AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. 'పి.వి. సునీల్ కుమార్' కథలు: సామాజికస్పృహ
డకర వెంకట రమణ
పరిశోధక విద్యార్థి,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం, తూర్పు గోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8886726408, Email: rvenkat431@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
నీలవేణి కథల సంపుటిలో పి.వి. సునీల్ కుమార్ మానవసంబంధాలు, స్త్రీ దృక్పథానికి సంబంధించిన కథలతోపాటు వ్యవస్థవిశ్లేషణ, దళితక్రైస్తవ జీవితాలు, అధివాస్తవికధోరణిలతో కూడిన కథలను పొందుపరిచారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకొని కథలుగా మలిచారు. సమాజంలో ఉన్న అసమానతలను వ్యంగ్యంగా చిత్రించారు. నీలవేణి కథలసంపుటిలో సామాజికస్పృహను సోదాహరణంగా విశ్లేషించండం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం. సునీల్ కుమార్ కథలు ఈ పరిశోధనకు ముఖ్యభూమిక. కథల విశ్లేషణలకు సహాయంగా కథాశిల్పం, కథనరంగం వంటి కొన్ని పుస్తకాలు తోడ్పడ్డాయి.
Keywords: సాహిత్యం, కథ, సమాజం,విశ్లేషణ, వ్యంగ్యం.
1. ఉపోద్ఘాతం:
పి.వి. సునీల్ కుమార్ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పుట్టారు. పెనుగొండలో పెరి. తణుకు, విశాఖపట్టణం, హైదరాబాదులో విద్యాభ్యాసం గడిచింది. తల్లి దయామణి. ఈయన రచనలు 50 కథలు, 3 నవలలు (1. ప్రారంభం, 2. సయ్యాట, 3. క్షుద్ర) ఆయన చేసిన సేవలకు గానూ ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారం 2016 లో, తానా పురస్కారం. (వాషింగ్టన్ డి.సి.) 2017లో, తెలుగు విశ్వవిద్యాలయప్రతిభాపురస్కారం 2018లో ఆయనకు వరించాయి.
2. సునీల్ కుమార్ రచనలు - సామాజికస్పృహ:
నీలవేణి కథలసంపుటిలో పి.వి. సునీల్ కుమార్ మానవసంబంధాలు, స్త్రీ దృక్పథానికి సంబంధించిన కథలతోపాటు వ్యవస్థవిశ్లేషణ, దళితక్రైస్తవ జీవితాలు, అధివాస్తవిక ధోరణిలతో కూడిన కథలను పొందుపరిచారు. మానవసంబంధితకథలు దెయ్యం, దెయ్యం-2, నాన్న హైదరాబాదొచ్చాడు, భయానందం, స్త్రీ దృక్పథంలో రాయబడిన కథలు. నీలవేణి, అందం వ్యవస్థ విశ్లేషణతో చెప్పబడిన కథలు - తోకదెయ్యం చెప్పిన దీనిపై కథ, చాయిస్ ఈజ్ యువర్స్, సబ్బునురగ, దళిత క్రైస్తవ జీవితానికి సంబందించిన కథలు థూ..., చీకటి, - మహామాయ, పరిశుద్ధ వివాహము 3వ ప్రకటన, దేవదాసు 2015, క్రైస్తవులు లేని చర్చి, అధివాస్తవికత, ది టెర్మినేటర్ ద్వైతములుగా ఈయన తన కథలను వర్గీకరించారు.
