headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797

5. పోతన భాగవతం: గుణ, అలంకార, రసౌచిత్యాల సమన్వయం

డా. రాంభట్ల వేంకటరాయశర్మ

ఎమ్.ఎస్ సి. మైక్రోబయాలజీ, ఎమ్.ఏ. జ్యోతిషం, ఎమ్.ఏ. తెలుగు, పీహెచ్.డి,
పద్యకవి, రచయిత, నాటక కర్త, జ్యోతిశ్శాస్త్రవేత్త,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7989110805. Email: rvr87sarma@gmail.com

Download PDF


Keywords: పోతన, భాగవతం, ఔచిత్యం, క్షేమేంద్రుడు, గుణం, అలంకారం, రసం, సమన్వయం, పద్యం

ఉపోద్ఘాతం:

ఆ.వె.      భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,

             శూలికైనఁ దమ్మిచూలికైన,

             విబుధజనుల వలన విన్నంత కన్నంత

             దెలియ వచ్చినంత దేటపఱతు. (భాగవతం 1.19)

అష్టాదశ పురాణాలలో భాగవత స్థానం పదిలమైంది. వ్యాస భాగవతాన్ని సభక్తికంగా, సుమధురంగా, వినయంగా తెనిగించిన పోతన కవి చరితార్థుడు. 1. వీరభద్ర విజయం, 2 నారాయణ శతకం, 3 భోగినీ దండకం, 4. భాగవతంలోని ఎనిమిది స్కంధాలు ( 1,2,3,4 మరియు 7 ,8, 9 ,10) ఈయన రచనలు. సుమారు 9 వేల పద్యగద్యాలతో విలసిల్లుతున్న ఆంధ్రమహాభాగవతం భక్తిరసప్రధానమైంది. సంస్కృత ఆలంకారికులు పేర్కొన్న రసం, గుణం, ధ్వని, వక్రోక్తి వంటి సంప్రదాయలన్నింటికీ పరిశోధకులు పోతన భాగవతం నుండి ఉదాహరణలు చూపించారు. అదే వరుసలో కాశ్మీర పండితుడు - క్షేమేంద్రుడి  ఔచిత్యసిద్ధాంతాన్ని పరిచయం చేసి, పోతన భాగవతం నుండి గుణ, రస, అలంకార ఔచిత్యాలను ఈ పరిశోధనవ్యాసంలో వివరిస్తున్నాను.

క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన కాశ్మీరీ పండితుడైన క్షేమేంద్రుడు సుమారు 35 రచనలు చేసినట్లుగా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. వీటిలో 18 రచనలు లభ్యాలు. లభిస్తున్న వాటిలో "ఔచిత్య విచారచర్చ" ఒకటి.

క్షేమేంద్రుడు పేర్కొన్న ఔచిత్యభేదాలు:

క్షేమేంద్రడు ఔచిత్యవిచార చర్చలో మొత్తం 27 రకాల ఔచిత్యాలను నిర్వచించి, లక్ష్యాలను పేర్కొన్నాడు.

 శ్లో.        పదే వాక్యే ప్రబంధార్థే గుణేలంకరణేరసే

             క్రియాయాం కారకే లింగే వచనేచ విశేషణే

             ఉపసర్గే నిపాతే చ కాలే దేశే కులేవ్రతే

             తత్త్వే సత్త్వేష్యభిప్రాయే స్వభావే సారసంగ్రహే

             ప్రతిభాయామవస్థాయాం విచారేనామ్న్యధాశిషి

             కావ్యస్యాంగేషుచ ప్రాహురౌచిత్యం వ్యాపిజీవితమ్ (ఔ.వి.చ.8 -10)

ఈ కారికావళిలో క్షేమేంద్రుడు పేర్కొన్న 27 ఔచిత్యరీతులను గమనించవచ్చు. అవి: 1. పద 2. వాక్య 3. ప్రబంధార్థ 4. గుణ 5. అలంకార 6. రస 7. క్రియ 8. కారక 9. లింగ 10. వచన 11. విశేషణ 12. ఉపసర్గ 13. నిపాత 14. కాల 15. దేశ 16. కుల 17. వ్రత 18. తత్త్వ 19. సత్త్వ 20. అభిప్రాయ 21. స్వభావ 22. సార సంగ్రహ 23 .ప్రతిభ 24. అవస్థ 25. విచార 26. నామ 27. ఆశీర్వచనం.

ప్రస్తుత పరిశోధనాంశంగా ఎంపిక చేసుకున్న గుణ, అలంకార, రసౌచిత్యాలను ఇప్పుడు పరిచయం చేసి, భాగవతంలోని పద్యాలను లక్ష్యాలుగా చూపిస్తూ సమన్వయిస్తాను.

