headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

9. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల సహజవర్ణనావైచిత్రి

dr_p_krishna
డా. పల్లా కృష్ణ‌

వైస్ ప్రిన్సిపల్ & తెలుగు అధ్యాపకులు
సియస్యస్ఆర్ & యస్ఆర్ఆర్యమ్ డిగ్రీ & పీ.జీ. కళాశాల,
కమలాపురం, కడపజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9985193868. Email: pallakrishnadr@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులలో క్రీ.శ. 1509 - 1530 కాలానికి చెందిన రాజుగా సాహితీ సరస్వతిని రాజ్యమున నెలకొల్పిన ఉభయ భాషా రచనా సమర్థుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ విషయాలతోపాటు, వివిధ కళలను, సకళ శాస్త్రాలను కూడా పోషించినట్లు తెలుస్తున్నది. నాటి కావ్యాలలో కవులు వర్ణించిన సహజ నేపథ్యాన్ని నేటి కాలపు యువతకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాసంలో పరిశీలన మరియు పరిశోధనాత్మక పద్ధతులను అనుసరించడం జరిగింది. నాటి ప్రబంధాలలో ప్రతిబింబించిన మానవ జీవిత వర్ణన వైచిత్రి, సామాజిక నేపథ్యం నేటి తరాలకు తెలియాలంటే ఈ కావ్యం చదివ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

Keywords: శ్రీకృష్ణదేవరాయలు, కుటుంబనేపథ్యం, సాహితీనేపథ్యం, వస్తునేపథ్యం, సహజ వర్ణనావైచిత్రి, అష్టదిగ్గజ కవుల సాంగత్యం

1. ఉపోద్ఘాతం:

“తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్లనృపులు గొలువ నెఱగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”
అని తెలుగు ప్రాభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన రాజకవీశ్వరుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడు, అష్టదిగ్గజ కవులనాదరించి పోషించిన సాహితీ వల్లభుడు, రసజ్ఞుడు, ఆంధ్రభోజుడు ‘శ్రీకృష్ణదేవరాయలు’.

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులలో క్రీ.శ. 1509 - 1530 కాలానికి చెందిన రాజుగా సాహితీ సరస్వతిని రాజ్యమున నెలకొల్పిన ఉభయ భాషా రచనా సమర్థుడు శ్రీకృష్ణదేవరాయలు. మాధవ విద్యారణ్యస్వామి ఆశీస్సులతో స్థాపితమైన విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజులు మూడు దశాబ్ధాల కాలం పరిపాలించారు. 16 శతాబ్ధి ప్రథమ పాదంలో రాజ్యాన్ని పాలించిన తుళువ వంశీయుడైన శ్రీకృష్ణదేవరాయలు అత్యంత ప్రశస్తి గాంచిన చక్రవర్తిగా పేరు గడిరచారు. ‘‘విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులందరూ ‘రాయలు’ పేరు ఉన్నవారైనా రాయల యుగం, రాయలసీమ అన్న కీర్తి కృష్ణదేవరాయలకే దక్కిందని”  తెలుగు సాహిత్యచరిత్రలో ఆచార్య ఎస్వీ రామారావుగారు శ్రీకృష్ణదేవరాయలు అన్న వ్యాసం నందు పేర్కొన్నారు.  ‘‘భువన విజయము” అను భవనమున అష్టదిక్కుల అష్టదిగ్గజ కవుల కోసం సింహపీఠములు ఏర్పాటు చేసి కవులను అందులో కూర్చునబెట్టి  సాహితీ చర్చలు కొనసాగించే వారని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. అంతేగాక యుద్ద సమయాలలో కవులను తనతో పాటు వెంట తీసుకుపోయేవారని అది ఆయనలోని రసజ్ఞతకు నిదర్శనంగా తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ విషయాలతోపాటు, వివిధ కళలను, సకళ శాస్త్రాలను కూడా పోషించినట్లు తెలుస్తున్నది. అంతేగాక కవుల చేత ప్రబంధ రచనలు రచియింప చేయించడం చేత కూడా 16వ శతాబ్ధం శ్రీకృష్ణదేవరాయల యుగంగా, ప్రబంధ యుగంగా కీర్తికెక్కినది. ఆముక్తమాల్యద అనే ప్రబంధ రచనను తాను స్వయంగా రచించినట్లు గ్రంథ అవతారికను అనుసరించి చెప్పబడిరది. ఈ ఆముక్తమాల్యదకే ‘విష్ణుచిత్తీయము’  అను మరొక పేరు కలదు. అలాగే సంస్కృతంలో మదాలస చరిత్ర, జాంబవతీ పరిణయం, రసమంజరి, సత్యవధూ ప్రీణనం, సకలకథాసార సంగ్రహం, జ్ఞానచింతామణి వంటి మంచి కావ్యాలను రచించారు.