2.1 బలహీనమానవసంబంధాలు/ అనుబంధాలపై వ్యంగ్యాస్త్రాల కథలు:
ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. వీటిని ఐదు విభాగాలుగా చేస్తే, మొదటి విభాగంలోని కథలు మానవ సంబంధాలలోని డొల్ల తనాన్ని, అనుబంధాలలో వ్యాపించిన పగుళ్ళకు వ్యంగ, హాస్యాన్ని జోడించి మరి తెలిపారు సునీల్ కుమార్ . “నమ్ముకుంటే, వాడుకుంటే నమ్మకం ఏ రూపంలోనైనా లాభమే. దాని పేరు కావచ్చు దేవుడు ... లేదా... దెయ్యం"1 మనిషి బలహీనతని ఆసరాగా తీసుకుని పాపం, పుణ్యం అంటూ భయపెట్టి వీధికో స్వామిజీ (దొంగ స్వామీజీలు)పేటకో ఆశ్రమం నడుపుతూ శాంతులు, పూజలు, ప్రార్ధనలు అంటూ జనాల డబ్బును జలగల్లా లాగేసుకుంటున్న వైనాన్ని చూసినా రచయిత కు వచ్చిన చిలిపి ఆలోచన ఈ "దయ్యం". కథ ఎప్పుడు దేవుడి పేరిట మోసాలు చేస్తే ఎట్లా? దయ్యం ఏం తక్కువ తినిందని, సత్యానందం ఊర్లో జనాలను మంగ దయ్యం పేరుతో భయపెట్టి, 60వేలు చేసే ఇంటిని రెండు వేలకే కొట్టేసి” ఉంటాది... నమ్మితే దయ్యం వల్ల ఉపయోగం అనుకున్నాడు సంతోషంగా.
జీవితంలోని సమస్యలతో విసికిపోయి ఉన్న యువరాజు కు దయ్యం చంపుతానంటే పెద్దగా భయం వేయలేదు. అప్పులు, పేదరికం, భాద్యతలు, బ్రతుకుతెరువు ఇలా ఏదో ఒక సమస్య తో రోజు చచ్చిపోయేకంటే దయ్యం చేతిలో చావడం చాల తేలిక అనుకున్నాడు దయ్యం-2 కథలో. ఇద్దరు మనుషులు ఇపుడు "ఒకరితో ఒకరు కాకుండా టీవీలోని నీడల్లో కాలక్షేపం చేస్తున్నారు"2. అది కాకపోతే ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ లలో నీడలతో, టచ్ స్క్రీన్ మీద వేళ్ళు కదుపుతూ కాపురాలు చేస్తున్నారు తప్ప మనిషి మనిషితో మాట్లాడే సమయమే ఉండడంలేదు ఇపుడు. ఇలాంటి పరిస్థితులలో మనుషులతో మసలే కంటే దయ్యలతో సహజీవనమే వెయ్యి రేట్లు మేలు అంటూ ఇప్పటి కాపురాలకు చురకలు అంటిస్తారు రచయత. మరో మాట చెపుతూ ఆడవాళ్లు బతికున్నప్పుడు మీకు మనుషుల్లా కనపడరు... రోజు ఎలా చస్తున్నా ఎవరు పట్టించుకోరు... "మన దేశంలో అయితే ఆడాళ్ళు దేవతలై ఉండాలి.. పూజిస్తారు.లేదా దయ్యాలై ఉండాలి... భయపడతారు... మనుషులుగా ఉంటే చంపేస్తారు నానా రకాలుగా” 3 అంటారు. మొన్నటి “నిర్భయ”, నిన్నటి “దిశా” ఘటనలు ఇందుకు ప్రత్యక్ష తార్కాణాలు. స్త్రీల ఇక్కట్ల పట్ల ఎంతటి ఆవేదన చెందితే కానీ ఇటువంటి రచన చేయలేరు.
“నాన్న హైదరాబాద్ వచ్చాడు" కథలో సునీల్ కుమార్ తన చిన్ననాటి సంగతులను వివరిస్తూనే, భవిష్యత్ కథాచిత్రాన్ని కళ్ళకు కట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జూనియర్ హరికృష్ణ, ఇలియానా మనవరాలు జులియానా అంటూ, కాలం మారుతోంది కానీ తెలుగు సినిమాలు మాత్రం కాలాన్ని జయించినట్టు ఇంకా అక్కడే ఉండిపోయాయి అన్నారు. అంటే సినీ పరిశ్రమలో కొందరికి ప్రతిభ లేకపోయినా తరతరాలుగా సాగుతున్న వారసత్వాన్ని ఎండగట్టారు.
