headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. 'రవ్వా శ్రీహరి' విమర్శదృక్పథం: విశ్లేషణ

డా. బోయినిపల్లి ప్రభాకర్

సహాయ ఆచార్యులు,
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వ), నిజామాబాద్,
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9490901050, Email: prabhakarboinepally@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

రవ్వా శ్రీహరి రచనావ్యాసంగం సంస్కృతాంధ్రాల్లో సమాంతరంగా కొనసాగింది. అనువాద రచనతో ఆరంభించినప్పటికీ వారు విభిన్న ప్రక్రియల్లో రచనలు చేశారు. ముఖ్యంగా సంస్కృత భాషలో కవిత్వం అలాగే అనువాదం, నిఘంటు నిర్మాణం, ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన- విమర్శ, సంస్కృత తెలుగు భాషా వ్యాకరణాలు, గ్రంథసంపాదకత్వం మొదలైన రంగాల్లో చేసిన కృషి అపారమైనది. రవ్వా శ్రీహరి రచనా వ్యాసంగంలో భాగంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన - ప్రత్యేకించి వారి విమర్శ దర్శనం చెప్పుకోదగినది. భాస్కరరామాయణము- విమర్శాత్మక పరిశీలనము, ఉభయభారతి, తెలుగుకవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, అన్నమయ్య భాషావైభవం మరియు అన్నమయ్య సూక్తి వైభవం మొదలైన పరిశోధనాత్మక గ్రంథాల్లో రవ్వా శ్రీహరి విమర్శక ప్రతిభను తెలియజేయడమే ఈ వ్యాస రచన ముఖ్య ఉద్దేశ్యం.

Keywords: సంస్కృతం, భాషాపాండిత్యం, వ్యాకరణం, నిఘంటుకర్త, అనువాదం, పరిశోధన, గ్రంథపరిష్కరణ, విమర్శ, సంపాదకత్వం.

1. ఉపోద్ఘాతం:

విద్య మీద ఉన్న అచంచలమైన శ్రద్ధ, శ్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, నిరంతర అధ్యయనం- అధ్యాపనం వల్ల తెలంగాణాలోని మారుమూల గ్రామమైన వెలివర్తిలో పెద్దగా చదువులేని ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందిన బాలుడు ద్రవిడవిశ్వవిద్యాలయ ఉపకులపతిస్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన వైనం అసాధారణం- అనుపమానం.

‘‘శ్రద్ధయా ఆప్నోతి విద్యా
విద్యయా అమృతమశ్నుతే’’

(పాలపిట్ట మాస పత్రిక, సంపుటి-2, సంచిక-9, అక్టోబర్ 2011)

అన్న ఋషివాక్కుకు నిలువెత్తు నిదర్శనం మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి.
సంస్కృతం అంటే ఏమిటో, దాన్ని చదివితే లాభమేమిటో తెలియకపోయినా ఉచితభోజన సౌకర్యం, ఫీజులు లేవన్న ప్రకటన చూసి యాదగిరి లక్ష్మీ నృసింహ సంస్కృత విద్యాపీఠంలో చేరాలని తీసుకున్న నిర్ణయం రవ్వా శ్రీహరి జీవితాన్నే గొప్ప మలుపు తిప్పింది. ఆ హరి వాసం- యాదగిరి పీఠం... ఆధునిక దృష్టి కలిగిన ఒక భాషావేత్తను, వ్యాకరణ శాస్త్రవేత్తను, నిఘంటు నిర్మాతను, అనువాదకున్ని, ప్రాచీన కావ్య పరిష్కర్తను అన్నిటికన్నా మంచి సంస్కృతాంధ్ర పండితున్ని... ఈ శ్రీహరి రూపంలో మనకందించింది.

2. ఆచార్య రవ్వా జీవనరేఖలు :

1943 సంవత్సరం సెప్టెంబర్‌ 7 నాడు నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని వెలివర్తి గ్రామంలో అతి సాధారణ చేనేత కార్మిక కుటుంబంలో రవ్వా వేంకట నరసమ్మ, నర్సయ్య పుణ్య దంపతులకు మొదటి సంతానంగా శ్రీహరి జన్మించారు. మాతామహుల గ్రామమైన మునిపంపులలో ప్రాథమిక విద్య 4వ తరగతి వరకు అభ్యసించారు. శ్రీ కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారల శిష్యరికంలో శ్రీహరికి సంస్కృత భాషాసాహిత్యాల్లో గట్టి పునాది ఏర్పడింది. నాలుగేళ్ళ తర్వాత 1956లో సికింద్రాబాద్‌ మున్నాలాల్‌ సంస్కృత కళాశాలలో చేరిన శ్రీహరి అక్కడ ఆచార్యులైన శ్రీ కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి, శాస్త్రుల విశ్వనాథశాస్త్రి, రామస్వామి శాస్త్రి ఘనాపాఠీల శిష్యరికంలో సంస్కృతంలో మరింత పట్టును సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్‌ తర్వాత 1958లో సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాలలో చేరి డి.ఓ.ఎల్‌ మరియు బి.ఓ.ఎల్‌ చదువును పూర్తి చేశారు. అక్కడ కోయిల్‌ కందాళై శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి , అమరవాది కృష్ణమాచార్యులు, మరింగంటి శ్రీరంగాచార్యులు, వేదాల తిరువేంగళాచార్యులు మొదలైన దిగ్దంతుల్లాంటి ఆచార్యుల వద్ద తర్కం, వ్యాకరణం, విశిష్టాద్వైతవేదాంతశాస్త్రం, సాహిత్యం, లఘుశబ్దేందుశేఖరం, మహాభాష్యం, వైయాకరణభూషణసారం మొదలైన విషయాలను పట్టుదలతో అభ్యసించారు. ఆచార్య బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో ‘భాస్కర రామాయణం - విమర్శాత్మక పరిశీలన’ అనే అంశంపై 1981లో పిహెచ్‌.డి. పూర్తి చేశారు. ఆర్ట్స్‌ కళాశాలలో పనిచేస్తున్నప్పుడే పి.జి.డిప్లమా ఇన్‌ అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌ కోర్సును చదువుతున్నప్పుడు భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు మొదలైన భాషా శాస్త్రవేత్తల శిక్షణలో భాషాశాస్త్రంపైన ప్రత్యేకంగా అభిరుచిని పెంచుకున్నారు. శ్రీహరి మీద బిరుదురాజు రామరాజు ప్రభావం చాల ఎక్కువ. వారి ప్రభావంతోనే గ్రంథ పరిష్కరణ, ప్రాచీన సాహిత్య పరిశోధన మొదలైన అంశాలల్లో ప్రామాణికమైన కృషి చేశారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 17 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా, అందులో మూడు పర్యాయాలు తెలుగు శాఖాధ్యక్షులుగా మహత్తరబాధ్యతలు నిర్వహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలోనే 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీహరిని కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షునిగా నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే తెలుగు విశ్వవిద్యాలయానికి రెండు మూడు నెలలు ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేసే అవకాశం కూడా లభించింది. కుప్పంలో మూడున్నర సంవత్సరాలు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన శ్రీహరి తిరిగి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి 2005 లో పదవి విరమణ పొందారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానములు - ప్రచురణల విభాగంలో 2011 నుండి 2014 వరకు ప్రధాన సంపాదకులుగా బృహత్తర బాధ్యతలు చేపట్టారు. 