ప్రధానవిషయం:

కృష్ణదేవరాయల కుటుంబ నేపధ్యం : కృష్ణదేవరాయల కుటుంబ నేపధ్యం పరిశీలిస్తే తండ్రి తుళువ నరస దండనాధునికి తిప్పమ్మ, నాగమ్మ, ఓబమ్మలు ముగ్గురు భార్యలు  కాగా, రెండవ భార్య నాగమ్మ కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు. తిరుమలదేవి, చిన్నాదేవిలు శ్రీకృష్ణదేవరాయలకు భార్యలు. తిరుమలదేవికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మొదటి కొడుకు తిరుమల దేవుడు, రెండవ కొడుకు రామచంద్ర. కుమార్తె పేరు తిరుమలాంబ. ఈమె ఆరవీటి రామరాయల భార్య. చిన్నాదేవికి వెంగళాంబ కుమార్తె. ఈమె అళియరామరాయల తమ్ముడు తిరుమల రాయలకు భార్య.

శ్రీకృష్ణదేవరాయలు తన పెద్దకొడుకు తిరుమలదేవుడును 1524లో తిరుమలదేవ మహారాయలు అనే పేరుతో చక్రవర్తిగా అభిషేకించాడని, అయితే విధి వక్రించి అతను మృత్యువాత పడ్డాడని అప్పటికి ఆపిల్లవాడి వయస్సు కేవలం ఆరేళ్ళు అని సాహితీ సమరాంగణ సార్వభౌమ వ్యాస సంపుటిలో (మనవి మాటలు) మోదుగుల రవికృష్ణ తెలిపారు. 1

శ్రీకృష్ణదేవరాయల సాహితీ నేపధ్యం : ‘యవనరాజ్య ప్రతిష్టాపనాచార్య’  బిరుదు పొందిన కవి రాజుగా, రాజకవిగా, కవితా ప్రావీణ్యుడుగా, తనను తాను తెలుగు ప్రభువుగా చాటుకొన్న తెలుగు భాషాభిమాని, విష్ణుభక్తి తత్పరుడు, ప్రబంధ రచనా కవిదిగ్గజం శ్రీకృష్ణదేవరాయలు. సాహిత్య జగత్తులో తమకంటు ప్రత్యేక  స్థానం సంపాదించారు. సంస్కృతంలో మదాలస చరిత్ర, జాంబవతీ పరిణయం, రసమంజరి, సత్యవధూ ప్రీణనం, సకలకథాసార సంగ్రహం, జ్ఞానచింతామణి వంటి మంచి కావ్యాలను రచించారు.

