headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-5 | May 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

13. శ్రీమన్మహాభారత భీష్మ-ద్రోణపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

కురుపాండవుల మధ్య సంధిప్రయత్నాలన్నీ విఫలమవగా, యుద్ధం అనివార్యమయిన తరుణంలో ధర్మరాజు యుద్ధభారాన్ని ఎలా వహించాడో, వ్యాసభగవానుడు చెప్పిన భవిష్యత్కథనాన్ని స్మరించి, సమస్త రాజలోక వినాశనానికి కారణమైన సంగ్రామంలో పరమాత్ముడైన శ్రీకృష్ణుని ఎలా అనుసరించాడో ఈ వ్యాసంలో తెలుసుకొనవచ్చు. ఒకప్రక్క తనకు తాతగారు, కురుకుల పితామహుడైన భీష్ముడి పతనము, మరోప్రక్క సమస్తవిద్యలను నేర్పిన పరమగురువైన ద్రోణాచార్యుని అస్త్రసన్యాసానికి ధర్మరాజు పాత్ర ఏవిధంగా ఉందనే విషయమును ఈ వ్యాసము ద్వారా తెలుసుకోగలరు.

Keywords: శ్రీమన్మమహాభారత రచనా ప్రారంభం, శాస్త్రపద్ధతిని అనుసరించిన ధర్మరాజు, యుద్ధారంభము, భీష్మపతనం, ధృతరాష్ట్రుని పశ్చాత్తాపం, ధర్మజుని బంధించి అప్పగిస్తానని ద్రోణుడి ప్రతిజ్ఞ, పద్మవ్యూహం, అభిమన్యుడి మరణానికి కారణాలు – విశ్లేషణలో ధర్మరాజు ప్రస్తావన, ధర్మజుడిచే పరమాత్ముడు పలికించిన అసత్యం

1. ఉపోద్ఘాతం:

యుద్ధషట్కమునందలి ముఖ్యమైన భీష్మ-ద్రోణపర్వాలలోని యుద్ధనీతి, రాజనీతి, వీరుల పరాక్రమములు చెప్పుకోదగినవి. కౌరవవీరలలో అగ్రగణ్యులైన భీష్మద్రోణులిద్దరే కలిసి మహాభారత సంగ్రామం జరిగిన పద్దెనిమిది రోజులలో పదిహేనురోజులు పోరాడి శాశ్వతశాంతిని పొంది యుధిష్ఠిరునికి విజయాన్ని చేకూర్చారు. వీరిద్ధరి యుద్ధవిరమణలోనూ ధర్మరాజు పాత్ర స్పష్టంగా ఉంది. ఆ అంశములను పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాసము.

2. శ్రీమన్మమహాభారత రచనా ప్రారంభం:

త్రికాలజ్ఞానియైన వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చాడు. “పుత్రా! నీ పుత్రులకి మృత్యుకాలం సమీపించింది. విచారించకు.

ఇదంతా కాలమహిమ అని భావించు. వారందరినీ యుద్ధంలో చూద్దామని నీకనిపిస్తే చెప్పు, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను. యుద్దమంతా చూడవచ్చు” అన్నాడు. యదిచేచ్ఛసి సంగ్రామే ద్రష్టుమేతాన్ విశాంపతే/ చక్షుర్దతామి తే పుత్ర యుద్ధం తత్ర నిశామయ.2.6

కానీ ధృతరాష్ట్రుడు “నాకు జ్ఞాతుల వధ స్వయంగా చూడాలని లేదు తండ్రీ. కానీ యుద్ధాన్ని యధాతధంగా వినాలని వున్నది” అన్నాడు. దాంతో వరప్రదాత అయిన వ్యాసుడు సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఈ సంజయుడు నీకు యుద్ద వార్తలన్నీ చెబుతాడు. ఇతనికి రహస్యాలు కూడా అన్నీ తెలుసుకునే శక్తి ఉంది. ఎవరన్నా మనసులో అనుకున్న విషయాలు కూడా చెప్పగలడు. రాత్రింబగళ్లూ ఎవరు ఎక్కడ ఏమనుకుంటున్నారో అన్నీ తెలుస్తాయి. అంతేకాక ఈ సంజయుడు యుద్దంలో స్వేచ్ఛగా సంచరించగలడు.

ప్రకాశం వాSప్రకాశం వా దివావా యది వా నిశి/ మనసా చింతితమపి సర్వం వేత్స్యతి సంజయః 2.11

నేను ఈ కౌరవపాండవుల కీర్తిని అందరికీ తెలియచెప్తాను. వీరిగాథను జయం అనే పేర మహాభారతాన్ని రచిస్తాను అని ధృతరాష్ట్రుని వీడి వ్యాసులవారు వెళ్లిపోయారు. అహం తు కీర్తిమేతేషాం కురూణాం భరతర్షభ/ పాండవానాం చ సర్వేషాం ప్రథయిష్యామి మా శుచః 2.13 (అంటే వ్యాసుడు మహాభారత రచన చేసిన సందర్భం ఇక్కడే అన్నమాట. ఈ వ్యాసవచనాన్ని బట్టి యుద్దారంభంలో మహాభారత గ్రంధ రచన సాగిందని చెప్పాలి.) యుద్ధరంగంలో కౌరవుల పదకొండు అక్షౌహిణుల సైన్యం చూసిన ధర్మరాజు అర్జునుడికి ఒక సలహా చెప్పాడు.  “నాయనా! ఎప్పుడైనా యుద్దంలో మన సైన్యం కంటే శత్రుసైన్యం చిన్నదయితే మన సైన్యాన్ని చిన్నదిగా కనబడేట్టు దట్టంగా నిలబెట్టాలి. అలాకాక శత్రుసైన్యం పెద్దదైతే, చిన్నదైన మన సైన్యాన్ని విశాలంగా కనబడేట్టు సూచీముఖవ్యూహాన్ని చేయాలి.

