AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-12  |  November 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797

4. ఎన్. గోపి కవిత్వం: వస్తువైవిధ్యం

Author photo
డా. బి. బాలకృష్ణ
అధ్యాపకులు, తెలుగుశాఖ,
రాజీవ్ గాంధీ వైఙ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం - బాసర
నిర్మల్ జిల్లా, తెలంగాణ.
Cell: 9948997983  |  Email: dr.b.balakrishna@rgukt.ac.in
Received: 10 Oct 2026  |  Accepted: 23 Oct 2026  |  Published: 01 Nov 2026
DOI: https://doi.org/10.5281/zenodo.24360551
Article Perma Link: https://www.auchithyam.com/2026/nov_2026/full_papers/november26_04.phpPDF
Abstract
తెలుగు సాహితీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందుతున్న డా. ఎన్. గోపి కవిత్వంలోని వస్తు వైవిధ్యం, మానవతావాదం, తాత్త్వికతను విశ్లేషించడం ఈ పరిశోధన ముఖ్యోద్దేశం. ఆధునిక కవిత్వంలో సామాజిక వాస్తవికతను, ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రతిబింబించడంలో గోపి శైలి విశిష్టతను గుర్తించడం ఈ అధ్యయన ఆవశ్యకత. పూర్వ విమర్శకులైన కడియాల రామ్మోహన రాయ్, బన్న అయిలయ్య, గుడిపాటి వంటి వారి విశ్లేషణలను ప్రాతిపదికగా తీసుకుని, ఈ పరిశోధన గోపి కవితా సంపుటాలను పరిశీలిస్తుంది. విషయసేకరణలో భాగంగా గోపి వచన కవితాసంపుటాలు, సాహిత్యవిమర్శనా గ్రంథాలు, అంతర్జాలవ్యాసాలను ప్రాథమిక, ద్వితీయ వనరులుగా వినియోగించుకోవడం జరిగింది. పరిశోధనలో భాగంగా వర్ణనాత్మక, విశ్లేషణాత్మక పద్ధతులను అనుసరిస్తూ, కవిత్వంలోని వస్తువు, రూపం, స్మృతి కవిత్వం, తెలంగాణ అస్తిత్వం వంటి అంశాలను చర్చించడం జరిగింది. గోపి కవిత్వంలో మానవీయవిలువలు, పర్యావరణస్పృహ, సామాజికబాధ్యత వంటి అంశాలు ప్రధానఫలితాలుగా ఆవిష్కృతమయ్యాయి. వ్యక్తిగత విషాదాలను విశ్వమానవ వేదనగా మలచడంలో కవి చూపిన ప్రతిభ ఈ పరిశోధనలో స్పష్టమైంది. భవిష్యత్తులో గోపి కవిత్వంలోని అనువాద ప్రక్రియ, ఇతర భారతీయ భాషా కవులతో తులనాత్మక అధ్యయనాలకు ఈ వ్యాసం ఒక దిక్సూచిగా నిలుస్తుంది.
Keywords: ఎన్.గోపి, ఆధునికకవిత్వం, మానవతావాదం, తెలంగాణ అస్తిత్వం, స్మృతికవిత్వం, వస్తువైవిధ్యం, కవితాతత్త్వం, సామాజికస్పృహ

1. ప్రవేశిక

తెలుగు సాహిత్యంలో డా. ఎన్. గోపి కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. వేమనపై చేసిన ప్రామాణిక పరిశోధనతో ‘వేమన గోపి’గా ప్రసిద్ధి చెందిన ఆయన, కవిత్వ రంగంలో ‘తంగెడుపూలు’ (1976) సంకలనంతో తన స్వచ్ఛమైన కవితా ప్రవాహాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, చుట్టకుదురు, ఎండపొడ, మళ్ళీ విత్తనంలోకి, పురివిప్పిన ఊపిరి వంటి ఇరవైకి పైగా కవితా సంపుటాలను వెలువరించారు. సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి వంటి ఉన్నత బాధ్యతలు నిర్వహించినప్పటికీ, ఆయనలోని కవితా హృదయ ఆర్ద్రత ఏనాడూ తగ్గలేదు. అంతేకాకుండా, ‘నానీలు’ అనే చిరుకవితా ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచి, వేలాది మంది కవులకు మార్గదర్శకులయ్యారు. ఆయన నానీలు ‘నన్హే ముక్తక్’ పేరుతో హిందీలోకి, మరెన్నో భారతీయ, విదేశీ భాషల్లోకి అనువాదమై విశ్వవ్యాప్త ఆదరణ పొందాయి.