శ్రీకృష్ణదేవరాయలు రాసిన కావ్యాలలో ప్రసిద్దిగాంచిన కావ్యప్రబంధం ‘ఆముక్తమాల్యద’. ఈ కావ్యానికే  ‘విష్ణుచిత్తీయం’ అని మరో పేరు కలదు. విష్ణుచిత్తుని కథాంశం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక రకంగా విష్ణుచిత్తీయం పేరు వచ్చి ఉండవచ్చు. కానీ ప్రధానంగా చూస్తే ఆముక్తమాల్యదలో గోదాదేవి శ్రీరంగేశ్వరుల పరిణయం ముఖ్యమైనది. ఆముక్తమాల్యద అంటే ధరించి వదిలిన దండను ఇచ్చునది అని అర్థం కలదు.  ఈ కావ్యమందు ఉపకథలుగా ఖాండిక్య కేశిధ్వజుల సంవాదం, యామునాచార్య వృత్తాంతం, మాలదాసరి కథలు మనకు కనిపిస్తాయి.
ఆముక్తమాల్యద వస్తునేపధ్యం: ఈ కావ్యం నందలి వస్తునేపధ్యం పరిశీలిస్తే రాయలవారికి విష్ణుభక్తి అధికమని తెలుస్తుంది. ఈ కారణం చేతనే ఆముక్తమాల్యద వంటి దివ్య ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టివుండవచ్చు.  ఈ కావ్యంలో విష్ణుభక్తితో పాటు విశిష్టాద్వైత తత్త్వానికి ఆలంబనగా చక్కటి వర్ణనా చాతుర్యంతో, అద్భుతమైన కల్పనా మాధుర్య పఠిమలు మనల్ని రంజింప చేస్తాయి. రాయలవారు ఆంధ్రవిష్ణువును (శ్రీకాకుళస్వామి) దర్శించేవారని, ఒకసారి స్వామివారు కలలో కనిపించి గోదాదేవి శ్రీ రంగనాథుల పరిణయ గాథను కృతిగా రాయమని ఆదేశించారని చెప్పబడిరది.

“ఎన్నిను గూర్తువన్న విను, మే మును దాల్చిన మాల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్ను గొంటినే
నన్ననదండ యొక్క మగవాడిడ, నేను దెలుంగు రాయడన్
గన్నడరాయ, యక్కొదువగప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్.”   ఆముక్త మాల్యద (1-14)

ఆముక్త మాల్యద నాయిక పేరుతో రచింపబడ్డ మొదటి ప్రాచీనాంధ్ర ప్రబంధ కావ్యంగా గుర్తింపు పొందినది. ఆరు ఆశ్వాసాల ఈ కావ్యమందు రాయలవారి తమ రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రధాన కథకు  సంబంధంలేని ఖాండిక్య కేశిధ్వజుల సంవాదం, యామునాచార్య వృత్తాంతము, మాలదాసరి కథలు ఉప కథలుగా చెప్పబడుటచే ఈ ప్రబంధంలో వస్త్వైక్యం లేదని కొందరు విమర్శకుల అభిప్రాయం. అయితే ఈ ఉపకథలు అన్నీను ప్రధాన కథ గోదాదేవి రంగనాథుల పరిణయగాథకు అంతర్భూతంగా నిలుస్తున్నవే అని, వస్త్వైక్యం ఆముక్త మాల్యదలో చక్కగా ఉన్నదని కాండూరు వెంగళాచార్యులు ఆముక్త మాల్యద   ఒక పరిశీలనలో తెలియజేశారు.

ఆముక్తమాల్యదలో రాయలవారి సహజవర్ణనావైచిత్రి :

రాయలువారు వర్ణనానిపుణులు మరియు చక్కటి వర్ణనా చమత్కార విన్యాసం తెలిసిన వారు.  ఈ కావ్యంలో చాలా పద్యాల్ని వర్ణనలకే వినియోగించుకున్నారు. ఆముక్తమాల్యద కావ్యం ఏడాశ్వాసాల్లో, 878 గద్యపద్యాల్లో విరచించబడింది. అందులో ఋతువర్ణనలకు 181 గద్యపద్యాల్ని అంటే కావ్యంలో దాదాపు ఐదోవంతు ఋతువర్ణనలు చోటుచేసుకున్నాయి. గ్రీష్మఋతువు 26 పద్యాల్లో (2-45 నుండి 70 వరకు) వర్ష ఋతువు 61 పద్యాల్లో (4-76-136) శరదృతువు 47 పద్యాల్లో (4-137-183) వసంతఋతువు 47 పద్యాల్లో (5-97-143) రాయలు వర్ణించారు. ఇదే విషయాన్ని ఆచార్య పాపిరెడ్డి నరసింహారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల చమత్కార వైభవం అన్న వ్యాసంలో తెలియజేశారు3. ఆముక్త మాల్యదలో విల్లి పుత్తూరు పురవర్ణన, మధురానగర వర్ణనలు, దశావతార వర్ణనలు, ఋతువర్ణనలు రాయలవారి వర్ణనా వైచిత్రిని అద్భుతంగా తెలియజేస్తాయి.


