headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-2 | February 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. మనుచరిత్ర: గుణ, అలంకార ఔచిత్యరీతులు

డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ

తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ, మానవీయశాస్త్రవిభాగం,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం,
శ్రీసత్యసాయి జిల్లా –515134, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9247859580, Email: psarmarambhatla@sssihl.edu.in
Download PDF


Keywords: పెద్దన, కవిత్వం, ఔచిత్యం, క్షేమేంద్రుడు. గుణం, అలంకారం

1. ఔచిత్యశబ్దనిర్వచనం:

                     ‘‘ఉచితం ప్రాహురాచార్యా: సదృశం కిల యస్యయత్‌

                   ఉచితస్య హి యో భావ స్తదౌచిత్యం ప్రచక్షతే॥’’         (ఔ.వి.చర్చ. 7వ శ్లో.)

‘దేనికి ఏది తగినదిగా ఉంటుందో దానిని ఉచితమని ఆచార్యులంటారు. ఉచితమైన దాని భావమే ఔచిత్యమని’ క్షేమేంద్రుడు ఔచిత్యవిచారచర్చలో పేర్కొన్నాడు. ‘ఉచిత’ శబ్దంనుండి ఔచిత్యశబ్దం పుట్టడాన్ని, ఈ శబ్దానికున్న అర్థాలను నిఘంటువులు చక్కగా నిర్వచించాయి. ఉచిత, ఔచిత్యశబ్దాలకు ఒక్కొక్కచోట ఒక్కో అర్థ, పర్యాయపదాలున్నాయి.

ఉచితమంటే ‘విదితం’, ‘న్యస్తం’, ‘పరిమితం’, ‘యుక్తం’ అని హేమచంద్రుడు కావ్యాను-శాసనంలో చెప్పాడు. ‘యోగ్యం’ అని ‘శబ్దరత్నావళి’ పేర్కొంది. పాశ్చాత్యులు ఔచిత్యానికి వివిధ సమానార్థాకాలను ఉపయోగించారు. Adaptation, Apropriatness, Aptnetss, Conformity, Congruity, Correctness, Decorm, Fitness, Harmony, Propriety, Suitability లాంటి పదాలద్వారా వ్యక్తమయ్యే- మర్యాద, వినయం, యుక్తత, అర్హత, దోషరాహిత్యం, పొందిక మొదలయిన అర్థాలు ఔచిత్యపరిధిని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

2. పెద్దనకవిత్వం - ఔచిత్యం:

పెద్దన కవిత్వంలో ఇంతకుముందు విమర్శకులు పేర్కొన్న ఔచిత్య, అనౌచిత్యాల స్వరూప, స్వభావాలను ఉజ్జాయింపుగా ప్రస్తావించాను. క్షేమేంద్రుడి ఔచిత్యసిద్ధాంతానికి లక్ష్యగ్రంథంగా మనుచరిత్రను నిరూపించడానికి కారణాలను, యోగ్యతను పేర్కొన్నాను.

తెలుగులో ప్రథమ స్వతంత్రప్రబంధమైన మనుచరిత్రనుద్దేశించి ‘‘తెలుగు వాఙ్మయంలో మనుచరిత్రకున్న ప్రచారప్రశస్తులు మఱే యితర కావ్యమునకు లేవనుటలో నత్యుక్తి లేదు’’ (పుల్లెల శ్రీరామచంద్రుడు, ఔచి. పుట.14) అని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర, తరువాతి ప్రబంధాలకు మార్గదర్శకమైన రచన. అందుకే పెద్దనకు ‘ఆంధ్ర కవితాపితామహుడ’న్న బిరుదు సార్థకమైంది. ‘పెద్దనవలెకృతి చెప్పిన’ అన్న కవిచౌడప్ప పద్యంకూడా, కవిత్వంలో అల్లసాని ‘జిగి-బిగి’కున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. పురాణాల్లో చిన్నకథను తీసుకుని వర్ణనలతో, రసవదలంకార ప్రయోగాలతో, అనల్పకల్పనాచమత్కృతితో ప్రబంధరచన చేసిన కీర్తి పెద్దనదే. ఆ తరువాతి కవులు ఈయణ్ణి అనుసరించారు.

