headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

11. తెలంగాణ ఉద్యమ కవిత్వం: ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం

కాంటేకారు శ్రీకాంత్

పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
ఉస్మానియా యూనివర్సిటీ, రావిర్యాల,
మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 8008668285, Email: srikanth.k.rr@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో మొదలైన ప్రాంతీయ అస్తిత్వచైతన్యం తెలంగాణ సాహిత్యంలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని సాంస్కృతిక చైతన్యాన్ని చాటేందుకు ఇక్కడి కవులు, రచయితలు, బుద్ధిజీవుల్లో మొదలైన స్పృహ.. తెలంగాణ సాహిత్యాన్ని మరోమెట్టు ఎక్కించింది. ఈ క్రమంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా వెలువడిన తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వకవిత్వంలోని సాంస్కృతికచైతన్యాన్ని పరిశీలించడం వ్యాస ముఖ్యోద్దేశం. మలిదశ ఉద్యమకాలంలో వెలువడిన వివిధ కవితాసంకలనాలను పరిశీలించి, అందులోని ప్రాంతీయ అస్తిత్వచైతన్యంతో వెలువడిన కవితలను విశ్లేషించి.. తెలంగాణ అస్తిత్వ వైభవాన్ని, సాంస్కృతిక చైతన్యాన్ని చాటిన తీరును ఈ వ్యాసం ప్రకటించగలదని ఆశిస్తున్నాను.

Keywords: తెలంగాణ ఉద్యమసాహిత్యం, సాంస్కృతికచైతన్యం, మలిదశఉద్యమకవిత్వం, కవిత్వ విశ్లేషణ, తెలంగాణ అస్తిత్వ వైభవం.

1. ఉపోద్ఘాతం:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 1996 నుంచి 2014 వరకు జరిగిన మలిదశ ఉద్యమం అత్యంత కీలకమైనది. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమం కేవలం తొమ్మిది నెలలపాటు అర్ధంతరంగా ముగిసిపోయింది. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తొలిదశ ఉద్యమం పెద్దగా విస్తరించలేకపోయింది. మలిదశ ఉద్యమకాలం నాటికి తెలంగాణ భావన అంతర్లీనంగా ఇక్కడి కవుల్లో, రచయితల్లో, బుద్ధిజీవుల్లో వ్యక్తమవుతూ వచ్చింది. 1996లలో మలిదశ ఉద్యమం తెరపైకి వచ్చేనాటికి తెలంగాణ అస్తిత్వాన్ని భాషపరంగా, సంస్కృతిపరంగా, తమదైన జీవన విధానపరంగా కవులు, రచయితలు స్పష్టంగా చేస్తూ వచ్చారు. బలవంతంగా రుద్దిన ప్రామాణిక భాషను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల భాషలో రచనలు చేస్తూ.. తెలంగాణ భాషా-సంస్కృతుల పట్ల కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ.. భౌగోళికంగానే కాకుండా చారిత్రకం, సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పారు. ఈ క్రమంలోనే చారిత్రకంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు వేర్వేరు పరిపాలనల్లో ఉండటం వల్ల, కుతుబ్‌షాహీల, అసఫ్‌జాహీల పాలన వల్ల, వేరవ్వడం వల్ల తెలంగాణ తనదైన అస్తిత్వాన్ని, సంస్కృతిని, తనదైన ఆధునిక చైతన్యాన్ని కలిగి ఉన్న విషయాన్ని తెలంగాణ కవులు, రచయితలు చాటిచెప్పారు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంతానికి సాంస్కృతికంగా, స్వభావికంగా ఉన్న వైరుధ్యాలను వివరిస్తూ.. ఐదుదశాబ్దాలు కలిసి ఉన్నా భావపరంగా ఐక్యత ఏర్పడలేదని, ఈ క్రమంలోనే తెలంగాణ తన సంపూర్ణ అస్తిత్వాన్ని చాటిచెప్పుకోవడానికి, తనదైన జాతిపరమైన ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి మలిదశ ఉద్యమానికి సిద్ధమైన తీరును చాటుతూ విశిష్టమైన కవిత్వాన్ని వెలువరించారు. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణ ప్రాంతీయతను చాటుకుంటూ వెలువడిన కవిత్వం.. తెలంగాణ అస్తిత్వ కవిత్వంగా ఉద్యమస్థాయిని అందుకొంది. ఈ విధంగా వెలువడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కవిత్వంలోని సాంస్కృతిక అంశాలను, ప్రాంతీయ చైతన్యాన్ని పరిశీలించడం నా పరిశోధన వ్యాసం లక్ష్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాహిత్యాన్ని పరిశీలించి.. 'ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం’ (1969-2014) అన్న అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెల్దండి శ్రీధర్‌ పరిశోధన చేసి.. పీహెచ్‌డీ పొందారు.  

