headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797

7. రాయలసీమ కథాసాహిత్యం: నేపథ్యచిత్రణ శిల్పం

డా. భీమినేని శివసాయి ప్రసాద్

పాఠశాల సహాయకులు (తెలుగు),
నల్లమోతు చెంచు రామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాల,
మారిస్పేట, తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9866573450. Email: sivasaiprasadprem@gmail.com

Download PDF


Keywords: రాయలసీమ, కథ, కథానిక, నేపథ్యం, స్థలం, కాలం, భాష, మధురాంతకం, బండి, భీమినేని.

1.0) ఉపోద్ఘాతం: -

ఆంగ్లంలో ‘Background’ అనే మాటకు సమానార్థక పదం “నేపథ్యం”. నేపథ్యంలో స్థలం (Place), కాలం (Time), భాష (Language) ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ నేపథ్యచిత్రణలో కథాసాహిత్యంలో చక్కని శిల్పం ఉంటుంది. ఈ శిల్పంలో రచయిత నేపథ్యం, సాహిత్య నేపథ్యం, సామాజికనేపథ్యం కూడా ఉంటాయి. సాహిత్యం జీవితవాస్తవికతకు కళాత్మక ప్రతిఫలనం. జీవితం స్థల, కాలబద్ధమై ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎవర్ని గురించి రచయిత చెబుతున్నారో పాఠకుడికి అర్థం కావాలి. స్థల, కాల, కుల, మత, వర్ణ, జీవితానుభవం, ఆచార వ్యవహార, భాషా విశేషాలన్నీ నేపథ్యం కిందికి వస్తాయి. స్థలం కంటే కాలాన్ని చిత్రించడం కష్టసాధ్యమైనది. "నేపథ్యాన్ని  చిత్రించడానికి కేవలం వర్ణనలు చేయడం కారాదు" అని వల్లంపాటి పేర్కొన్నారు.

కథానికలో వర్ణనలకు స్థానం పరిమితం. వర్ణనే చిత్రణ కాదు. మధురాంతకం రాజారాం 'ఎడారి కోయిల' అన్న కథలో అవసరానికి మించి వర్ణన కలదు. నేపథ్యంలో జీవితానుభవం లేదా వృత్తిపరమైన జీవితానుభవం కూడా కీలకపాత్ర నిర్వహిస్తుంది. ఒక వృత్తిని గురించి ఆ వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తి రాసే తీరు ఒక లాగా, అనుభవం లేని వ్యక్తి రాసే తీరు మరొక లాగా కనిపిస్తుంది. వ్యవసాయరంగంతో సంబంధం లేని వాళ్ళు ఆ నేపథ్యంలోంచి రచన చేయలేరు. అందువల్ల వృత్తిపరమైన జీవితానుభవం కూడా నేపథ్య చిత్రణలో ప్రాముఖ్యం వహిస్తుంది.

1.1) స్థల నేపథ్యం: -

కథా వస్తువు మానవ జీవితం నుండి తీసుకోబడుతుంది. విభిన్న ప్రాంతాలలో భిన్నభిన్న ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. అవన్నీ మానవ జీవితాన్ని, మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని కథలను కొన్ని నేపథ్యాల నుండి వేరు చేయలేము. కరువు కాటకాలు వస్తువులుగా గల కథలు రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలలో మాత్రమే జరుగుతాయి. కొన్ని కథలను గ్రామీణ నేపథ్యం నుండి, మరికొన్ని కథలను పట్టణ నేపథ్యం నుండి వేరు చేయలేము. ఫ్యాక్షన్ వస్తువుగా గల కథలు అధికంగా రాయలసీమలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, ప్రొద్దుటూరు, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, తాడిపత్రి, పులివెందల వంటి సీమప్రాంతాలలో మాత్రమే అధికంగా జరుగుతున్నట్లు అవగతం అవుతుంది. జీవితానికి స్థానికత, కాలికత ఉంటాయి. ఒక రకమైన జీవితం ఒక ప్రాంతంలోనే ఒక కాలంలోనే ఉండడానికి అవకాశం ఉంది. అనంతపురం జిల్లా 'బండి నారాయణస్వామి' రచించిన 'నీళ్లు' కథ రాజమండ్రి నుండి రావడానికి వీల్లేదు. తెలంగాణ పోరాట సాహిత్య ప్రభావంతో రాయలసీమలో తిరుగుబాట్లు జరుగుతున్నట్లు కథానికలు రాయకూడదు. తిరుగుబాట్లు రావలసిన పరిస్థితులు అవసరం ఉన్నట్లు రాయడంలో తప్పులేదు. స్థల కాలాలలాగే సమాజంలోని కుల, మత, వర్ణాలు కూడా నేపథ్య చిత్రణలో భాగాలే.

