AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797
7. ఉత్తర ద్రావిడభాషలలో అచ్చులు: తులనాత్మకపరిశీలన
జి. బాలకృష్ణ
పరిశోధక విద్యార్థి, తెలుగు మరియు తులనాత్మక సాహిత్యశాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురము, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9542428281. Email: balakrishna6032@gmail.com
ఆచార్య జి. నరసింహన్
ఆచార్యులు, తెలుగు మరియు తులనాత్మక సాహిత్యశాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురము, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9000127115. Email: gnnnaga11@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
భారతీయ భాషాకుటుంబాలలో ద్రావిడ భాష కుటుంబం ఒకటి. ఈ కుటుంబంలోని భాషలన్నీ మూల ద్రావిడ భాష నుండి పుట్టినవి వీటిని ప్రధానంగా నాలుగు(4) ఉపకుటుంబాలుగా విభజించవచ్చు. 1. దక్షిణ ద్రావిడ భాష కుటుంబం 2. దక్షిణమధ్య ద్రావిడ భాష కుటుంబం 3. మధ్యద్రావిడ భాష కుటుంబం 4. ఉత్తర ద్రావిడ భాష కుటుంబం. ఈ నాలుగు ఉపకుటుంబాలను కలిపి మొత్తం 26 ద్రావిడ భాషలు ఉన్నాయి. అందులో ఉత్తర ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి మూడు(3). 1. కూడుఖ్ 2. మాల్తో 3. బ్రాహుయి. ఈ వ్యాసంలో మూల ద్రావిడంలోని అచ్చులు ఉత్తర ద్రావిడ భాషలలో ఏ విధంగా పరిణామము చెందాయి అనే విషయాన్ని తులనాత్మక పరిశీలన ద్వారా తెలుసుకోవడం వ్యాసం ప్రధాన ఉద్ధేశం. నేను ఈ పరిశోధన కోసం ద్రావిడ భాషలకు సంబంధించిన ప్రామాణిక ద్వితీయ గ్రంథాలను ఆధారంగా తీసుకొని, సైద్ధాంతిక పద్దతిలో విషయాన్ని వివరించడం జరుగుతుంది.దీని ద్వారా ఉత్తర ద్రావిడభాషలను పరిచయం చేయడం,అందులో ఉన్న అచ్చులను,నాసిక అచ్చులను,సంధ్యాక్షరాలను గురించి మరియు పరిసర భాషలైన ఇండో - ఇరానియన్,పర్షియన్,హిందుస్తానీ భాషల ప్రభావం వల్ల ఉత్తర ద్రావిడ భాష అచ్చుల్లో జరిగిన ప్రధాన మార్పులను తెలుసుకుంటాము.
Keywords: మూలద్రావిడ భాష, ద్రావిడ భాషలు, కూడుఖ్, మల్తో, బ్రాహుయి, అచ్చులు, నాసిక అచ్చులు, మరియు సంధ్యక్షరాలు.
1. ఉపోద్ఘాతం:
ద్రావిడ భాషలన్నిటికి మూలం మూలద్రావిడ భాష. నేడు ద్రావిడ భాషలుగా వ్యవహారంలో ఉన్న భాషలన్నీ ఈ భాష నుంచి పుట్టినవే. దీని ఆధునిక రూపం పూర్తిగా పునర్నిర్మాణం మీద ఆధారపడి ఉంది. అందువల్ల దీనిని ‘పునర్నిర్మిత భాష’ అని కూడా అంటారు. మూల ద్రావిడ భాషలో పది అచ్చులు ఉన్నాయి1. వాటిని కింది పట్టికలో చూడవచ్చు.
మూలద్రావిడ భాషలో అచ్చులు
ఉత్తర ద్రావిడ భాషల్లో కూడుఖ్ ముఖ్యమైనది. కూడుఖ్ జాతివారిని 'ఒడయాన్” అని అంటారు. వీరు ప్రధానంగా బీహార్‌లోని ఛోటానాగ్‌పూర్ ప్రాంతంలో ఉన్నారు. సరిహద్దు రాష్ట్రాలైన జార్ఖండ్, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలలోను మరియు నేపాల్ దేశంలో కూడా ఈ భాష వ్యవహార్తలు అధికసంఖ్యలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. అస్సాం తేయాకు తోటలలో కూడా కొందరు కూలీలుగా పనిచేస్తున్నారు. కూడుఖ్ మల్తో భాషకు సన్నిహితంగా ఉంటుంది. మహాభారతంలోని “కరూశ’, ‘కరూఖలే’, కూడుఖ్ వారని టి.బరో పేర్కొన్నాడు2. కూడుఖ్ భాషలో పది అచ్చులు ఉన్నాయి. అందులో ఐదు హ్రస్వ అచ్చులు(అ, ఇ, ఉ, ఎ, ఒ). ఐదు దీర్ఘ అచ్చులు(ఆ, ఈ, ఊ, ఏ, ఓ).
