headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-2 | February 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. అమృతాంజనశతకం: అభివ్యక్తివైచిత్రి

కరి యామినీకృష్ణ

పరిశోధకురాలు, సంగీత & లలిత కళల విభాగం
శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, తిరుపతి
సంగీత బోధకురాలు, ఆర్జీయూకేటీ శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9182860821, Email: kariyaaminikrishna@gmail.com
Download PDF


Keywords: నారాయణాచార్యులు, అమృతాంజనశతకం, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్రపత్రిక, ఆంధ్రగ్రంథమాల, శతకం.

1. ఉపోద్ఘాతం:

అమృతాంజనంబను నౌషధరత్నంబు, వాతశీతాదిక భంజనమ్ము... అతులమై యిల విలసిల్లు నంజనంబు” (రామానుజయ్య, బుక్కపట్టణము, ఆంధ్రప్రత్రిక ప్రమోదూత ఉగాది సంచిక, ప్రకటన పుట) అంటూ వేనోళ్ళ కొనియాడబడిన వందలేళ్ళ నాటి ఔషధరాజం అమృతాంజనం.

“వెంకట సుబ్బారావు, అనగా రెంటాల వెంకట సుబ్బారావు …. వీరు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారికి మేనమామ. అమృతాంజనవిద్య వారికి నేర్పినది వీరే అభిజ్ఞలోకము వాకొంటుంది.” అని (కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం గురజాడ అప్పారావు- కన్యాశుల్కము వ్యాసం పుట. 187.) నిడదవోలు వెంకటరావు అన్నారు.

“అమృతాంజనం (ఆంగ్లం: Amrutanjan) అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది. అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు. ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది.  అమృతాంజన్ లిమిటెడ్ గా 1936లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది. ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.” (తెలుగు విజీపీడీయా 01.01.2023)

Responsive image

(చిత్రము: ఆంధ్రపత్రిక, సంపుటం 20 ప్రమోదూత సంవత్సరాది సంచిక. పుట. 48 ప్రకటనల్లో).

2. శతకకర్త పరిచయం:

కవితా వతంస, గానకళా నిపుణ, హరికథా చతురనాన శ్రీమన్ కరినారాయణాచార్య భాగవతార్ రామతీర్థ క్షేత్రం, విజయనగరం జిల్లా నివాసి.శ్రీరామతీర్థం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రామతీర్థ క్షేత్రం. చాలా మంది గొప్ప సంస్కృత కవులు మరియు పండితులు మరియు గొప్ప కర్ణాటక సంగీతకారులు ఈ ప్రదేశం నుండి వచ్చారు.

శ్రీమాన్ కరి నారాయణాచార్య భాగవతార్ "కరి" వంశానికి ఒక కిరీటం. వీరు విజయనగరం జిల్లాలోని రామతీర్థ క్షేత్రంలో “గాన పండిత్”గా తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా పదవీ విరమణ తరవాత కూడా సింహాచల దేవస్థానంచే “ఆస్థాన విద్వాన్” గా నియమింపబడి తన గాత్రం తో రచనల తో ఎంతో సంగీత సేవ చేసారు . వీరు ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశంలోని అన్ని ఇతర ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు, హరికథా కాలక్షేపం కూడా చేయటం లో సుప్రసిధ్దులు. 1963లో విజయనగరం వాణి  ప్రస్ ద్వారా ఆయన కుమారుడు శ్రీ కన్నసామి ప్రచురించిన “శ్రీమాన్ కరి నారాయణాచార్య భాగవతార్ షష్ట్యబ్ది పూర్తి సంచిక” అనే పత్రికలో  శ్రీ ధనకుధరం వరదాచార్యులు రాసిన వ్యాసంలో ఆయనను “ఆంధ్రరత్న” అని సంబోధించారు.

శ్రీమాన్ కరి నారాయణాచార్య భాగవతార్ 1903 జనవరి 23వ తేదీన ఏకాదశి తిథి నాడు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా లోని బొబ్బిలి సమీపంలోని రాజయ్యపేటలో జన్మించారు. వీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కందాళ వెంకటేశ్వర్లు, శ్రీమతి కందాళ లక్ష్మీ నరసమ్మ. శ్రీ కరి నారాయణాచార్యుల పూర్వీకులు బొబ్బిలి రాజు వంశానికి ఆధ్యాత్మిక గురువులు. వీరు సంస్కృత, తెలుగు సాహిత్యాలు, సంగీతములలో విశేషమైన వైదుష్యము కలవారు. నారాయణాచార్యభాగవతార్ విద్యాభ్యాసం విజయనగరం లోని సంస్కృత కళాశాలలో జరిగినది. వీరు ఆ కళాశాల నుండి “ఉభయభాషాప్రవీణులు”. వీరికి చిన్నతనము లోనే అధ్యాత్మిక గ్రంధములు కూడా అభ్యసించే అవకాశం కలగడంతో వీరు “ఉభయవేదాంతప్రవీణులు”గా కూడా ప్రావీణ్యత పొందారు. అప్పటికి కరి నారాయణాచార్య భాగవతార్ వయస్సు కేవలం ఇరవై సంవత్సరములు మాత్రమే.

శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ అనేక సాహిత్య రచనలు, సంగీథం లో కీర్తనలు చేస్తూనే హరి కధా కాలక్షేపాలు కూడా చెప్పేవారు. వీరు 1952లో “ శ్రీ యతిరాజ సేవా మహిళా మండలి “ వారి ద్వితీయ వార్షిక పండిత సభలలో చెప్పిన “ గోదా కళ్యాణం “ హరికధా కాలక్షేపం ఎంతగానో ప్రజాదరణ పొంది , తరువాత ఎన్నో పండిత సభలలో వీరి హరికథలను ఏర్పాటు చెయ్యటానికి దోహద పడింది.         శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ గారి పద్య రచనల లో “అమృతాంజనశతకం “ శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు మన్ననలను పొందినది. వీరి ఇతర రచనలు శ్రీ రామానుజ గురువరణం, సుధన్వుడు, స్వాహాశశాంకము మున్నగు నాటికలు, అనేక చాటువులు, గేయ ప్రబంధములు, హరికథలు. ఇవి ఆంధ్రదేశములో విశేషమైన ఖ్యాతి గడించినవి.

3. శతకరచనానేపథ్యం- ప్రచురణ:

కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రగ్రంథమాల అనే సంస్థను నడుపుతూ ఎన్నో సాహిత్యాత్మక గ్రంథాలను ముద్రిస్తూ ఉండేవారని, కవిరచయితలను పోషిస్తూ ఉండేవారని లభ్యమైన ఆధారాల ద్వారా తెలుస్తున్నది. కాశీనాథుని వారికి సమకాలికులు, సంగీతసాహిత్యాలలో అపారమైన ప్రతిభాపాండిత్యాలున్న నారాణాయణాచార్యులు నాగేశ్వరరావుకు అంత్యంత సన్నిహితులు కావడం వల్ల, వారి అభిమాన ఉత్పత్తి అయిన అమృతాంజనానికి ప్రాచుర్యం కల్పించడానికే ఈ శతకం వెలుగు చూసినట్టు ప్రకటనలద్వారా, శతకంలో అక్కడక్కడా పేర్కొన్న విషయాల ద్వారా అవగతం అవుతోంది. భారతి, ఆంధ్రపత్రిక, చందమామ, ఆంధ్రమహిళ మొదలైన అలనాటి పత్రికనిండా ప్రతి సంచికలోను అమృతాంజం ప్రకటనలు చూడవచ్చు. 1932 లో వచ్చిన పత్రికల్లో అమృతాంజన ప్రకటనతో పాటు అమృతాంజనశతకం-వెల ఒక అణా అని ప్రచురించడాన్ని బట్టి, ఈ శతకం కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకునేందుకు ఒకమంచి ఉపకరణంగా ఉండేదని బోధపడుతుంది. (ANDHRAPATRIKA Volume 19 issue 222, Publication date 1932-12-2 &  Volume 20 issue 4 Publication date 1933-04-05)

ఈ శతకముఖచిత్రము దొరకడంలేదు కానీ శీర్షిక పుటలో అమృతాంజనశతకము, కర్త: శ్రీమాన్ కరి నారాయణాచార్యుఁడు (ఆంధ్ర గీర్వాణ సాహిత్యపరిషత్తు) అని ఉంది. ప్రకాశకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు అని కనిపిస్తోంది ఆంధ్రగ్రంథమాల ప్రచురణగా1932 (ఆంగీరస)లో చెన్నపురిలో ముద్రితమైనట్టు, వెల ౦-౧-౦ ఒక అణా అని ఉటంకించడాన్ని గమనించవచ్చు. (అమృతాంజనశతకము, ముఖచిత్రం)

శ్రీకాశీనాథుని నాగేశ్వరరావు శతకమంజరిని ప్రచురించి ఎన్నో శతకాలను సంకలనం చేసి ప్రచురించారు కానీ ఆయా భాగాలలో ఎక్కడా అమృతాంజనశతకము కనిపించలేదు. కేవలం అమృతాంజనం ప్రచారానికి, అమృతాంజనంతో పాటు విక్రయించడానికి నాగేశ్వరరావుపంతులు ఈ లఘుశతకాన్ని ముద్రించి ఉండవచ్చు. (శతకమంజరి, కాశీనాథుని నాగేశ్వరరావు.)

