headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. జయరాజు ‘వసంతగీతం’ గేయాలు: తెలంగాణ జీవద్భాష

విప్లవకుమార్ మందుల

రచయిత, పరిశోధకుడు,
అరుణోదయ అపార్ట్ మెంట్, విద్యానగర్,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9515225658, Email: viplavkumar2011@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.11.2024        ఎంపిక (D.O.A): 28.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో పాట ప్రక్రియ ప్రత్యేకమైనది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల కన్నా, ప్రజా సమూహానికి చేరువగా ఉన్న సాహిత్య ప్రక్రియ పాట. తెలుగు నేలలో జయరాజు ఒక పాట కవిగా విస్తృత ప్రచారంలో ఉన్న వ్యక్తి. ఈయన తన పాట కవిత్వంలో భాషను ఉపయోగించిన తీరును, ఆ జీవద్భాషసౌందర్యాన్ని, అందులోని వైవిధ్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ పరిశోధన పత్ర సారాంశం. జయరాజు కవిత్వంలోని భాషా విషయాలపై ఇప్పటివరకు ఏ విమర్శకులు గానీ, పరిశోధకులు కానీ, భాషావేత్తలు ఎటువంటి రచనలు చేయలేదు. ఈ పరిశోధన వ్యాసానికి వసంత గీతం – 1 (2013), వసంత గీతం – 2 (2016) అనే జయరాజు పాటల పుస్తకాలను ప్రథమ ఆకరాలుగా స్వీకరించాను. అలాగే అధ్యయన విస్తృతి కోసం ప్రొ. సి. కాశీం “తెలంగాణ సాహిత్యం”, కె. కె రంగనాథాచార్యులు “నూరేళ్ల తెలుగు భాష – దశ, దిశ”, గంటా జలంధర్ రెడ్డి సంపాదకత్వంలో వచ్చిన “శిఖరం” అనే పుస్తకాలను ద్వితీయ ఆకరాలుగా స్వీకరించాను. ఈ పరిశోధన వ్యాసాన్ని విశ్లేషణ, పదాల కూర్పు పద్ధతిలో రూపొందించాను. ఈ పత్రంలో భౌగోళిక ప్రాంత ప్రత్యేకతలు, ప్రాంతీయ పదాలు, ఆంగ్ల భాషాపదాలు, ప్రత్యేకపదాలరూపకల్పన, నుడికారాలు, జాతీయాలు, సామెతలు, విప్లవంపాట– భాష, దళితోద్యమంపాట – భాష వంటి ఉప శీర్షికలతో ఈ పరిశోధన పత్రాన్ని రూపొందించాను. ఈ పత్ర రచన ద్వారా జయరాజు పాట కవిత్వంలో ఉన్న భిన్నమైన పదజాలాన్ని గుర్తించవచ్చు. ఒక పాట కవిగా కవిత్వాన్ని నిర్మించడంలో తెలంగాణలోని జీవద్భాషను ఉపయోగించిన తీరును తెలుసుకోవచ్చు.

Keywords: పాట, పాట కవిత్వం, జీవద్భాష, వసంత గీతం, ప్రాంతీయ పదజాలం, భౌగోళిక భాష, జాతీయాలు, భాష సౌందర్యం.

1. ఉపోద్ఘాతం:

జీవితాన్ని భాష ద్వారా కళాత్మకంగా వ్యక్తీకరించేదే సాహిత్యం అంటాడు అర్జెంటీనియన్ రచయిత, ప్రకృతి శాస్త్రవేత్త విలియం హెన్రీ హడ్సన్. అయితే భాష లేకుండా కళ ఉంటుంది. కానీ దానికి సమగ్రత ఉండదు. భాషను ఉపయోగించిన కళ మాత్రమే నిండు రూపాన్ని సంతరించుకుంటుంది. కళాత్మకంగా కాకుండా ఏదైనా రాయొచ్చు. కానీ అది రిపోర్టో, డాక్యుమెంటో, చరిత్రో అవుతుంది తప్ప సాహిత్యం అవదు. మానవాళి జీవన పరిణామక్రమంలో మాట పుట్టింది, పాట పుట్టింది ఈ భాష కూడా పుట్టింది. అది అత్యంత సహజంగా జరిగిన ప్రక్రియ. కానీ కాలానుగతంగా జరిగిన మార్పుల్లో భాగంగా స్వార్ధం, ఆధిపత్యం, దోపిడీ అనేవి పుట్టుకొచ్చాయి. దానికి అనుగుణంగానే కళలు, సాహిత్యంలో కూడా అవి ప్రవేశించాయి. దాదాపు ఓ వెయ్యి సంవత్సరాలుగా రాత పూతలే సాహిత్యంలో పై చేయి సాధించాయి.

“పది శతాబ్దాలుగా రాత సాహిత్యమే సాహిత్యంగా ఏలుబడి అయింది. మిగిలిన సాహిత్యమంతటినీ అనేక ముద్దు పేర్లు పెట్టి దాని అసలు అస్తిత్వాన్ని కప్పి పెట్టారు. దాని వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు.” అంటాడు జయధీర్ తిరుమల రావు. (జయధీర్ తిరుమల రావు. ప్రజాసాహిత్యం, 1988: ix)

తత్కారణంగా ఆ కోవకు చెందిన వారు సాహిత్యాన్ని విభజించి మాట్లాడి, చరిత్రలో ఆ విధంగానే రికార్డు చేశారు. అలా వాళ్ళ రికార్డులు పాలకుల ఆస్తానాల్లో, దేశంలోని ఒక్కో జిల్లాలో వేళ్ళమీద లెక్కబెట్టగలిగే అతి కొద్ది మంది పండితుల కీబోర్డులకే పరిమితమయ్యాయే తప్ప ప్రజా సమూహాలకు చేరువవ్వలేదు. కానీ వారు జానపద కవిత్వమంటూ చిన్నచూపు చూసిన ప్రజా సాహిత్యం ప్రజల నాలుకల మీద నాట్యమాడింది.

కనుకనే ఇప్పటికీ ఎవరిని తట్టినా పేపరు ముట్టకుండానే ఉప్పు కప్పురంబు అని వేమన పద్యం చెప్పగలరు. పొడుస్తున్న పొద్దుమీద అని గద్దర్ పాట, గల్లీ చిన్నది అని గోరటి వెంకన్న పాట, వానమ్మా వానమ్మా అని జయరాజుల పాట పాడగలరు. నిజంగా చెప్పాలంటే పండిత సాహిత్యానికి పాలక దృక్పథం ఎక్కవనేది చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రజా సాహిత్యానికి ఉన్నది కేవలం ప్రజా దృక్పథం మాత్రమే. కాబట్టి ప్రజలు దాన్ని తమదిగా భావించి గుర్తుపెట్టుకుని ఆలపిస్తారు. పైగా ప్రజా సాహిత్యం కాలక్షేపానికో, వ్యాపకానికో, పొగడ్తలకో, పారాయణాల కోసమో పుట్టదు. పనికోసం, పని సాగడం కోసం, ప్రగతి మార్గంలో నడవడం కోసం, సమాజాన్ని సమానత్వం వైపు నడపడానికి, మానవీయ అభివృద్ధి కోసం ప్రజా సాహిత్యం పుడుతుంది. అది ప్రజల్ని ఐక్య పరుస్తుంది, చైతన్య పరుస్తూ ముందుకు నడుపుతుంది. ఆ సాహిత్యంలో ఉపయోగించే ఈ భాషకు ఒక స్పష్టమైన ప్రజా దృక్పథం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకోబోయే దానిలో ప్రజా సాహిత్యంలో భాష ఎలా ఉంటుందనేది.

2. ప్రజాకవి జయరాజు పరిచయం:

ఈ భూమ్మీద పాట మాత్రమే ప్రథమ సాహిత్యమని చెప్పవచ్చు. పాట అన్నామంటే అది చాలా వరకు ప్రజా సాహిత్యంగానే ఉంటుంది.

