headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

5. కథాసాహితి కథలు: స్త్రీ సమస్యల విశ్లేషణ

l_satyanarayana
లెంక సత్యనారాయణ

పరిశోధకులు, ఆంధ్రవిశ్వవిద్యాలయం,
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట - 506132, వరంగల్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9989732382. Email: lenkasatyanarayana@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఒకప్పుడు స్త్రీవిద్య నిషేధించబడినది. “పితారక్షితకౌమారే, భర్తరక్షిత యవ్వనే, పుత్రస్తూ స్థావిరేభావాత్, అపి న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అని ఆర్యోక్తి. స్త్రీ పుట్టినది మొదలుకొని, తాను గతించే వరకు అన్ని దశలలో పురుషుడుపై ఆధార పడవలసిందే అని అర్థం. అసలు స్త్రీకి స్వాతంత్ర్యం లేదని తేల్చిచెప్పారు. ఇది ఒకప్పటి సామాజికపరిస్థితి. ఇప్పటి స్త్రీ ఇంటా బయట రకరకాలుగా పరాభవాలు అవమానాలను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు స్త్రీవిద్య నిషేధించబడగా, నేడు ఎక్కడ చూసిన అత్యాచారాలు, యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, గృహహింస, భ్రూణహత్యలు, శిశుహత్యలు ఇలా పలురకాలుగా స్త్రీ పై హింసా ప్రవృత్తిసమాజంలో పెరిగిపోతున్నది.ఆధునికసమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు “కథాసాహితి” కథాసంకలనాలలో అధ్యయనం చేసి, ఒక అవగాహనను పెంపొందించుకొని ఈ పరిశోధకవ్యాసం రాస్తున్నాను. నా పరిశోధనకు సంబంధించిన సమాచారము అంతటినీ మేథోసంపత్తి కలిగిన, వైజ్ఞానిక ప్రతిభావంతులైన రచయితలు రాసిన గ్రంథాలను చదివి అందులో గల విషయాలను సూక్ష్మంగా క్రోడీకరించి ఈ వ్యాసంతో జోడిస్తున్నాను. “ఒక్క సిరా చుక్కలక్ష మెదళ్లకు మేత” అని మహాకవి కాళోజీ ప్రవచనం. నేటి సమాజాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత కవులు, కళాకారులపైన, కథా రచయితలపైన, సామాజిక పరిశోధకులుమీద, విజ్ఞానవేత్తలమీద కలదు. కథారచయితలు సామాజిక పరిశోధకులు అని చెప్పుకొన్నాం కాబట్టి వారు తమ కథలలో స్త్రీల సమస్యలకు తగు పరిష్కారమార్గాలను సూచించారు కాబట్టి వాటిని బహిర్గతం చేసి సమాజానికి అందించినట్లయితే సమాజంలో స్త్రీసమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయని ఆశిస్తున్నాను. స్త్రీశక్తి సమస్యల సుడిగుండం నుండి బయటపడి తను తాను పరిరక్షించుకోవాలన్నది ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యము.

Keywords:కథ, ఆధునిక సాహిత్యం, వాసిరెడ్డి నవీన్, స్త్రీలు, భారతీయసంస్కృతి, జీవనవిధానం, ఆధునికనాగరికత, అత్యాచారాలు, గృహహింస, పితృస్వామ్యసమాజం, పురుషాధిక్యత, స్త్రీవివక్ష, స్త్రీల స్వేచ్ఛ, మన్నం సింధుమాధురి, ఉమా నూతక్కి, కుప్పిలి పద్మ, విమల

1. ఉపోద్ఘాతం:

కథాసాహితి ‘కథ’ వార్షిక సంకలనాల ప్రచురణ సంస్థ. ఈ సంస్థ సాహితీ విలువలు కలిగిన, సామాజిక స్పృహతో కూడిన, సామాజిక బాధ్యతను నిర్వర్తించే కథలను ‘కథ’ అను పేరుతో ఒక పుస్తకంగా ప్రచురిస్తుంది.’కథాసాహితి’ వాసిరెడ్డి నవీన్ గారిచే 1990 లో స్థాపించబడినది. కథాసాహితి ప్రచురణసంస్థ ఏర్పడటానికి ప్రధాన కారకులు చేకూరి రామారావు, హరి పురుషోత్తమరావు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అనే ఒక సంస్థ కూడా కీలక భూమికను నిర్వహించింది. సాహితీపిపాస కలిగిన, ప్రజాసాహితి పత్రికా సంపాదకుడిగా పని చేసి కథా సాహిత్య అభివృద్ధికి కంకణబద్ధుడైన వాసిరెడ్డి నవీన్, సుప్రసిద్ధ కథారచయిత,కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, సాహిత్య కృషీవలుడైన పాపినేని శివశంకర్ కథాసాహితీ కథల వార్షిక సంకలనాలకు ప్రధాన సంపాదకులు. కథాసాహితి సంస్థ 1990 లో ప్రారంభమై ప్రతి సంవత్సరము కథ వార్షిక సంకలనాలను అవిచ్ఛిన్నంగా ప్రచురిస్తుంది. ఈ కథా సాహితీ వార్షిక సంకలనాల ముద్రణా సంస్థ ఇప్పటి వరకు 32 కథల సంకలనాలను ప్రచురించింది. కథారచయితల సంఖ్య 193. కథల సంఖ్య 440. నూతనమైన శైలి, శిల్పాలతో కథా వస్తువుకు సంబంధించిన కొత్తదనం, సమకాలీనమైన సమస్యలను, విస్తృత వర్గాల జీవిత చిత్రణను వాళ్ల యాస భాషలలో చెప్పడం ఈ కథా సాహితి కథల సంకలనాల ప్రత్యేకత. తెలుగు కథను వెయ్యేళ్లపాటు వర్ధిల్లినట్లు చేయడం కథాసాహితి వారి కథల సంకలనాల పరమలక్ష్యం - పరమార్థం.