మనుచరిత్రలోని ప్రతిపద్యం శిరీషకుసుమపేశల సుధామయోక్తులతో, అనవద్యంగా ఉంటుంది. ఈ ప్రబంధంలో ఎక్కడచూసినా పెద్దన భాషావైదుష్యం, భావగాంభీర్యం, లోకవిజ్ఞానం, కల్పనాచాతుర్యం, శయ్యాసౌభాగ్యం శోభిస్తుంటాయి. అందుకే మనుచరిత్రకు టీకలు, వ్యాఖ్యలు చాలా వచ్చాయి. ‘సి.పి.బ్రౌన్‌’ ప్రతి, ‘వావిళ్ళ’ ప్రతి, ఆనందముద్రణాలయ ప్రతి, సాహిత్యఅకాడమీ ప్రతి, వెంకట్రామ గ్రంథమాలప్రతి, ఎమెస్కో ప్రతి... ఇలా ఎన్నో సంస్థలు లెక్కకుమించినన్ని సార్లు మనుచరిత్రను ముద్రించాయి. అంతేకాకుండా మనుచరిత్రలో విరివిగా వచ్చిన పాఠాంతరాలు, వాటిని పరిష్కరించిన పరిష్కర్తల సంఖ్య ఈ ప్రబంధానికున్న ఆదరణను తెలుపుతున్నాయి.  మనుచరిత్రలోని పద్యాలను ప్రముఖ ఛందోవ్యాకరణ లక్షణగ్రంథాల్లో ఆయా గ్రంథకర్తలు ఉదహరించారు. ఈ ప్రబంధంలోని చాలా పదాలు ప్రామాణికనిఘంటువుల్లో స్థానాన్ని సంపాదించాయి.

పెద్దనకవిత్వం గురించి చెప్పాలంటే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రత్నం. మనుచరిత్రలోని పద్యసౌందర్యం, కథాకథనం, పాత్రచిత్రణ మొదలైన అంశాల గురించి తాత్త్వికదృష్టి మొదలు సామాజిక దృక్కోణంవరకు అన్ని విధాలా విశ్లేషించిన విమర్శనాగ్రంథాలు అసంఖ్యాకంగా వెలుగుచూసాయి. నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు - మను సంభవ చరిత్ర, ‘‘స్వారోచిష మను సంభవము’’. మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మవృత్తాంతం. ఐతే మనుచరిత్ర అనగానే వరూథినీ ప్రవరాఖ్యులు గుర్తొస్తారు. వీళ్ళకీ ఈ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం ఏమిటి? అన్న అంశాన్ని వివరిస్తూ అల్లసాని ప్రారంభించాడీ కథ. ఈ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, ఇదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. ఇదొక తమాషా కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు పితామహుడేనా అంటే? కాదు. ఒక రకంగా అవును! అందుకే ఇది విచిత్రమైన కథ అయ్యింది.

మనుచరిత్రలో ప్రతిపద్యానికీ గంభీరమైన వ్యాఖ్యానం చేయవచ్చు. మచ్చుకొక పద్యాన్ని పరిశీలిద్దాం. ప్రవరుడు వరూధినిని తిరస్కరిస్తాడు. ఇద్దరికీ మంచి రసవత్తరమైన వాదన జరుగుతుంది. కానీ ప్రవరుడు చలించడు. తన నిష్ఠతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి తనదోవన తను వెళ్ళిపోతాడు. వరూథిని విరహంతో వేగిపోతూ ఉంటుంది. అంతలో పొద్దువాలుతుంది. సూర్యాస్తమయం. దాన్ని వర్ణించే పద్యం ఇది!

చం॥ తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యధా/ భర వివశాంగి నంగభవుబారికి నగ్గముసేసి క్రూరుఁడై/ యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ/ స్ఫురణవహించెనోయన నభోమణిదాల్చెఁ గషాయ ధీధితిన్‌.

శబ్దశక్తి తెలిసిన కవులు దాన్ని భావానుకూలంగా ఉపయోగించుకొంటారు అనేందుకు ఈ పద్యం ఉదాహరణ. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడంటే కోపంతో అతని మొహం ఎర్రబడిరదంట. ఎవరిమీద, ఎందుకా కోపమంటే, వరూధినిని అలా వదలి వెళ్ళిపోయిన ప్రవరుడి మీదట! ఇక్కడ సూర్యుడిని ఆలంబనంగా చేసుకుని పెద్దన ప్రవరుడిమీద తన కోపాన్ని ఘాటుగా వ్యక్తం చేసాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే కవిహృదయం తెలిసేది! కథలో పాత్రగా ప్రవరుడిని ఉదాత్తంగానే చిత్రించాలి, లేకపోతే కథ చెడుతుంది. అలా చెయ్యాలంటే ప్రవరుడు వరూధినిని తిరస్కరించాలి. కానీ అది రసికుడైన అల్లసానికి ఇష్టం లేదు. అంచేత సూర్యుడి మీద తోసాడు. సూర్యుడలా అనుకున్నాడనడంలో ఎంత చమత్కారం! ఔచిత్యం చెడకుండా, తన హృదయాన్ని వ్యక్తపరుస్తూ, పాఠకుడికి చమత్కారాన్ని పండిరచడం గొప్ప కవిత్వమే ఔతుంది.