1. గుణౌచిత్యం :

శ్లో॥        ప్రస్తుతార్థోచితః కావ్యే భవ్య: సౌభాగ్యవాన్ గుణః |

             స్యందతీందు రివానందం సంభోగావసరోదితః ॥ (ఔ.వి.చ. 14)

కావ్యంలో ప్రస్తుతార్థానికి తగినట్లుగా గుణాలను కూర్చడం అవసరం. అలాంటి గుణాలే సౌభాగ్యమున్నవౌతాయి. సంభోగ సమయంలో చంద్రుడు ఆనందాన్నందించినట్లు 'గుణం' రుచితమౌతుందని క్షేమేంద్రుడి అభిమతం. కావ్యంలో ప్రస్తుతార్థానికి తగినవిధంగా ఓజస్సు, ప్రసాదం, మాధుర్యం సౌకుమార్యం మొదలైన గుణాలను కవి పోషిస్తే గుణౌచిత్యమౌతుంది.

1.1 ఓజోగుణం:

"విలసిత సమాస భరితో / జ్వల బంధంబోజమయ్యె" (కావ్యా. సం. 4వ ఆశ్వా. 69) అని కావ్యాలంకారసంగ్రహంలో రామరాజభూషణుడు పేర్కొన్నాడు. ఈ గ్రంథలఘుటీకలో "ఎక్కువ సమాసాలు గలది ఓజము" అన్న వివరణ కనిపిస్తోంది. "గాఢబంధత్వమోజః" అని 'కావ్యాలంకార సూత్రవృత్తి' ఓజోగుణాన్ని నిర్వచించింది.

మ.  సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా

ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి

స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ

కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై. (2స్కం.146)

భాగవతం ద్వితీయ స్కంధంలోని నరసింహ స్వామి అవతార ఘట్టాన్ని ఆవిష్కరించిన ఈ పద్యం దీర్ఘ సమాస యుతంగా ఉండి, ఓజోగుణౌచిత్యంతో పోతన చిత్రించాడు.

1.2 మాధుర్యగుణం:

"సరసములగు వాక్యంబులు / వరుసను వేర్వేఱ మించువగ మాధుర్యంబు" (కావ్యా. సం. 4వ ఆశ్వా, 60వపద్యం) అని కావ్యాలంకార సంగ్రహంలో పేర్కొన్నారు. వాక్యంలో పదాలు వేరు వేరుగా ఉండడం మాధుర్యగుణమౌతుందని లఘుటీకలో బులుసు వేంకట రమణయ్య వివరణ.

"చిత్తద్రవీభావమయోప్లాదో మాధుర్యమిష్యతే" - కోమలరచనతోకూడిన శృంగార కరుణ, శాంత, రసాలను ఆస్వాదించేటప్పుడు చిత్తానికి కలిగే ఆనందం(ద్రవీభావం) మాధుర్యం.

విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో గుణాలస్వరూపాల్ని, అవి ఏ ఏ రసాల్లో ఎలా ప్రవర్తిస్తాయో ఆ క్రమాన్ని చెప్పి, ఏ ఏ గుణాలు ఎలాంటి రచనలో ఉండాలో కూడా చెప్పి ఆ క్రమాన్ని వివరించాడు.

భాగవతంలో మాధుర్యగుణంతో ఉన్నపద్యమిదిగో. మాధుర్య గుణౌచిత్యానికి శృంగార రస భూమికగా చక్కటి ఉదాహరణ ఇది.

మ.  అమరేంద్రాంగన లాకసంబున విమానారూఢులై పోవుచుం

గమలాక్షున్ శుభమూర్తిఁ గాంచి మురళీగానంబు లందందఁ గ

ర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలఁగా నాథాంకమధ్యంబులం

బ్రమదా! వ్రాలిరి చూచితే వివశలై పంచాశుగభ్రాంతలై?

అదిగో దేవతాస్త్రీలు విమానాలెక్కి ఆకాశవీధిలో వెళుతూ, మంగళమూర్తి అయిన కృష్ణుడిని తిలకించి, ఆయన వేణుగానం వీనులపడగానే పులకించారు. వారి కలాపం అనే మొలతాళ్ళు వదులైపోసాగాయి. వారు వశంతప్పి మదనపీడితులై పతుల ఒడులలో ఒరిగిపోతున్నారు .

గోపికలు శృంగార రసోచితంగా సరసమైన వాక్యాలలో చెప్పిన ఈ పద్యం మాధుర్య గుణాన్ని కలిగి ఉండి ఔచిత్యశోభితమైంది.