3. రచనావ్యాసంగం:

రవ్వా శ్రీహరి రచనా వ్యాసంగం సంస్కృతాంధ్రాల్లో సమాంతరంగా కొనసాగింది. అనువాద రచనతో ఆరంభించినప్పటికీ వారు విభిన్న ప్రక్రియల్లో రచనలు చేశారు. ముఖ్యంగా సంస్కృత భాషలో కవిత్వం అలాగే అనువాదం, నిఘంటు నిర్మాణం, ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన- విమర్శ, సంస్కృత తెలుగు భాషా వ్యాకరణాలు, గ్రంథ సంపాదకత్వం మొదలైన రంగాల్లో చేసిన కృషి అపారమైనది. శ్రీహరి మాతృగీతం, సంస్కృత వైజయంతీ అనే సంస్కృత రచనలు; ప్రపంచపదీ, ఫిరదౌసీ, తైలపాయికా, అన్నమాచార్య సూక్తి సుధా, వేమన శతకమ్‌ మొదలైన సంస్కృత అనువాద రచనలు; సంకేత పదకోశము, తెలంగాణా మాండలికాలు - కావ్యప్రయోగాలు, వ్యాకరణ పదకోశము, నల్లగొండ జిల్లా పదకోశము, శ్రీహరి నిఘంటువు, ప్రాకృతాంధ్ర నిఘంటువు, అన్నమయ్య సంకీర్తన నిఘంటువు మొదలైన నిఘంటువులు; భాస్కర రామాయణము - విమర్శాత్మక పరిశీలనము, ఉభయభారతి, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, అన్నమయ్య భాషావైభవం, అన్నమయ్య సూక్తి వైభవం మొదలైన ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శ - పరిశోధన గ్రంథాలు; లఘసిద్ధాంతకౌముది, పాణినీయ అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ అనువాద గ్రంథాలు మరియు ముకుంద విలాస కావ్యాన్ని రచించారు. త్రిలింగ శబ్దానుశాసనం అనే వ్యాకరణ గ్రంథం, అలబ్ధ కావ్య పద్య ముక్తావళి అనే సంకలన గ్రంథం, సంస్కృత సూక్తిరత్నాకరం, సంస్కృత న్యాయదీపిక, అకారాది అమర నిఘంటువు మొదలైన గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు.

4. రవ్వా శ్రీహరి విమర్శ దర్శనం:

రవ్వా శ్రీహరి రచనా వ్యాసంగంలో భాగంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన - ప్రత్యేకించి వారి విమర్శ దర్శనం చెప్పుకోదగినది. భాస్కరరామాయణము- విమర్శాత్మక పరిశీలనము, ఉభయభారతి, తెలుగుకవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధవాఙ్మయం, సాహితీనీరాజనం, అన్నమయ్య భాషావైభవం, అన్నమయ్య సూక్తివైభవం మొదలైన పరిశోధనాత్మకగ్రంథాల్లో రవ్వా శ్రీహరి విమర్శక ప్రతిభను ఇప్పుడు పరిశీలిద్దాం.

4.1 భాస్కర రామాయణం- విమర్శాత్మక పరిశీలనం:

ఇది శ్రీహరి పిహెచ్‌.డి గ్రంథం. రామాయణం మీద పిహెచ్‌.డి చేయాలన్న ఉత్సాహంతో శ్రీహరి భాస్కర రామాయణాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకొన్నారు. అప్పటికే భాస్కర రామాయణం చాల సార్లు ముద్రించబడింది. అందులో ఎన్నో పాఠాంతరాలున్నాయి. సాధారణంగా పాఠాంతరాలు ఒక అక్షరం బదులు మరో అక్షరం, ఒక పదం బదులు మరో పదం అన్నట్లుగా ఉంటాయి. కాని లభ్యమౌతున్న భాస్కర రామాయణ ముద్రణ ప్రతుల్లో బాల, అయోధ్య, అరణ్యకాండలలో పాఠాంతరాలుగా పద్యాలు పద్యాలే ఉన్నట్లుగా గమనించిన శ్రీహరి అసలైన ‘భాస్కర రామాయణం’ వెలికి తీయాల్సిన అవసరాన్ని చెప్పడం ప్రధానలక్ష్యంగా సిద్ధాంత గ్రంథాన్ని మలచారు. లభ్యమౌతున్న భాస్కర రామాయణ ముద్రణ ప్రతుల్లో బాల, అయోధ్య, అరణ్యకాండలు అనేక ప్రక్షిప్త పద్యాలతో కూడి ఉన్నట్లుగా నిరూపించారు. ఇతర కాండల్లో పద్యాలలోని కొన్ని పదాల్లోను, పద్యైక దేశంలోనో పాఠాంతరాలు కనిపిస్తున్నాయి కాని బాల, అయోధ్య, అరణ్యకాండల్లో మాత్రం ఫుట్‌ నోట్స్‌లో ఉన్నవే పద్యాలకు పద్యాలే పాఠాంతరాలు తాళపత్ర ప్రతుల్లో కనబడుతున్నాయి. ఆ మూడు కాండలు సంక్షిప్తంగా ఉన్నాయనే కారణంగా ఎవరో అనంతరకవులు వర్ణన ప్రీతిచే ఆయా సందర్భాల్లో తమ పద్యాలను ప్రక్షిప్తం చేసారని శ్రీహరి ఉదాహరణ పూర్వకంగా నిరూపించారు. ఎర్రన రామాయణ పద్యాలు కూడా కనిపిస్తున్నాయంటారు. తొలుతగా అచ్చువేయించినవారు మంచి కవులైతే వారి సొంత కవనం చేత పద్యాలను పెంచి ఉంటారని కరాలపాటి రంగయ్య, మామిడిపల్లి వెంకటార్యులను ఉదాహరణగా ప్రకటించారు.

