headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. ఆంధ్రమహాభారతం శాంతియుత పర్వాలు: ధర్మోపదేశం

బుక్కే ధనక నాయక్

పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జున నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

రామాయణ మహాభారతాలను ఇతిహాసములు అని అంటారు ఇది అందరికీ తెలిసినదే. అయితే ఇవి కథగా మాత్రమే ప్రస్తుత సమాజానికి తెలుసు. మహాభారతంలోని ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు పాత్రల చిత్రీకరణ నన్నయ, తిక్కన, ఎర్రన కమనీయంగా రూపొందించారు అనడానికి అతిశయోక్తి ఏమాత్రం లేదు. ధర్మం, మోసం, కుట్ర, భార్యాభర్తల మధ్య అనుబంధం, కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ ఆంతర్యాలు, సమాజంలో స్పృహలేమి తనం, వెన్నుపోటు, యుద్ధంలో నయవంచన, ఎత్తుకు పైఎత్తులు ఎన్నో రకాల సంఘటనలతో సంఘర్షణలతో మహాభారత చిత్రీకరణ మహోన్నతంగా సాగింది. వేదవ్యాసుడి చేత సంస్కృతంలో లిఖించబడిన మహాభారతం తెలుగులో నన్నయ్య చేత ప్రారంభమైంది. ఈ ఆంధ్ర మహాభారతాన్ని ప్రస్తుత సమాజంలోని కథలుగా మాత్రమే తెలిసిన పాఠకులకి ఇదొక సాంఘిక స్పృహగా అందులోను శాంతియుతంగా నడిచే శాంతియుత పర్వాల కమనీయతని మరియు ధర్మోపదేశం గురించి మరో కొత్త కోణంతో తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాసంలో శ్రీకృష్ణుడి ధర్మాంతర్యార్థం, ధర్మరాజు యొక్క దయా గుణ శ్రీలతను ఇప్పటి తరంవారు అనుసరించడం వలన ఉన్నత విలువలను సమకూర్చుకొనెదరు అని నమ్ముతున్నాను.

Keywords: అశ్వమేధం, కమనీయత, ధర్మం, కర్మం, ఆచరణ, ప్రమోదము

1. ఉపోద్ఘాతం:

ప్రపంచ సాహిత్యంలోనే మహాభారతం చాలా విశిష్టమైనది. మన రామాయణ భారతాల ప్రాశస్త్యం గురించి పాశ్చాత్య పండితులే అంగీకరించి అభినందించారు. వాల్మీకి రామాయణం ఉన్నత ఆదర్శాలకు ఊపిరి పోసింది. వ్యాసభారతం ఉత్తమాచరణకు జీవం పోసింది. రామాయణ భారతాలు మానవ సాహిత్య సంపదలు ఆంధ్ర సాహిత్యంలో కవిత్రయ భారతం కనువెలుగుల గని,  సత్య సుగందాల ఆమని మహాకవి తిక్కన ఉభయ కవిమిత్రుడే కాదు ఉభయ కావ్య ప్రౌఢీ పాటించు శిల్పమున పారగుడు. అందువల్లనే తిక్కన భారతం దృశ్య కావ్యానుభూతినిచ్చి రసజ్ఞులను రంజింప చేస్తుంది. పదునెనిమిది పర్వాల మహాభారతంలో 12వది శాంతిపర్వం. తర్వాత అనుశాసనిక, అశ్వమేధ పర్వాలు కేవలం 12వ పర్వానికి మాత్రమే శాంతియుత పర్వం అని పేరు ఉన్నప్పటికీ శాంతి అనునాశనిక అశ్వమేధ పర్వాల మూడింటికి శాంతిత్రయం అని పేరు. వీటికి శాంతిత్రయం అని వ్యవహారం కూడా ఉంది. ఇప్పుడు ఈ మూడు పర్వాల కమనీయతను చర్చించి, విశ్లేషించబోతున్నాం.

మహాభారత సంగ్రామం భీష్మ పర్వంతో ఆరంభమై సౌప్తికపర్వంతో అంతమవుతుంది. కౌరవ మహిళల గాడశోకంతో స్త్రీ పర్వం సమాప్తం అవుతుంది. యుద్ధంలో విజయం సిద్ధించినప్పటికీ ధర్మరాజు శోకం వృద్ధి అయిందే కానీ ఉపశమింపలేదు. మహాభారత సంగ్రామ విజేత అయిన ధర్మరాజుని శోకనివృత్తికై శాంతి త్రయం కావలసి వచ్చింది.  ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవ కౌరవ సేన వాహిని అష్టాదశ అక్షౌహిణులు మోహరించాయి.  కదన ఘంటికలు మ్రోగక మునుపే భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధించాడు.  బంధు సంహారం చేయడానికి ఉత్సాహించక అస్త్ర సన్యాసం చేసి, ధర్మాచరణకు దూరమైన ఫల్గునినిచే ధర్మ నిర్వహణ చేయిస్తుంది భగవద్గీత.  నిర్వేదం చెంది, శోకసంతప్త హృదయుడై, రాజ్యపాలన ధర్మాచరణకు విముకుడైన ధర్మరాజుకి శాంతి పర్వంలో శాంతనవుడు ధర్మగీత ఉపదేశిస్తాడు. విషాద భారంతో  పాప భయంతో పాలన బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సాహింపక సన్యాసం స్వీకరిస్తానన్న ధర్మరాజుచే రాజ్యపాలన ధర్మ నిర్వహణ చేయిస్తుంది ధర్మగీత.