1.1.1) బండి నారాయణస్వామి - నీళ్లు: -

నీళ్లు కథకు నేపథ్యం అనంతపురం జిల్లాలోని ఎడారిగా మారుతున్న రాయదుర్గం ప్రాంతం. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలోని కనేకల్, విడపనకల్ మండలాలు ఎడారిగా మారుతున్న వైనాన్ని చిత్రించాయి. నీళ్లే నాగరికత అంటారు. మరి తాగే దానికి ఒక కడవడు నీళ్లు నోచుకోలేని వారికి ఏం నాగరికత ఉంటుందో అది సీమ ప్రజలకే ఎరుక అనే వాస్తవిక నీటి కడగండ్లను ఈ కథ తెలియజేస్తుంది.

1.1.2) వియోగి - సమిధ: -

వీరభద్రుడు, నారాయణప్ప వంశపారంపర్యంగా ఆధిపత్యం కోసం కర్నూలులో గొడవ పడసాగారు. మద్దిలేటి వీరభద్రుడికి నమ్మిన బంటుగా ఉంటూ బాంబులు వేయడంలో పట్టు సాధించాడు. ఒకసారి పోరులో మద్దిలేటి బాంబుకు నారాయణ వర్గం జీపు పేలిపోయింది. ప్రయాణ సాధనాల వల్ల అదే జీపులో మద్దిలేటి కుమారుడు కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో సహా వస్తుండడంతో వీరు అతి కష్టం మీద రక్తపు మడుగులతో బయటపడి చంపకండి, మేమూ మీ వారమే అని ఆర్తనాదాలు చేశారు. మళ్లీ నారాయణప్ప వర్గం దొంగ దాడి చేయడంతో బాంబుకు బలై మద్దిలేటి మొండెం లోంచి ప్రాణం పోతుంది. తను ఫ్యాక్షన్లో పుట్టి  ఫ్యాక్షన్లోనే మరణిస్తున్నాడు, కానీ ఫ్యాక్షన్ కు సంబంధంలేని కొడుకు కోడలును ఎవరు రక్షిస్తారని మానసిక సంఘర్షణ అనుభవిస్తూ దేవుడా వాళ్ళని రక్షించు అంటూ గుడ్లు తేలేశాడు. ఎవరు ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారంటూ తెలుసుకున్న కన్నులు ప్రశ్నిస్తున్నాయి.

1.2) కాల నేపథ్యం: -

స్థలం కంటే కాలాన్ని చిత్రించడం చాలా కష్టం. స్థలం కథలోనే భౌతిక పరిసరాలను చిత్రిస్తే, కాలం కథా కాలానికి చెందిన భావజాలాన్ని చిత్రిస్తుంది.స్థలాన్ని చిత్రించినంత ఖచ్చితంగా కాలాన్ని చిత్రించడం సాధ్యం కాదు. కాలాన్ని గొప్పగా చిత్రించినప్పుడే కథ చదువుతున్నపాఠకుడికి ఆ కథాకాలంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. కాలాన్ని బట్టి మొదట సంఘసంస్కరణ కథలు, స్వాతంత్రోద్యమ నేపథ్య కథలు, మధ్యతరగతి జీవితం చిత్రించే కథలు వచ్చాయి. తరువాత వివిధ ప్రాంతాల జీవనస్థితిగతుల్ని, సాంప్రదాయాల్ని, ఉద్యమ నేపథ్య కథలు వచ్చాయి. వాటి వాటి నేపథ్యాలను బట్టి శిల్పం మారుతూవుంటుంది.

