AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
2. తెలంగాణ భాష: సంధి స్వరూపాలు
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ,
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్),
తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్–503 322, తెలంగాణ.
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ఆంధ్రశబ్దచింతామణి, బాల, ప్రౌఢవ్యాకరణ గ్రంథాలు తెలుగు సంధుల పేర్లు పేర్కొనలేదు. పూర్వపదంలోని చివరి అక్షరానికి, ఉత్తరపదంలోని మొదటి అక్షరానికి మధ్య కలయికలో జరుగుతున్న మార్పును బట్టి అచ్చుల మధ్యా, హల్లుల మధ్యా అవి సంధులని చెప్పుకొంటున్నాం. తెలుగులో ‘‘పూర్వ పరసర్వంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధియనంబడు” సూత్రం కేవలం ‘‘అచ్” సంధులకు మాత్రమే వర్తిస్తుంది. హల్ సంధులను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇవన్నీ తెలుగు పదాలకు వర్తింపజేసుకొంటాం. కాని వీటికి భిన్నంగాను, లేదా చిన్నచిన్న మార్పులతో తెలంగాణ భాషలో సంధి విశేషాలు కన్పిస్తున్నాయి. వాటిని స్థూలముగా తెలిపి తెలంగాణ భాషలో సంధి–రూపాల తీరుతెన్నులపై అధ్యయనం చేయడం, ఆలోచింపచేయడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
Keywords: అచ్చులు, హల్లులు, బాలవ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, పూర్వపదం, సూత్రం, సంధి విశేషాలు, భాష, శాస్త్రగ్రంథాలు, బోధకులు, ఆగమం, ఆదేశం, లోపం, నామవాచకాలు, వ్యవహారం, ద్రుతం, విభక్తి, సహజరూపం, స్త్రీ వాచక సర్వనామాలు.
ఉపోద్ఘాతం:
తెలంగాణలోని భాష వ్యాకరణయుక్తంగా ఉంటుంది. అంతర్లీనంగా ఉంటూ, అచ్చ తెలుగు పదాల ప్రయోగం ఎక్కువగా కనబడుతుంది. అచ్సంధుల, హల్సంధులు, ఆగమాదేశ సంధుల ప్రయోగాలు వాడుక భాషలో ఉపయోగిస్తున్న తీరును ఈ వ్యాసం వివరిస్తుంది.
2. తెలుగులో అచ్సంధులు – హల్సంధులు:
పూర్వోత్తర పదాల మధ్య అచ్చు వల్ల ఏర్పడ్డ లేదా అచ్చు ప్రధాన స్థానం వహించడం వల్ల ఏర్పడ్డ ఆగమాదేశాదులను దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఈ క్రిందివి అచ్సంధులుగా వివరించుకొంటున్నాం.
1. ఉకార 2. యడాగమ 3. అకార 4. ఇకార 5. అపదాదిస్వర 6. ద్విరుక్తటకార 7. టుగాగమ 8. రుగాగమ సంధులు. ఈ పేర్లతో కాకున్నా సూత్రాల అధారంగా బాలవ్యాకరణాది గ్రంథాలలో మనం వీటిని గూర్చి చదువుకొన్నాం. పూర్వోత్తరపదాల మధ్యలో ఆగమమో, ఆదేశమో, లోపమో, ద్విత్వమో, సంయుక్తమో, సంశ్లేషమో, పూర్ణబిందువో, ఏదో ఒకటి కలుగుతుంది. ఇది కేవలం హల్లులకే వర్తిస్తుంది. వాటిని హల్సంధులని చెప్పుకొంటున్నాం. అయితే ఆగమాదేశాలు అచ్చులకూ ఉంటాయి.