2   శాంతీయుత  పర్వాలు ఆంతర్యార్ధం:

2.1 ధర్మాచరణ వైశిష్ఠ్యము:

ధర్మం అంటే కర్మమే. ధర్మాచరణ అంటే కర్మాచరణమే. భగవద్గీత గాని శాంత నవగీత గాని అందించిన సందేశం ధర్మాచరణమే. వ్యామోహం లేకుండాతన పని తాను నిర్వహించడమే ధర్మాచరణ! అసలు మహాభారత సందేశ సారమే ధర్మాచరణ!“కృష్ణద్వైపాయనుడర్థిలోకహితనిష్ఠన్ బూని కావించె ధర్మాద్వైతస్థితి భారతాఖ్యమగులేఖ్యంబైన ఆమ్నాయమున్” (విరాట-1-3) అని స్పష్టం చేసిన కవి బ్రహ్మ మహాకవిత్వదీక్షావిధి విస్మరించకుండా ధర్మచింతన, ధర్మాచరణ ఎంత పటిష్టమో విదితం చేశారు.

“సారపు ధర్మమున్‌ విమల సత్యము పాపము చేత బొంకుచే
పారము బొందలేక చెడబారినదైనయవస్థ దక్షులె
వ్వారలు పేక్ష చేసినది వారల చేటకగుగాని ధర్మని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్” (ఉద్యోగ-3-27)

ఇతిహాసం అయినా మహాభారత కావ్యం ఒక ధర్మ శాస్త్రం.” ధర్మ తత్వజ్ఞలు ధర్మశాస్త్రం బని” కొనియాడుతున్నారన్న నన్నయ ప్రశంస మనకు తెలిసినదే. అసలు ఈ విశ్వమునకు మూలమే ధర్మమని భారతీయుల ప్రగాఢ విశ్వాసం.

ధర్మమూలం జగత్ సర్వం ధర్మశ్చ శృతి మూలకః/ భారతం పంచమో వేదః శృతి సర్వస్వ విస్తరః” (శాంతి-2-27) అని మన నమ్మకం. ఉగ్రశ్రవుడు (సూతుడు) శౌనకాదిమునులకు మహాభారత కథ వినిపించి ముక్తాయింపుగా పలికిన మాటలు సర్వదా గుర్తుంచుకోవలసిన వాస్తవం.

యది హాస్తి తదన్యత్రా, యన్నేహాస్తి న తత్ క్వచిత్“ (శాంతి,3-11) మొదటి ఆశ్వా-  అంటే, ఇందులో (భారతంలో) ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని సూతుడు చెప్పిన పలుకులు ప్రత్యక్షర సత్యాలని భారతం చదివిన వారు గుర్తిస్తారు.

విశ్వ సాహిత్యంలో కర్మాచరణకు సంబంధించిన మూడు దశల్లో వేదనతో మదనపడిన వారు ముగ్గురు కనిపిస్తారు. ఆంగ్ల సాహిత్యంలో హెమ్లెట్ కర్మ పూర్వవేదన, మన అర్జునుడు కర్మ క్షేత్రంలో బాధ, సోవియట్ రష్యా సాహిత్యంలో రాస్కల్ని కోడ్ కర్మానంతరం శోకం అనుభవించి, మన అనుభవానికి తెచ్చారు. ప్రస్తుతం ధర్మరాజు కూడా కర్మానంతర శోక మదనంలో మగ్నమయ్యాడు. పాలసముద్రం మదనంతో హాలాహలమూ, అమృతమూ ప్రాప్తించాయి. కర్మాచరణకు సంబంధించిన హృదయ సాగర మదనంతో  శోకగరాలము కర్తవ్య శాంతిసుధ అనుభవానికి వస్తాయి.

2.2 ఉపదేశప్రాధాన్యత:

కర్మానంతర శోకభారంతో మథన పడుతున్న ధర్మరాజును  కర్తవ్యసారధిని చేయుటానికి సాధారణ ఉపశమన వాక్యాలు చాలవు. అందుకు ఉపదేశమే ఉపకరిస్తుంది. కర్మ పూర్వం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పార్ధునికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించవచ్చు కదా! వ్యాసుని వంటి ప్రాచీన భారతీయ కవులు పాత్ర ఔచిత్యానికి భంగం కలిగించరు . శ్రీకృష్ణుడు మహిమాన్వితుడే అయినా ధర్మరాజు కంటే వయసులో చిన్నవాడు. పిన్న వారిచే పెద్దలకు ధర్మోపదేశం చేయించడం సముచితం కాదు. అందుకే కృష్ణుడే కురువృద్ధుడైన భీష్మునిచే బోధింప చేశాడు. శరత్పగతుడైన శాంత నవుని ఉపదేశం వల్ల ధర్మజుని శోకం ఉపశమించినట్లే కనిపించి మళ్లీ ముందుకు వచ్చి బాధిస్తుంది. వేదన తగ్గి రాజ్యాభిషిక్తుడైన వెనుకకు ధర్మ సంశయాలవేదన! సన్యసించాలన్న నిర్ణయానికి వచ్చిన యుధిష్ఠిరునికి మళ్లీ ఉపదేశం అవసరమైంది. శాంతించిన ధర్మరాజుకి పాపభయం పట్టిపీడిస్తుంది, మళ్లీ బోధన కావలసి వచ్చింది. ఈ విధంగా మూడు దశల్లో ధర్మజుని వేదన తొలగించి, అతనిని కర్తవ్యసారధిని చేయడానికి రాజ ధర్మాలు, లౌకికమైన ఆపద్దర్మాలు, పార లౌకికమైన మోక్ష ధర్మాలు వివరించవలసి వచ్చింది. ఇన్ని గంభీర ధర్మ రహస్యాలకు కానాచి అయిన శాంతి త్రయంను భారతీయ తాత్విక, నైతిక, ధార్మిక విజ్ఞాన కోశం అని చెప్పవచ్చు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు ధర్మరాజు కంటే పిన్న వయస్కుడు కావున ధర్మంరాజుకి ఉపదేశం భీష్ముడి చేత చెప్పించాడు. దీని ద్వారా పెద్దరికం విలువ మరియు ధార్మికత స్వచ్ఛంగా కనబడుతుంది.