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు విశిష్టమైన ప్రాతను పోషించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ రచనలు చేయడమే కాకుండా.. క్షేత్రస్థాయి ఉద్యమంలోనూ పాల్గొని.. క్రియాశీల పాత్ర పోషించారు. సుదీర్ఘమైన పోరాట చరిత్ర, సమృద్ధమైన వనరులు కలిగిన తెలంగాణ ప్రాంతం సమైక్య పాలనలో పాలకుల వివక్షల కారణంగా కునారిల్లుపోతున్న తరుణంలో ఈ ప్రాంతీయ వివక్షల మీద నిరసనగళమెత్తుతూ.. తమ రాజకీయ ఆకాంక్షలు ప్రకటించుకోవడమే కాకుండా చారిత్రకంగా, సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వ ఔన్నత్యాన్ని, చైతన్యాన్ని చాటిచెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కవిత్వంలోని సాంస్కృతిక పార్శ్వాన్ని చర్చిస్తూ.. పండుగుల, గ్రామీణ సాంస్కృతికచిత్రణ, నగరసాంస్కృతిక చిత్రణ అంశాలతో కూడిన కవిత్వాన్ని విశ్లేషణాత్మకంగా అందిస్తున్నాను.

2. పండుగలు-బతుకమ్మ చిత్రణ:

తెలంగాణ సంస్కృతిని చర్చించుకునే సమయంలో ప్రముఖంగా గుర్తొచ్చేవి ఇక్కడ జరుపుకునే పండుగలు. తెలంగాణ జనజీవనంలో ఈ పండుగలకు విశేషమైన ప్రాధాన్యంతోపాటు బలమైన సాంస్కృతిక నేపథ్యమూ ఉంది. కులమతాలకతీతంగా సాంస్కృతిక సమభావన, సామరస్యం చాటుకుంటూ తెలంగాణ ప్రజలు బతుకమ్మ, బోనాలు, దసరా, హోళీ, ఉగాది, శ్రీరామనవవి, మొహ్రర్రం, పీర్లు, రంజాన్‌, క్రిస్మస్‌ ఇలా అన్ని మతాల పండుగలను జరుపుకుంటారు. మలిదశ ఉద్యమకాలంలో సబ్బండ వర్ణాల ప్రజలు తమదైన అస్తిత్వ చైతన్యంతో, గొప్ప స్వాభిమానంతో బతుకమ్మ, బోనాల వంటి పండుగలను జరుపుకుంటూ.. వాటిని ఉద్యమరూపాలుగా, ప్రజలను చైతన్యపరిచే అస్త్రాలుగా మలిచారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ చిహ్నంగా బతుకమ్మ నిలిచింది. బతుకమ్మ  ముఖ్యంగా ఇది మహిళలు జరుపుకునే పండుగ. ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను అలకరించి.. ఆటపాటలతో సంబురంగా జరుపుకునే ఉత్సవమిది. పెత్తరమాస, బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా.. ఇలా వరుసగా వచ్చే పండుగలతో.. తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాలు ప్రతి ఏటా కొత్త కళను సంతరించుకుంటాయి.

ఎంగిలి పువ్వుకూ చద్దుల బతుకమ్మకూ
పూలగుత్తుల వంతెన కట్టి
పాటల రహదార్లను పరిచాకనే
కొత్త పెండ్లిపిల్లలు
పిండారబోసిన వెన్నల్లో
ఆటల ఆరిందలయ్యింది
చుక్కలు చంద్రుడిపై మక్కువ పడ్డట్లు
బతుకమ్మలు చెరువుగట్టుకు బారుగడితే
వూరు సమస్త లౌక్యమూ మరిచిపోయి
నీలాకాశపు సాయంతనంలో సేదీరేది - ఏనుగు నరసింహారెడ్డి (పొక్కిలి, పుట 70)

తెలంగాణ సామాజిక జీవన విధానంలో, ప్రాంతీయ అస్తిత్వంలో విడదీయరాని భాగమైన బతుకమ్మ పండుగను, ఆ పండుగతో ముడిపడిన మానవ సంబంధాల మహోన్నతను ఇలా చిత్రిస్తాడు కవి. తెలంగాణ పల్లె స్త్రీల నిరాడంబర సాంఘిక వేడుక అయిన బతుకమ్మ వెనుక ఎంతటి స్వచ్ఛమైన మానవీయత, మమకారాలు ఉన్నాయో చాటుతున్నాడు. సమైక్య పాలనలో తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయాలు చులకనకు గురవుతున్న ఉద్వేగ సందర్భంలో తమ సామాజిక, సాంస్కృతిక వేడుకల్లోని ప్రత్యేకతను, విశిష్టతను గుర్తుచేసుకుంటూ.. ఆ ఉత్సవాల జ్ఞాపకాలను అక్షకరీంచడం ఇక్కడి కవులు కర్తవ్యంగా భావించారు. తమ పల్లె జీవితంలోని, తమ జ్ఞాపకాల్లోని సకల సాంస్కృతికాంశాలకు అక్షరరూపమిచ్చారు. తెలంగాణ ఆత్మను, అస్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రజా సాంస్కృతిక చిహ్నాలను, అందులోని జీవన సంబురాలను కవిత్వీకరించారు.