సూచీముఖమనీకం స్యాదల్పానాం బహుభిః సహ/ అస్మాకం చ తథా సైన్యమల్పీయః సుతరాం పరైః 22.5

 ఇది బృహస్పతి నీతి అంటారు. ఈ బృహస్పతి నీతిని అనుసరించి వ్యూహాన్ని రచించు అర్జునా”, అని ధర్మరాజు చెప్పిన రీతిగా అర్జునుడు దుర్భేద్యమైన వజ్రమనే వ్యూహరచన చేసి భీముడిని ఆ సేనకు అగ్రభాగాన నిలిపి కదులుతున్నారు. భీముని రక్షణలో ధృష్టద్యుమ్నుడు, నకుల, సహదేవులు సంచరిస్తున్నారు. వ్యూహానికి మధ్యలో అర్జునుడి రక్షణలో శిఖండి సైన్యం ఉంది. వజ్రవ్యూహం దక్షిణ భాగాన్ని ఇంద్రుడి వలే సాత్యకి పరిరక్షిస్తున్నాడు.  గజసైన్యం మధ్యలో భద్రగజంలా ఈ వ్యూహం మధ్యలో ధర్మారాజు ఇంద్రరథంలాంటి రథం మీద ఉన్నాడు. ఆ సమయంలో పాండవసైన్యం ముందు సింహంలా నిలిచిన భీమసైనుడు ఉగ్రరూపం చూసి నీసైనికులంతా భయంతో బురదలో చిక్కిన ఏనుగుల వలే వ్యధ చెందాయి మహారాజా. మధ్యలో ఉన్న అర్జునుడిని చూసి సారథియైన కృష్ణుడు అన్నాడు- “అర్జునా! కౌరవసైన్యంలో ముందు ఉండి సింహంలా మనల్ని చూస్తున్నవాడే కురువంశోన్నతుండు భీష్ముడు. ఆయన ఇప్పటికి మూడువందల అశ్వమేధ యాగాలు చేసిన మహానుభావుడు. ముందు తక్కిన వారితో యుద్దం చేసి తరువాత భీష్ముడితో యుద్దం చేయమన్నాడు”.

3. శాస్త్రరీత్యా భీష్మాదుల ఆశీస్సులు అందుకున్న ధర్మజుడు:

శ్రీకృష్ణ పరమాత్ముడి చేత గీతామృతాన్ని పొంది ఉత్సాహంగా తన ధర్మాన్ని తాను పాటించటానికి గాండీవాన్ని ధరించి అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు యుద్ధసన్నద్దుడవటం చూసి పాండవవీరులు ఉత్సాహంతో సింహనాదాలు చేశారు, దేవ గంధర్వ, సిద్ధ చారణ మహర్షి గణాలు యుద్ధం చూడటానికి గగనతలంలో నిలిచారు. కానీ ఇంతలో మరో పరిస్థితి ఎదురైంది. ఇంతకుముందు దైన్యస్థితిలో ఉన్న అర్జునుడు గాండీవం విడిచిపెట్టగా, కృష్ణుడు గీతను బోధించి కార్యోన్ముఖుని గావించాడు. ఇప్పుడు ధర్మరాజు ఆయుధాలు విడిచిపెట్టాడు. 

ఇరుసైన్యాలను చూసిన ధర్మరాజు కవచం విప్పి ఆయుధాలు రథం మీదే పడేశాడు. రథం దిగి కాలినడకతో కౌరవసైన్యం వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ధర్మరాజు అలా ఒంటరిగా వెళ్లటం చూసి సోదరులు నలుగురూ ఖంగారు పడుతూ  అనుసరించారు. ఎందుకు వెళుతున్నాడో తెలీదు. భీమార్జునులిద్దరూ అడిగారు. ఈ  సమయంలో కౌరవుల దగ్గరికి ఎందుకు వెళుతున్నావు రాజా? ఆయుధాలు కూడా విడిచి పెట్టావు. ఇంకాసేపట్లో రణం ప్రారంభం కాబోతుంది, కారణం లేకుండా వెళుతున్నావు ఎందుకు అని ఎంత అడిగినా ధర్మరాజు మౌనంగా వెళ్లాడు. అంజలి  ఘటించి కౌరవసైన్యం వైపు వస్తున్న ధర్మరాజుని చూసి, కొంతమంది సందేహపడ్డారు. సోదరులతో కలిసి మనల్ని శరణు వేడటానికి వస్తున్నాడంటూ అవహేళన చేశారు. ఇంతలో కృష్ణుడికి అర్థమైపోయింది ఎందుకు వెళుతున్నాడో. కృష్ణుడు భీమార్జునులతో ప్రశాంతంగా, వివరంగా చెప్పాడు. “మీ అగ్రజుడు శాస్త్రబద్ధంగా యుద్ధప్రారంభంలో పెద్దల అనుమతి తీసుకోవటానికి వెళుతున్నాడు” అన్నాడు. “అలా అనుమతి గ్రహించి యుద్దం చేసిన వారికే జయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం” అన్నాడు కృష్ణుడు.