“ప్రజాకవిత్వమంటే అది అనివార్యంగా పాట రూపమే. ప్రజా సాహిత్యమంతా పాటగానే వ్యక్తమవుతుంది.” అంటాడు కాశీం. (సి. కాశీం. తెలంగాణ సాహిత్యం, 2015: 11)

అలాంటి ప్రజాసాహిత్య పరంపరలో కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి అంటూ ప్రజా కవిగా పుట్టుకొచ్చినవాడు జయరాజు. ప్రజాకవి జయరాజుగా ప్రసిద్ధి చెందిన గొడిశాల జయరాజు 1964 సంవత్సరం ఫిబ్రవరి 11న మహబూబాబాద్ జిల్లా, మానుకోటలోని గుమ్ముడూరు ప్రాంతంలో గొడిశాల చెన్నమ్మ, కిష్టయ్యలకు జన్మించాడు. జయరాజు చిన్నతనంలోనే నాగార్జున సాగర్ నది పరివాహక ప్రాంతం కాల్వ కిందికి, నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు అనే ఊరికి వలసపోయారు. జయరాజు ప్రాథమిక విద్యాభ్యాసమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత హైస్కూల్ చదువు కొంతకాలం మానుకోటలో, గంధంపల్లిలో సాగింది. ఐటిఐ వృత్తి విద్య కొత్తగూడెంలో పూర్తి చేసి అక్కడే సింగరేణి బొగ్గుగని కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. హైస్కూల్ స్థాయి నుంచే పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘంలో చేరి పనిచేశాడు. కాలక్రమంలో అరుణోదయలో సాంస్కృతిక సమాఖ్యలో పనిచేశాడు.

సింగరేణిలో తనదైన శైలిలో కార్మికోద్యమాలను నిర్మించాడు. అక్కడి సింగరేణి బొగ్గుల్లోనే తెలంగాణ ఉద్యమాన్ని రాజేశాడు. నాయకుడిగానే కాకుండా తన కాలుకు గజ్జెకట్టి, గొంగడేసి, తెలంగాణ సాధనకు పాటలు కైగట్టి పాడుతూ పోలీసుల లాఠీలకు తన పాటలను పోటీగా నిలబెట్టాడు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందుల నుంచి మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి వరకు తన గాయాల నుంచి నెత్తురు చిమ్ముతున్నా లెక్కజేయకుండా తెలంగాణ భాష, యాస, ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం, స్వరాష్ట్రాన్ని సాధించడం కోసం పొట్టపేగులనే పోరువంతెనలుగా కట్టి పాడాడు. తను కైగట్టిన పాటల్ని, రాసిన పాటల్ని అన్నింటిని కలిపి ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలను తెచ్చాడు.  జయరాజు పాటలు (2005), వసంతగీతం (2011), వసంతగీతం (2013), వసంతగీతం (2016). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కాళోజీ పురస్కారాన్ని తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్లకు జయరాజుకు అందుకున్నారు. అయితే జయరాజు తెచ్చిన నాలుగు పుస్తకాల్లోని పాటలు అన్ని వసంతగీతం (2011), వసంతగీతం (2016) లో ఉన్నాయి. కనుక నేను ఇప్పుడు ఈ రెండింటినే ప్రామాణికంగా తీసుకున్నాను. వాటిల్లో ఉన్న పాటల్లోని తెలంగాణ భాషను మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆధిపత్య సంస్కృతి ప్రభావం పాలిత ప్రజలపైన, వారి భాషపైన ఉండడం సహజం అంటాడు కె. కె. రంగనాథాచార్యులు. (కె. కె. రంగనాథాచార్యులు. నూరేళ్ల తెలుగు భాష - దశ - దిశ, 2023: 34).

ఆ రకంగా జయరాజు పాటల్లో కోస్తా ఆంధ్రా పదాలు పచ్చని అడవిలా ఉంటే, ఆ అడవిలో ఎర్రగా పూసిన మోదుగుపూల వలె తెలంగాణ పదాలు ఉన్నాయి. దాదాపు అర్ధ శతాబ్దం కంటే ఎక్కువగానే తెలంగాణను ఆంధ్రా ప్రాంతం వారే పరిపాలించిన కారణంగా వారి భాష మనలో ఇమిడిపోవడం సహజం. ఒక జాతి పాలనలో ఉన్నప్పుడు ఆ జాతి భాషా పదాలు వాడుకలోకి వస్తాయి. పైగా ప్రజాకవులు తెలుగు ప్రజలందరిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మిశ్రమ భాషలో కూడా రాయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నమే జయరాజు చేశాడు అనిపిస్తుంది. అలాగే అతడి యవ్వన కాలం నుంచి ఉంటున్న ప్రాంతం కొత్తగూడెం ఆంధ్రా సరిహద్దుల్లో ఉంటుంది. తను పని చేస్తున్న సింగరేణి ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే. తన ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కృష్ణా పరివాహక ప్రాంతం గుంటూరుకు సమీపంలో ఉంటుంది కనుక ఆ ప్రభావం కూడా జయరాజు పై ఉండే అవకాశం ఉంది.

సాహిత్యంలో భాషను పరిశీలించాల్సి వచ్చినప్పుడు తెలంగాణ భాషా, తెలంగాణ యాస, అనడంకన్నా ప్రాంతీయ భాష అనడమే సముచితం. ఉత్తర తెలంగాణ భాష ఒకలా, దక్షిణ తెలంగాణ భాష మరోలా ఉంటుంది. ఇవి కూడా సంపూర్ణ ఏకరూపంగా ఏమి ఉండవు. ఈ ప్రాంతాల్లోని ఆయా జిల్లాలను బట్టి పదాల వాడకం, యాస భిన్నంగా ఉంటుంది. ఒకే జిల్లాలో కూడా భాషా తేడాలుంటాయి. అందుకే “తెలంగాణ ప్రాంతీయ పదాలన్నంత మాత్రాన అవి తెలంగానంతట వ్యవహారంలో ఉన్నాయని అర్థం కాదు.” అంటాడు బాణాల భుజంగరెడ్డి. (భుజంగరెడ్డి, బాణాల. శిఖరం. 2018: 256).

కాబట్టి జయరాజు వాడిన భాష ఎక్కువభాగం మహబూబాబాద్, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన భాషగా గుర్తించాలి. అలా అని తెలంగాణ ప్రాంత భాష మొత్తమే లేదని భావించడం కూడా ఔచిత్యము కాదు. కనుక స్థానిక భాష, తెలంగాణ భాష, తెలంగాణ భాషలో ఇమిడిపోయిన ఉర్దూ, పర్షియన్, అరబ్బీ, సంస్కృత పదాలు కలిపి ముందుగా ప్రాంతీయ భాషగా, మరొకటిగా ఆంగ్లభాషా ప్రయోగాన్ని పరిశీలిద్దాం.

3. భౌగోళిక భాష ప్రత్యేకతలు:

జయరాజు పాటల్లో కనిపించే తాను నివసించిన ప్రాంతపు భాష భౌగోళిక ప్రత్యేకతలు కూడా తన పాటల్లో కనిపిస్తాయి. సహజంగానే తను పుట్టి పెరిగిన, తిరుగాడిన నేల, వాతావరణం ప్రతి కవిని ఆవరిస్తుంది. వాటి పట్ల ప్రతి కవి కొన్ని భావనలు రూపొందించుకుంటాడు. అవి ప్రేరణగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. కరువు వచ్చినప్పుడు, ఆ కరువు దాటికి ప్రజలు, గొడ్డు, గోదా అల్లాడుతున్నపుడు వాన రావాలని కవి తపిస్తూ పాట రాస్తాడు. వానోస్తే గోదావరి నది పారుతుంది. ఈ నది జయరాజు పని చేస్తున్న సింగరేణి కోల్ బెల్ట్ పొడుగూతా ఉంటుంది. ఇక కిన్నెరసాని నది. ఇది తన సొంత జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా, తాను పని చేసిన కొత్తగూడెం, పాల్వంచల మీదుగా పారుతుంది. కనుక "నిండూ గోదారై కిన్నెరసానివై” (వసంతగీతం - 89); అని అంటాడు. మరో చోట-

“ఓ.. పారే కిన్నెరసాని
పరువాల మన్నెపురాణి
ఓ.. నడిచే నీలవేణి
నాగమల్లి కిన్నెరసాని” (వసంతగీతం - 93)

అంటూ ఒక పాట మొత్తం రాశాడు. ఇక్కడ కిన్నెరసాని నది అడవిలో పారుతుంది, తన జలంతో అడవి చెట్లను సాదుతుంది కూడా కాబట్టి నదిని అడవి రాణి అన్నాడు. ఓ నడిచే నీలవేణి అంటూ నడుస్తున్న అందమైన స్త్రీగా నదిని వర్ణించాడు. నాగమల్లి తీగ వయ్యారాలు పోతూ ఎన్నో వంకలు తిరిగినట్లు ఈ నది కూడా అన్ని వంకలు తిరుగుతుంది అని కవి ఇక్కడ సూచ్యం చేశాడు. 