కథాసాహితి కథల సంకలనాలలో స్త్రీల సమస్యలు వారి అస్తిత్వానికి చెందిన కొన్ని కథలు కలవు. ఈ కథల ద్వారా స్త్రీల సమస్యలను విశ్లేషించడం, స్త్రీలు తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికి గల కారణాలను క్రోడీకరించి చెప్పడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నేటి ఆధునిక కాలంలో స్త్రీలు ఎన్నోరకాల కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు వాటికీ పెక్కుకారణాలున్నవి. ఆధునిక సమాజం వేగవంతమైన మార్పులకు లోనుకావడం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం భారతీయ సమాజంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించడం, మనిషి జీవితం యాంత్రికం కావడం, ప్రసార సాధనాలు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు, పాశ్చాత్య సాంస్కృతిక వ్యామోహంలో కొట్టుకుపోయి భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం మొదలైన అనేక అంశాలు నేటి ఆధునిక సమాజంలో స్త్రీల అత్యాధునిక సమస్యలకు ప్రధాన హేతువులు. నేటి స్త్రీల సమస్యలు అత్యాధునిక సమస్యలు అని ఎందుకు పేర్కొనడం జరిగింది అంటే పూర్వసమాజంలో ఇటువంటి సమస్యలను స్త్రీలు ఎదుర్కోలేదు.

2. స్త్రీల సమస్యలు-విషయ పరిచయం:

నేటి భారతీయ సమాజంలో స్త్రీలకు గౌరవ ప్రధానమైన స్థానం కలదు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత” ఇది ఆర్యోక్తి. ఏ సమాజంలో స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో ఆ సమాజంలో లక్ష్మి నివసిస్తుందని అర్థం. లక్ష్మి సిరి సంపదలకు, సుభిక్షానికి ప్రతిరూపం. అంటే భారతీయ కుటుంబ జీవన విధానంలో మన సమాజం ప్రపంచ దేశాలలో శిఖరాగ్ర భాగాన నిలవడానికి స్త్రీలు, స్త్రీశక్తియే ప్రధాన కారణంగా చెప్పవచ్చును.

మన కర్మ భూమి లో స్త్రీ కి సముచిత స్థానం ఇప్పటికి దొరికింది. ఆస్థానం కొరకు ఆ స్త్రీ శక్తి అనేక పోరాటాలు చేసింది. ఆ విషయాన్ని ఇలా విశ్లేషించి చెప్పవచ్చును. “స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి ప్రతిరూపమే స్త్రీ. ఆకాశంలో సగం స్త్రీ. సమాజంలో సగం స్త్రీ. ఏ సమాజానికైనా మూలం స్త్రీనే. స్త్రీ లేని సమాజాన్ని ఊహించలేము” అని సమాజంలో స్త్రీల పాత్ర గురించి డాక్టర్ కె ఉమాదేవి గారు చెప్పారు. అసలు సమాజానికి మూలస్తంభం స్త్రీ. స్త్రీలు లేని సమాజం పునాదులు లేని భవనం వంటిది. సామాజిక అభివృద్ధిలో, సమాజంలో సగభాగం స్త్రీ. స్త్రీ లేని సమాజాన్ని మనం ఊహించలేము. స్త్రీ జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రాచీన కాలపు స్త్రీకి నేటి ఆధునిక మహిళకు అనేక భేదసాదృశ్యలు కలవు. పురాణకాలంలో స్త్రీని దేవతతో పోలుస్తూ ఆమెకు ఇవ్వాల్సిన స్వేచ్ఛను కాస్త పరోక్షంగాహరించాం. ఆనాటి సమాజం స్త్రీ ని ఒక పక్క దేవతగా పొగుడుతూ, మరొకపక్క ఆమెకు ఏ విధమైన హక్కులు లేవని తేల్చిచెప్పింది. మద్య యుగం స్త్రీ కూడా దుర్భర స్థితిని అనుభవించింది. నేటి ఆధునిక స్త్రీ అనేక పోరాటాలు చేసి ఆధునిక యుగంలో చివరకు తన లక్ష్యాన్ని సాధించి పురుషులతో సమానంగా పురుషునిచెంత నిలిచింది. ఆధునిక యుగంలో అన్ని రంగాలలో పురుషునితోపాటు ముందుంటుంది. ఆధునిక యుగంలో స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వారి జీవితము ప్రధానంగా రెండు కోణాలలో దర్శనమిస్తుంది ఒకటి స్త్రీల సమస్యలు. రెండు స్త్రీ చైతన్యము, అస్తిత్వ పరిరక్షణ.

3. కథా సాహితి కథల ద్వారా స్త్రీల సమస్యల నిరూపణ:

కథాసాహితి కథ సంకలనాలలో గల కొంతమంది రచయితలు స్త్రీల సమస్యలను విశ్లేషించి వారి సమస్యలకు తగు పరిష్కార మార్గాలను పరోక్షంగా సూచించిరి. మరి కొంతమంది రచయితలు స్త్రీలను చైతన్యపరిచి వారి అస్తిత్వ పరిరక్షణకు కారణభూతులైనారు. అటువంటి కథల విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.

