AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. 'బోయకొట్టములు పండ్రెండు' నవల: స్త్రీపాత్రల చిత్రణ
డా. తంగి ఓగేశ్వరరావు
తెలుగు అధ్యాపకులు,
వి.వి. గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడప,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె రాసిన ఈ ‘బోయకోట్టములు పండ్రెండు' అనే చారిత్రిక నవలలో క్రి.శ.7- 9 శతాబ్దాల ఆంధ్రదేశం నందలి చారిత్రక, సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు వాస్తవికంగా చిత్రించబడ్డాయి. ఈ నవల ఆధారంగా మధ్యయుగప్రారంభదశలో ఆంధ్రప్రాంతం స్థితిగతులను విశ్లేషనాత్మకంగా అధ్యయనం చేయడంతోపాటు, అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో బోయలు వంటి అనాగరికజాతులు ఏవిధంగా తమ అస్తిత్వం కోసం పోరాటం చేశాయో వివరించడం, ఈ కాలంలో ఆ సమాజాలలోని స్త్రీలు నిర్వర్తించిన పాత్రను కూడా తెలిజేయడం ఈ వ్యాసప్రధానోద్దేశం. ఈ పరిశోధనకు అవసరమైన సమాచారం వి.వి.గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడప గ్రంథాలయం, https://archive.org. నుండి స్వీకరించాను.
Keywords: బోయలు, చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, వేంగి, కంచి, జయసింహవల్లభుడు, విష్ణువర్ధనుడు, విలుకాండ్రు.
1. ఉపోద్ఘాతం:
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె 1936 ఫిబ్రవరి 1న చిత్తూరు జిల్లా తలుపులపల్లెలో జన్మించారు. ఆయన చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసి, 1994 లో కలిచెర్ల ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె తన పూర్తి సమయాన్ని తెలుగు భాషాభివృద్ధికే వినియోగించారు. అచేతన స్థితిలో ఉన్న మదనపల్లె రచయితల సంఘంలో తిరిగి చైతన్యం నింపారు. తెలుగు సాహిత్యంలో పద్యం, నవల, కథ, వ్యాసం, నాటకం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేశారు. అతని రచనలలో పేరొందిన రచన ‘బోయకొట్టములు పండ్రెండు’.
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె పండరంగని అద్దంకి శాసనం ఆధారంగా రచించిన చారిత్రక నవల ‘బోయకొట్టములు పండ్రెందు’.
“----భూపాలకుండు
పట్టంబు గట్టిన ప్రథమంపు నేడు బలగర్వమొప్పంగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు బంచిన సామంత పదువతో బోయ
కొట్టముం ల్వండ్రెండు గొని వేంగినాటి గొఱల్చియ త్రిభువనాంకుశ బాణనిల్పి
కట్టెపు దుర్గంబు కదు బయల్సేని కందుకుర్బెజవాడ గావించె మెచ్చి
పండురంగు పరమ మహేస్వరుండు ఆదిత్య బటరనికి ఇచ్చిన
భూమి ఎనుబొది వుట్ల ఆడ్లు పట్టు నేల ధర్మపురంబున
ధర్మువులు వీని రక్షించిన వారికి అస్వమేదంబున ఫలంబు అగు”1 .
ఇదే పండరంగని అద్దంకి శాసనం. ఈ శాసనాన్ని క్రీ.శ. 848 లో చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగడు పల్లవులపై తన విజయానికి చిహ్నంగా అద్దంకిలో నెలకొల్పాడు. అద్దంకి శాసనంలో పేర్కొన్న బోయలు ఎవరు? వారు ఎక్కడి వారు? వారిని పండరంగడు ఎందుకు జయించాడు? కట్టెపుదుర్గాన్ని ఎందుకు నేలమట్టం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాల్ని ఊహించి కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలను రచించారు. లభిస్తున్న చారిత్రక సత్యాలకు కొంత కల్పనలను జోడించి ఈ చారిత్రక నవల్ని రచించారు.
ఈ శాసనం వేంగి చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని కీర్తికి, అతని సేనాని పండరంగని పరాక్రమానికి ప్రతీకగా నెలకొల్పబడింది. కాని బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె “ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునపడి కాన్పింపని కథలన్నీ కావాలిప్పుడు”2 అన్న శ్రీశ్రీ మాటలకు కట్టుపడి బోయవీరులపక్షం వహించి వారి విషాదగాధను నవలగా తీర్చిదిద్దారు. ఈ నవల్లో కొట్టం అనగా పల్లవ రాజ్యంలో పరిపాలన విభాగం. ఇది నేటి రెవిన్యూ మండలంగా భావించవచ్చు.
2. బోయకొట్టములు పండ్రెండు నవల - ఇతివృత్తం:
ఈ నవలలోని సంఘటనలు క్రీ.శ. 614 వ సంవత్సరంలో ప్రారంభమై క్రీ.శ. 848 వ సంవత్సరం వరకు ఇంచుమించు 220 సంవత్సరాలపాటు కొనసాగుతాయి. ఈ నవలలో బోయల ఏడు తరాల చరిత్రను రచయిత వివరించారు. రాష్ట్రకూటులకీ చాళుక్యులకీ మధ్య జరిగిన యుద్ధాలలో త్రిపురాంతకం ప్రాంతంలోని బోయలు నలిగిపోయి, తమ జీవనం కోసం అణ్డెక్కి(అద్దంకి) ప్రాంతానికి బయలుదేరడంతో ఈ నవల ప్రారంభమవుతుంది. మొదటి వీరనబోయడు, అతని భార్య మంగసాని పల్లవుల ప్రాపకాన్ని సంపాదించి గుండ్లకమ్మ, మూసీ నదుల మధ్య ప్రాంతంలో స్థిరపడతారు. క్రమంగా ఈ ప్రాంతం పన్నెండు బోయకొట్టాలుగా విస్తరిస్తుంది. తర్వాత కాలంలో వీరి వారుసులైన రెండవ వీరనబోయాడు, కసవనబోయాడు, పులిరాజు, నన్ని, పొన్ని బోయలు ఒకప్రక్క చాళుక్యులకూ మరొక ప్రక్క పల్లవులకు సామంతులుగా ఉంటూ పరిణామం చెందిన తీరును, అదేవిధంగా వారి సామ్రాజ్య కాంక్షకు బలైన తీరును ఈ నవలలో బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె అద్భుతంగా చిత్రించారు. మధ్యయుగ ప్రారంభదశలో ఆంధ్రదేశంలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలను ఈ నవల వాస్తవికంగా చిత్రించింది.
