headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

10. ప్రజా ఉద్యమాలు: ఒగ్గుకథ

dr_b_mahendar
డా. మహేందర్‌ బర్ల‌

అధ్యాపకులు, తెలుగుశాఖ,
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9885937740. Email: mahenderb28@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలంగాణ ప్రాంతంలో ప్రజాధారణ పొందిన జానపద కళారూపాలలో ఒగ్గుకథ ప్రధానమైనది. ఒగ్గుకథను మించిన జానపద కళారూపం మరొకటి లేదంటే అతిశయోక్తికాదు. ప్రజా ఉద్యమాలలో, సామాజికోద్యమాలలో, ప్రాంతీయోద్యమాలో వచ్చిన ఒగ్గుకథలను ఈ వ్యాసంలో చర్చించాను. ఈ ఒగ్గుకథలు ప్రజా ఉద్యమాలను, సామాజికోధ్యమాలను ఏ విధంగా ప్రభావితం చేసినవి అనేది పరిశోధన వ్యాసఉద్దేశ్యం. ప్రపంచీకరణ ప్రభావం వలన ఒగ్గుకథ అంతరించిపోయే దశకు చేరుకుంది. వందల ఏళ్లుగా ఉన్నటువంటి ఈ ఒగ్గుకథను కాపాడు కోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇంతటి ప్రజాధారణ పొందిన, ప్రజలలో నాటుకుపోయిన ఈ ఒగ్గకథలను రికార్డు చేసి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.

Keywords: ఒగ్గుకథ, సామాజికోద్యమాలు, ప్రాంతీయోద్యమాలు, ప్రజా ఉద్యమాల సాహిత్యం

1. ఉపోద్ఘాతం:

తెలంగాణ ప్రాంతంలో ప్రజాధారణ పొందిన జానపద కళారూపాలలో ఒగ్గుకథ ప్రధానమైనది. ఒగ్గుకథను మించిన జానపద కళారూపం మరొకటి లేదంటే అతిశయోక్తికాదు. జానపద కళారూపాలకు ఆయా కథా ఇతివృత్తాన్ని బట్టి పేర్లు పెట్టుకుంటారు. కాని ఆయా కళారూపాల్లో ఉపయోగించే వాద్యాన్ని ఈ కళకి శీర్శికగా పెట్టడం అరుదు. ఆ లక్షణం ఒగ్గుకథకు ఉంది. ఒగ్గుకథను కురుమ కులంలోనే ఒగ్గుకథలు వచ్చినవాళ్లు చెప్తారు. ఈ ఉత్పత్తి కులంవారే తెలంగాణలో ఒగ్గు కళాకారులుగా ప్రసిద్ధి చెందారు. వీళ్లను ఒగ్గోళ్లు, బీర్‌లోల్లు, బీరన్నలు అంటారు. వీళ్లు మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ మొదలైన కథలను చెప్తారు. వీరి చేతిలోని డమరుకమే ఒగ్గు లేదా జగ్గు. వీళ్ల కథలు శివుని వాద్యమైన ఒగ్గు లేదా డమరుకంతో చెప్పడం వల్ల ఈ కథలకు ఒగ్గుకథ కథ అని పేరు వచ్చి ఉంటుంది.  తెలంగాణలో అతిప్రాచీనమైన అద్భుత జానపద కళారూపం ఒగ్గుకథ.

2. ప్రధానవిషయం:

తెలంగాణలో ప్రజాసంఘాల నాయకులు, ప్రజాకళాకారులు ప్రజలకు ఒగ్గుకథలపై ఉన్న ఆసక్తిని గమనించారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా దీనిని మలుచుకున్నారు. ఒగ్గుకథ బాణీలలో అనేక సమస్యలను ప్రజలకు తెలియచేశారు. తెలంగాణ పోరాట కాలంలో కొందరు ఉద్యమకారులు భావజాలాన్ని ప్రచారం చేయడంకోసం ఒగ్గుకథను ఉపయోగించుకున్నారు. వర్తమాన కాలానికి సంబంధించిన వస్తువులో ఒగ్గుకథను తమ అవసరాలకు అనుగుణంగా మలచుకున్నారు. ఈ ఒగ్గుకథ ద్వారా సామాజిక మార్పును తీసుకువచ్చే ప్రయత్నం జననాట్యమండలి చేసింది.  
ఒగ్గుకథలను జననాట్యమండలి కళాకారులు  బి.నర్సింగరావు, గద్దర్‌, దివాకర్‌, సంజీవ్‌, భూపాల్‌, డప్పు రమేష్‌, పద్మ, కుమారి, డోలక్‌ దయ ప్రజాఉద్యమాల్లోకి తీసుకువచ్చారు. ప్రజానాట్యమండలి కళాకారులు బండి సత్తెన్న, సాంబరాజు యాదగిరి ఒగ్గుకథలు రాశారు. అరుణోదయ  విమలక్క, ప్రజాకళకారుడు జి.వై గిరి ఒగ్గుకథలు చెప్పారు. సాంప్రదాయికంగా వస్తున్న ఒగ్గుకథలోనే వినూత్న పద్దతిలో గద్దర్‌ చెప్పారు. ప్రదర్శనలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ జననాట్యమండలి వాళ్లు చెప్పే ఒగ్గుకథకు జనాదరణ ఎక్కువగానే ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ఒగ్గుకథల ద్వారనే ప్రచారం చేయిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆధిక జనాధారణ ఉన్న ప్రజాకళ ఒగ్గుకథ.

3. జననాట్యమండలి-ఒగ్గుకథలు:

కొత్తమనిషి, చెల్లీచెంద్రమ్మ, నక్సల్‌బరి ఒగ్గుకథ, రైతుకూలి విజయం, కారంచేడు ఒగ్గుకథ, స్వర్ణక్క ఒగ్గుకథ, కొమురంభీం ఒగ్గుకథ, రైతుకూలీ పోరాటం ఒగ్గుకథ,  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య  అడవిబిడ్డలు, ప్రజానాట్యమండలి ` పోరుబాట మొదలైనవి వచ్చినవి.
భూమి, భుక్తి , విముక్తికోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పేదప్రజల పక్షాన నక్సలైట్లు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగానే ఎమర్జెన్సీ కాలంలో నలుగురు రాడికల్‌ స్టూడెంట్ యూనియన్‌ విద్యార్థులను మెదక్‌ జిల్లా గిరాయిపల్లిలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ నలుగురు అమరుల స్మృతిలో గద్దర్‌ నక్సల్‌బరి ఒగ్గుకథను రాశారు.

‘‘ఏ ఊరు మీదిరా
ఏ పల్లె నీదిరా
ఏ పార్టీ నీదిరా
ఏ దళం నీదిరా
దళనాయకుడేడిరా
సూటిగా చెప్పాకుంటే షూట్‌ చేస్తామురా’’.
నక్సల్‌బరి బిడ్డలం
త్యాగాలకు గుర్తులం
దోపిడికి బాకులం
సత్యమన్న తమ్ములం
ఎర్రజెండ లెత్తి నడిచే ఎర్రెర్రెనీ సూర్యులం’’.

(నక్సల్‌బరి బిడ్డలు ఒగ్గుకథ. జననాట్యమండలి, యూట్యూబ్‌).

పేద ప్రజలకోసం పోరాటం చేస్తున్న  నక్సలైట్లను పోలీసులు పట్టుకొని ఎవరు మీరు మీ నాయకుడు ఎవరు?  ఎక్కడుంటారు? అని చిత్రహింసలు పెడుతూ చెప్పకుంటే కాల్చివేస్తం అని బెదిరిస్తారు. పోలీసుల బెదిరింపులకు బయపడకుండా, లొంగకుండా నక్సల్‌బరి బిడ్డలం మేము సత్యమన్న తమ్ములం. ప్రజలకోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దోపిడిని ఎదిరించేవాళ్లం. ఎర్రజెండ పట్టుకొని ప్రజలకు వెలుగునిచ్చే సూర్యులం అని సమాధానం చెప్తారు. ఆర్‌ఎస్‌యూ విద్యార్థులు ముక్కుసూటిగా సమాధానం చెప్పడంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తారు. ఇట్లా అనేక మంది ప్రజలకోసం ప్రాణాలర్పించారు. ఈ అమరుల స్మృతిలో వచ్చిన జానపద కళ అయిన ఒగ్గుకథ విశేష ఆధరణ పొందింది. దొరలకు, భూస్వాములకు, పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాడానికి, రైతులను కూలీలను చైతన్య పరచడానికి ఎంతగానో ఉపయోపడిరది.