1. గసడగవాదేశ 2. సరళాదేశ (ద్రుత) 3. పుంప్వాదేశ 4. రుగాగమ 5. ప్రాతాది 6. నుగాగమ 7. ఇత్వాదేశ 8. పెన్వాదేశ 9. ఆమ్రేడిత 10. మువర్ణలోప 11. పడ్వాది 12. అనుకరణ 13. విసంధి (సంధి అభావం) 14. పఙృవర్ణాదేశ 15. త్రిక 16. డు–లు–ల–న–ల 17. దుగాగమ 18. అల్లోప 19. నకారాదేశ 20. ‘మి’ వర్ణలోపసంధులు. ఇవన్నీ ఆయా వ్యాకరణశాస్త్రగ్రంథాల ఆధారంతో తెలుగుభాషాభిమానులు, భావవ్యవస్థీకృత విధానాన్ని తెలిసికోవాలనుకొనేవారు అధ్యయనం చేస్తారు. స్నాతకోత్తర తరగతుల విద్యార్థులు కూడా సంధి తదితర పరిచ్ఛేదాలలో సూత్రాల మాధ్యంగా వీటిని నేర్చుకొంటారు. అయితే ఈ సంధికీపేరు అని వ్యాకరణ శాస్త్రవేత్తలు నిర్దేశించని కారణంగా, తదనంతర బోధకులు పై సంధి నామాలలో కొన్నిటిని మారుపేరుతో, సూత్రమదే ఉన్నా అలాగే పిలుచుకొన్నారు. అయినా పైన పేర్కొన్నవన్నీ రూఢి పడ్డ సంధి నామాలే.
ఇక తెలంగాణభాషలో కూడా పై సంధిస్వరూపాలన్నీ కనిపిస్తాయి. అటు ప్రాచీనకావ్యభాష లోనూ, ఇటు అర్వాచీనగ్రంథగతభాషలోనూ అచ్సంధులూ, హల్సంధులు పూర్తిగా కనిపిస్తాయి. అన్నిటికీ ఉదాహరణలున్నాయి. అయితే తెలుగుగ్రంథగతభాషలోనూ, వ్యవహారంలో ఉన్న భాషలోనూ పై సంధులకు భిన్నంగా లేదా కొంత దగ్గరగా ఉన్న సంధిస్వరూపాలను - లుప్తవకార అచ్సంధులు, అ>ఆగా, అ>ఏగా, అ>ఓగా, ఇ>ఏగా మారడం, అది – ఇది సంధులు, క్త్వార్థకపూర్వరూపంసంధి, హల్సంధులు, ద్రుతం మీద స–వాదేశం, ద్రుతాంతవిభక్తులపై స–వాదేశం, గకారాదేశం, పదాంతంలో ఎత్వాదేశం, కొన్ని పదాలు–సంధి విశేషాలు అనే అంశాల వారీగా ఇప్పుడు పరిశీలిద్దాం.
3. లుప్త వకార అచ్సంధులు:
(క) అ>ఆగా మారుతుంది:
చదువవలెను : చదువ>వాలె = చదువ + ఆలె = చదువాలె.
ఇదే విధంగా చూడవలెను> చూడాలె; తినవలెను>తినాలె; చేయవలెను>చేయాలె; చావవలెను>చావాలెగా మారుతాయి.
ఉదా: బాగా చదువాలె;
పరీక్షలు దగ్గరగా ఉన్నాయి.
(ఖ) అ>ఏగా మారుతుంది:
పారవేయాలి: పార>వేయాలి = పార>ఏయాలి = పారేయాలి.
ఇదే విధంగా దెబ్బవేశారు>దెబ్బేశారు;
కూడవేశారు>కూడేశారు; నిలవేశారు>నిలేశారు; కూరవేశారు>కూరేశారు.
ఉదా: ఆయన పనిచేయనందుకు అధికారి నిలేశారు.
(గ) అ>ఓగా మారుతుంది:
ఉదా: మగవాళ్ళు : మగ>వాళ్లు = మగ>ఓళ్లు = మగోళ్లు.
ఇదే విధంగా ఆడోళ్లు, కన్నోళ్లు, తిన్నోళ్లు.
ఉదా: ఇంట్లో మగోళ్లు లేరా! ఆడోళ్లే ఉన్నారా!
అ>ఓగా మారడమే కాకుండా ఇ>ఓగా, ఉ>ఓగా మారుతుంది.