మలేర్ జాతి వారు మాట్లాడే భాష మాల్తో. వీరు ఎక్కువగా బీహార్, సంతాల్ పరగణాలలోని రాజ్మహాల్ కొండలలో నివశిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన జార్ఖండ్, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా కొందరు మాల్తోలు ఉన్నారు. మల్తో భాషలో కూడా పది అచ్చులు ఉన్నాయి. అందులో ఐదు హ్రస్వ అచ్చులు(అ, ఇ, ఉ, ఎ, ఒ). ఐదు దీర్ఘ అచ్చులు(ఆ, ఈ, ఊ, ఏ, ఓ).
పూర్తిగా భారతదేశం వెలుపల వ్యవహారంలో ఉన్న ఏకైక ద్రావిడ భాష బ్రాహుయి. ఈ భాష వ్యవహార్తలు పాకిస్తాన్ లోని బెలుచిస్తాన్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఆప్ఘానిస్థాన్ లోని షోర్వాక్ పట్టణంలో కూడా కొందరు నివశిస్తున్నారు. వీరందరూ ఒకే జాతివారు కాదు. ఇందులో ప్రస్తుతం 27 తెగలు ఉన్నాయి. వాటిలో అహమద్ జై, ఇల్తజై, మిర్వారి, గుర్గార్నీ, సమలారీ, కలంద్రరీ అనే ఆరు శాఖలే ముఖ్యమైనవి. వీరి ముఖ్య వృత్తి గొర్రెలు పెంచడం. కొన్ని చోట్ల గుర్రాలు, ఆవులను కూడా పెంచుతారు. ఎమ్.ఎస్. అండ్రోనోవ్ బ్రాహుయిలో మూడు మాండలికాలను గుర్తించాడు.అవి 1.కాలత్, 2.సరవాన్, 3.ఝులవాన్. బ్రాహుయి భాషలో ఎనిమిది అచ్చులు ఉన్నాయి3. అందులో మూడు హ్రస్వ అచ్చులు(అ, ఇ, ఉ). ఐదు దీర్ఘ అచ్చులు(ఆ, ఈ, ఊ, ఏ, ఓ).
ఉత్తర ద్రావిడ భాషల్లోని అచ్చుల పరిణామం:
- * |అ|కారం:
మూల ద్రావిడంలోని హ్రస్వ ‘అ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘అ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/973: తమిళ్ - కణ్(కన్ను)
కూడుఖ్ - ఖన్
మాల్తో - ఖను
బ్రాహుయి - ఖన్
- * |ఆ| కారం:
మూల ద్రావిడంలోని దీర్ఘ ‘ఆ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఆ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/3348: తమిళ్ - పాటు(పాడు)
కూడుఖ్ - పార్ నా
మాల్తో - పారె
* DED/3370: బ్రాహుయి - పాల్ (పాలు)
- * |ఇ| కారం:
మూల ద్రావిడంలోని హ్రస్వ ‘ఇ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఇ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/4198: తమిళ్ - పిళ్లై(పిల్ల)
కూడుఖ్ - పెల్లో
మాల్తో - పెలి
బ్రాహుయి - పిల్లోత
- * |ఈ| కారం:
మూల ద్రావిడంలోని దీర్ఘ ‘ఈ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఈ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/2683: తమిళ్ - తీర్ (తీరు)
కూడుఖ్ - తీర్ (వెనుకపడు)
మాల్తో - తీర్ (వెళ్లిపోవు)
* DED/2672: బ్రాహుయి - తీన్ (మండే వేడి)
- * |ఉ| కారం:
మూల ద్రావిడంలోని హ్రస్వ ‘ఉ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఉ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/3064: తమిళ్ - నుంకు (మింగు)
కూడుఖ్ - నున్ ఖ్నా
మాల్తో - నుంగ్
బ్రాహుయి - నుంఘుషింగ్
- * |ఊ| కారం:
మూల ద్రావిడంలోని దీర్ఘ ‘ఊ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఊ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/3564: తమిళ్ - పూ (పువ్వు)
కూడుఖ్ - పూప్ / పూంప్
మాల్తో - పూపు
* DED/3537: బ్రాహుయి - పూ (పురుగు)
- * |ఎ| కారం:
మూల ద్రావిడంలోని హ్రస్వ ‘ఎ’ కారం కూడుఖ్, మాల్తో భాషల్లో ‘ఎ’ కారంగానే ఉంది. బ్రాహుయి భాషలో ఉన్న హ్రస్వ ‘ఎ’ కారం కొన్ని పదాలలో హ్రస్వ ‘అ’ కారంగాను మరి కొన్ని పదాలలో హ్రస్వ ‘ఇ’ కారంగాను మారుతుంది.