అయితే ఈ పద్యం గొప్పదనం ఇక్కడితో ఆగిపోదు. ఇందులో ప్రతిపదాన్నీ ఎంతో సార్థకంగా ప్రయోగించాడు కవి. వరూధినికి వాడిన పదాలు చూడండి - తరుణి - లేత యవ్వనంలో ఉన్న స్త్రీ, అనన్య కాంత - వేరొకరిని వరించలేదు, తననే వరించిందయింది. అతిదారుణ పుష్పశిలీముఖ వ్యథాభర వివశాంగి - శిలీముఖం అంటే బాణం. పుష్పశిలీముఖుడు మన్మథుడు. అతి దారుణమైన మన్మథబాధతో వశంతప్పిన శరీరం కలది! అలాంటి ‘‘వరూధినిని ఆ మన్మథుడికి అధీనం చేసి క్రూరుడై తనదారిని తాను పోతాడా ఆ బ్రాహ్మణుడు!’’ అని తీవ్రమైన కోపాన్ని పూనాడా అన్నట్టుగా సూర్యుడున్నాడు. ఇది ఒక రకంగా పెద్దన కాలంనాటి సాంఘిక పరిస్థితులని కూడా సూచిస్తుంది. నిష్ఠాచారాలకన్నా భోగాలపై ప్రజలకి ఎక్కువ మక్కువ ఆ కాలానికే మొదలై ఉంటుంది.       

‘‘రోష భీషణ స్ఫురణ’’ - ఇక్కడ ‘‘ష’’కార ‘‘ణ’’కార ఆవృత్తి, ఎర్రరంగుకి వాడిన ‘‘కషాయ’’ అన్న పదం కూడా క్రోధాన్ని స్ఫురింపజేస్తున్నాయి. అలాగే ఈ పద్యంలో మొదటిపాదంలో యతి స్థానంలో ‘‘దారుణ’’ అన్న పదం చక్కగా ప్రయోగించాడు పెద్దన. యతి స్థానాన్ని పద్యాన్ని చదివేటప్పుడు సాధారణంగా కొంచెం వత్తి పలకడమో, దీర్ఘం తీసి పలకడమో చెయ్యాలి . ఇక్కడ ‘‘దారుణ’’పదాన్ని సాగదీసి పలికినప్పుడు అది ఎంత దారుణమో స్ఫురిస్తుంది. అలానే మూడవ పాదంలో ‘‘అహంకృతి’’ అన్న పదంలో యతిస్థానంలోని ‘‘హం’’ని వత్తి పలకడంవల్ల ఆ సూర్యుడి కోపం స్ఫురిస్తుంది!  ఈ విధంగా పెద్దన కవిత్వంలో అణువణువునా చక్కని ఔచిత్యం విరాజిల్లితూ ఉంటుందని చెప్పవచ్చు.

3. గుణౌచిత్యం:

కావ్యంలో ప్రస్తుతార్థానికి తగినట్లుగా గుణాలను కూర్చడం అవసరం. అలాంటి గుణాలే సౌభాగ్యమున్నవౌతాయి. సంభోగసమయంలో చంద్రుడు ఆనందాన్నందించినట్లు ‘గుణం’ రుచితమౌతుందని క్షేమేంద్రుడి అభిమతం. కావ్యంలో ప్రస్తుతార్థానికి తగినవిధంగా ఓజస్సు, ప్రసాదం, మాధుర్యం, సౌకుమార్యం మొదలైన గుణాలను కవి పోషిస్తే గుణౌచిత్యమౌతుంది.

3.1. ఓజోగుణం:

‘‘విలసిత సమాస భరితో/ జ్వల బంధంబోజమయ్యె’’   (కావ్యా.సం.4వ ఆశ్వా. 69వపద్యం) అని కావ్యాలంకారసంగ్రహంలో రామరాజభూషణుడు పేర్కొన్నాడు. ఈ గ్రంథలఘుటీకలో ‘‘ఎక్కువ సమాసాలు గలది ఓజము’’ అన్న వివరణ కనిపిస్తోంది. ‘‘గాఢబంధత్వమోజ:’’ అని ‘కావ్యాలంకార సూత్రవృత్తి’ ఓజోగుణాన్ని నిర్వచించింది.