గునుగులూ, తంగేళ్ల గుసగుసలే
జీవితం వన్నె దిద్దుకొని
ఉయ్యాల పాటల అలల మీద తేలే
సద్దుల బతుకమ్మైపోతది
సుద్దుల్నీ సద్దుల్నీ
వాయినాలుగా ఇచ్చిపుచ్చుక్ను తృప్తి
చెవికమ్మల మెరుపుల
తళుక్కుమంటది - దేశపతి శ్రీనివాస్ (మునుం, పుట 97)

పండుగ రోజుల్లో తెలంగాణ పల్లెలు సంతోష సంబూరాలతో వికసిస్తాయి. బతుకమ్మ పండుగ వేళ ఏ ఇంటికెళ్లినా తంగెడు పూలు, గునుగుపూల గుసగుసలే వినిపిస్తాయంటూ.. పల్లె జీవితం బతుకమ్మలా మురిసిపోయే తీరును గుర్తుచేస్తాడు కవి. పండుగ పూట ఆడబిడ్డలు ఇంటికొస్తే ఉండే సంతోషం.. అదే పండుగ అయిపోయి.. వాళ్లు తిరిగి అత్తగారింటికి వెళుతుంటే.. తల్లిదండ్రుల గుండెలు ఎలా భారంగా మారుతాయో, ఆడబిడ్డలు మనస్సులు ఎలా కలత చెందుతాయో చిత్రిస్తూ.. గ్రామీణ జీవనంలోని మానవ సంబంధాల ఆర్దతను చాటుతారు కవి.

'కోళ్ళాగ గుంజుకపోతుంటే/ కలతపడ్డ ఆవు/ కనుగుడ్డైతది పల్లే' (పైదే)

పండుగ తర్వాత తల్లిగారింటిని, దోస్తులను వదిలివెళ్లలేక వెళుతున్న ఆడపడుచుల మానసిక స్థితిని చిత్రిస్తాడు కవి. 'గౌరమ్మను సాగనంపినట్లు గావురంగ సాదిన బిడ్డను పంపలేక చిట్టిచేతుల టాటాలకు జవాబివ్వలేక’ కన్న తల్లిదండ్రుల ఆవేదనకు మన కళ్లూ చెమర్చుతాయి. పండుగ ముగిసి ఆడబిడ్డా వెళ్లిపోయిన తర్వాత ఇల్లు బతుకమ్మను చెరువులో వేసిన అనంతరం ఖాళీగా మిగిలిపోయిన తాంబాలమవుతుందనడంతో మనస్సు చివుక్కుమంటుంది.

'మల్లొచ్చే ఏటిదాకా ఒంటరి పాటొకటి గుండె ఊపిరి ఉయ్యాల ఊపుతది' అనడంలో తెలంగాణ సంస్కృతిలోని ఎదురుచూపంతా కనబడుతుంది' (శ్రీధర్‌, వెల్దండి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం. 2017. పుట59) అన్న విశ్లేషణ ఈ కవిత ఆవిష్కరించిన మానవ సంబంధాల లోతును చూపుతుంది.

తెలంగాణ నేలమీద వెలిసిన లక్ష చందమామలు
ఆడబిడ్డల కండ్లల్ల మొలిచిన కోటి స్వప్నాలు
ఎంగిలిపూల అమాస
పునాస ఆనందాలతో నిండిన గరిసెలు
ఆరుగాలం శ్రమకు దొరికిన ఆటవిడుపు
.......
బతుకమ్మ - ఒక సహజ అనుబంధాల ఊరేగింపు
బతుకమ్మ - తెలంగాణ నేల పూల కవాతు
.......
బాల్యపు స్వప్న సువాసనల పలవరింతలు
ఉల్లాసాల బాధల భావాల వాయినాలు
మత్తడి వడ్ల సంబురం ఆట - సామూహిక పాదాల ఉద్విగ్నలయ పాట
- కాసుల లింగారెడ్డి (మునుం, పుట 199)