అమృతాంజనము, అమృతాంజనశతక ఆవిర్భావాల గురించి శతకసౌరభంలో డా. కె. గోపాలకృష్ణారావుగారి మాటలు అవశ్యం గమనించదగ్గవి. “వస్తువు బంగారం వంటిది. ప్రచారసాధనాలు దానికి సౌరభాన్ని చేకూర్చినాయి. ఈ ఔషధ ప్రశస్తిని కర పత్ర ములు, పత్రికా ప్రకటనలు నానావిధాలుగ చాటినవి. దీనికితోడుగ వ్యాపార ప్రకటనం కార్యరూపంలో అందులోను శతకరూపంలో సాగటం శతకవాఙ్మయానికి అలంకారప్రాయమైంది.” (శతకసౌరభం పుట. 45)

4. కృతిసమర్పణ:

ఈ శతకంలో తొలిపుటలో ’కృతిసమర్పణము’ అనే శీర్షికతో రెండు పద్యాలున్నాయి. ఒకటి కందపద్యం. మరొకటి తేటగీతితో కూడిన సీసపద్యం. ఇందులో నాగేశ్వరరావు పంతుల్ని ఆశీఃపురస్సరంగా ప్రస్తుతించిన విధానం రసరమ్యంగా ఉంది.

          శ్రీశ పదకమల భక్తుడు / దేశోద్ధారకుడు బహుసుధీగణ్యుండున్

    కాశీనాథాన్వయ నా/ గేశుడు సుఖియగుత  మహి నహీనవిభవుడై. (కృతిసమర్పణము)

విష్ణుభక్తుడు, దేశోద్ధారకుడు, పండితాగ్రేసరుడైన నాగేశ్వరుడు అమితమైన వైభవంతో సుఖించుగాక అని ఆశీస్సులందిస్తూ ఈ కృతిసమర్పణం ప్రారంభమైంది. కవిపోషకులకు కావ్యాలు రాసి అంకితమివ్వడం పూర్వంనుండి వస్తున్న సంప్రదాయం. “కాశినాగేశ్వరాబ్ధి హిమమరీచికి, గుణికి, నాగేశ్వరాఖ్యకృతికి నీకృతి భక్తి నంకిత మొనర్తు జంద్రునకు నూలిపోగను సామెతగను” అంటూ ఈ శతకకర్తకూడా కృతిభర్తగా శతకవస్తువైన అమృతాంజనసృష్టికర్త, ఆ సంస్థ అధినేత అయిన కాశీనాథుని వారికే ఈ శతకాన్ని సమర్పించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.

5. అమృతాంజనశతకం- వైశిష్ట్యం:

లభ్యమౌతున్న శతకాలలో అమృతాంజనశతకం విలక్షణమైంది. గడిచిన తొంబై ఏళ్ళలో ఈ శతకాన్ని సమీక్షించిన వారు, విశేషంగా వ్యాఖ్యానించిన వారు, సమగ్రంగా పరిశీలించినవారు లేరేలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఒకరిద్దరు కేవలం పరిచయాత్మకంగా మాత్రమే ఈ శతక వైశిష్ట్యాన్ని స్పృశించిన దాఖలాలు శతకవాఙ్మయం సంకలన, విమర్శన గ్రంథాలలో కనిపిస్తున్నాయి.

“వస్తు వైలక్షణ్యము బట్టి అమృతాంజనశతకము ప్రత్యేకముగ పరిశీలింపదగినది.” దేవులపల్లి శేష భార్గవి, శతకసాహిత్యం-2)

“ ‘ఆంధ్రపత్రికతోడ అమృతాంజనం బిచ్చి తలనొప్పి బాపిన ధన్యుడితడు' అని కీర్తిని గడించిన కాశీనాథుని నాగేశ్వరరావు గారి సృష్టి "అమృతాంజనము" అనే నొప్పి నివారిణి మందు. దీనిపై ఒక ప్రత్యేక శతకమే వెలుగుచూచింది. అనేక చమత్కారాలు పొదగబడిన ఈ శతకంలో పలుచోట్ల హాస్యం తొంగిచూస్తున్నది. వస్తువుకు ప్రాచుర్యం కల్గించే ప్రకటనలవలె కాకుండా ఒక విశిష్టతను సంతరించుకున్న హాస్యశతకం ఇది. వరవర్ణవిలసిత మగు సురుచిర పాకాంచితగుణ శోభితమగుచున్ సరస మగుట నిన్ను మనో హర కావ్యమనంగవలయు నమృతాంజనమా ! అని అమృతాంజనాన్ని ఒక మనోహర కావ్య సదృశంగా కవి వర్ణించాడు. శబ్ద చమత్కారాన్ని ఆశ్రయించి ఈ విషయాన్ని సాధించాడు. వర్ణము, పాకము, రసము వంటి కావ్యసామగ్రిని అమృతాంజనమునకు ఆపాదించి పోలిక చెప్పిన చోట కనిపించిన సునిశిత హాస్యం ఈ శతకంలో పలుతావులలో ప్రకటమవుతుంది.” (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు, గిరిజామనోహరబాబు, జి. తెలుగుశతకాలు. పొట్టీశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాద్, 2012. పుట. 30)

