ఔచిత్యమ్ పరిశోధన మాసపత్రిక ఆరవ వార్షికోత్సవ సంచిక
9. నందిని సిధారెడ్డి బందారం కథలు: శైలీశాస్త్ర ప్రక్రియలు
|  | కొలుపుల ప్రశాంత్ పరిశోధక విద్యార్థి, భాషాశాస్త్ర విభాగం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి ప్రాంగణం హైదరాబాదు, తెలంగాణ. |
| |
Abstract
నందిని సిధారెడ్డి రచించిన 'బండారం కథలు' సంపుటిని కేంద్రంగా చేసుకుని, ఈ పరిశోధనా వ్యాసం కథా సాహిత్యంలో శైలీ ప్రక్రియల (Stylistic Devices) వినియోగాన్ని విశ్లేషిస్తుంది. కథనంలో పాఠకుల ఆసక్తిని, ఉత్సుకతను పెంచేందుకు రచయిత అనుసరించిన భాషాశైలి, వర్ణనాత్మక పునరావృత్తి, పదక్రమ రీతులు, వాక్యనిర్మాణ పద్ధతులను శాస్త్రీయంగా పరిశీలించడం ఈ పరిశోధన ముఖ్యోద్దేశం. సాహిత్య విశ్లేషణలో శైలీశాస్త్ర ప్రాధాన్యతను గుర్తించడం, కథా వస్తువును పాఠకులకు మరింత చేరువ చేయడంలో శబ్దాలంకారాల పాత్రను వివరించడం ఈ అధ్యయన ఆవశ్యకత. పరిశోధనలో భాగంగా నందిని సిధారెడ్డి కథలను ప్రాథమిక వనరులుగా స్వీకరించి, భాషాశాస్త్రవేత్తలు లీచ్ (Leech), జాకబ్సన్ (Jacobson) వంటి వారి సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించడమైంది. వృత్యానుప్రాస, పదమధ్యానుప్రాస, ధ్వన్యనుకరణ, అనాఫోరా, ఎఫిస్ట్రోఫి, యమకానుప్రాస వంటి శైలీ ప్రక్రియలను ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది. ఈ పరిశోధనలో పరిమిత వనరుల లభ్యత ఒక సవాలుగా నిలిచినప్పటికీ, కథా సాహిత్యంలో శైలీ వైవిధ్యంపై స్పష్టమైన ఫలితాలను సాధించడమైంది. ఈ అధ్యయనం సమకాలీన సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు భాషాశాస్త్ర కోణంలో కొత్త మార్గాలను చూపుతుంది. భవిష్యత్తులో సిధారెడ్డి కథల్లోని మాండలిక ప్రయోగాలు, సామాజిక జీవన చిత్రణపై మరిన్ని లోతైన పరిశోధనలు చేసేందుకు ఈ వ్యాసం పునాదిగా నిలుస్తుంది.
Keywords: శైలీశాస్త్రం, భాషాశాస్త్రం, ప్రసంగం, కథనస్వరం, చిత్రణ, గతస్మృతి, అనిశ్చితి, సామాజికవాస్తవికత.
శైలీ ప్రక్రియలు - (Stylistic Devices)
1. వర్ణనాత్మక పునరావృతి
ఈ భాగంలో పదారంభ, పదమధ్య, పదాంత్య అక్షర పునరావృతిని మనం గమనించగలం.
1.1 వృత్యానుప్రాస
ఒకటిగాని అంతకుమించి గాని హల్లులు పెక్కుమార్లు వచ్చుట వృత్యానుప్రాసగా పేర్కొనబడుతుంది.
“ఒకటిగాని అంతకుమించి గాని హల్లులు పెక్కుమార్లు వచ్చుట వృత్యానుప్రాసగా పేర్కొనబడుతుంది. (వెంకటశాస్త్రి 1967:1) ఒకే హల్లు పల్లుమార్లు అవృత్తమగుట వృత్యానుప్రాసము.”
ఈ ప్రాసలో ఒక పదం ముందట వచ్చిన అక్షరం వెనువెంటనే పునరావృత్తి చెందుతుంది. బందారం కథలలో ఈ ప్రక్రియలోని ఉదాహరణలు ఈ క్రింద ఉదహరించడమైంది.