బతుకమ్మ పండుగ వైభవాన్ని నేల మీది లక్ష చందమామలతో, కోటి ఇంద్రధనుస్సుల రంగులతో పోలుస్తూ.. తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుతున్నాడు కవి. తంగెడు పూవు, గునుగుపూవు, కట్లపూవు, బీరపూవు, గడ్డిపూవు, బంతి పూవు, రుద్రాక్ష.. ఇలా రంగురంగులుగా ఒదిగిపోయి ప్రకృతిలో ప్రకాశించే పూలశిఖరం బతుకమ్మ అంటూ.. గ్రామీణ వ్యవసాయ కుటుంబాల 'ఆరుగాలం శ్రమ'కు ఆటవిడుపుగా ఈ పండుగ సందర్భం నిలిచిన వైనాన్ని చాటుతాడు. అత్తవారింటి నుంచి వచ్చిన 'నిండు గౌరమ్మలు నా అక్కచెల్లెల్ల' సందడితో 'సహజ అనుబంధాల ఊరేగింపు'లా బతుకమ్మ సాగుతుందని, 'సద్దుల బతుకమ్మ సంబరాల వేళ ఆకాశంలో సగం కాదు నా తోబుట్టువులు సంపూర్ణాకాశాలు’ అని తెలంగాణలోని ప్రేమానుబంధాల సహజత్వాన్ని బతుకమ్మ నేపథ్యం నుంచి ఆవిష్కరిస్తారు కవి. 

అదే సమయంలో బతుకమ్మ ఒక సాంస్కృతిక ఉత్సవమే కాదు.. పోరాట వారసత్వమని, 'రజాకారు రాకాసి మూకల అకృత్యాల'పై తిరుగబడి..

'నిజాం నిరంకుశాన్ని సాయుధమై నిలువరించిన' చైతన్యమని కవి స్పష్టం చేస్తాడు. 'గడీల గోడలు కూల్చి/ భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ' (పైదే) ఒక పోరాట వారసత్వం, సమైక్య పాలనలో జరుగుతున్న 'సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద'' ప్రజలకు లభించిన 'ఒక సరికొత్త ఆయుధం' అని తెలంగాణ ప్రజల పోరాట అస్తిత్వాన్ని, పోరాట సంస్కృతిని బతకమ్మతో మేళవించి చాటుతాడు కవి.

3. గ్రామీణ సాంస్కృతిక చిత్రణ:

నిర్దిష్ట భౌగోళిక ప్రాదేశికతతోపాటు ఇతర తెలుగు అస్తిత్వాలకు భిన్నమైన సామాజిక, సాంస్కృతికాస్తిత్వాన్ని కలిగిన తెలంగాణ ప్రాంతం ఉద్యమ కవిత్వంలో సంపూర్ణంగా వ్యక్తమవుతూ వచ్చిందంటే అందుకు కారణం ఈ ప్రాంత స్థానీయ ముద్ర, భాషపరమైన సహజ ఔద్వేగమేనని చెప్పవచ్చు. ఇక్కడి ప్రాంతీయ జీవితంలో ఇమిడిపోయి.. అప్పటివరకు సాహిత్యంలోకి రాని అనేకానేక సాంస్కృతికాస్తిత్వాలను, వ్యక్తిత్వాలను, జీవనరీతులను తెలంగాణ కవిత్వం వ్యక్తీకరించింది.

ఊరు చుట్టూ పిల్లబాటలే
పికాసో చిత్రాల్లా
ఊరు పక్కనే
వాలిన నెలవంకలా చెరువు
అందులో పూసిన మల్లెమొగ్గలు కొంగలు
కొంచెము దూరాన జొన్నకర్రల చేన్లు
జనం జండాలు పట్టుకొని నిలబడినట్లు
మోటబావి నీళ్ళు
బొక్కెనలో ప్రాణం పోసుకొని
గలగల నవ్వేసి
పొలంతల్లి ఒడిలో నిద్రపోతాయి - టీ. కృష్ణమూర్తి యాదవ్‌ (జిగర్‌. పుట 147)

మొట్టమొదటగా తెలంగాణ భాషలో, తెలంగాణ నుడికారంలో కవిత్వం రాసిన అతికొద్దిమందిలో కృష్ణమూర్తి యాదవ్‌ ఒకరు. తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ కృష్ణమూర్తి యాదవ్‌తోపాటు దేవరాజు మహారాజు, పంచరెడ్డి లక్ష్మణ,  తెలిదేవర భానుమూర్తి, ఎన్‌.గోపి తదితరులు 1970 ప్రాంతంలోనే తెలంగాణ భాషలో కవిత్వం రాశారు. తెలంగాణ నుడికారంలో వస్తుగతంగా తెలంగాణ పల్లెను, అందులోని నిసర్గ సౌందర్యాన్ని, ఆ పల్లెవాసుల జీవన మాధుర్యాన్ని, సాంస్కృతిక నేపథ్యాన్ని చిత్రిస్తూ వీరు కవితలు రాశారు. పల్లె జీవితంపై వీరు రాసిన కవితలు.. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీకలుగా నిలబడ్డాయి. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ.. అందులోని జీవన వైవిధ్యాలను వినూత్నంగా చూపే కవి ప్రయత్నాన్ని ఈ కవితల్లో చూడొచ్చు. గడీలు, వెట్టిచారికి, పోరాటాలు, మోటబావులు, బొక్కెనతో చేదిన నీళ్లు.. ఇవన్నీ ఇప్పుడు కనుమరుగు అవుతున్నా.. ఒకప్పటి గ్రామీణ జీవన సంస్కృతిలో భాగమే. అంతేకాకుండా పల్లెవాసుల అమాయకత్వాన్ని, నిరాడంబరతను కూడా కవి తన కవితల్లో ఎంతో తాద్మాత్యంగా చిత్రించడం చూడొచ్చు.