“శతకసౌరభం”లో శ్రీ గోపాలకృష్ణారావు పేర్కొన్న అంశాలు ఈ శతకవైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి. “కరి నారాయణాచార్యులుగారు "అమృతాంజనము"నకు సంబంధించిన అనేకాంశములకు కావ్యగౌరవము కలిగించినారు. సువర్ణముతో నొప్పు అంజనము-అందమైన చిన్నసీసా, మూత, పేటిక, వివిధ భాషలలో గల ఔషధ గుణకీర్తన పత్రము, మొదలగు వానిని నారాయణాచార్యకవి మనోహరములగు కల్పనలతో వర్ణించిన శతకమే “అమృతాంజన శతకము". ఈ శతకము కేవలము ప్రచారగ్రంధముకాదు. మనోజ్ఞమైన కావ్యం. అమృతాంజనము కూడ హృద్యమైన కావ్యమువంటిదని కవి ఈ పద్యంలో వివరించిన రీతి గమనించండి. నన్నెచోడాదులు హృద్యకావ్యమును శ్లేషకల్పనలతో వర్ణించినట్లున్నది. ఇంపైన కావ్యమువలె అమృతాంజనము కరవర్ణము సురుచిర పాకముతో సరసమైనదని నారాయణాచార్య కవి ప్రస్తుతించినారు.” (శతకసౌరభం పుట. 45)

ఈ ఒకటి రెండు ఉదాహరణలు తప్ప, ఇతమిత్థంగా ఈ శతకవైభవాన్ని పట్టిచూపించిన రసజ్ఞులు, చమత్కారప్రియులు కానరారు.

6. అమృతాంజనశతకం- అభివ్యక్తివైచిత్రి:

ఈ శతకంలో ఎన్నో రకాల చమత్కారాలు కొల్వుతీరి ఉన్నాయి. నారాయణాచార్యులవారి భాషాపటిమ, పాండితీ ప్రకర్ష, వర్ణనావైదుష్యం, అభివ్యక్తి వైచిత్రి ఈ శతకంలో ప్రతిపద్యంలోనూ ద్యోతకమవడాన్ని గమనించవచ్చు.

6.1 ఉక్తివైచిత్రి:

చమత్కారమైన మాటనే ఉక్తివైచిత్రిగా పేర్కొనవచ్చు. వక్రోక్తిగా, వాక్ప్రౌడిగా ఈ తరహా రచనాపాటవాన్ని ప్రాచీనులు పేర్కొన్నారు. నారాయణాచార్యుల వారి శతకపద్యరచనలో అనేకసందర్భాలలో ఈ ఉక్తివైచిత్రి తొణికిసలాడుతూ సహృదయా-నందకరంగా ఉంటుంది.

ఈ శతకరచనాప్రణాళికలోనే అసలైన ఉక్తివైచిత్రి ప్రకటితమౌతోందని చెప్పవచ్చు. కవి- శతకవస్తువైన అమృతాంజనంతోనే సరిసరి సంభాషించడం ఈ రచనలో విశేషం. ప్రతిపద్యంలో మకుటం “అమృతాంజనమా” అన్న సంబోధన. ఒక అచేతనమైన పదార్ధానికి చేతనత్వాన్ని ఆపాదించి, అమృతాంజనానికి మానవీయతను ఆరోపించడం, మధ్యమపురుషలో ప్రతిపద్యాన్ని రచిస్తూ, సంబోధనాత్మక అమృతాంజనంతోనే సంభాషించడం ఎంతో అరుదైన, విలక్షణమైన నాటకీయతగా పేర్కొనవచ్చు.

           కం.    శ్రీచారుముఖీకమన/ ప్రాచుర్యకృపాకటాక్షభాగ్యంబున నీ

      భూచక్రమున సమృద్ధిగ/నాచంద్రార్కముగ వఱలు మమృతాంజనమా!        1

శ్రీ మహాలక్ష్మీ దేవి అందమైన ముఖం వలన ఎంతో కృపాకటాక్ష భాగ్యాన్ని పొందినదై ఈ భూమ్మీద సమృద్ధిగా, శాశ్వతంగా "అమృతాంజనం" ఉండుగాక అని మొదటి పద్యంలోనే శ్రీకరి వారు ఆశీర్వాదాత్మకంగా అమృతాంజనాన్ని ఆచంద్రతారార్కం నిలిచి ఉండమని దీవించారు.

