AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797
4. దార్లమాట శతకం: సమాజప్రతిఫలనం
డా. మంగళగిరి శ్రీనివాసులు
ఎం.ఏ., యూ.జి.సి.-నెట్, ఎ.పి.సెట్.,
సహాయ ఆచార్యులు (సి),
తెలుగు శాఖ, పీ.జీ.సెంటర్, గద్వాల,
పాలమూరు విశ్వవిద్యాలయం,తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9491388662. Email: mangalagiri.srinivas@gmail.com
Download PDF
Keywords: శతకం, సమాజం, నీతి, చదువు, సంస్కారం, మాతృభాష, దళితులు, రాయలసీమ, దార్ల
ఉపోద్ఘాతం:
దార్లమాట శతకం కృతికర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. దార్లను కని పెంచి సమాజానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు కీ. శే. దార్ల అబ్బాయి (శ్రీలంకయ్య), శ్రీమతి పెద నాగమ్మలు. వారి ఆశీర్వాద మహిమచే "మట్టిలో మాణిక్యం" అనే మాటను నిజం చేయడానికి చిన్నతనంలోనే తెలుగు పై అభిమానంతో ఆతుకూరి లక్ష్మణరావు వద్ద శిష్యరికం చేసారు. ఛందస్సులో పద్యాలు వ్రాయాలని మదిలో బీజావాపనం చేసుకుని, పద్యాలు రాస్తూవచ్చారు. అలా రాసి వుంచిన పద్యాలను శతకంగా ప్రచురించాలనేది సంకల్పం. అట్టి సంకల్పానికి చేదోడుగా మిత్రుడు గోవిందుని గోవర్ధన్ సహకరించగా పద్య సాధనలో చాతుర్యం నింపిన శంకరాభరణం బ్లాగు, వాట్సాప్ సమూహాల నిర్వాహకుడు కందిశంకరయ్య ప్రోత్సాహం వీరికి కొండంత అండ. దార్ల రాసిన పద్యాల ప్రతిభను గుర్తించి మొచ్చుకోలులు అందించిన ఆచార్య రేమిళ్ల వేంకట రామకృష్ణ శాస్త్రి, మల్లవరపు జాన్ కవుల సహృదయుల ప్రేమలు వెన్నంటి నిలిచాయి.
దార్లమాట శతకం కృతికర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, దార్లమాట శతకం కృతిభర్త కొత్తూరు సత్యనారాయణ గుప్త ఈ ఇరువురు కూడా అసామాన్య సాహిత్య సంపన్నులు, సాహిత్య సేవకులు, నిర్విరామ కృషివలులు కావడం విశేషం. ఇరువురి మార్గాలు వేరు వేరు. ఒకరేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ అధ్యక్షులు, ఆచార్యులు, సాహిత్య పరిశోధకులు, అన్నింటికి మించి శిష్యులకు ప్రేమతో పాఠాలు బోధించే గురువులు దార్ల వెంకటేశ్వర రావు. మరొకరు సంపాదకులు, సమాజ సేవకులు, సాహిత్య సేవకులు, అయినప్పటికీ సాహిత్యవృక్షం నీడన కొలువైన వ్యక్తులు కృతిభర్త కొత్తూరు సత్యనారాయణ గణేష్ దినపత్రికకు సంపాదకులు. ఈ పత్రిక కర్నూల్ నుంచి వెలువరిస్తున్నారు. ఇందులో ఎంతో మంది కవులను ప్రోత్సహిస్తూ వారు పంపిన కవితలను పద్యాలను సాహిత్య అంశాలను ప్రతిదినము ఒక పేజీని వీలునుబట్టి ఆ పత్రికలో కవులను రచయితలను ప్రోత్సహిస్తున్న దారిలో దార్ల వెంకటేశ్వరరావుకి కొత్తూరు సత్యనారాయణగారితో పరిచయం ఏర్పడింది. దార్ల గణేశ పత్రికకు తరుచుగా కవితలు పద్యాలు పంపుతూ ఉండేవారు వాటిని గణేష్ పత్రికలో అచ్చు వేస్తూ ఉండేవారు. కొత్తూరు సత్యనారాయణ గుప్త చేస్తున్న సేవలను గుర్తించి దార్ల వారు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు.