తెలుగు కావ్యప్రబంధాల్లో దీర్ఘసమాసరచన సర్వసామాన్యం. అవతారిక నుండి ఆశ్వాసాంతగద్య, పద్యాలవరకు సమాస భూయిష్ఠరచనా విధానమంటే ప్రాచీనకవులకు అమితమైన ఇష్టం. అందువల్ల ఏ రసవత్తర ఘట్టాన్ని పరికించినా ఈ ఓజోగుణం తొణికిసలాడుతూనే ఉంటుంది. అయితే ఈ ఓజోగుణాన్ని కావ్యాల్లో ఔచిత్యవంతంగా కవులు పోషించారో లేదో తెలుసుకోవడానికి ఆలంకారికులు  ఒక మార్గాన్ని చూపించారు.

భరతముని రసచర్చననుసరించి ఉద్ధత, కోమలరసాలు రెండూ, రెండు విభిన్నమైన మార్గాల్లో సామాజికుడికి రసానందం కలిగిస్తాయి. దీన్ని బట్టి ‘‘ఓజోగుణమునకు వీర, రౌద్రములనుకూల రసాలు’’ అన్న సత్యం వెల్లడౌతోంది. ఈ రీతిగా ఉత్సాహ, క్రోధాలను ప్రదర్శించే సందర్భంలో ఓజోగుణం ఔచితీమంతంగా శోభిస్తుందని కావ్యాలు నిరూపిస్తున్నాయి. మనుచరిత్రలో స్వరోచికి ఇందీవరాక్షుడనే గంధర్వుడు తాను రాక్షసుడిగా మారిన శాపవృత్తాంతాన్ని  వివరిస్తాడు. ఈ సందర్భంలో రౌద్రరసం ఆవిష్కృతమైంది. ఇక్కడ రౌద్రరసాన్ని మరింత పరిపుష్టంచేస్తూ సమాసభూయిష్ఠ రచన కనిపిస్తుంది. బ్రహ్మమిత్రుడనే ముని ఆయుర్వేదవిద్యను శిష్యులకు బోధిస్తుంటాడు. గంధర్వుడైన ఇందీవరాక్షుడు ఆసక్తితో తనకావిద్యను ఉపదేశించమని మునిని అర్థిస్తాడు. కాని గంధర్వుడనే కారణంతో బ్రహ్మమిత్రుడు తిరస్కరిస్తాడు. ఇందీవరాక్షుడు ముని శిష్యుల్లో ఒకరిగా మారి, మోసగించి విద్యనభ్యసించి, ఆ తర్వాత మొత్తం విషయాన్ని వివరించగానే ముని కోపంతో ఇందీవరాక్షుణ్ణి శపిస్తాడు. ఈ సందర్భంలో ఓజోగుణం ఔచిత్యంతో శోభిల్లింది.

మ॥ అనినన్‌ గన్నులు జేవురింప నధరంబల్లాడ వేల్లత్పున:/ పునరుద్యద్భ్రుకుటీ భుజంగయుగళీ ఫూత్కారఘోరానిలం/ బున నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకంబందంద ఘర్మాంబువుల్‌/ చినుకన్‌ గంతు దిదృక్షురూక్ష నయనక్ష్వేలా కరాళధ్వనిన్‌ (5వ ఆశ్వా. 18వ పద్యం)

బ్రహ్మమిత్రుడికి కోపంతో కళ్ళెర్రబడ్డాయి. పెదాలదిరాయి. భ్రుకుటి ముడి పడిరది. విడిచే నిట్టూర్పులు రెండుపాముల ఫూత్కారాన్ని తలపిస్తున్నాయి. మన్మథుణ్ణి చూసి సింహధ్వని చేసిన శివుడి భయంకరార్భటి అన్నట్లు కంఠమెత్తాడు బ్రహ్మమిత్రుడు. ‘వేల్లత్పున: పునరుద్యద్భ్రుకుటీ భుజంగయుగళీ ఫూత్కారఘోరానిలంబు’ అన్న సమాసం లోను, ‘కంతుదిదృక్షురూక్షనయన క్ష్వేళాకరాళధ్వనిన్‌’ అన్న సమాసంలోనూ రౌద్రభావన నిక్షిప్తమై ఉంది.

మాటిమాటికీ ఎగిరిపడుతున్న భ్రుకుటి అనడంలో మెలికలుపడ్డ కను బొమలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో రెండుపాముల భయంకరమైన ఫూత్కార ధ్వని, శివుడికి చిక్కిన మన్మథుడిలా - బ్రహ్మమిత్రుడికి ఇందీవరాక్షుడు చిక్కడం చాలా రౌద్రస్ఫూర్తిని కనబరుస్తున్నాయి. చిన్న చిన్న పదాలతో బ్రహ్మమిత్రుడి కోపాన్ని వర్ణించవచ్చు. కానీ ఈ దీర్ఘసామాసికరచన సందర్భోచితంగా రౌద్రరసాన్ని మరింతగా వెల్లడిచేస్తోంది. అందువల్ల ఈ పద్యంలో ఓజోగుణౌచిత్యం రాజిల్లిందని చెప్పవచ్చు.