- ఏండ్ల వయసున్న యాపచెట్టు కొమ్మలకు ఎన్నెన్నో ముడులు. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 22)
- ఊరు ఊపిరి పీల్చుకున్నది. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 25)
- పండుగొచ్చిందంటే చాలు పడుచువాళ్లంతా పోటీ పడతారు. (కుంజీ, పుట సంఖ్య: 45)
- రాక రాక అల్లుడొచ్చాడని రాచమర్యాదలు జరుగుతున్నాయి. (కుంజీ, పుట సంఖ్య: 47)
1.2 పదమధ్యాను ప్రాస
పదంలోని మధ్యాక్షరం ముఖ్యంగా రెండవ అక్షరం పునరావృతమవుట పదమధ్యానుప్రాసగా ఆ వాక్యానికి ఒక చక్కటి లయను సమకూరుస్తుంది. పాఠకులు ఆ కథను చదువుతున్నప్పుడు ఆ పదంలోని లయ వారికి తెలియకుండానే ఒక చక్కటి భావాన్ని కలిగిస్తుంది.
- ఇంతలోనే కరువొచ్చి చెరువులెండిపోయాయి. (జంజాటం, పుట సంఖ్య: 33)
- వాడంతా వ్యవహారం తెలిసింది. ఊరంతా వెటకారం చేసింది. (జంజాటం, పుట సంఖ్య: 37)
- అవే ముతక బట్టలు. అవే ముతక మాటలు. (బంగారు గురిగి, పుట సంఖ్య: 61)
1.3 పదాంత్యానుప్రాస
ఈ ప్రక్రియలో పదం చివర్లో అక్షరపునరావృతి కనిపిస్తుంది. నందిని సిధారెడ్డి బందారం కథలలోని కొన్ని ఉదాహరణలు.
- నీళ్ళొచ్చినా, కన్నీళ్ళొచ్చినా, దోషమొచ్చినా, ఆఖరుకు రోషమొచ్చినా ఊరును పట్టతరంగాదు. (తడిసి మోపెడు)
1.4 వాక్యాంతానుప్రాస
వాక్యాంత్యానుప్రాసలో అనేక రచయితలు, రెండు వాక్యాల చివర్లో అక్షర పునరావృతిని అవలోకగా తీసుకువస్తారు. వాక్యాల చివర్లోని ఈ అక్షర / శబ్ద పునరావృతి ద్వారా ఆ వాక్యానికి మరింత ఆకర్షణతో పాటు పై వాక్యం, క్రింది వాక్యం, ఆ తరువాతి వాక్యానికి కూడా ఒక చక్కటి లయ, అర్థసంబంధాలు ఏర్పడతాయి. ఆంగ్ల రచయితలు Jacobson (1960), Chatman (1960) వాక్యాంత్యాను ప్రాసపై విశేషమైన పరిశోధనలు చేసారు. ఈ ప్రాసలో ప్రాస ఒక అక్షరానికి కాకుండా రెండు అక్షరాలు రెండు వాక్యాల చివర్లో ధ్వనించేదిగా ఉంటుంది.
- చీకటిని అదరగొడ్తూ దీపాలు వెలుగుతున్నాయి. దిక్కులను ఎగిరిస్తూ దప్ప్పులు మోగుతున్నాయి. (శానతనం, పుట సంఖ్య: 54)
- నిలువదు నిలువదు కాయం. ఇది నిమిషం లోపల మాయం. (బాకీ, పుట సంఖ్య: 120)
- సంతాన వ్రతం చేసింది. పుట్టలో పాలుపోసింది. గుళ్ళల్లో నిద్ర చేసింది. (ఎటమటం, పుట సంఖ్య: 135)
1.5 ధ్వన్యానుకరణ
భాషలోని కొన్ని పదాలు ధ్వనిని అనుకరిస్తూ దాని సారూప్యతను గుర్తు చేస్తుంటాయి. ఇలా ధ్వనిని అనుకరించే ప్రక్రియను “ధ్వన్యనుకరణ”గా మనం నిర్వచించుకోవచ్చు. శబ్ద రమ్యత కలిగిన ఈ క్రింది ఉదాహరణలో రచయిత చెప్పాలనుకొన్న ఆ విషయాలన్నీ పాఠకులు శబ్దతీవ్రతను బట్టి గ్రహించడం జరుగుతుంది.