సమకాలీన సామాజిక వాస్తవాలను, మట్టి మనుషుల జీవన వ్యధలను, మానవ సంబంధాల సున్నితత్వాన్ని అక్షరీకరించడంలో గోపి శైలి విశిష్టమైనది. గతంలో కడియాల రామ్మోహన రాయ్, బన్న అయిలయ్య, గుడిపాటి, అప్సర్ వంటి విమర్శకులు గోపి సాహిత్యంపై విలువైన సమీక్షలు, వ్యాసాలు రాశారు. ఈ పరిశోధన వ్యాసం ఆ పూర్వ అధ్యయనాలను దృష్టిలో ఉంచుకుని, గోపి కవిత్వంలోని ప్రధాన పార్శ్వాలైన వస్తు వైవిధ్యం, మానవతావాదం, కవిత్వతత్త్వం, స్మృతి కవిత్వం, ప్రాంతీయ అస్తిత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రంథమైన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’లోని తాత్త్విక విలువలను సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.

2. గోపీ వచన కవితాసంపుటాల్లో వస్తు విశ్లేషణ

2.1 వస్తు వైవిధ్యం - రూప విశిష్టత

ఆధునిక కవిత్వంలో వస్తువు ప్రాణమైతే రూపం దేహం వంటిది. వస్తువుకు తగిన శిల్పం తోడైనప్పుడే కవిత సజీవ రూపాన్ని సంతరించుకుంటుంది. పింగళి లక్ష్మీకాంతం పేర్కొన్నట్లు

“ఒకానొక దృగ్విషయంలో ప్రత్యేకంగా, నియమబద్ధంగా ఉన్న మూలకాల క్రమ విధానాల మొత్తమే వస్తువు” (పింగళి, సాహిత్య శిల్పసమీక్ష, పుట. 39).

మహాకవి శ్రీశ్రీ

“కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా... కాదేదీ కవిత కనర్హం!” (శ్రీశ్రీ, మహాప్రస్థానం, పుట. 29)

అని చాటినట్లుగా, సృజనశీలి అయిన కవి ఏ సామాన్య వస్తువునైనా కవితాత్మకం చేయగలడు. ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి తన సిద్ధాంత గ్రంథంలో తెలిపినట్లు,

కవి స్వీకరించే భావన చలనశీలమై కాలంతో పాటు నూతన రూపాలను సంతరించుకుంటుంది (శరత్ జ్యోత్స్నారాణి, స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత, పుట. 25).

ఈ క్రమంలో ఎన్. గోపి కవిత్వంలో వస్తువు పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. వస్తువు లేనిదే కవిత్వానికి మనుగడ లేదని ఆయన భావించారు.

“వస్తువు దొరకనప్పుడు / కవిత్వం పస్తులుంటుంది / కళ్ళెదుటి వాస్తవం ఊహించనివ్వదు / ఉత్ప్రేక్షలు పల్టీలు కొడుతూనే నేలకూలుతాయి” (ఎన్. గోపి, చిత్రదీపాలు, పుట. 26).

