headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. ‘లండ సాంబమూర్తి’ కవిత్వం: శ్రీకాకుళం జిల్లా వలసలు

శీలంకి గోవిందరావు

పరిశోధక విద్యార్ధి,
తెలుగు అధ్యయనశాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8464034547, Email: govind.sjgc43@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

శ్రీకాకుళం జిల్లా పేరు వినగానే పోరాటాలకు పురిటిగడ్డ అని గుర్తొస్తుంది ఈ జిల్లాలో కవులు వివిధ రకాల నేపథ్యాలతో రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా కథ, నవల ,నాటకం గేయం మొదలైన ప్రక్రియలో రచనలు చేయడం జరిగింది. కానీ కవితా ప్రక్రియలో రచనలు చేసిన వారు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే జిల్లాలో కవులు ఇతర ప్రక్రియలపై చూపినంత శ్రద్ద కవిత్వంపై చూపకపోటమే. కానీ ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా విస్తృతంగా కవిత్వం వెలువడుతుంది. జిల్లా కవులు తమ ప్రాంతపు సమస్యలను,ప్రాంతపు అస్తిత్వాన్ని తమ కలాలతో, గలాలతో సమాజానికి తెలియజేస్తున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా నుంచి కవిత్వాన్ని వెలువరిస్తున్న కవుల్లో సీరపాణి, చింతాడ తిరుమలరావు, కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి, అరుణ్ భవేర మొదలైన వారు ప్రసిద్ధి చెందిన కవులగా చెప్పవచ్చు. “శ్రీకాకుళం జిల్లా కవిత్వం - పరిశీలన” అనే పరిశోధన అంశంలో భాగంగా ఆ ప్రాంతపు ప్రజలు రాష్ట్రం లో ఇతర ప్రాంతపు ప్రజలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచే ఎక్కువ శాతం ప్రజలు వలసలు పోవటానికి గల కారణాలు, జిల్లా అభివృద్ది లో వెనుకపడటానికి గల కారణాలు మొదలైన అంశాలు ఈ వ్యాసంలో తెలుసుకోవచ్చు. నా ఈ పరిశోధన వ్యాసానికి సంబంధించి జిల్లాలో ప్రజలు వలసలు పోవటానికి,వారు పనిచేసే ప్రదేశంలో ఎదుర్కొంటున్న సమస్యల పై కవి వెలువరించిన కవితలను వివరణాత్మకంగా అధ్యయనం చేసి కవి అనుసరించిన పద్ధతులను విశ్లేషించి ఈ వ్యాసాన్ని తీసుకురాగలిగాను.

Keywords: ఆకాశహర్మ్యాలు, చెమటపూలు, ఉచ్ఛ్వాసనిశ్వాసాలు, వలసపిట్టలు ,గాజురెక్కల తూనీగ, వలస రైలుబండి

1. ఉపోద్ఘాతం:

ఉత్తరాంధ్ర ప్రాంతం అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమని, అక్కడ అంతగా అభివృద్ధి లేదని ఆ ప్రాంతపు ప్రజలు అంతా కష్టంతోనే జీవనాన్ని కొనసాగిస్తారని అర్థమవుతుంది. పుష్కలంగా వనరులున్నా వాటి వినియోగం మాత్రం అంతంతే. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ ప్రాంతపు అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడే నాయకులు మాత్రం ఉండరనేది అక్షర సత్యం. తమ సొంతప్రయోజనాల కోసం 5 సంవత్సరాలు ఒకసారి ప్రచారంలో భాగంగా పలకరించిపోతారు తప్పా ఆ ప్రాంతపు సమస్యలను గురించి, అభివృద్ధి పనులను గురించి కానీ అధికార ప్రభుత్వాలకు తెలియజేసే నాథుడే కరువయ్యారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలు కలవు. విజయనగరం, విశాఖపట్నం జిల్లా గురించి ప్రక్కనపెట్టి శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడినట్లయితే ఈ రెండు జిల్లాలతో పోల్చితే అత్యంత వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం. ఈ ప్రాంతం ఎక్కువగా వలసలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా పేరొందింది. ఎందుకంటే ఈ జిల్లాలో భూమి లేని నిరుపేదలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంకొంతమందికి పూట గడవటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి భూమిలేని నిరుపేదలు, భూములు ఉన్న రైతుల వద్ద పనిచేయటం వల్ల వారు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వకుండా వారి శ్రమను దోచుకోవటం వల్ల వారి సంపాదన పైనే పెద్ద దెబ్బపడినట్లయ్యింది. సంపాదనను ప్రక్కన పెడితే వారికి చెల్లించే డబ్బులు కుటుంబ పోషనకు సరిపోయేవి కావు. అది ఒక ప్రధానకారణమైతే ఈ ప్రాంతంలో సరైనపరిశ్రమలు లేకపోవటం అనేది కూడా వారు ఆ ప్రాంతంలో స్థిరపడలేకపోవటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతపు ప్రజలు క్రమంగా వలస జీవితాలను ప్రారంభించవలసి వచ్చింది. అటువంటి వలస బ్రతుకు జీవులను గురించి ప్రత్యక్షంగా చూసిన శ్రీకాకుళం జిల్లా కవి లండ సాంబమూర్తి  కలత చెంది ఆ వలస జీవుల వెతల సమస్యల స్పందించి కవిత్వాన్ని వెలువరించిన కవి  యొక్క కవితలను ఇందులో వివరించబోతున్నాను.