అలాగే అప్పటికే నిర్ణయమైన హుళక్కి భాస్కరుని కర్తృత్వాన్ని శ్రీహరి మరికొన్ని ఆధారాలతో నిరూపించి ఒక ప్రామాణిక విమర్శాత్మక సిద్ధాంత గ్రంథాన్ని ప్రకటించారు.ఈ సిద్ధాంత గ్రంథంలో శ్రీహరి గారు కర్తృత్వ చర్చను, గ్రంథ పరిష్కరణను ప్రధానంగా చేసుకొని పరిశోధన చేశారు. ఈ మౌలిక పరిశోధన గ్రంథ పరిష్కరణ విమర్శ క్రిందికి వస్తుంది.

4.2 భాషా విమర్శ-భాషా శాస్త్రం:

రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్రభాషా, సాహిత్యవైదుష్యానికి, విమర్శక ప్రతిభకు గొప్ప తార్కాణంగా వారు 1996 లో వెలువరించిన ‘ఉభయభారతి’ వ్యాససంపుటి నిలుస్తుంది. ‘భాస్కర రామాయణం - విమర్శాత్మక పరిశీలనం’ అనేది శ్రీహరి పిహెచ్‌.డి. సిద్ధాంతగ్రంథం. ఈ గ్రంథంలో శ్రీహరి పరిశోధన పాటవం సుస్పష్టం. అలాగే ‘ఉభయభారతి’లో కూడా భాస్కరరామాయణం గురించి రెండు వ్యాసాలు ప్రకటించారు. భాస్కర రామాయణంలో అరణ్యకాండలో పాఠభేదాలు- అందులో ప్రక్షిప్త పద్యాల గురించి సప్రామాణిక విమర్శ ఒకటి కాగా (గ్రంథ పరిష్కరణ విమర్శ); భాస్కర, రంగనాథ రామాయణాలను తులనాత్మకంగా పరిశీలించి భాస్కర రామాయణం రంగనాథ రామాయణాన్ని అనుసరించి రచింపబడిందని నిరూపించిన వ్యాసం రెండవది(తులనాత్మక విమర్శ). ‘తెలంగాణా మాండలికంలో అసమాపక క్రియా రూపాలు’ మరియు ‘తెలంగాణా మాండలికంలో సమాపక క్రియారూపాలు’ అనే వ్యాసాల్లో శ్రీహరి తెలంగాణాలోని తెలుగు పలుకుబళ్ళను కోస్తాలోని తెలుగు పలుకుబళ్ళతో తులనాత్మక పరిశీలన చేసి కోస్తా ప్రాంతీయులకు తెలియని తెలంగాణాలోని ప్రత్యేక పదాలు, విలక్షణ ప్రయోగాల స్వరూప స్వభావాలను ఆసక్తికరంగా వింగడించి చూపారు (తులనాత్మక విమర్శ). 1) పెదపాటి జగ్గన్న ప్రబంధ రత్నాకరం, 2)ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ప్రచురించిన కర్త తెలియని ఉదాహరణ పద్యాలు అనే రెండు సంకలన గ్రంథాలకు సంకలన గ్రంథమైన వేటూరి ప్రభాకర శాస్త్రి ‘‘ప్రబంధరత్నావళి’’ తెలుగు సాహిత్యానికి అందించిన ప్రామాణిక సమాచారాన్ని ‘సంకలన గ్రంథంగా ప్రబంధరత్నావళి’ వ్యాసంలో అందించారు. మరొక వ్యాసంలో అనుకరణ వాచకాలన్నీ ధ్వని పరిధిలోకి రావని - వాటిలో రూపానుకరణ వాచకాలు, అవస్థానుకరణ వాచకాలు మొదలైన వాటిని ధ్వన్యాద్యనుకరణ వాచకాలని వ్యవహరించి ఉంటే బాగుండేదని శ్రీహరి తెలపడం వారి నిశిత దృష్టికి తార్కాణం.

4.3 తులనాత్మక/వైయాకరణ/ గ్రంథపరిష్కరణ విమర్శ:

ప్రాకృతాంధ్ర భాషా సాహిత్యాల తులనాత్మక పరిశీలన మరియు ‘అష్టభాషల’ పద ప్రయోగాలపై సమగ్ర విశ్లేషణను అందించిన శ్రీహరి ‘ప్రాకృతాంధ్ర సాహిత్యాలు’ అనే వ్యాసంలో ప్రాకృత భాషాసాహిత్యపు మౌలికమైన ప్రభావం తెలుగు సాహిత్యంపై పడలేదని దానికి కారణాలను వివరించారు పాణిని తన అష్టాధ్యాయి/ పాణినీయంలో లాఘవం సాధించడానికి శాస్త్రీయ పద్ధతిలో ఆశ్రయించిన రీతుల వల్ల సంస్కృత వ్యాకరణ గ్రంథాలన్నింటిలో అగ్రస్థానాన్ని అలంకరించిన విధానాన్ని ‘పాణినీయంలో లాఘవం’ అనే వ్యాసంలో నిరూపించారు. భగవద్గీతకు తెలుగులో పద్య, గద్య, ద్విపద, గేయ ప్రక్రియల్లో వచ్చిన అనువాదాల గురించి ‘తెలుగులో భగవద్గీతలు’ అనే వ్యాసంలో విశ్లేషించారు. పోతన కాకుండా ఇతర కవులు వివిధ ప్రక్రియల్లో రాసిన భాగవతాలు (ద్విపదలో ఐదు, చంపువుగా పది, నిర్వచనంగా రెండు, అచ్చ తెలుగులో ఒకటి, ఏకవృత్తంగా ఒకటి) వెలసిన తీరును ‘పోతన భాగవతేతర భాగవతాలు’ అనే వ్యాసంలో చూపించారు (ప్రక్రియా విమర్శ). తెలుగు కావ్యాలను సంస్కృతీకరించి వాటి మాధుర్యాన్ని తెలుగేతరులకు అందించి సంస్కృతాంధ్ర భాషలకు ఎంతోసేవచేసిన కవుల కావ్యాలను గురించి ‘సంస్కృతీకరింపబడ్డ తెలుగు కావ్యాల’లో తెలిపారు (అనువాదం). స్వయంగా నిఘంటు నిర్మాత అయిన శ్రీహరి సంస్కృత నిఘంటువుల్లోని వైవిధ్యాన్ని ఒక వ్యాసంలో వివరించగా, తెలుగు మాండలికాల సౌందర్య శోభను మరొక వ్యాసంలో భాషాశాస్త్ర దృష్టితో విశ్లేషించారు (భాషా విమర్శ-భాషా శాస్త్ర పరంగా). తెలుగు సాహిత్యంలో మనకు లభించకుండా నశించిపోయిన వందల కొద్దీ ప్రాచీన కావ్యాల సమాచార సమాహారంగా ‘తెలుగులో అలబ్ద వాఙ్మయం’ అనే వ్యాసాన్ని రూపొందించారు. అలాగే ప్రాచీన తెలుగు కావ్యాలు - వాటికి సంబంధించిన పాఠ పరిష్కరణలు - భాషా ప్రయోగ విశ్లేషణలు (గ్రంథ పరిష్కరణ విమర్శ); విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం - భాషా విశేషాలు ఇటీవలి కవిత్వ ప్రయోగ విశేషాలు, నేటి వాడుక తెలుగులో కొన్ని అపప్రయోగాలు (భాషావిమర్శ-భాషా శాస్త్రపరంగా) మొదలైన ఇరవై ఐదు వ్యాసాలు శ్రీహరికి కల లోతైన పరిశోధనాదృష్టిని, విమర్శక ప్రతిభను తేటతెల్లం చేస్తున్నాయి.