1.2.1) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు- కూలోళ్లతో మా అమ్మ కటీనం: -

భూశమ్మకు వానా కాలంలో ఒక పంట, ఎండాకాలంలో ఒక పంట వస్తుంది. ఎండాకాలంలో వచ్చిన పంటను భూశమ్మ కుటుంబమే దోక చేసేవారు. కానీ వానాకాలంలో కూలోళ్ళను పెట్టి పనులు చేయించుకోవడం భూశమ్మకు కష్టంగా ఉండేది. ఉత్తరాది నుండి వచ్చిన కూలోళ్ళు కయ్యల్లో వొంగే కాడికి పొద్దు నాలుగు బారలెక్కేది. కయ్యల్లో వొంగినారో లేదో అప్పుడే చద్ది కావాలని కూలోళ్ళు అడిగేవాళ్లు. ఆ తరువాత ఒంటి గంటకంతా సంగటి పెట్టాలి. ఇంతలో సాయంకాలం కాకముందే మూడు గంటలకే తిరుమల కొండమీద దిగిన వాన అయిదు నిమిషాల్లో భూశమ్మ కయ్యల్లోకి వచ్చి వాలడంతో పని ఆగిపోయింది. కూలోళ్ళు రాత్రి భూశమ్మ ఇంటి దగ్గర సంగటి ముద్దలు తిని ఆదమరిచి నిద్రించినారు. సూర్యోదయం తర్వాత మళ్ళా కయ్యల్లోకి పనికి వొంగినారు. ఈ విధంగా వానాకాలం పంటను కూలోళ్ళతో చేయించుకోవడంలో భూశమ్మ విసిగిపోయింది.

1.3) భాష నేపథ్యం: -

స్థలం, కాలం తర్వాత కథలో భాష ప్రధానమైన అంశం. ఒక ప్రాంతంలోని ప్రజలంతా ఒకే రకంగా మాట్లాడరు. వివిధ వర్గాల, కులాల, మతాల ప్రజలు మాట్లాడే భాష కూడా భిన్నంగానే ఉంటుంది. ఒకే మతానికి కులానికి చెందినవారు అందరూ కూడా ఒకే విధంగా మాట్లాడారు. అలాగే పురుషుల భాషకూ, స్త్రీల భాషకు తేడాలున్నాయి.  ఒక ప్రాంతానికీ, వర్గానికీ, కులానికి చెందిన పాత్ర తన ప్రాంతానికీ, వర్గానికీ, కులానికీ దగ్గరగా ఉన్న భాషను మాట్లాడటం మంచిది. వీటినే మనం మాండలికాలు, ప్రాంతీయ భాషలు అంటాము. కథలు ఆద్యంతం వ్యవహారికం లేదా మాండలికంలో చెప్పడం ఒక పద్ధతి. కథను వ్యవహారికంలో చెప్పి సంభాషణలు మాండలికంలో రాయడం మరొక పద్ధతి. కోస్తా, సీమ జిల్లాల్లోని అన్ని ప్రాంతాలలో కూడా భాష ఒకే రకంగా ఉండదు. చిత్తూరు జిల్లాలో నామిని వ్రాసే పుత్తూరు భాషకు, వల్లంపాటి వ్రాసే మదనపల్లి ప్రాంత భాషకు చాలా తేడాలు ఉన్నాయి.

కథ ఎంత అందంగా చెప్పినా సరియైన  భాష ఎన్నుకోకపోతే అసలు కథాగమ్యమే దిక్కుతోచని స్థితిలోకి వస్తుంది. ఎందుకంటే ప్రధాన వాహిక భాష. కథానికలోని భాష పాత్రోచితంగా ఉండాలి. నాటి సమాజానికి, వ్యక్తులకు, వ్యక్తులస్థాయికి, సంస్కారానికి తగినట్లు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఉండే మనుషులే మన కథలో పాత్రలైతే వారు మాట్లాడుకునే భాష లాగే ఉండాలి. ఇది కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటే బాగుంటుంది. "గ్రాంథికం కంటే వ్యవహారికం, వ్యవహారికం కంటే మాండలికం ఎక్కువగా వాస్తవానికి దగ్గరగా ఉంటాయని" కొలకలూరి ఇనాక్ తెలిపారు.