1.3 ప్రసాదగుణం:

"ప్రసిద్ధ పదంబుల నలఘూక్తి ప్రసాదమయ్యె" (కావ్యా. సం. 4వ ఆశ్వా. 57) - శీఘ్రంగా అర్థాన్ని బోధించే పదాలుండడం ప్రసాదగుణం. వెంటనే బోధపడే పదాలుంటే దానిని ప్రసాదగుణం అనవచ్చు. 'ప్రసాదవత్ ప్రసిద్ధార్థమ్' అని కావ్యాదర్శం. 'సప్రసాద: సమస్తేషు రసేషు రచనానుచ' అని సాహిత్యదర్పణం. ప్రసిద్దార్థమైన రచన - ప్రసాదగుణభరితమౌతుంది. ప్రసాదగుణంతో కూడిన రసం శుష్కేంధాగ్నిలాగ నీటిలాగ తటాలున వ్యాపించి సామాజికుడికి చిత్త వికాసం కల్గిస్తుందని ఆనందవర్ధన, విశ్వనాథుల నుడి.

ఉ.  నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ

జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా

జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!

మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే! (10 స్కం. పూ.భా. 1011)

నల్లని దేహము వాడు, కమలములవంటి కన్నులు గలవాడు, కరుణా రసము కురిపించేవాడు, సిగపై నెరపిన నెమలి పింఛము కలవాడు, చిరునవ్వు చెలువారే చక్కని మోము కలవాడు నైన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనం దోచి తెచ్చాడు. ఓ మల్లెలార! మీ మల్లె పొదల మాటున కాని ఉన్నాడేమో కొంచం చెప్పండమ్మా.

ఈ పద్యంలో ఉపయోగించిన పదాలు, పరస్పర భావాలు లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. అందువల్ల ఇక్కడ ప్రసాదగుణం వేగంగా అర్థాన్ని బోధిస్తూ ఔచిత్య శోభితమైంది.

1.4 సౌకుమార్య గుణం:

"అరయగ బొట్లు పిఱుందుల నరుదగునది సౌకుమార్యము" (కావ్యా. సం. 4వ ఆశ్వా. 60) నిండుసున్నలతో కూడిన కోమలాక్షరాల కూర్పు 'సౌకుమార్యగుణం' ఔతుందని నరసభూపాలీయం. 'అపారుష్యమ్ సౌకుమార్యమ్' అని వామనుడు చెప్పాడు. 'అపారష్యమ్' అనడంలో బిందుపూర్వక 'క, చ, ట, త, ప'లు సౌకుమార్య గుణానికి లక్ష్యాలుకావు. 'గ, జ, డ, ద, బ'లు సరళాలు కాబట్టి కోమలత్వాన్ని తెలుపుతూ ఔచిత్యవంతంగా ఉంటాయి.

శా.  శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్. (1స్కం. 1)

ఈ పద్యంలో బిందు పూర్వకమైన సరళాక్షరాలు ఔచిత్యవంతంగా శబ్దాలంకారభరితంగా శోభిల్లాయి. అందువల్ల ఇది సౌకుమార్యగుణౌచిత్యం.

2. అలంకారౌచిత్యం :

శ్లో.   అర్థౌచిత్యవతా సూక్తిరలంకారేణ శోభతే

       పీనస్తనస్థితేనేవ హారేణ హరిణేక్షణా. (ఔ.వి.చ. 15)

ఉన్నతమైన కుచాల మధ్యలోనున్న హారంతో అలరారే కామినిలాగ, ప్రస్తుతార్థానికి తగినట్లుగా ఉండే ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం లాంటి అలంకారాలతో కూడిన కావ్యం అందంగా ఉంటుంది. ప్రతిపద్యంలో, సన్నివేశంలో, సంభాషణలో శతాధికమైన అర్థాలంకారాలు, షడ్విధ శబ్దాలంకారాలు కనిపిస్తూనే ఉంటాయి. "అలంకారాస్త్రలంకారా గుణాఏవ గుణాస్పదా" అని క్షేమేంద్రుడన్నాడు. అలంకారాలైనా గుణాలైనా సందర్భోచితంగా ప్రయోగిస్తేనే శోభిస్తాయి. లేకపోతే ఎలాంటి రచనైనా కృత్రిమంగా ఉంటుంది. ప్రస్తుతార్థానికి తగినట్లుగా ఉండే ఉపమ, ఉత్త్ప్రేక్ష, రూపకం మొదలైన అలంకారాలు కావ్యానికి ఔచిత్యశోభను చేకూరుస్తాయని క్షేమేంద్రుడి మాట.