సత్యాశ్రేయ పులకేసి, కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహవల్లభుడు, గుణగ విజయాదిత్యుడు వంటి చాళుక్య రాజులనూ, జయవర్మ, నందివర్మ, ఉదయచంద్రుడు వంటి పల్లవ రాజులనూ ప్రధాన పాత్రలుగా తీసుకొని వీరిద్దరికీ సమాంతరంగా బోయకోట్టాల చరిత్రను రచయిత వాస్తవికంగా చిత్రించారు. ఈ నవలలో పల్లవ, చాళుక్య రాజుల పేర్లను రచయిత యథాతదంగా తీసుకున్నారు. కాని ఒక్క పులిరాజు తప్ప మిగిలిన బోయల పేర్లు చారిత్రక సాక్ష్యాలకు, తన ఊహలకు అనుగుణంగా రచయిత సృష్టించినవే.
ఈ నవలలో ఒకటవ వీరన బోయడు- మంగసాని, రెండవ వీరనబోయడు- జయశ్రీ, సంపంగి, కసవనబోయడు- పృధ్వీవ్యాఘ్రరాజు (పులిరాజు), నన్ని బోయడు- పొన్ని బోయడు, పొన్ని బోయడు- వకుళ, గుణగ విజయాదిత్యుడు- పండరంగడు ఇత్యాది ప్రధాన పాత్రల చుట్టూ జరిగిన ఘట్టాలు తొలి మధ్యయుగ చరిత్రని మన ముందు ఉంచుతాయి.
ఈ నవల ప్రఙ్నన్నయ్య యుగపు విజ్ఞాన సర్వస్వంలా ఉంది. అనేక విషయాలపైన నవలలో సమాచారం అందించారు పిళ్ళె. ఏనుగులు పట్టే విధానం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, విలువిద్యా ప్రదర్శనం, యుద్ధతంత్రాలు, నాటి శిక్షావిధానాలు, సాతులు, సంతలు, పన్నులు, ఇసుక గడియారాల నిర్మాణం, నాటక ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు, ఆలయనిర్మాణం, కోటలు కట్టుకోవడం, ఊర్లు ఏర్పడటం - ఒకటేమిటి అనేక విషయాలపైన దృష్టిని సారించింది ఈ నవల.
బోయకొట్టాల చరిత్ర చెబుతూనే ఆ కాలంలో ముఖ్యంగా చాళుక్యులు తెలుగు దేశికవితకు ఎలా పునాదులు వేశారో పిళ్ళె వివరించారు. “తెలుగు దేశికవితకు పునాదులు వేసిన చాళుక్య నృపులు ఎవరు? ఖచ్చితంగా రాజరాజ నరేంద్రుడు కాదు. ఎందుకనగా నన్నయ్యకు పూర్వమే తెలుగువారు గాసట బీసట అయిన తెలుగు దేశికవితను చదువుచుండినారు. కావున దేశికవిత పుట్టించి తెనుంగున నిలిపినవాడు సత్యాశ్రయుడే కావలయును”3 అని పిళ్ళె ఊహించారు. నన్నయ్యకి పూర్వం తెలుగు సాహిత్య స్వరూపం అంచన వేయడానికి ఈ నవల ఉపయోగపడుతుంది. దేశీయఛ్చందాల పుట్టుకను ఎంతో చమత్కారంగా వర్ణించారు. అందుకోసం యతులు, ప్రాసలు, సంధులు లేని కొన్ని పద్యలను కూడా రచించి, తెలుగు పద్యం ప్రాథమికదశలో ఇలా ఉండవచ్చునని చూపారు. “తెలుగులో కవిత్వము పుట్టలేదు కాని తెలుగు వారు కవిత్వము చెప్పినారు. తమిళంలో ‘తిరుక్కురళ్’ కంటే ముందే తెలుగువారు కవిత్వం చెప్పియున్నారు. ‘తిరుక్కురళ్’లో సూక్తులు మాత్రమున్నవి. తెలుగువారి కవిత్వము నానారస భరితము”4 అని గాథాసప్తశతి ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు.
3. బోయకొట్టములు పండ్రెండు నవల - స్త్రీ పాత్రల చిత్రణ :-
3.1 మంగసాని:
ఈమె మొదటి వీరనబోయని భార్య. నల్లని శరీరచ్చాయ, విశాలమైన ముఖం, నొసటిపై పెద్ద కుంకుమబొట్టు, ముక్కుకు కుడివైపున రాయి పొదిగిన ముక్కెర, ముక్కు నుండి పెదవిపైకి వ్రేలాడే బులాకి, చెవులకు బం బుగడలు, మెడలో బం తాళిబొట్టు, చేతులకు గాజులతోపాటూ వెండి మురుగులు, కాళ్ళకు వెండి కడియాలు ఇలా చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉంటుంది మగసాని.