రాయలవారు గోదాదేవిని వర్ణిస్తూ -
‘‘తళుకొత్తు న్భుజకీర్తి వజ్రఘృణి సూత్ర స్యూత హారస్ఫుర
త్కళికా చిత్ర కుచద్వయోపరి గళా ధస్య్వుల్ప విస్తారదై
ర్ఘ ్యల సత్తిర్యగురస్తటంబను వివాహాంచ న్మనోజాత పా
టల దంతచ్ఛద బోడబాసికము దండల్వోలె గేళ్లింతికిన్.’’  ఆముక్త మాల్యద :  (5-20)
ఈ పద్యంలో రాయలవారు గోదాదేవి వక్షస్థలం ఆభరణాలచేత మెరుస్తూ బాసికం వలే ఉన్నదని, ఆమె చేతులు పూలదండవలె ఉన్నవని అద్భుతంగా గోదాదేవికి పూలదండలకు గల సంబంధాన్ని అన్వయిస్తు వర్ణనచేశారు. అదేవిధంగా మరొక సందర్భంలో మానవాళికి, ఋతుచక్రానికి ఉన్న సంబంధాన్ని అమోఘంగా దర్శింపజేస్తారు.

ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు తమ విష్ణు భక్తితో పాటు అద్భుతమైన సామాన్య జన జీవన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఆయనలోని లోకజ్ఞత ఎంత గొప్పదో క్రింది పద్యం ద్వారా వ్యక్తమవుతుంది,

‘‘తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా
వలి పిండీకృత శాటు లన్సవి తదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బారువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.’’   ఆముక్త మాల్యద :   (1-65)
అంటూ బాతులు పంటకాలువల దగ్గర తమ రెక్కలలో తలదాచుకొని నిద్రించుట చూసి, బ్రాహ్మణులు ప్రొద్దునే స్నానం చేసి మరిచి వెళ్ళిన ధోవతులవలే ఉన్నవని, ఆ ఊరి కాపలావాళ్ళు అవి తీసుకుని బ్రాహ్మణులకు అందజేయడానికని కాలువలోకి దిగగానే ఆ బాతులు పారిపోవుట చూచి అక్కడ పనిచేసుకుంటున్న ఆడవాళ్ళు నవ్వుకున్న వైనం చిత్రించబడిరది. ఇది రాయల అపూర్వ వర్ణనా పఠిమకు నిదర్శనం.

కలమపుటెండుగుల్ ద్రవిడకన్యలు ముంగిట గాచుకుండి త
జ్జలకరుహనాభోగేహ  రురుశాబము సారెకు బొక్కులాడ కొం
డెలపయికమ్మగ్రామ్య తరుణీతతి  డించిన పేపగంపలం
చలమగుచున్న చెంగలువదండల దోలుచు రప్పురంబునన్”.  ఆముక్త మాల్యద :    (1-75)
విలుబుత్తూరులో నున్న మన్ననారు స్వామి గుడిముందు ఖాళీస్థలంలో ద్రావిడ కుటుంబినులు వడ్లు ఎండబోసి కాపలా ఉన్నారు. ఆ గుడి జింకపిల్ల మాటిమాటికీ వచ్చి ఆధాన్యం బొక్కులాడుతూ ఉంది. దాన్ని కొడదామంటే గుడి జింక అయిపోయె సున్నితం అయింది అయిపోయె. ఎలామరి? రాయలు ఈ సందర్భంలో ఓ చక్కని చమత్కృతిని సాధించారు. గుడి ముంగిట్లో పల్లెయువతులు పేముతో అల్లిన గంపల్లో చెంగలువదండలు పెట్టుకొని ఉన్నారు. అమ్మడానికి వాటిని తీసుకొని ఆ జింకపిల్లను తరిమారట జింకపిల్లలు ఎంత సున్నితమైనవో ద్రావిడ కుటుంబినుల హృదయాలు అంత కోమలమైనవి. చెంగలువదండులు సుతిమెత్తనివి.