కం. వెన్నుడు, లచ్చియు మొదలుగ,/ బన్నిద్దరు సూరు, లుడయవరు, లితరార్యుల్

         సన్నుతులగు వైష్ణవ గురు/ లన్నన్ స్మరణీయులెపుడు నమృతాంజనమా! 2

ఓ అమృతాంజనమా! విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మొదలు, 12మంది ఆళ్వారులు, సాక్షాత్తు శ్రీరంగనాథుడే "ఉడయవర" అని పిలవగా ప్రసిద్ధులైన భగవత్ శ్రీమత్ రామానుజాచార్యులు, ఇంకా మిగతా పూజ్యులు, స్తుతించ దగిన వైష్ణవ గురువులు ఎప్పుడూ స్మరణీయులే అని వైష్ణవపరివార వర్ణనం వీరి సంప్రదాయవైదగ్ధ్యానికి ప్రతీక.

ఆచార్యులవారు గురుపరంపరను, సంస్కృత-తెలుగు పూర్వకవులను స్తుతించడం, కుకవినింద గావించడంలో చక్కని వాక్చమత్కృతిని గమనించవచ్చు.

         కం.     శ్రీ మన్ముడుంబకులజుని, / ధీమహితుని సింహగిరి సుదేశికవరునిన్

                  నా మనమునందు సంతత/ మామోదముతో భజింతు నమృతాంజనమా! 3

“ఓ అమృతాంజనమా! ధీశాలియైన శ్రీ ముడుంబ సింహగిరి స్వామి (ఆధ్యాత్మిక గురువు, రామతీర్థం క్షేత్రం, విజయనగరం) వారిని నా మనసులో ఎంతో ప్రత్యేకంగా ఎప్పుడూ భజిస్తూ ఉంటాను” అంటూ గురువందనం చేసారు. ఇందులో వినయోక్తి స్పష్టం.

          కం.     నాకుభవు, వ్యాసు, మాఘుని, / శ్రీకాళీదాసు, బాణు, శ్రీహర్ష కవిన్

                  లోకజ్ఞు దండికవి న/ త్యాకృష్టాదృతి దలంతు నమృతాంజనమా!         4

“ఓ అమృతాంజనమా! ఆదికవి వాల్మీకి మహర్షిని, వ్యాసుల వారిని, శిశుపాలవధ అనే కావ్యం వ్రాసిన మాఘకవిని, సంస్కృత పంచకావ్య కర్త, కవి కులగురువు, మహాకవి కాళిదాసును, కాదంబరి కర్త భట్టబాణుణ్ణి, నైషధీయ‌చరిత్ర వ్రాసిన శ్రీహర్షుణ్ణి, దశకుమార చరిత్రాది రచనలతో ప్రసిద్ధుడైన దండ్యాచార్యుణ్ణి ఎంతో ఆదరంతో తలుచుకుంటూ నమస్కరిస్తున్నాను. (పూర్వకవులను స్తుతిస్తున్నారు. ముందుగా సంస్కృతంలో సుప్రసిద్ధులైన కవీంద్రులను స్మరిస్తున్నారు.)

       కం.           నన్నయ దిక్కన నెఱ్ఱన/ జెన్నలరగ బోతనార్యు శ్రీనాథకవిన్

        సన్నుతు బెద్దన్నను ది / మ్మన్నను మది దలదు సతత మమృతాంజనమా!5

“ఓ అమృతాంజనమా! తెలుగులో కవిత్రయంగా ప్రఖ్యాతులైన నన్నయ తిక్కన ఎర్రన కవులను, శ్రీమదాంధ్ర మహాభాగవతం కర్త పోతనామాత్యుణ్ణి, శృంగారనైషధం శివరాత్రి మహాత్మ్యం మొదలైన ఎన్నో కావ్యాలు రాసిన శ్రీనాథ మహాకవిని, ప్రబంధ యుగంలో మొట్టమొదట చెప్పుకోదగ్గ అల్లసాని పెద్దనను, పారిజాతాపహరణం వ్రాసిన నంది తిమ్మనను మనసారా తలుచుకుంటూ నమస్కరిస్తున్నాను.” అన్నారు. కరివారికి తెలుగు సంస్కృతకవులపట్ల ఉన్న గౌరవాదులు ఈ పద్యాలలో వ్యక్తమౌతున్నాయి.