2.3 ధర్మరాజు హృదయ వేదన:

యుద్ధంలో మరణించిన ఆత్మీయులు అందరికీ ఉదక కర్మములు నిర్వర్తించడానికై ధర్మరాజు సోదర బంధు సమేతంగా గంగా తీరంలో సుమారు ఒక నెల రోజులపాటు విడిది చేయవలసి వచ్చింది. అక్కడికి పలువురు మహర్షులు వచ్చి ధర్మరాజును పరామర్శిస్తారు. ఇంతలో నారదుడు వచ్చి ధర్మరాజుతో మాటలు కలుపుతాడు శ్రీకృష్ణుని అనుగ్రహం, భీమార్జునుల పరాక్రమం తోడు ఉండగా మహాకురు సామ్రాజ్యం దక్కించుకున్న తర్వాత నీ “చిత్తము ప్రీతి బొందెనే?”(శాంతి-1-4) అంటాడు. అప్పుడు బహిర్గతం అవుతుంది ధర్మజుని ఆత్మక్షోభ “అతి ఘోరమగు నఖిల జ్ఞాతివధ మొనరించుట వలన, నధిక గునుని సౌభద్రుని, కుల భూషణంబు పాంచాలి తనూజ పంచకము కోలుపోకాజేసియు గెల్పు గెల్పుగ మదీయ బుద్ధి గైకొనదు” (శాంతి.1-6) అంటాడు. అలా వెలువడిన ధర్మజుని హృదయ వేదన అధికమైంది. చివరికి అర్జునునితో ధర్మరాజు చెప్పిన మాటలు ఆతని వేదన సాంద్రతను వ్యక్తం చేస్తాయి.

జ్ఞాతుల నందర జంపితి , మది యాత్మవధను కాదే? రాజవర్తనంబు
గాల్పు,మహింస నిక్కము తాల్మి మత్సరవర్జన మిది వనవాస జనుల
కాగమవిహితంబులటే?ఇంతయొప్పునే?వనమునవసియింపవలయు వింటే,
అసుఖదంబైన రాజ్యామిషంబునకు కుక్కలభంగి తమలోన కాటులాడి
కులము నెల్లను పొలియింప కుత్సితంపు
బ్రదుకు వచ్చెనే అను వగపాలు పడగ
ప్రమదమొసగదు త్రైలోక్య రాజ్యమైన
కాన నేనొల్ల మహి, మీరెకైకొనుండు   (శాంతి.1-45)