2. లండ సాంబమూర్తి – పరిచయం :

శ్రీకాకుళం జిల్లాలో నేటి తరం కవులు తమ కవిత్వం ద్వారాసమాజాన్ని గురించి, ఆ ప్రాంతపు సమస్యల గురించి తన కలం ద్వారాతెలియజేస్తున్న కొద్ది మంది రచయితల్లో లండ సాంబమూర్తి ముందు వరుసలో ఉంటాడనటంలోఅతిశయోక్తి లేదు. “ఒక కవిగా మిగిలిపోవడానికి/  ఎన్నిసార్లు మరణించి/  మళ్ళీ మళ్ళీ మొలకెత్తానో లెక్కలేదు" అంటూ "నేను కలం పట్టాక/ నాలో లోలోన ఏదోతృప్తి/ కవిత్వం నన్ను నడిపించే దీప్తి"  (గాజు రెక్కల తూనీగ. పుట – 14) అంటాడు సాంబమూర్తి.

లండ సాంబమూర్తి శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు (మండలం) ఒంకలూరు గ్రామంలో సుమిత్ర, రామస్వామి దంపతులకు 1980 అక్టోబర్20న జన్మించారు. ఈయన ఎం.ఎస్సీ (మ్యాథమ్యాటిక్స్), ఎం.ఎ (ఎడ్యుకేషన్), బి.ఎడ్.విద్యార్హతలు కలిగి ఉన్నారు. చదివిన చదువు వేరయినప్పటికి తెలుగుసాహిత్యం పై ఉన్నఅభిమానంతో,ఇష్టంతో ఎన్నో రచనలు తన కలం ద్వారా అందించగలుగుతున్నారు. వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయునిగా దాదాపు 17 సంవత్సరాల నుండి తమ సేవలను అందించగలుగుతున్నారు. సాధారణంగాకవులు కలల్ని నింపుకుంటారు. కవితల నిండా కలల్ని వొంపుతుంటారు. కలలు మంచివే కావచ్చుమంచిని కోరేవే కావచ్చు. ఆదర్శపూరితాలవ్వచ్చు. కానీ అన్ని కలలూ సాకారం కావు, అందుకేనేమో ఓ సినీ కవి "కలలేమనకు మిగిలిపోవు కలిమి చివరకూ, ఆకలిమిని కూడా దోచుకునే దొరలు యెందరో”అంటాడు.

సాంబమూర్తిగా కలలు కనడాన్ని ప్రజలకు విడిచిపెట్టారు. ప్రపంచమంతా కాసిన్ని కలల్ని కప్పుకొని నిద్రపొమ్మంటాడు. వారి కలలు చెదిరిపోకుండా చౌరస్తాలో నిల్చోని అక్షరాలకు పహారా కాస్తుంటానంటాడు. అందరి నిస్సహాయతలను భుజాన మోస్తానంటాడు. సాంబమూర్తి. ఈయన రాసిన 'గాజురెక్కల తూనీగ' , “నాలుగు రెక్కల పిట్ట” ఈ రెండు  కవితా సంపుటిలో ఆ ప్రాంతపు సామాన్య  ప్రజల  ఆశలు, ఆక్రోశాలు, ఆవేశాలు, ఆక్రందనలు, నీవీ, నావీ, అందరివీ! సరిహద్దు కాపలా కాసే సైనికుల నుంచి పక్కదనాల పల్లె పరాయీకరణ దాకా, రైతు, కార్మికుడు, ఉద్యోగీ యెందరెందరి జీవితాల్లో కావ్యవస్తువులైనాయి.