మొదటి వీరనబోయడు జీవించి ఉన్నంతకాలం ఇంటి వద్ద పిల్లల పెంపకం, ఇంటి పనులన్ని తానే చూసుకునేది. అతని మరణాంతరం మనుమలు చిన్నవాళ్ళు కావడంతో బోయకొట్టాల పరిపాలనా బాధ్యతలను కూడా తానే నిర్వర్తించవలసి వస్తుంది. ఒకసారి బోయ పిల్లలకూ, బోయకొట్టాల గుండా ప్రయాణం చేసే వ్యాపారులకు మధ్య వివాదం వస్తుంది. వ్యాపారులు బోయ పిల్లలను కొడతారు. ఈ విషయం తెలిసిన బోయ యువకులు వారిపై దాడి చేస్తారు. దీనితో వ్యాపారులు తమ వస్తువులను, బండ్లను వదిలివేసి వంగవోలుకు పారిపోతారు. ఈ విషయం తెలిసిన మంగసాని బోయ యువకులను మందలిస్తుంది.
“మనము పల్లవుల అండను చేరినామని చాళుక్యులకు ముందుగానే మనమీద కన్నెఱ్ఱగానున్నది. ఈ వర్తకులు సందు చూసుకొని ఈ వృత్తాంతమును చిలువలు పలువలుగా వర్ణించి, లేనిపోనివి కల్పించి చాళుక్యు ప్రభువుల వద్ద మొఱపెట్టుకొన్నచో చాళుక్యులు ఏమి చేయుదురో”5 అని మంగసాని వర్తకుల వల్ల వచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తుంది. దీనిని బట్టి మంగసాని దూరదృష్టి కలిగిన నాయకురాలని స్పష్టమౌతుంది.
చాళుక్యరాజైన జయసింహ వల్లభుడు అద్దంకి దుర్గాన్ని ఆక్రమించుకుంటాడు. అక్కడినుండి బోయకొట్టాలపై దాడి చేయడానికి బయలుదేరుతాడు. ఆ విషయం తెలిసి బోయలు ఆందోళన చెందుతారు. బోయలను కాపాడవలసిన బాధ్యత మంగసానిపై అడుతుంది. “ఝంఝామారుతము నెదిరించి తాటిచెట్టు కూలిపోవుచున్నది. తలవంచుకొనిన గడ్డిపోచ తరువాత తల యెత్తుకొని నిలబడుచున్నది. ప్రస్తుతమునకు అదియే రాజనీతి”6 అని భావించి మంగసాని ఎదురేగి జయసింహ వల్లభునికి స్వాగతం పలుకుతుంది. కానుకలు సమర్పించుకుంటుంది.
తన మనుమల చేత చాళుక్య రాజుకు సాష్టాంగ నమస్కారం చేయిస్తుంది. ఈ హఠాత్పరిణామానికి జయసింహ వల్లభుడు ఆశ్యర్యపోతాడు. ‘మా రాజ్యానికి వస్తున్న వ్యాపారులకు ఎందుకు సుంకం అడి? ఇవ్వనందుకు వారి వస్తువులు దోచుకున్న విషయం వాస్తవమేనా?’ అని చాళుక్యరాజు మంగసానిని ప్రశ్నిస్తాడు.
అప్పుడు మంగసాని “చిత్తము చిత్తము. దేవరవారికి అంతయు ఎఱుకయే. ఎవరెన్ని కల్పించి చెప్పినను దేవరవారి సూక్ష్మదృష్టికి యథార్ధమంతయు తేటతెల్లమే. సుంకమడుగు వారు దోచుకొనరు. దోచుకొనువారు సుంకమడుగరు. బచ్చుల సరుకులను ఎవరును దోచుకొనలేదు. వారే వదిలిపెట్టిపోయిరి. వారి సరుకంతయు భద్రముగానున్నది. వారు ఎప్పుడైనను వచ్చి తీసుకొని పోవచ్చును ....ఎంతకాలమైనను అవి అక్కడ నవసి పోవలసినదేకాని ప్రాణము పోయినను పరుల సొమ్ము సున్నపాకు తొడిమైనను తాకము”7 అని సమాధానమిస్తుంది. ఇలా నీతి నిజాయితీలతో కూడిన రాజనీతిజ్ఞురాలిగా కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె మంగసాని పాత్రను తీర్చిదిద్దారు.
జయశ్రీ, రెండవ వీరనబోయడు ఒకరికొకరు ఇష్టపడటం, వారికి జయపాలుడి సహకారం ఉండటం గమనించిన మంగసాని “ఈ నాగరికులు బహుటక్కరి వారు. పండువంటి పిల్లవానిని చూచుచు వదిలిపెట్టరు. పట్టి బుట్టలో వేసికొందురు. తరువాత వగచి లాభము లేదు. ఈ మధ్య వీడు ఏదో ఒక నెపము మీద వినుకొండకు ఒకటి రెండు సార్లు వెళ్ళి వచ్చినాడు. తన వంశరక్తము నందు వేరే వంశ రక్తము కలియరాదు. తన బోయలలోనే తగిన పిల్లను ఎన్నుకొని కట్టబెట్టవలె”8 అని భావించి బేత కొట్టం పెద్ద దొర చెన్నుబోయని కుమార్తె సంపంగితో రెండవ వీరనబోయడి వివాహం జరిపిస్తుంది.
ఈ విధంగా ధైర్యానికి, సమయస్పూర్తికి, రాజనీతికి నిలువెత్తు నిదర్శనంగా రచయిత మంగసాని పాత్రను చిత్రించారు.