ఈ మాటలవల్ల రాజ్యాధికారకాంక్ష వదలిన ధర్మజుని హృదయవేదన వ్యక్తమవుతున్నది. తర్వాత అర్జునుని నుండి సోదరులు, భార్య అందరూ ధర్మరాజును ఊరడించే ప్రయత్నంచేశారు. జ్ఞాతినాశనమునగాదే సకల దేవతల ప్రవర్దన మొందుట….(ఆశ్రమ-1-54) అని విజయుడు ”ఫలముల యెడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్యకర్మము నడపన్ వలయును” అని భీముడు, పరుల వధింపక ఎవ్వడు ధర ఏలెన్ చెపుమ? రక్ష ప్రజ కోరు నిజయోగ క్షేమార్దముగ, జనసుఖస్థితి నడపన్ దక్షుడగు రాజునడపక -ఉపేక్షించిన పాపమొందదే?” (ఆశ్రమ-1-82) అని నకులుడు, అరణ్యములకు అరిగి నీవందు వలయు ద్రవ్యముల మీద చేయవలదే మమత్వంబు…. అదియు సంసార చక్రవాహకము కాదే?(శాంతి1-85) అని సహదేవుడు, ”దండార్హులైన వారాల దండింపకయున్న జువ్వే ధాత్రీ విభుని ఆఖండల సన్నిభునైన ప్రచండపు కిల్భిషము పొందును” (అశ్వమేధ-1-96) అని ద్రౌపది పలికిన విషయాలు ఆలోచింపదగినవి. ఒక మానవుడుగా, విశేషించి రాజుగా ధర్మజుని కర్తవ్యాన్ని సూచిస్తూ, అతని శోకం తగ్గించడానికి వారు పలికిన ఉపశమన వాక్యాలు ధర్మజుని వేదనను తగ్గించలేకపోయాయి. దేవస్థానుడనే ఋషి హితోపదేశం చేశాడు, శ్రీకృష్ణుడు షోడశరాజుల  చరిత్ర చెప్పి ప్రోత్సహిస్తాడు. వ్యాసుడే వచ్చి  “దురమున కైదువుగొని తను బొరిగొననే తెంచునట్టి పురుషుని వేదాంత రహస్యవేది నయినను పోరిగొనినను కిల్భిషంబు పొందదు” (శాంతి-1-295) అని వివరించినా ధర్మజుని శోకం నివృత్తి చెందలేదు. అయినా వ్యాసమహర్షి విరమించక ప్రాయశ్చిత్త విశేషాలు, ధర్మాధర్మంబులు సుదీర్ఘంగా చెప్పి ఒప్పించిన తర్వాత ధర్మజుని “చిత్తంబు కలంకదేరి” నది, “రాజ్యబార నిర్వహణోత్సవం”  అంకురించింది.  అందరితో కలిసి హస్తినాపురం చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుని సారధ్యంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు. తాత్కాలికమైన ఆనందంతో శ్రీకృష్ణుని కనుగొని “అమల భవదీయ సుప్రసాదమున జేసి పితృపితా మహాక్రమ యోగ్యపీఠమైన వినుత సామ్రాజ్యమున కేను విబుడనై కృతార్తానంద పూర్ణిండనైతి కృష్ణ!” (అశ్వమేధ-1-386) అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కానీ, భౌతిక సుఖం మాత్రమే ఇచ్చే రాజ్యపీఠం ధర్మజుని మనః పీఠంలో తిష్ట వేసిన దుఃఖతిమిరాన్ని దూరం చేయలేకపోయింది.  మనసుపెట్టి ప్రభు పదవి సౌఖ్యం అనుభవించలేని ధర్మజుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఉన్నట్లుండి ధృతరాష్ట్రునికి, విదురునికి రాజ్యం అప్పగించి, తాను వారి ప్రతినిధిగా మాత్రమే రాచకార్యాలు నిర్వహించడానికి పూనుకున్నాడు.

సమకాలికుడైన ధర్మరాజుకు ఉపదేశించిన రాజధర్మాల వంటివి భవిష్యత్ తరాల ప్రభువులకు కూడా ఉపకరించాలి.  అటువంటి ధర్మసందేశం ఇవ్వటమే మహాకవుల కర్తవ్యం. అందుకే భారతకర్త వ్యాస మహర్షి ధర్మాజునిచ్చే విపరీత ప్రవర్తనాల సన్నివేశాలు కల్పించి, ధర్మజుని ద్వారా మనకు విలువైన విషయాలు అందించారు, భీష్ముని ద్వారా చెప్పించారు. శరతల్పగతుడైన భీష్ముని ఉపదేశం ధర్మజుని వేదనను కొంతవరకైనా ఉపశమింప చేస్తుంది.  ఇక్కడ కూడా కవి ఉపదేశం పూర్తిగా ఉపన్యాసం వలె ఇప్పించలేదు. ప్రశ్నోత్తరాల సంభాషణల రీతిలో ఈ ఉపదేశం సాగుతుంది, ధర్మజునికివలె పాఠకులకుసైతం ఉత్సుకత పెరిగి ధర్మసారాంశం హృదయానికి చేరుతుంది. “చెప్పవే మున్ను రాజ ధర్మముల తెరంగు!”  అని ధర్మజునిచే అడిగించి రాజ ధర్మాలు బోధిస్తాడు. రాచరిక వ్యవస్థలేని వర్తమాన యుగంలో పాలకులు ఆచరించవలసిన ధర్మములే అవి, వాటికి కాలదోషం పట్టదు. చూడండి. “రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజకు నాత్మ, కాన రాజున్ ప్రజయున్ రాజోత్తమ! అన్యోన్య విరాజితులై ఉండవలయు రక్షార్చనలన్” 

(ఆశ్రమ-2-274) ప్రజలను పాలకులు, తమ ఆత్మలుగా, శరీరాలుగా భావించినప్పుడు ప్రజలకు అగచాట్లు దాపురించవు. ఆనాడైనా, ఈనాడైనా! ఈ ఒక్క ధర్మము రాజ ధర్మానికి ఆయువు పట్టు. అపారమైన అపాయ సంకటముల నుండి ప్రజలను సంరక్షించి ఆదుకునే వాడే ప్రభువు. వర్షింపని మేఘంలా ప్రజారక్షణం చేయని పాలకుడు నిరర్థకుడు అని శాంతి పర్వం ఎలుగెత్తి చాటింది. రాజరిక వ్యవస్థ రద్దై, ప్రజా ప్రతినిధులుగా రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తున్న ఈనాటి పాలకులకు కూడా ఈ ధర్మం వేగుచుక్క కావాలి. ఈ పాలక ధర్మం సార్వకాలిక సత్యం! శాంతి పర్వం మనకు అందించిన పులుగడిగిన ముత్యం!