2.1 శబ్దాలంకారం:

ఆంధ్రమహాభాగవతం అనగానే గుర్తుకు వచ్చేవి శబ్దాలంకారాలు.

కం. అడిగెద నని కడువడిఁ జను

నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్

వెడవెడ సిడిముడి తడఁబడ

నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్. (8.స్కం.103)

గజేంద్రుణ్ణి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు వెళ్తున్నప్పుడు మహాలక్ష్మీ దేవి యొక్క మానసిక స్థితి ఈ పద్యంలో వృత్యనుప్రాసతో చాలా చక్కగా పోతన వర్ణించాడు. ఇక్కడి అలంకారం శ్రీదేవి యొక్క మానసిక స్థితిని ఆవిష్కరిస్తోంది. అడగాలా వద్దా? అడిగితే ఏమ నుకుంటాడో? వంటి ఊగిసలాడే మనసును ఆమె నడకలో చూపించిన ఈ పద్యం వర్ణనకు పరిపుష్టిని చేకూరుస్తూ ఈ శబ్దాలంకారం ఔచిత్యవంతమైంది.

భాగవతంలో వివిధ ఘట్టాలలో శబ్దాలంకారాలు చాలా చక్కగా శోభిస్తున్నాయి. సప్తమ స్కంధంలో 169 పద్యమైన కమలాక్షు నర్చించు కరములు కరములు అనే పద్యంలో లాటానుప్రాస అలంకారం ఉంది. అదే విధంగా దశమస్కంధం ఉత్తర భాగంలోని 172 వ పద్యమైన లేమా దనుజుల గెలువగ లేమా అనే చోట యమకాలంకారం ఉంది.

2.2 అర్థాలంకారం:

భాగవతంలో అర్థాలంకారాలకు కొదవేలేదు. ఇప్పుడు నేను ఉల్లేఖాలంకారాన్ని ఉదహరిస్తున్నాను. "బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే" అంటే ఒకే వస్తువు పలువురికి పలు విధాలుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది. భాగవతంలోని నరకాసుర వధ ఘట్టంలో సత్యభామశ్రీకృష్ణుడికి నరకాసురుడికి ఒక్కో విధంగా కనిపించిందిట.

సీ.  రాకేందుబింబమై రవిబింబమై యొప్పు; నీరజాతేక్షణ నెమ్మొగంబు;

కందర్పకేతువై ఘన ధూమకేతువై; యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;

భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై; మెఱయు నాకృష్టమై మెలఁత చాప;

మమృత ప్రవాహమై యనల సందోహమై; తనరారు నింతిసందర్శనంబు;

తే.గీ హర్షదాయియై మహారోషదాయియై పరఁగు ముద్దరాలి బాణవృష్ణి;

హరికి నరికిఁ జూడ నందంద శృంగార వీరరసము లోలి విస్తరిల్ల. (10 స్కం. ఉ.భా. 183)

ఏక కాలంలో ఆ సుందరాంగి ఒక ప్రక్క పతిపై అనురాగం, ఒక ప్రక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది; అప్పుడు, ఆమె నిండు ముఖ పద్మమును కృష్ణుడికి చంద్ర బింబములాగా, నరకాసురుడికి సూర్యమండలం లాగా కనబడుతోంది; అందమైన ఆ అతివ పైట కొంగు కన్నయ్యకు కందర్పుని జెండాలాగా, ఆ ధూర్తుడికి ధూమకేతువు లాగా కనబడుతోంది;

ఆమె చేతి విల్లు మానసచోరుడికి మన్మథ భావాలు ఆవరిస్తున్నట్లుగా, ఆ దానవుడి పాలిటికి ప్రళయకాలపు సూర్యుని చుట్టి ఉన్న పరివేషంలాగా బహు ఆకర్షణీయంగా మెరుస్తోంది; ఆ సుందరి సౌందర్యం గోపయ్యకు అమృత ధారలను, అసురుడికి అగ్నిశిఖలను చూపెట్టుతూ మెరిసిపోతోంది; ఆ భామ బాణవర్షాలు హరికి హర్షమును, అరికి మహా రోషమును కలిగిస్తున్నాయి; అలా అక్కడికక్కడే శృంగార, వీర రసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించింది. ఇక్కడ ఉల్లేఖాలంకరం ఎంతో ఔచితీమంతంగా ఉంది.