1985లో ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం కారంచేడు గ్రామంలో దళితులు మంచినీళ్ళు తాగే చెరువులో అగ్రకులాల వాళ్లు దున్నపోతులను కడుగుతారు. దీన్ని అక్కడ ఉన్న దళితులు మేము నీళ్లుతాగే చెరువు కదా దున్నపోతులను కడుగితే మేము నీళ్లు ఎట్లా తాగాలె అని అగుగుతారు. దళితుడివి మమ్మల్ని ప్రశ్నిస్తవా అంటూ కమ్మ భూస్వాములు ముకుమ్మడిగా దాడిచేసి దళితుల్ని కొట్టి చంపుతారు. ఆ సందర్భంలో అక్కడి ప్రజలను చైతన్య పరచడానికి జననాట్యమండలి దివాకర్‌, కలెకూరి ప్రసాద్‌, డప్పు రమేష్‌లు 1989లో కారంచేడు ఒగ్గుకథ రాశారు.

‘‘దళితా పులులూరమ్మా
కారంచేడు భూస్వాముల మీద
కలబడి నిలబడి పోరుజేసినా
దళితా పులులూరమ్మా...
కారంచేడులో కలదొకపల్లె పల్లెపేరురా మాదిగపల్లె
మాలసాయబ్ కోయ వడ్డెరకు మాదిగపల్లె తల్లిలాంటిది
శరణుగోరిన శత్రువునైనా కరుణతో జూపే పేదలపల్లె
మాదిగపల్లె పేరువింటేరా కమ్మదొరలకే కాళ్లు వనుకురా
బరిసెలెత్తి మరి పందె మాడితే..హ
ఊరి దొరలకే ఉచ్చబడ్డది’’. (కారంచేడు ఒగ్గుకథ. జననాట్యమండలి, యూట్యూబ్‌).

కారంచేడులో ఉన్న ఒక మాదిగపల్లె అన్ని కులాలకు తల్లి వంటిది. అట్లాంటి పల్లెలో దళితులను ఊచకోత కోసి చంపిన కమ్మ భూస్మాములపైకి ఈ ఊరుమాదే, ఈ వాడమాదే  సబ్బండ కులాలు ఒక్కటై వారి పనిముట్లను ఆయుధాలుగా చేసుకొని కమ్మదొరలు కాళ్లు చేతుల వనికే విధంగా  తిరుగబడిన తీరును ఈ ఒగ్గుకథలో చెప్తారు.

తెలంగాణలో ఒగ్గుకథను భుజానేసుకొని యావత్తు దేశమంతా తిరిగిన చుక్క సత్తయ్య మలన్న, ఎల్లమ్మ, బీరప్ప కథలే కాకుండ ఒగ్గుకథ బాణీలను అనేక సామాజిక కార్యక్రమాలలోకి మార్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల చేత ప్రశంసలు పొందాడు. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియమాకాలలో అన్యాయం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమ సందర్భంలో ఒగ్గుకథలు వచ్చాయి.

4. తెలంగాణ ఉద్యమం:

‘‘తెలంగాణ మనది సోదరుడా మా యన్నల్లారో...
ఖనిజసంపదలు కలిగిన దేశంరా...
వలపేరుతో వచ్చిరి సొచ్చిరి హైదరాబాద్‌ను ఆక్రమించిరి
మనసంపదలు కొల్లగొట్టిరి మనమోకాన మట్టిగొట్టిరి..
తెలంగాణ మనదే సోదరుడా మా యన్నల్లారో...
ఖనిజసంపదలు కలిగి దేశంరా...’’ (సత్తయ్య, చుక్క. ప్రముఖ ఒగ్గుకథకులు,  యూట్యూబ్‌).

ఆంధ్రప్రాంతం నుండి వలస పేరుతో వచ్చి హైదరాబాద్‌ను ఆక్రమించి మన సంపదలు అన్ని కొల్లగొట్టినారు. మన ఉద్యోగాలు మనకు రానియ్యకుండా చేసినారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం పోరాటాల ద్వారానే సాధించుకోవాలె అని చుక్క సత్తయ్య ఈ కథ ద్వారా ప్రజల్ని చైతన్య పరుస్తాడు.