పుస్తక ముఖచిత్రం నీలివర్ణ పరదాఛాయన శశకరూపం కల్గిన చిన్నసైకిల్ పై సవారి చేస్తూ ముద్దులొలికే ముసి ముసి నవ్వుల చిరంజీవి, డాక్టర్ ఎం. మంజుశ్రీ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు దంపతుల గారాల పట్టి, పుత్రరత్నం శ్రీనివాసరావు ముఖచిత్రం చూడగానే ఆనందం, సంతోషం, అనురాగం, ఆప్యాయతలు కనిపిస్తున్నాయి. లోకంలోని ఏ తల్లిదండ్రులకైనా ఆస్తి అంతస్తులకన్నపేగుతెంచుకు పుట్టిన పిల్లలపై ఉండే ఆప్యాయత ఆనంతం. దార్ల దంపతులకు పుత్రుడు శ్రీనివాసరావుపై ఉన్న వాత్సల్యాన్ని ముఖచిత్రం తెలియపరుస్తున్నది.
ఇట్టి గ్రంథానికి “పూలు పరచిన'దార్ల'లో” శీర్షికన కంది శంకరయ్య అభినందించారు. "స్వాగతం" శీర్షికతో ఆచార్య ఎస్ శరత్ జోత్స్నరాణి, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్, వారు ముందుమాటను రాసారు. దార్ల పద్యాలను కొనియాడుతూ ఆచార్య పిల్లలమర్రి రాములు "విలక్షణ రసహృదయుడు దార్ల" పేరిట అభినందనలు తెలిపారు. ఆచార్య విస్తాలి శంకర్ రావు తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాసు విశ్వవిద్యాలయం వారు “సమకాలీన జీవితాలకు దర్పణం దార్లమాట శతకం” శీర్షికన పరిపూర్ణ సద్విమర్శన రూపంలో కవి గురించి, కుటుంబ నేపథ్యం గూర్చి, వీరి సాహిత్యం గూర్చి తెలుపుతూ దార్లమాట శతకంలోని పద్యాలతో సమన్వయం చేస్తూ పుస్తకం గూర్చి చక్కగా పరిచయం చేసిన ఆచార్య విస్తాలి శంకర్ రావు తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాస్ వారి ఆశీర్వాదం శుభసూచకం. దార్ల వారిపై మక్కువను తెలుపుతూ మల్లవరపు రాజేశ్వరరావు రెండు పద్యాలను రాశారు.
మిత్ర వాత్సల్యం పేరిట గోవిందుని గోవర్ధన్, తెలుగు ఉపన్యాసకులు, పాలెం, వారు మిత్ర వాత్సల్యంతో తొమ్మిది పద్యాలలో వారి గొప్పతనాన్ని తెలియపరిచారు. ఇక కొత్తూరు సత్యనారాయణ గుప్త (కృతిభర్త), ఏమని వ్రాయాలి? అను శీర్షికతో ఆత్మీయ పలుకులు పలుకుతూ కృతికర్తతో ఏర్పడిన పరిచయం తెలియపరుస్తూనే వారి కుటుంబీకులకు ధన్యవాద వందనాలు తెలిపారు.
దార్ల వెంకటేశ్వరరావు "నా పద్య కవిత్వం నేపథ్యం" శీర్షికతో వారి జీవిత విషయాలను, శతకం రాయడానికి పూనుకున్న స్థితిగతులు అన్నీ కూడా ఇక్కడ తెలియజెప్పారు. గ్రంథరూపం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
దార్లమాటశతకం - శతకలక్షణ సమన్వయం:
శతకానికి ఉండవలసిన లక్షణాలలో ప్రాథమికంగా సంఖ్యానియమం, మకుటనియమం, వృత్తనియమం, భాషా నియమం ప్రధానమైనవి వీటిని బట్టి చూస్తే దార్ల మాట శతకంలో పై చెప్పిన విషయ అంశాలన్నీ సంపూర్ణంగా ఉపయోగించారు. సంఖ్యానియమము ప్రకారము వందకు పైగా పద్యాల వినియోగంలో 165 పద్యాలను తీసుకున్నారు. మకుట విషయంలో “దారి పూల తోట దార్ల మాట” అనే మకుటం తీసుకున్నారు. అన్ని పద్యాలకు కూడా 4వ పాదంలో ఇదే మకుటం ఉంటుంది. ఇది "దార్ల వెంకటేశ్వర రావు" నామముద్ర తెలియజేస్తుంది.