2.2 స్త్రీ దృక్పథంలో వచ్చిన కథలు:
“నీలవేణి” “అందం” కథలు ఈ కోవకు చెందుతాయి. ‘నీలవేణి’ కథలో మెస్ నడుపుతూ, ఆర్థికంగా తనకాళ్లమీద తాను నిలబడిన అందగత్తె నీలవేణిని ఓ పత్రికలో ఆడాళ్ళ పేజీ కోసం ఇంటర్వ్యూ చేయడానికి వెళతాడు రమణ అనే జర్నలిస్టు. అపుడు నీలవేణి తిన్నగా తన కథ చెప్పకుండా పూర్తిగా చెడిపోయి, రెండేళ్ల కంటే ఎక్కువ బ్రతకలేని సంపత్ తో మొదలుపెట్టి తన జీవితంలోకి తన ప్రమేయం లేకుండా వచ్చిన అతను వచ్చి తన జీవితాన్ని ఎలా చీకటిమయం చేసాడో, సంపత్ తో పాటూ నీలవేణి తండ్రి, అన్న కూడా తన ఒంటరి బ్రతుకుకు ఎలా కారణం అయినరో వివరించి చెప్తుంది. సమాజం, ఆర్థిక, సాంఘిక, కుటుంబ పరిస్థితులు ఓ స్త్రీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, ఒంటరి స్త్రీలు సమాజంలో నెగ్గుకు రావాలంటే ఎలాంటి తెగువ, ధైర్య, సాహసాలు చూపించాలో నీలవేణి పాత్ర ద్వారా తెలుపుతూ రచయిత తనదయిన శైలి లో హాస్యాన్ని పండించడంలో సఫలీకృతులు అయినారు.
“అందం” అంటే తెల్లని రంగు చర్మం, పొడవైన నల్లటి జుట్టు, ఆకర్షనీయమైన ముఖం కాదు, అంతకంటే గొప్పవైనా వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం. ఇవి బయటకు కనిపించేవి కాదు. మనిషి లోపల కూడా అందం ఉండాలంటే పువ్వుకి పుప్పొడి, సువాసన ఎలాంటివో మనిషికి చదువు, సాహిత్యం అలాంటివి. అవి లేకుండా కేవలం బాహ్యంగా కనిపించే అందం, అలంకరణలు ప్లాస్టిక్ పూలలాంటివి. చూడడానికి, డ్రాయింగ్ రూంలో పెట్టుకోవడానికి తప్ప, అనుభూతి చెందడానికి పనికిరావు అన్నారు రచయిత “అందం” కథలో.
2.3 వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపే కథలు:
సమాజంలోని వివిధ వ్యవస్థల్లోని లోటుపాట్లను, అవినీతిని చాప కింద నీరులా వ్యాపిస్తున్న సామాజిక పరిస్థితులను ఎటువంటి తొట్రుపాటూ లేకుండా విశ్లేషించారు రచయిత. సునీల్ కుమార్ స్వయంగా రక్షకవిభాగంలో ఉండడంతో "తోక దయ్యం చెప్పిన డిసిప్లి కథ”లో పోలీస్ వ్యవస్థలోని దిగజారుడుతన్నాని, అధికారుల మెప్పు కోసం వాళ్ళ చుట్టూ తోక ముడుచుకుని తిరిగే డిసిప్లి లాంటి వాళ్ళ గురించి కథలో ఎక్కడ రాజీ పడకుండా చేదు నిజాలను చెక్కర పూత వేసిన చేదు గుళికల్లా, వ్యంగ్యాన్ని రంగరించి మనకు అందించారు.
2.4 దళిత క్రైస్తవజీవితాలకు సంబంధించిన కథలు:
దళిత క్రైస్తవ జీవితాలలోని వెతలకు సంబందించినవి. "పరిశుద్ధ వివాహము: మూడవ ప్రకటన” కథలో క్రైస్తవులంతా సమానమే, కానీ వివాహ సంబంధాలను కలుపుకోవడానికి మాత్రం కులం గోత్రం చూసుకోవాలి అనే అబేద్నగో లాంటి గోముఖుల గురించి ప్రస్తావిస్తూ, "వివాహం అన్ని విషయాల్లోకి గొప్పది అని ప్రభువు చెప్పాడు. కానీ కులం దానికంటే గొప్పదని చెప్పే ప్రభువులు మన మధ్యనే ఉన్నారు" అంటూ వివాహాలలోకి కూడా చొచ్చుకు వచ్చిన కులవివక్షని తూర్పారబట్టారు.