కృష్ణుడు చెప్పినట్లే ధర్మరాజు భీష్మాదుల వద్దకు వెళ్లి, “పితామహా! నీతో యుద్దం చేయటానికి నీ ఆజ్ఞ కోరుతున్నాను, నన్ను ఆశీర్వదించు, నన్ను అనుమతించు” అని నమస్కరించి వేడుకున్నాడు. వచ్చిన ధర్మరాజుని చూడగానే భీష్ముడు “ధర్మజా! నీవిలా రాకుండా యుద్దం ప్రారంభించి ఉంటే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాడిని.

యద్యేవం నాభిగచ్ఛేథా యుథి మాం పృథివీపతే/ శపేయం త్వాం మహారాజ పరాభావాయ భారత. 43.38

 ఇప్పడు సంతోషించాను, యుద్దం చేసి జయం పొందు, అంతేకాదు. నానుండీ నీకు  ఏం కావాలో కోరుకో, కౌరవుల ధనాన్ని పొందినందుకు, నేను ఆ ధనంచేత కౌరవుల వైపు బంధింపబడినవాడిలా ఉన్నాను. నీ వైపు యుద్ధం చేయటం తప్ప నీకేం కావాలో కోరుకో తీరుస్తాను” అన్నాడు.

అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్/ ఇతి సత్యం మహారాజ బద్దోsస్మ్యర్థేన  కౌరవైః. 43.41

“డబ్బుకి దాసుడవనివాడు ఎవడు ఉంటాడు? కాబట్టి నేను కౌరవులకు సేవకుడిలా, ఒక నపుంసకుడిలా నీతో మాట్లాడుతున్నాను రాజా!”  అన్నాడు. అతస్త్వాం క్లీబవద్ వాక్యం బ్రవీమి కురునన్దన.43.42

విశ్లేషణ - ఇక్కడ భీష్ముడు కౌరవుల చేత బంధించబడిన వాడిలా ఉన్నాను - అన్నాడు. అంటే పాండవులు ధర్మాత్ములు, వారి పక్షాన ఉండాల్సింది పోయి నేను పాపాత్ములైన కౌరవపక్షాన ఉన్నానేంటి, పైగా వారికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాను, అని భీష్ముడి మనసులో సందేహం అప్పుడప్పుడూ కలుగుతూ ఉండేది.  దాన్ని తాను తెలివిగా సమర్థించుకున్నాడు. “నా తండ్రికి నేను మాటిచ్చాను కదా. నాకు వచ్చిన రాజ్యాధికారాన్ని కూడా వదులుకుని నేను రాజ్యాన్ని రక్షిస్తానని చెప్పాను, ఆవిధంగా రాజ్యం ధృతరాష్ట్రుడిది, ఆ ధృతరాష్ట్రుడి ఉప్పు తిన్నాను కాబట్టి వారి పక్షాన ఉండాలి. అందుకోసం కౌరవ పక్షంలో ఉన్నానే గానీ నేను చేసినదాంట్లో తప్పేముందని” తనను తాను సమర్థించుకునే తత్వం భీష్ముడిలో ఎప్పుడూ ఉంది. (ఇక్కడే మరోలా అనుకునివుంటే బావుండేది భీష్ముడు. ధృతరాష్ట్రుడికి రాజ్యాధికార అర్హతే లేదు కదా? పాండురాజు దీనికంతటికీ రాజు, రాజ్యాన్ని వృద్ధి చేసి, గౌరవార్థంగా మాత్రమే ధృతరాష్ట్రుడిని నియమించాడు. కాబట్టి పాండురాజునే నేను సేవించాలి, రక్షించాలి, అతని పుత్రుల పక్షానే నేను ఉండాలి అని అనుకుని ఉంటే మహాభారతం మరోలా ఉండేదేమో. భీష్ముడు మరణించవలసిన అవసరమే ఉండేదికాదేమో).

భీష్ముడు ఏం కావాలో కోరుకోమనగానే, వెంటనే ధర్మరాజు “తాతా! ఓటమి ఎరుగుని నిన్ను ఎలా జయించమంటావు? యుద్ధంలో నీవు అజేయుడివి. ఉపాయం చెప్పు”? అన్నాడు. నిజమే ధర్మరాజా! నేను యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను ఎవరూ ఓడించలేరు అన్నాడు. అందుకే చెప్పు తాతా. నిన్ను ఎలా చంపాలో నీవే సెలవివ్వు? యుద్దంలో చంపక తప్పదు కదా అన్నాడు. దానికి భీష్ముడు నాయనా! నాకింకా మరణసమయం రాలేదు, మళ్లీరా- అన్నాడు. (అక్కడ మళ్లీరా అంటే అర్థం ఇక్కడ అందరూ ఉన్నారు, తిరిగి మళ్లీ కొన్ని రోజులయ్యాక రా, అని అర్థం కదా. అలాగే మరలా తొమ్మిదవరోజు అందరూ వెళ్లి ఇదే ప్రశ్న అడుగుతారు. అప్పుడు భీష్ముడు శిఖండి ఉపాయం చెప్పటం జరిగింది. అసలు తొమ్మిది రోజులు దాకా కూడా ధర్మరాజు భీష్ముడిని అడగలేదంటే అది కృష్ణమాయన్నమాట.  ఎందుకంటే రోజూ రాత్రిపూట ధర్మరాజు భీష్ముడి పరాక్రమాన్ని తలుచుకుని భయపడి యుద్ధం ఆపేస్తే బాగుండు అని అనుకుంటూనే ఉన్నాడు). ఈవిధంగా పెద్దల ఆశీర్వచనాలను అందుకుని ధర్మనందనుడు మహాభారత సంగ్రామంలో శాస్త్రరీత్యా విజయం సాధించటానికి కారకుడయ్యాడని నిర్ధారించవచ్చు.