3. రసౌచిత్యం:

శ్లో.        కుర్వన్ సర్వాశయే వ్యాప్తి మౌచిత్యరుచిరో రసః

            మధుమాస ఇవాశోకం కరోత్యంకురితం మనః  (ఔ.వి.చ. 16)

వసంతం అశోకవృక్షాన్ని అంకురింపజేసినట్లు, ఔచిత్యంతో శోభిల్లే రసం అందరి హృదయాల్లోనూ వ్యాప్తి చెంది, మనస్సును అంకురింపజేస్తుంది. అంటే మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట.

రసౌచిత్యాన్ని క్షేమేంద్రుడు రససంఖ్యననుసరించి ప్రధానంగా తొమ్మిది భాగాలుగా విభజించి, విడి విడిగా ఉదాహరణలతో విచారించాడు. రసౌచిత్యం - భేదాలు- 1 శృంగార, 2. హాస్య, 3. కరుణ, 4. రౌద్ర, 5. వీర, 6. భయానక, 7 బీభత్స, 8. అద్భుత, 9. శాంత రసాలు. భాగవతంలో కూడా నవరసాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

3.1 శృంగార రసం:

ఆంధ్ర మహాభాగవతంలో శృంగారరసం విశిష్టమైనది, విలక్షణమైనది. ఈ రసాన్ని భాగవతంలో-

3.1.1 దివ్యులకు సంబంధించినది

3.1.2 మహర్షులకు సంబంధించినది

3.1.3 మహారాజులకు సంబంధించినది

3.1.4 మానవులకు సంబంధించినది

3.1.5 పశుపక్ష్యాదులకు సంబంధించినది

3.1.6 ఋతుపరంగా వర్ణించబడినదిగా విభజించవచ్చును.

కం. కెంపారెడు నధరంబును

జంపారెడి నడుము సతికి శంపారుచులన్

సొం పారు మోముఁ గన్నులుఁ

బెంపారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్. (8 స్కం. 267)

పాలసముద్రం నుండి ప్రభవించిన శ్రీదేవిని చూసిన క్షీరసాగర మధనాన్ని చేస్తున్న దేవాసురులు సమస్త గంధర్వాదులు చూసిన లక్ష్మీ దేవి వర్ణన. ఇది దివ్యులకు సంబంధించినది.

అలాగే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో (దశమ స్కంధం పూర్వ భాగములో) ఇలాంటి వర్ణన ఉంది. మహర్షులు పరంగా శృంగార రసాన్ని తృతీయ పంచమ స్కంధాల్లోనూ, మహా రాజులకు సంబంధించిన శృంగార రసాన్ని నవమ దశమ స్కంధాలలో, మానవుల శృంగారవర్ణన చతుర్థస్కంధంలో పురంజనోపాఖ్యానంలో, షష్ఠ స్కంధములో అజామిళోపాఖ్యానములో ఉంది. పశుపక్ష్యాదుల శృంగార రసం భాగవతం అష్టమ స్కంధంలో గజేంద్రమోక్షఘట్టంలో ఉంది. దశమస్కంధము పూర్వభాగములో హేమంతువర్ణన శృంగారరసోపేతంగా ఔచీత్య వంతంగాఉంది. ప్రఖ్యాతమైన ఈ క్రింది పద్యంలో శృంగారరసం ఈ విధంగా ఉంది.

సుకుమారశృంగారచిత్రణలో పోతనతో సమానమైన తెలుగుకవి మరొకరులేరని విజ్ఞులైన పరిశోధక పండితుల సిద్ధాంతం (దేవులపల్లి రామానుజరావుగారి ఉవాచ). వామనావతారకథలో బలిచక్రవర్తి యొక్క దానవీరంలో శృంగారరసాన్ని పండించారు బమ్మెరవారు.

"దానం తీసుకునే శ్రీహరిహస్తం కిందుగా ఉండి, నా చేయి మీదుగా ఉండే అవకాశం వచ్చింది. ఇక నా రాజ్యం గీజ్యం ఉంటేయేం ఊడితేయేం, ఇక నా శరీరం అపాయాన్ని పొందకుండా ఉంటుందా" అనే స్థాయిలో ఉండే దానవీర రసంగల పద్యంలోనే హృద్యంగా శృంగారరసాన్నీ పండించాడు. బమ్మెరవారు ఆ పద్యం-

శా.  ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై

బాదాబ్జంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే (7 స్కం.)