          కం.     ఇలలో గల కవు లందఱ/ వలె గాక సమస్తమానవప్రియకర మౌ

                  సలలిత శతకము సహృదయు       లలరగ నీపై నొనర్తు నమృతాంజనమా! 6

          “ఓ అమృతాంజనమా! లోకంలో ఎంతో మంది కవులు ఎన్నో విషయాలను కవితా వస్తువులుగా స్వీకరించి శతకాలు వ్రాశారు. కానీ నేను వాళ్ళ దారిలో కాకుండా, అందరికీ ఆనందాన్ని కలిగించేలా,  సహృదయులు మెచ్చుకునే విధంగా నీ గురించి లలితమైన శతకాన్ని వ్రాస్తాను.” అని శపథం చేసిన ఆచార్యుల మాటల్లో పౌఢోక్తిని ఉక్తివైచిత్రిగా గమనించవచ్చు.

6.2 భాషావైచిత్రి:

సంస్కృతాంధ్రాలలో విశేషమైన పాండిత్యమున్న కవివరేణ్యులు శ్రీ నారాయణాచార్యులు. ఉభయ భాషల ప్రావీణ్యం ఈ శతకరచనలో ఎన్నో సందర్భంలో మనకు సాక్షాత్కరిస్తుంది.

          కం.     ఉరుదారుణశూలతమో గురుదారణకరణలసదకుంఠఖమణియన్/

                  బిరు దార్జింపందగు నీ కరుదా రుగ్రక్షకత్వ మమృతాంజనమా! 57

వంటి పద్యాలలోని దీర్ఘసమాసాలు, సమాసఘటన వైశిష్ట్యం, ఓజోగుణగుంభనం కరి వారి భాషావైచిత్రి ని వెల్లడిస్తున్నాయి.

          కం.     నడచుటకుఁ బూనినంతన గడేగడెకు మివుల నొవులుఁ గల్గించెడునె                                              క్కుడుకీళ్లనొప్పులను నీ వడఁతువు నిముసమ్ములోన నమృతాంజనమా! 62

అనే పద్యంలో అచ్చతెనుగు సొగసును కవి చవిచూపించిన తీరు లెస్సగా ఉంది.

6.3 వర్ణనావైచిత్రి:

          కం.     ఇల నతినిష్ఫలవర్ణన /      ముల జేతురు కవులు న్యాయముం దలపకయే

                  లలి నిను వర్ణించుటయే యలఘుత రావశ్యమందు నమృతాంజనమా!        7

“ఓ అమృతాంజనమా! లోకంలో కవులెంతోమంది అనాలోచితంగా, ఎవరికీ ఉపయోగంలేని ఎన్నెన్నో వర్ణనలు చేస్తూ ఉంటారు. కానీ క్రమంగా నిన్ను వర్ణించడమే ఎంతో అవసరమైన, గొప్పదైన విషయంగా నేను భావిస్తాను.” అని ఎందుకు అమృతాంజనాన్నే వర్ణించదలుచుకున్నారో ఆచార్యులవారు శతక ప్రారంభంలోనే పేర్కొన్నారు. అమృతాంజనం ప్రకటనల్లో కూడా విభిన్నవర్ణనలు, నూతనత్వం, అభివ్యక్తులను గమనించవచ్చు.

Responsive image

6.4 అలంకారవైచిత్రి:

వరవర్ణవిలసిత మగు సురుచిర పాకాంచితగుణ శోభితమగుచున్ సరస మగుట నిన్ను మనో హర కావ్యమనంగవలయు నమృతాంజనమా ! అని అమృతాంజనాన్ని ఒక మనోహర కావ్య సదృశంగా కవి వర్ణించాడు. శబ్ద చమత్కారాన్ని ఆశ్రయించి ఈ విషయాన్ని సాధించారు. వర్ణము, పాకము, రసము వంటి కావ్యసామగ్రిని అమృతాంజనమునకు ఆపాదించి పోలిక చెప్పిన తీరు ఈ శతక రచనలోని అలంకార వైచిత్రికి ఒక మచ్చుతునకగా భాసిస్తోంది.

6.5 అభివ్యక్తివైచిత్రి:

భావాన్ని రసరమ్యంగా మనోహరంగా వ్యక్తీకరించడంలో అభివ్యక్తివైచిత్రి ద్యోతకమౌతుంది. అమృతాంజనశతకంలో 26వ పద్యం నుండి వరసగా అనేకపద్యాలలో ఈ అభివ్యక్తివైచిత్రి, విశేష భావపరంపర, నూతనవ్యక్తీకరణలు, వర్ణనలుండడం ఈ శతకానికే మకుటాయమానమైన విషయం.