3.2 జయశ్రీ:
ఈమె చాళుక్యుల ఆడపడుచు. ధనపాలుని కూతురు. జయపాలుని సోదరి. రెండవ వీరనబోయడ్ని ఇష్టపడుతుంది. అతనికి సంపంగితో వివాహం జరిగిపోయినా కానీ, జయశ్రీ అతనిపై తన ప్రేమను మాత్రం వదులుకోదు. కార్తికేయ దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవానికి ధనపాలుని కుటుంబం బోయకొట్టాలకు వస్తుంది. అక్కడ ఒకానొక సందర్భంలో జయశ్రీ ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. తాను పెళ్ళంటూ చేసుకుంటే తాను ప్రేమించిన వ్యక్తినే చేసుకుంటానని జయశ్రీ చెబుతుంది. చివరికి అక్కడ ఉన్న వారందరూ ఒత్తిడి చేయడంతో తాను ప్రేమించిన వ్యక్తి రెండవ వీరనబోయడే అని చెబుతుంది. గత్యంతరం లేని పరిస్థితులలో రెండవ వీరనబోయడు జయశ్రీని రెండవ వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి ఎటువంటి పరిస్థితులలోనైనా తన అభిప్రాయం ధైర్యంగా చెప్పగలిగిన స్త్రీ జయశ్రీ అని తెలుస్తుంది.
బోయల ఆదరం, ఆత్మీయత జయశ్రీకి బాగా నచ్చుతాయి. కాని వారి అనాగరికత ఆమెకు అంతగా నచ్చదు. గట్టిగా మాట్లాడడం, మోటు హాస్యం, వరసలు కలుపుకొని మాట్లాడటం ఆమెకు నచ్చదు. తన భర్త పన్నెండు బోయకొట్టాలకు రాజు, తాను రాణి అని జయశ్రీ భావిస్తుంది. ఆ విషయాన్ని బోయలు గుర్తించడం లేదని బాధ పడుతుంది. ఇలా అధికార దర్పం ప్రదర్శించాలనే భావన అణువణువున జీర్ణించుకున్న స్త్రీగా జయశ్రీ కనిపిస్తుంది.
బోయకొట్టాలలో వివాహం అనుకోకుండా జరిగిపోవడంతో రెండవ వీరనబోయడిని, జయశ్రీని ధనపాలుడు వినుకొండకు తీసుకెళ్తాడు. అక్కడ ధనపాలుని బంధువులు నూతన దంపతుల పట్ల ఎంతో ఆప్యాయత కనబరుస్తారు. బోయకొట్టాల నాయకుడు వినుకొండకు వచ్చిన విషయం తెలిసిన వినుకొండ దుర్గాధ్యక్షుడు అతనిని తన గృహానికి ఆహ్వానిస్తాడు. వీరనబోయడ్ని ఎంతగానో గౌరవిస్తాడు. వీరనబోయని విలువిద్యా నైపుణ్యాని చూసి ముగ్ధుడవుతాడు. తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి. వీరనబోయని మెడలో అలంకరిస్తాడు. “ఆనాడు జయశ్రీ సంతోషమునకు పట్ట పగ్గములు లేకుండెను. పుట్టినింటిలో తన ప్రతిష్ఠ దేవాలయ ధ్వజమంత ఎత్తుకు పెరిగిపోయింది”9 అని రచయిత జయశ్రీ మానసిక స్థితిని మనముందుంచే ప్రయత్నం చేశారు.
జయశ్రీకి నలుగురు కుమారులు జన్మిస్తారు. పెద్దకుమారుడు జన్మించినప్పుడు రెండవ వీరనబోయడి పినతల్లి అన్నెమసాని ఆ బాలుడికి పులిరాజు అని పేరు పెడుతుంది. కాని ఆ అచ్చతెలుగు పేరు జయశ్రీకి నచ్చదు. తన కొడుకు పేరు ఘనంగా ఉండాలని భావించి అతనికి పృద్వీవ్యాఘ్రరాజు అని పేరు పెడుతుంది. చాళుక్యులు తెలుగుభాషకు చేయూతనిచ్చి ముందుకు తీసుకోస్తూ ఉండగా ప్రజలలో విద్యావంతులయిన వారు ఇంకా సంస్కృత వ్యామోహం వదలలేదని రచయిత జయశ్రీ పాత్ర ద్వారా మనముందుంచారు.
పులిరాజు అక్షరాభ్యాసం చేసే సమయంలో హరిశర్మ ‘ఓం నమశ్శివాయ’ అని రాయబోతాడు. అప్పుడు జయశ్రీ “ఈ సంప్రదాయము ఇప్పుడిప్పుడు వచ్చింది. అనేక తరములుగా తెలుగు సీమలో జైన సిద్ధుల పేరు మీద ‘ఓం సిద్ధం నమః’ అని వ్రాయించుటయే అలవాటులో నున్నది. ఆ పద్ధతి నెందుకు మార్చవలె”10 అని అతనితో వాదిస్తుంది. చాళుక్యరాజులు, రాజోద్యోగులు, ప్రముఖులు క్రమంగా శైవ మతం పట్ల ఆకర్షితులు అవుతుండగా స్త్రీలు, సామాన్య ప్రజలు ఇంకా జైన మతాన్ని అభిమానించారని జయశ్రీ పాత్ర ద్వారా రచయిత వివరించారు.
తన కొడుకు పులిరాజు కోనకొట్టం పెద్ద దొర మాచన బోయని కుమార్తెను ఇష్టపడుతున్న విషయం జయశ్రీకి తెలుస్తుంది. వెంటనే తన మేనకోడలూ, జయపాలుని కూతురూ అయిన మల్లికతో పులిరాజు వివాహం జరిపిస్తుంది. తల్లి, భార్య ఇద్దరూ చాళుక్య స్త్రీలు కావడంతో బోయపెద్దలు పులిరాజును దూరంగా ఉంచడం మొదలు పెడతారు. రెండవ వీరనబోయడి తర్వాత కసవనబోయడే బోయకొట్టాలకు నాయకుడిగా వారు తీర్మానించుకుంటారు. ఇది గమనించిన జయశ్రీ “ఇట్లే కొనసాగిన యెడల బోయకొట్టములలో పులిరాజు ఒక సామాన్యుడైపోవును. వీనికి వెంటనే బోయదొరలతో అనుబంధము ఏర్పరచవలె. ‘వీడు మనవాడే’, అను భావన వీరిలో కొందరిలోనైనను కలుగవలె”11 అని భావించి కొనకొట్టం పెద్దదొర మాచనబోయని కూతురు నాగసానితో పులిరాజుకు రెండవ వివాహం జరిపిస్తుంది.