3.2 మాధుర్యగుణం:

‘‘సరసములగు వాక్యంబులు/ వరుసను వేర్వేఱ మించువగ మాధుర్యంబు’’ (కావ్యా. సం. 4వ ఆశ్వా. 60వపద్యం) అని కావ్యాలంకారసంగ్రహంలో పేర్కొన్నారు. వాక్యంలో పదాలు వేరు వేరుగా ఉండడం మాధుర్యగుణమౌతుందని లఘుటీకలో బులుసు వేంకట రమణయ్య వివరణ.

‘‘చిత్తద్రవీభావమయోహ్లాదో మాధుర్యమిష్యతే’’ - కోమలరచనతోకూడిన శృంగార, కరుణ, శాంత, రసాలను ఆస్వాదించేటప్పుడు చిత్తానికి కలిగే ఆనందం(ద్రవీభావం) మాధుర్యం.

విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో గుణాలస్వరూపాల్ని, అవి ఏ ఏ రసాల్లో ఎలా ప్రవర్తిస్తాయో ఆ క్రమాన్ని చెప్పి, ఏ ఏ గుణాలు ఎలాంటి రచనలో ఉండాలో కూడా చెప్పి ఆ క్రమాన్ని వివరించాడు.

మనుచరిత్రలో మాధుర్యగుణం ఎక్కువగా కనిపిస్తుంది. మాధుర్యగుణౌచిత్యానికి శృంగారరస భూమికగా చక్కటి ఉదాహరణ ఇది.

ఉ. ‘‘ఎన్ని భవంబులన్‌ గలుగు నిక్షుశరాసన సాయకవ్యథా/ ఖిన్నత వాడి వత్తలయి కేలఁ గపోలములూఁది చూపులన్‌/ పిన్నఁదనంబు దోఁపఁగనువేఁదుఱునన్‌ బయిగాలి సోకినన్‌/ వెన్నవెలన్‌ గరంగునలివేణులఁ గౌఁగిఁటఁ జేర్చుభాగ్యముల్‌’’ (2వ ఆశ్వా. 57వ పద్యం)

తమంతటతాముగా వలచి, వలపుతో చిక్కి, చూసినంతమాత్రాన కరిగి పోయే స్త్రీలు పురుషుడికి వేయి జన్మలెత్తినా లభించడం అరుదని వరూథిని ప్రవరుడితో శృంగారరసోచితంగా సరసమైన వాక్యాల్లో పలికింది.

ఈ పద్యంలోని ‘ఇక్షుశరాసన సాయక వ్యథా ఖిన్నత’ అన్న సమాసం తప్ప మిగతా పదాలు అన్నీ వేరు వేరుగా ఉన్నాయి. ఈ విధంగా మాధుర్యగుణాన్ని పోషిచడంద్వారా వాక్యరచన ఔచిత్యశోభితమైంది.

3.3 ప్రసాదగుణం:

‘‘... ప్రసిద్ధ పదంబుల / నలఘూక్తి ప్రసాదమయ్యె’’ (కావ్యా. సం. 4వ ఆశ్వా. 57వ పద్యం)

శీఘ్రంగా అర్థాన్ని బోధించే పదాలుండడం ప్రసాదగుణం. వెంటనేబోధపడే పదాలుంటే దానిని ప్రసాదగుణం అనవచ్చు. ‘ప్రసాదవత్ప్రసిద్ధార్థమ్‌’ అని కావ్యాదర్శం. ‘సప్రసాద: సమస్తేషు రసేషు రచనానుచ’ అని సాహిత్యదర్పణం. ప్రసిద్ధార్థమైన రచన-ప్రసాదగుణభరితమౌతుంది. ప్రసాదగుణంతో కూడిన రసం శుష్కేంధాగ్నిలాగ, నీటిలాగ తటాలున వ్యాపించి సామాజికుడికి చిత్త వికాసం కల్గిస్తుందని ఆనందవర్థన, విశ్వనాథుల నుడి.