ఈ శతకంలో అభివైచిత్రి చోటుచేసుకున్న సందర్భాలకు కొన్ని ఉదాహరణలు:

  • ఓ అమృతాంజనమా! ఎన్నో ఔషధాలకు నిలయమైన చంద్రుడికి నీ గొప్పతనం తెలియదు. ఒకవేళ తెలుసుకున్నవాడే అయితే, రాహువు తనని పట్టుకుని విడిచిపెట్టినప్పడయ్యే గాయాలను సులభంగా మాన్పుకుని ఉండేవాడు కదా.
  • ఓ అమృతాంజనమా! అన్ని వేళలా మూలాధారాది చక్ర సమాహారమైన శరీరాలను రోగాల నుండి రక్షిస్తావు. మానవులందరి మనస్సులనే పద్మాలను రంజింప చేస్తావు. ఈ గుణాల చేత నిన్ను మిత్రుడు (సూర్య భగవానుడు) అని తలుస్తాను.
  • ఓ అమృతాంజనమా! కొంతమంది తెలివి తక్కువ వారూ.. నకిలీ మందుల‌మ్మే వారి మాటలు నమ్మి, పైపై మెరుగులకు భ్రమపడి వాటినే కొంటారు. వాటిలో నీ సుగుణాలేవీ ఉండవు కదా.
  • ఓ అమృతాంజనమా! పారిజాతంలోని పూదేనను ఆస్వాదించే తుమ్మెద, ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళనట్టే నీ మాహాత్మ్యం తెలుసుకున్న వారెవరూ ఇతర మందుల జోలికి వెళ్ళలేరు.
  • ఓ అమృతాంజనమా! తాపాన్ని పోగొట్టడం, చల్లదనాన్నివ్వడం, సువాసన వెదజల్లడం, ప్రకాశిస్తూ తెల్లగా ఉండడంవల్ల నిన్ను కల్పవృక్షాలలో ఒకటైన "హరిచందనం"గా భావిస్తాను.
  • ఓ అమృతాంజనమా! ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క మందులో ఒక్కోరకమైన సుగుణముంటుంది. కానీ లెక్కకు మించి ఎన్నో సుగుణాలు నీలోనే దాగి ఉన్నాయి కదా!
  • ఓ అమృతాంజనమా! ఆ హనుమంతుడి పేరు తలుచుకుంటే సమస్త భూతాలు ఎలా భయంతో చెదిరి పోతాయో.. అదేవిధంగా నీ పేరు పలికిన వెంటనే నొప్పులన్నీ మటుమాయమవుతాయి.
  • ఓ అమృతాంజనమా! అందరూ నిన్ను ఉపయోగించేటప్పుడు మిగతా మందుల లాగ, మందుతోపాటు చేర్చి పుచ్చుకొనే వస్తువులేవీ అక్కర్లేదు. ఉపయోగించిన తర్వాత కూడా ఎలాంటి పథ్యం పాటించాల్సిన అవసరం లేదు. నీలాంటి అనుకూలమైన ఔషధం మరొకటి ఉంటుందా.?
  • ఓ అమృతాంజనమా! పొగడదగిన ప్రబలమైన తిరుగులేని శ్రీరామబాణము లాగ, నిన్ను ఉపయోగించే వారికి వ్యర్థంకాని ఎన్నో  ప్రయోజనాలను కలిగిస్తావు.
  • ఓ అమృతాంజనమా! రోగాల నుండి అందరినీ రక్షించడం వలన ( గదాయుధంతో సమస్త లోకాలను రక్షించడం వలన), కాశీనాధుని నాగేశ్వరరావు గారి కృషి ఫలితంగా అందరికీ తెలిసినందువలన (ఆదిశేషుడు వహిస్తూ ఉండడం వలన) నిన్ను "హరి" అంటే విష్ణువుగా భావిస్తాను.
  • ఓ అమృతాంజనమా! సిద్ధపడి విషాన్ని మింగిన శంకరుడికి నీ అమేయమైన శక్తి తెలిసి ఉంటే ఏ మాత్రం జంకకుండా నిన్ను స్వీకరించి తన కంఠం మీద ఉన్న నల్లని మచ్చని పోగొట్టుకుంటాడు కదా!
  • ఓ అమృతాంజనమా! ఎలాంటి వాళ్లైనా సరే వాళ్ళుండే ప్రదేశాల్లో దుర్గంధం ఉంటే.... నిన్ను వాసన చూస్తే చాలు, ఎంతో ఆహ్లాదకరంగా సువాసనలతో వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తావు కదా!
  • ఓ అమృతాంజనమా! "కమ్మనైన సువాసనలనిచ్చే మందులు ఈ భూమి మీద అసలు ఉన్నాయా"అనే మాట ఇంక అననక్కర్లేదు. గుభాలించే వాసనతో నువ్వు అందరికీ సుఖప్రదాయినివిగా ఉంటావు కదా.!
  • ఓ అమృతాంజనమా! ఎంతో ప్రశస్తమైన ఔషధాలను ధరించిన నీ సుందరమైన రూపము వలన (ఎంతో గొప్పవాడు, పక్షిరాజైన గరుత్మంతుడు ధరించిన సుందరమైన శరీర వైభవం వలన), కాశీనాధుని నాగేశ్వరరావు గారి ప్రయత్నం వలన ఎంతో ఆదరమైన యుక్తవర్తనతో ఉండడం వలన, (ఆజ్ఞలను పాలిస్తూ ఆదిశేషుడు యుక్త వర్తనతో ఆదరంగా ఉండటం వలన) నిన్ను "హరి" అంటే విష్ణువుగా భావిస్తాను.
  • ఓ అమృతాంజనమా! సంపన్నుడైన దేవేంద్రుడు నిన్ను చూసి, నీ తత్త్వాన్ని తెలుసుకుంటే గనక, నిన్ను స్వీకరించడా? తన శరీరానికి ఉన్న దౌర్భాగ్యాన్ని తొలిగించుకొని ఉండేవాడు కాదా?