వృత్త నియమం ప్రకారం ఆటవెలది పద్యాలను తీసుకున్నారు. భాషానియమం విషయంలో అలతి అలతి మాటలతో సరళమైన పదాలతో పద్యాలను రచించారు. ఇందులోని పద్యాలు అన్నీ విశ్లేషించడం సాధ్యం కాని పని అయినా, మచ్చుకు కొన్ని దార్లమాట శతకంలోని పద్యాల విశ్లేషణలను ఈ పరిశోధన వ్యాసంలో చర్చిస్తాను.
ప్రార్థన:
విఘ్నములు తొలగించే గణపతిని, శివపార్వతులను స్తుతిస్తూ దయతో తమకు పద్య కవిత్వవిద్యను అందించగలరని ప్రార్థిస్తూ శతకమును ప్రారంభించారు.
"శ్రీ గణపతి దేవ! శివపార్వతీ పుత్ర!
నీదు దయను పొంది నిన్ను తలతు.
పద్య విద్య సుజన హృద్యంబు చేయరా!!
దారి పూల తోట దార్ల మాట"
శ్రీకారంతో మొదలుపెట్టడం మంగళసూచకంగా ఉంది. సంప్రదాయబద్ధమైన పద్యకవిత్వానికి ఇది చక్కని ప్రారంభం. ఆదిపూజలందుకునే విఘ్నేశ్వరుణ్ణి, ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను స్తుతిలో ఈ శతకపద్యాలు సుజనహృదయానందకరంగా ఉండేలా అనుగ్రహించమని ప్రార్థించడం కవి భక్తిప్రపత్తులు, ఈ రచన వెనుక ఉన్న ధ్యేయాన్ని తెలుపుతోంది.
రాయలసీమ - ఔన్నత్యం:
ఒక్కో కవికి ఒక్కో ప్రాంతం పట్ల వల్లమాలిన ప్రేమ, మమకారం ఉంటాయి. అవి సందర్భవశాత్తు రమణీయంగా ఆవిష్కృతమౌతాయి. ఈ శతకంలో కవి అక్కడక్కడా ప్రాంతీయాభిమానాన్ని చాటి చెబుతూ వాటి ఔన్నత్యాన్ని ఉగ్గడించారు. అలాంటిదే ఈ కింది పద్యం.
"కరవు నేల కాదు కళలకు పుట్టిల్లు
వనరులుండె, స్వర్ణవజ్రఖనులు,
రాగి సంగటి రుచి రాయలసీమదే
దారి పూల తోట దార్ల మాట"
"రాయలసీమ ప్రాంతంలో ఓరి నాయనా ...." అనే ఒక సినిమా పాటలో కరవు గూర్చి విన్నా... డివిఆర్ పద్యంలో కళలకు పుట్టినిల్లని, గనులు, వజ్రాలు, బంగారం వనరులు ఉన్న నేలని, మంచి బలాన్నిచ్చే రాగుల సంగటి రాయలసీమ వారిదే అన్నట్లు ఆ ప్రాంతం గొప్పతనాన్ని తెలిపారు. ఏదో కరవు నేలగా మాత్రమే భావించకుండా, కళావైభవాన్ని, సంపద్వంతమైన ప్రాభవాన్ని, ఆరోగ్యాన్నిచ్చే పౌష్టికాహారం మొదలైన వాటి గురించి కూడా తెలుసుకోవాలని దత్తమండాలాల ప్రాముఖ్యాన్ని కవి చక్కగా చిన్న పద్యంలో వివరించారు.
మనిషి ప్రవర్తన - విశ్లేషణ:
"విత్తనమును బట్టి వికసించు బుద్ధులు
మట్టి యొక్కటైన మాను వేరు
మనుషులంత యొకటి మర్మంబు వేరయా
దారి పూల తోట దార్ల మాట"
విత్తనమును బట్టి మొలకలు పేరుగుతుంటాయి. మొలక మొలిచే మట్టి మాత్రం అన్ని మొలకలను ఒక్కటే. అయినప్పటికీ మొక్కలు ఎదుగుదల వేరు వేరు ఉంటుందని దీని సమన్వయం మానవులంతా ఒకటే అయిన వారి వారి మర్మాంబులు వేరు వేరుగా ఉంటాయని మనిషి ప్రవర్తనను ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.