ఈ విధంగా పెద్దవాడిని కాదని తన కుమారుడిని రాజుగా చేయాలనే దుర్భుద్ధిపరురాలుగా రచయిత జయశ్రీ పాత్రను చిత్రించారు. పులిరాజు, అతని తమ్ములు చేసే ప్రతి పనిని మంచి చెడులతో సంబంధం లేకుండా జయశ్రీ ప్రోత్సహిస్తుంది. వారు చేసే పనులు బోయకొట్టాల ఉనికికే ప్రమాదం అని తెలిసినా వాళ్ళకు జయశ్రీ అండదండలు ఉండటంతో వాళ్ళను నియంత్రించడంలో రెండవ వీరనబోయడు నిస్సహాయుడౌతాడు. చివరికి చాళుక్యుల అండచూసుకొని పులిరాజు పల్లవుకు ఎదురుతిరుగుతాడు. దీనితో పల్లవులు బోయకొట్టాలపై దాడి చేస్తారు. జయశ్రీ, ఆమె కోడలు మల్లిక, ఆమె మనుమలు బోయకొట్టాలను విడిచిపెట్టి వేంగికి పారిపోతారు. ఇలా తన ప్రవర్తన ద్వారా తన కుటుంబంతో పాటు బోయకొట్టాలకు కూడా అపకారం చేసే స్త్రీగా ఈ నవలలో జయశ్రీ కనిపిస్తుంది.
ఈ విధంగా తన మొండితనం, కొడుకుల పట్ల ప్రేమ, అధికార వ్యామోహం, నాగరికతా మోజు కలగలిసిన స్త్రీగా రచయిత జయశ్రీ పాత్రను చిత్రించారు.
3.3 అన్నెమసాని:
ఈమె రెండవ వీరనబోయని పినతల్లి. మంగసాని కోడలు. మంగసాని మరణాంతరం రెండవ వీరనబోయనికి మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. కార్తికేయస్వామి దేవాలయ ప్రతిష్టాపన సందర్భంలో అన్నెమసాని-
“మనము సన్యాసులముకాము. సంసారులము. ఆడువారము. పెండ్లి లేకుండ ఉండలేము. ఉండరాదు. ఆడది పెండ్లి చేసుకోవలె. బిడ్డలను కనవలె. వారిని పెంచి పెద్ద చేయవలె. మగవానికేమి? మహారాజు. మగవానికి నూరు పనులుండును. ఆడదే సంసారమును ఈదవలె. బిడ్డలను ప్రయోజకులను చేయవలె. వారికి పెండ్లిండ్లు చేయవలె. మనుమలను, మనుమరాండ్రను ఎత్తుకోవలె. చివరకు అందరికన్నుల ముందర తృప్తిగా కన్నుమూయవలె. మగవాడు నూరు విధములుగా బ్రతకవచ్చును. కాని ఆడుది బ్రతుకవలసిన పద్ధతి ఇది ఒకటియే. ఇది ఆడజాతి నొసట బ్రహ్మదేవుడు వ్రాసినవ్రాత”12 అని జయశ్రీతో అన్న మాటలను బట్టి ఆమె సామాన్య సంప్రదాయబద్ధమైన గృహిణి అని తెలుస్తుంది.
జయశ్రీ తాను ప్రేమించిన వ్యక్తికి వివాహం జరిగిపోయిందని చెప్పినప్పుడు అన్నెమసాని ‘ఒక వ్యక్తికి ఒకరకంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం తప్పుకాదు. మా మామకి ఇద్దరు భార్యలు, మావారికి మేము ఇద్దరం’ అని చెబుతుంది. ఈ మాటలను అవకాశంగా తీసుకొని జయశ్రీ తాను వీరనబోయడ్ని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. రెండవ వీరనబోయడి నుండి కూడా అవే సంకేతాలు రావడంతో గత్యంతరం లేక వారిద్దరికి పెళ్ళి చేస్తుంది.
“తన అత్త మంగసాని తీసుకున్న జాగ్రత్తయు, చేసిన భద్రకార్యమును ఒక్క క్షణములో గాలికి కొట్టుకొనిపోయినది. అన్య రక్త సంపర్కము తప్పిపోయినదని మంగసాని సంబరపడిపోయినది కాని అది ఇంత కాలము లోలోపల రగులుచుండునని ఆమె గ్రహింపలేకపోయెను”13 అని అన్నెమసాని విచారం వ్యక్తంచేస్తుంది.
జయశ్రీ, రెండవ వీరనబోయడు వివాహ అనంతరం జయశ్రీ పుట్టినిల్లు అయిన వినుకొండకు ప్రయాణమవుతారు. వినుకొండకు బయల్దేరే ముందు అన్నెమసాని రెండవ వీరనబోయడ్ని తన వద్దకు పిలిపించుకొని “వారి నాగరికత వేరు, మన నాగరికత వేరు. వారి అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. పడరాని ముడి ఏట్లో పడిపోయినది. వారి నాగరికతకు అలవాట్లకు మురిసిపోయి నీవు వాటిని అలవాటు చేసికొన్న యెడల ఇక్కడి మనవారికి దూరమైపోదువు. మనవారు నిన్ను పరాయి వానిగా భావింతురు. మన వారికి మనము దూరమైన తరువాత ఎంత గొప్పగా బ్రతికిన ఏమి ప్రయోజనము? జాగ్రత్త”14 అని అతడిని హెచ్చరిస్తుంది.