రచనలు :

  1. గాజురెక్కల తూనీగ (కవితా సంపుటి) - ప్రచురణ - 2020
  2. నాలుగు రెక్కల పిట్ట (కవితా సంపుటి) - ప్రచురణం - ఆక్టోబర్ 2022

3. సాహిత్యకృషి - గుర్తింపు :

ఈయన చేసినసాహిత్య కృషికి మెచ్చి వివిధ సంస్థలు, సంఘాలవారుఈయనకు వివిధ బహుమతులతోపాటు, సత్కారాలు చేశారు. 1. బాలసాహిత్యంలో చేసిన కృషికిగాను “బాలరంజని” ఆంధ్రప్రదేశ్, బాలమిత్ర పురస్కారం 2018లో అందుకున్నారు. 2. ఎక్స్-రే ఉత్తమ కవితా అవార్డ్స్ (2009). 3. నవమల్లెతీగ పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి (2019) 4. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, శ్రీకాకుళంవారు నిర్వహించిన ఉపాధ్యాయ రంగస్థలం సంక్రాంతి కవితల పోటీల్లో ప్రథమ బహుమతి (2020).

4. నగరానికి పోయిన వలస జీవుల వెతలు:

“గాజురెక్కల తూనీగ” అనే కవితలో లండ సాంబమూర్తి నగరానికి వలసపోయిన కూలీల వ్యధనుగురించి   తెలియజేస్తూ ఇలా అంటాడు.
                       "నగర వీధుల్నిండా నిశ్శబ్దం ప్రవహిస్తుంటుంది
                         నగరపు పొడారిన పెదాల పైనుంచొక
                         నిర్లిప్తగీతం 
                       సన్నగా రోజు జారుతుంటుంది." (గాజు రెక్కల తూనీగ పుట. 122)                      
                         "పెద్దగా అలవాటు లేని నగరంలో
                            పల్లెల్లోంచి  వచ్చిన
                            పచ్చనిసీతాకోక చిలుకలు
                            ఉక్కిరిబిక్కిరవుతుంటాయి." (గాజు రెక్కల తూనీగ. పుట. 123)
అని పల్లెటూరులో బ్రతకటానికి సరైన కూలీ లభించక పట్నం వైపు పయనమవుతుంటారు వలస జీవులు. అటువంటి పల్లెటూరు నుంచి వచ్చిన వలస జీవులకు నగరాల్లో సరిపడని గదుల్లో జీవనం సాగిస్తూ నగర వాతావరణానికి ఉక్కిరిబిక్కిరవుతుంటారు అని
  కవి యొక్క అభిప్రాయం.
              “అంతెత్తున నిలబడ్డ
               ఆకాశహర్మ్యాల నీడల మధ్య
               జీవితం మాత్రము
               ఎప్పటికీ “గాజురెక్కల తూనీగే!" (గాజు రెక్కల తూనీగ పుట. 42)

అంటూ నగర వికృత స్వభావాన్ని బట్టబయలు చేస్తారు. నగరంలో పూనే చెమట పూలపై కూసింత మానవత్వాన్ని చిలకరిస్తూ వాడిపోకుండా చూసుకోవాలంటూ వలసకూలీల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటాడు.

5. కరోన కాలంలో వలస జీవుల స్థితి:

“చెమట పూలు” అనే కవితలో సాంబమూర్తి వలస జీవుల వెతలను గురించి తెలియజేస్తూ
                 "సొంతూరులో కాసింత పనిపుట్టక
                   పొట్టచేత్తోపట్టుకుని
                   కాంక్రీటు వనాలకు ఎగురొచ్చిన సీతాకోకలు
                    మాల్స్ తళుకుల్లో వాళ్ళ కన్నీటి ఆనవాళ్ళుంటాయి
                    ఊపిరిపోసుకున్న ప్రతి పరిశ్రమలోనూ
                   వాళ్ళ ఉచ్ఛ్వాసనిశ్వాసాలుంటాయి"  (గాజు రెక్కల తూనీగ. పుట. 42)
అంటూ ఈ కవితలో కరోనా కాలంలో వలస జీవుల వెతలను గురించి తెలియజేశాడు. సొంత ప్రాంతంలో   పనిదొరక్క పనిదొరికినా పనికి తగ్గ ఫలితం (కూలీ) లభించకపోవడంతో ఎంతో మంది సామాన్యులు పనికోసం పట్టణాలకు చేరుకుంటున్నారు. వాళ్ళ కష్టంతోనే ఎన్నో పరిశ్రమలు, మాల్స్ నిర్మాణాలు  జరగటంతో వాళ్ళ ఆనవాళ్ళును గుర్తిస్తున్నాడు. కరోనా కాలంలో వలస పిట్టలు పడిన బాధలను గురించి వివరిస్తూ......
                  "దేశం తలుపులు తెరుచుకునే వరకైనా
                  ఆకలి కొండచిలువ వాళ్ళను మింగేయకుండా చూడాలి
                  గూడు విడిచి సుదూరాలకు తరలివచ్చిన
                  వలస పిట్టలకింత ధైర్యాన్ని వడిచిపట్టాలి''  (గాజు రెక్కల తూనీగ పుట. 43)    
అని ఊరు, ఇళ్లను విడిచి వచ్చి శ్రమ చేస్తున్న ఆ శ్రమజీవుల శ్రమను దోచుకోకుండా, ఆకలి బాధలు    తెలియకుండా వారికి రావలసిన ప్రతిఫలాన్ని ఇచ్చి, వారిలో కొంత ధైర్యాన్ని నింపి నగరంలో పూసే ఆ"చెమట పూల" పై కాసింత మానవత్వాన్ని చిలకరిస్తూ వాళ్ళను వాడిపోకుండా చూడమంటాడు కవి. పై రెండు కవితలను లండ సాంబమూర్తి రచించిన కవిత్వ సంపుటి "గాజురెక్కల తూనీగ" నుండి తీసుకొనివివరించటం జరిగింది.

6. ఉద్దానం ప్రాంతంపు ప్రజల వలస జీవితం :

“వలస రైలుబండి” అనే కవితలో సాంబమూర్తి తమ సొంత ప్రాంతం అయిన “ఉద్దానం” దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్ళే వలస పిట్టలు గురించి వివరించారు.
              "ప్రపంచ పటం మీద
               నా ఊళ్ళు కాళ్ళుపెట్టని ప్రదేశమంటూ లేదు.
                నా ఊళ్ళో వలసపిట్ట కూయని
                 కొమ్మంటూ ఏదీ లేదు" అంటాడు. (గాజు రెక్కల తూనీగ. పుట. 129)
అలా అనటంలో ఎంత నిగూఢ అర్ధం దాగి ఉన్నదో మనకి అర్థమవుతుంది. శ్రీకాకుళం అంటేనే ప్రపంచ నలుమూల ఎక్కడ చూసిన అక్కడి ప్రాంతపు ప్రజలు ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఆ ప్రాంతంలో వలసలు పోకుండా ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ మోతాదులో ఉంటుందంటాడు కవి.
                 "అసంఘటిత మరభూముల్లో
                   ఏ కలలూ మొలకెత్తవు ఉద్దానపు తీరాల్ని
                   చీకటి తుఫాన్లే తప్ప
                    ఏ వెలుగులూ పలకరించవు ” (గాజు రెక్కల తూనీగ. పుట.130)
అంటూ ఈ ఉద్దానం ప్రాంతపు ప్రజల్లో ఎటువంటి భవిష్యత్ ఆశయాలు ఉండవు. వీరు ఆ క్షణం ఎలా గడుస్తున్నదో అన్న విషయాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ వీరిలో ఎటువంటి కొత్త కలలు అనేవి మొలకెత్తవు. ఇటువంటి ఈ సమస్యల ప్రాంతాన్ని సందర్శించాలంటే అధికారులు సైతం భయభ్రాంతులకు గురయ్యి వారి కష్టాలు తీర్చటంలో మొండి చెయ్యి చూపిస్తున్నారు. అందుకనే కవి ఈ ఉద్దానపు తీరాల్ని చీకటి తుఫాన్లే తప్ప ఏ వెలుగులూ పలకరించవు అంటున్నాడు.
                           “ఇక్కడ ఐదేళ్ళకోసారి
                            రంగులు మారుతుంటాయి
                            మా "వలస రైలుబండి"
                           ఎక్కే దిగే స్టేషన్లు మాత్రం మారవు" (గాజు రెక్కల తూనీగ. పుట. 50)
ఆ ప్రాంతపు ప్రజలకు ఎటువంటి కలలుండవు, ఉన్నప్పటికీ వాటిని సాకారం చేసేందుకు అవకాశాలు తక్కువ అని చెబుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ ప్రాంతపు ప్రజల యొక్క సమస్యను పట్టించుకోకుండా, కనీస అభివృద్ధి అనేది లేకుండా జీవిత పర్యంతం తమ పరిస్థితి అంతేనేమో అని ఆందోళన చెందుతున్న ప్రజలు గురించి “ఐదేళ్ళ కొకసారి ప్రభుత్వాలు మారినా' ఆ వలస రైలుబండి ఎక్కే దిగే స్టేషన్లు మాత్రం మారటం లేదని కవి తన ఆవేదనని తెలియజేస్తున్నాడు.