4. భీష్మపతనం:

తొమ్మిదవరోజు రాత్రి ధర్మరాజుకి బెంగ పట్టుకుంది. ఈ భీష్ముడిని నిలవరించే మార్గమేది.  అంటూ కృష్ణుడిని సలహా అడిగాడు ధర్మరాజు. “ధర్మనందనా! మీకు హితం చేయటానకి నేను ఎప్పుడూ సిద్దమే. పోనీ యుద్దానికి నన్ను నియమించు. ఈ అర్జునుడు భీష్ముడిని చంపటానికి ఇష్టపడకపోతే నేనే ఆ భీష్ముడితో పాటు కౌరవులందరినీ సంహరిస్తాను. ఎందుకంటే పాండుపుత్రులైన మీకు శత్రువైనవాడు నాకూ శత్రువే. మీ మిత్రులే నా మిత్రులు. నావారందరూ నీవారే. నీ వారందరూ నావారే.

యః శత్రుః పాండు పుత్రాణాం మచ్ఛత్రుః స న సంశయః

మదర్థా భవదీయా యే యే మదీయాస్తవైవ తే. 107.32

కాబట్టి నేను వెళ్లియుద్ధం చేయనా” అని అడిగాడు కృష్ణుడు. దానికి యుధిష్ఠిరుడు, “మాధవా! నువ్వు అంత పని చేయటానికి సమర్థుడవే కానీ నీవు ఆయుధం పట్టనని మాట ఇచ్చావు. అటువంటి నీ మాటని అసత్యం చేయటం నాకు ఇష్టంలేదు. నీవు పక్కనే ఉంటే భీష్ముడేముంది. ఇంద్రాదులతో కూడిన దేవతలను కూడా జయించగలను. మొదటి రోజు నేను పెద్దల అనుజ్ఞ తీసుకోటానికి వెళ్లినప్పుడు భీష్ముడు నాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. యుద్ధం దుర్యోధనుడి పక్షానే చేస్తాను కానీ నీకు హితకరమైన సలహా చెప్తాను అన్నాడు. కాబట్టి నాకు మేలు కలిగించే సలహా కోసం త్వరగా అందరం కలిసి భీష్ముడినే కలుద్దాం” అని కృష్ణుడితో పాటు అందరూ కలిసి భీష్ముడి శిబిరానికి చేరుకున్నారు.

భీష్ముడు వారందరినీ సాదరంగా ఆహ్వానించి ప్రేమతో మీకేం కావాలో సంకోచించకండా అడగండి. అది ఎంత కష్టమైనా చేస్తాను అని మాటిచ్చాడు. ధర్మరాజు ఆయనకి నమస్కరించి, “అయ్యా! మాకు యుద్దంలో  విజయం ఎలా చేకూరుతుంది. ఎలా రాజ్యాన్ని పొందగలం. దానికి తగ్గట్టుగా నీ వధోపాయాన్ని నీవే స్వయంగా చెప్పాలి” అని వేడుకున్నాడు. సమాధానంగా భీష్ముడు “మీకు జయం కలగాలంటే నన్ను రేపు ఇష్టం వచ్చినట్టు బాణ ప్రహారంతో కొట్టండి. మీకు అనుమతినిస్తున్నాను. అంతే కాదు మీకు ఇదే పుణ్యకార్యం. నాకు కూడా శుభప్రదమైనది. నన్ను పడగొడితే ఆ తరువాత నుండీ సమస్త కౌరవసైన్యమూ నిహతమైపోతుంది. నేను బాణాల దెబ్బలకు పడాలంటే మీరు శిఖండిని ముందు పెట్టుకుని పోరాడండి. శూరుడైన అర్జునుడు ఆ శిఖండిని ముందు నిలుపుకుని పక్కనుండీ నన్ను కొడితేనే నేను అంతమొందుతాను. అర్జునః సమరే శూరః పురస్కృత్య శిఖండినమ్/ మామేవ విశిఖైస్తీక్ష్ణైః అభిద్రవతు దంశితః 107.82. ఆ శిఖండి మీద నేను అస్త్రశస్త్రాలు సంధించను. ఆ సమయంలో అర్జునుడు నన్నుపడకొట్టాలి. నారాయణుడైన ఈ కృష్ణపరమాత్ముడు, నరుడైన ఈ అర్జునుడు తప్ప నన్ను యుద్ధంలో పడకొట్టేవారు ఈ లోకంలో లేరు. కాబట్టి సంకోచించకుండా నేను చెప్పినట్టు చేయండి”. అందరూ ఆయన సలహాను విని, ఆయనకు వినయంగా నమస్కరించి తమ తమ శిబిరాలకు వెళ్లిపోయారు.