“కండ్లల్లో గోదారి పారుతున్నా..
కాళ్లల్లో కృష్ణమ్మ కదులుతున్నా..
గుండెల్లో దాహాలు తీరవాయే..
మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే..” (వసంతగీతం - 95)

తెలంగాణ రెండు ప్రధానమైన గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉంటుంది. ఇక్కడి ప్రజల కళ్ళ ముందు నుంచే గోదావరి, కృష్ణలు పారుతుంటాయి. కానీ వాటి నుంచి తెలంగాణ ప్రజల తాగు సాగు నీటి అవసరాలు తీరవు. వాటి పైన కట్టిన నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు ఆంధ్రా పారుదలకు ఉపయోగపడతాయి తప్ప తెలంగాణకు కాదని కవి ఇక్కడ ఆవేదన వ్యక్తం పడుతున్నాడు.

"పట్టు వస్త్రం నేసి అగ్గిపెట్టెలో పెట్టి..
ప్రపంచానికి నేను పంపిస్తిని..
నాటి చేనేత చేజారి పోతున్నది..
నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది.." (వసంతగీతం - 96) 

ఎంతో చేనేత కళా నైపుణ్యాలతో వస్త్రాలను నేసి ఇక్కడి వారికే కాదూ, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన వృత్తి ఇప్పుడు మసకబారుతున్నది. తెలంగాణలోని పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లోని చేనేత కార్మికులు, కళాకారులూ ప్రపంచానికి కట్టుకోవడానికి బట్టలు నేసిచ్చారు. కానీ కాలక్రమంలో మిషనరీ పెరగడం, ప్రభుత్వాలు వారికి చేయూతనివ్వకపోవడం వలన వారు ఆర్ధికంగా కుంగిపోయి వేలాది చేనేత కార్మికులు ఉరి వేసుకున్నారు. ఆ విషయాన్నీ ఎత్తిపడుతూ సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నదని ఎక్కి ఏడుస్తూ ఆలపిస్తున్నాడు జయరాజు. 

“నల్లాని గౌడిబర్రె
తెల్లని ఎల్లనావు
సైదన్న మేకపోతు
సక్కాని లేగదూడ
కరువింట్ల పీనుగెల్ల
కటికోని కమ్ముకునిరి
వానమ్మా వానమ్మా వానమ్మో
ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా” (వసంతగీతం - 42)

తెలంగాణను, యావత్ తెలుగు నేలలో 1999 - 2004 మధ్య కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి తోడు అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు కరువుని పెంచాయి. ఆ పరిస్థితుల్లో కవి ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా అని వర్షాన్ని బతిమిలాడుతున్నాడు. దానికి కొన్ని దీనమైన సంఘటనలను రుజువుగా చూపిస్తున్నాడు వానకు. తెలంగాణాలో మనుషులనే కాదు సాధు జంతువుల్ని కూడా ఇంట్లో మనుషుల్లాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాంటి పాలిచ్చే బర్రెను, ఆవును, లేగదూడలను కూడా అమ్ముకునే దుస్థితి వచ్చిందని చెప్తున్నాడు. అక్కడే ఒక భౌగోళిక ప్రత్యేకతను కూడా చెప్పాడు. అది తన చిన్న వయస్సులో వలసపోయిన నల్లగొండ జిల్లా కల్మలచెర్వు గ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్న జాన్ పహాడ్ గురించి రాశాడు. అక్కడ ప్రజలు దేవుడి అని భావించే సైదన్న దర్గా ఉంటుంది. కుల, మతాలకు అతీతంగా సైదన్నకు మొక్కి మేకపోతును ఆ దేవుని పేరు సాధుతారు. వాళ్లకు వీలైన సంవత్సరం జాన్ పహాడ్ దర్గాకు వెళ్లి ఆ మేకపోతును అక్కడ కట్టి రావడమో, కోసి అక్కడ నైవేద్యంగా సమర్పించి రావడమో చేస్తారు. ఈ కారణం వల్లనే నల్లగొండ జిల్లాలో సైదులు అనే పేర్లు ఊరిలో పది మందికి తగ్గకుండా ఉంటాయి. ఆ భౌగోళిక ప్రత్యేకతను "సైదన్న మేకపోతు" అంటూ ఈ వానమ్మ పాటలో వాడాడు.

భద్రాద్రి రాములోరివమ్మా
ఓరుగల్లు రుద్రంబావమ్మా
యాదగిరి నర్సన్నవమ్మా
యములాడా రాజన్నవమ్మా
కొమురెల్లి మల్లన్నవమ్మా
కొరివి వీరన్న నీవు
సమ్మక్క సారక్క నీవమ్మా (వసంతగీతం - 101)

అని తెలంగాణ భౌగోళిక చారిత్రక పరిస్థితుల్ని ఈ పాటలో గుర్తు చేస్తూ జయరాజు కైగట్టి పాడాడు.

జై రా సింగరేణి
జై జై రా సింగరేణి
ఖమ్మం వరంగల్లు ఆదిలాబాద్ కరీంనగర్
కన్నతల్లివోలె మమ్ము సాదుకున్నావు
కడుపులున్నదంత పెట్టి కట్టెలాగా కాలిపోతూ
మా ఇంటి దీపమై వెలుగుతున్నావు (వసంతగీతం - 101)

సింగరేణి కోల్ బెల్ట్ అయిన ఖమ్మం వరంగల్లు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలను ప్రస్తావిస్తూ, ఈ జిల్లాలను కన్నతల్లి లాగా సాదుకున్నావు. కడుపులో ఉన్నదంతా దేవిపేట్టి అంటాడు. భూగర్భం లోపల ఉన్న బొగ్గును బయటకు తీసిపెట్టి కట్టెలాగా కాలుతూ, థర్మల్ విద్యుత్ ఇస్తూ మా ఇంటి దీపమై వెలుగుతున్నావు అని సింగరేణితో మాట్లాడుతున్నాడు. అదొక్కటే కాదు కోల్ మైన్ లో పని చేసే కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తూ బతుకు తెరువు చూపిస్తున్నావు అనే అర్ధం కూడా ధ్వనిస్తుంది.

"అమ్మా తెలంగాణ వందనం..
తల్లి తెలంగాణ వందనం..
పోతన్న నీ కీర్తి స్తోత్రమే చేసెను
సోమన్న నీ కీర్తి వేనోల్ల పొగిడెను
కాళన్న నీ కీర్తి కావ్యాలు రాసెను
దాశరథి నీ కీర్తి ధరణిపై నిలిపెను" (వసంతగీతం - 109)

ఈ కవులంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. తెలంగాణ ఖ్యాతిని వారి కవితల ద్వారా ఘనుతికెక్కించారని తన భౌగోళిక సాహిత్య వారసత్వాన్ని చాటి చెబుతూ జయరాజు తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆత్మ విశ్వాసం నింపుతున్నాడు.