- శివుని పాదాల ప్రతిమ ఉన్న రాయి దగ్గర బిందె తళతళ మెరుస్తున్నది. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 26)
- ఆ పీరి ఎత్తుకున్న కనకయ్య పూనకం పెరిగి వారుగట్టెతో చటాచటా కొట్టుకున్నాడు. (శానతనం, పుట సంఖ్య: 51)
- దోస్తులతో గుసగుస పెట్టాడు. (శానతనం, పుట సంఖ్య: 56)
- చీకటి పడే సమయానికి దడదడమని ఒక్కసారే కుమ్మరించింది. (తడిసి మోపెడు, పుట సంఖ్య: 77)
2. శైలి లోని పదక్రమ రీతులు
భాషాశైలి, వర్ణ సముదాయముతో పాటు ఒక స్వచ్ఛమైన పద విశ్లేషణను కూడా అందిస్తుంది. పై భాగంలోని వర్ణక్రమ రీతులలాగే ఈ భాగంలో కూడా పదక్రమ రీతులలో పునరావృతమయ్యే ప్రక్రియలను విశ్లేషించడమౌతుంది. అయితే ఇవన్నీ పదక్రమ రీతులుగా ఉంటాయి. పదాల మధ్య ఏ ఇతర అంతరాయాలు లేని పునరావృత్తిని ఈ భాగంలో మనం గమనించవచ్చు. పదబంధాల మధ్య ఇంకే ఇతర పదాలు రాక అవే పదాల వెనువెంటనే పునరావృత్తమయ్యే ఈ ప్రక్రియను గ్రీకులో Epezeuxis అని అంటారు. ఒక పదాన్ని పదేపదే వెంటవెంటనే పునరావృతి చేయడం వల్ల రచయితలు ఆ పదానికున్న అర్థాన్ని మనం గ్రహించేటట్లు, లేదా దానిని మనం జ్ఞాపికలో ఉంచుకొనేటట్లు చేసే ప్రయత్నాన్ని చేస్తారు.
2.1 అదే అర్థంతో పునరావృతమయ్యే పదాలు
వాక్యంలోని అర్థస్థిరత్వం కోసం వెనువెంటనే పునరావృతమౌతున్న పదం అదే అర్థంతో మళ్ళీ పునరావృతమవుతుంది.
- నడుచుకొంటూ నడుచుకొంటూ ఒడ్డుకు చేరాడు. (తడిసి మోపెడు, పుట సంఖ్య: 83)
- కడుపు కట్టుకొని కట్టుకొని నొప్పి పెరిగితే చీర బిగదీసి కడుపుకు కట్టుకొని కట్టుకొని లోకం విడిచింది. (జంజాటం, పుట సంఖ్య: 34)
- రెండు పీరీలకు పెద్దపెద్ద కొమ్ములున్నాయి. (శానతనం, పుట సంఖ్య: 51)
- పటువ మీద చిన్నచిన్న రంగు బిందువులు పడి అందంగా మెరుస్తున్నాయి. (శానతనం, పుట సంఖ్య: 53)
2.2 అదనపు అర్థంతో పునరావృతమయ్యే పదాలు
ఒక వాక్యంలో వెనువెంటనే పునరావృతమవుతున్న పదం అదే అర్థంతో కాకుండా అదనపు అర్థంతో పునరావృతమవుతుంది. ఈ అదనపు అర్థం పద పునరావృతితో లేక వాక్య పునరావృతితో మరో అర్థాన్ని అందిస్తుంది.
- వానదేవుడు తిరుగుతూ తిరుగుతూ వచ్చి పడమటి పట్టణంలో రాజు కూతురు పాపమ్మను మోహించాడు. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 23)
- లక్ష్మి మీద చిల్లర పైసలు, ప్యాలాలు, పూలు కలిపి గుప్పెడు గుప్పెడు వెదజల్లుతున్నారు. (ఋణానుబంధాలు, పుట సంఖ్య: 29)
- ముంతెడు ముంతెడు నీళ్ళతో తడుపుకొని తడిబట్టలతో ఇంటింటికీ తిరుగుతున్నారు. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 22)
3. స్థానానుగత పద పునరావృత్తి
ప్రముఖ ఆంగ్ల సాహితీ వేత్త Leech, 1970 ప్రకారం, ‘పునరావృత్తి’ ఒక విషయాన్ని నొక్కి చెప్పడమే కాకుండా ఆ విషయాన్ని సాధ్యమైనంత వరకు మన స్మరణలో ఉంచుతూ దాని ఆంతర్యాన్ని విషదపరుస్తుంది. ఈ భాగంలో శైలీ విశ్లేషణలో ఒక క్రమాన్ని అనుసరించి పునరావృతమయ్యే ప్రక్రియలను అధ్యయనం చేయడం జరిగింది.