"రసికావతంసుడు మొట్టమొదట కచార్షణం చేసి నాయికను అభిముఖం చేసుకుని భ్రూ నేత్ర చుంబనం చేస్తాడు. ఆపై అంసోత్తరీయాన్ని అపనయించి కుచగ్రహణం చేస్తాడు.శ్రీహరి కూడా అలిగే ఉపక్రమించాడు. కానీ లక్ష్మీదేవి కోపగోప కావడంతో ఉపలాలనకు ఉపక్రమించాడు. ఇక్కడ శ్రీసతి కుపితనాయిక. శ్రీహరి తన హస్తంతో శ్రీదేవీ కేశపాశాన్నిపట్టి తనవైపుతిప్పుకోబోగా ఆమె తప్పించు కుంది. దాంతో ఆమె మేను తాకబోయాడు. మళ్లీ తప్పుకుని ఆమె ముందుకు సాగింది. అప్పుడు ఆమె (అంసోత్తరీయంబు) మూపునవేలాడే పైటను అందుకుని బతిమిలాడే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె స్వాధీనం కాలేదు. కనుకనే మదన జనకుడై హరి శ్రీదేవి కోపానికి ఉపశమన సాధనంగాఆమె పాదాబ్జాలపైపడడమనే పరమప్రేమాస్త్రాన్ని ప్రయోగించాడు. బిడియంతో ఉన్నా / కోపంతో ఉన్నా, ఉత్తమ ఇల్లాలు, తన పాదలనుతాకిన భర్తకు స్వాధీన మవుతుంది. ("వ్రీడాయుక్తాsపి యోషి దత్యంత క్రుద్ధాsపి పాదపతన మతివర్తత ఇతి సార్వత్రికం" -అని సూత్రం) అంతే ఆదిలక్ష్మి కరిగిపోయింది, పతికి స్వాధీన అయింది. దాంతో శ్రీపతి హస్తం మళ్లీ ఆమె (కపోలతటిపై) చెక్కిళ్లపై చేరి, (నూత్నమర్యాదంజెందు) సుతారంగా స్పృశించింది, ఆ చేయి అలా కిందికిదిగిపాలిండ్లపై (నూత్నమర్యాదంజెందు) నిత్యనూతనమర్యాదతో వ్యవహరించింది. ఇలా శ్రీపతి క్రియాశృంగార విశేషాలను వర్ణించడం బమ్మెర వారి శృంగారదార్శనికతకు, భాగవతంలో లభిస్తున్న ఎన్నో ఉదాహరణలలో ఇదొకటి" (శ్రీ వైద్యం వేంకటేశ్వర్లు గారి పరిశోధనాత్మకమైన వివరణ).

3.2 హాస్యరసం:

హాస్య రసానికి స్థాయి భావం హాసం. భాగవతం దశమ స్కంధం పూర్వభాగంలో బాలకృష్ణుడి అల్లరి చేష్టలను హాస్యరస పూర్వకంగా పోతన రచించాడు. అందులో మచ్చుకు ఒక పద్యం.

కం.  తెఱవ యొకతె నిద్రింపఁగ

నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం

గఱపించి నీ కుమారుఁడు

వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ! (10స్కం. పూ.భా. 324)

ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! భాగవతంలో హాస్యరసం కొన్నిచోట్లే కనిపించినా ఔచిత్యంతో ఒప్పుతోంది.

3.3 కరుణరసం:

కరుణ రసానికి స్థాయూభావం శోకం. భాగవతంలో ఒకటవ స్కంధంలో 356 వ పద్యం (మన సారథి మన సచివుడు), అలాగే ఒకటవ స్కంధంలో 162 పద్యం, దశమ స్కంధం ఉత్తర భాగంలో 15వ పద్యం (పాపకర్ముడు) మొదలైన చోట్ల కరుణరసం హృదయవిదారకంగా ఉంది.

కం. మన సారథి, మన సచివుడు,

మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుఁడున్,

మన విభుడు, గురుడు, దేవర,

మనలను దిగనాడి చనియె మనుజాధీశా! (1 స్కం. 356)

కృష్ణ నిర్యాణ వార్తను ధర్మరాజుకు తెలియజేస్తున్న సందర్భంలోని పద్యమిది. మనకు తోడుగా ఉండే సారథి మనకు మంత్రాంగం చేసేవాడు మన వియ్యంకుడు మనకు సన్నిహితంగా ఉండేవాడు. మన బాంధవుడు మన గురుడు అయినటువంటి కృష్ణుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు.. అని చెప్పే ఈ పద్యంలో కరుణ రసం ఔచితీవంతంగా ఉంది.