4.3 తెలుగు కవుల సంస్కృతానుకరణలు:

లోకంలో అనుకరణమనేది అతి సహజమైన విషయంగా ప్రస్తావిస్తూ, సాహిత్యంలో కూడా పూర్వకవులను తర్వాతి కవులు అనుకరించిన ఘట్టాలెన్నో ఉన్నాయని, అది సాహిత్యాభివృద్ధికి దోహదపడుతుందని శ్రీహరి పేర్కొంటారు. సంస్కృత సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో కూడా పూర్వకవులను అనుకరించిన ఘట్టాలు ఎన్నో కనబడుతున్నాయంటారు. ఈ అనుకరణను కొందరు గ్రంథ చౌర్యమనడం న్యాయం కాదని, ఆయాకవులకు పూర్వకవులు చేసిన వర్ణనపై గల గౌరవభావం కారణమనడం న్యాయంగా తోస్తుందంటారు. తెలుగులో వెలసిన భారత, భాగవత, రామాయణాలు, పురాణాలు, కావ్యాలు మొదలైనవన్నీ సంస్కృత రచనలకు అనుకృతులే. ఈ గ్రంథాల్లో వాటి మూలమైన సంస్కృత గ్రంథాల్లోని శ్లోకాలకు అనువాద పద్యాలు ఉండడం సహజమే కాని, అనువాదాలు కాని తెలుగు కావ్యాల్లో కూడా అక్కడక్కడ సంస్కృత శ్లోకాలకు అనువాద పద్యాలు కనిపిస్తుంటాయని వాటిని తమ విమర్శక ప్రతిభతో వివరించారు. సంస్కృత కవులైన కాళిదాసు, శ్రీహర్షుడు, భర్తృహరి, మయూరుడు, అగస్త్యకవి, జయదేవుడు మొదలైన వారి కొన్ని శ్లోకాలను తెలుగులో నన్నెచోడుడు, బద్దెన, హుళక్కి భాస్కరుడు, భాస్కర రామాయణ యుద్ధకాండ శేషకర్త అయ్యలార్యుడు, శ్రీనాథుడు, అనంతామాత్యుడు, కొరవి గోపరాజు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, కాణాదం పెద్దన సోమయాజి మొదలైన కవులు సందర్భానుసారంగా తమ కావ్యాల్లో పద్యాలుగా అనువదించుకొని కావ్య సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకున్నారని శ్రీహరి సోదాహరణ పూర్వకంగా విశ్లేషించి చూపారు.

‘తత్ర మిత్ర న వస్తవ్యం, యత్రనాస్తి చతుష్టయమ్‌
ఋణదాతా చ వైద్యశ్చ, శ్రోత్రియ: స జలానదీ’

అనే సంస్కృత సుభాషిత శ్లోకాన్ని బద్దెన సుమతీ శతకంలో కింది విధంగా యధాతథంగా అనువదించుకొన్నాడు.

’అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్‌
చొప్పడిన ఊరనుండుము
చొప్పడకున్నట్టి ఊరజారకుము సుమతీ!’

మరో ఉదాహరణ...

‘భృంగాన వాప్తి ప్రతిపన్న ఖేదా, కృత్వావనే గంధఫలీ తపో7లమ్‌
తన్నాసికా భూదనుభూత గంధా, స్వపార్శ్వ నేత్రీకృత భృంగసేవ్యా’
(నలకీర్తికౌముదీ, ద్వితీయసర్గ: - 74)

అగస్త్యకవి రచించిన ‘నలకీర్తి కౌముది’లోని పై శ్లోకాన్ని అనుకరించి నంది తిమ్మన పారిజాతాపహరణ ప్రబంధంలో ఈకింది మంచి పద్యాన్ని రచించాడు.