ఉదా:
* DED/1645: తమిళ్ - చెవి (చెవి)
కూడుఖ్ - ఖెబ్దా
మాల్తో - ఖెత్వు
బ్రాహుయి - ఖాఫ్
బ్రాహుయి లో (ఎ > అ) కారంగా మారడానికి ఉదాహరణ:
* DED/710 తమిళ్ - ఎలి (ఎలుక)
బ్రాహుయి - హల్
బ్రాహుయి లో (ఎ > ఇ) కారంగా మారడానికి ఉదాహరణ:
* DED/3613 తమిళ్ - పెరు (పెద్ద, పెరుగు)
బ్రాహుయి - పిర్ (వాచు)
- * |ఏ| కారం:
మూల ద్రావిడంలోని దీర్ఘ ‘ఏ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఏ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/2855: తమిళ్ - తేళ్ (తేలు)
మాల్తో - తేలె
బ్రాహుయి - తేల్
* DED/2851: కూడుఖ్ - తేలా (నల్లమల చెట్లు)
- * |ఒ| కారం:
మూల ద్రావిడంలోని హ్రస్వ ‘ఒ’ కారం కూడుఖ్, మాల్తో భాషల్లో ‘ఒ’ కారంగానే ఉంది. బ్రాహుయి భాషలో ఉన్న హ్రస్వ ‘ఒ’ కారం * ఓ, ఉ, అ కారాలలో ఒకటిగా మారుతుంది.
ఉదా:
* DED/3658: తమిళ్ - పొంకు (పొంగు)
కూడుఖ్ - పొక్
మాల్తో - పొంఘ్
* DED/3656: బ్రాహుయి - పోఘ్ (బొగ్గు)
బ్రాహుయి లో (ఒ > ఓ) కారంగా మారడానికి ఉదాహరణ:
* DED/2926 తమిళ్ - తొంటాన్ (తోడేలు)
బ్రాహుయి - తోల (నక్క)
బ్రాహుయి లో (ఒ > ఉ) కారంగా మారడానికి ఉదాహరణ:
* DED/2324 తమిళ్ - చొట్టు(నీటి బిందువు)
బ్రాహుయి - చుట్ట్
బ్రాహుయి లో (ఒ > అ) కారంగా మారడానికి ఉదాహరణ:
* DED/834 తమిళ్ - ఒన్రు(ఒకటి)
బ్రాహుయి - అసిట్
- * |ఓ| కారం:
మూల ద్రావిడంలోని దీర్ఘ ‘ఓ’ కారం ఉత్తర ద్రావిడ భాషల అన్నిటిలోనూ ‘ఓ’ కారంగానే ఉంది.
ఉదా:
* DED/4219: తమిళ్ - మోటు (మూర్ఖత్వం)
బ్రాహుయి - మోట్
* DED/4221: కూడుఖ్ - మోద్ (మర్చిపోవు)
మాల్తో - మోత్
నాసిక అచ్చులు:
ముక్కు ద్వారా గాలిని బయటకు పంపడం ద్వారా ఉత్పన్నమయ్యే అచ్చులను నాసిక అచ్చులు అంటారు. ఇవి నోటి ద్వారా పలికే అచ్చులకు విరుద్ధంగా ఉంటాయి. కొన్ని అచ్చులకు ఏ విధమైన భేదము ఉండదు. ఈ లక్షణం ఆ భాషలోని మాండలికాల పై ఆధారపడి ఉంటుంది. కూడుఖ్ భాషలో పది నాసిక అచ్చులు ఉన్నాయి4. వీటిని సూచించడానికి /~/ అనే గుర్తును ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను క్రింది పట్టికలో చూడవచ్చు.