 ఉ॥      కమ్మనికుందనంబు కసుగందని మే నెలఁదేటి దాఁటులన్‌/ బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెఁడు వెండ్రుక లిందుబింబమున్‌/ గిమ్మననీదు మోము గిరిక్రేపులు మూఁపులు కౌను గానరా/ దమ్మకచెల్ల! వాని వికచాంబకముల్‌ శతపత్రజైత్రముల్‌ (3వ ఆశ్వా. 6వ పద్యం)

శైలశిఖరాలంతటి భుజాలుండడం సౌందర్యాతిశయం. శరీరం పరిమళ భరితమైన మేలిమి బంగారం. తుమ్మెదల్లాంటి నల్లని, పొడవయిన వెంట్రుకలు, చంద్రుడిలాంటి ముఖం, తామరల్లాంటి విశాలమైన కళ్ళు ఉన్నతమైన పర్వతాల్లాంటి భుజాలు అంటూ ప్రవరుడి సౌందర్యాన్ని వరూధిని ప్రస్తుతిస్తోంది.

ఈపద్యంలో ఉపయోగించిన పదాలు, పరస్పరభావాలు లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. అందువల్ల ఇక్కడ ప్రసాదగుణం వేగంగా అర్థాన్ని బోధిస్తూ, ఔచిత్యశోభితమైంది.

3.4 సౌకుమార్య గుణం:      

‘‘అరయగ బొట్లు పిఱుందుల/ నరుదగునది సౌకుమార్యము’’           (కావ్యా.సం.4వఆశ్వా.60వ పద్యం)

నిండుసున్నలతో కూడిన కోమలాక్షరాల కూర్పు ‘సౌకుమార్యగుణం’ ఔతుందని నరసభూపాలీయం. ‘అపారుష్యమ్‌ సౌకుమార్యమ్‌’ అని వామనుడు చెప్పాడు. ‘అపారుష్యమ్‌’ అనడంలో ‘ంక,ంచ, ంట, ంత, ంప’లు సౌకుమార్యగుణానికి లక్ష్యాలుకావు. ‘ంగ, ంజ, ండ, ండ, ంద, ంబ’లు సరళాలు కాబట్టి కోమలత్వాన్ని తెలుపుతూ ఔచిత్యవంతంగా ఉంటాయి.           మనుచరిత్రలో 2వ ఆశ్వాసంలో 3వ పద్యమైన ‘అటజని కాంచె భూమిసురుడు....’ పద్యంలో ‘అంబర’, ‘చుంబి’ ‘అభంగ’, ‘తరంగ’ ‘మృదంగ’అనే పదాల్లో బిందుపూర్వకమైన సరళాక్షరాల ప్రయోగముంది. ఇదే సౌకుమార్యగుణం.

ఈ విధంగానే మరో సందర్భంలో...

సీ॥ ‘‘గంగాతంరగిణీ రంగత్తరంగశీ/ కరశీతసైకతోత్కరములందు/ మందార మాకంద మకరంద తుందిలేం/ దిందిరానందకృన్నందనములఁ/ గాంత నిశాకాంత కాంతవిర్థికా/ క్రాంత భూభృద్బృంద కందరముల’’ (6వ ఆశ్వా. 62వ పద్యం) ఈ పద్యంలో బిందు పూర్వకమైన సరళాక్షరాలు ఔచిత్యవంతంగా శబ్దాలంకారభరితంగా శోభిల్లాయి. అందువల్ల ఇది సౌకుమార్యగుణౌచిత్యం.

4. అలంకారౌచిత్యం:

ప్రబంధాలు అలంకారప్రధానాలు. ‘ఆలంకారికశైలి వీని యందు విశేషము’ అని శ్రీ కాకర్ల వెంకటరామనరసింహం అభిప్రాయపడ్డారు. ప్రతిపద్యంలో, సన్నివేశంలో, సంభాషణలో శతాధికమైన అర్థాలంకారాలు, షడ్విధ శబ్దాలంకారాలు కనిపిస్తూనే ఉంటాయి. ‘‘అలంకారాస్త్వలంకారా: గుణాఏవ గుణాస్సదా’’ అని క్షేమేంద్రుడన్నాడు. అలంకారాలైనా గుణాలైనా సందర్భోచితంగా ప్రయోగిస్తేనే శోభిస్తాయి. లేకపోతే ఎలాంటి రచనైనా కృత్రిమంగా ఉంటుంది.

ప్రస్తుతార్థానికి తగినట్లుగా ఉండే ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం మొదలైన అలంకారాలు కావ్యానికి ఔచిత్యశోభను చేకూరుస్తాయని క్షేమేంద్రుడి మాట. ఉదాహరణగా శ్రీహర్షుడి ‘రత్నావళి’ నుండి ‘‘విశ్రాంత విగ్రహకథో రతిమాన్‌ జనస్య’’ అన్న శ్లోకాన్ని పేర్కొన్నాడు. ఇది మదనోత్సవ సమయంలో అంత:పురానికి వస్తున్న వత్సరాజు వర్ణన. నాయకుణ్ణి మన్మథుడితో ఉపమించడం ప్రస్తుతశృంగార రసానికి అనుగుణంగా ఉండడంచేత ఇది అలంకారౌచిత్యానికి లక్ష్యంగా పేర్కొన్నాడు.