గ్రీష్మఋతువు వర్ణనలో రాయలు ఓ చక్కని దృశ్యాన్ని చమత్కారంగా ఆవిష్కరించాడు. ఎండాకాలంలో చలిపందిరులు వెలిశాయి. ఒక చలిపందిరి వద్దకు ఓ బాటసారి వచ్చాడు. 'అమ్మలు అక్కలు' అంటూ దీనతతో దోసిలి పట్టి నీళ్లు తాగడం ప్రారంభించాడు. దప్పిక తీరుతూ ఉండేకొద్దీ ఓరచూపుల్లో ఆ నీళ్లుపోసే అమ్మాయిల అందాల్ని అదేపనిగా చూస్తున్నాడు. అంతకుముందు తను 'అమ్మా, అక్కా అన్న మాటల్ని మరిచిపోయాడు తమని శృంగారదృష్టితో చూసే బాటసారిని ఆ యువతులు గమనించారు. వాడి కపటపు తాగుడుకు సరిపోయేట్లు వాళ్లు నీళ్లు పోయడమే మానేశారు. సైగలు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎంత చక్కని చమత్కారభరిత దృశ్యమో ఇది. రాయల మాటల్లోనే –

తొడిబడ నమ్మలక్కలని తూలుచు దీనత దోయిలొగ్గుచున్
వడ మఱి తేఱదేనల వాక్యము లెన్నక మోము గుబ్బలున్
కడుగోను కక్షదీప్తులనెగాదిగ గ్రన్ననున చిట్టకంపు త్రా
గడుగ్రని సన్నలన్నగిరి క్రోల్పక పాంథు బ్రపాలికత”.

వేసవికాలంలో రాయలసీమ బావుల్లో నీరు అడుగంటడం జరుగుతుంది కనుక ఇంతకుముందు చేతితో త్రాడు చాలక ఇంట్లో ఉన్న తాటి తుంపులన్నీ ముడిపెట్టి పొడవైన త్రాడుగా చేసి ఎక్కడో పాతాళం అంటిన నీటిని స్త్రీలు చేరడం జరుగుతుంది ఆ చేరడానికి కూడా చాలా సమయం పడుతుంది ఇది ఎలా ఉన్నదంటే సూర్యుని ప్రతాపాగ్నికి భయపడి నీటి చలువలు పాతాళంలో దాక్కున్నవిగా (శ్రీకృష్ణదేవరాయల పరాక్రమానికి భయపడి శత్రువులు వింధ్య పర్వతం గుహలో దూరినట్లుగా) అన్పిస్తుంది. ఆ నీటిలో చల్లదనాన్ని ఆకర్షించడానికి తల్లి గుండెలమీద తరుణులు ఒరిగినప్పుడు ఆస్వాదించే చల్లదనం అంటూ చక్కగా వర్ణించే పద్యం-

తరుణుల్దల్లి యొఱన్దుచంబు లునుపం దచ్చైత్యము ల్దీములై
పెరరేపం జనుదెంచే ఁగాక! రవిదీప్తిం గ్రుంగి పాతాళగ
హ్వరముల్ దూఱిన వారి నీ యదుకు ద్రాళ్లా తెచ్చు? నా దీర్ఘత
చ్చిర కృష్టింగను నీటి శైత్య మలరించె న్నూతులందత్తఱిన్”.  ఆముక్త మాల్యద :    (2- 66)

నాటి కాలంలో గ్రామ గ్రామాన సర్వ వసుంధరలో కూడా నిప్పుల కుంపటి లాగా ఉండే తీక్షణమైన ఆ వేసవిని తట్టుకునే విధంగా రాజుగారు వేయించిన చలువ పందిళ్లు తామరల తీగల గుంపుగా ఉన్నవని చెప్పిన సందర్భంలోని పద్యం -

"గ్రామ గ్రామంబున నొక
సామంతున కిడిన చలువ చప్పరములు త
న్పై మేదినిఁ గుంపటిలోఁ
దామరలుం బోలె నట్టి తఱి నొప్పారెన్". (ఆముక్త మాల్యద : 2- 69)