పదవరోజు మధ్యాహ్నవేళ దాటాక భీష్ముడికి ఇక వైరాగ్య భావన మనసున చేరింది. ఇక తన బ్రతుకే వ్యర్థం అనుకున్నాడు. ఇక నేను ఎవరినీ వధించను అనుకున్నాడు. ఎదురుగా కనిపిస్తున్న యుధిష్ఠిరుడితో అన్నాడు- “నాయనా! నాకు ఈ దేహం మీద విరక్తి కలుగుతున్నది. కాబట్టి చివరిగా నాకు ఇష్టమైన పనిని నీవు చేయదలచుకుంటే అర్జునుని శిఖండిని ముందు పెట్టుకుని నన్ను పడకొట్టమని చెప్పు. నన్ను వధించటానికి ప్రయత్నించు” అని స్వయంగా సంహరించమని చెప్పాడు. ధర్మరాజు అర్జునునికి పితామహుడి వచనాన్ని చెప్పి ఇక ఆలస్యం చేయక పితామహునికి శాంతిని కలిగించమని ఆజ్ఞాపించాడు. భీష్ముడి సలహాప్రకారమే ఆనాటి యుద్ధంలో భీష్ముని శాంతి పరిచారు.

5. ధృతరాష్ట్రుని పశ్చాత్తాపం:

పదిహేనవరోజు సంజయుడు ద్రోణమరణవార్తను ధృతరాష్ట్రుడికి నివేదించాడు. ఆశ్చర్యకరమైన ఆ వార్తవిని ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు - “శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు రథికుడై సాగుతున్న రథాన్ని ఎదిరించి రణభూమిలో ఏ మహారథుడు నిలవగలడు. యస్య యంతా హృషీకేశః యోద్దా యస్య ధనంజయః/ రథస్య తస్య కః సంఖ్యే ప్రత్యనీకో భవేద్ రథః11.36

అంతే కాదు అర్జునుడి ఆత్మే కేశవుడు. ఆ కేశవుడి ఆత్మే అర్జునుడు. వారిద్దరిదీ అవినాభావ సంబంధం.

అర్జునః కేశవస్యాత్మా కృష్ణోsస్యాత్మా కిరీటినః           11.38

ఇంక ఆ పరమాత్ముడే ఆయుధం ధరించాడంటే ఆయనతో పోరాడగలవారు ఒక్కడుకూడా ఉండడు. ఆయనకు కోపం వస్తే రాజులందరితో కలిసిన కౌరవులను సమూలంగా సంహరించి రాజ్యాన్ని కుంతీదేవికి అందచేస్తాడు. ఇంకా నా ఉద్దేశంలో భీష్మద్రోణాదులే పడిపోయారంటే దానికి కారణం ధర్మాత్ముడైన ధర్మరాజు యొక్క క్రోధమే అయిఉండవచ్చు. ఇంద్రప్రస్థంలో ఆయన సంపదను చూసి అసూయ పడ్డాం. నా పుత్రులు ఆ ధర్మాత్ముడికి చాలా అపకారం చేశారు. ధర్మాత్ముడైనవానికి అపకారంచేసినా వారి క్రోధానికి కారకులైనా ఇటువంటి పరిణామాలే ఎదుర్కోవాల్సివస్తుంది. దీనికంతటికీ నేనూ భాధ్యుడనే సంజయా” అంటూ వాపోయాడు ధృతరాష్ట్రుడు.

6. ధర్మజుని బంధించి అప్పగిస్తానని ద్రోణుడి ప్రతిజ్ఞ:

కర్ణాదులతో సంప్రదించి దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సైన్యాధిపతిగా అభిషేకించాడు. ద్రోణుడు వేద వేదాంగాలు నేర్చినవాడు. మనువు చెప్పిన అర్థశాస్త్రాన్నంతా అవపోసనపట్టినవాడు. పరమేశ్వరుడు అనుగ్రహించిన  శస్త్ర విద్య కలిగినవాడు. అందరికీ గురువు.  తనకు వచ్చిన ఈ గౌరవానికి పొంగిపోయి, భీష్ముడికి ఇచ్చిన స్థాయిని తనకి ఇచ్చినందుకు సంతోషంతో ఈ పిచ్చి బ్రాహ్మణుడు దుర్యోధనుడిని ప్రశంసించి 'నీకోసం ఏం కావాలన్నా చేసేస్తాను, కోరుకో దుర్యోధనా' అన్నాడు.   దుర్యోధనుడు మాత్రం తక్కువవాడా? వెంటనే కర్ణ, శకునులతో సంప్రదించిమరీ ఒక కోరిక కోరాడు. అదేమిటంటే – దదాసి చేద్ వరం మహ్యం జీవగ్రాహం యుధిష్ఠిరమ్/ గృహీత్వా రథినాం శ్రేష్ఠం మత్సమీపమిహానయ 12.6. “ధర్మరాజుని ప్రాణాలతో బంధించి అప్పగించండి” అని అడిగాడు దుర్యోధనుడు. ఆ మాట వినగానే ద్రోణాచార్యుడు సంతోషించి “నాయనా! నీవెంత మంచివాడివి, ధర్మరాజుని వధించమని కోరుకోకుండా ప్రాణాలతో అప్పగించమంటున్నావు. యుధిష్ఠిరుడు జీవించివుంటే నీ వంశం రక్షించబడుతుందని భావించి అడిగావా? లేదా పాండవులను యుద్ధంలో జయించి వారికి తరువాత రాజ్యాన్నిచ్చి నీ సోదరభావాన్ని చాటుకుందామని అలా కోరుకున్నావా? రాజ్యం సంప్రతి దత్వా చ సౌభ్రాత్రం కర్తుమిచ్ఛసి 12.11.  అదే నీ కోరిక అయితే యుధిష్ఠిరుడు చాలా అదృష్టవంతుడు, అజాతశత్రువు” అన్నాడు ద్రోణాచార్యుడు. ఆయన మనసు అలాంటింది. అంత మంచిగా ఆలోచించిన ద్రోణాచార్యునికి దుర్యోధనుని రాజకీయం ఇంకా అర్థం కాలేదు. ఈ దుష్టచతుష్టయం ఆలోచన వేరు. మనం అసలు ఊహించను కూడా ఊహించలేము ఆ రాజనీతి. దుర్యోధనుడు అన్నాడు, “ఆచార్యా! పాండవులను ఇంద్రాది దేవతలు కూడా సంహరించలేరు. (భీష్ముడి విషయంలోనే ఆ సంగతి తేలిపోయింది) ఒకవేళ పాండవులలో ఏ ఒక్కరి సంహారం జరిగినా మనమెవ్వరం మిగలం కూడా. మిగిలిన వారు మనల్ని తప్పక సంహరిస్తారు. లేదా పాండవులందరూ వారి పుత్ర బాంధవులతోసహా మన చేతిలో మరణించినా కూడా ఈ రాజమండలాన్ని అంతా ఒక్క శ్రీకృష్ణుడే గెలిచుకుని ఆ రాజ్యాన్నంతా ద్రౌపదికో కుంతీదేవికో ఇచ్చేస్తాడు. విష్ణుర్దాస్యతి కృష్ణాయై కుంత్యై వా పురుషోత్తమః 12.16. (ఈ మాట ఇంతకు ముందు హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడు అన్నాడు సంజయుడితో మాట్లాడుతున్నప్పుడు, చూశారా, తండ్రీ కొడుకుల ఆలోచనలు ఒకే రకంగా ఎలా ఉన్నాయో!)  ఈ చెప్పిన మూడు సంఘటనలూ కూడా ఒకదానికి మించి మరొకటి అసాధ్యములైనవి. పాండవులను చంపలేము. లేదా ఒకరిని చంపినా మిగిలివారు మనల్ని బతకనివ్వరు. లేదా వారందరూ మరణించినా కృష్ణుడు మనల్ని బ్రతకనివ్వడు.

కాబట్టి నా ఉద్దేశ్శమేమిటంటే సత్యప్రతిజ్ఞ కలవాడైన ధర్మరాజుని మీరు బంధించి నాకు అప్పగిస్తే అతనితో మరలా జూదమాడిస్తాను. ఆ జూదంలో పాండవులను ఓడించి వారిని మరలా అరణ్యాల పాలు చేస్తాను.  సత్యప్రతిజ్ఞే త్వానీతే పునర్ ద్యూతేన నిర్జితే/ పునర్యాస్యన్త్యరణ్యాయ పాండవాస్తం అనువ్రతాః 12.17. ఆ గెలుపు నాకు చిరకాలం ఉండిపోతుంది. అలా పందెం పెడతాను. అందువలననే నేను ధర్మరాజు మరణాన్ని కోరుకోవటంలేదు ఆచార్యా” అన్నాడు శిష్యడు దుర్యోధనుడు. ఆ శిష్యుడి మేధాశక్తికి, వాడి నిజస్వరూపానికి, వాడు కోరుకున్న కోరికకి ఖంగుతిన్నాడు గురువుగారు.

7. పద్మవ్యూహం:

పదమూడవరోజు యుద్ధం ప్రారంభంలోనే సంశప్తకులతో యుద్ధం ప్రారంభించాడు అర్జునుడు. అర్జునుడు అటు వెళ్ళగానే గురువుగారు చక్రవ్యూహాన్ని రచించారు. వ్యాసుడు చెప్పిన ఈ చక్రవ్యూహాన్నే మనం పద్మ వ్యూహం అంటున్నాం. ధర్మరాజు ఆ వ్యూహాన్ని చూసి అభిమన్యుడితో అన్నాడు. ఏత్య నో నార్జునో గర్హేద్ యథా తాత తథా కురు/ చక్రవ్యూహస్య న వయం  విద్మో భేదం కథం చన 35.14. “నాయనా! ఈ చక్రవ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు ఎవరికీ తెలీదు. సంశప్తకులతో యుద్ధానికి వెళ్లిన అర్జునుడు తిరిగివచ్చి మనలని నిందించకుండా వుండే రీతిగా నీవే కర్తవ్యాన్ని ఆచరించు” అన్నాడు.