కథలో భాషను ఎంచుకునేటప్పుడు కూడా కథాంశం కంఠస్వరం వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సాధారణంగా కథలో వ్యవహారిక భాష ఉంటుంది. రచయిత వ్యవహారిక భాషలో చెప్తూ పాత్రల సంభాషణలను మాండలికంలో నడపవచ్చు. లేదా పూర్తిగా మాండలిక భాషలోనే నడపవచ్చు. అయితే ప్రాంతీయ భాషలో ఉన్న జీవాన్ని, జవాన్ని కథలోనికి ఎక్కించేందుకు యోగ్యమైన వస్తువున్నప్పుడు మాండలిక భాష కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కథాంశం, రచయిత నేపథ్యం, సామాజిక నేపథ్యాలతో మాండలికభాషకు సంబంధం ఉన్న సందర్భంలో మాండలికభాషలో రాసే కథ చాలా శక్తివంతంగా ఉంటుంది. తొలినాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు - గుంటూరు మాండలికం, రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ - విశాఖపట్నం, శ్రీపాద - గోదావరి, కాలువ మల్లయ్య - తెలంగాణ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు - చిత్తూరు, వైసివి రెడ్డి - కడప, శాంతి నారాయణ - అనంతపురం మాండలిక భాషల్లో కథలు రాశారు.

గుత్తి రామకృష్ణ 'చిరంజీవి' కథలో రెడ్డోరు తన పనివాడితో అనంతపురం మాండలికంలో ఇలా మాట్లాడించారు.

“థూ... ఎందరికి పుట్టింటివి రా, ఋణపాతకం నా కొడకా... ఈనికి పెళ్ళంట. పెండ్లి. ఈనమ్మ ముండ పనికిరాక మూడు దినాలాయ, ఈ కొడుకు...' నోటి దూల తీరేదాక రెడ్డోరు తిట్టినాడు. చేతిలోని బర్ర ఇరిగేదంకా కొట్టినాడు. పనోడు యెంగట్రాముడు కిముక్కు మనలేదు. ఒకచోట కుప్పై కూచున్నాడు.”

శాంతి నారాయణ 'కల్లమయిపాయ' కథలో అనంతపురం జిల్లా సింగనమల ప్రాంతంలోని కరువు పరిస్థితులను అనంతపురం మాండలికంలో ఒక రైతు ఇలా మాట్లాడినాడు.

"పుబ్బకార్తి పోయ వాన రాలె. జనం అంతా ఉత్తర జూచి గంపలెత్తల్లనుకుండారు. చెర్లోపల నేలంతా ఎండకు నోరు తెరుచుకొని వొగిరిస్తాంది.బాయిలన్నీ ఎండిపోయినాయి. ఇస్కులు దగ్గరుండే బోరింగులో నీళ్లు రావడం లే. వంకల్లో, ఇసక గుంతల్లో నీళ్లు తోడుకొని, కడవ లో బోసుకొని నీళ్ళెత్త కొచ్చుకుంటా వుండారు. ఊరి చుట్టూరా దొడ్లన్నీ చెప్పుతో కొట్టిన మొగమాకట్ల ఇగిలించి కొనిండాయి”.

చిలుకూరి దేవపుత్ర 'మన్ను తిన్న మనిషి' కథలో తండ్రి చెన్నప్ప తన కొడుకు రామచంద్రుడితో అనంతపురం మాండలికంలో ఇలా మాట్లాడినాడు.

"ఒరేయ్ రాముడూ! నీ భాగం, నా భాగం ఏందిరా!అంతా నీది కాదేం రా !... రేయ్! నువ్వే తీసుకొప్పా! నాకేమీ వల్ల! దాన్ని అమ్ముకుంటావో, పాడు చేసుకుంటావో నాకేల ? జానెడు పొట్ట యీ ఊళ్ళో ఇంత అడక్కతింటే నిండదు? నీ ఇట్ట పెకారమే కానియ్యిరా!".