"నాయిన.. నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయినా
నాయినా.. ఊరి కుక్కలన్ని నిను చిత్రంగ చూసేవి నాయినా" (వసంతగీతం - 66)

ఈ నాయినా పాటలో తెలంగాణలో సాయుధ పోరాటానికి పూర్వం దళిత నాయినలందరి దుస్థితిని వివరిస్తున్నది. దొరలు వారి కచ్చడం అనే గుర్రపు బండిని వేసుకుని వస్తే వాటి ముందు దళితులు పరుగెత్తేవారు. దొరలకు అది ఒక రకమైన స్వాగతం, పరేడ్ లాంటిదని, మీ ఆధిపత్యం కిందనే బతుకుతున్నామని తెలియజేయడం లాంటిది. తన తండ్రి గురించి వివరించే ఈ పాటలో దొరల ఏలుబడిలో తెలంగాణాలో ఉన్న భాష ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. 

4. ప్రాంతీయ పదాలు:

i) వసంతగీతం 2011:

పోనివ్వలేదు (వసంతగీతం - 39); కట్టినౌ (వసంతగీతం - 39); పాడిన. (వసంతగీతం - 39); అమ్మున్నాది (వసంతగీతం - 39); బండి (వసంతగీతం - 40); సైదన్న మేకపోతు (వసంతగీతం - 42); బర్రె (వసంతగీతం - 42); కరువింట్లే(వసంతగీతం - 43); పీనుగెల్ల (వసంతగీతం - 43); పాలయే (వసంతగీతం - 43); రెక్కలే (వసంతగీతం - 44); గుంజావు (వసంతగీతం - 43); సద్ద (వసంతగీతం - 46); ఎరుగని (వసంతగీతం - 47); అయితిని (వసంతగీతం - 49); నిదురపుచ్చి, కాననైతి (వసంతగీతం - 50); కొప్పు (వసంతగీతం - 51); పొద్దు పొడుపు (వసంతగీతం - 51); బోసుకున్నాను (వసంతగీతం - 53); పాలసరం (వసంతగీతం - 53); వల్లో (వసంతగీతం - 54); పోతాఉంటే (వసంతగీతం - 54); పలుగు పారా (వసంతగీతం - 54); సచ్చి (వసంతగీతం - 56); ఇంటిదిక్కు (వసంతగీతం - 56); భౌషత్ (వసంతగీతం - 57); పాలిడిసినానుండి (వసంతగీతం - 58); పసుల (వసంతగీతం - 58); వన్నె (వసంతగీతం - 58); యమినోల్ల (వసంతగీతం - 59); నువ్వు (వసంతగీతం - 62); సాలు (వసంతగీతం - 64); పొద్దు (వసంతగీతం - 66); ఉరికింది (వసంతగీతం - 67); సాకిరేవు (వసంతగీతం - 68); పోకురా (వసంతగీతం - 68); చేతబడతవు (వసంతగీతం - 68); సద్దిగిన్నె (వసంతగీతం - 68); పొద్దుమాపు (వసంతగీతం - 68); గోస (వసంతగీతం - 68); జానెడు, మూరెడు, ముళ్ళుగర్ర (వసంతగీతం - 69); పెట్టంగ (వసంతగీతం - 70); కట్టంగ (వసంతగీతం - 70); చీరెలు (వసంతగీతం - 70); తట్టలు (వసంతగీతం - 70); మోస్తివి (వసంతగీతం - 70); బంగులాలు (వసంతగీతం - 70); బంక (వసంతగీతం - 71); గోసి (వసంతగీతం - 71); ఏలేడంత (వసంతగీతం - 75); కట్టుగుంటే (వసంతగీతం - 75); ఎద (వసంతగీతం - 79); ఎతలు (వసంతగీతం - 79); మేతకెళ్తే (వసంతగీతం - 86); కూడుకొనోస్తాయ్ (వసంతగీతం - 87); ఊరపిచ్చుక (వసంతగీతం - 87); పెండ్లీడు (వసంతగీతం - 92); కొంగు (వసంతగీతం - 92); లొద్ది (వసంతగీతం - 93); కొర్రమట్ట (వసంతగీతం - 93); జారుకున్న (వసంతగీతం - 93); బువ్వ (వసంతగీతం - 95); అంగట్లో (వసంతగీతం - 95); వొల్లిరిసి (వసంతగీతం - 95); రొమ్ముకెగబడ్డ (వసంతగీతం - 96); ఉసిళ్ల పుట్ట (వసంతగీతం - 96); దేవినట్లు (వసంతగీతం - 96); పగిడికంటి (వసంతగీతం - 97); తూటా (వసంతగీతం - 98); సంక (వసంతగీతం - 98); సద్ద (వసంతగీతం - 98); మంచె (వసంతగీతం - 98); వడిశల (వసంతగీతం - 98); గుంజుతుంది (వసంతగీతం - 99); పోతివి (వసంతగీతం - 99); అంటివి (వసంతగీతం - 99); పైట (వసంతగీతం - 101); జిల్లేడు (వసంతగీతం - 103); పల్లేరు (వసంతగీతం - 103); వర్లుతున్నవి (వసంతగీతం - 104); సొద (వసంతగీతం - 105); కట్టిరి (వసంతగీతం - 105); సక్కంగ (వసంతగీతం - 105); కరంటు (వసంతగీతం - 107); సంఘపొల్ల (వసంతగీతం - 107); గంటె (వసంతగీతం - 111); మసిగుడ్డ (వసంతగీతం - 111); ముట్టుగుడ్డ (వసంతగీతం - 111); గోస (వసంతగీతం - 112); సావగొడతరు (వసంతగీతం - 112); పొద్దు మాపు (వసంతగీతం - 112); తినంగ (వసంతగీతం - 112); తొడగంగ (వసంతగీతం - 112); కూకుండి (వసంతగీతం - 112); తినేటోల్ల (వసంతగీతం - 112); ఎట్టి (వసంతగీతం - 113); బైట (వసంతగీతం - 113); గుంజేశావు (వసంతగీతం - 113); మ్యాతరి (వసంతగీతం - 113); తాగేటోడు (వసంతగీతం - 113); అరిగోస (వసంతగీతం - 113); సచ్చిన (వసంతగీతం - 113); కానుండి, చంపుతుండ్రు, పారేసిండ్రు, పొడిసిరి, పోసిరి, నరికిరి (వసంతగీతం - 114); సోయి, సోది, లొట్టి, దూలా (వసంతగీతం - 115); కొలువు, కుంట, జానుపాటి సైదన్న (వసంతగీతం - 117); మట్టిపెడ్డ, గూనపెంక, గడీ, ఠాణా, ఏనెలు, గుట్టలు (వసంతగీతం - 118); జిల్లేడు మొలిసేరో, వొట్లు, రింగన పురుగు, వడ్లపిట్ట (వసంతగీతం - 119); డప్పు, గొల్ల, లొల్లి (వసంతగీతం - 120); జావ, అంబలి (వసంతగీతం - 121); శరలు (వసంతగీతం - 122); పడతై, పెండ్లి (వసంతగీతం - 123); బురకపిట్ట (వసంతగీతం - 123); దినం (వసంతగీతం - 127); కంకి, తిరుగుతుండిరి (వసంతగీతం - 133); సానబట్టిరి, ఎదబెట్టిరి, నమ్మిరి, (వసంతగీతం - 133); సద్ది మూట (వసంతగీతం - 134); అయ్య, అయ్యనొదిలిన, చింత, గింత, వాటికాడ, పన్న, (వసంతగీతం - 135); కులపోల్లు, బంతులు (వసంతగీతం - 136); ఇరిగిపోవు (వసంతగీతం - 137); కురిసిన (వసంతగీతం - 141); రొండు చేపలు, మందికిస్తివి (వసంతగీతం - 144); పొద్దు పొడిసింది (వసంతగీతం - 146); ఊరోళ్లకు, కలబడితే (వసంతగీతం - 149); మోపెడు గడ్డి, బాయి (వసంతగీతం - 151); పశువోలె, కంఠం (వసంతగీతం - 154); పాసింది (వసంతగీతం - 155); తెల్లంగ, నల్లంగ (వసంతగీతం - 157); ఫిరంగి, అప్పిచ్చి సప్పిచ్చి (వసంతగీతం - 159); కాలేకడుపు (వసంతగీతం - 160); దోస్తీ (వసంతగీతం - 165); అరక, మెరక, తట్టి, ఎల్లనావు (వసంతగీతం - 163); కొంప, పెండ (వసంతగీతం - 165); సలిజరం, దవాఖాన, ఏసిన (వసంతగీతం - 168); పానం (వసంతగీతం - 169); బొందకాయెను (వసంతగీతం - 170); యాడ, జాడ బట్టలోళ్లు, లాగంగి, కొంటిని, పోలగాండ్లు (వసంతగీతం - 171); సూతును, పెడుదును, కుంపట్లు (వసంతగీతం - 172); పోయేదెట్లా, ఈదుడెట్లా (వసంతగీతం - 176); జాస (వసంతగీతం - 178); సంకురాతిరి, సాలిరువాలు (వసంతగీతం - 180); కాడి, ముల్లుగర్ర, ఖాబద్ధార్ (వసంతగీతం - 181); పచ్చులే, గుమి కూడినవి (వసంతగీతం - 182); తోమబెట్టె (వసంతగీతం - 183); కొట్లాడబోయినోళ్ళ, లేకుంటే (వసంతగీతం - 184); పడతై, దొరకాదాయె (వసంతగీతం - 186); జీతగాడ, బర్లు, పిసుకుతావు, సల్లబొట్టే, కొర్రు, గొడ్డుకారం (వసంతగీతం - 187); కల్లం, మాపటేల, తాసుపామే, బాకీ, బాంచె బతుకులు (వసంతగీతం - 188); సాప, సోపతి (వసంతగీతం - 195); మూట, సక్కంగ, పెనిమిటి (వసంతగీతం - 196); పసులు (వసంతగీతం - 198); గెదిమినోల్లు, తవ్వెడు, గిద్దెడు మస్తు, మాడి (వసంతగీతం - 199); గడియ, సర్కారు, పొలిమేర, ముంతెడు (వసంతగీతం - 202); పాయె, నాయాల్ల (వసంతగీతం - 204); గుతుపలు, కాసెపోస్తే (వసంతగీతం - 205); పురసతి, జిద్దు (వసంతగీతం - 206); ఏలుబడి (వసంతగీతం - 211); పాడెకట్టెలు (వసంతగీతం - 213); బతికేటోళ్ళం, ఓర్వనోళ్లు (వసంతగీతం - 214); మెతుకు, తారాడే (వసంతగీతం - 220); మన్ను, ఏకునాదం (వసంతగీతం - 228); సావిడి (వసంతగీతం - 229); ఉప్పెనోలె (వసంతగీతం - 232); 