3.1 ప్రథమ పద పునరావృత్తి
అనాఫోరా అనే పదం 16వ శతాబ్దంలో ఆదిమ గ్రీకు నుండి ఉద్భవించిన పదం. అనా అంటే వెనుకనుండి అని, ఫీరిన్ అంటే మోసుకెళ్ళడం లేదా దానిని తీసుకెళ్ళడం అని అర్థం. వెనుకనున్న అర్థాన్ని లేదా ఒక విషయాన్ని ముందుకు ప్రత్యక్షపరచి దానిని నొక్కి చెప్పడం దీని ప్రత్యేకత. ఆంగ్లకవులు, తెలుగు కవులు కూడా ఈ ప్రక్రియను వారి రచనల్లో విస్తృతంగా వాడినట్లు గమనించగలం. ప్రథమ పదంలో అర్థ ప్రాముఖ్యత లేదా చెప్పదలచుకున్న ఆ అర్థ విశిష్టత మనకు కనిపిస్తుంది.
- ఎవరూ తినలేదు. ఎవరూ దీపం ముట్టించలేదు. (జంజాటం, పుట సంఖ్య: 36)
- అదొక వేడుక. అదొక జోష్. (శానతనం, పుట సంఖ్య: 53)
- మళ్ళా ఆలింగనాలు, మళ్ళా ముచ్చట్లు, మళ్ళా బాకి, మళ్ళాగొర్లు, మళ్ళా కల్లు, మళ్ళా పాటలు, మళ్ళా ధూలా మరి అదే ఊరు. (బాకీ, పుట సంఖ్య: 120)
3.2 అంత్యపద పునరావృత్తి
ప్రథమ పద పునరావృతి (అనాఫోరాలో) పద విశిష్టతను ప్రథమ పదంలో వ్యక్తీకరిస్తే, అంత్య పద పునరావృతి (ఎఫిస్ట్రోఫిలో) వాక్యం చివర్లోని పదంలో ఈ విశిష్టత మనకు కనిపిస్తుంది. ప్రతి వాక్యంలోని చివర్లో వరుసగా ఈ పదపునరావృతి జరుగుతుంది. ఎఫిస్ట్రోఫి అనే పదం కూడా గ్రీకు భాష నుండి వచ్చినదే. Epistrophe ని antistrophe లేదా epiphora అని కూడా పిలుస్తారు. వాక్యంలోని చివరి పదంలో పునరావృతమయ్యే పదం ఆ పద విశిష్టతను చాటుతుంది.
- పక్షుల దాహం తీరటంలేదు. పశువులకు మేతలేదు. ఎన్ని బావులు గాలించినా చుక్కనీరు లేదు. ఇక మనుషులు సంగతి చెప్పనక్కరలేదు. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 21)
- బాధొచ్చినా తత్త్వమే. కోపమొచ్చినా తత్త్వమే. (జంజాటం, పుట సంఖ్య: 34)
- కొమురెల్లి చూపుల్లో మంట. ఊపందుకున్న మంట. (శానతనం, పుట సంఖ్య: 55)
3.3 మధ్య పద పునరావృత్తి
ఒక వాక్యంలోని మధ్యపదం మళ్ళీ 2వ వాక్యంలో పునరావృతమగుట ఈ ప్రక్రియలో గమనించవచ్చు.