8. అభిమన్యుడి మరణానికి కారణాలు – విశ్లేషణలో ధర్మరాజు పాత్ర

 అభిమన్యుడి మరణానికి ఇక్కడ నరనారాయణులను తక్కువచేసి మాట్లాడిన దోష ఫలితం ఒక కారణంగా కూడా చెప్పవచ్చు. మరొక కారణం పూర్వజన్మలో చంద్రుడి నిర్ణయం. ఆదిపర్వంలో మనం చెప్పుకున్నాం. దేవదానవులందరూ ఈ భూమిమీద అవతరించినప్పుడు చంద్రుని కుమారుడైన వర్చసుడు అభిమన్యునిగా జన్మించాడు. అతడు అవతరించటానికి ముందే చంద్రుడు, జరిగేది దైవకార్యం కనుక నా ప్రాణాధికుడైన నా కుమారుణ్ణి ఒక ఒప్పందం పై మాత్రమే అవతరించటానికి అనుమతిస్తాను. ఇతడు నారాయణునికి మిత్రుడైన అర్జునుని కుమారునిగా పదహారు సంవత్సరాలు మాత్రమే అక్కడ జీవించి మహారధునిగా గుర్తింపు పొందుతాడు. తస్యాయం భవితా పుత్రో బాలో భువి మహారథః/ తతః షోడశ వర్షాణి స్థాస్యత్యమర సత్తమాః           67.117

యుద్దంలో పగలు సగం గడిచే సరికి నాల్గవవంతు శత్రువీరులను యమపురికి పంపిస్తాడు. సాయంకాలానికి నన్ను చేరుకుంటాడు. అతనికి వంశకారకుడైన కొడుకు పుట్టి నశించినటువంటి భారత వంశాన్ని మళ్లీ ఉద్ధరిస్తాడు. అని చంద్రుడు చెప్పగానే దేవతలందరూ తధాస్తు అని పలికారు. ఈ రెండు కారణాలు అభిమన్యుడి మరణానికి కారణాలయ్యాయి. మూడవ(కారణం) అంశమేమిటంటే పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్న పాండవులను సైంధవుడు అడ్డుకోవాలి. అభిమన్యుడిని అనుసరిస్తూ చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తున్న ధర్మజ, భీమ, ధృష్టద్యుమ్నులందరినీ సింధురాజు, దుర్యోధనుడి బావ అయిన సైంధవుడు అడ్డుకున్నాడు. అరణ్యపర్వంలో ద్రౌపదిని బాధించిన సమయాన పాండవులు చేసిన అవమానానికి శివుడిగూర్చి కఠోరతపమాచరించి అర్జునుడు తప్ప తక్కిన పాండవవీరులను ఒక్కరోజు మాత్రమే ఓడించగల వరాన్ని పొందాడు ఆ సైంధవుడు. అర్జునుడు లేనప్పుడే ఆ సైంధవుడు తక్కిన నలుగురినీ ఓడించటం ద్వారా శివుడి వరాన్ని నెరవేర్చే భారం కృష్ణుడు తీసుకున్నాడు. ఇది మూడవ అంశం. నాల్గవ కారణం అసలు అభిమన్యుడిని సంహరించే పనిలో పడి కౌరవులు ధర్మరాజుని బంధించాలి అనే విషయాన్నే మరిచిపోయేట్టు చేయటం. ధర్మరాజుని బంధించి ఇస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞకూడా చేశాడు. ఆరోజు అభిమన్యుడి పరాక్రమానికి అందరూ బ్రతుకుజీవుడా అని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బిక్కచచ్చిపోయి చివరికి గురువు సలహాతో అభిమన్యుడిని అందరూ కలిసి వంచనతో మట్టుపెట్టారు. ఆ విషయంలో పడి దుర్యోధనుడు గురువు గారిని అడిగిన  వరం- ధర్మరాజుని పట్టించి ఇవ్వమన్న మాట, అసలు ఆరోజు  ఎవరికీ స్ఫురణకి కూడా రాలేదు.

9. ధర్మజుడిచే పరమాత్ముడు పలికించిన అసత్యం:

పదిహేనవరోజు ఉషోదయ కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎడమ పక్క ద్రోణుడు, అతడి సైన్యం ఉండేట్టు. కుడిపక్క తక్కిన శత్రువులందరూ ఉంటేట్టు చేసి రథం సాగించాడు. ఆసమయంలో కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. “ద్రోణుడి చేతిలో ధనస్సు ఉన్నంతవరకూ దేవతలు కూడా ఆయన్ని గెలవలేరు. ఏదో ఒక రకంగా ఆయన ఆయుధం విడిచిపెట్టేట్టు చేయాలి. ఆయన మిమ్మల్నందరినీ సంహరించకుండా ఉండాలంటే ధర్మాన్ని వదిలి జయం కోసం ఆలోచించాలి అర్జునా. అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ఈయన యుద్ధం చేయడని నా ఉద్ధేశ్యం. కాబట్టి అశ్వత్థామ మరణించాడని ఎవరన్నా ఈయనకి చెప్పాలి”. అర్జునుడు తప్ప తక్కిన వారంతా అంగీకరించారు. ధర్మరాజుకూడా అతి కష్టంమీద అంగీకరించాడు. అదే సమయానికి భీముడు మాలవరాజయిన ఇంద్రవర్మ యొక్క అశ్వత్థామ అనే ఏనుగును చంపాడు. దాన్ని చంపి భీముడు ద్రోణుడి వద్దకి వెళ్ళి “ఆచార్య! అశ్వత్థామ హతుడయ్యాడు” అంటూ పెద్దగా అరిచాడు.   ఆ మాట వినగానే ద్రోణుడి మనస్సు సందేహంలో పడింది. భీముడి వచనాలు నమ్మదగ్గవేనా కాదా. అనుకున్నాడు.