వినుకొండ నుండి బోయకొట్టాలకు వచ్చిన రెండవ వీరనబోయడు వినుకొండలో తన మామ కుట్టించిన నాగరికమైన దుస్తులు ధరిస్తాడు. అతనిని చూసి మిగతా బోయ యువకులు కూడా కందుకూరు, వంగవోలు వెళ్ళి అటువంటి దుస్తులు కుట్టించుకొని ధరించడం మొదలుపెడతారు. దీనిని చూసిన అన్నెమసాని “బోయదొరలు బోయదొరలుగానే ఉండవలె. ఇటువంటి నాగరిక వేషములకు అలవాటు పడిన యెడల బోయలు తమదైన నైసర్గిక స్వభావస్వరూపములను, శక్తియుక్తులను కోల్పోవుదురు. సుఖమునకు, సింగారమునకు మరుగుదురు. ఇది బోయ జాతికే సేగి తెచ్చును”15 అని భావిస్తుంది. తల్లి మనస్సు తెలుసుకున్న రెండవ వీరనబోయడు నాగరికమైన దుస్తులను క్రమంగా ధరించడం మానివేస్తాడు.
ఈ విధంగా బోయల క్షేమాన్ని నిరంతరం కోరుకునేదిగానూ, బోయల సంస్కృతి పరిరక్షకురాలుగానూ రచయిత అన్నెమసాని పాత్రను నిర్మించారు.
3.4 నాగసాని:
ఈమె కోనకొట్టపు పెద్దదొర మాచనబోయని కుమార్తె. పులిరాజు రెండవ భార్య. ఈమెకు ముగ్గురు కుమారులు. పెద్దవారిద్దరు మశూచి సోకి మరణిస్తారు. అందరికంటే చిన్నవాడికి కూడా మశూచి సోకినప్పటికి బ్రతుకుతాడు. ఉదయచంద్రుడి దండయాత్ర గురించి తెలిసి జయశ్రీ, మల్లిక, ఆమె కుమారులు ముందుగానే వినుకొండకి వెళ్ళిపోతారు. పులిరాజు కూడా యుద్ధం మధ్యలోనే ప్రాణభయంతో పారిపోతాడు. పులిరాజు కుటుంబికులలో నాగసాని, ఆమె కుమారుడు మాత్రమే బోయకొట్టాల్లో మిగులుతారు. ఉదయచంద్రుడు పులిరాజు కుమారుడ్ని కాదని కనవనబోయని మనుమడు వీరభద్రుడ్ని బోయకొట్టాలకు నాయకుడిగా నియమిస్తాడు. తన కుమారుడు బోయకొట్టాలకు నాయకుడు కాకపోవడం, ఇంతవరకు అనామకుడిగా ఉన్న కసవనబోయని మనుమడు నాయకుడు కావడంతో నాగసాని కడుపున అగ్గిపోసినట్లు అయింది. తన కుమారుడి స్థానంలో బోయకొట్టాలకు నాయకుడైన వీరభద్రబోయనిపై నాగసాని ద్వేషం పెంచుకుంటుంది. విషప్రయోగం చేసి వీరభద్రుడ్ని చంపుతుంది. నిజానికి కసవనబోయడే బోయకొట్టాలకు నాయకుడనీ, తన భర్త అన్యాయంగా అతని అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడనే స్పృహ లేకుండా చిన్నపిల్లలపై హత్యాయత్నం చేసి అమ్మతనానికి తలవంపులు తెచ్చే స్త్రీగా ఈ నవలలో నాగసాని కనిపిస్తుంది.
విషం ప్రయోగం చేసింది నాగసానే అని బోయలకు తెలిసిపోతుంది. చివరికి వేరే దారి లేక తానే వీరభద్రుడ్ని చంపానని ఒప్పుకుంటుంది.
“నా మగడు దొరతనము చేసిన దినములలో మీరందరూ కుక్కల వలె ఆయన చుట్టును తిరిగినారు. చెప్పులు నెత్తిన పెట్టుకొని మోసినారు. ఆ ఒక్కడు ఇప్పుడు లేకపోగా మీరందరును మగవారైనారు. నా బిడ్డకు అన్యాయము చేసినారు. న్యాయముగా నా కొడుకే ఈ పండ్రెండు బోయకొట్టములకు ప్రభువు. ఈ వీరభద్రుని అడ్డు తొలగిన యెడల నా కొడుకే బోయ కొట్టములకు ప్రభువు. అందుకే ఈ పని చేసినాను”16 అని నాగసాని బోయలందరి ముందు చెబుతుంది. నాగసాని చేసిన పనికి కడుపు మండిపోయిన బోయలు ఆమెకు పుట్టెడు సున్నపు రాళ్ళతో విడగబోయడం అనే మరణశిక్షను విధిస్తారు.
ఈ విధంగా తన కుమారుడికి అధికారం దక్కడానికి ఎంతటి దుర్మార్గానికైన ఒడిగట్టే స్త్రీగా రచయిత ఈ నాగసాని పాత్రను నిర్మించారు. అదేవిధంగా చాళుక్యుల పాలనలో వారి నాగరికతతోపాటూ వారి వారసత్వ తగాదాలు కూడా బోయలలో ప్రవేశించాయని చెప్పడానికి రచయిత జయశ్రీ, నాగసాని పాత్రలను ఉపయోగించుకున్నారు.