- రామవ్వ అందెలు పట్టిందంటే అదొక సంగీతం, కంఠం ఎత్తిందంటే అదొక పాట. (కళకు కన్నీళ్ళే, పుట సంఖ్య: 152)
3.4 యమకానుప్రాస
తెలుగు వ్యాకరణంలో యమకానుప్రాస అనే నామకరణంలోని పునరావృత ప్రక్రియ ఇది. వాక్యంలోని చివరి పదం మరుసటి వాక్యంలో వెనువెంటనే మొదటిపదంగా పునరావృతమౌతుంది. ఈ ప్రక్రియ కూడా గ్రీకు నుండి ఉద్భవించినదే (అనాడిఫ్లోసిస్). వాక్యం చివర్లోని పదాన్ని వినేవారి ఉనికికోసం రచయితలు వెనువెంటనే ఆ మరుసటి వాక్యం మొదట్లోకి తీసుకువెళ్తారు.
- పాటకు తగిన దరువు. దరువుకు తగిన అడుగులు. అడుగుల మించి ఊపు. ఊపుకు మించి పాట. (శానతనం, పుట సంఖ్య: 55)
- విశాలమైన అరుగు. అరుగును ఆనుకొని మరో అరుగు. (చెడ్డ గడియ, పుట సంఖ్య: 74)
- గుడి సమీపంలో చిన్న వొర్రె. వొర్రె ఇసుకలోకి దిగగానే బోనాలెత్తుకొన్న వాళ్ళ కాళ్ళు చుర్రుమన్నాయి. (ఆమె సుతా ఒక తల్లే, పుట సంఖ్య: 139)
4. శైలిలోని వాక్యనిర్మాణ రీతులు
శైలిలోని పునరావృత్తి ప్రక్రియను వాక్య నిర్మాణ రీతుల కోణం నుండి చూసినప్పుడు స్వరూప నిర్మాణ పునరావృత్తి Parallelism గురించి ఈ భాగంలో ముందుగా ప్రస్తావించడం జరిగింది. పునరావృతికి చెందిన ఈ ప్రక్రియ తరువాత భాషా శైలికి చెందిన ఇతర వాక్య నిర్మాణ రీతులు చర్చించడం జరుగుతుంది. వాక్యనిర్మాణంలో రెండు లేక ఆపైన పునరావృత్తమయ్యే పదబంధాల సామ్యతను స్వరూపనిర్మాణ పునరావృత్తిగా చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణానికి సమాంతరత్వం Parallelism అని ఆంగ్లంలో పేరు. ఇక్కడ వర్ణనిర్మాణంలో వర్ణానికి వర్ణంగా, పద నిర్మాణంలో పదానికి పదంగా పునరావృతమైనట్లు వాక్యానికి వాక్యంగా పునరావృత్తి కాకపోవచ్చు. కాని కొన్ని పదక్రమాలు లేదా వ్యాకరణ రీతులు అనే పద్దతిలో మళ్ళీ రావడం జరుగుతుంది. కనిపించే బాహ్యపదపునరావృతిలా కాకుండా కనిపించని అంతర్గత వాక్యనిర్మాణ పునరావృతిని ఇక్కడ పరిశీలించవచ్చు. ఒక వాక్యాన్ని సమాంతరతతో ఆ వెనువెంటనే వచ్చే వాక్యంతో సరితూగే విధంగా ఈ పునరావృతి కనిపిస్తుంది. ఈ సమాంతరత సమాంతరతతో లేదా ప్రతికూలతలో ఉంటుంది.
4.1 సమాంతరాలు
రెండు లేక అంతకంటే ఎక్కువ సమాంతర పదాలను కలిగి ఉన్న వాక్యాలు సమాంతర వాక్యాలుగా గమనించవచ్చు. బందారం కథల నుండి ఉదాహరణలు.
- మనుషులు ధర్మం తప్పినట్టే రుతువులు ధర్మం తప్ప్పుతున్నాయి. (చినుకు చినుకుల వాన, పుట సంఖ్య: 21)
- ఏడాదిదాకా ఎటు వెళ్లాడో జాడ దొరకలేదు. జాడ దిరికినా అడ్రస్ దొరకలేదు. (జంజాటం, పుట సంఖ్య: 33)
- అమ్మను అమ్మ లెక్క జూడాలె. పెండ్లాన్ని పెండ్లం లెక్క జూడాలె. (కుంజీ, పుట సంఖ్య: 50)
4.2 సమాంతరతలో ప్రతికూలత
ఉదాహరణలో సమాంతరతలోనే ప్రతికూలత ఉంటుంది. ఒక విషయాన్ని తేల్చిచెప్పడానికి లేదా సరిగ్గా అర్థం చేయడానికి రచయితలు వారి రచనల్లో ఈ ప్రక్రియను వాడుకొంటారు.