అర్థసిద్ధి కంటే…. ధర్మసిద్ధి ఎక్కువ…” అని ప్రతిపాదిస్తూనే….”ధర్మం అధర్మంలా అధర్మం ధర్మంలా…”  (శాంతి2-408) భ్రమింపజేసే ప్రమాదం ఉంటుందనీ,' నిర్మలమతి’తో ధర్మాన్ని గుర్తించి ప్రవర్తించాలని హెచ్చరిస్తుంది శాంతిపర్వం. ధర్మశీలుడైన ప్రభువు సమయోచిత జ్ఞానంతో ఆపద్దర్మంగా లోకధర్మాలను గుర్తించి రక్షించాలని కూడా వివరిస్తున్నది. ఐహికమైన భద్రతతో పాటు పారలౌకిక భద్రత కూడా కలిగించగల మిత్రులను సంపాదించుకోవాలని సూచిస్తున్నది అటువంటి మైత్రిని పోలిన ధర్మం లోకంలో మరొకటి లేదని, అది మనిషిని వివేకవంతుని చేస్తుందని  బోధిస్తున్నది. రాజుకైనా, భటునికైనా, బలవంతునికైనా, బలహీనునికైనా, జ్ఞానికైనా, మూడునికైనా, సంపన్నునికైనా, ఆపన్నునికైనా తల్లి అనే సంపద సౌఖ్యకరమని, తల్లి ప్రాముఖ్యత విస్మరించరాదని పరమోత్కృష్టమైన లోకధర్మాన్ని ధర్మజుని ముందు పరచి ప్రదర్శిస్తుంది శాంతిపర్వం! ఈ విధంగా శాంతి పర్వంలో భీష్మ బోధ ద్వారా ధర్మజుని హృదయ వేదన చాలావరకు శాంతించే పరిస్థితికి చేరింది. భీష్ముని ఉపదేశానుసారంగా చివరికి “ఒరులేయవి యొనరించిన, నరవర! అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్లన్” (ఆశ్రమ-5-220) అన్న పరమ ధర్మ రహస్యం ధర్మజునికి అందుతుంది. తాను బాధపడేటట్లు ఇతరులు చేసే పనుల వంటివి తాను మరెవరి పట్ల చేయకుండటమే పరమ ధర్మమనే  విషయం ధర్మజుని హృదయాన్ని తాకుతుంది. నేటి మానవులు కూడా ఈ ధర్మ సూక్ష్మము గ్రహించి నడుచుకుంటే సామాజిక శోకజ్వాలలు, రగలవు.  ముక్తి అన్నది ఇటువంటి ధర్మపరాయణులకే లభిస్తుందని కొంతకు కొంత శోక నిగ్రహం చేసికొనగల స్థితికి చేరుకుంటాడు. భీష్ముని హితవు ధర్మజుని కర్తవ్యనిష్టకు పురిగొల్పుతున్నది. శోకం ఉపశమంచిన ధర్మజునికి ధర్మసంశయాలు చిగురించాయి.  ధర్మరాజుని సంశయాలకు జవాబుగా సమస్త మానవాళి అనుసరించవలసిన లౌకిక ధర్మ వివరణమే అనుశాసనిక పర్వం! మానవ ధర్మలక్ష్యాన్ని అనుశాసిస్తున్న విషయం వివరణమే అనుశాసనిక పర్వం!

2.4 శీలం అంటే గుణం:

వ్యక్తి సంఘజీవి. వ్యక్తి ధర్మాలు సక్రమంగా ఉన్నప్పుడే సాంఘిక జీవితం ధర్మబద్ధమై శాంతి సంశోభితం అవుతుంది. వ్యక్తినిష్టమైన గృహస్థ ధర్మాలు, సమిష్టినిష్టమైన సాంఘిక ధర్మాలు, వివాహ ధర్మాలు, అతిధి మర్యాదలు, పితృభాతృ ధర్మాలు, దానధర్మాలు వంటి లౌకిక ధర్మ సమాహారం ధర్మజుని రాజధర్మోన్ముకుని చేయడానికి ఉపకరిస్తున్నది. వ్యక్తిగా మమకార అహంకారములకు లోకువ అయినా మనసు జీవన వికారానికి కారణం అవుతుంది.  కాబట్టి ప్రభువైన ఒక వ్యక్తిగా నిశ్చల నిష్కలంక దృష్టితో సమతా ధర్మం కలిగి ఉండాలి.  అటువంటి శీలమే ముఖ్యం. “సత్ కులంబున పుట్టుట, సకల వేదములు పురాణంబులును శాస్త్రములను చదువుట…. సద్గతికి సాధనాలు కావు…శీల సామాగ్రిలేని దుశ్చేష్టితునకు”(ఆశ్రమ-2-41) అని శీల ప్రాధాన్యత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. తల్లి, తండ్రి గురువు, దైవం అని ప్రాధాన్యక్రమం భారతీయ శీలసంస్కృతికి వెన్నుపూస. ఈ సత్యాన్ని లెక్కకట్టి అనుశాసిస్తుంది ఈ పర్వం.  “జనకుండదికుడుపాధ్యాయునకు పడిమడుంగు లెక్కుడు…జనకునకు దశ గుణంబులు జనని గురుత్వమునన్…(అశ్వమేధ4-139).  జననీ జనకులు తనువుకే కారణం, మానసిక విజ్ఞాన వివేకాల ఎదుగుదలకు ఆచార్యుడే ఆధారం. కావున “గౌరవమున ఆచార్యుండు సర్వాదికుండు” అని బోధిస్తున్నది.