అసలు అశ్వత్థామ జీవించి ఉన్నాడో లేదో ధర్మరాజునే అడుగుదామనుకుని యుధిష్ఠిరుడినే అడిగాడు. ధర్మరాజు తటపటాయించాడు ఏం చెప్పాలో అని, కానీ కృష్ణుడు చెప్పాడు “రాజా! ద్రోణుడు ఇంకా ఒక్క పూట యుద్ధం చేసినా నీ సేనంతా హతమయిపోతుంది. కాబట్టి నీ సేనని రక్షించేభారం ఇప్పుడు నీ మీదే ఉంది. ఇప్పుడు సత్యంకంటే అసత్యమే శ్రేష్టమైనది. జీవిత రక్షణ కోసం అబద్ధం చెప్పవలసి వస్తే ఏపాపం కలుగదు”. అన్నాడు. భీమాదులుకూడా గోవిందుడి వచనాలనే పాటించమని ధర్మజుడిని ప్రోత్సహించారు. దాంతో ధర్మరాజు తనని  అడిగిన ద్రోణుడితో "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి ఏనుగు హతమైందని, "కుంజరః" అని మెల్లగా అస్పస్టంగా చెప్పాడు.   అంతే ఆ మాట చెప్పగానే భూమికంటే నాలుగంగుళాలు పైకి ఉండే ధర్మరాజు రథం ఒక్కసారిగా, మొదటిసారిగా భూమిని తాకింది. కుంజరః  అనే మాట కూడా వినపడకుండా కృష్ణుడు శంఖ నాదం చేశాడు. ధర్మరాజు నోట అంమంగళకర వాక్యాలు వినగానే ఇంతకాలం తాను ఎవరికోసమైతే జీవించాడో ఆ పుత్రడే మరణించాక ఇంక ఈ జీవితం ఎందుకు? అని ద్రోణుడు దుర్యోధనాదులకు ముందుగా ఒక మాట   చెప్పి, తరువాత అస్త్రాన్ని విడిచిపెట్టి తన రథం మీద పద్మాసనాసీనుడయి  ప్రాణాయామం ద్వారా ఓంకారనాదం చేస్తూ సహస్రారం దగ్గరికి ఊర్థ్వమార్గంలో ప్రాణాన్ని పయనింపచేశాడు. ఆ ద్రోణుడు జ్యోతిరూపంగా మహాత్ములుకూడా పొందలేని బ్రహ్మలోకాలకు చేరుకున్నాడు. తథోక్త్వా యోగమాస్థాయ జ్యోతిర్భూతో మహాతపాః/ పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరమ్.192. 50.

ఆకాశంలో ఇద్దరు సూర్యుళ్ళు ఒకే సారి ప్రకాశిస్తున్నట్టు ఉంది ఆ సమయంలో. రెప్పపాటుకాలంలో ఆ జ్యోతి అంతర్థానమైపోయింది. సంజయుడు చెప్తున్నాడు – “ఆ జ్యోతిని దర్శించుకున్నవారు నేను, కృపాచార్యుడు, కృష్ణార్జునులు, అలాగే ధర్మరాజు, మేము ఐదుగురమే మహారాజా! నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడైన ఆచార్యుడు నీ సంతోషంకోసం పదహారు సంవత్సరాల యువకుడిలా యుద్ధంలో పదిహేనురోజులు అవిశ్రాంతంగాపోరాడి అందనిలోకాలకు చేరుకున్నాడు మహారాజా” ఆంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి బాధపడుతూ విన్నవించాడు.

10. ముగింపు:

ఒక్క మాటతోనే ధర్మజుని రథం నాలుగు అంగుళాలు దిగి నేలకు త్రాకిందంటే, ఇన్నాళ్ళూ ఆ ధర్మాత్ముడు ఎంత ధర్మదీక్షతో ఉన్నాడో మనం గ్రహించవలసిన అంశం. అయితే ఇక్కడ ధర్మరాజు అసత్యమాడాడా లేదా అనే విషయం చాలమందికి కలిగే సందేహమే. ఇందులో గ్రహించవలసిన అంశమేమంటే, పాండవుల విజయం కోసం తన స్థాయిని తగ్గించుకుని మరీ ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణపరమాత్ముడిని చూసి, పరమాత్మ చెప్పిన మాటలను వేదవాక్కులుగా భావించి, వాటిని ఆచరించిన ఆదర్శమూర్తిగా ఈ పర్వంలో మనకు ధర్మజుడు కనిపిస్తాడు. శ్రీకృష్ణపరమాత్మ చెప్పగా అర్జునుడంతటివాడే భీష్మపితామహుడు ద్రోణాచార్యులవంటి వారి మీద అస్త్రప్రయోగం చేశాడు. అలాంటిది ధర్మజుడు, పరమాత్మ ఆజ్ఞాపిస్తే చేయకుండా ఉండవచ్చా? మరొక విషయమేమంటే ధర్మరాజు స్పష్టంగా “అశ్వత్థామ హతః కుంజరః” అనే పలికాడు. అందులో అసత్యమేమీలేదు. ధర్మజుడు అసత్యమే పలికి ఉంటే సశరీరంతో స్వర్గలోకంలో ప్రవేశించేవాడే కాదు కదా. ప్రవేశించాడు కాబట్టి మనం ఈ మాటను అసత్యమనటానికి వీలు లేదు. ఈ విధంగా భీష్మ-ద్రోణపర్వాలలో ధర్మనందనుడు తాను విజయం వైపు పయనిస్తూ విజయాదులకు(అర్జునాదులు) కూడా మార్గం సుగమం చేశాడు.

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "మే-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-ఏప్రిల్-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "మే-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]