ఉదా: తిననివాడు>తిననోడు; ఇలాగే చూడనోడు,
లేనోడు, పొట్టోడు, పనోడు.
ఉ>ఓగా మారేవి ఉన్నాయి.
ఉదా: కాపు>వాడు = కాపోడు; చదువు>వద్దు =
చదువొద్దు; కూడు>వండు = కూడొండు. ఇలాగే ఓటేయుట, మాటేయుట, కాటేయుట మొదలగునవి.
(ఘ) ఇ>ఏగా మారుతుంది:
ఉదా: కనివేసి = కని>వేసి = కని>ఏసి = కనేసి
ఇదే విధంగా కడిగేసి, తినేసి, చూసేసి.
ఉదా: ఎవరో కనేసి పోయిన ఆ బిడ్డను ఓయమ్మ పెంచి పోషిస్తున్నది.
ఈ విధంగా వకారం అచ్చుగా మారి సంధి రూపాలు
పొందినవింకా అనేక విధాలుగా కనిపిస్తాయి. అంతేగాక వ్యవహారంలో వాకిలి – ఆకిలిగాను, వంకాయలు –
అంకాయలుగాను, వచ్చిండు అచ్చిండుగాను వినిపిస్తుంది. అయితే ఈ ప్రయోగాలెక్కువగా నిజామాబాదు
జిల్లా అంతటా మెదక్ – ఆదిలాబాద్ కొన్ని మండలాలల్లో మాత్రమే వినిపిస్తాయి.
4. అది – ఇది సంధులు:
అది, ఇది అనేది స్త్రీ వాచక సర్వనామాలు అకారాంత పదాలతో, ఇకారాంత పదాలతో కలిసి సంధి రూపాన్ని పొందుతాయి.
ఉదా: పొల్ల+అది = పొల్లది, పోరి+ఇది = పోరిది.
ఉదా: ఈ పని ఆ పొల్లది చేసింది / పొల్ల చేసింది. ఆ పోరిది ఏం చెప్పినా వినదు / పోరి ఏం చెప్పినా వినదు.
తెలుగు భాష మాట్లాడే అన్ని ప్రాంతాలలో ఉన్న
వారిది, వీరిది పదాల వంటిదే ఈ సంధి. అయితే తెలంగాణలోని నామవాచకాల మీద (పొల్ల, పోరి) సంధి జరగడం
విశేషం.
5. క్త్వార్థక పూర్వ రూప సంధి:
ఇకారాంతమందున్న అసమాపకక్రియక్త్వార్థకం. తెలంగాణ భాషలో ఈ ధాతురూపాల మీద పూర్వరూపసంధి జరుగుతుంది.
ఉదా: చూచి+ఉండె = చూచిండె; ఆడి+ఉండె = ఆడిండె; వచ్చి+ఉండె = వచ్చిండె.
వచ్చిండు, చూచిండు, ఆడిండు, పాడిండు, తినిండు,
పండిండు మొదలైనవి. ఇవి స్త్రీ వాచకాలైతే వచ్చింది (వచ్చి+ఉంది), చూచింది, ఆడింది, పాడింది, తినింది (తిన్నది
బాగా వ్యవహారంలో ఉంది) పడింది మొదలైనవి వ్యవహారంలో ఉన్నాయి.
6. హల్సంధులు:
వ్యాకరణ శాస్త్రవేత్తలు చెప్పిన హల్సంధులకు భిన్నంగా వ్యవహారంలో ఉన్న భాషలోనూ, రచనల్లోనూ కనిపిస్తున్న హల్లుల మార్పులను చూద్దాం.
(క) ద్రుతం మీద సవ ఆదేశం:
ద్రుత ప్రకృతికము మీది కచటతపలకు గజడదబలు రావడం, ప్రథమ మీది పరుషాలకు గసడదవలు రావడం వ్యాకరణ శాస్త్రవేత్తల అభిమతం, అయితే జానపద సాహిత్యంలోనూ, తెలంగాణ ప్రజల వాడుక భాషలోనూ జ–బలకు మారుగా స–వలు వస్తున్నాయి. అయితే రెండు రూపాలు ఉండడం, మూల రూపం ఉండడం, సహజరూపమే ఉండడం తెలంగాణ అంతటా కనిపించడాన్ని బట్టి ఇది బహులమే అనాలి.