3.1. కొట్రవ్వ:

ఈ కథా రచయిత్రి మన్నం సింధుమాధురి. ఈ కథ కథాసాహితి వారి కథల సంకలనం ‘కథ 2019’ లో ముద్రించబడినది. ఈ కథలో ప్రధాన పాత్ర కొట్రవ్వ. కొట్రవ్వ ఊరూరా గొర్రెల మందను తిప్పుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన కొట్రవ్వకు పద్దెనిమిదవ ఏట తండ్రి వివాహం చేస్తాడు. పెళ్లి చూపులకు వచ్చిన అత్త కొట్రవ్వ చేతులు, కాళ్ల పిక్కలు, కండలు వత్తి వత్తి చూసింది. మగడు, మరుదులు, మమ్మల్ని అందరిని తట్టుకొని కష్టం చేయాలంది. ఇది భవిష్యత్తులో కొట్రవ్వ కష్టాలకు సంకేతము. పెళ్లి తరువాత కొట్రవ్వ జీవితం అరిగిన బండి ఇరుసులా మారింది. కొంతకాలం తర్వాత కొట్రవ్వ భర్త పక్షవాతంతో మంచాన పడ్డాడు. తండ్రి ఇంటికి రమ్మని పిలిచిన కొట్రవ్వ భర్తను విడిచి వెళ్ళలేదు. పగలంతా గొర్రెలు, మొగుడుశాకిరి. రాత్రికి మరుదులనే తోడేళ్ల సమస్య. అంటే కొట్రవ్వ మరుదుల కామదాహానికి బలైపోతోంది. కొట్రవ్వకు గొర్రెల బాస తెలిసినట్లు మనుషుల బాస తెలియదు. గొర్రెలకు ఎప్పుడు ఆకలౌ తుందో కొట్రవ్వకు తెలుసు కానీ, ఆ ద్విపాద పశువుల ఆకలి ఎంతో తెలియడం లేదు. ఇక్కడ నోరు, జ్ఞానములేని జంతువుల కంటే మనిషి మృగారూపంలో మృగం కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడని అర్థము. చతుష్పాద పశువుల కంటే ద్విపాద జీవి అయిన మనిషి హీనుడని తెలుస్తుంది. అందుకే కొట్రవ్వకు చతుష్పాద పశువుల ఆకాలంతో తెలుస్తుంది కానీ, ద్విపాద పశువులు ఆకలి తెలియడం లేదు. “తోడేలు ఏ రాతిరిలో ఆకలి తో, మంద మీద పడుద్దో తెలుసు. అది ఆకలి కోసం ఒక పిల్లనే తింటుంది. కానీ అంతులేని ఆకలికి నేను ఇస్తరిలా మారిపోయా.”1 అని కొట్రవ్వ దు:ఖించింది.

అసహాయురాలైన ఒక స్త్రీపై జరుగుతున్న సామూహిక అత్యాచారానికి ఇది ఒక ప్రతీక. తోడేలు ఆకలితో ఒక పిల్లనే తింటుంది. కానీ ఇక్కడ కొట్రవ్వ మరుదుల ఆకలికి అంటే కామ దాహానికి అంతులేదు. కోడలిపై కొడుకులు అత్యాచారం చేస్తున్న ఆ కొడుకుల కన్నతల్లి పట్టించుకోవడం లేదు. దానికి కారణం పితృస్వామ్య సమాజ భావజాలం.

అత్యాచారం అనేది అత్యంత హేయమైన పితృస్వామిక వ్యక్తీకరణ. మహిళల మనసు, శరీరాలను గాయపరిచే పితృస్వామిక దాడి. మహిళలను అవయవాల కుప్పగా తప్ప మనసు, ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలతో వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నసంపూర్ణ మనిషిగా పితృస్వామ్యం గుర్తించదు. ఆమె ఇష్టాయిష్టాలను, అభి ప్రాయాలను పట్టించుకోవాలని, గౌరవించాలని అర్ధం చేసుకోదు. పురుషుల సౌఖ్యం కోసమే మహిళ పుట్టిందని బోధిస్తుంది. మహిళను పవిత్రతను చేయడం ద్వారా వేళ్ళూనుకొన్న పితృస్వామ్యం, పురుషులకు ఎటువంటి నైతిక విలువలను బోధించదు. పైగా పురుషత్వం పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రబోధిస్తుంది. ఇట్లా అత్యాచారానికి మూలాలు పితృస్వామ్య సమాజంలో ఉన్నవి.2

ఇందులో ప్రస్తావించబడ్డ సంపూర్ణమైన విశ్లేషణ ద్వారా పురుషుడు స్త్రీల మనోభావాలను గుర్తించడం లేదని, స్త్రీని పురుషుడు ఒక అవయవాల కుప్పగా మాత్రమే చూస్తున్నాడని, ఆమె శరీరాన్ని ఆస్వాదించడానికి ఆరాటపడుతూ, ఆ శరీరం వెనుక దాగి ఉన్న ఆమె మనసును, ఇష్టాయిష్టాలను గుర్తించడం లేదని, మహిళ పురుషుని సౌఖ్యం కోసమే పుట్టిందని పురుషుడు భావించడం జరిగింది. స్త్రీలకు పవిత్రత పేరుతో నిబంధనలను, ఆంక్షలను విధించడంము పితృస్వామిక భావజాలాలు. దేశంలో స్త్రీలపై జరిగే అనేక అత్యాచారాలకు ఈ భావజాలమే ప్రధాన కారణాలు. చివరకు కొట్ర కంటే 10 సంవత్సరాల చిన్న వయసు కలిగిన మరిది కొట్రవ్వను అనుభవిస్తూ “నీ మొగుడు లెగిసొత్తాడా?రానియ్యి? ఆడు లెగిసేది లేదు? నీతో సంసారం చేసేది లేదు?”3 అని కొట్రవ్వ పై పడి కామవాంఛను తీర్చుకొంటాడు. ఈ మాటలు అత్యంత హేయమైనవి. చివరకు కొట్రవ్వ తను అనుభవించిన మానవ మృగాలను చంద్రవంక కత్తితో వేటాడి, గాయపరిచింది. ఒక స్త్రీపై కుటుంబ సభ్యులు జరిపిన సామూహిక అత్యాచారానికి ఇది ఒక సంకేతం. నేటి ఆధునికకాలంలో, ఆధునికసమాజంలో స్త్రీలపై ఇటువంటి సామూహిక అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నవి.