అదేవిధంగా గొప్ప ధనము చేత అత్తవారింట కాపురం చేయుచున్న కుమార్తెలు గర్భము కలగగానే బిడ్డను పుట్టించుకొనుటకు పుట్టినిల్లు చేరునట్లుగా, మేఘములు సముద్ర ఉదకము చేత గర్భము ధరించి లోకమునంతట వర్శించుచున్నవని  అద్భుతంగా  వర్ణించె సందర్భంలోని పద్యం -

వనధిగమనజగర్భార్క జనిత ఘృణులు
మణి ప్రసూతికి నతవిధామంబుఁ జేరె:
ఘనతఁ జొచ్చినయిండ్లను దనయ లుండి
కాన్పునకుఁ బుట్టిని ల్చేరుక్రమము గనమె? (ఆముక్త మాల్యద: 4-78)

అలాగే శరదృతువు సమయంలో- వర్షఋతువు ధర్మములైన వర్షించుట మొదలగు చిహ్నములు పోయి శరదృతువు ధర్మములు కనిపించుచున్నవని చెప్పుచు,  శరదృతువు రాగా  మానస సరోవరంబున  వర్షాకాలం పోవుట చేత క్రౌంచ పర్వతము యొక్క బిలములో నుంచి రాజహంసలు దశర్నాది దేశములకు వస్తున్నవని, శరదృతువు నందు కమలములు వికసించుచున్నవని వాని యందు లక్ష్మి నివసించుట గురించి చేసిన వర్ణన కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది.

రాజమరాళలబ్ధగిరిరంధ్రము, శాలివనీశరావలీ
వైజనంబు, యజ్వహుతవా జహు తాళము, భాస్వదిందిరాం
భోజసమాగమం, బుదితభోదభుజంగ శయోపచారనీ
రాజనపుల్ల హల్ల కసరం, బుదయించే శరద్దినం బిలన్”  (ఆముక్త మాల్యద : 4-137)

ఈ సందర్భముగా ఆ శరదృతువు నందు విష్ణువు నిద్ర మేల్కొని తన పాదమును భూమిపై ఉంచనేమో భూదేవి పులకింత అయ్యనేమో అని చెబుతూ పండుట చేత వాడి అయివున్న  ముండ్లుగల సన్న వరి ఎన్నులు అందముగా కనపడుచున్నవి అని చక్కగా వర్ణించారు. ఈ సందర్భంలోని పద్యం -

నీరజేక్షణుం డవ్వేళ నిద్ర దెలిసి
యడుగుఁ దనమీఁద మోపనో యవనిరమణి
కంటకితగాత్రి యయ్యె నాఁగా విపాక
పరుషకంటకశాలిమంజరులు వొలిచె”   (ఆముక్త మాల్యద : 4-144)

సహజంగా లోకమందలి స్త్రీలు తమ సంతానమునకు దంతములు మొలిచే వరకు బాలింతలై పురుష సాంగత్యం లేకుండా ఉంటారని, దంతములు మొలవగానే పురుషులు తమతో సంభోగించురని సంతోష పడినట్లుగానే వనలక్ష్మీ కూడా వృక్షములు చిగిర్చి వృద్ధియై మొగ్గలు పొడమిన కారణమున ఆ వృక్షములు బిడ్డలని మొగ్గలు వారి దంతములని, వైశాఖమాసము తన పురుషుడని, ప్రకాశము సంతోషమని అన్నట్లు ఆనందపడెనని వర్ణించారు.  మాధవుని సంగతి చెప్పుటవలన లక్ష్మికి మాధవుని సాంగత్యం యుక్తమేనని తెలిపెను. ఈ సందర్భంలోని పద్యం -

తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్చట లుల్లసిల్లఁ గో
ల్కొను ధరణీజ సంతతికిఁ గోరక దంతము లించుకంత ని
క్కినయది యాదిగాఁగఁ జెలంగెన్ వనలక్ష్మి; గడుఁ జెలంగఁగాం
జనుఁ, బ్రియుఁడైన మాధవుని సంగతి మీఁదటఁ జాలఁ గల్గుటన్”   (ఆముక్త మాల్యద : 5- 116)