7. ఉపసంహారం:

“బొంబాయిపట్టణమున కేగి యచ్చట విలియం అందుకో స్థాపించి పని చేయుచుండెడివారు. అప్పుడే పంతులుగా రమృతాంజన మును కనిపెట్టిరి. ఆ విధముగ తులుగారు సంపాదించిన యమృతాంజన వ్యాపారమున వివిధ ధనాకర్షణమార్గముల సరయుచు విశేషలబ్ధిని బొందిరి. ఈ యమృతాంజన విక్రయశాల 1894లో స్థాపింపబడినది.  ఇట్టి లాభదాయకమగు నమృతాంజన ప్రకటన వ్యాపా రముల కొకపత్రిక యావశ్యకమని గుర్తించి యాలోపమును బూరించుటకై యొశ ముద్రణాలయమును గొనివచ్చి “ఆంధ్రపత్రిక"యను పేరుతో నొక వారపత్రికను స్థాపించి ప్రకటిం చుచు దస్మూలమున గూడ సమితేధనము నార్జించుటకు బ్రారం భించెను, ఆంధ్రభాషయం దానాడు వారపత్రికలు మాత్రమే ప్రకటింపబడుచుండెను. ఈ పత్రికలకంటె నాంధ్రపత్రికయే యుత్తమోత్తమమైనదను ప్రఖ్యాతి నార్జించుకొనినది. ఈ పత్రిక 1908 సంవత్సరమున నెలకొల్పబడినది” (నాగేశ్వరావు వ్యాసము పుట. 20-21 - జాతీయ నాయకులు- ప్రథమ భాగము.) అనే వాక్యాలు అమృతాంజనం ఆవిర్భావం దాని ప్రచారం కోసం ప్రారంభమైన ఆంధ్రపత్రిక పుట్టుక – ఎదుగుదల గురించి సూచిస్తున్నాయి. ఇంతటి విశేషమైన మహత్తు కలిగిన  అమృతాంజనం పై ఆచార్యులవారి శతకం కూడా సహృదయరంజకమై ఆనాటి కాలంలో ఎంతో ఆదరించబడింది. హాస్యశతకంగా, ప్రకీర్ణకశతకంగా, వస్తువైవిధ్యం ఉన్న శతకంగా పాఠకుల మన్ననలు పొందింది.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గిరిజామనోహరబాబు, జి. తెలుగుశతకాలు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు, పొట్టీశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాద్, 2012.)
  2. చినరఘుపతిరావు, కోటమర్తి. నాగేశ్వరావు వ్యాసము జాతీయ నాయకులు- ప్రథమ భాగము. పుట. 20-21 - 1955).
  3. దుర్గాబాయి, దేశముఖ్ (సం.) ఆంధ్రమహిళ సంపుటి 5,6. 1948-11-01.
  4. నాగభూషణశర్మ, మొదలి. ప్రసాద్, ఏటుకూరి. (సంపా.) కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం. గురజాడ అప్పారావు- కన్యాశుల్కము వ్యాసం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్, 1999.
  5. నాగేశ్వరరావు, కాశీనాథుని (సం.) ఆంధ్రపత్రిక సంపుటము
  6. నారాయణాచార్యుడు, కరి. అమృతాంజనశతకం, ఆంధ్రసాహిత్యగ్రంథమాల, చెన్నపురి, 1932.
  7. మల్లికార్జునారాధ్య, మల్లంపల్లి. పురాణము సూర్యనారాయణతీర్థ(సం.) అవతారిక పుట. 3 - సత్యవత్యుపాఖ్యానము 1919.
  8. శ్రీమాన్ కరి నారాయణాచార్య భాగవతార్ షష్ట్యబ్ది పూర్తి సంచిక.
  9. ANDHRAPATRIKA Volume no19 issue no222 AndhraPatrika Publication date 1932-12-23.
  10. ANDHRAPATRIKA Volume no 20 issue no 4 AndhraPatrika Publication date 1933-04-05.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "మే-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-ఏప్రిల్-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "మే-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]