3.2. మిట్ట మధ్యాహ్నపు నీడ:

ఈ కథా రచయిత్రి ఉమా నూతక్కి. ఈ కథ కథాసాహితి కథల సంకలనం కథ 2019 లో ముద్రించబడినది. కథారచయిత్రి స్త్రీల వర్తమాన సమస్యల్లో ఒకటైన స్త్రీల అత్యాచారం అనే విషయాన్ని ఈ కథలో ప్రస్తావించారు. ఈ కథ ముఖ్యంగా యుక్తవయస్సు లేని బాలికలపై జరిగే అత్యాచార ఉదంతానికి ప్రతిక. సమాజంలో ముక్కుపచ్చలారని అమాయకులైన బాలికలపై ఇటువంటి అత్యాచార సంఘటనలు ఎన్నో జరుగుతున్నవి. ప్రపంచం మొత్తం మీద జరిగిన అత్యాచార కేసుల్లో 2. 8% మాత్రమే వెలుగులోకి వస్తున్నాయన్నది ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం. మురికి వాడల్లో, గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో బాలికలపై అత్యాచారాలు జరిగినా ఎన్నో సంఘటనలు ప్రపంచానికి తెలియకుండా మరుగునపడిపోతున్నవి.

కథ విషయం పరిశీలించగా మిథున భర్త అర్జున్. మిథునకు అర్జున్ తో వివాహమైనప్పటికీ ఆమె మానసికంగా భర్తకు దగ్గర కాలేకపోతుంది. దానికి కారణం మిథున తన మేనమామ ఇంట్లో చదువు కొరకు ఉన్నప్పుడు ఎనిమిదవ తరగతి చదువుకునే రోజుల్లో జరిగిన ఘోరమైన అత్యాచార సంఘటన. అది మిథున పై ఆమె మేనమామ భుజంగరావు చేసిన అత్యాచారం. ఒక రోజు మధ్యాహ్నం డ్రిల్ పిరియడ్‌లో స్కిప్పింగ్ రోప్ మర్చిపోయి ఇంటికి వచ్చి మిథున అల్మరాలో స్కిప్పింగ్ రోప్ వెతుకుతుండగా “వెనకగా ఏదో కదిలినట్టు నీడ. మెడ మీద నుంచి చేతులు కిందికి సాచి చుట్టేసింది. నీడ కంటే చిక్క నైన ఆ చీకటి. దడుచుకుని కేక వేయబోయిన నానోరు మోసేసా డతడు. గింజుకుంటూనేఉన్నా, వదలట్లేదు, వెనక నుంచి ఇంకా బలంగా ఒత్తుకుంటూ. కాళ్లతో నేలని తంతూ విరగబడుతున్నా, రక్కుతున్నా. . . . , ఏడుస్తున్నా. . . వెనక స్కర్ట్ కి ఏదోగట్టిగా తగులుతుంది, తడిగా జిగటగాతాకుతుంది తాకుతుంది. స్కర్ట్ వెనకంతా ఇంత వెడల్పున తెల్లటి జిగురు డాఁగు. చీదరేస్తుంది, రోత పుడుతుంది. . . స్కర్ట్ వెనుక అంటుకున్న మైల. . మాలిన్య. . స్కలన. . వీర్య పాతాలన్ని పొంగి. . పోటెత్తి జుగుప్సా ప్రవాహాల వైతరణై నా లక్క పిడతల్ని. . నా గుజ్జన గూళ్ళని. . నా ఆశల్ని. . ఆ ఆకాశాల్నీ మొత్తంగా ముంచెత్తింది”4

మిథున లోకజ్ఞానం తెలియని పసిపిల్ల. మిథున మేనమామ భుజంగరావు మిట్ట మధ్యాహ్నపు నీడై ఆమె ఆశల్నీ, ఆశయాల్ని, ఆమె బాల్యాన్ని కర్కశమైన తన చేతులతో చిదిమేశాడు. కూతురు వయస్సు కలిగిన మిథున పై మేనమామ అత్యాచారం చేశాడు. ఆ రోతను మిథున సహించలేక, భరించలేక ఎవరికి చెప్పుకోలేక గుండె గాయమై ఎంతో మనో వేదనను అనుభవించింది. మిథునను కాటేసిన కట్ల పాము ఇంట్లో దర్జాగా తిరుగుతోంది. మిథున నాయనమ్మ సరోజనమ్మ విషయం తెలుసుకొని భుజంగరావును మందలిస్తుంది. సుకుమారమైన, కృషిచుకుపోయిన ఆ పసి హృదయానికి భర్త అర్జున్ చేత చికిత్స చేయిస్తుంది.