ఉదా: మందును+చేపలు మ్రింగినయి = మందును సేపలు మింగినయి / చేపలు మింగినయి; నేరకను+పోయిన = నేరకను వోయిన / నేరకను బోయిన / నేరకను పోయిన.
బావిలో దూకను+పోయిండు = బావిలో దూకను వోయిండు / బావిలో దూకను బోయిండు / దూకనుపోయిండు / దూకవోయిండు.
ద్రుతానికి లుప్తం కూడా వస్తుంది మాటల వేగంలో ఇది సహజంగా జరిగే పరిణామం. తాను, నేను పదాల మీద వచ్చే చ–పలు, సవలుగా మారుతాయి. ‘‘వ్యాకరణ శాస్త్రవేత్తలు ద్రుతకార్యాల మీద దృష్టిపెట్టి లోప, సంశ్లేష, పూర్ణ బిందువుల విషయం వారు చెప్పారు. అయితే తెలంగాణ భాషలో స–వలు అలవోకగా ప్రయోగింపబడతాయి’’1.
ఉదా: తాను+చదువుకొంటుండు = తాను సదువుకొంటుండు / తాను జదువుకొంటుండు / తాను చదువుకొంటుండు
నేను+చక్కగున్న = నేను సక్కగున్న / నేను చక్కగున్న
తాను+పోడు = తానువోడు / తానుబోడు / తానుపోడు
నేను+పాడుతున్న = నేనువాడుతున్న / నేనుబాడుతున్న /
నేనుపాడుతున్న.
‘‘ఓ జానపద గీతంలో నేను
వోతన్న పెండ్లికి అనే ప్రయోగముంది. తాను నేను పదాల మీద చ–పలు సవలుగా అలవోకగా మారిపోతాయి. ఇది దాదాపు
తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ఉంది. పదాదిలో ‘చ’ కారం, క్షకారం, శ–కూడా సకారంగా
పలుకబడుతుంది. చేను>సేను, చాలు>సాలు, చెలక>సెలక, క్షేమం>సేమం, శ్రీను>సీను, చక్కగ>సక్కగ,
క్షవరం>సవరం/సవురం, చవుక>సవుక, చెండు>సెండు, చేతులు>సేతులు, చందమామ>సందమామ,
చెట్టు>సెట్టు, చీమలు>సీమలు... ఇలా వాక్యం మధ్యలో వచ్చిన చకారాలు గానీ, వాక్యం ప్రారంభంలో వచ్చిన
చకారాలు గానీ వాడుకలో సకారాలుగా వినిపిస్తాయి. ‘సాలు సాలు లే సక్కగ మాట్లాడ్డం నేర్సుకో...’ ఈ
వాక్యంలోని ‘స’కారాలు చూడండి! ఇది తెలంగాణ ప్రజల్లో వాడుకలో ఉన్న వాక్యమని
తెలిసిపోతుంది’’2.
(ఖ) ద్రుతాంత విభక్తులపై సవ ఆదేశం
కేవలం ద్రుతప్రకృతికాలకే కాక ద్రుతాంతాలైన విభక్తులపై కూడా తెలంగాణ మాండలిక పదాల్లో స–వాదేశం రావడం విశేషం.
ద్వితీయావిభక్తి ‘ను’ వర్ణకం మీద జ, బలకు మారుగా స–వలు రావడం ఇంతవరకు చూశాం.
ఇప్పుడు తృతీయ చే–చేత, తో–తోడ, చతుర్థి కొఱకున్, పంచమి వలన కంటే, షష్ఠి కి–కు–లో–లోపల, సప్తమి, అందు, న... ఇవన్నీ ద్రుతాంత విభక్తులే.