3.5 వకుళ:
ఈమె పల్లవ రాకుమారి. పల్లవ చక్రవర్తి బావమర్ధి జయవర్మ కుమార్తె. అందంతోపాటు విలువిద్యా ప్రావీణ్యం కలిగిన స్త్రీ. తిరువేంగడ క్షేత్రానికి వెళ్ళేమార్గంలో ఎదురైన కొండచిలువపైనా, ఏనుగులు పట్టే గోతిలోకి వచ్చిన త్రాచుపాముపైనా వకుళ బాణ ప్రయోగం చేసి వాటిని సంహరిస్తుంది. ఈ రెండు సంఘటనలలో ఆమె బాణ ప్రయోగ వేగాన్ని చూసిన పొన్నిబోయడు ఆశ్చర్యపోతాడు. “ఇవి చేతులా, మెరుపు తీగలా - స్త్రీని కవులు లతాంగి అనుట తప్పు. అయఃప్రతిమ అనవలయును”17 అని వకుళ గురించి పొన్నిబోయడు అన్న మాటలు ఆమె విలువిద్యా నైపుణ్యానికి నిదర్శనం.
వకుళ పొన్నిబోయడని ప్రేమిస్తుంది. తన ప్రేమ విషయం తన మేనత్త అయిన పల్లవ మహారాణికి చెప్పి ఆమె అనుమతితో పొన్నిబోయడిని వివాహం చేసుకుంటుంది. అతనితోపాటూ బోయకొట్టాలకు వస్తుంది. అక్కడ నన్నిబోయని వద్ద విలువిద్యలో మరిన్ని మెళుకువలు నేర్చుకుంటుంది. బోయస్త్రీలలో సైన్యం తయారు చేస్తుంది. కడియరాజు బోయకొట్టాలపై దాడి చేసినప్పుడు అతడిని ఓడించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చిన్ననాటి నుండి పొన్నిదొరే భర్తగా ఊహించుకొని జీవిస్తున్న అల్లెమను తన భర్తకిచ్చి రెండవ వివాహం జరిపిస్తుంది. ఈ విధంగా తన నడవడిక, మాటతీరు ద్వారా బోయల ఆదరాభిమానాలు సంపాదిస్తుంది. పండరంగని చేతిలో తనవారంతా మరణించడంతో కోపంతో అతనిపై దాడిచేసి గాయపరుస్తుంది. “ఒక చాళుక్య వనిత ఆనాడు ఒక బోయ యువకుని పెండ్లాడి వానిని చాళుక్యునిగా మార్చివైచినది. ఈనాడు ఒక పల్లవ వనిత బోయదొరను పెండ్లాడి తానే బోయవనితగా మారుచున్నది”18 అని వకుళ గురించి పొన్నిదొర అన్నమాటలు ఆమెలో వచ్చిన పరివర్తనకు నిదర్శనం.
వకుళ మలయప్ప స్వామి భక్తురాలు. తిరువేంగడక్షేత్రానికి వెళ్ళిన ప్రతిసారి మలయప్ప స్వామి విగ్రహం వద్దే ఎక్కువ సమయం గడుపుతుంది. తన కుమారుడికి మలయప్ప అని పేరు పెట్టుకుంటుంది. పండరంగనితో జరిగిన యుద్ధంలో తన భర్త, బావ, పిల్లలు మరణించడంతో బోయకొట్టాలను విడిచి తిరువేంగడానికి వెళ్ళి అక్కడ మలయప్ప స్వామి సేవలో తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటుంది. చివరికి ఆ స్వామిలోనే ఐక్యమౌతుంది.
ఈ విధంగా రచయిత వకుళ పాత్రను శక్తి యందు అపర దుర్గగా, భక్తి యందు అపర ప్రహ్లాదమూర్తిగా చిత్రించారు.
3.6 కసవన బోయని కోడలు:
ఈ నవలలో ఇది పేరులేని పాత్ర. ఈమె కసవన బోయని కోడలు. వీరభద్ర బోయడు, నన్ని బోయడు, పొన్ని బోయడు ఈమె కుమారులు. ఉదయచంద్రునితో జరిగిన యుద్ధంలో ఆమె భర్త మరణిస్తాడు. ఈమె పెద్ద కుమారుడు వీరభద్రబోయడ్ని నాగసాని విష ప్రయోగం చేసి చంపుతుంది. ఈ విధంగా బోయకొట్టాలపై ఆధిపత్యం కోసం పులిరాజు చేసిన దుశ్చర్యలో ఎక్కువగా నష్టపోయిన పాత్ర ఇది.
కుమారుడు, మనుమడి మరణాలను కళ్ళార చూసిన కసవనబోయడు వైరాగ్యానికిలోనై బోయకొట్టాల వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు పట్టించుకోడు. అప్పుడు ఈమే “మామ, మీరిట్లు వైరాగ్యమును పట్టినచో మేమేమైపోవలె. బోయకొట్టము లేమైపోవలె. మన వంశమేమైపోవలె. మొదటి నుండియు మీరిట్లు చేతులు ముడుచుకొని కూర్చుండుట వలననే మన వంశమునకు, మన బోయకొట్టములకు ఇట్టి దురవస్థ వచ్చినది. పోయిన వారు పోగా ఉన్నవారినైనను చూడవలదా? వారిని పెంచి ప్రయోజకులను చేయవలదా. మన వంశమును నిలబెట్టవలదా? మీరు ఈ వైరాగ్యమును వదలి నడుము కట్టుకొనకున్న ఈ బోయకొట్టములకు దిక్కెవ్వరు?”19 అని కసవన బోయనికి కర్తవ్యం బోధిస్తుంది. ఈమె మాటలతో జ్ఞానోదయం పొందిన కసవన బోయడు నన్ని, పొన్ని బోయలను విద్యావంతులుగాను, ప్రయోజకులుగాను చేయడానికి పూనుకుంటాడు.
ఈ విధంగా తన భవిష్యత్తు మొత్తం అందకారం అయినా తన పిల్లల భవిష్యత్తూ, బోయకొట్టాల శ్రేయస్సును గురించి ఆలోచించే స్త్రీగా రచయిత ఈ కసవన బోయని కోడలి పాత్రను తీర్చిదిద్దారు.