2.5 దానగుణ విశిష్టత:

గోదానం, భూదానం, సువర్ణ దానం, అన్నదానం అంటూ అనేక దానాల గురించి, వాటి ఫలితాల గురించి చాలా కావ్యాలు ఘోషిస్తున్నాయి. “పానీయ దానం ఉత్తమ దానం” అని (అశ్వమేధ-2-383) కాబట్టి  చెరువులు, నూతులు, బావులు, కొలనులను” తవ్వించి ప్రజలకు మేలు చేస్తే” అవి కడుపావనములుగా పుణ్యలోక భాగ్యాలు సమకూరుస్తాయని  ఉపదేశించటం అనుశాసనిక పర్వంలో విశిష్టత! క్షత్రియుడు రణధర్మంగా శత్రుహింస చేయటం అనివార్యం అని చెప్పి, ధర్మజుని శోక శాంతి చేస్తున్న ఈ పర్వంలో అహింస ప్రాధాన్యం గురించిన సూచన ఉంది. తిండి కోసం జంతువులను చంపటం హింస అని వ్యాఖ్యానిస్తుంది. 'మాంసభక్షణం' 'కోసము చంపుటయును, చంప పనుచుటయును’……కల్మషాలలో కెల్లా పెద్ద కల్మషమని ఉపదేశిస్తుంది.  వెడల్పైన ఏనుగు పాదముద్రలో తక్కిన జంతువుల పాదముద్రలన్నీ ఇమిడి ఉన్నట్లే అహింసా ధర్మంలో తక్కిన ధర్మకోటులు ఇమిడి ఉంటాయని బోధిస్తున్నది. ”దుఃఖ భాజనము ధనం” అని చెప్పి, ధనార్జనకైనా దారుణ కార్యాలు చేయరాదని ధర్మాజునికి చెప్పినట్లుగా లోకానికి ఉపదేశిస్తుంది అనుశాసనిక పర్వం! తన ఉపదేశం ఫలించి, ధర్మజుని వేదన ఉపశమించిందని నమ్మిన భీష్ముడు ధర్మజుని హస్తినకు వెళ్లి  “శ్రద్ధాన్వితంబుగా…రాజధర్మంబున ప్రకృతి రంజనము నాచరింపుము” (ఆశ్రమ-5-442) అని ఆకాంక్షించాడు.  ధర్మజుడు అట్లే అని అంగీకరించి, హస్తిన చేరి, అందరితో కలిసి  “తమ్ములను కృష్ణుడును ప్రమోదమున తేల అమ్మహేశ్వరుడప్పుడు రాజాభిషేకమంగళము నొందినట్లు నెమ్మది దలంచి గట్టి అయినా ఊరట పపెంపుగాంచి” (ఆశ్రమ-5-448) బాధ్యతలు నిర్వహించాడు. అంపశయ్య మీది భీష్ముడు తన బాధ్యత పోటీ చేసి “దివంబునకు” వెళ్లాడు. భీష్మ మరణంతో అనుశాసనిక పర్వం పూర్తి అవుతుంది.

భీష్మునికి శ్రాద్ధ కర్మలు పూర్తి చేసిన ధర్మరాజు హృదయాన్నీ శోకం పునరావహిస్తుంది. కృష్ణుడు, ధృతరాష్ట్రుడు ధర్మజుని ఊరడిస్తారు. అయినా విచారంతో మిన్నకున్న ధర్మజుని శ్రీకృష్ణుడు “భీష్ముని ద్వారా వినవలసినదంతా విని, ఇంకా దుర్మతి వలె వగచుచుండుట నీకు ఉచితం కాదని” మందలించినంతా పనిచేస్తాడు. అయినా ధర్మరాజు పెద్దతండ్రి తో “…నన్ను పెక్కు భంగుల రక్షించితిరి. ఇట మీద వనంబున కరుగననుజ్ఞా ఇచ్చుట నాకు ప్రియంబగును” అని రాజ్య త్యాగానికి, వన గమనానికి సిద్ధపడతాడు. ఇక వ్యాసుడు ముందుకు వచ్చి “మేము చెప్పిన వాక్యంబులెల్లను వరద గలసిపోయేనే, నీ బుద్ధి ఇంత ఒప్పదో… అని నిందించినంత పని చేసి…పాప భావం నశించాలంటే… “అశ్వమేధము అధిక దక్షిణాన్వితముగా చేయుము…. దానితో భవదీయ చిత్తాను తాపం తొలగిపోతుందని” ప్రబోధిస్తాడు. అయినా “బంధు విషయశోకమున…ధూమంబు పొదిగిన అగ్నిలా” కాంతిహీనంగా కనిపించాడు ధర్మరాజు(అశ్వమేధ-1-107) . ఇక కృష్ణునికి తప్పలేదు, తన ధర్మం గుర్తించి ధర్మజుని మనస్థాపం ఉపశమించే విధంగా ఉపదేశిస్తాడు. ఏడుస్తూ కూర్చుంటే “చచ్చిన బంధువుల కొని రావచ్చునే?... అశ్వమేధ క్రతువు చేయి, లోకం నిన్ను మెచ్చుకుంటుంది, తర్వాత నీకు ముక్తి లభిస్తుంది”  అని (ఆశ్రమ-1-135) హితవు పలికాడు కృష్ణుని మాటలు విన్న ధర్మజుడు “శోకంబు విడిచి…ధరణి పాలన అధ్వరకరణంబులకు…”  సమ్మతించి కార్యోన్ముఖుడై నాడు.  “మీ కారుణ్యంబున నా శోకంబంతయు బాసే, సుమనస్కత కలిగేన్ …” అని రాజ్యపాలనకు, అశ్వమేధ యాగ నిర్వహణకు, సిద్ధమవుతాడు.   కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మచుని దారిలో పెట్టగల ధర్మసాధనంగా భారతంలోని “శాంతి త్రయం” ఉపకరించింది.