సుక్కురారంగోలె ఏగిలివారంగ
సురువైతది హుస్నాబాద్‌ అంగడి
సుట్టుముట్టు ఇరువై ఊర్లపెట్టు
రాకడ పొకడకిరాంలేదు
పైసపుట్టేది మాయమయ్యేది
మందిగూడేది మర్మందెలిసేది గీన్నే
ఊరూరా చెక్కర్లుగొట్టే ఎర్రబస్సు
నెత్తిమీన మూటలతో కాన్పుకొచ్చే
ఆడిబిడ్డనాడు... - నాంపల్లి సుజాత (జిగర్‌. పుట 176)

గ్రామీణ జీవితంలోని సకల సాంస్కృతికాంశాలకు ప్రతిబింబిం ఈ కవిత. పల్లె వాసులంతా ఒక్కతాన గుమ్మిగూడి తమ సాంస్కృతిక, సామాజిక, దైనందిన జీవితానికి అవసరమయ్యే వస్తువులను కొనే అంగడి (సంత) నేపథ్యంలో పల్లె దృశ్యాన్ని సాంస్కృతికంగా, సజీవంగా చూపే ప్రయత్నం ఈ కవితలో కనిపిస్తుంది. గ్రామీణ జీవితంలో ఎన్ని వైవిధ్యమైన వస్తువులు అవసరమవుతాయో, ఆ నిత్యావసరాలలోనే సాంస్కృతిక అవసరాలు ఎలా మమేకమై ఉంటాయో ఈ కవితలో చూడొచ్చు. కీస్‌పిట్ట పిల్లనగొయ్యలు, లబ్బరిగాజులు, నితాను రిబ్బెన్లు, రంగురంగుల రైక గుడ్డలు రుమాల్లు, రోల్లూ రోకండ్లూ, చాట్లూ జల్లెన్లు, మర్తమాన్లు మారెసరు గుడ్లు.. పసుపు కుంకుమ బుక్కగుల్లాలు.. అంటూ తెలంగాణ పల్లెల సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలంగాణ భాషలో ఉన్నదున్నట్టు కవయిత్రి చిత్రించారు. తెలంగాణ భాషలో శక్తివంతంగా రాస్తున్న వారెక్కువగా పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కావడం, వారు తమ భాషలోని తెలంగాణ నుడికారాన్ని, పలుకుబళ్ళను సహజంగా కవిత్వంలోకి తీసుకురావడం వల్ల తెలంగాణ భాషా సంస్కృతుల స్పృహ ఉద్యమకవిత్వంలో మరింత విస్తరించిందని చెప్పవచ్చు. ఇలాంటి వచన కవితలే పల్లె సాంస్కృతిక నేపథ్యాన్ని, గ్రామీణ సామాజికాస్తిత్వాలను బలంగా చాటిచెప్పాయి. 

పండుగైనా, పబ్బమైనా, కష్టమైనా, సుఖమైనా
కులమత భేదం మరచి అందరొక్కటయ్యే వేళ
దసరా పండుగ నాడు పాలపిట్టను జూసి
జమ్మిసేతుల పెట్టి వంగి దండం బెట్టి
అలాయి బలాయి అందరమూ తీసుకొని
మంత్రనగర మాయెనే నా పల్లె!
మనసు సింగిడేసేనే... - కేతిరెడ్డి యాకూబ్‌రెడ్డి (జిగర్‌. పుట 97)

దసరా పండుగ తెలంగాణలో ఒక గొప్ప సాంస్కృతిక ప్రతీక. ఒక సామాజిక వేడుక.  పాలపిట్టను చూడటం, జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావించి పరస్పరం పంచుకోవడం, అలయ్‌బలయ్ తీసుకోవడం, ఆడబిడ్డలంతా కూడి బతుకమ్మ ఆడటం.. ఎంతో కోలాహలంగా జరుగుతుంది ఈ సంబూరం. తెలంగాణ సంస్కృతిలోనే తనదైన ప్రత్యేక విశిష్టతను సంతరించుకున్న ఈ పండుగలోని సంబూరాన్ని చాటుతూ.. కొత్త బట్టల్లో అందరూ ఒక్కతాన గూడి పండుగలై పరవశించే మహత్తర సందర్భాన్ని, మంత్రనగరమయ్యే పల్లె సంస్కృతిని, జీవనరీతిని కవి ఆవిష్కరించి పులకించడం చూడొచ్చు.