నాగప్ప గారి సుందరరాజు 'నడిమింటి బోడెక్క బసివిరాలయ్యెద' అనే కథలో కర్నూలు మాండలిక భాషను వాడిన తీరు ఈ విధంగా ఉంది.

"ఈ పొద్దు నడిమింటి బోడెక్క బసివిరాలు అయ్యేద. ద్యావర్లు గట్టిన పూజారయ్య, కాలుదొక్కిన కర్ణము సామి, కంకుమాను కట్టిన గురవయ్య ముగ్గురు ముసిలినా బట్లు కలిసి, సామి కార్యమని ఆ పిల్లను ఈ రాతిరికే వొగుడయినంకా వొగుడు పక్కలో పొండు బెట్టుకుంటారంట. అన్నిము పున్నిము యెరగని బోడెక్కని బసివిరాలిని చేసి బజారుకు యేసిడిసిరి. పెద్దమనిషి అయ్యే తనకాలే ఎంతమంది ముట్టుకుంటారో, పాయము అయ్యి పొయ్యే తలకాలా యంత మంది పిల్లల్ని పుట్టిస్తారో.  ముసలిముప్పుతనానికి ముద్దేసేకి యెవురు మిగులుతారో, ఆ బగమంతునికే తెలల్ల తల్లోయ్...”.

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'నా రెక్కలున్నంతకాలం' అనే కథలో తల్లి భూశమ్మ తన కొడుకుతో చిత్తూరు మాండలికంలో ఇలా మాట్లాడింది.

"పుట్టకముందే చంపాలనుకున్న ఈ తల్లి పుట్టినాక మాత్రం చంపకుండా వదలబోతుందా? అని ఏడుస్తూ ఉండావా నాయనా. ఏడు పొద్దు కొడకా! ఒరే, యెర్రెదవా! నీ అమ్మకు రెక్కలు వుండాయిరా! ఆ రెక్కల్లో సత్తా వుండినంత కాలం నువ్వంటావురా యెర్రి కొడకా! వైభోగంగా నిన్ను పెంచలేకపోయినా, నా కడుపుని ఎండ కట్టుకొని నీ కడుపుకు అంత పెడతానురా! లోకంలో ఇంక బతకలేము అని తెలిసిపోయినాక నిన్నొదిలి నేనే పోతానా? చెరి కొంచెం తాగేసి పోదాం కొడకా! నువ్వు ఏడవద్దు నా రెక్కలుంటాయి నువ్వు ఏడవద్దు, ఏడిస్తే గసవచ్చి వూపిరి తిరగదు. నాయనా, నువ్వు ఏడవద్దు". అంటూనే మా అమ్మ గసపెట్టి ఏడ్చింది.

పి.రామకృష్ణారెడ్డి 'సిత్తాట' అనే కథలో వ్యవసాయం చేయడం వెనక ఉన్న కష్టాలను కడప మాండలికంలో ఇలా తెలియజేశారు.

"అస్సలుకు యెవసాయం జేయడం చిత్తాట ఆడటం కన్నా కానా కట్టం. సిత్తాట ఆడేవాడు ఓడిపోయినా గెలిచిన వాని చేతులారా ఆడతాండాడు. ఆట బాగా గెలుచుతాడు, లేదా ఓడిపోతాడు. యిదట్టాగాదే! నువెంత  బాగా ఆడినా గెల్చలేవు. ఇదింగో రకం సిత్తాట, సిత్తయి పోయే ఆట! అసలాటే నీ చేతిలో లేదు. మరెవరి చేతిలో వుందబ్బీ అంటే... ఒక్క సెయ్యని చెప్పలేం. వాన సేతిలో ఉండేవి సరే అప్పుడు అదట్టపోనీయ్... అదోక్కటేనా? కోనేతప్పుడు అంతా అమ్మేతప్పుడు ఇంతా ఉండే ధరలు సేతుల్లో, దరలను పెట్టే పెద్దోళ్ల సేతుల్లో, ఊర్లో ముందే ఏర్లుపారుతున్నా పైర్లకు నీళ్లు పెట్టుకోవడానికి ల్యాకుండా జేస్తాండే వాళ్ళ సేతిలో... ఇట్ట ఇందరి సేతుల్లో వుంది. ఎక్కడెక్కడో వుండి ఏం సమ్మందం లేని వాళ్ళందరి సేతుల్లో ఉంది గానీ  సెమట నెత్తురూ కార్సి యెల్లకాలం కనిపెట్టుకొని కట్టం సేసేవాడి సేతిలో లేదు యెవసాయం! ఎంత సిత్రం! ఎంత అన్యాయం.”