- బయట వేడి చల్లారినా కొమురెల్లి లోపలి వేడి చల్లారలేదు. (శానతనం, పుట సంఖ్య: 53)
- ఒక పక్క దప్ప్పులజోరు, మరొక పక్క యువకుల గంతులు. పేరు దేవతలది. వేడుక మనుషులది. (శానతనం, పుట సంఖ్య: 54)
- లచ్చవ్వ కొత్త కోడలు ఇంతకుముందు వేరే యింట్లో పాతకోడలు. (ఎటమటం, పుట సంఖ్య: 135)
ఉపసంహారం
పై విశ్లేషణలన్నిటి ద్వారా బందారం కథలలో రచయిత నందిని సిధారెడ్డి గారు ఉపయోగించిన సాహిత్య, భాషాశాస్త్ర, శైలీశాస్త్ర ప్రక్రియలన్ని ఎంతో అనురక్తితో కథలను రక్తి కట్టించి పాఠకులందరూ వాటిని సహజరీతిలో చదివేందుకు, చదువుతున్న కొద్దివారిలో ఆసక్తిని ఉత్సుకతను పెంచేందుకు తోడ్పడిన ప్రక్రియలని పరిశీలించడమైంది. సమకాలీన సాహిత్య పరిశోధకులందరి భావి పరిశోధనలకు భాషాశాస్త్ర మరియు శైలీశాస్త్ర రీత్యా ఇవి ఎంతో తోడ్పడుతాయని భావించడమైంది. ఇంకా నందిని సిధారెడ్డి గారి బందారం కథలను చాలా కోణాలలో పరిశీలించవచ్చు. అలంకారాలు, ఆనాటి సామాజిక జీవన విధానాలాను తెలిసుకొనుటకు సిధారెడ్డి గారు ఉపయోగించిన మాండలికాలను కూడా పరిశీలించవచ్చు. ఈ వ్యాసం భాషాశాస్త్రం, శైలిశాస్త్రంలో ఆసక్తి ఉన్నవారికి మరియు విద్యార్థులకు ఉపయోయగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
- నందిని సిధారెడ్డి గారు తన కథలలో వర్ణనాత్మక, పదక్రమ, స్థానానుగత పునరావృత్తి ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించారు.
- ఈ శైలీ ప్రక్రియలు పాఠకులలో కథాంశం పట్ల ఆసక్తిని, ఉత్సుకతను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.
- భాషాశాస్త్ర కోణంలో ఈ కథలు సమకాలీన సాహిత్య పరిశోధనలకు గొప్ప వనరుగా నిలుస్తాయి.
- మాండలిక భాషా వినియోగం మరియు సామాజిక జీవన చిత్రణ ఈ కథల ప్రత్యేకతను మరింత పెంచాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- అబ్రామ్స్, ఎం. హెచ్. సాహిత్య పరిభాషా పదకోశం, సెంగేజ్ లెర్నింగ్, బోస్టన్, 2015.
- ఈగిల్టన్, టెర్రీ. సాహిత్య సిద్ధాంతం: ఒక పరిచయం, బ్లాక్‌వెల్, ఆక్స్‌ఫర్డ్, 1996.
- గోగు, శ్యామల. తెలంగాణ కథనాల్లో కులం మరియు లింగ వివక్ష, ఇండియా జర్నల్ ఆఫ్ జెండర్ స్టడీస్, ఇండియా, 2014.
- నందిని, సిద్ధారెడ్డి. బండారం కథలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు, 2024.
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు సాహిత్య విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2006.
- రాజయ్య, అల్లం. తెలంగాణ కథల్లో సామాజిక చైతన్యం, జర్నల్ ఆఫ్ తెలుగు స్టడీస్, తెలంగాణ, 2004.
How to cite this article:
కొలుపుల ప్రశాంత్ (2026). నందిని సిధారెడ్డి బందారం కథలు: శైలీశాస్త్ర ప్రక్రియలు. AUCHITHYAM, 7(11), 64–70.
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.