ఈ పంక్తుల్లో కవి వాస్తవిక దృక్పథం వ్యక్తమవుతోంది. కేవలం ఊహాజనిత అలంకారాలతో కవిత్వం నిలబడదని, జీవిత వాస్తవాల నుండి పుట్టిన వస్తువే కవితకు ప్రాణం పోస్తుందని గోపి నిరూపించారు. అలాగే ‘జలగీతం’ దీర్ఘకవితలో

“కాస్మిక్ జలం నుంచి కాలుష్య జలం దాకా నీటి అనంత యాత్రా ప్రక్రియ దీనిలో చిత్రితమైంది” (ఎన్. గోపి, జలగీతం, భూమిక)

అని పేర్కొంటూ, ప్రకృతి వనరులైన నీటి సంస్కృతిని, పర్యావరణ స్పృహను విశ్వవ్యాప్త దృష్టితో ఆవిష్కరించారు.

2.2 మానవతావాదం - సామాజిక స్పృహ

ప్రాచీన గ్రీక్ దార్శనికుడు ప్రొటొగొరాస్ ప్రతిపాదించిన ‘మానవుడే అన్నింటికీ మూలం’ (Homomensura) అనే సూత్రం నుండి ఎఫ్.సి.ఎస్. షిల్లర్ ప్రతిపాదించిన ‘హ్యూమనిజం’ (Humanism) వరకు మానవతావాదం మనిషి హుందాతనాన్ని, స్వేచ్ఛను, హేతువును ప్రకటిస్తుంది (రావికంటి వసునందన్, ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం, పుట. 6). గోపి కవిత్వమంతటా ఈ మానవీయత అంతస్సూత్రంగా ప్రవహిస్తుంది. ‘మైలురాయి’ సంపుటిలోని ‘అర్ధరాత్రి వాన’ కవితలో నగరపు వానలో తడిసి ముద్దయ్యే నిరుపేదల దీనస్థితిని కవి హృదయవిదారకంగా చిత్రించారు:

“తలమీద నీడలేని / తలపండిన బిచ్చగాళ్ళు / గోడవారన ముడుచుకుంటే / నాగుబాముల్లా నడిచొచ్చే కాలువలు.....” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 108).

ఇక్కడ వాన ప్రకృతి రమణీయతగా కాకుండా, నిలువనీడలేని బిచ్చగాళ్ళ పాలిట రాక్షస పాదంగా కనిపించడం కవి నిశిత సామాజిక దృష్టికి నిదర్శనం. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో కులవృత్తులు దెబ్బతిని వలసబాట పట్టిన తెలంగాణ నేతన్నల వ్యధను ‘ఓ రాజయ్య కథ’ కవితలో కవి కళ్ళకు కట్టారు:

“అవి పట్టుచీరలు నేసిన అద్భుత హస్తాలనీ / బట్టపై బంగారు శిల్పాలు నాటిన / కళా విజయకేతనాలనీ మనకు తెలుసు / లోకాన్ని జలతారు ముసుగుల్తో కప్పిన వాడికి / దోతి చిరుగులెందుకున్నాయో” (ఎన్. గోపి, వంతెన, పుట. 255).

లోకానికి అందమైన వస్త్రాలను అందించిన చేతులకు కనీసం కట్టుకోవడానికి సరైన బట్ట లేని వైరుధ్యాన్ని ఇందులో వ్యంగ్యంగా, ఆర్ద్రంగా ప్రశ్నించారు. అదేవిధంగా 1991 గల్ఫ్ యుద్ధ బీభత్సాన్ని చూసి చలించిన కవి ‘వార్ 91’ కవితలో

“యుద్ధాన్ని క్రికెట్ క్రీడగా చేసిన / నాగరికతను ప్రశ్నిస్తున్నాను... రేపటి శతాబ్దం గుండెల్లో / సైన్స్ చేస్తున్న రాక్షస వ్యవసాయమిది” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 203-204)

అంటూ వినాశకర యుద్ధ సంస్కృతిని ఖండించారు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల అంతర్మథనాన్ని ‘సరిహద్దు’ కవితలో ప్రస్తావిస్తూ

“రెండు దేశాల్లోని / దొరల పుర్రెల్లో పుట్టిన బుద్ధి / బార్డర్ పై మంటలను రగిలిస్తుంది” (ఎన్. గోపి, మా ఊరుమహాకావ్యం, పుట. 52)