ఇలా ధర్మజుని ధర్మదీక్ష వైపు నడిపించిన 'శాంతి త్రయం’ మానవజాతికి సార్వకాలికంగా ఉపకరించే పలు సత్యాలకు ఆకరంగా నిలుస్తున్నది. మనసు, ఇంద్రియాలు ఎవరి మట్టుకు వారు తామే గొప్ప అని వివాదం లోకి జారుకుని వాద ప్రతివాదాలతో జవాబు తేలక…. చివరికి ఐకమత్యంతో ”మేమును నీవును కలిసి పరగ భోగ కలన కలుగు” అని వాస్తవ జ్ఞానం గ్రహించి, జాతికి సత్యం వెల్లడిస్తాయి.

ధర్మరాజు అశ్వమేధయాగం నిర్వహించి, శోకరహితుడై రాజధర్మ నిర్వహణలో నిమగ్నుడయ్యాడని చెప్పి కథ ముగించవచ్చు. కానీ మహాకవులు కేవలం కథ మాత్రమే చెప్పరు.  వివిధ సన్నివేశాల ద్వారా వివిధ ధర్మ సూక్ష్మాలు జాతి గుండెలకు చేరువగా తెస్తారు.  అశ్వమేధ హయం వెంట రక్షకుడిగా వెళ్లిన పార్ధుని జీవిత స్వభావ విశేషాలు మనకు తెలియజేశాడు వ్యాసుడు. యాగాశ్వం వెంట వెళ్తూ విజయుడు సింధూ రాజ్యాన్ని జయిస్తాడు. ఒకనాడు ద్రౌపదిని చేరబట్టిన సైంధవుని మనువడే అక్కడి రాజు. వానిని లొంగదీసుకున్న అర్జునుడు అక్కడ దుశ్శలను చూస్తాడు కౌరవుల సోదరీ దుశ్శల. ఆమె అర్జునుని ఎదుటకు వచ్చి తన మనుమని శిక్షింపకుమని అర్థిస్తుంది. సోదరి ప్రేమతో కిరీటి ఆమె మనుమనికి స్వేచ్ఛ ఇచ్చి, దుశ్శలను  “బహుశాంత్వనముల నూరార్చి, ఆ సుధతి మస్తకమును అక్కున చేర్చి” ఊరడిల్లుమని ఓదార్చుతాడు(శాంతి-4-48) ఇక్కడ అర్జునుని సోదర ప్రేమ, కారుణ్య గుణం వెల్లడి అవుతుంది.

మణిపురం అనే రాజ్యాన్ని బబ్రువాహనుడు పాలిస్తున్నాడు. అతడు చిత్రాంగతకు పార్ధుని వల్ల జన్మించినవాడు. వానికి అర్జునుడు తన తండ్రి అని తెలుసు. ఎదుటికి వచ్చి, నాన్నగారిని గౌరవించి వెళ్ళబోతే, వానిది పిరికితనం అనుకున్న విజయుడు యుద్ధానికి ప్రేరేపిస్తాడు.  కానీ, తండ్రితో యుద్ధం చేయరాదని బబ్రువాహనుడు తిరుగు ముఖం పట్టాడు. అప్పుడు ఉలూపి వచ్చి యుద్ధం చేయమని ప్రోత్సహించి పంపుతుంది.  అక్కడ తండ్రి కొడుకుల యుద్ధం, కొడుకు చేతిలో తండ్రి మరణం  అప్పుడు చిత్రాంగద వస్తుంది. ఆమె కూడా విజయని సతీమణియే! చిత్రాంగద ఉలూపిని నిందిస్తుంది. ఉలూపి తండ్రి నాగరాజును ప్రార్థించి సంజీవని మని తెప్పించి, బబ్రువాహనుని చేతికిచ్చి, విజయుని సృశింపచేస్తే, విజయుడు పునర్జీవితుడు అవుతాడు. అర్జునుడు చిత్రాంగదను, ఉలూపిని, బబ్రువాహనుని అశ్వమేధ యాగ క్షేత్రానికి రమ్మని ఆహ్వానించి వెళ్తాడు.

ఈ సన్నివేశం ద్వారా మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముని వధించిన అర్జునునిపై భీష్ముని తల్లి గంగాదేవి కోపిస్తుంది. వసువులను ప్రార్థించి, వారి ద్వారా విజయుని శాపసంతాపితుని చేయించేటట్లు మాట పుచ్చుకుంటుంది.  విషయం తెలుసుకున్న ఉలూపి తండ్రి నాగరాజును ప్రార్థించి పతిబిక్ష కావాలంటుంది. నాగరాజు వసువులను అభ్యర్థించాడు. నాగరాజు ప్రార్ధన మన్నించిన వసువులు.  అర్జునుడు తన పుత్రుడైన బబ్రువాహనునిచే మరణిస్తే అతనికి కిల్బిషం అంటదని చెప్పారు  ఆ సంగతి తెలుసు కాబట్టి ఉలూపి కొడుకును తన భర్త పై యుద్ధానికి ప్రోత్సహిస్తుంది, మళ్లీ బ్రతికించుకొనింది.