4.1 శబ్దాలంకారం:

ప్రవరుడు హిమాలయానికి వెళ్ళిన సందర్భాన్ని తెలియజేసే ఈ కింది పద్యంలో శబ్దాలంకారం తగినవిధంగా ఉంది.

          కం॥     ఆమందిడి యతడరిగిన/ భూమీశుండరిగె తుహిన భూధర శృంగ

                  శ్యామల కోమల కానన/ హేమాఢ్యదరీఝరీ నిరీక్షాపేక్షన్‌.  (1వ ఆశ్వా. 79వ పద్యం)

ప్రవరుడు హిమాలయాన్ని చూడాలనే కుతూహలంతో సిద్ధుడిచ్చిన లేపనాన్ని పాదాలకు పూసుకుని వెంటనే తుహినభూధరమార్గం పట్టాడు. ‘శ్యామల- కోమల’, ‘దరీ-ఝరీ’, ‘నిరీక్ష - అపేక్ష’  మొదలయిన పదాల్లో చక్కని అనుప్రాస ఉంది. ఇక్కడి అలంకారం హిమవన్నగసోయగాలను ఆవిష్కరిస్తోంది. అక్కడి పర్వతాల - లోయల ఎత్తుపల్లాలను, దుర్గమమైన అడవుల్లో ఉండే సంక్లిష్టతను ఈ పదాలు ధ్వనింపజేస్తూ, కళ్ళకుకట్టినట్లు చూపిస్తున్నాయి. ప్రస్తుత హిమాలయాల వర్ణనకు పరిపుష్టిని చేకూరుస్తూ ఈ శబ్దాలంకారం ఔచిత్యవంతమైంది.

4.2 అర్థాలంకారం:

అలంకారవిషయంలో పెద్దన ఉచితస్థానదృష్టితోనే ప్రవర్తించినట్లు రెండు ఉదాహరణలు చూస్తే తెలుస్తోంది. మాయాప్రవరుణ్ణి దూరంనుండి వరూథిని చూసి పొదలమాటున పొంచి, సమీపించి అతని ఉత్తరీయం పట్టుకుని కన్నీరుకార్చి, రాత్రిపొందిన విరహవేదన చెప్పి-

శా॥     రా వైరాగ్యముఁబూని నీవు కడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్‌/ రావైతేఁ జవి గాని యిందులకు హోరాహోరిగాఁ బోరి యే/ లా వాలాయము సేయఁగా బ్రదుకు నీవాచారవంతుండవై/ చావో యెక్కుడొ నీయెడన్‌ బొడము వాంఛనన్‌ భూసురగ్రామణీ’’ (3వ ఆశ్వా. 94వ పద్యం). ‘‘బ్రదుకు నీవాచార వంతుడవై - (నాకు) చావో యెక్కుడొ నీయెడన్‌ బొడము వాంఛన్‌’’ అన్న వాక్యంలో ఆక్షేపాలంకారాన్ని పెద్దన సారవంతంగా పోషించాడు.

శ్లో॥ ఆక్షే-పోన్యో విధౌ వ్యక్తే నిషేధే చ తిరోహితే ।/ గచ్ఛగచ్ఛసి చేత్కాంత! తత్రైవస్యాజ్జని ర్మమ ॥  (చంద్రా. 70వ శ్లో.)

నాయకుడు వెళ్ళడం నాయికకు ఇష్టంలేకపోయనా నిషేధం వ్యక్తం చేయకుండా వెళ్ళడమే తన అభీష్టంగా చెప్పడం ఈ అలంకారానికి లక్ష్యంగా శ్లోకంలో కనిపిస్తోంది. కానీ వెళ్ళడం ఇష్టం లేదన్న విషయం అన్యాపదేశంగా వ్యక్తమైంది.‘‘నువ్వు లేకపోతే నేను జీవించను. కాబట్టి నువ్వు వెళ్ళకు’’ అన్న భావం నిగూఢంగా ఉంది. అంటే ఇష్టం లేని విషయాన్ని అంగీకరించడం, ఇష్టమైన విషయాన్ని నిషేధించి చెప్పడం ఆక్షేపాలంకారంగా చెప్పవచ్చు.