తృతీయ ఉదా: నీతో+చాల్చాలు = నీతోసాల్సాలు
వానితో+చావొచ్చింది =
వానితోసావొచ్చింది
నాతో+పెట్టుకోకు = నాతోవెట్టుకోకు
అయినవారిచేత+చిక్కిన =
అయినవారిచేతసిక్కిన
నా చేత+పడ్డాడు = నాచేత వడ్డాడు
చతుర్థి ఉదా: నాకొఱకు+చచ్చినాసరే = నాకొఱకుసచ్చినాసరే
నీకొఱకు+చేస్తాను = నీకొఱకు
సేస్తాను
ఎవరికొఱకు+పోయారు = ఎవరికొఱకువోయారు
దేనికొఱకు+పడాలి =
దేనికొఱకువడాలి
పంచమి ఉదా: ఆయనవలన+చక్కగకాదు = ఆయన వలన సక్కగకాదు
ఈయనకంటె+చేయరాదు = ఈయనకంటె
సేయరాదు
ఎవరి
వలన+చెదిరిపోయింది = ఎవరి వలన సెదిరిపోయింది
వారికంటె + చదువొచ్చింది = వారికంటె సదువొచ్చింది.
షష్ఠి ఉదా: ఆ
అమ్మాయికి+చదువొచ్చింది = ఆ అమ్మాయికి సదువొచ్చింది
తీపంటే ఆయనకు+చచ్చేంత ఇష్టం = ఆయనకు తీపంటే సచ్చేంత ఇష్టం
ఆ పనిలో+పడ్డాడు = ఆ పనిలో
వడ్డాడు
కోట
లోపల+చెట్టుంది = కోటలోపల సెట్టుంది
సప్తమి ఉదా: పుస్తకములందు+చాలాఉంది = పుస్తకములందు సాలా ఉంది
లోకమందు+చెప్పారు =
లోకమందుసెప్పారు
చెట్టున+చీమలు = చెట్టున సీమలు
పొలములందు+పోరడు =
పొలములందువోరడు
పాడిన+పాట = పాడినవాట
ద్రుతాంత విభక్తులపై స–వా దేశం (చ–పలకు) నిత్యం వైకల్పికం కూడా.
ఆయా వ్యక్తుల భాషా సంస్కారంపై కూడా ప్రయోగాల్లో మార్పులుంటాయి. వ్యాకరణ శాస్త్రవేత్తలు చెప్పిన ద్రుతాంత పదాల మీది కచటతలు గజడదబలవుతాయన్న దానికి ఇది అపవాదం. అయితే చ–పల విషయంలోనే ఇలా జరుగుతుంది.
ఊరికిసేనుకు తిరగాలె, ఊరికిసేసిన సేతానం,
ఉరికురికివడ్డాడు, దానిలోకివోయాడు, ఆయనలో వడిపోయాడు, సెల్కలో సేను వెట్టిండు... ఈ విధంగా వాక్యాల్లో వాక్యం
మధ్యలో అలవోకగా చ–పలు సవలుగా మారడం వ్యవహారంలో కనిపిస్తుంది. తెలంగాణ మాండలిక భాషలో స–వాదేశ
సంధిని ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది.
(గ) గకారాదేశం:
ఆ–ఈ–ఏ అనే త్రికాల్లో అఆ–ఇఈలు వాక్యం మధ్యలో గానీ, పదాదిలో గానీ, గగాగిగీలుగా మారిపోతాయి. అయితే ఇది కూడా వైకల్పికమే. నిజానికిది అచ్సంధిలోనే చెప్పుకోవాలి. కాని యడాగమాలకు లేని ప్రాధాన్యం ఇక్కడ గగాగిగీలకు ఉంది. అవి అక్కడ ఇక్కడ అన్న పదాల్లోని ఆద్యక్షరాలని కూడా తెలియకుండానే ఈ పదాలు గకారాదితో వ్యవహరింపబడుతున్నాయి.