అర్జున్ నాయనమ్మతో “సమస్య ఏమిటో తెలిసింది కాబట్టి పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం ఉంది నాకు. కాకపోతే చటుక్కునపోయే సమస్య కాదు. లేత మనసుకి తగిలిన గాయం ఇంకా ఎంత పచ్చిగా ఉందో మిథున కళ్లని చూస్తే తెలుస్తూనే ఉంది. ఎప్పటిదాకా ఈ గాయం లోతు తెలీదు నాకు. ఇక ఈ గాయాన్ని మాన్పించి, మిథున మనసు మీదఅలుపెరుగని నవ్వు పూయించే బాధ్యత నాది. మరింత ప్రేమ చూపించాలి నేను. తను గెలవగలదు అన్న భరోసానిచ్చే ప్రేమ”5 అని చెప్పాడు. పసి హృదయం అత్యాచారానికి గురైనప్పుడు ఆ సంఘటన పదిమందికి తెలిస్తే ఆ హృదయం ఇంకా ఎంతో మనోవేదనకు లోనవుతుంది. సాంఘిక భయాలు ఆమెను వెంటాడి, వేటాడుతుంటాయి. అలాగని తప్పుచేసిన వారిని శిక్షించకుండా వదలడం ధర్మం కాదు. ముఖ్యంగా సమస్యను గుర్తించి, మిథున లాంటి పసిహృదయానికిది తగినంత ప్రేమనందించచాలి. తను సమాజంలో గెలవగలదన్నభరోసానిచ్చే ప్రేమను పంచడమే ఆమె పసిహృదయానికి చేయదగ్గ చికిత్స. మిథునలాంటి బాలికలపై జరిగే అత్యాచారాల గురించి నిర్భయ చట్టం సంక్షిప్త పరిచయంలో ఎం. వి. శాస్త్రి గారు ఇలా విశ్లేషించిరి.

ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీత లోకంలో లైంగిక హింసా ప్రవృత్తి వికృతి రూపం ధరించి, రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యంత కిరాతకమైన రీతిలో మానభంగాలు, సామూహిక అత్యాచారాలు, ముక్కుపచ్చలారని పసి పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్నబాధితులలో మూడో వంతు మంది బాలికలే. 4, 5 ఏళ్ల వయసున్నచిన్నారులపై కూడా హింసా ప్రవృత్తితో అత్యాచారాలు చేస్తూ వారి జీవితాలతో కామోన్మాదులు చలగాటం ఆడుతున్నారు. భారతదేశంలో మహిళలకే కాదు చిన్నారులకు కూడా రక్షణ కరువైందనేది స్పష్టంగా అర్థమవుతోంది. గడిచిన పదేళ్లలో బాలికల మీద అత్యాచారాల్లో పెరుగుదల336 శాతంగా ఉంది. ఇందులో 90% మంది 12 ఏళ్లలోపు బాలికల మీద వారి కుటుంబానికి చెందిన బంధు మిత్రులే అత్యాచారానికి పాల్పడ్డారు6

ఈ విశ్లేషణలో మహిళలపై అత్యంత కిరాతకమైన రీతిలో అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయని ముఖ్యంగ 12ఏళ్లలోపు బాలికలపై వారి కుటుంబానికి చెందిన బంధుమిత్రులే అఘాయిత్యానికి పాల్పడుతున్నారనేది గమనించ దగ్గ ఒక ముఖ్యాంశము. సామాజిక భయాల వలన ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగు చూడటం లేదు. పసిహృదయాలను అత్యాచారాలనుండి కాపాడి రక్షించవలసిన బాధ్యత నేటి సమాజంపై ఎంతైనా కలదు.

3.3. ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్:

ఈ కథారచయిత్రి కుప్పిలి పద్మ. ఈ కథ కథాసాహితి కథల సంకలనం కథ 2013 లోప్రచురించబడినది. ఈ కథలో కథారచయిత్రి పనిచేసే చోట పురుషుడైన ఒక ఉన్నత ఉద్యోగి తన క్రింది స్థాయిలో పనిచేసే మహిళా ఉద్యోగిని వేధించడం అనే అంశం ను స్వీకరించి ఈ కథగా మలిచారు. ఒక విధంగా ఈ కథ స్త్రీల లైంగిక వేధింపులు, లింగవివక్షకు చెందుతుంది. వర్కప్లేస్ లో గల మానవసంబంధాలు రకరకాల క్యాలిక్యులేషన్స్ తో నిండి ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ నుండి వ్యక్తిగత జీవితాలను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఒక్కోసారి వర్క్ ప్లే స్లో గల రిలేషన్స్ వ్యక్తిగత జీవితాన్ని డామినేట్ చేసినప్పుడు, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోలేక పట్టు కోల్పోతాం. ఆ పట్టును కోల్పోయేటప్పుడు ఒక స్త్రీ పొందే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందోఈ కథన మనకు చెబుతోంది.

ఈ కథలో ప్రధానపాత్ర దర్శన. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. దర్శన విహాన్ ను ప్రేమిస్తుంది. విహన్ విదేశాలలో సినిమా దర్శకుడిగా పని చేస్తాడు. వారాంతపు సెలవులలో తన టీమ్ లీడర్ వలన కలిగే మానసిక వేధింపులను తొలగించుకోవడానికి, ప్రశాంతంగా ఆ రెండు రోజులు గడపడానికి విదేశాలకు వెళ్తుంది. వినీత, రాధికా దర్శన కొలీగ్స్. బాస్‌ను వర్క్ తో సాటిస్ఫై చెయ్యలేవని ఒకసారి బాస్తో లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొస్తే నీ సమస్య తొలగిపోతుందని సలహా ఇస్తారు. విహాన్ ను చూస్తే తన శరీరం మల్లెపూవులా పరిమళం వెదజల్లుతుంది. వేరే వాళ్లతో కలిసి వెళ్లడం దర్శనకు ఇష్టం లేదు. ఆఫీస్ లో పనిచేసే చోట ఒక స్త్రీని పురుషుడు వేధించడం లైంగికవేధింపులకు దారితీస్తుంది. అది లింగ వివక్షత కూడా అవుతుంది. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులను నిరోధిస్తూ కఠిన చర్యలు తీసుకోవడానికి సుప్రీం కోర్ట్ 1997లో కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, హింసకు వ్యతిరేకంగా 2012 లో చాలా తీవ్రమైన స్పందన, విస్తృత స్థాయిలో వ్యతిరేకతలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల(నిరోధం, నిషేధం, పరిహారం) చట్టంకు 2013లో రూపకల్పన జరిగింది. ఈ చట్టం మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి తోడ్పడుతుంది. రాజ్యాంగంలో అధికరణలు 14, 15, 21 అనుసరించి చట్టం ముందు అందరూ సమానులే. ఎవరినీ వారి లింగ, మత, వర్ణ, కుల, ప్రాంత బేధాలతో సంబంధం లేకుండా సమానంగా చూడాలి. వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలి. ఈ మూల సూత్రాలు లైంగికవేధింపులకు విరుద్ధం. కాబట్టి పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 అత్యావశ్యకమైనది.