‘నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధ ఫలి బల్కాకం దపంబూని యో
షానాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వం కలన్‌’

4.4 తెలుగులో అలబ్దవాఙ్మయం:

తెలుగుసాహిత్యంలో వందల కొద్దీ ప్రాచీనకావ్యాలు మనకు దొరకకుండా నశించిపోయాయనే విషయాన్ని లక్షణగ్రంథాదుల వల్ల గుర్తించిన శ్రీహరి వాటి వివరాలను సాహిత్యలోకానికి అందించాలనే తపనతో, ప్రత్యేక అభినివేశంతో పరిశోధించి వెలువరించిన రచన ‘అలబ్దకావ్య పద్యముక్తావళి’. ప్రాచీన సాహిత్య మౌలిక పరిశోధకుల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి అగ్రేసరులుగా గుర్తించబడ్డారు. తెలుగులో సంకలన కావ్యప్రక్రియను వెలుగులోకి తీసుకువచ్చిన వారు మానవల్లి రామకృష్ణకవి కాగా అలబ్ధ పద్యకావ్యాలను ఒకచోట కూర్చి ‘ప్రబంధరత్నావళి’ అనే సంకలన గ్రంథంగా ప్రకటించిన వారు వేటూరి ప్రభాకరశాస్త్రి. తొలిదశలో శ్రీహరి వీరి రచనలను ఎక్కువగా చదివేవారు. ప్రాచీన కావ్యావతారికలు, ఛందోవ్యాకరణ గ్రంథాలు, సంకలన గ్రంథాలను ప్రధాన ఆధారాలుగా చేసుకొని శ్రీహరి సుమారు వందకు పైగా అలబ్ధ కావ్య సమాచారాన్ని ఈ సంకలన గ్రంథంలో చేర్చారు. ఇది వారి మౌలిక పరిశోధనకు గొప్ప తార్కాణంగా నిలుస్తుంది. తెలుగు సాహిత్యంలో మనకిప్పటికీ లభించని ఎర్రన రామాయణం, అధర్వణ భారతం మొదలైన గ్రంథాల్లోని లభ్యమైన పద్యాలన్నింటిని వివిధ ఆకరాల ఆధారంగా సేకరించి ఈ గ్రంథంలో కూర్చడం జరిగింది (గ్రంథపరిష్కరణ విమర్శ). వీటి ద్వారా తర్వాతి కాలంలో పరిశోధకులు, ప్రాచ్యలిఖితసంస్థలు ఏవైనా కావ్యాలను బయట పెట్టే ప్రయత్నం చేయాల్సి ఉందని శ్రీహరి తెలియజేస్తున్నారు.

4.5 ఆలంకారికవిమర్శ - సాహితీ నీరాజనం:

శ్రీహరి తెలుగు భాష,సాహిత్యం, సంస్కృతికి సంబంధించి విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా 2008లో ప్రకటించిన 13 వ్యాసాల సంపుటి ‘సాహితీనీరాజనం’. సంస్కృతం, తెలుగు, షడ్విధ ప్రాకృతాలను (ప్రాకృత,శౌరసేని,మాగధి,పైశాచి,చూళిక, అపభ్రంశ) కలిసి అష్టభాషలు అంటారు. తెలుగుకవులు సంస్కృతాంధ్రాలతో పాటు ప్రాకృత భాషల్లో కూడా పాండిత్యం సంపాదించిన వారి గురించి, తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న అష్టభాషా కవులను గురించి శ్రీహరి ‘అష్టభాషా కవులు’ అనే వ్యాసంలో ప్రామాణిక చర్చ చేశారు. శృంగార రస స్థాయీభావమైన రతిని పోషించే ముప్పైరెండు వ్యభిచారీ భావాల్లో వ్రీడ (లజ్జ) ఒకటి. దీనికి తెలుగులో ‘సిగ్గు’ అనే పదమే బహుళ ప్రచారంలో ఉంది. శృంగారాన్ని పరిపుష్టం చేసే భావాల్లో ఒకటైన సిగ్గును సంస్కృతాంధ్ర కవులెందరో తమ కావ్యాల్లో ఎంతో హృద్యంగా వర్ణించడాన్ని మనం గమనించవచ్చు. అయితే నాయిక ఎన్నెన్ని రకాలుగా సిగ్గును ప్రదర్శిస్తుందో ఆ భేదాలు వీటిలో కనిపించవు. కాని లాక్షణిక దృష్టి కలిగిన కవి అన్నమయ్య తన సంకీర్తనల్లో నూట ఎనభై తీరుల సిగ్గులను ఆయా సందర్భాల్లో పేర్కొనడం విశేషమని శ్రీహరి ఆ సిగ్గులన్నింటినీ ‘అన్నమయ్య సిగ్గులు’ అనే వ్యాసంలో మన ముందు ఒలకింపజేశారు. అన్నమయ్య తెలుగులో భాషాపరంగా ఒక గొప్ప విప్లవాన్నే తీసుకువచ్చాడని చెప్తారు. ప్రజల నోళ్ళలో నిత్యమూ పలికే వాడుక భాషను గౌరవించి తన కీర్తనల్లో దానికి పెద్దపీట వేశాడు. అలాగే తన ప్రాంత మాండలిక పదజాలాన్ని కూడా విరివిగా వాడుకున్నాడు. తన సంకీర్తనలు ప్రజలకు బాగా అర్థమై వ్యాప్తిని పొందాలనే ఉద్దేశంతో అలా వాడినట్లు శ్రీహరి ‘అన్నమయ్య సంకీర్తనల్లో కొన్నిమాండలికాలు’ అనే వ్యాసంలో విశ్లేషిస్తారు. సంస్కృత కవుల లాగే తెలుగు కవులు కూడా సూక్తి సాహిత్యాన్ని ఎంతో వెలువరించారని, సంస్కృతంలో మూడు రకాలుగా కనిపించే సూక్తి సాహిత్యం తెలుగులో కూడ విలసిల్లిందని శ్రీహరి ‘సుక్తినిధి అన్నమయ్య’ వ్యాసంలో సోదాహరణంగా తెలియజేశారు.

తెలుగు దినపత్రికల్లో బాషాప్రయోగాల్లో కనబడే కొన్ని ధోరణులను ప్రస్తావిస్తూ యోగ్యమైన పదాలు తెలుగుభాషలో లభ్యమౌతున్నప్పుడు వాటిని వదిలేసి ఆంగ్ల లేదా సంస్కృత భాషా పదాలను వాడడం మంచిది కాదంటూ, ఇటీవలి దినపత్రికల్లో ఆంగ్లభాషా పదజాలం వాడుక ఎక్కువై ఎబ్బెట్టుగా కూడా ఉంటుందని శ్రీహరి ‘నేటి పత్రికా భాష’ అనే వ్యాసంలో విమర్శనాత్మకంగా నిరూపించారు. భాషలో ఒక పదం బోధించే భావానికి అనుగుణంగా వర్ణ సంయోజనం తప్పకుండా ఉండాలన్న నియమం లేకున్నా శ్రీహరి పరిశీలన వల్ల కొన్ని పదాలలో భావానుగుణ వర్ణ సంయోజనం ఉండడానికి అవకాశం ఉంటుందని ‘పదాలు అర్థానుగుణ వర్ణసంఘటన’ వ్యాసంలో నిరూపించారు(భాషా విమర్శ).