''తీరొక్క పూల బతుకమ్మయితది నా పల్లె/ఓరుగల్లు పోరు ఆకాశమయితే/అందులో మెరిసే ఎర్ర జాబిల్లి/ నా భట్టుపల్లి'' (- సొన్నాయిల కృష్ణవేణి. జిగర్‌. పుట 267)

అంటూ పండుగలను- పల్లెలను మమేకం చేసుకుంటూ.. పల్లె సాంస్కృతిక ప్రతీకలను గానం చేస్తూ విశిష్టమైన కవిత్వాన్ని కవులు పలికించారు.

పల్లె జీవితంలోని నిసర్గ సౌందర్యాన్నే కాదు.. తమ సమకాలంలో పల్లెల్లో జరుగుతున్న సామాజిక విధ్వంసాన్ని కూడా కవులు సమర్థంగా చిత్రించారు. తెలంగాణ అస్తిత్వ వేదనకు ప్రతిబింబంగా గ్రామీణ జీవన విధ్వంసాలను నిలబెట్టారు. గ్రామీణ స్మృతిలోని వైవిధ్యంతోపాటు ప్రపంచీకరణ నేపథ్యంలో సమైక్య పాలకుల వివక్షలో అది చిధ్రమవుతున్న తీరును కవులిలా అక్షరాలలో ఒడిసిపట్టారు.

ఏలిముద్ర ఎయ్యకుండానే
నా బతుకును వీలునామాగా రాయించుకున్నోడా!
నీ వాడిన జూదంలో నా ఊళ్ళకు ఊళ్ళే
బతుకమ్మలై తేలడం తల్చుకొని ఎర్రిగా నవ్వుకుంటున్న!
నమ్ముకున్న ఆలిని
రెక్కలు రాని గద్ద గాళ్ళనీ - నెత్తికెత్తుకొని
ఇయ్యాల బతుకు దెరువుకు ఏడ్నని దేవులాడను!
- ప్రాఫెసర్‌ ననుమాసస్వామి (పొక్కిలి. పుట 234)

సమైక్య పాలకుల జూదంలో తెలంగాణ ఊళ్లకు ఊళ్లూ బతుకమ్మలై తేలుతున్న దృశ్యాన్ని, ప్రాంతీయంగా తెలంగాణ అనుభవిస్తున్న వివక్షను సూటిగా చెప్తూ కవి వ్యక్తంచేసిన ఆవేదన ఇది. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న విధ్వంసం, పట్టణాలకు వలసపోతున్న దృశ్యానికి సంబంధించిన దృశ్యాలను ఇందులో చూడొచ్చు. నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్ట్‌ కింద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజల వేదనతో గొంతు కలిపి.. ఈ కవిత రాసినట్టు కవి చెప్పుకున్నారు. అప్పటి తెలంగాణ గ్రామాల దుస్థితికి సైతం ఈ కవితలోని పంక్తులు అద్దం పడుతున్న తీరును మనం గమనించవచ్చు. తెలంగాణలో సంబురాలకు, సంస్కృతికి ప్రతీక అయిన బతకమ్మ, ఇక్కడ తెలంగాణ పల్లె విధ్వంసానికి కూడా ప్రతీకగా కవి ప్రకటించిన తీరు.. అప్పటి వాస్తవ పరిస్థితులకు ఉదాహరణగా చెప్పవచ్చు.

4. నగర సాంస్కృతికచిత్రణ:

తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ తాత్వికతలో కేంద్రబిందువుగా నిలిచిన హైదరాబాద్‌ నగరంపై తెలంగాణ కవులు విశేషమైన అభిమానాన్ని చాటుకున్నారు.  ఘనమైన చారిత్రక వారసత్వం, భిన్న సంస్కృతుల సహజీవనం, గంగాజమునా తెహజీబ్‌తో నిత్యచైతన్య స్రవంతికి వేదిక అయిన ఈ నగరాన్ని కులమతాలకతీతంగా ప్రజలందరినీ అక్కున చేర్చుకునే తల్లిగా అభివర్ణించాడు కవి.

హైదరాబాద్ ఒక కవల పిల్లల కన్నతల్లి
పెద్దకొడుకు యాదగిరి రంజాన్ అంటాడు
చిన్నవాడు దస్తగిరి దసరా అంటాడు
ఆ తల్లికి మాత్రం ప్రతి రోజూ పండుగే
- అమ్మంగి వేణుగోపాల్ (జాగో.. జగావో. పుట 48)

తన ఒడిలో నివసించే ప్రజలు ఏ మతం వారైనా వారి వివక్ష చూపని తల్లి హైదరాబాద్‌ అని గుర్తుచేస్తూ...

''తానీషా కథలో అందరికీ రాముణ్ని చూపిస్తుంది/తుర్రేబాజ్ ఖాన్ కథలో తిరుగుబాటు చెప్తుంది/తాను మాత్రం మక్కా మసీదు పావురమై ఎగురుతుంది'' (పైదే)

అంటూ కవి ఈ నగర చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని, పోరాట వారసత్వాన్ని చాటిచెబుతున్నాడు.  హైదరాబాద్‌ మహానగరానికి పునాది అయిన వందల ఏళ్ల చారిత్రక స్మృతులను, అడుగడుగునా తారసపడే వైభవోపేత వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ..