అని సామాన్య ప్రజల పక్షాన నిలిచారు. మనిషిలో మమత, అనుబంధాలే అసలైన మానవత్వమని చాటుతూ

“ప్రతి మనిషికీ / ఒక పరిమళం ఉంటుంది / మానవత / దాని సారాంశం అయినట్టు” (ఎన్. గోపి, మళ్ళీ విత్తనంలోకి, పుట. 49)

అని మానవీయ విలువలకు పట్టం కట్టారు. అలాగే ‘ఎవరి దుఃఖమో ఇది!’ సంపుటిలోని ‘మళ్ళీ జన్మిస్తే’ కవితలో

“మళ్ళీ జన్మిస్తే / నేనిలా ఉండకపోవచ్చు / ఇంతకన్నా మెరుగ్గా / చురుగ్గా / మరింత మనిషిగా” (ఎన్. గోపి, ఎవరి దుఃఖమో ఇది, పుట. 68)

అంటూ నిరంతర ఆత్మవిమర్శతో కూడిన మానవీయ దృక్పథాన్ని చాటుకున్నారు.

2.3 కవిత్వంపై కవిత్వం - కవితా తత్త్వం

కవిత్వం అంటే కేవలం అక్షరాల కూర్పు కాదు, అది ఒక నిరంతర అన్వేషణ, ఒక ఆత్మ సంఘర్షణ. గోపి తన అస్తిత్వాన్ని కవిత్వంలోనే చూసుకున్నారు. కవి కన్నా కవితే శాశ్వతమైనదని నమ్మిన గోపి

“కవికన్నా కవిత గొప్పది / కవి మరణిస్తాడు / కవిత బతుకుతుంది / కవి మనిషి / కవిత మానవత” (ఎన్. గోపి, గోపి కవిత్వం, పుట. 226-227)

అని స్పష్టం చేశారు. మనిషి భౌతికంగా నశించినా, అతడు సృజించిన మానవీయ కవిత్వం కాలం చెరపలేని సత్యంగా నిలుస్తుందనే భావం ఇందులో ఉంది. కవిత్వం నిజాయితీతో, స్పర్శతో కూడుకున్నదిగా ఉండాలని ఆకాంక్షిస్తూ

“ముట్టుకుంటే తగలాలి కవిత్వం / మనిషిలాగా” (ఎన్. గోపి, చిత్రదీపాలు, పుట. 148)

అని పేర్కొన్నారు. చిన్న కాగితం ముక్క కూడా కవిత్వం వల్ల విశ్వవ్యాప్త విలువను పొందుతుందని చెబుతూ

“అరచేయ్యంత కాగితం / కవిత్వం వల్ల / ఆకాశమంత విస్తీర్ణం పొందుతుంది” (ఎన్. గోపి, పురివిప్పిన ఊపిరి, పుట. 108)

అన్నారు. అంతస్సంఘర్షణను అణువిస్ఫోటనంతో పోలుస్తూ

“నా కవిత / నాలోనే కొట్టుమిట్టాడుతుంది... అణచిపెట్టలేని అణుపరమాణువుల సంగ్రామం / ఏదైనా విస్ఫోటనంతోనే ముగుస్తుంది” (ఎన్. గోపి, పురివిప్పిన ఊపిరి, పుట. 60)

అని కవితా జనన ప్రక్రియను వర్ణించారు. అలాగే

“ఖైదీలుగా ఉన్న భావాలకు / ముక్తిని ప్రసాదించడమే కవిత్వం / కవిత్వానికి ప్రాణమే ప్రాతిపదిక / జీవితం దాని వేదిక” (ఎన్. గోపి, మళ్ళీ విత్తనంలోకి, పుట. 65)

అంటూ జీవితానికీ, కవిత్వానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని నిర్వచించారు.