పింగళి లక్ష్మీకాంతం తమ ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’లో భాస్కర రామాయణాన్ని గురించి రాస్తూ... గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణంలో రామున్ని పురుషోత్తముడని వాచ్యంగా వర్ణిస్తే భాస్కర రామాయణ కర్తలు వాల్మీకిని అనుసరించి రామున్ని ఉత్తమ పురుషునిగా వర్ణించారని సప్రమాణంగా నిరూపించారు(తులనాత్మక విమర్శ). దీనికి కొనసాగింపుగా శ్రీహరి భాస్కర రామాయణ కర్తలు రామున్ని ఉత్తమ పురుషునిగా ప్రధానంగా వర్ణించినప్పటికీ రంగనాథ రామాయణంలో లాగా పురుషోత్తమునిగా కూడా వర్ణించిన ఘట్టాలు కూడా ఉన్నాయని ‘భాస్కర రామాయణం - రాముని పురుషోత్తమత్వం’ అనే వ్యాసంలో ఉదాహరణ పూర్వకంగా వివరించడం ఆయన సునిశిత పరిశోధనా దృష్టి, విమర్శక ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు (తులనాత్మక విమర్శ). ఒక ఉదాహరణ-

సురవరుల కంటెఁ బూజ్యుం
డరయగ నీ పురుష వృషభుఁడట్లగుట గుణో
త్తరునకు నీ హవి వేల్చిన
చరుశేషముఁ దెచ్చి పెట్టు సంభావనతోన్‌ (భా.రా : అరణ్యకాండ 1-95).

రాతప్రతులు - వాటిలోని అపపాఠాలు, పాఠభేదాలకు గల కారణాలు, గ్రంథ పరిష్కరణ గురించి శ్రీహరి ‘గ్రంథపరిష్కరణ - తీరుతెన్నులు’ అనే వ్యాసంలో ప్రామాణిక చర్చను లేవనెత్తారు(గ్రంథ పరిష్కరణ విమర్శ). రామాయణం సంస్కృత భాషలోనే కాక ప్రపంచ భాషలన్నింటిలో ఆదికావ్యమని చెప్పదగిన మహాకావ్యం. తెలుగులో ఇంతవరకు వచ్చిన రామాయణ కావ్యాలన్నీ పండితైకవేద్యాలని చెప్పుతూ పామరులకు సులభ వేద్యంగా ఉండే రామాయణ ఆవశ్యకతను చెప్తూ ఆ లోటును ‘మల్లెమాల రామాయణం’ తీర్చిందని శ్రీహరి ఉవాచ. అలతి అలతి పదాలతో వర్ణన, పాత్రపోషణ, కవితా శిల్పం, అలంకార ప్రయోగం మొదలైన అంశాల్లో ప్రాచీన కవులకు ధీటుగా ఉత్తమ కావ్యంగా మల్లెమాల తన రామాయణాన్ని తీర్చి దిద్దారని, వారి కవితా ప్రతిభను ‘మల్లెమాల రామాయణ వైశిష్ట్యం’ అనే వ్యాసంలో విమర్శనాత్మకంగా చూపించారు.

తెలుగువారు పండించిన వడ్లలోని వివిధరకాల భేదాలను కవులు తమ కావ్యాల్లో పేర్కొనడం జరిగింది. గణపవరపు వేంకటకవి నూట నాలుగు రకాల వడ్ల భేదాలు పేర్కొనగా, పాలవేకరి కదిరీపతి నూట పది రకాలను, చించాపట్నం లక్ష్మణాచార్యులు మూడు వందల రకాల వడ్ల భేదాలను తెలిపారు. ఈ విధంగా సాహిత్యం ఆధారంగా వడ్లలోని భేదాలను తెలియజేయాలనే ప్రధానాశయంగా శ్రీహరి ‘తెలుగువారి బహువ్రీహులు’ అనే వ్యాసాన్ని ప్రకటించారు(తులనాత్మక విమర్శ). ఇలాంటి పరిశ్రమ వల్ల ఆంధ్రుల సంస్కృతి పదకోశాన్ని నిర్మించవచ్చు. మండలక్ష్మీ నృసింహకవి ‘సారస్వత త్రిలింగ శబ్దానుశాసనం’ తెలుగుభాషకు సంస్కృతంలో రాయబడిన వ్యాకరణ గ్రంథం. ఇందులోని మొత్తం పదమూడు ప్రకరణాల్లో పరిభాష, సంజ్ఞ, సంధి, శబ్ద, తద్ధిత, కారక, సమాస, తద్భవ మొదలైన ఎనిమిది ప్రకరణాలను శ్రీహరి ఒక వ్యాసంలో విశ్లేషించారు(వైయాకరణ విమర్శ). సంస్కృత సాహిత్యంలో మానవతావాదం ఎలా ప్రతిఫలించిందో కూడా ఈ గ్రంథంలో ఒక వ్యాసంలో పేర్కొన్నారు. మొత్తం మీద రవ్వా శ్రీహరి సాహిత్య విమర్శ దర్శనంలో ‘సాహితీ నీరాజనం’ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

4.6 అన్నమయ్య భాషావైభవం”లో భాషావిమర్శ:

అన్నమయ్య సంకీర్తన వాఙ్మయంలో అన్నమయ్య భాషాతత్వాన్ని వివరించడానికి శ్రీహరి విమర్శనాత్మకంగా రచించిన గ్రంథం- ‘అన్నమయ్య భాషా వైభవం’. మొత్తం పదిహేను వ్యాసాల్లో పదమూడు వ్యాసాలు అన్నమయ్య భాషా తత్వాన్ని వివరించేవి కాగా రెండు వ్యాసాలు పెదతిరుమలాచార్యుల భగవద్గీత వ్యాఖ్యానాన్ని పరిశీలించేవి. ఈ గ్రంథంలో శ్రీహరి - అన్నమయ్య నవ్వులు, అన్నమయ్య ఉపమలు, అన్నమయ్య విలక్షణ సమాసాలు, అన్నమయ్య కీర్తనలు - వ్యావసాయిక పదజాలం, అన్నమయ్య వాడిన కొన్ని దేశ్యశబ్దాలు, అన్నమయ్య భాషలో వ్యావహారిక జానపద భాషాలక్షణాలు, అన్నమయ్య కీర్తనల్లో కొన్ని కారక విశేషాలు, అన్నమయ్య విలక్షణ పదబంధాలు, అన్నమయ్య కీర్తనలు - వింత తద్ధితాంతరూపాలు, అన్నమయ్య భాషలో అరసున్నలు, అన్నమయ్య కీర్తనల్లో ధర్మవాచక పదాలు, అన్నమయ్య వైరి సమాసాలు, అన్నమయ్య లోకజ్ఞత, తాళ్ళపాక పెద తిరుమలాచార్య భగవద్గీత వ్యాఖ్యావిధానం మరియు పెద తిరుమలాచార్య భగవద్గీత వ్యాఖ్యానం - వ్యావహారిక భాషా పరిశీలనం మొదలైన వ్యాసాల్లో అన్నమయ్య భాషా తత్త్వాన్ని సప్రమాణంగా, విమర్శనాత్మక ప్రతిభతో ప్రకటించారు. అన్నమయ్య సంకీర్తనల్లో భక్తి, సంగీతం, సాహిత్యం మొదలైన అంశాలకు ఎంత ప్రాధాన్యముంటుందో భాషకు కూడా అంతే ప్రాధాన్యముందని, గ్రాంథిక రచనా శైలికి పట్టం కట్టబడిన కాలంలో దాన్ని కాదని అలతి అలతి తెలుగు పదాలతో వేలాది సంకీర్తనలు రచించి, వాడుక తెలుగు భాషకు పట్టం కట్టి, భాష సజీవతను కాపాడినాడని శ్రీహరి తమ వ్యాసాల్లో అడుగడుగునా నిరూపించడం జరిగింది. భాషాశాస్త్రజ్ఞులు, వైయాకరణులు అన్నమయ్య భాషపై ఎంతో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్న- అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించిన విద్వాంసులు శ్రీగౌరి పెద్ది సుబ్బరామశర్మ మాటలకు అనుగుణంగా శ్రీహరి ‘అన్నమయ్య సంకీర్తన నిఘంటువు’ను కూర్చడం విశేషంగా చెప్పుకోవచ్చు.

4.7 అన్నమయ్య సూక్తి వైభవం:

సూక్తి అంటే సుభాషితం. ఎంతో లోకానుభవాన్ని పండించుకొని విజ్ఞులు చెప్పిన మంచి మాటలే సూక్తులుగా ఆవిష్కారమౌతాయి. సూక్తులు ప్రధానంగా మానవజాతికి నీతిని బోధిస్తాయి. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వివిధ దశల్లో మానవుని వర్తనం ఎలా ఉంటే సమాజానికి ఉపయోగకారిగా ఉంటుందో దానిని సూక్తులు వివరిస్తాయని, వ్యక్తి సంస్కారం ద్వారా సమాజ సంస్కారానికి సూక్తి సాహిత్యం ఎంతగానో దోహదం చేస్తుందంటారు శ్రీహరి. తెలుగు సంస్కృత భాషా సాహిత్యాల్లో పండితాగ్రేసరులైన రవ్వా శ్రీహరి సంస్కృతంలో సుభాషిత సాహిత్యం మూడు విధాలుగా కనిపిస్తుందని చెప్పుతారు. 1. సుభాషితాలనే స్వతంత్రంగా రచించిన సాహిత్యం ఉదా: భర్తృహరి సుభాషిత త్రిశతి మొదలైనవి, 2. వేర్వేరు కవులచే ఆయా సందర్భాల్లో కావ్యగతంగానో లేక స్వతంత్రంగానో రచించిన సుభాషితాలను ఏరి కూర్చిన సంకలన సాహిత్యం ఉదా: సుభాషిత భాండాగారం మొదలైనవి, 3. వివిధ కవులు- విశ్వశ్రేయః ప్రధానాలైన వారి కావ్యాల్లో సందర్భానుగుణంగా కథతో పాటు, సమాజానికి నీతిని బోధించడానికి పొదివి చెప్పిన సుభాషితాలు ఉదా: రామాయణం, భారతం మొదలైనవి.

సంస్కృత కవుల్లాగే తెలుగు కవులు కూడా ఈ సూక్తి సాహిత్యాన్ని ఎంతో వెలువరించారని, సంస్కృతంలో లాగే తెలుగులో కూడా సూక్తి సాహిత్యం మూడు విధాలుగా విలసిల్లిందని శ్రీహరి పేర్కొంటారు. అన్నమయ్య రచించిన సంకీర్తనలను పరిశోధించి అందులోని సూక్తుల విశిష్టతను ‘అన్నమయ్య సూక్తి వైభవం’ అనే గ్రంథంలో చక్కగా విశ్లేషణాత్మకంగా వివరించారు. ఉదాహరణకు-

మానవుని అంతశ్శత్రువుల్లో ఒకటైన ‘కోపాన్ని’ గురించి కొన్ని-

‘కోపమధికము సేయు కోరికలు’
‘అతి కోపమేడ నుండు అజ్ఞానమాడ నుండు’

మానవుల్లో ఉండే దుర్గుణాల్లో ఒకటైన ‘అత్యాశ ‘ గురించి కొన్ని-

‘ఆస విడిచిన గాని యధిక సుఖము లేదు’
‘కడుపులోపలి పుండు కడలేని యాస’

‘సంసారం’ గురించి-

‘పాము చెలిమి రంపపు సంసారము’

‘స్వార్థం’ గురించి-

‘పంది వలె తనుఁ దానె బ్రదుకేటి సుఖము’
‘పరోపకారము కంటే బహు పుణ్యము లేదు’

‘స్త్రీలపై గల గౌరవం’ గురించి-

‘ఇలపైఁ బూజ్యులలోన నింతులే కడుఁ బూజ్యులు’

ఇంకా అధిక సంపదల వల్ల కలిగే నష్టాల గురించి, అదృష్టం, కృతజ్ఞతాభావం, తల్లిదండ్రుల యోగక్షేమాల ఆరా, బిడ్డలపై చూపే ప్రేమ, పరనింద - పర్యవసానం, స్వార్థనిమిత్తమై పరస్తుతి, శరణాగత రక్షణ, జాతి కులాభిజాత్యం, కాలస్వభావం, అప్పు - అనర్థాలు, మాత్సర్యం, పాపచింతన, అరిషడ్వర్గాలు, పరస్త్రీ వ్యామోహం - కాముకత్వం, ఉమ్మడి కుటుంబం మొదలైన వాటి గురించి చెప్పిన సూక్తులను అన్నమయ్య సంకీర్తన వాఙ్మయాన్ని పరిశోధించిన శ్రీహరి వెలికి తీసి తమ విమర్శక ప్రతిభతో విశ్లేషించి ‘అన్నమయ్య సూక్తి వైభవం’లో సాహితీలోకానికి ప్రకటించారు. అన్నమయ్య రచించినవి ఆధ్యాత్మిక శృంగార కీర్తనలే అయినా, వాటికి భగవద్భక్తే మౌలికాంశమైనా సామాజికాంశాలను మరవలేదని అందుకే అన్నమయ్య - ‘ప్రజాకవి’ అని శ్రీహరి ప్రతిపాదించడం ఎంతో సముచితంగా తోస్తుంది.