ఉదా: అక్కడ>గక్కడ, అక్కడ>ఆడ = గాడ
ఇక్కడ>గిక్కడ, ఇక్కడ>ఈడ = గీడ
నిందార్థంలో గిగీలు (వంకాయ>గింకాయ,
టెంకాయ>గింకాయ, సోమయ్య>గీమయ్య) వస్తాయని వ్యాకరణ శాస్త్రవేత్తల మతం. కాని ఆఈ సర్వనామాలకు తెలంగాణాలోని
కొన్ని జిల్లాల్లో పాక్షికంగా గగా–గిగీలు వస్తాయి. ‘నేను గాడికోయి గిప్పుడు వచ్చిన’. ఈ
వాక్యంలోని గకారాదేశం సమాజంలో వాడుక భాషలో కనిపిస్తుంది.
(ఘ) పదాంతంలో ఎత్వాదేశం:
పదాంతంలో గానీ, వాక్యాంతంలో గాని ఎత్వాదేశం వస్తుంది. ఇకార, అకారాంత, క్రియా పదాలలోని అంత్యాక్షరాలే ఈ విధంగా పరిణామం చెందుతాయి.
ఉదా: వినాలి>వినాలె, తినాలి>తినాలె, ఉండాలి>ఉండాలె, చదువాలి>చదువాలె, చూడాలి>చూడాలె, దూకాలి>దూకాలె.
ఇవన్నీ క్రియాపదాలె. చాలా రచనల్లో గ్రంథస్థమైనవే. నిత్య వ్యవహారంలో ఉన్నవే. ఈ ఇకారాంత క్రియలు మనం ఇప్పుడు తినాల, సమయమైంది పోవాల వంటివి చదువుకొన్నవారిలో అరుదుగా వినిపిస్తున్నాయి. ఇకారాంతమే సహజమైందయినా, ఎకారాంత వైరళ్యాన్ని (ఆధిక్యాన్ని) బట్టి ఈ ఎత్వాదేశ పదాలు ప్రామాణిక భాషలో కూడా నిలిచాయి.
ఉదా: మనమందరం ఈ వర్ణాంతర వివాహానికి వెళ్లాలె. మంచీ చెడ్డలు చూడాలె. యువతను ప్రోత్సహించాలె. పది మంది ఆ మార్గంలో నడవాలె. దేశంలోని సదాచారాలు సత్కార్యాలు పదిమందికి ఆదర్శంగావాలె.
ఇలా వాక్యాంతంలోని క్రియాపదాల ఇత్వం - ఎత్వంగా
మారడం సహజపరిణామమే. కవితల్లోనూ, కథానికల్లోనూ, జానపదుల భాషాపరిశీలనంలోనూ ఈ ఎత్వాదేశం
కనిపిస్తుంది.
(ఙ) కొన్ని పదాలు : సంధి విశేషాలు
- పోరగాడు, పిల్లగాడులో గారావడం
- బత్కాలి, వెత్కులాటలో అల్లోపం కలగడం
- ఉత్కలాట (ఉదకాలాడుట–నీళ్లాడుట)లో తకారాదేశం
- ఎం(వెం)టికన్నరలో ద్విత్వనుగాగమం రావడం
- వచ్చినుంటె, చూచినుంటె వంటి పదాల్లో నుగాగమం
- పెండ(పేడ)లో దీర్ఘం పోయి పూర్వానుస్వారం రావడం
- ఇగ(ఇక) ఒగ(ఒక)ల్లో కకారం గకారంగా మారడం
- సద్దలు(సజ్జలు) దంట(జంట)ల్లో జకారం దకారంగా మారడం
- పెద్దీర్కం(పెద్దరికం) ఈ, ఇ, అల పరిణామం
- బనాయించు, పిరాయించు, టలాయించు, చలాయించు, మిళాయించు వంటి అన్య దేశ్యాలకు వచ్చిన ఇంచు గాగమం
- చాల–చాన–శాణ–శానలలో నణల ఆగమం
- గదువ(గడ్డము) డకారముకారాలకు దువలు రావడం, గదుమ అనే రూపం కూడా ఉండడం
- బర్లు–గొర్లు (బఱ్ఱెలు–గొఱ్ఱలు) రూపాంతరాల సాధన
- బొక్కలు (బొమికలు) ‘మిక’ ద్వత్వకకారంగా మారడం
- గుంతల్ల, నీల్లల్ల, బండ్లల్ల, కంపల్ల వంటి పదాల్లోని ద్విత్వలకారం ‘లో’ నుండి పరిణమించడం
- బుస్సు బుస్సు మనడం, కస్సు కస్సు మనడం, తుస్సు మనడం పదాల్లో ముగాగమాదేశం
- తిరుగుతడు–తింటడు–పంతడు పదాల్లోని వాడు పరిణామం చెంది హ్రస్వాంతం కావడం