ii) ప్రాంతీయ పదాలు - వసంతగీతం 2016:

ఆదెరువు, బతుకుదెరువు (వసంతగీతం - 26); బురదమట్ట (వసంతగీతం - 27); దండమే,గోరుకొయ్య (వసంతగీతం - 63); గొర్ల కొట్టం, బర్ల పెండ, ఎడ్ల గిట్టలు, అవ్వురుక, తాలు వడిపిలు, దూడపెయ్య, పులగం, రుమాలు, బోనం, కచ్చడం (వసంతగీతం - 65); పెండకల్లు, బాంచెగాన్ని (వసంతగీతం - 67); సింగిడి (వసంతగీతం - 72); గూనపెంక (వసంతగీతం - 87); ఇరుసు, గుంజావు (వసంతగీతం - 112); మడుగులు, సన్నాయి కుప్పలు (వసంతగీతం - 113); పల్లెం (వసంతగీతం - 129).

5. ఆంగ్ల పదాలు:

i) వసంతగీతం 2011:

ఇన్సూరెన్స్, లైసెన్స్ (వసంతగీతం - 56); లైట్, లారీ, బస్సు, బ్రేక్ (వసంతగీతం - 57); ప్రాజెక్టు (వసంతగీతం - 62); డాక్టరు, లాయరు బార్డర్ (వసంతగీతం - 63); రైఫిల్ (వసంతగీతం - 97); మున్సిపాలిటీ, క్లాసు, టీనేజీ, మైకు, లెక్చర్, కేసు (వసంతగీతం - 112); ఎన్ కౌంటర్ (వసంతగీతం - 119); హోటల్, లీజ్ (వసంతగీతం - 120); పోలీస్ (వసంతగీతం - 121); జైలు (వసంతగీతం - 122); ఓటు (వసంతగీతం - 123); సెంట్రీ, గన్ను (వసంతగీతం - 130); సెంటు (వసంతగీతం - 133); టి.వి, అరెస్ట్ (వసంతగీతం - 135); ట్యాన్క్, బాంబు (వసంతగీతం - 159); ట్వంటీ, విజన్, లైఫ్, టెన్షన్, స్టైల్, స్టోరీ, కంప్యూటర్, మమ్మి, డాడీ, ఫీలింగ్స్, రైట్, జాబ్స్, కంట్రీ, లెంతి, మిల్లు, మిషన్, ఫ్యామిలీ, బర్డన్, ఆటో, హైవే, బ్రిడ్జీ, డైవింగ్, అగ్రికల్చర్, పెస్టిసైడ్, ఫిక్స్, స్టవ్, రైస్, హైటెక్, సిటీ, అంకుల్, సేఫ్, ఫుల్, లూటీ, బర్త్, ప్లేస్, స్లోగన్, అండ్, డెత్, టైమ్, స్ట్రగుల్ (వసంతగీతం - 162); ఫ్యాక్టరీ (వసంతగీతం - 165); బ్రేక్, డాన్స్, బ్రెయిన్, డ్రైనేజి, ఎయిడ్స్, కటింగ్, షాప్, బ్లేడ్ (వసంతగీతం - 168); కలెక్టర్ (వసంతగీతం - 180); సైరన్ (వసంతగీతం - 181); పర్సనాలిటీ, ఎస్పీ, డిఎస్పీ, లేటు, డిస్మిస్, ఆర్డర్ (వసంతగీతం - 183); లాకప్, కోర్టు, స్టేషన్ (వసంతగీతం - 184); ప్లాన్ (వసంతగీతం - 193); స్టీల్, బ్లాకు (వసంతగీతం - 198); రౌడీ (వసంతగీతం - 199); కాంట్రాక్టర్ (వసంతగీతం - 205); టీచర్, ఫ్యూచర్, టార్చ్ (వసంతగీతం - 208); సూట్, బూట్ (వసంతగీతం - 218); డీజిల్, పెట్రోల్ (వసంతగీతం - 223).

ii) ఆంగ్ల పదాలు- వసంతగీతం - 2016:

రైలు (వసంతగీతం - 24); సిగరెట్, క్యాన్సర్ (వసంతగీతం - 71); సెల్ ఫోన్ (వసంతగీతం - 73); విద్యుత్ (వసంతగీతం - 103); రోడ్డు, కారు (వసంతగీతం - 117); నక్లెస్ (వసంతగీతం - 130); కంపెనీ, బ్యాంక్ (వసంతగీతం - 153); డాలర్ (వసంతగీతం - 154);
.
6. ప్రత్యేక పద, వ్యాఖ్యల రూపకల్పన:

i) వసంతగీతం - 2011:

నీళ్లు పోసుకున్న చేను నీళ్ళాడాలేకపాయె, పాలుపోసుకున్న కంకి పాలన్ని ఉడిగిపాయె (వసంతగీతం - 42);  ఆ నింగికి నేలకు కురిసిన వెన్నెల పూవుల వానవి (వసంతగీతం - 46); నల్లమబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మ, రుతువు రుతువుకు నీవు బాలెంత ఓయమ్మ (వసంతగీతం - 51); మనసా నిను నిప్పుతోటి కడగనా (వసంతగీతం - 55); బండరాళ్ళకైనా బిడ్డలమీద ప్రేమలుంటయి, నెత్తినెత్తుకున్న బిడ్డలను దించనంటాయ్ (వసంతగీతం - 64); ఎండిపోయిన రొమ్ముకెగబడ్డ బిడ్డల్ని (వసంతగీతం - 96); నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది.." (వసంతగీతం - 96) మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసపోతున్నది (వసంతగీతం - 103); కడుపున జిల్లేడు మొలిసేరో, ఎర్రని మోదుగు పూసినా ఎన్ కౌంటర్లని కాల్చెరో (వసంతగీతం - 119); దారి పొడుగు నక్కా బావ సెంట్రీ కాస్తది (వసంతగీతం-130); పొలముల ముత్తయిదువులుగా చేసి (వసంతగీతం - 141); పాలకంకులేడ్చినాయి (వసంతగీతం - 163); నీ తెగిపడ్డ పేగునోయమ్మా, నీ చావు చూసిన గంగమ్మ కొంగునా మొఖమెట్టి ఏడ్చేనోయమ్మా (వసంతగీతం - 179); నీరులేని భూతల్లి పగులుతుంది గాజుకుండై (వసంతగీతం - 221); నేలమీద పడ్డ గింజకు లాలపోసి జోలపాడి (వసంతగీతం - 228); 

ii) వసంతగీతం - 2016:

తన వయసు పూలు ముడిసే (వసంతగీతం - 11); చెమట చుక్కలె ఊట చెలిమెలాయెనేమో, నీ కంటిలో కన్నీటి చెరువులున్నాయేమి నాయినా (వసంతగీతం - 63); కంటి చూపును తీసి చేను కంచెగ నాటి, నువ్వు పాట పాడితే చేను పొట్టకొచ్చినాది నాయినా (వసంతగీతం - 64); వెన్నెల మడుగులు (వసంతగీతం - 113)

7. నుడికారాలు, జాతీయాలు:

i) వసంతగీతం - 2011

సైదన్న మేకపోతు, కరువింట్లే పీనుగెల్ల, కటికోనికమ్ముకునిరి, నెర్రెబారిన బతుకు (వసంతగీతం - 43); ఉప్పుబస్తోలే మోశావు, రెక్కలే పెట్టుబడి (వసంతగీతం - 44); ఆటుపోటులై (వసంతగీతం - 47); రాయినైతేనేమి రప్పనైతేనేమి, కంటికి రెప్పై కాచిన (వసంతగీతం - 48); కనులుండి గుడ్డివాన్నైన (వసంతగీతం - 50); పాలసరం పడిందమ్మా (వసంతగీతం - 53); గుళ్ళు గోపురాలు తిరిగి (వసంతగీతం - 55); ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు, ఏడుపే మన బతుకు రాతగా మారు (వసంతగీతం - 58); కాలనాగులుండు (వసంతగీతం - 59); పట్టెడు మెతుకులు (వసంతగీతం - 67); సాకిరేవు బండగాకురా, బారెడున్న ముల్లుగర్ర జానడాయె (వసంతగీతం - 69); మాడ వెంటుకలూడ (వసంతగీతం - 71); పుట్లకొద్ది పంట, నెత్తినిండ పూలుముడిచి (వసంతగీతం - 74); మట్టిలో మాణిక్యాలు, నా కంటి వెలుగు, నా ఇంటి జ్యోతి (వసంతగీతం - 79); తప్పటడుగులు (వసంతగీతం - 84); పెరుగుబువ్వా చందము (వసంతగీతం - 85); గుదిబండ (వసంతగీతం - 89); బతికిచెడ్డ బాధ, అంగట్లో సరుకాయెరా (వసంతగీతం - 95); ఉసిల్ల పుట్టోలె, పల్లెంత వల్లకాడైపోయెరా, కడుపులో దేవినట్లవుతున్నది, పాలు తాగి రొమ్ము గుద్దేటి (వసంతగీతం - 96); పంటరాసులు (వసంతగీతం - 97); కన్నపేగు గుంజుతుంది, నాకు కొండంత బలము (వసంతగీతం - 99); కంటికి నిదుర లేదు, నా కుడి కన్ను అదురుతుంది (వసంతగీతం - 100); ఇంకేమి మిగిలిందిరా, వల వల ఏడుస్తుంది (వసంతగీతం - 103); బతికి చెడ్డ బాధ, అన్నమో రామంటూ, కల్లాకపటం (వసంతగీతం - 110); కాకికైనా చెయ్యి దులపదు, పాళ్ళలో నీళ్లలాగ (వసంతగీతం - 112); రాబందుల రాజ్యమాయె (వసంతగీతం - 114); ఎన్నాళ్ళు ఈ శరలు (వసంతగీతం - 122); ఇస్తిరి మడత చెడిపోకుండా బట్టలుండాలి, ఇంట్లో కాలు బయట పెడితే బండి కావాలి (వసంతగీతం - 135); తలలో నాలుక (వసంతగీతం - 136); పాల సంద్రం చిలికినట్లు (వసంతగీతం - 139); రాజకీయ రంకులాట (వసంతగీతం - 150); తన్నుడు గుద్దుడాయే, ఏడుపు తప్పదాయె (వసంతగీతం - 158); అప్పిచ్చి సప్పిచ్చి (వసంతగీతం - 159); మంది కొంపలు ముంచుతుండే (వసంతగీతం - 165); దిక్కులేని పక్షులాయే, ఎక్కడిదాన్నో లేపుకొచ్చే (వసంతగీతం - 170); కంటికి రేప్పొలే కాపాడుకున్నాను (వసంతగీతం - 171); గుడ్డిదీపం కాడ కూసోని (వసంతగీతం - 174); చనుబాల రుణం (వసంతగీతం - 179); సాలిరువాలు (వసంతగీతం - 180); బాంచె బతుకులు (వసంతగీతం - 189); ఏ ఇంటి బిడ్డడోగాని (వసంతగీతం - 190); చుక్కల్లో చంద్రుడు, రెక్కలమ్ముకొని, పేగు పంచుకు పుట్టినోళ్లం (వసంతగీతం - 196); రామలక్ష్మణుల జంట (వసంతగీతం - 197); కంటికి కన్ను పంటికి పన్ను (వసంతగీతం - 201); కలిసి మెలిసి బతికేటోల్లం, గాడిదెమోత చాకిరి, నీతులు వల్లించేటోళ్లు (వసంతగీతం - 214); ఎవడు చేసిన పాపమో (వసంతగీతం - 216); ఎండి బంగారం (వసంతగీతం - 224).

ii) వసంతగీతం - 2016:

ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు (వసంతగీతం - 65); ఇల్లుగుల్ల వళ్ళు గుల్ల, నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచకు, దిక్కుమాలిన అలవాట్లు (వసంతగీతం - 71); మబ్బుతునక (వసంతగీతం - 73); భుజం భుజం కలిపి (వసంతగీతం - 103); సన్నాయి కుప్పలు (వసంతగీతం - 113); తెల్లదొరలు, నల్లదొరలు, వెలివాడ (వసంతగీతం - 155). 