5. ముగింపు:

తెలుగు పరిశోధకుల్లో నాలుగింట మూడోవంతు మంది కవిత్వం అందులో ఆధునిక కవిత్వం, ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, వచన కవిత మొదలైన వాటిలో ఎక్కువగా పరిశోధన కొనసాగిస్తే, శ్రీహరి గారు మాత్రం అందుకు భిన్నంగా మరెంతో ప్రత్యేకంగా భాష, మాండలికం, వ్యాకరణం,నిఘంటు నిర్మాణం, అనువాదం, తెలంగాణ పద సేకరణ, ప్రాచీన గ్రంథ పరిష్కరణ మొదలైన రంగాల్లో విశేషంగా పరిశోధన చేసి ఎన్నో విమర్శాత్మక రచనలు వెలయించిన సంస్కృతాంధ్ర పండితాగ్రేసరులు. 1980ల తర్వాత ఎం.ఏ తెలుగు చదువుకున్న వారికి ప్రాచీన గ్రంథ పరిష్కరణ గురించి పెద్దగా తెలియదు.  పరిష్కర్తకు ఛందస్సు, వ్యాకరణం, అలంకార శాస్త్రం మొదలైన అనేక విషయాలపై పట్టు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం యూనివర్సిటీలలో దీని గురించి పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. అలాగే గ్రంథ పరిష్కరణ కష్టమైనదనే భావన ఉండడం వల్ల విద్యార్థులు ఆ రంగం వైపు దృష్టిని సారించడం లేదు. తెలుగుకు ప్రాచీన భాషా హోదా వచ్చిన సందర్భంలో గ్రంథ పరిష్కరణ అంశం ఎం. ఏ. స్థాయిలో ఒక పాఠ్యాంశంగా ఉండాలనేది శ్రీహరి గారి నిశ్చితాభిప్రాయం. నేటి పరిశోధక విద్యార్థులు భాష, వ్యాకరణం, అలంకార శాస్త్రం, గ్రంథ పరిష్కరణ, నిఘంటు నిర్మాణం, అనువాదం మొదలైన మౌలిక రంగాలపై ఆధునిక దృష్టిని కలిగి ఆ దిశగా అడుగులు వేయాలని వారి సందేశంగా చెప్పవచ్చు.మానవల్లి రామకృష్ణ కవి గారు ఒక అంశంపై రచన చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పరిపూర్ణ మౌలిక పరిశోధకులు కాబట్టి పూర్వాపరాలు/లోతులు తరచి చూస్తూ ముందుకు వెళ్లడం వల్ల దారిలో తారసపడే అనేక అనుబంధ అంశాలను కూడా చేర్చుకొని తన పరిశోధనా వ్యాసానికి సర్వ సమగ్రతను సాధించిపెట్టేవారు. ఈ మాటలు శ్రీహరి గారికి కూడా అచ్చంగా వర్తిస్తాయి. ప్రణాళిక లేవీ వేసుకోకుండానే ఒక రచన చేస్తున్నప్పుడు మరో రచనకు సంబంధించిన ఆలోచనలు రావడంతో మొదటి పని పూర్తి చేసి తర్వాతి దానిలోకి వెళ్లే వాడినని, నిఘంటువులన్నీ అలా వచ్చినవే అని వినమ్రంగా తెలియజేశారు.

పైవిధంగా ఆచార్య రవ్వా శ్రీహరి రచనా వ్యాసంగంలో ప్రాచీన తెలుగు సాహిత్యంలో పరిశోధన- ప్రత్యేకించి వారి విమర్శక ప్రతిభ చెప్పుకోదగినది. తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానంలో కొన్ని అధ్యాయాల సమగ్రతకు శ్రీహరి విమర్శ దర్శనం తోడ్పడుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక, సంపుటి 19, సంచిక 1, అగస్త్యకవి, "నలకీర్తికౌముదీ", ద్వితీయసర్గ: పుట. 26, ద్వైమాసిక పత్రిక, తెలుగు అకాడమీ, కాకినాడ. 1930-31.
  2. పరిణత వాణి (రవ్వా శ్రీహరి ప్రసంగం), ఆంధ్ర సారస్వతపరిషత్తు ప్రచురణలు, హైదరాబాదు.
  3. పాలపిట్ట మాస పత్రిక, సంపుటి-2, సంచిక-9, అక్టోబర్, 2011.
  4. శ్రీహరి, రవ్వా. అన్నమయ్య భాషా వైభవం,వరరుచి పబ్లికేషన్స్, హైదరాబాదు,2006.
  5. శ్రీహరి, రవ్వా.(సంపా.) అన్నమయ్య సూక్తి వైభవం,వరరుచి పబ్లికేషన్స్, హైదరాబాదు.
  6. శ్రీహరి, రవ్వా.ఉభయభారతి, 1996.
  7. శ్రీహరి, రవ్వా. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, 2006.
  8. శ్రీహరి, రవ్వా. తెలుగులో అలబ్ద వాఙ్మయం, 1983.
  9. శ్రీహరి, రవ్వా. భాస్కరరామాయణం- విమర్శాత్మకపరిశీలనం (పి.హెచ్.డి. గ్రంథం), 1988.
  10. శ్రీహరి, రవ్వా. సాహితీ నీరాజనం,పతంజలి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2008.
  11. శ్రీహరి, రవ్వా. సంకేత పదకోశం,పతంజలి పబ్లికేషన్స్, హైదరాబాదు, 1973.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]