దర్శన బాస్ వత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఆఫీస్ లో కౌన్సిలర్ ఉజ్వల ను సంప్రదించింది. ఉజ్వల ఇటువంటి సన్నివేశాలు పాలిటిక్స్ ప్రతి చోట ఉన్నాయని చెబుతోంది. పర్సనల్ లైఫ్ దీనికి అతీతం కాదని సలహా ఇస్తుంది. “కొన్ని సిట్యుయేషన్స్‌లోయేవి వేటికి అతీతం కాదు. అందులో మీది బ్రేక్ కే బాద్ జనరేషన్. యిమోషనల్ డిసిప్లిన్ కాస్త తక్కువే. కెరీర్, యిమేజ్ డామినేట్ చేస్తున్నాయ్. దేనినైనా నిమిషాలపై వదులుకొనేటట్టు మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేసే పరికరాలు చుట్టూ ఉన్నాయి. ఇది ఎక్కువగా సిటీస్ లో కనిపిస్తుంది ఇంకా కాస్మోపాలిటన్ సిటీస్ లో అయితే మరీ ఎక్కువగా ఉంది7 అని ఉజ్వల పలికిన మాటలు నేటి యువతను బాగా ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే నేటి యువతలో ఎమోషనల్ డిసిప్లిన్ చాలా తక్కువ. దేనినైనా తేలికగా వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేటి యువత మానసికంగా ధృడంగా లేదు. సహనము లోపించింది. కౌన్సిలర్ చెప్పిన అంశాలతో దర్శన తన ఇమేజ్ ఎక్కువ డ్యామేజ్ చేసుకోకుండా బాస్ తో స్మూత్ నెస్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ప్రవాహానికి ఎదురీదడం అశాంతిని మిగులుస్తుంది.

3.4. వాళ్ళు ముగ్గురేన:

ఈ కథారచయిత్రి విమల. ఈ కథ కథాసాహితీ కథల సంకలనం కథ 2014 లో ముద్రించబడింది. ఈ కథలో కథారచయిత్రి విమల స్త్రీలస్వేచ్ఛకు చెందిన అంశాన్ని చక్కగా చెప్పారు. సమాజంలో సగభాగమైన స్త్రీకి స్వేచ్ఛ అవసరమే. కానీ ఆ స్వేచ్ఛను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాని ఫలితమును ఆ స్త్రీ అనుభవించవలసి వస్తుంది. భారతీయ సమాజం అనేక ఆచార నియమాలు, కట్టుబాట్లతో కూడుకుంది. స్త్రీ తన స్వేచ్ఛను అనుభవించవలసినప్పుడు ఆ సంకెళ్లను ఛేదించవలసి వస్తుంది. అందుకు ఎంతో మనో ధైర్యమూ, సాహసమూ కావాలి.

ఈ కథలో ప్రధానపాత్రలు మూడు. ఒకటి యాదమ్మ, రెండు చిత్రకళ, మూడు సరస. వీరు ముగ్గురూ స్వేచ్ఛను తమ జీవితంలోనికి ఆహ్వానించిన వారే. వారి నేపథ్యము, పరిస్థితుల ప్రభావం భిన్నంగా కనిపిస్తున్నవి. వీరు ముగ్గురూ తాము ఎంచుకున్న స్త్రీ స్వేచ్ఛా మార్గంలో ప్రయాణించినప్పుడు విభిన్న ఫలితాలను పొందుతారు.

యాదమ్మది ఈ మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట దగ్గర ఒక పల్లెటూరు. యాదమ్మకు పేదరికం ఎంతో జీవితానుభవాన్నిచ్చింది. భవననిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తన భర్త మరణించినప్పుడు చింతించింది కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. పల్లెటూరుకి చేరుకుని తిరిగి బ్రతుకు తెరువు కొరకు పట్టణానికి వచ్చి తన జీవితంలోకి స్వేచ్ఛను ఆహ్వానించింది. మొదట బస్తీకి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ తో స్నేహం కుదిరింది. తాను కోరుకున్న స్వేచ్ఛ ఫలితంగా గర్భస్రావమై తల్లిదండ్రుల నిందలను భరించింది. జీవనాధారం కొరకు ఒక ఇల్లు కావాలని వెళ్లి గల్లీ లీడర్ నరసింహుని కలిసింది. ఈ పరిచయం చాలా కాలం నడిచింది. అతన్ని పెళ్లి చేసుకోమని అడగలేదు. దానికి కారణం తన ఆత్మాభిమానం.