మనం ప్రతి రోజు పత్రికలలో, టీవీలలో చూస్తావుంటాం వరకట్నం బాధలు భరించలేక నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని, భర్త చేతిలో భార్య హత్య అని వివిధ రకాలు వార్తలు చూస్తాము. అత్తమామ పోరు పడలేక  పుట్టింటికి వెళ్లిన కోడల్లగురించి వింటూవుంటాం. ఇట్లాంటి సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే వరకట్నాన్ని రూపు మాపాలని చుక్క సత్తయ్య వరకట్నం ఒగ్గుకథలో చెప్పారు.

‘‘వరకట్నాలు బందుపెట్టుమని ప్రకటించినారు అయ్యా ప్రకటించినారు.
చెప్పంగా వినకుంటే చెడిపోతరు మీరు బాధపడుతరయ్యా
డబ్భులు లేక కొందరు పిల్లలు పెళ్ళీలుగాక మరి పేరంటంలేక
నీతులు నిలుపక కొందరు బిడ్డలు అగ్నిపెట్టుకొని దగ్దంలైపొయిరి’’
(డా. సత్తయ్య, చుక్క. ప్రముఖ ఒగ్గుకథకులు, యూట్యూబ్‌).

అదే విధంగా తాగుడుకు బానిసై  ప్రతి రోజు  తాగివచ్చి భార్యలను కొడుతుంటారు. ఇంటి పక్కవాళ్లతో గొడవలు పడుతుంటారు. తాగడానికి డబ్బులు లేని రోజు భార్యల మీద పుస్తెలు కూడా అమ్మి తాగుతుంటారు. సారా తాగితాగి ఇల్లును కూడ మరిచిపోయినవాళ్లు ఉంటారు. మంచి సమాజం నిర్మాణం కావాలంటే కల్లు సారా బ్రాంది షాపులు బందుపెట్టాలని పోరుబాట నడిపించాడు చుక్క సత్తయ్య.

‘‘కల్లుసారాబ్రాందిషాపులు బందుపెట్టుమనీ దానికొరకు వినుడి
ఆస్తిపాస్తులు అమ్ముకొనీ అప్పులపాలయిరీ కొందరు తిప్పల పాలయిరి
ఎక్కువతాగి తిక్కరెచ్చిపొయి తల్లీతెలువదాయే తనకు చెల్లెతెలువాదాయే
భార్యపిల్లలకు బట్టలులేక భాదలపాలయిరీ కొందరు అగాధమయిపొయిరి’’

(డా. సత్తయ్య, చుక్క. ప్రముఖ ఒగ్గుకథకులు, యూట్యూబ్‌).

వరకట్నాలతోని అడపిల్లలు పడుతున్న బాధలను చెప్తూ వరకట్నాలను  బందు చేయమంటాడు. అదేవిధంగా ప్రజలు కల్తీ కల్లుసారా తాగి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారని మధ్యపాన నిషేధం విధించాలని సత్తయ్య ఈ ఒగ్గుకథలలో చెప్తాడు.

5. పోరుబాట ఒగ్గుకథ:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోని మరిచిపోలేని పోరాటం. భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం జరిగిన పోరాటమిది. భూస్వామ్య శక్తులు సామాన్య ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకున్న తీరు రజకార్ల జులుం, ప్రజల తిరుగుబాటు, భూమి పంపకం వంటి అనేక విషయాలు పోరుబాట’ ఒగ్గుకథలో బండి సత్తెన్న ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పారు.

‘‘నైజాం సర్కారు నీచుడు ఆనాడు ఆడింది ఆటాయే పాడింది పాటయే
దొరల భూస్వాముల సంకన బెట్టుక దోసుకతింటే అడిగేనాదుడే లేడాయే
మదమెక్కి నవాబు మహిళల చెరబట్టి బట్టలు విప్పించి బతుకమ్మలాడించే
విసునూరు దొరోని పేరు వింటేరా ఆకశమదిరేను భూదేవి బెదిరేను
పాలుదాగే పసికూన ప్రాణమిడిసేను కోయిల రాగాలు మూగబోయేను
బాంచెన్‌ దొరా అనే బతుకులు అనాడు పొట్టకు లేకున్న వెట్టి చెయ్యాలే’’