అలాగే ఆముక్త మాల్యదలో  కనపడే కొన్ని సాధారణ జనజీవన చిత్రణను గమనిస్తే`
‘గ్రామీణ ఆడపడచులు గంపలతో పూలు తీసుకుని వీధులవెంట తిరుగుతూ అమ్ముకొవడం’,
‘ఇంటికి వచ్చిన వారిని కొబ్బరాకుల చాపలపై కూర్చోబెట్టడం’,
‘వర్షాకాలంలో భార్యలు కష్టపడకూడదని పొయ్యిలోకి కొబ్బరి బొండాల పీచు, ఎండుమట్టలు పోగుచేసి నిల్వచేసుకోవడం’,
‘చాకిరేవులలో ఎండబెట్టిన చీరల్లా ఆకాశంలో రంగులు మారడం’,2
‘వేసవి కాలంలో గ్రామీణ స్త్రీలు గరిక దొప్పలతో కుండలలోని నీరు  పోస్తూ బాటసారుల దాహం తీర్చడం’,
‘సాయంత్రం నగరానికి పూలు, చెఱకుగడలు తీసుకొని వచ్చి అమ్మే పల్లెపడుచుల చుట్టూ గుంపులు గుంపులుగా జనం చేరి వాటిని కొనుక్కోవడం’
‘కాలువలో బొరియలు వెదుక్కొని దూరే ములుగు మీనులు’,
‘పుట్టమీద మొలచిన పుట్టకొక్కులు’,

వేసవి కాలంలో తాపం తట్టుకోలేక బురదలో పోర్లాడే పందులు  వంటి అంశాలతో  గ్రామీణ జీవన వైవిధ్యం ఉట్టిపడే విధంగా రాయలు వారు చిత్రించారు.  రాయలవారు గొప్ప పర్యాటక అభిలాషి కావడం వలన ఆయన వివిధ ప్రదేశాలను పర్యటించినపుడు, ముఖ్యంగా సామాన్య జనుల జీవన విధానం గురించి, ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే మార్పులు గురించి, అద్భుతమైన సుందర దృశ్యాల గురించి, సృష్టిలో జరుగుతున్న వింతలు విశేషాల గురించి ఎంత చక్కగా  నిశిత పరిశీలన చేశారో అర్థం  చేసుకోవచ్చు.

‘‘నాటి కవులు ఎక్కడ జీవించినా వారి చూపులు మాత్రం ఆకాశ మార్గాన సాగేవి. వారు కనీవినీ ఎరుగని వింతలను బహురుచ్యముగా పద్యంలో అందంగా పేర్చడంలో నిష్ణాతులు” అయితే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో  చేసిన వర్ణనలు ఇందుకు భిన్నంగా సహజనేపధ్యంగా కొనసాగినవని చెప్పవచ్చు అని సాహితీ సమరాంగణ సార్వభౌమ వ్యాస సంకలనంలో సంపాదకుడు మోదుగుల రవికృష్ణ అన్నారు. రాయలు వారు వివిధ వైష్ణవ గ్రంథాల నుంచి కథలను తీసుకొని వర్ణనలతో పెంచి ప్రబంధంగా ఆముక్తమాల్యదను రచించాడని, సందర్భం దొరికితే చాలు రాయలు వారు సుదీర్ఘ వర్ణనలోకి దిగుతారు అని ఆముక్తమాల్యదలోని రుతు వర్ణనలు, ప్రకృతి వర్ణనలు,  పురవర్ణనలు, ఉద్యానవన వర్ణనలు అపూర్వంగా ఈ కావ్యంలో వర్ణించబడ్డాయని, తెలుగు కావ్యాల్లో  ఇంత మనోహరమైన వర్ణనలు లేవని, గ్రీష్మ వర్షాధి ఋతువులను కవి దీర్ఘంగా రమ్యంగా సహజంగా వర్ణించారని అంటారు ముదిగంటి సుజాత రెడ్డి గారు4.