8. సామెతలు:

ఓటుకోచ్చేటపుడు ఓడ మల్లయ్య ఓడ దాటినాక బోడ మల్లయ్య (వసంతగీతం - 123); ఆడవారి బతుకు అరిటాకు చందము (వసంతగీతం - 156); తలలో నాలుకలాగా (వసంతగీతం - 136);

9. విప్లవ పాట - భాష:

i) వసంతగీతం - 2011:

డేగలా దొరగాడు తన్నుకుని పాయె (వసంతగీతం - 58); కామాందు దొరగాని కంఠాన్ని నరకాలి (వసంతగీతం - 59);  గుండె గుండెను రాసుకోని దండుగ నీవు సాగరా (వసంతగీతం - 85); నువ్వు దోపిడోళ్ల గుండెలల్లో పేలుతున్నవు (వసంతగీతం - 107); మిణుగురు మెరిసిన నేరమే, మీసం మొలిచిన నేరమే తెలంగాణ పల్లెలో.. (వసంతగీతం - 118); ఎర్రని మోదుగు పూసినా ఎన్ కౌంటర్లని కాల్చెరో (వసంతగీతం - 119); తూటా కడుపున పేలురో, తూరుపు ఎర్రగ మారురో (వసంతగీతం - 120); భూమంతా భూస్వాముల కాళ్ళ కింద నలుగుతుంటే (వసంతగీతం - 122); బతుకుమీద ఆశలుంటే బందూకు ఎత్తలేవురా (వసంతగీతం - 127); కుక్కపిల్ల అన్నల బాట విడవనంటది, మన ఆశయాలు పూతపూసె రోజులొస్తాయి (వసంతగీతం - 130); వీళ్ళ నడుముల్లో తూటాల దండలు, నడకల్లో ఎర్రాని జెండలు, ప్రజలే ప్రాణమని నమ్మిరి, గడ్డి పరకోలె ప్రాణాలనిచ్చిరి (వసంతగీతం - 133); కొలిమిలో కత్తివోలె మనము కణకణ మండాలి, వీరుల నడవడి రేపటి తరముకు మార్గం కావాలి (వసంతగీతం - 136); పదండి అరుణ కిరణమై, పదండి ఎర్ర సైన్యమై (వసంతగీతం - 137); కాలే కడుపుల ముందు యుద్ధ టాంకులెంత, మండే గుండెలముందు మరఫిరంగులెంత (వసంతగీతం - 160); అల్లూరి వారసులు వెల్లువై కదలాలి, భగత్ సింగ్ కలలు నిజమై తీరాలి (వసంతగీతం - 167); వీరతిలకం దిద్దినావు పోరుదారిలో నడవమన్నావు (వసంతగీతం - 178); ఉక్కు సంకెళ్లు తెంచుకున్నరు, సుత్తె కొడవళ్ళనందుకున్నరు (వసంతగీతం - 181); ఉద్యమాన్ని పెనవేసుకున్నరు, ఎర్రని తిలకం పులుముకున్నరు (వసంతగీతం - 182); ఈ దొరల మీదకు ఉరకరో, దొరల రాజ్యం కూల్చరో (వసంతగీతం - 189);  పడమరలో ఉరితీస్తున్నా, తూరుపున ఉదయిస్తారు, వీరులకు మరణం లేదు, విప్లవాలనాపలేము (వసంతగీతం - 190); తెగిపడిన వీరుని తల తిరిగి మళ్ళీ లేవాలి, భూమిని ముద్దాడి మళ్ళీ యుద్ధానికి నడవాలి (వసంతగీతం - 191); యుద్ధంలో వీరయోధుని ఆయుధంరా పాట, ఉరికొయ్యల ముద్దాడింది ఉద్యమాల పాట (వసంతగీతం - 232). 

ii) వసంతగీతం - 2016:

తుమ్మల శేషయ్య దళము గడిలోకొచ్చి, ఊరి దొరలను పట్టి వర్లంగ కొట్టిరని (వసంతగీతం - 66); నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతి నాయినా, నీ నడక చూసి నేను నక్సలైటునైతి నాయినా (వసంతగీతం - 66).

10. దళితోద్యమ పాట - భాష:

"ఉన్నదీ.. ఊరు బయట..
దీని పేరే.. మాల పేట..
దీని పేరే.. మాదిగ పేట.. " (వసంతగీతం, 2011: 105)

అంటూ జయరాజు ఊరికి దూరంగా వెలివేయబడ్డ మాల, మాదిగ కులాల దుస్థితిని వివరిస్తున్నాడు. జయరాజు యూరోపియన్ విప్లవోద్యమ వర్గ పోరాట రహాదారి నుంచి, భారతదేశపు సందు గొందుల్లోని మాల, మాదిగ పేటల్లోకి వచ్చాడు. ఇక్కడ వర్గంతో కంటే ముందు కులంతో పోరాడాలనే అవగాహనకొచ్చాడు. అందుకే 2011 సంవత్సర కాలానికి జయరాజు చాలా స్పష్టమైన అవగాహనతో కుల నిర్మూలన పోరాటాల గురించి రాయడం మొదలుపెట్టాడు.

"మాలోడి బతుకొద్దు మాదిగ బతుకొద్దు
ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు
కత్తిలా నువ్వు మెరవరన్నా ఓరన్నా
దొరలకెదురు తిరగరన్నా మాయన్న" (వసంతగీతం, 2011: 113)

కులాన్ని చూపెట్టి దొరలూ, పెత్తందార్లు మాల, మాదిగలతో వాళ్ళ గడీల్లో, పొలాల్లో వెట్టి చాకిరీ చేయించుకుంటారు. అవమానిస్తూ చిన్నచూపు చూస్తారు. కులానికి కట్టివేయబడ్డ మన బతుకుల్ని విప్పుకోవడానికి దొరలపైన తిరుగుబాటు చేయమంటున్నాడు.

"పూటకు మోపెడు గడ్డిని కోసి
కుడితిని పోసి పాలను పిసికితె
నల్లని బర్రె కులమేమన్న
తెల్లని పాల కులమేమన్న" (వసంతగీతం, 2011: 151)

కులం అని కలవరించే వారికి జయరాజు తన పాటల రూపంలో చాలా సూటిగానే ఎన్నో ప్రశ్నలు విసిరాడు. దళితులమైన మేము మీ నల్లటి బర్రెను సాదడానికి గడ్డి కోసుకొచ్చి, పాలు పిసికి మీకు పోస్తాము. మీరేమో వాటిని కమ్ముగా తాగుతారు. మమ్మల్నేమొ కింది కులమని అవమానిస్తూ, అంటరానివారిగా చూస్తారు. మరి నల్లని బర్రెది, తెల్లని పాలది ఏం కులమో చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాడు.

"మనువాదానికి మరణ శాసనం
రాస్తున్నామిదిగో..
కౌటిల్యానికి పాడె కట్టెలు
మోస్తున్నమిదిగో.. " (వసంతగీతం, 2011: 212)

అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ఈ దేశంలోని దళిత, బహుజన, మూల వాసుల తరపున మనువాదానికి వ్యతిరేకంగా జయరాజు నేరుగా ఒక హెచ్చరిక జారీ చేశాడు. నిచ్చెన మెట్ల కుల తత్వానికి, అణివేతలకు, అంటరానితనానికి మరణ శాసనం రాస్తున్నాం. సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు అనే కుట్రలతో కుల దోపిడీకి పాల్పడుతున్న కౌటిల్యానికి పాడేకట్టెలు మోస్తున్నామంటున్నాడు. ఈ సమాజంలో తరతరాలుగా చనిపోయిన ఎంతో మందికి పాడె కట్టెలు మోసి దహన సంస్కారాలు చేసిన మాకు కౌటిల్యానికి పాడె కట్టడం మాకు పెద్ద కష్టం కాదని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు.

"మలమును మోసే దెవ్వరహో
మలినం కడిగినదెవ్వరహో
రోడ్లను ఊడ్చిన దెవ్వరహో
గొడ్లను పెంచేదెవ్వరహా
మాకే ఈ పనులెందుకహో" (వసంతగీతం, 2011: 212)

వేల సంవత్సరాలుగా శ్రమ చేసే పనిని, చెమటోడ్చే పనిని, మల మూత్రాలు శుభ్రం చేసే పనిని, రోడ్లను ఊడ్చే పనిని కొన్ని కులాలకే ఎందుకు అప్పగించారు? వాటికి కట్టుబాట్లని, కుల వృత్తులని, సాంప్రదాయాలని ఎందుకు గీతలు గీశారు. ఈ పనులు చేయడం మా ధర్మం అని గుడ్డిగా నమ్మి చేసేంతలా మానసికంగా కూడా బానిసలుగా మార్చి వేశారు. ఆ పనుల్ని మేమె ఎందుకు చేయాలి? అని ప్రశ్నిస్తున్నాడు. శూద్రులందరిని ఇలా ప్రశ్నించుకుని కుల వృత్తుల బానిసత్వం నుంచి విముక్తి కావాలని ఆశిస్తున్నాడు జయరాజు.