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 'కొత్త దుప్పటి' అనే కథలో తాత, మనవరాలు మధ్య సంభాషణ కడప మాండలికంలో ఇలా సాగుతుంది.

"బువ్వ తెచ్చినం తాత!' నెత్తిన అన్నం గిన్నెతో అయిదేళ్ల పాప తాత వద్ద కొచ్చింది.

"మా తల్లే! మాయమ్మే! ఏం బువ్వ నాయనా?బరిగే బువ్వా?" నెత్తి మీద ఉన్న గిన్నె అందుకుంటూ అడిగాడు.

"కాదు ఆ బువ్వ".

"కూర్చో?"

" పైటేలదే! "

"సద్ది కూరా...నిరాశ ధ్వనించింది ఆయన గొంతులో".

"పూటపూటకు ఉడుకుద్ది ఎట్టొచ్చదే? ఎట్టొచ్చదే తిను. పొద్దుపోయింది"

ఉపసంహారం (ముగింపు):

ఉత్తమ కథానిర్మాణములో ఇతివృత్తం, రూపం ముఖ్యభూమికలు పోషిస్తాయి. కథాసాహిత్యం జీవిత వాస్తవికతకు కళాత్మక ప్రతిఫలనం. కథావస్తువు మానవజీవితం నుండి తీసుకొని అద్భుతముగా రక్తికట్టించడములో నేపథ్యచిత్రణ రూపం ప్రముఖపాత్ర పోసిస్తుంది. మానవ జీవితం స్థల, కాల, భాషా బద్ధమై ఉంటుంది. కావున నేపథ్య చిత్రణలో ఈ మూడు అంశాలు ప్రముఖ స్థానం ఆక్రమిస్తాయి. స్థలం కంటే కాలాన్ని చిత్రించడం చాలా కష్టం. స్థలాన్ని చిత్రించినంత కచ్చితంగా కాలాన్ని చిత్రించడం కుదరదు. స్థల, కాల నేపథ్యాల తరువాత కథలో భాష ప్రాధాన్యం సంతరించుకుంటుంది. భాష పాత్రోచితముగా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కథలో సందర్భోచితంగా రచయిత  వ్యావహారిక లేదా మాండలికభాషను వినియోగించుకుంటాడు. నేపథ్యచిత్రణ శిల్పంలో భాగంగా పై మూడు నేపథ్యాలను సందర్భానుసారంగా రచయిత వినియోగించుకుంటాడు.

ఉపయుక్త గ్రంథసూచిక:

  1. చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. (2006). కథాంశం (తెలుగు కథానిక సాహిత్య విమర్శ), అనంతపురం
  2. దక్షిణామూర్తి,  పోరంకి. (1985) కథానిక స్వరూప స్వభావాలు, శివాజీ ప్రెస్, సికింద్రాబాద్
  3. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. (1995) కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్, హైదరాబాద్
  4. నారాయణ, సింగమనేని (సంపా). తెలుగు కథకులు - కథన రీతులు విశాలాంధ్ర పబ్లిషింగ్, హైదరాబాద్
  5. శివప్రసాద్, వల్లూరి. కథానిక - పాఠాలు, అరసం, గుంటూరు
  6. శశిశ్రీ. (2012) రాయలసీమ సాహిత్యం, నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ, తెలుగు అకాడమీ, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]