2.4 స్మృతి కవిత్వం - ఆర్ద్రతాభరిత వ్యక్తీకరణ

ఆప్తుల మరణం కలిగించే తీవ్ర వేదన నుండి జన్మించే సాహిత్య ప్రక్రియ స్మృతి కవిత్వం (Elegy). ఆంగ్ల విజ్ఞాన సర్వస్వం ప్రకారం మరణించిన మిత్రులను లేదా ఆప్తులను స్మరించుకుంటూ విషాదాన్ని వ్యక్తం చేసే గీతమే ఎలిజీ (Encyclopedia Americana, Vol-17). తెలుగులో వడ్డాది సుబ్బరాయ కవి ‘సతీస్మృతి’ నుండి రాయప్రోలు, బసవరాజు అప్పారావు, శ్రీశ్రీ వరకు అనేకమంది స్మృతి గీతాలు రాశారు. సినారె స్మృతి కావ్యాలను దేశనాయక, సతీ, సుతాదిక, ఆప్త స్మృతులుగా విభజించారు (సినారె, ఆధునికాంధ్ర కవిత్వము, పుట. 451). ఎన్. గోపి కవిత్వంలో సుతాదిక స్మృతి, ఆప్త స్మృతి అత్యంత హృదయవిదారకంగా కనిపిస్తాయి. 1996 డిసెంబర్ 21న తన కుమార్తె ‘రచన’ అకాల మరణం చెందినప్పుడు గోపి గుండె పగిలి రాసిన ‘మా అమ్మాయి’ కవిత తెలుగు స్మృతి కవిత్వంలో అపురూపమైనది:

“విజయాలే కాదు / వైఫల్యాలు కూడా జీవితంలో భాగమని నేర్పనందుకు / ‘అనుభవించు నాన్నా’ అని / నిర్దాక్షిణ్యంగా శిక్షించి పోయింది... తనకు తెలియదు / తన మరణం క్షణమయితే / మా మరణం క్షణ క్షణమని” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 284).

కడియాల రామ్మోహన రాయ్ పేర్కొన్నట్లు, ఈ కవిత చదువుతుంటే తన కుమార్తె మంగళప్రద మరణంపై బసవరాజు అప్పారావు రాసిన రక్తపు జీర అంటిన గీతాలు గుర్తుకు వస్తాయి. అలాగే తన తొలి సంపుటి 'తంగెడుపూలు'ను ఆదరించి ప్రోత్సహించిన కడప కవి వై.సి.వి. రెడ్డి మరణంపై:

“మీరిక లేరని చదివి / అక్షరాలు అలుక్కుపోయాయి... అంతటా మీరే కనపడుతున్నారు” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 228-229)

అని నివాళులర్పించారు. సహోద్యోగి, తెలంగాణ ఉద్యమ కవి ఋక్నుద్దీన్ మృతికి

“పాలెంనుండి పాలమూరుదాకా / పాలమూరు నుండి ప్రపంచ విశ్వవిద్యాలయం దాకా” (ఎన్. గోపి, మళ్ళీ విత్తనంలోకి, పుట. 102)

అంటూ ‘ఋగ్వేదన’ పేరుతో, కవి నార్ల చిరంజీవి మరణానికి

“కవి చిరంజీవి / కలల సంజీవిని... మధుగళం ఆగిపోయింది” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 44-45)

అని, దేవులపల్లి రామానుజరావు, తన తల్లి మరణాలపై రాసిన స్మృతి కవితలు వ్యక్తిగత దుఃఖాన్ని విశ్వమానవ వేదనగా మార్చాయి.