'చిలుకల మేడ చార్మినారే లేకుంటే/ఇంతకాలం చందమామ దీపంలా వెలిగేదికాదు.. హైదరాబాదు లేకుంటే మల్లెపందిరిలా అల్లుకొన్న/ ఆకాశం కూడా వుండేది కాదు' (ఆశారాజు. జిగర్‌. పుట 53) అంటాడు మరో కవి. 

ఘనమైన గతచరిత్రకు సాక్ష్యాలుగా నేటికీ నిలిచి ఉన్న చార్మినార్‌, లాడ్‌ బజార్‌, గుల్జార్‌హౌజ్‌, మూసీ నది, సాలర్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నామా, గోలకొండ కోట, దేవిడిలు, ఇరానీ హోటళ్లు, నుమాయిష్‌.. ఇలా నిత్యజీవితంలో తారసపడే ఈ సాంస్కృతిక ప్రతీకల్ని ఎంతో అపురూపంగా తన కవిత్వంలోకి ఎత్తుకుంటాడు.

పల్లెటూళ్లను విడిచి ఉపాధి కోసం నగరానికి వచ్చేవారిని అక్కున చేర్చుకునే ఈ నగరాన్ని ''తోటి పిల్లలతో కొట్లాడి/తలదాచుకోడానికొస్తే రెక్కల్లో దాచుకున్న తల్లికోడి' (సత్యనారాయణ, ఎస్వీ. మునుం. పుట 136)

అంటూ తన బాల్యపు జ్ఞాపకాలలో భాగమైపోయిన ఈ నగరాన్ని నెమరువేసుకుంటాడు కవి. వీధి భాగోతంలో చిందులేసే చిన్ని కృష్ణుడైనా, పీర్ల పండుగనాడు దూల ఆడినా, బాల క్రీస్తు వేషం వేసినా, బోనాల పండుగలో కోయ నృత్యం చేసినా.. కులాలకు, మతాలకతీతంగా హైదరాబాద్‌ ఒక తల్లిలా అందరినీ ఆదరించిన వైనాన్ని చిత్రిస్తాడు.

''ఒక తెలంగాణ తల్లి భాగీరథి
ఒక తెలంగాణ ప్రేయసి భాగమతి
“తెలంగీ”ని హత్తుకున్న ప్రేమ ఫలానివి''
-సుంకిరెడ్డి నారాయణరెడ్డి (జిగర్‌. పుట 285)

ప్రేమకు చిహ్నంగా అకురించిన హైదరాబాద్‌ నగర చారిత్రక మూలాలను స్పృశిస్తూ. హైదరాబాద్‌ నిర్మాత కులీ కుతుబ్‌షాహిని కవి ఇలా తలుచుకుంటాడు. తెలంగాణ తల్లి భాగీరథి అని, తెలంగాణ ప్రేయసి భాగమతి అని, ఈ ఇద్దరి పేరు మీదగానే భాగ్యనగర్‌ నిర్మాణానికి పునాది వేసి.. 'తెలంగీ'ని హత్తుకున్న కులీ గొప్పతనాన్ని చాటిచెపుతాడు.

''కుమారగిరి సింగభూపాల/కృష్ణరాయల రాసిక్య/రచనా పల్లకీల మోతల్లో/నువ్వు లేవు గానీ/ తరాజు ముల్లు నీవైపే/తొలి ఉర్దూ రాజకవీ''

అంటూ సాహిత్య చరిత్ర రచనలో కులీని విస్మరించిన వైనాన్ని గుర్తుచేస్తాడు. స్వయంగా కవి అయిన కులీ ఉర్దూలో 'ఖుల్లీయత్‌' అనే కవితా సంపుటిని ప్రకటించి.. తొలి ఉర్దూ రాజకవిగా ఘనత వహించిన తీరును జ్ఞప్తికి తెస్తాడు.

ఇరానీ చాయ్‌ కమ్మదనపు రుచి
హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమల ధూమాలు
భూమి చుట్టూ సాంబ్రాణి పొగలై అలుముకుంటాయి - షాజహానా (జాగో.. జగావో. పుట 43) 

ఇలా తెలంగాణ అస్తిత్వానికి, ఔన్నత్యానికి ప్రధాన భూమికగా నిలిచిన హైదరాబాద్‌ నగరాన్ని హృదయానికి హత్తుకుంటూ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్‌ ఎవరిది అన్న చర్చను ధిక్కరించారు. ఈ నగర మూలవాసులుగా, ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న ప్రజల వారస్వత హక్కుగా ఈ నగరం తమకే చెందుతుందని గొప్ప అస్తిత్వ చైతన్యంతో తెలంగాణ కవులు చాటారు. ఈ నగరం మీద ఎనలేని ప్రేమనే కాదు.. దీనిపై తమ హక్కును కూడా గొప్ప ఆత్మగౌరవంతో ప్రకటించుకున్నారు.