- లచ్చవ్వ, గంగవ్వ, పోశవ్వ పదాలకు అకారసంధి నిత్యం గావడం
- కైకిలి (కైకూలి)లో ‘కూ’కిగా మారడం
- తినవోయిండు, దున్నవోయిండు పదాల్లో ద్రుతలోపం ప–వగా మారడం
7. ముగింపు:
తెలంగాణ భాషలో వచ్చే పరిణామాల్ని, సంధి స్వరూపాల్ని వ్యాకరణ శాస్త్ర దృష్టితో అధ్యయనం చేయడానికి మనకున్న పరిమితి మేరకు కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. భాషా పరిణామ దృష్టితో గాక, సంప్రదాయ వ్యాకరణాలకు మరికొన్ని అంశాలు చేర్చవచ్చునన్న ఆలోచనతో జరిగిన అధ్యయనంగానే దీనిని భావించాలి.
ఆంధ్రశబ్ద చింతామణి, బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం
వీటిపై వచ్చిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలు తెలుగు భాష అధ్యయనశీలురకు తెలుసు. ఈ వ్యాకరణాలన్నీ వాడుక భాషకు
లక్షణాలు నిర్మించలేదు. అయితే గ్రంథ గత భాష కూడా వాడుకలో ఉంటుంది. అటువంటి భాష లక్షణ శాస్త్రానుగుణంగానే
ఉంటుంది. అయితే తెలంగాణ వాడుక భాష జానపదుల గేయ–కథా సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. వాడుక భాషను
పాత్రానుగుణంగా ప్రయోగించేప్పుడు ఆధునిక కథానికల్లో, కవితల్లో, నవలల్లో, నాటికల్లో కనిపిస్తుంది. కొన్ని
కవితలు – కథా కావ్యాలు, కథానికలు తెలంగాణ మాండలికంలోనే లభిస్తున్నాయి. వాడుక భాష ఆధారంగా తెలంగాణ
భాషలో సంధి రూపాలు తెలుసుకొనే అవకాశం ఈ వ్యాసం ద్వారా కలుగుతుంది.
8. పాదసూచికలు:
- తెలంగాణ యాస – బాస, పుట: 42
- తెలంగాణ యాస – బాస, పుట:
43
9. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణమూర్తి, భద్రిరాజు (సం). మాండలిక వృత్తి పదకోశం-1, 2 భాగాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైద్రాబాద్: 1962, 1971
- నారాయణరావు, చిలుకూరి. ఆంధ్రభాషా చరిత్రము, 1–2 సంపుటాలు, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరు:1937
- ముత్యం, కె. నేటి ప్రపంచీకరణలో తెలంగాణ భాష - తెలుగు భాష - గిరిజన భాషలు. తెలుగు విభాగం. శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్: 2016
- రాధాకృష్ణ, బూదరాజు. వ్యావహారిక భాషా వికాసం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు: 1999
- వెంకటరెడ్డి, కసిరెడ్డి. తెలంగాణ యాస – బాస, జాతీయ సాహిత్య పరిషత్, తెలంగాణ: 2016
- శ్రీహరి, రవ్వా. తెలంగాణ మాండలికాలు – కావ్య ప్రయోగాలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు: 1988
- సత్యనారాయణ, ఎస్వీ. తెలంగాణ పదకోశం – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు: 2019
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.