వరూధిని మాయాప్రవరుడ్ని చూసిన వెంటనే తను అనుభవించిన విరహవేదనను చెప్పి, ‘సదాచార వంతుడిగా నువ్వు హాయిగా ఉండు. నాకు చావో, అంతకంటే ఎక్కువైనదో దొరుకుతుందిలే’ అని పలికింది. నిరాకరించి వెళ్ళిపోవడం తనకు ఇష్టంలేని విషయం. అయినప్పటికీ అంగీకరిస్తున్నట్లు, అలాగే చావో అంతకన్నా ఎక్కువో వస్తుందనడం నిషేధమైన, ఇష్టంలేని అంశం. కానీ అది ఐచ్ఛికమైన అంశంగా వరూథిని చెప్పింది. ఈ విధంగా సందర్భోచితంగా ఆక్షేపాలంకారం ఉండడంవల్ల ఈ సంభాషణ ఔచితీమంతమైంది.

ఈ ప్రబంధంలో పెద్దన అలంకారప్రీతిని గణిస్తే అతిశయోక్తులు 55, స్వభావోక్తులు 58 చోట్ల కనిపిస్తాయి. దీనిబట్టి చూస్తే మిగతా అలంకారాలకంటే పెద్దన స్వభావోక్తికి ఎక్కువ ప్రాధన్యమిచ్చినట్లు తెలుస్తోంది.

5. ముగింపు:

పెద్దనాదులు ఔచిత్యపోషణకు పెద్దపీట వేశారు. పెద్దన కవిత్వంలో అనౌచిత్యాలంటూ వివిధ విమర్శల్లో, ప్రసంగాల్లో కొందరు ప్రస్తావిస్తూ ఉంటాయి.

తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి; ఈ నాళుల వ్రాసిన కవిదోషము” అని విశ్వనాథవారన్నట్టు– ఆనాటి కవులు సర్వవ్యుత్పన్నతాసార్వభౌములన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు. వారి రచనల్లో దోషాలు ఎత్తి చూపే ప్రయత్నం మన అజ్ఞానాన్నే బయటపెడుతుందని కవిసమ్రాట్ తాత్పర్యం.

క్షేమేంద్రుడు పేర్కొన్న 27 ఔచిత్యరీతులనూ ఆకలింపు చేసుకుని, ప్రబంధకవులు ఎంతో గౌరవపురస్సరంగా వారి వారి కావ్యాల్లో సందర్భవశాత్తు ఉపయోగించారన్నది వాస్తవం.

పెద్దన కవిత్వంలో గుణ, అలంకార ఔచిత్యాలతో పాటు, పద, వాక్యాది ఔచిత్యాలు కూడా రసరమ్యంగా కొలువుదీరి ఉన్నాయని ఘంటా-పథంగా చెప్పవచ్చు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గోపాలకృష్ణ, రెంటాల. మనుచరిత్ర (వచనం). జయంతి పబ్లికేషన్స్, విజయవాడ, 2013.
  2. దామోదరనాయుడు, గార్లపాటి. మనుచరిత్ర – మనచరిత్ర. నాలుగవ ప్రపంచతెలుగుమహాసభల ప్రచురణ. తెలుగు అకాడమి, హైదరాబాద్, 2012.
  3. నరసింహారావు, ఎం.వి.ఎల్. కావ్యపరిచయాలు – మనుచరిత్ర. ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమి. హైదరాబాద్, 1974.
  4. విశ్వనాథ కవిరాజు. సాహిత్యదర్పణ. రాష్ట్రీయసంస్కృతసంస్థాన్, భోపాల్.
  5. వేంకటరమణయ్య, బులుసు (టీక). కావ్యాలంకారసంగ్రహం. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి. 1958.
  6. శ్రీరామచంద్రుడు, పుల్లెల (వ్యా). ఔచిత్యవిచారచర్చా, కవికంఠాభరణమ్, సువృత్తతిలకమ్. సురభారతి, హైదరాబాద్, 1983.
  7. సత్యనారాయణ, కాశీభొట్ల. ఆంధ్రకవుల ఔచిత్యవిచారణ. నవజ్యోతి ప్రెస్, నర్సాపురం. 1973.
  8. సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల (పీఠిక). మనుచరిత్రము. వెంకట్రామా అండ్ కో. హైదరాబాద్, 1969.
  9. స్ఫూర్తిశ్రీ, చంద్రాలోక సమున్మేషము. వికాస్ ప్రెస్, గుంటూరు, 1981.
  10. హేమచంద్రుడు. కావ్యానుశాసన. మొదటిసంపుటం. శ్రీమహావీరజైన విద్యాలయ, బొంబాయి, 1938.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "మే-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-ఏప్రిల్-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "మే-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]