నా తిండి నేను సంపాదించుకుంట. నా పోరన్ని నా రెక్కల కష్టం మీద సాదుకుంట. నా ఇంట్ల నేను బాజాప్త పంట. పని బందు పెట్టి రేపటి కెళ్ళి కుక్క తీర్గ నువ్వెన్నడు బొచ్చల కూడేస్తవో అన్నట్లు ఎదురు సూడాల్నా? నువ్వు జూ జూ అని బుదగరిస్తే, తోకూపు కుంటనీ దగ్గరకు రావాలే... నీకు కోపమొచ్చి నీ ఎడ్మ కాలితో లాసిగ ఒకలాత్ తన్నితే ఏడ్చుకుంటూ బో వాల్నా? ఎవరి మీద ఆధారపడి బత్కదీ యాదమ్మ”.8

ఈ మాటలలో ఒక స్త్రీగా యాదమ్మ మనసు సంపూర్ణంగా ఆవిష్కృతమైనది. యాదమ్మ స్వేచ్ఛను కోరుకుంది, ఆ స్వేచ్ఛను అనుభవించింది. పెళ్లి చేసుకుంటానని జాలి చూపిన నరసింహుని తిరస్కరించింది. స్వేచ్ఛను కోరుకున్న ఒక స్త్రీగా తన కొడుకు బాధ్యతను తాను నిర్వర్తించ దలుచుకున్నది. జీవితంలో తన రెక్కల కష్టాన్ని నమ్ముకో దలుచుకున్నది. ఎవరిపైనా ఆధారపడడమూ, ఒక స్త్రీగా తనపై ఎవరూ జాలి చూపించి తనను ఆదుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆర్థికంగా తనను తాను నిలబెట్టుకోవడానికి మసాజ్ సెంటర్లో నెల జీతానికి ఉద్యోగం చేస్తుంది. స్వేచ్ఛ అనే పులియాదమ్మను మింగేందుకు వాడిన సాధనాలను యాదమ్మ ఒక్క తాపు తన్నింది. 

ఈ కథలో స్త్రీ స్వేచ్ఛను కోరుకునే రెండవ పాత్ర చిత్రకళ. చిత్రకళ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లి అమెరికా కలను నిరాశపరిచి బీకాం డిగ్రీ తో హైదరాబాదు చేరి నెల జీతానికి అకౌంటెంట్ గా పని చేస్తుంది. మధ్యతరగతికి చెందిన తాను ఆకాశ శిఖరాన గల ఉన్నతతరగతిని చేరాలని స్వేచ్ఛను కోరుకుంది.

“జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి మనకున్న అందం, శరీరం సాధనమైతే అందుకు చింతించాల్సిన అవసరం లేదని”9

తన స్నేహితురాలు సునీత పలికిన మాటలు చిత్రకళ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. సంపాదకు, విలాసానికి శరీరాన్ని స్వేచ్ఛను సాధనంగా ఎంచుకుంది. ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోక తప్పదు అనే సత్యాన్ని గ్రహించింది. శరీరానిదేముంది కొద్ది నిమిషాలు తనది కాదనుకుంటే సరి అనుకున్నది. లెక్కలేనితనంతో గడిపే అమ్మాయిల జాబితాలో చిత్రకళ చేరింది. మద్యం త్రాగడం, సిగరెట్ కాల్చడం లాంటి పాశ్చాత్య అలవాట్లను అలవర్చుకుంది. ముప్పైఏడేళ్ల తన అందాన్ని కాపాడుకోవడానికి యాదమ్మ చేత మసాజ్ చేయించుకున్నది. చివరకు చిత్రకళ స్త్రీ స్వేచ్ఛా ఫలితాన్ని రుచి చూసి, ఆ స్త్రీ స్వేచ్ఛ అనే పులి తనను మింగబోయినప్పుడు అలసిపోయినతాను తప్పించుకుంది. 

“ఆట ఆడాలనుకున్నప్పుడు ఆటకు సంబంధించిన సూత్రాలు మొదట నీకు తెలిసి ఉండాలి. దెబ్బకొట్టడం, దెబ్బ కాచుకోవడమే కాదు, దెబ్బతగిలితే తట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎవర్ని నమ్మకు. నమ్మినట్లు కనిపించు చాలు. దేనిలోనైనా నీకు నష్టం జరుగుతోందని అనిపించినప్పుడు తక్కువ నష్టంతో వెనక్కి రావడం ఎలాగో తెలుసుకో”10

తనతో స్నేహితురాలు వినీత రాథోడ్ చెప్పిన మాటలు చిత్రకళ లో పరివర్తనకు కారణమైనవి. ఇక్కడ వినీత రాథోడ్ పలికిన మాటలు వాస్తవమైనవి. ఎందుకంటే ఒక స్త్రీ స్వేచ్ఛను అనుభవించ తలచుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్నీ విషయాలను పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే దెబ్బలను భరించాలి లేదా దెబ్బ అయినా కొట్టాలి. నష్టం జరుగుతుందన్నప్పుడు తక్కువ నష్టంతో వెనక్కి రావడం వివేకుల లక్షణం. ఇదే తెలివితో చిత్రకళ తాను కోరుకున్న స్త్రీ స్వేచ్ఛ నుండి కొద్ది నష్టంతో వెనుదిరిగింది.

ఈ కథలో స్త్రీ స్వేచ్చను కోరుకునే మూడవ పాత్ర సరస. సరసది చాలా పేదకుటుంబం. బ్రతుకుతెరువు కొరకు తండ్రితో పాటు మద్రాసునుండి వలస వచ్చింది. మొదట బస్తీలోగల యాదమ్మకు ఒక ప్రత్యేకతతో కనిపించేది. కానీ సరస ఒక యువకుడిని నమ్మి మోసపోయింది. నిరాశ్రయులై యాదమ్మ ఆశ్రయాన్ని పొందింది. యాదమ్మ ఒక తాపీ మేస్త్రీ దగ్గర పనికి కుదర్చగా సరస స్వేచ్ఛను కోరుకొని ఆ మేస్త్రి చేత మోసపోయింది. అలా రెండవసారి స్వేచ్ఛను తన జీవితంలోనికి ఆహ్వానించి నష్టపోయింది.