3.4 రౌద్ర రసం:

రౌద్రరసానికి స్థాయీభావం క్రోధం. ఆంధ్రమహాభాగవతములో శ్రీమన్నారాయణుని మహిమలను తెలియజేసే భక్తుల చరిత్రలు శ్రీకృష్ణ లీలలు వాటి పరమార్థం, దేవదానవులు కలహాలు ప్రధానంగా వర్ణించబడ్డాయి. ఇందులో ప్రతినాయకులైన దానవులలో రౌద్ర రసం స్పష్టమవుతుంది. ఆంధ్రమహాభాగవతంలో భీముడి పాత్రచిత్రణ దానవుల ఉద్రేకపూరితమైన మనశ్చిత్రణములో ఈ రౌద్రరసం భాసిల్లింది.

చం. కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్

విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీఁడు విప్రుఁడే?

విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా

పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్." (1వ. స్కం.167)

ఉపపాండవులైన తన కొడుకులను చంపిన గురుపుత్రుడు అశ్వత్థామను విడిచిపెట్టమని ద్రౌపది అన్నప్పుడు, భీముడికి వచ్చిన కోపాన్ని ఈ పద్యంలో ఔచితీమంతంగా పోతన వర్ణించాడు. భాగవతంలో ప్రథమస్కంధంలో కలిపురుషుని వర్ణన, శృంగి శాపఘట్టంలో, తృతీయస్కంధంలో యజ్ఞవరాహమూర్తి హిరణ్యాక్షుని వధించిన వృత్తాంతంలోనూ, చతుర్థస్కంధంలో దక్షుడు పరమేశ్వరుని శపించిన వృత్తాంతంలోనూ, షష్ఠ స్కంధంలో నారదుని శాపవృత్తాంతంలోనూ, సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుని వృత్తాంతంలోనూ, నవమ స్కంధంలో దుర్వాస మహర్షి వృత్తాంతంలోనూ, దశమస్కంధం ధేనుకాసురవధ వృత్తాంతంలోనూ, చాణూర ముష్టికులవధ లోనూ రౌద్ర రసం పోషింపబడింది.

3.5 వీర రసం:

వీరరసానికి స్థాయీభావం ఉత్సాహం. ఆంధ్ర మహాభాగవతంలో వామనచరిత్రలో దానవీరం, గజేంద్రరక్షణంలోనూ, కుచేలరక్షణ, ఉత్తర గర్భరక్షణ, హాలాహల భక్షణం, కాళీయమర్దనం, యమలార్జున భంజనం, కుబ్జానుగ్రహం మొదలైన ఘట్టాలలో దయావీరం కనిపిస్తుంది. శమంతకోపాఖ్యానం, గురుమృతపుత్రుని పునరుజ్జీవితుని చేయటం, మొదలైన చోట్ల ధర్మవీరం కనిపిస్తుంది. సాల్వ జరాసంధ విడూరథ నరకాసుర చాణూర ముష్టిక కంసాది దుష్టులను శిక్షించడంలో యుద్ధవీరం కనిపిస్తుంది.

మ.  "ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబెయా ద్రౌణి ని

ష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీ

కరబాణంబుల నేఁడు వానిశిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ, ద

చ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా!" (1వ స్కం.142)

అశ్వత్థామ మీద కోపంతో అర్జునుడు చెబుతున్న టువంటి ఈ మాటలు వీర రసంతో ఔచిత్యవంతంగా ఉన్నాయి. నిద్రపోతున్న టువంటి బాలకులను కరుణ లేకుండా చంపిన ద్రౌణి శిరస్సును ఖండిస్తానంటున్నాడు. ద్రౌణి అనటంలో గురువైన ద్రోణుడిని కొడుకైనా, అని అర్థం స్ఫురణకు వస్తూ యుద్ధవీరాన్ని తెలియజేస్తోంది.

3.6 భయానక రసం:

భయానక రసానికి స్థాయీభావం భయం.  ఆంధ్ర మహాభాగవతంలో అక్కడ అక్కడా రేఖామాత్రంగా భయానక రసం పోషించబడింది.

శా.  తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా

పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్

మున్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా

సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియభ్రాంతితోన్. (1స్కం.144)

శిశుహంతయిన అశ్వత్థామ, అర్జునుడికి భయపడి, దూరంగా వెళ్లి ప్రాణరక్షణకై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినట్లుగా పోతన రచించాడు.

3.7. బీభత్స రసం:

బీభత్సరసానికి స్థాయీభావం జుగుప్స. రక్తం మాంసం మొదలైన దానివలన మనసుకు కలిగే ఉద్వేగం జుగుప్స అనబడుతుంది. సామాన్యంగా రణరంగ వర్ణన సందర్భాలలో ఈ బీభత్సరసం పోషించబడుతుంది. ఆంధ్ర మహా భాగవతంలో తక్కువ సందర్భాలలో బీభత్సం పోషించ బడింది.