''బాజాప్తుగ భాగ్యనగరం మాదే/గీ అవ్వల్‌ దర్జా హైద్రాబాద్‌/మా వీర తెలంగాణది/పోరు తెలంగాణది/మా వేరు తెలంగాణది'' (-జూపాక సుభద్ర. జాగో.. జగావో. పుట 64) అంటారు.

తెలంగాణ సంస్కృతిలో, జీవరరీతిలో అంతర్లీనమైన హైదరాబాద్ ఎవరిదీ అనే ప్రశ్న మలిదశ ఉద్యమంలో రావడమే ఇప్పుడు పెద్ద ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ అస్తిత్వాన్నే కాదు.. ఆ అస్తిత్వాన్ని మూలకేంద్రమైన హైదరాబాద్‌ నగరాన్ని కూడా గుండెలనిండా నింపుకొని.. తమ కవితాపతాకాలను ఎగరేశారు కవులు. తమ అస్తిత్వ వైభవంలో మణిహారమైన హైదరాబాద్‌ నగరాన్ని గొప్ప సాంస్కృతిక అభినివేశంతో కవిత్వంలో పలికించి.. ఈ నగర ఘనతలను మరోసారి పునర్జీవింపజేశారు.

5. ముగింపు:

  1. మలిదశ ఉద్యమకాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వం అనేక విధాలుగా తెలంగాణ అస్తిత్వపు చైతన్యాన్ని చాటిచెప్పింది. విశాలాంధ్ర పేరిట జరిగిన భౌగోళిక సమైక్యతలో భాగంగా ఏర్పాటైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు గురైంది. తెలంగాణ భాషా-సంస్కృతులు వివక్షకు, విస్మరణకు గురయ్యాయి. 
  2. చారిత్రకంగా, సాంస్కృతికంగా తనకు సంక్రమించిన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ ప్రాంతం క్రమంగా సమైక్య పాలనలో కోల్పోతూ వచ్చింది. దీనికితోడు ప్రపంచీకరణ ప్రభావం వల్ల తెలంగాణ గ్రామీణ రంగం, వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అస్తిత్వ అన్వేషణ ప్రారంభమై.. ప్రాంతీయ చైతన్యానికి దారితీసింది. 
  3. తెలంగాణ అస్తిత్వాన్ని స్వగర్వంగా ప్రకటించుకోవడం, సకల సాంస్కృతిక రంగాలలోనూ తెలంగాణ ప్రత్యేకతలను చాటిచెప్పుకోవడం జరిగింది. ప్రాంతీయంగా వివక్ష, విస్మరణలు ఎదురైన చోట తమదైన ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రాంతీయ విశిష్టతలను చాటిచెప్పారు. ఇలా తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటడంలో కవిత్వం తనదైన పాత్రను పోషించింది. 
  4. కేవలం ప్రాంతీయ ఆకాంక్షలు వ్యక్తంచేస్తూ రాజకీయ నినాదాలతో నిరసన కవిత్వంగానే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే కవిత్వంగా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ కవిత్వం విశిష్టతను కలిగింది. 
  5. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ కవిత్వంలో వ్యక్తమైన ఇలాంటి భిన్నపార్శ్వాలను విశ్లేషించడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక చైతన్యంలో కవిత్వం పోషించిన పాత్రను గ్రహించవచ్చని, అందుకు ఈ పరిశోధన వ్యాసం ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ.. ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గౌరీశంకర్, జూలూరు (సం). పొక్కిలి (తెలంగాణ కవిత్వం). 2002. స్పృహ సాహితీ సంస్థ. కోదాడ.
  2. నారాయణరెడ్డి, సుంకిరెడ్డి. సురేంద్ర రాజు, అంబటి (సం). మత్తడి (తెలంగాణ కయిత). 2002. తెలంగాణ సాంస్కృతిక వేదిక. హైదరాబాద్‌.
  3. మురళీకృష్ణ, వేముగంటి. కాంచనపల్లి మొ||వారు(సం). మునుం (తెలంగాణ కవితా పుష్కరం 2000-2011). 2012. తెలంగాణ సాహిత్య సమాఖ్య. హైదరాబాద్‌.
  4. రజిత, అనిశెట్టి (సం). జిగర్‌ (తెలంగాణ విశిష్ట కవితా సంకలనం). 2013. రుద్రమ ప్రచురణలు. వరంగల్‌.
  5. శ్రీధర్‌, వెల్దండి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం. 2017. తెలంగాణ సాహిత్య అకాడమీ. హైదరాబాద్‌.
  6. స్కైబాబా (సం). జాగో.. జాగావో (తెలంగాణ ఉద్యమ కవిత్వం). 2009, స్వీయ ముద్రణ. హైదరాబాద్‌.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]