ఈ కథలో స్వేచ్ఛను కోరుకున్న స్త్రీలలో యాదమ్మ పులిపై చేసిన స్వారిలో విజయాన్ని సాధించింది. చిత్రకళ పులిపై స్వారీ చేసి ఆ పులి మింగడానికి ప్రయత్నించినప్పుడు తెలివితో పోరాడి తప్పించుకుంది. సరస పులిపై స్వారీ చేసి ఆ పులిచేత మింగబడింది. ఇక్కడ స్త్రీస్వేచ్ఛ పులిపై స్వారీతో సమానం. 

4. ముగింపు:

నేటి ఆధునిక యుగంలో, ఆధునిక సమాజంలో స్త్రీ బహుముఖ పాత్రను పోషించి అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక వైపు వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రకటనలు పేరుతో అడుగడుగున స్త్రీల శరీరాలను, అనువనువున ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా యువతరం ఇంటర్నెట్ మొదలైన ప్రసార సాధనాల వైపు అశ్లీ లత కొరకు పరుగులు పెడుతున్నారు. చివరకుడ్ రాపిడికి ఏదైతేనేం అనే భావన ఇంటలెక్చువల్స్ లోకి కూడా వ్యాప్తి చెందింది. పసిపాప నుండి పండు ముసలి వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుంది. వీటన్నింటికీ పరిష్కార మార్గం ఒక్కటే. పిల్లలకు హైస్కూలు స్థాయి నుండి నైతిక విలువలను నేర్పించాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువల విషయం ఒక పాఠ్యాంశంగా పిల్లలకు హైస్కూలు స్థాయి నుండి ఈ బోధించబడాలి. అప్పుడు పిల్లల మనసు పరివర్తన చెంది స్త్రీలపై జరిగే అత్యాచారాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా సమాజంలో కుటుంబవ్యవస్థలో కూడా మార్పు రావాలి. పురుషాధిక్యత, పురుషాహంకారం, పితృస్వామ్య భావజాలం తొలగిపోవాలి. ఇదే క్రమంలో మరొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. స్త్రీ తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకునే క్రమంలో స్వేచ్ఛను కోరుకుంటుంది. కానీ భారతీయ సమాజం అనేక ఆంక్షలతో కూడినది. స్త్రీ స్వేచ్ఛ పేరుతో వింత పోకడలను పోకూడదు. ఆ స్వేచ్ఛ మన సంస్కృతి సంప్రదాయాలకు, సామాజిక విలువలకు లోబడి ఉండాలని నా అభిప్రాయం. 

5. పాదసూచికలు:

  1. మన్నం సింధుమాధురి,కొట్రవ్వ,కథ 2019,పుట 30.
  2. అత్యాచారాలకు మూలాలు,మహిళా మార్గం ప్రచురణ,పుట 48.
  3. మన్నం సింధుమాధురి. కొట్రవ్వ కథ, 2019. పుట 31.
  4. ఉమా నూతక్కి. మిట్ట మధ్యాహ్నపు నీడ. కథ, 2019, పుట 241.
  5. ఉమా నూతక్కి. మిట్ట మధ్యాహ్నపు నీడ. కథ, 2019. పుట 245.
  6. ఎం. వి. శాస్త్రి. నిర్భయ చట్టం పరిచయం. పుట 5. 
  7. కుప్పిలి పద్మ. ద లాస్ అఫ్ ఇన్నోసెన్స్. కథ2013, పుట 172.
  8. విమల,వాళ్ళు ముగ్గురేనా? కథ, 2014. పుట 184.
  9. విమల. వాళ్ళు ముగ్గురేనా? కథ, 2014,పుట 181.
  10. విమల. వాళ్ళు ముగ్గురేనా? కథ, 2014, పుట 185.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆనంద లక్ష్మి. సి, తెలుగు నవలలో కుటుంబ జీవనం, నవజ్యోతి పబ్లికేషన్స్ విజయవాడ 1979.
  2. ఓల్గా, చలం- నేను, స్వేచ్ఛా ప్రచురణలు, హైదరాబాద్, 2019.
  3. ఓల్గా, సంకలిత, స్వేచ్ఛా ప్రచురణలు, హైదరాబాద్, జూన్ 2013.
  4. కాత్యాయని విద్మహే, ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక, స్త్రీ జనాభ్యుదయ సంస్థ, వరంగల్.
  5. కుసుమకుమారి. పీ సాహిత్యం జెండర్ స్పృహ, సీఎస్ ప్రింటర్స్ ప్రకాశం రోడ్డు, తిరుపతి, మే 2005.
  6. తమిళ సెల్వన్, తెలుగు ఏ. జీ యతిరాజు, స్త్రీత్వం ఓ ఊహ ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్, జూన్ 2013.
  7. మల్లీశ్వరి, కె. ఎన్., (సంపా.) సాహిత్య సాన్నిహిత్య వోల్గా, ఓల్గా మిత్రులు, జూగాస్ విల నవంబర్ 2019 హైదరాబాద్.
  8. మూర్తి, డీ. బీ. ఎన్. ఆర్. సి. హెచ్., సమాజ పరిణామంలో స్త్రీ, ప్రజాశక్తి బుక్ హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్, మార్చ్ 2007.
  9. రంగనాథాచార్యులు, కె. కె., ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు, ఆంధ్ర సారస్వత పరిషత్, తిలక్‌రోడ్డు, హైదరాబాద్.
  10. సత్యనారాయణ, ఎస్‌వీ, (సంపా.) స్త్రీవాదాలు వివాదాలు, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ మే 1997.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]