ఎన్ని తరాలు మారిన మారని తమ బ్రతుకుల గురించి, మతం మారిన వాళ్ళ పేర్ల చివర తగిలించుకున్న కులం తోకని ఊపుకుంటూ, చర్చ్ లలోకి దూసుకువచ్చిన అగ్రకులాల పెత్తనాన్ని నిరసిస్తూ, ఎంతకాలమని మా బతుకులను మీ వెనకమలే తిప్పాలని విసుగెత్తిన దేవదాసు తిరగబడి పాస్టర్ గా అవతారం ఎత్తిన సత్యనారాయణమూర్తి మీద దాడికి దిగుతాడు “దేవదాసు 2015” కథలో.
చర్చ్ లలోకి దూరిన కులపెత్తనాలను, అగ్రకులాలు, దళితకులాలు, ఆస్తులు, అంతస్తులు అంటూ వివక్షతను విశృంఖలం చేసి మొత్తం మీద చర్చిలను క్రైస్తవులు లేని చర్చిగా మార్చారని కలత పడ్డారు రచయిత "క్రైస్తవులు లేని చర్చి” కథలో.
చీకటి ఫుట్ బాల్ గ్రౌండ్ నుంచి బెల్టుషాపుల మీదుగా మాలపల్లి, మాదిగ గూడేలమీదికి జారి, అక్కడనుంచి వాడకట్టు మీదకు, అక్కడ నుంచి నేరుగా మనుషుల మనసులలోకి ప్రసరించి, క్రీడాకారుడు నిజాయితి గల వ్యక్తి అయినా చంటి లాంటి వారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో విశ్లేషిస్తూ, "ప్రేమ ఉన్న చోట ఆర్థిక జ్ఞానం ఉండదు. ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది” అంటూ మనుషుల మధ్య స్నేహాన్ని, నమ్మకాల్ని, విలువల్ని, అసలు మొత్తానికే మనుషులను... అవినీతి చీకటి... మింగేస్తుంది అంటారు. రచయిత “చీకటి” కథలో.
'లోకం అంత మిధ్య'మాయ అంటూ బోధించే యాజులు వస్తువులు, నగలతో సహా మాయం చేసిన మహా మాయగాళ్లు ఎవరో చూడాలనిపించింది రాములుకు” అంటూ “మహామాయ” కథలో చమత్కరించిన తీరుకు నవ్వకుండా ఉండలేం మనం.
‘నీలివేణి’ కథలకే తలమానికం అయి, ఎప్పుడు చదివిన గుండె తరుక్కుపోయి కళ్ళు రెండు కన్నీటి చలమలు అయి హృదయాన్ని ఆవేదనలో ముంచెత్తే కథ “థూ”. ముఖ్యంగా ఈ కథ చుండూరు, కారంచేడులలో దళితుల మీద ఆధిపత్య కులాల వాళ్ళు జరిపిన దమన కాండ నేపథ్యంలో సాగుతుంది. అమ్మాయి, అబ్బాయి పరస్పరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డా కూడా, అగ్రకులపు ఆడపిల్లను ప్రేమించాడని, ఆ పిల్లతో మాట కలిపాడని రాజు అనే దళిత యువకుడిని కులం పేరుతో దూషిస్తే తిరగబడినందుకు, ఆ రోజు రాత్రి ఆధిపత్య కులాలవాళ్ళంతా ఒకటై దండెత్తి వచ్చి కత్తులు, కాటర్ల తో దళితుల ఇళ్ల మీద పడి వాళ్ళ గుడిసెలను తగలబెట్టి, దొరికిన వాళ్ళను దొరికినట్టు నరకడం, దళిత ఆడబిడ్డలను చరచడం లాంటి రాక్షస, ఉన్మాద కాండని సాగించి చివరకు రాజును అతి దారుణంగా చెంపేస్తారు. తరతరాలుగా ఆధిపత్య కులాలు, దళితులమీద సాగిస్తున్న పెత్తనాన్ని, బానిసలుగా మార్చి వాళ్ళ మీద పాల్పడుతున్న దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ, సమాజం అంతా కులం కంపుతో కుళ్ళిపోతోందని ఆవేదన చెందారు రచయిత. కథను నేరుగా చెప్పకుండా బసివి రెడ్డి పాత్ర చేత సమాజంలో ఉండే కుళ్ళునంతా కక్కించాడు. చాతుర్వర్ణ్యం మాయ స్పష్టం. ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి అంటూనే, అంతరాలు పాటిస్తూ, తరాలు మారిన మారని కుల విషపు వేళ్ళు వ్యక్తుల్లో, సమాజపు లోతుల్లోకి చొచ్చుకుని పోయి ఉన్నాయి తప్ప, సమానత్వం తరిదాపుల్లో కనపడడం లేదు. అంటూ ఆవేదన చెందుతారు. కన్న బిడ్డను పోగుట్టుకున్న కుంటి జోసెఫ్ న్యాయం కోసం పెద్ద కోర్టుకు వెళితే అక్కడ న్యాయం జరగక “ఇది దొంగ కేసు " అన్న జడ్జి మాటలకు కడుపు "నిన్నెప్పుడైనా ఎవుడైన తరిమాడ? నీ అమ్మ మానం మీద తన్నడా? పొలంలో మీ ఇంటి ఆడబిడ్డని చెయ్యట్టుకు లాక్కెళ్లాడా... అయి జరిగినపుడు ఎలా ఉంటదో నీకు తెలుసా అని అడుగుదామని నోరు తెరిచా... "నోట్లోనుంచి మాట రాలే... మాట బదులు ఉమ్మొచ్చింది... ఊశా అది ఆయన మొహం మీద పడిందయ్యా"4... థూ... అంటూ జోసెఫ్ పాత్ర చేత చెప్పించిన తీరుకు మనసున్న ఏ మనిషికైనా కన్నీళ్లు రాక మానవు. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా సమాజంలో కుల మత అంతరాలు ఇంకా మారలేదనడానికి సాక్షాలు నిన్న మొన్నటి మిర్యాలగూడ ప్రణయ్ ఉదంతం. కులం, పరువు అంటూ కన్న బిడ్డలను చంపుకునే కసాయి లోకంలోనే ఇంకా మనం ఉన్నాం అనే ఆవేదన కలుగుతుంది కథ చదువుతున్నంతసేపూ.
3. ముగింపు:
కథానిక చిన్నదే అయిన అదొక శక్తి వంతమైన ప్రక్రియ. జాతి జీవనాన్ని ఆలోచనలను అది ఎత్తి చూపితుంది. అభాగ్యుల గుండె లోగిళ్ళలో చప్పుళ్ళను వినిపింప జేస్తుంది. అనాథల ఆర్తిని తనివి తీర శ్రోత కోరుకొన్న విధంగా తెలియజేస్తుంది. నిమ్నజాతిజనుల బాధలను అల్పజనుల గోడును కులీనుల హహా కారలను ఎత్తి చూపుతుంది. కుటుంబంలో జీవితంలో అణువణువును రంగరించి చూపుతుంది. చెదిరిపోతున్న బెదిరిపోతున్న జీవితాలను ఆదుకోవనే తపనను కలిగిస్తుంది. నిండునూరేళ్ళ బతుకును మంచి చేసి చూపిస్తుంది. యువతలో చెడు బారుతున్న అవస్థను వక్రబుద్ధిను పి.వి. సునీల్ కుమార్ తన కథల్లో అనేక జీవిత సంఘటనలను సమూహారంగా ప్రతిబింబింప చేసారు.
4. పాదసూచికలు:
- నీలవేణి కథల సంపుటి. పుట. 33
- పైదే. పుట. 43
- పైదే. పుట. 42
- పైదే. పుట. 127
5. ఉపయుక్తగ్రంథసూచి:
- తిరుమలరావు, జయధీర్. స్త్రీవాదకథలు.
- దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక-స్వరూపస్వభావాలు. పి. వరలక్ష్మి. హైదరాబాద్.
- రాంబాబు, వేదగిరి. (సంకలనం), (1996). కథనరంగం. హైదరాబాదు, శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్.
- రామలింగం, డి. తెలుగు కథ. (1910 - 2000). విశాలాంధ్రపబ్లికేషన్ హౌస్, హైదరాబాదు.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. (2016). కథాశిల్పం. విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
- సునీల్ కుమార్, పి.వి. (2016). నీలవేణి కథలసంపుటి. నవచేతనపబ్లిసింగ్ హౌస్, హైదరాబాదు.
- సుబ్రహ్మణ్యశర్మ, పురాణం. పాండురంగారావు, వాకాటి. కథాభారతి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.