కూడుఖ్ భాషలోని నాసిక అచ్చులు
సంధ్యక్షరాలు:
వీటిని ఆంగ్లంలో 'diphthongs' అంటారు. ఒకే అక్షరంలో రెండు వేర్వేరు అచ్చు శబ్దాలు కలిసి ఉన్నప్పుడు సంధ్యక్షరాలు ఏర్పడుతాయి. ఇవి కూడుఖ్ భాషలో రెండు ఉన్నాయి5. అవి 1.(ai) అయ్ 2.(au) అవ్. బ్రాహుయి భాషలోకూడా రెండు సంధ్యక్షరాలు ఉన్నాయి. అవి 1.(ay) అయ్ 2.(aw) అవ్.
ఉదా :
క్ర.సం కూడుఖ్ ఆంగ్లం
- enghai my
- dau good
ఉదా :
క్ర.సం బ్రాహుయి ఆంగ్లం
- bai a grass
- Say Spectacle
ముగింపు:
మూల ద్రావిడంలోని అచ్చులను ఉత్తర ద్రావిడ భాష అచ్చులతో పోల్చి తులనాత్మకంగా
పరిశీలించిన తరువాత వాటి నిర్మాణంలో కొన్ని విశేషమైన మార్పులను గుర్తించడం జరిగింది.
అవి :
- మూలద్రావిడ భాషలో మొత్తం పది అచ్చులు ఉన్నాయి. ఇవి కూడుఖ్ భాషలో కూడా అలానే ఉన్నాయి. అయితే కూడుఖ్ భాష ముండాభాష కుటుంబంతో సన్నిహితంగా ఉండటం, దాని పరిసర ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న హిందీ, బెంగాలి భాషల ప్రభావంతో ఈ భాషలోకి పది నాసిక అచ్చులు, రెండు సంధ్యక్షరాలు కొత్తగా చేరాయి.
- మాల్తో భాషలో ఏవిధమైన మార్పులు లేవు. మూలద్రావిడ భాషలో ఉన్న అచ్చులనే ఉపయోగిస్తున్నారు. అయితే మాల్తో సాహిత్యరహిత భాష కాబట్టి లిపి లేదు. వీరు ఈ భాషను రాయడానికి హిందుస్తాని లిపిని ఉపయోగిస్తారు. మాల్తోలో ఉన్న పది అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఏ,ఓ అనే ఏనిమిది అచ్చులను హిందుస్తాని లిపిని, ఎ,ఒ అనే రెండు అచ్చులకు ఆంగ్లాక్షరాలను వాడుతారు.
- బ్రాహుయి భాషలో అనేక జాతులు కలసిపోవడం వల్ల వారి భాషమీద ఆ జాతి భాషలైన బలూచి, పర్షియన్, సింధి, పంజాబీ భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ భాషలో మూలద్రావిడంలో ఉన్న పది అచ్చులలో ఎనిమిది అచ్చులు మాత్రమే ఉన్నాయి. ప్రాస్వ ఎ,ఒ లు ఇందులో లేవు. వీటి స్థానంలో దీర్ఘ ‘ఏ’, ‘ఓ’ లని ఉపయోగిస్తారు.
పాదసూచికలు:
- ద్రావిడ భాషలు, పి.యస్ సుబ్రహ్మణ్యం, పుట – 97.
- ద్రావిడడభాషలు, పి.యస్ సుబ్రహ్మణ్యం, పుట – 48.
- ది ద్రవిడియన్ లాంగ్వేజెస్, బి స్టీవర్ శాన్ఫోర్డ్, పుట – 498.
- ది ద్రవిడియన్ ల్యాంగ్వేజెస్, భద్రిరాజు కృష్ణమూర్తి, పుట – 74.
- కూరుఖ్ గ్రామర్, ఫర్డినాండ్ హాన్, పుట – 2.
ఉపయుక్తగ్రంథసూచి:
తెలుగు:
- సుబ్రహ్మణ్యం పి.యస్, ద్రావిడభాషలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1977.
- సోమయాజి గంటిజోగి, ద్రావిడ భాషలు, ఆనంద ముద్రణాలయం, చెన్నపురి, 1931.
ఆంగ్లం:
- Krishnamurthi, Bhadriraju. The Dravidian Language. Cambridge University Press Newyork: 2003.
- Ferdinand Hahn, Kurukh Grammar. Calcutta Bengal Secretariat Press. 1911.
- Steever Sanford, The Dravidian Languages, Second edition New York, 2020.
- Ernest Droese Rev, An Introduction to the Maltho Language and the Maltho Vocabalary, Secundra orphanage Press, 1804.
- Andronov MS, The Brahui Language, Nauka Publishing House, Moscow, 1980.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.