(సత్తెన్న, బండి. 2016. దరువుల బండి, పుట.24)

అనాటి నైజాం దొరలను భూస్వాములను వెంటబెట్టుకొని ప్రజల సొమ్మును దోసుకుంటున్న, మహిళలను చెరచినా, బట్టలువిప్పించి బతుకమ్మలు ఆడించిన అడిగేవారే లేకపాయే అంటాడు. విస్నూరు దొరపేరు వింటేనే పక్షులు జీవరాసులు కూడా మూగబోయేవి అంటే దొర ఎంత క్రూరమైన వాడో అర్థం చేసుకోవచ్చు. తిండి తినకపోయిన కూడ వాళ్ల పనులు చేయాలె. పొట్టకు, బట్టకు ఏం ఇయ్యకున్న వెట్టిచెయ్యాలె. ఇట్లాంటి బతుకులు మారాలంటే పోరాటమే మార్గమని ఈ కథలో చెప్తాడు బండి సత్తెన్న.

‘‘అన్నోకూలన్నలారో అన్నో రైతన్నలారా 
భూమిలేకుంటే బువ్వలేనట్టే అన్నో పేదన్నల్లారా...
పంటలు పండేది బంగారమెల్లేది భూతల్లినుండేరో
గడ్డీమొలిసేది దుంపలు దొరికేది భూతల్లి నుండేరో....
సెట్టూపుట్టేది సెరువులు గలిగేది భూతల్లి నుండేరో
రాల్లూదొరికేది రత్నాలు వచ్చేది భూతల్లి నుండేరో
వాగులుపారేది వజ్రాలు వచ్చేది భూతల్లి నుండేరో
గ్యాసునూనే ఇనుము గంగమ్మ వచ్చేది భూతల్లి నుండేరో’’  (సత్తెన్న, బండి. 2016. దరువుల బండి, పుట.38)

సకల ఖనిజ వనరులు అన్ని భూమిలోనే ఉన్నాయి. పంటలు పండేది భూమి నుండే ఈ భూమి లేకపోతే మనకు బువ్వదొరుకదు అంటూ ఈ భూమికోసం పోరాటం చేయాలని రైతులను, కూలీలను చైతన్య పరుస్తాడు సత్తెన్న.

‘‘అమరుల రక్తంతో అవతారమెత్తిన
మార్క్సిస్టు జెండానే మనమంత ఎత్తాలే
మదిలోన దలువాలే మార్క్సిస్టు జెండాను
బెంగాలు రాష్ట్రానా దొంగల్ని తరిమింది
చట్టాలు జేసిందీ సాధించి చూపింది
భూముల్ని పంచింది బువ్వజూపెట్టింది’’ (సత్తెన్న, బండి. ప్రజానాట్యమండలి).

అమరుల రక్తంతో తడిసిన ఈ నేలలో మనమంత ఎర్రజెండ ఎత్తుకోవాలె. ఈ ఎర్రజెండతోనే మన బతుకులు మారుతాయి, మన బాధలు తీరుతాయి అని చెప్తాడు సత్తెన్న. బెంగాలు వంటి రాష్ట్రాల్లో దొంగలందరిని తరిమి అనేక చట్టాలు చేసి భూములు పంచి బువ్వ పెట్టింది ఎర్రజెండానే తెలుపుతాడు.

బండి సత్తెన్న ఆడపిల్లలకు జరుగుతున్న వివక్షతను చూసి ‘ఆడపిల్ల బతుకు’ ఒగ్గుకథను రాశాడు. ‘‘బంతిపూల జెడలెయ్యవమ్మా బడికినన్ను పంపించవమ్మా’’ అంటూ తల్లిని బిడ్డ నిలదీస్తుంది. ‘‘ఒక్కబిడ్డచాలు ఓ బావగారు నా బావగారు ఆపరేషన్‌తోటి ఆపుకుందాము హాయిగుందారు’’ అంటూ ‘కుటుంబ నియంత్రణ’ గురించి చెప్పిన సన్నివేశం ఎంతో అద్భతంగా చిత్రించాడు. బండి సత్తెన్న రైతుబతుకు, కరువు కన్నీరు, అంటరానోల్ల ఒగ్గుకథలను కూడా రాశారు.