మ.  హరిమీఁదన్ దితిసంభవుండు ఘనమాయాకోట్లు పుట్టించినన్

ధరణీచక్రము భూరి పాంసుపటలధ్వాంతంబునం గప్పె భీ

కర పాషాణ పురీష మూత్ర ఘనదుర్గంధాస్థి రక్తావళుల్

గురిసెన్ మేఘము లభ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై. (3స్కం. 683)

         ఆ రాక్షసుడు విష్ణువుమీద కోట్లకొలది మాయలు ప్రయోగించాడు. భూమండలమంతా దుమ్ము రేగి చీకటితో నిండిపోయింది. మేఘాలు భయంకరంగా రాళ్ళను, మలమూత్రాలను, కుళ్ళిన ఎముకలను, రక్తప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి. ఇది పోతన చిత్రించిన ఔచిత్యవంతమైన బీభత్సరసం.

3.8 అద్భుత రసం:

అద్భుత రసానికి స్థాయీభావం విస్మయం. శ్రీ మహాభాగవతం శ్రీకృష్ణ మూలం. అడుగడుగున అద్భుత విషయాలు ద్యోతకాలై, సహృదయ పాఠకులకు దివ్యానుభూతుల నెన్నింటినో అందిస్తాయి.

కం.  ఉండ నిదిఁ గొంచె మెంతయు

నొండొకటిం దెమ్ము భూవరోత్తమ! యనుడున్

గండకముఁ దెచ్చి విడిచెను

మండలపతి సలిల కలశ మధ్యమున నృపా! (8స్కం. 697)

అష్టమ స్కంధంలో మత్స్యావతార ఘట్టంలోని ఈ పద్యంలో ఆ చేప అంతకంతకూ పెరిగి పోవడం అద్భుత రసమనే చెప్పవచ్చు.

3.9 శాంతరసం:

దీని స్థాయీభావం శమం. శ్రీ మహాభాగవతము భక్తి రసప్రధానంగా రచించబడింది. ఇందులో అడుగడుగునా భక్తి తత్పరతకే ప్రాధాన్యం ఎక్కువ. శాంతరసమున్న ఘట్టాలు తక్కువ. భాగవతంలో ప్రథమస్కంధం లో శుకుని స్వభావ వర్ణంలో శాంతరసం కనిపిస్తుంది.

మ.  సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్న్యాసియై యొంటిఁ బో

వ మహాభీతి నొహోకుమార! యనుచున్ వ్యాసుండు చీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ

తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్. (1.స్కం. 53)

ఇందులో శుకుని వర్ణించడానికి వాడిన పదాలన్నీ ఔచితీవంతంగా, శాంత రస ప్రధానంగా ఉన్నాయి.

ముగింపు:

ఈ విధంగా శ్రీమదాంధ్రమహాభాగవతంలో క్షేమేంద్రప్రోక్తమైన అనేక  గుణౌచిత్యాలను, వివిధ అలంకారౌచిత్యభేదాలను, నవరసౌచిత్య రీతులను ఎంతో పోతన కవి సహజంగా చిత్రించాడని నిరూపించవచ్చు.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్ర కవుల ఔచిత్య విచారణ-కాశీ భొట్ల సత్యనారాయణ-సాహిత్య అకాడమీ ప్రచురణ
  2. ఆంధ్ర మహాభాగవతము రస పోషణము -తాత వెంకటలక్ష్మి స్వీయ ప్రచురణ విజయనగరం
  3. ఔచిత్య ప్రస్థానము చారిత్రక సమీక్ష-స్ఫూర్తిశ్రీ టి భాస్కరరావు
  4. ఔచిత్య విచార చర్చ-జమ్మలమడక మాధవరామ శర్మ- అభినవభారతి ప్రచురణలు గుంటూరు
  5. కావ్యాలంకార సంగ్రహం-రామరాజభూషణుడు
  6. తెలుగు ప్రాచీనపంచకావ్యాల్లో ఔచిత్యసిద్ధాంతం: పరిశీలన (సి.గ్రం), రాంభట్లపార్వతీశ్వరశర్మ విశాఖపట్నం
  7. పోతన భాగవతము 5 సంపుటాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, తిరుపతి
  8. శ్రీనాథుని సాహిత్య ప్రస్థానం (సి. గ్రం)-జంధ్యాల జయకృష్ణ బాపూజీ గుంటూరు 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "మే-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-ఏప్రిల్-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "మే-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]