3.7 పల్లవ రాణి:
ఇది కూడా పేరులేని పాత్రే. ఈమె జయవర్మ (వకుళ తండ్రి) సోదరి. తిరువేంగడక్షేత్రంపై వెలిసిన శ్రీనివాసుని భక్తురాలు. “రాణి వాసపు రాజసము, తద్విరుద్ధమైన ప్రసన్నత, ఔదార్యము కలగలిసిన రూపమామెది. ఆమెను చూడగానే ఆమె హృదయము పార లౌకిక చింతనతో నిండినదనియు, ఆమె శరీరమంతయు దైవభక్తితో నిందారినదనియు స్పష్టమైపోవును”20 అని రచయిత పల్లవ రాణి అంతరంగ సౌందర్యాన్ని వివరించారు. ఆత్మీయత, అనురాగం కలబోసిన పాత్ర ఇది. తాను మహారాణి అనే గర్వం ఈ పాత్ర అధ్యాంతం ఎక్కడా ఇసుమంతైన కనిపించదు. పొన్నిబోయడు తనను ‘అమ్మా’ అని పిలవగానే, అ పిలుపు విని ఉప్పొంగిపోతుంది. వకుళ, పొన్నిదొరలు ఒకరికొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకొని వారిద్దరికి వివాహం చేస్తుంది.
ఈ విధంగా రాజసం, ప్రేమ, ఆత్మీయత కలబోసిన మహారాణిగా రచయిత ఈ పల్లవరాణి పాత్రను నిర్మించారు.
పై స్త్రీ పాత్రలతో పాటూ సంపంగి (రెండవ వీరనబోయని మొదటి భార్య), అక్కమ (బద్దెబోయని కొట్టం పెద్దదొర కుమార్తె, కసవన బోయని భార్య), అల్లెమసాని(పొన్ని బోయని రెండవ భార్య), నరససాని (గండబోయని కొట్టం పెద్దదొర పోతన బోయని కుమార్తె, నన్ని బోయని కుమారుడైన కొమ్మన బోయని భార్య) మొదలైన స్త్రీ పాత్రలను కూడా రచయిత నిర్మించి, ఈ నవలలో సందర్భానుగుణంగా ఉపయోగించుకున్నారు.
4. ముగింపు:
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ ‘బోయకొట్టములు పండ్రెండు’ నవలలో సున్నితమైన స్త్రీల మనస్తత్వాలను అద్భుతంగా అక్షరీకరించారు. మధ్యయుగ ప్రారంభ దశలో తెలుగు ప్రాంతం నందలి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలలో స్త్రీలు నిర్వహించిన పాత్రను ఈ నవలలోని స్త్రీ పాత్రల ద్వారా రచయిత వివరించే ప్రయత్నం చేశారు. స్త్రీలు నాయకులుగా, మార్గనిర్దేశకులుగా, యుద్ధనిపుణులుగా పురుషులుతో సమాన స్థాయి అందుకున్నవారిగా రచయిత ఈ నవలలో మంగసాని, అన్నెమసాని, వకుళ పాత్రలను తీర్చిదిద్దారు.
నాగరిక, అనాగరిక మానవ సమాజాల్లోని మానవ సంబంధాలను ముఖ్యంగా స్త్రీల మనస్తత్వాలను ఈ నవల్లోని జయశ్రీ, నాగసాని, వకుళ పాత్రల ద్వారా వివరించారు. నాగరిక సామాజాలను అనాగరిక సమాజాలు అనుకరించడానికి ప్రయత్నించడం. దీని వల్ల అనాగరిక సమాజాల్లో వచ్చిన మార్పులు, సంఘర్షణలను కరణంవారు ఈ నవలలో అత్యంత వాస్తవికంగా చిత్రించారు.
ఈ నవలను రచయిత సరళ గ్రాంథికంలో రచించారు. ప్రస్తుతం వాడుకలో లేని ఆనాటి ప్రజలు వాడిన అనేక అచ్చతెలుగు పదాలను రచయిత ఈ నవల్లో ప్రయోగించారు. సామెతలు, జాతీయాలను సందర్భానుసారం ఉపయోగించుకుంటూ కరణంవారు అసాంతం పాఠకులను కట్టిపడేసే శైలిలో ఈ నవలను రచించారు.
5. పాదసూచికలు:
- బోయకొట్టములు పండ్రెండు నవల, పీఠిక, పుట. 5
- శ్రీనివాసరావు శ్రీరంగం (శ్రీశ్రీ), మహాప్రస్థానం, పుట. 73
- బోయకొట్టములు పండ్రెండు నవల, పీఠిక పుట. 8,9
- పైదే. పుట. 206
- బోయకొట్టములు పండ్రెండు నవల, పుట. 58
- పైదే. పుట. 77
- పైదే. పుట. 78
- పైదే. పుట. 97
- పైదే. పుట. 120
- పైదే. పుట. 126
- పైదే. పుట. 136
- పైదే. పుట. 104, 105
- పైదే. పుట. 107
- పైదే. పుట. 115
- పైదే. పుట. 121
- పైదే. పుట. 167
- పైదే. పుట. 200
- పైదే. పుట. 227
- పైదే. పుట. 169
- పైదే. పుట. 197
6. ఉపయుక్తగ్రంథసూచి:
- బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, కరణం. (2013). బోయకొట్టములు పండ్రెండు, అమర్ ఆఫ్సెట్ ప్రింటర్స్, మదనపల్లె.
- వేంకటరమణయ్య, నెలటూరు. (1969). పల్లవులు - చాళుక్యులు, వేదం వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మద్రాస్.
- శ్రీనివాసరావు, శ్రీరంగం (శ్రీశ్రీ). (2004). మహాప్రస్థానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- హనుమంతరావు, బి.యస్.యల్. (2014). ఆంధ్రులచరిత్ర, విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.