ముగింపు:

శ్రీకృష్ణదేవరాయలు స్వతహాగా కవి కావడం, ఆయనలో మంచి భావుకత ఉండడం, అష్టదిగ్గజ కవుల సాంగత్యం లభించడం చేత కూడా వారి కవిత్వానికి మంచి పట్టుదొరికి ఉండవచ్చు. రాయల వర్ణనల్లో ప్రతి పద్యంలో ఓ 'ఊహ ఉంటుంది'. ఒక ఋతువును గురించి అన్ని రకాలుగా ఒకేసారి ఊహించడం కుదరనిపని. ఇలా రాయాలంటే కొన్ని సంవత్సరాలు ఆయా ఋతువుల్నీ వివిధ నేపథ్యాల్లో - పల్లెల్లో, అడవుల్లో, నగరాల్లో, మనుషులు, జంతువులు, కీటకాలు-వాటి ప్రతిచర్యలు, ప్రకృతిలోని కొండలు, వనాలు ఇలా అన్ని అంశాల్ని నిశితంగా పరిశీలించి రాయలు పద్యాలు అల్లుకొని ఉంటారు. అందుకే వారి కావ్యంలో కవిత్వంలో గొప్ప ప్రతిభా పాండిత్యాలు అడుగడుగునా కన్పిస్తాయి. అంతేగాక  ఈ కావ్యంలో రాయలవారి ఆలంకారిక ప్రౌడశైలి వారికి శాస్రం నందు గల అభినివేశాన్ని, పాండిత్యాన్ని తెలియజేస్తాయి. అందుకే ఆముక్తమాల్యద కావ్యం శ్రీకృష్ణదేవరాయలను మంచి పండితుడుగా, రసజ్ఞుడుగా  నిలబెట్టిందని చెప్పవచ్చు.  

పాదసూచికలు:

  1. సాహితీ సమరాంగణ సార్వభౌమ - సంపాదకుడు మోదుగుల రవికృష్ణ. మిత్రమండలి ప్రచురణల(2013) - గుంటూరు. పేజీ నం 9,10.
  2. సాహితీ సమరాంగణ సార్వభౌమ - సంపాదకుడు మోదుగుల రవికృష్ణ. మిత్రమండలి ప్రచురణల(2013) - గుంటూరు. పేజీ నం 14,15.
  3. తెలుగు విభవం  సంపాదకులు – డా. ఎల్వీ కే,  డా. పి. సి. వెంకటేశ్వర్లు. (దివ్య తేజ పబ్లికేషన్స్ హైదరాబాద్.) పేజీ నం 22-23
  4. చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర)- రోహణమ్ పబ్లికేషన్స్ - హైదరాబాద్. 2004. పేజీ నం 147.

ఉపయుక్తగ్రంథసూచి:

1. తెలుగు సాహిత్య చరిత్ర - ఎస్.వి.రామారావు. పసిడి ప్రచురణలు(2012) – హైదరాబాద్.
2. తెలుగు సాహిత్యసమీక్ష- (రెండవ సంపుటం) డా.జి.నాగయ్య- నవ్య పరిశోధక ప్రచురణలు(2003)- తిరుపతి.
3. సాహితీ సమరాంగణ సార్వభౌమ - సంపాదకుడు మోదుగుల రవికృష్ణ. మిత్రమండలి ప్రచురణల (2013) – గుంటూరు.
4. చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర- ముదిగంటి సుజాత రెడ్డి. రోహణమ్ పబ్లికేషన్స్ (2004) - హైదరాబాద్.
5. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద - ఎమెస్కో ప్రచురణ (2009), విజయవాడ.
6. తెలుగు విభవం  సంపాదకులు – డా. ఎల్వీ కే,  డా. పి. సి. వెంకటేశ్వర్లు. (దివ్య తేజ పబ్లికేషన్స్ హైదరాబాద్.) 
7. ఆముక్త మాల్యద - ఒక పరిశీలన (కాండూరు వెంగళాచార్యులు ) సాహితీ మంజూష

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "November-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-October-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "NOVEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]