7. ముగింపు:

సాంబమూర్తి కవిత్వమంతా కష్టజీవుల పక్షమే. వారి వేదనలు, కష్టాలు, కన్నీళ్లూ ఇతని కవిత్వం నిండా విస్తారంగా కనిపిస్తాయని వలసలకు సంబంధించిన కవితలను పరిశీలిస్తే అర్థమవుతుంది. తన ప్రాంత ప్రజలు జీవన పోరాటంలోని ఎగుడు దిగుడులను ఆకవి దారిద్ర్యాలను వలస జీవితంలోని సాధకబాధకాలను తాను తీసుకున్న వస్తువు పట్ల నిర్ధిష్టమైన చూపు ఉంది. కనుకనే అతని కవితల్లో ఒక నిర్దిష్టత ఉంది చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా తనదైన శైలిలో చెబుతాడు.అంతేకాకుండా కవిత్వ ప్రక్రియ ద్వారా ఆ ప్రాంతపు ప్రజల వలసలు బాట పట్టి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను బయట ప్రపంచానికి తెలియజేయటానికి ఒక సాహసం చేసిన మొదటి వ్యక్తిగా లండ సాంబమూర్తిని చెప్పవచ్చు. లండ సాంబమూర్తి  లాంటి కవులు ఇంకా కొంత మంది ఆ ప్రాంతపు ప్రజలు వలసల  బాట పట్టి ,అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను  గుర్తించి, వాటి పైన తమ కలాలతో  స్పందించినట్లైతే సమాజానికి ఆ ప్రాంతపు ప్రజల పడుతున్న బాధలు  అర్థమవుతాయి.

ముఖ్యంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆ ప్రాంతపు ప్రజల వలస జీవితాల పై స్పందిచి  వారి తమ సొంత ప్రాంతం లో ఉపాధి దొరికి సరైన కూలీ రేట్లు లభించేటట్లు చేసి వారికి  ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించినట్లయితే వలస జీవితాలను వాదిలి తమ ప్రాంతంలో నివశిస్తు ప్రాంత అభివృద్దికి పాత్రులు కాగలరాని ఆశిద్దాం.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగాధర్, మంచాల. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణలు – ఒక విశ్లేషణ.
  2. భుజంగరావు, కంచరాన. (2023).  నీటి గింజల పంట. దక్కన్ ప్రెస్, హైదరాబాద్.
  3. ముత్యం, కె. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం, శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ.
  4. వెంకట్. (2007). శ్రీకాకుళంజిల్లా గిరిజన రైతాంగ ఉద్యమం -  మైత్రిబుక్ హౌస్, విజయవాడ.
  5. సత్యనారాయణ, మానేపల్లి. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం జన సాహితి మైత్రి బుక్హౌస్, విజయవాడ.
  6. సాంబమూర్తి, లండ. (2020) . గాజురెక్కల తూనీగ. చరిత్ర ఇంప్రెషన్, హైదరాబాద్.
  7. సాంబమూర్తి, లండ. (2022). నాలుగు రెక్కల పిట్ట. లిశoక ప్రింట్ సొల్యూషన్, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]