2.6 ధర్మరాజు హృదయవేదన తొలిగుట:

అందరి సమక్షంలో ధర్మరాజు “సుప్రయోగం” గా అశ్వమేధ యాగం అఖిల లోక హితంబుగా పూర్తి చేశాడు. యజ్ఞకర్తగా ధర్మరాజు తన రాజ్యాన్ని వ్యాసునికి యజ్ఞ దక్షిణగా ఇస్తానని ప్రకటించాడు.  వ్యాసుడు రాజ్య కానుకను తిరస్కరించి తాను “పసిడి గొనగా గోరెదము” అది ఇవ్వ చాలు అంటాడు. కృష్ణుడు వ్యాసుడినే సమర్థిస్తాడు. ధర్మరాజు వారి మాట పాటించి ప్రశాంతంగా రాజ్యపాలన కొనసాగిస్తాడు. ఈ విధంగా కర్మానంతర శోకభారం తొలగించి ధర్మరాజును కార్యోన్ముఖుడిగా చేయటానికై శాంతి త్రయం వెలువరించిన ధర్మ కాంతి భావితరాలకు కూడా సత్కర్మ మార్గం చూపుతూ ఉంది.

3. ముగింపు:

ధర్మం అంటే కర్మమే అన్న విషయం ఇక్కడ మళ్లీ చర్చించుకోదగ్గ విషయం. కారణం మహాభారతమంటేనే  కురుక్షేత్ర యుద్ధం మాత్రమే ప్రస్తుత సమాజానికి కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ భారతం వీరరస ప్రధానమైనది కాదు. శాంతిరస ప్రధానమైనది. వయసులో చిన్నవాడైన శ్రీకృష్ణుడి చేత ధర్మరాజుకు ఉపదేశం చెప్పించడం సబబు కాదన్న విషయం పండితులకు మాత్రమే అర్థమవుతుంది. చిన్న వయసు వాడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశం చేయడం ధర్మాచరణలో హాస్యాస్పదమవుతుంది కనుకనే భీష్ముడు చేత ధర్మోపదేశం చేయించడం అనేది వ్యాసుడు చేత రాయబడినటువంటి మహోన్నతమైన కార్యక్రమం. నన్నయ, తిక్కన, ఎర్రన వంటి మహా మహనీయ పండితుల యొక్క అద్భుతమైన రచన శిల్పం ఈ మహాభారతం. వ్యాస భారతంలో ధర్మరాజును కథానాయకుడిగా చెప్పినప్పటికీ కొన్ని కొన్ని ఇతరేతర అనువాద రచనల్లోనూ అర్జునుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తారు నూతన రచయితలు నూతన కవులు. అర్జునుడిని  కథానాయకుడిగా పరిచయం చేసినప్పటికీ సంస్కృతం నుంచి తెలుగులో అనువదించబడినటువంటి మహాభారతం యొక్క అనువాద శిల్పం ధర్మరాజు యొక్క పాత్ర స్వభావాన్ని తగ్గించినట్లు కాదు నవయుగ కవుల, రచయితుల యొక్క రచన నైపుణ్యంగానే తీసుకోవాలి. యుద్ధంలో విజయం సంపాదించినప్పటికీ ధర్మరాజు మదిలో ఏదో వేదన, ఆందోళన  ఎప్పుడూ  ధర్మజుడిని మానసికంగా వెంటాడుతూనే ఉంది.  మానసిక వేదన నుంచి ధర్మజుడిని విముక్తి చేసి ధర్మ పాలన వైపు నడిపించడానికి ధర్మోపదేశం అగ్ర తాంబూలం ఇచ్చిందన్న విషయం గ్రహించగలగాలి. పెద్దల మాట చద్దన్నం మూట అన్న నానుడిని ఇప్పటికీ గౌరవించాలని ఈ వ్యాసానుసారం కోరడం జరుగుతుంది.

4.ఉపయుక్తగ్రంథసూచి:

  1. కాటంరెడ్డి, రామిరెడ్డి. (2010). అధ్యాపక విజయం, అక్షర కోచింగ్ సెంటర్, కర్నూల్.
  2. చలపతి, గల్లా. (2011). కవిత్రయ భారతం ప్రతిపర్వవివేచనం, C N  ప్రింటర్స్, తిరుపతి.
  3. నన్నయ, ఆంధ్ర మహాభారతం. (1996). గాయత్రి పబ్లికేషన్స్, కర్నూల్.
  4. భాస్కరనాయుడు, మన్నవ. మహాభారతం శాంతి త్రయం వ్యాసము, (2007) మే  విశాలాంధ్ర దినపత్రిక.
  5. రామకోటి శాస్త్రి, కేతవరపు. (2009). తిక్కన కావ్యశిల్పము. విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.
  6. శాస్త్రి,  ద్వానా. (2010).  తెలుగు సాహిత్య చరిత్ర (ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
  7. శ్రీమదాంధ్ర మహాభారతం, తిరుపతి దేవస్థానం, చిత్తూరు.
  8. సత్యనారాయణ, విశ్వనాథ. (1999). తిక్కన శిల్పము తెలుగు తోట. విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.
  9. సిమ్మన్న, వెలమల. (2014).  తెలుగు సాహిత్యవిమర్శ సిద్ధాంతాలు. దళిత సాహిత్యపీఠం, విశాఖపట్నం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]