటారు. వంగటం, లేవటం, కూర్చోవటం, నడవడం వంటి పనులను చేస్తుంటారు. దీనివల్ల వారికి తెలియకుండానే మంచి వ్యాయామం కలుగుతుంది.
6. ముగింపు:
- మన సంస్కృతి సంప్రదాయాల పట్ల పిల్లలకు అవగాహన కలిగేటట్లు చేయాలి.
- భక్తి భావం పెంపొందుతుంది
- విషయ పరిజ్ఞానం కలుగుతుంది.
- పిల్లల ఆటలకు పాఠశాలల్లో అలాగే ఇంట్లోనూ సమయాన్ని కేటాయించాలి.
- పిల్లల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. చురుకుగా ఉంటారు.
7. విషయదాతలు:
- జి. సరస్వతి, (70), కేశవయాని గుంట, తిరుపతి
- వీరమ్మ. డి, (67), అనంత వీధి, తిరుపతి
- కే. రాజయ్య. (65), పరసాలవీధి, తిరుపతి
- జి. ఎల్లమ్మ (72), నెహ్రూ వీధి, తిరుపతి
8. ఉపయుక్తగ్రంథసూచి:
- అరుణ గెంజి. చిత్తూరు జిల్లా పండుగలు. చరిష్మా పబ్లికేషన్స్, తిరుపతి, 2003
- నాగయ్య. జి. దాక్షిణాత్య జానపదదృశ్యకళారూపాలు. నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 1976.
- ప్రతాపరెడ్డి, సూరవరం-హిందువుల పండుగలు. ప్రతాప్‌రెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్రసారస్వత- పరిషత్తు, హైదరాబాద్, 1987
- ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘికచరిత్ర. సాహిత్య వైజయంతి ప్రచురణలు, హైదరాబాద్, 1982
- సుందరం ఆర్.వి.ఎస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1992
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.