"అసె ఒసే అని మాటలుబడ్డవు
…. బూతులుదిన్నవు
పులిలా నీవు పంజ విసిరినవు
పూలన్ దేవిగ అవతరించినవు" (వసంతగీతం, 2016: 142)

భారతదేశంలో కింది కులాల స్త్రీలు పడినన్ని అవమానాలు, మాటలు, తిట్లు, దాడులు, అత్యాచారాలు ఇంకెవ్వరు ఎదుర్కోరు. వీరిని ఏం చేసినా అడగడానికి, ఎదురుతిరగడానికి ఎవరూ ఉండరని అగ్రకులాల వారికో బలమైన నమ్మకం. ఆ బలాన్ని వారికిచ్చింది అత్యంత దుర్మార్గకరమైన కుల వ్యవస్థ. దాని కోరలకే బలి అయ్యి ఎన్నో బూతులు, తిట్లు పడి రేప్ కి గురై రెబల్ గా తిరగబడిన పూలన్ దేవిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు జయరాజు. దళిత స్త్రీలు దెబ్బ తిన్న పులుల్లా నిలబడి పోరాడితేనే బతుకు, ఆత్మగౌరవం ఉంటుంది అని జయరాజు ప్రతిపాదిస్తున్నాడు.

ii) వసంతగీతం - 2016:

బడుగులకు, మా దారికి టార్చ్ అంబేడ్కర్ (వసంతగీతం - 7); మనువుకు మరణం (వసంతగీతం - 8); కులమన్న రోత మరిచి (వసంతగీతం - 14); బహుజనులే నా దేశం (వసంతగీతం - 29); స్వర్గాలు నరకాలు సున్నా (వసంతగీతం - 31); ఎవడు అధికుడు, ఎవడు అథముడు, ఎవడు చేసిన ధర్మమిది, దళితుల ఊరవతల ఉంచి, వివక్ష (వసంతగీతం - 33); పండిన పంటల కులమేమి, కుండల మెతుకుల కులమేమి (వసంతగీతం - 36); మనువాదానికి మరణ శాసనం, కౌటిల్యానికి పాడె కట్టెలు (వసంతగీతం - 37); పాదాలలో పుట్టిన వాళ్ళని పాతరేస్తిరదిగో, నీ బ్రహ్మకే దిమ్మ తిరిగేటట్లు రాతను మార్చేస్తాం, శవాల మీద కప్పిన బట్టలు (వసంతగీతం - 38); మలినమంత, వెలివాడల, వెతలులేని (వసంతగీతం - 44); ఊరిబయట, మాలపేట, మాదిగపేట, అవమానం కుంగదీస్తది, ఆత్మ గౌరవంగా బతకరా, అంబేడ్కర్ వై సాగరా (వసంతగీతం - 54); మాలోడి బతుకొద్దు, మాదిగ బతుకొద్దు, ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు, సచ్చిన పశువును, చర్మాన్ని తీశావు, చెప్పులు కుట్టావు (వసంతగీతం - 55); కారంచేడులో బలిసిన దొరగాడు, అంటరానోడని గెంటి పారేసేను, దళితులు, దండోరా (వసంతగీతం - 56); డప్పు మండేటి కడుపు (వసంతగీతం - 57); ఆకలి తీరదు అవమానముడుగదు (వసంతగీతం - 63); మనువాదం మంటలు పేర్చిరహో, కులమని తెలివిగ చీల్చిరహో, మము కూకటివేళ్ళతో కూల్చిరహో, చినిగిన చర్మం, పగిలిన హృదయం, మలం, మలినం, రోడ్లు, గొడ్లు, మంత్రం (వసంతగీతం - 75); నేరం, మర్మం, దీనపు చూపులు, దిగులు బతుకులు, బూతులు (వసంతగీతం - 76); నల్లగున్నందుకా, నీచంగా, పాపమో, శాపమో (వసంతగీతం - 77); ఊరంతా దొరల కోట, ఊరేనుక మాల పేట, నల్లనమ్మవు, పాతబట్టలే (వసంతగీతం - 108); దళిత డప్పులే దరువేస్తున్నాయ్ (వసంతగీతం - 137); ఆడవాళ్ళ జోలికిపోతే మాడ వెంట్రుకలు ఊడతన్నినవ్, మానం దోచిన కొడుకులపట్టి, మర్మాంగాలను కోసుకొచ్చినవ్ (వసంతగీతం - 143); గుడిసెల్లో, గూడెంలో (వసంతగీతం - 150); అవమానం మోశాడు, ఆకలి దిగమింగాడు (వసంతగీతం - 156).

11. ముగింపు:

  • జయరాజు ప్రజా జీవితంలో నిండు కవితా ప్రవాహమై నిలిచాడు. 
  • భాష నిత్య వ్యవహారంలో ఉండటమే అది జీవిస్తూ ఉందనటానికి ఆధారం. కనుక తెలంగాణ నేల జీవద్భాషనే కలిగి ఉంది. 
  • జయరాజు విప్లవాన్ని తన రాజకీయ మార్గంగా ఎంచుకున్న క్రమంలో విప్లవాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ప్రజల భాషలోనే ప్రచారం చేయాల్సి వచ్చింది. 
  • రాజకీయ పరిభాషలో విప్లవాన్ని సామాన్య పేద ప్రజలకు అందివ్వలేము.  కనుక ప్రజల జీవద్భాషను ప్రధాన వాహికగా చేసుకొని పాట కవిత్వాన్ని అల్లాడు. గజ్జె కట్టి ఆడాడు. 
  • జయరాజు పాటలు ఎక్కువ ప్రచారం అయ్యాయంటేనే, తన పాట కవిత్వంలో వాడిన ప్రజా భాషకు ఉన్న గొప్పతనం తెలుస్తుంది.

12. సూచికలు:

  1. ప్రజాసాహిత్యం, తిరుమల రావు జయధీర్, పుట. Ix
  2. తెలంగాణ సాహిత్యం, కాశీం. సి, పుట. 11
  3. తెలుగు భాష - దశ - దిశ, రంగనాథాచార్యులు. కె. కె, పుట.34
  4. శిఖరం, భుజంగరెడ్డి బాణాల, పుట. 256

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అశోక్ తేజ, సుద్దాల. నేలమ్మా నేలమ్మా. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2016.
  2. కాశీం, సి. తెలంగాణ సాహిత్యం. హైదరాబాద్: స్నేహ ప్రచురణలు, 2015.
  3. జయరాజు, జయరాజు పాటలు. హైదరాబాద్: నవ్య ప్రింటర్స్, 2005.
  4. జయరాజు, వసంతగీతం. హైదరాబాద్: కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, 2011.
  5. జయరాజు, వసంతగీతం. హైదరాబాద్: సూర్యా గ్రాఫిక్స్, 2013.
  6. జయరాజు, వసంతగీతం. హైదరాబాద్: హిమాలయ గ్రాఫిక్స్, 2016.
  7. జలంధర్ రెడ్డి, గంటా (సం). శిఖరం. పెద్ద అంబర్ పేట: తెలంగాణ భాష సాంస్కృతిక మండలి, 2018.
  8. తిరుమలరావు, జయధీర్. తెలంగాణ రైతాంగపోరాటం ప్రజాసాహిత్యం. హైదరాబాద్: సాహితీ సర్కిల్, 1988.
  9. యాదగిరి, చింతల. తీగో నాగో ఎన్నియ్యలో. అలగడప: మట్టిముద్రణలు, 2016.
  10. యాదయ్య, బెల్లి. పాలెం: పదం ప్రచురణలు, 2024.
  11. రంగనాథాచార్యులు, కె. కె. నూరేళ్ళ తెలుగు భాష - దశ - దిశ. హైదరాబాద్: ఎమెస్కో, 2023.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]