మాతృభాష గొప్పదనం:
"అవసరంబు మేర యన్యభాషనయిన
మాటలాడవలయు మరువవద్దు
మాతృభాష యేను మనకు జీవనమగు
దారి పూల తోట దార్ల మాట"
అవసరానికి అన్యభాషలు మాట్లాడు కానీ మాతృభాషనూ ఎప్పుడూ మర్చిపోవద్దు అదియే మనకు జీవితాన్ని అందిస్తుందని మాతృభాషను గొప్పతనం ఈ పద్యంలో తెలిపారు.
భారతదేశంలో దళితుల పరిస్థితులు:
"దళితుడెంత యున్నత పదవి నుండిన
కులము కర్మ యనుచు కూర్మి లేదు!
భరత భూమినందు భాగ్యంబు చూడరా!!
దారి పూల తోట దార్ల మాట"
దళితుడు ఎంత ఉన్నత పదవిని అధిరోహించిన వారితో కలసిమెలసి ఉండరు. కారణం వాడు దళితుడిగా పుట్టడం. అది వాడి కర్మ. భరత భూమిలో ఈవిధంగా చూడరా! అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా "మనం అందరం సమానం" అనే భావనతో ఉండాలని గ్రహించాలంటారు.
చదువు - సంస్కారం:
"చదువు కన్న మిన్న సంస్కారమున్నచో
చక్కగున్న యెడల చదువు లేల?
నోరు మంచి గున్న ఊరికేముందిరా!
దారి పూల తోట దార్ల మాట"
చదువున్న చదువు లేకున్నా సంస్కారంతో వుండడం మిన్న. సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడితే ఏ ఊరు అయితేనేం ఎక్కడైనా మంచిగా జీవించగల్గుతాము అంటారు డివిఆర్.
ముగింపు:
ఈ విధంగా దార్ల వెంకటేశ్వర రావు ఎన్నో సన్నివేశాలు, సమస్యలు,సంఘటనలు, వాటిని తీసుకుంటూ తెలుగు భాషా గొప్పతనం గూర్చి, అమ్మ గూర్చి, రాజకీయ నాయకుల గూర్చి, ఓటు ప్రాధాన్యతను గూర్చి, నీటిని గూర్చి, ఊరిని గూర్చి, నల్లధనం గూర్చి, ప్రకృతిని గూర్చి ఇది అది అని లేకుండా సందర్భోచితంగా మనసుకు తట్టి మది అంతరంగం నుండి మదించగా వచ్చిన మంచి పద్యాలను వెలువరించి తన మేధో జ్ఞాన బండారాన్ని మన చేతిలో పెట్టిన పుస్తకం దార్లమాట శతకం. ఇందులో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క భావాన్ని మనకు తెలియపరుస్తూ ఈనాటి నిజజీవితంతో ముడిపడిన విధానాన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు శతకంలో చెప్పిన గొప్ప దార్శనికుడు దార్ల వెంకటేశ్వరరావు. ఇట్టి మంచి పుస్తకం వెలువరించిన దార్ల వెంకటేశ్వర రావు గారికి నమస్సులతో అభినందన శుభాకాంక్షలు. గువ్వల చెన్న శతకంలో పద్యం గొప్పతనం గూర్చి ఒక పద్యం.
"గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళం జెఱువు తెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యము సుమ్మీ
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా"
గుడి కూలిపోతుంది, మంచి నీటి బావి పూడిపోతుంది, వేగంగా వచ్చే నీటి వేగానికి చెరువు తెగిపోతుంది, వనము కాలిపోతుంది, కానీ ఎప్పటికి నశించిపోనిది పద్యం మాత్రమే అనే భావన్నీ బట్టి దార్ల వెంకటేశ్వర రావు వెలువరించిన దార్లమాట శతకం ధరణి యందు మంచి గుర్తింపుతో ఎప్పటికి నిలిచి ఉంటుంది.
ఉపయుక్తగ్రంథసూచి:
- కదంబం, తెలుగు సాహిత్య ప్రక్రియలు. మూసీ ప్రచురణ
- శాస్త్రి, ద్వానా, తెలుగు సాహిత్య చరిత్ర.
- వెంకటేశ్వరరావు, దార్ల, దార్లమాట శతకం.
- గువ్వల చెన్నడు, గువ్వలచెన్న శతకం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.