6. ముగింపు:

ఈ విధంగా అనేక ధాటీలను ఒగ్గుకథలో ప్రయోగించి ఒగ్గుకథకులు, ప్రజా కళాకారులు ఒగ్గుకథ ప్రత్యేకత చాటుతున్నారు. ఒగ్గుకథలు చెప్పేవారే మాత్రమే కాకుండా ప్రజా కళాకారులు, ప్రజావాగ్గేయకారులు ఒగ్గుకథను ప్రజాసమస్యలను ఎలుగెత్తిచాటే ఒక ప్రసార సాధనంగా ఎంచుకున్నారు. అంతేగాక తెలంగాణ సాయుధ పోరాటానికి, విప్లవోద్యమానికి, అనేక సామాజికోద్యమాలకు ఒగ్గుకథలు ఆలంబనగా నిలిచాయి. ఈ విధంగా ఒగ్గుకథలో అనేక సామాజికాంశాలు చేరాయి. ప్రజాసంఘాలలో ఒగ్గుకథ ఒక బలమైన ఆయుధంగా అవతరించింది.
ప్రపంచీకరణ ప్రభావం వలన ఒగ్గుకథ అంతరించిపోయే దశకు చేరుకుంది. వినేవారు కరువవుతున్నారు. వందల ఏళ్లుగా ఉన్నటువంటి ఈ ఒగ్గుకథను కాపాడు కోవాల్సిన అవసరం మనందరిపైన, ముఖ్యంగా ప్రభుత్వంపైన ఉంది. ఇంతటి ప్రజాధారణ పొందిన, ప్రజలలో నాటుకుపోయిన ఈ ఒగ్గకథలను రికార్డు చేసి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కనుక విశ్వవిద్యాలయ స్థాయిల్లో ప్రత్యేకంగా ఒగ్గుకథ మూలాల్లోకి వెళ్లి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

7. పాదసూచికలు:

 1. నక్సల్‌బరి బిడ్డలు ఒగ్గుకథ. (1990). జననాట్యమండలి, యూట్యూబ్
 2. కారంచేడు ఒగ్గుకథ. . (1990). జననాట్యమండలి, యూట్యూబ్
 3. డా. సత్తయ్య, చుక్క. ప్రముఖ ఒగ్గుకథకులు, యూట్యూబ్‌.
 4. సత్తెన్న, బండి. 2016. దరువుల బండి, పుట.24.
 5. సత్తెన్న, బండి. 2016. దరువుల బండి,  పుట.38.

8. ఉపయుక్తగ్రంథసూచి:

 1. తిరుమలరావు, జయధీర్. (1988). తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం, సాహితి సర్కిల్, హైదరాబాద్.
 2. సత్తెన్న, బండి. (2016). దరువుల బండి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
 3. వాసుదేవసింగ్, ఆర్. (2008). ఒగ్గుకథ – అభినయసమన్వయం, స్వీయ ప్రచురణ, హైదరాబాద్.
 4. శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల. ఒగ్గుడోళ్ళ నృత్యం గొల్ల కురుమల సంప్రదాయం, స్వీయ ప్రచురణ, హైదరాబద్.
 5. నక్సల్‌బరి బిడ్డలు ఒగ్గుకథ. (1990). జననాట్యమండలి, ఆంధ్రప్రదేశ్.
  JANA NATYAMANDALI NAXALBARIBIDDALU OGGUKATHA BY Dappu Ramesh
 6. కారంచేడు ఒగ్గుకథ. (1990). జననాట్యమండలి, ఆంధ్రప్రదేశ్.
  JanaNantyaMandali KaaramChedu OgguKatha By Dappu Ramesh
  https://youtu.be/8jdmqBnXqqc 
 7. సత్తయ్య, చుక్క. ప్రముఖ ఒగ్గుకథకులు, యూట్యూబ్‌.
  (Oggu Katha Chukka Sattaiah Exclusive Interview-V6 Telangana Animuthyalu (01-05-2015).
  https://youtu.be/34GyCmGk45o 
 8. Prabhanjan Kumar Yadav, Y. (2006). The Voice of The Voiceless Use Of Folk Media Communication A Case Study Of Jana Natya Mandali.
  https://youtu.be/9I8T0deu0yM 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "మే-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-ఏప్రిల్-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "మే-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]