2.5 ప్రాంతీయ అస్తిత్వం - తెలంగాణ గుండెచప్పుడు

ప్రాంతీయ అస్తిత్వ స్పృహ గోపి కవిత్వానికి ఆయువుపట్టు. బన్న అయిలయ్య అభిప్రాయపడినట్లు, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, జీవన వైవిధ్యాన్ని జీర్ణించుకుని, ప్రారంభం నుండే తెలంగాణ పలుకుబడిని స్పృహతో కవిత్వీకరించిన కవి ఎన్. గోపి (బన్న అయిలయ్య, ఎన్. గోపి కవిత్వంలో తెలంగాణ గుండెచప్పుళ్ళు, పుట. 417). 1967లో వెలువడిన ‘తంగెడు పూలు’ కవితలో తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, నిరాదరణకు గురైన వారి ఆత్మగౌరవాన్ని ప్రతీకాత్మకంగా చిత్రించారు:

“తంగేడు పూలు అంటే ఒప్పుకోను / బంగరు పూలు / పొంగిన విచారాన్ని / దిగమింగిన పూలు... తెలుగువారి బతుకమ్మల కమ్మని మొగాల / వెలుగునింపు పూలు” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 19).

మహబూబ్నగర్ జిల్లా పల్లెల్లో కరువు, పోషకాహార లోపం (Malnutrition) వల్ల అల్లాడుతున్న పేద తల్లి ఆవేదనను అచ్చమైన తెలంగాణ మాండలికంలో ‘మంచి తిండి’ కవితలో ఆవిష్కరించారు:

“జర నా కొడుకును జూడుండ్రి దొరా / మొన్న బాగుండె / నిన్న బాగుండె / సెంపలుబ్బినయి / పెయ్యి వాసింది... బుక్కెడన్న దింటలేడు / జర కడుపు జూడుండ్రి దొరా” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 48).

అలాగే భూస్వామ్య వ్యవస్థలో దొరల గడీల కింద నలిగిన వెట్టి బతుకులను పూర్తి మాండలికంలో

“చెట్టు గొట్టురా ఎంకా కట్టె గొట్టు / పటేలింట్ల పొలావొండుతుండ్రు... పటేలుకోపమొస్తే పటేలు పటేలు గాడు” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 86)

అంటూ కళ్ళకు కట్టారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల దుస్థితిని

“అరుగుల మీద అవిటి బాల్యాలూ / కాళ్ళతో నడవలేని వృద్ధాప్యాలూ / వలసబోయిన ఊపిర్లూ” (ఎన్. గోపి, గోపి కవిత్వం - 3, పుట. 110)

అని వర్ణించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువత ఆత్మబలిదానాలను నివారిస్తూ

“యువత కోసమే కదా ఉద్యమాలు / మరి నువ్వే లేనప్పుడు / తెలంగాణ వచ్చి మాత్రం ఏం లాభం?” (ఎన్. గోపి, మా ఊరుమహాకావ్యం, పుట. 68)

అని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం

“బిడ్డలారా! / ఇక తెలంగాణ మీది, మీ పిల్లలది / శిథిలాలను ఒక్కచోట చేర్చి / అతికించుకోండి” (ఎన్. గోపి, పురివిప్పిన ఊపిరి, పుట. 19)

అంటూ పునర్నిర్మాణ పిలుపునిచ్చారు.

2.6 ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ - తాత్త్విక దర్శనం

2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ సంపుటి గోపి తాత్త్విక ప్రయాణంలో ఒక శిఖరం. ఆర్. శాంతసుందరి హిందీ అనువాదంతో సహా మొత్తం 23 భారతీయ భాషల్లోకి అనువాదమై ఈ గ్రంథం జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది (గుడిపాటి, నిరంతర, పుట. 354-355). కాలం కన్నా మనిషే గొప్పవాడనే ఆత్మవిశ్వాసాన్ని ఈ సంపుటి ప్రతిపాదిస్తుంది. అప్సర్ పేర్కొన్నట్లు, గోపి సమకాలీనతలోంచి సార్వకాలీనతలోకి ప్రవేశించి కాలం, స్థలాల సమగ్రతను (Integrity of time and place) ఇందులో ఆవిష్కరించారు. ఈ సంపుటిలోని ‘రొట్టె’ కవిత శ్రమ సౌందర్యానికి, తల్లి మమకారానికి అద్భుత ప్రతీక:

“రొట్టె ఆకాశం నుంచి ఊడిపడదు / భూగర్భసారంలోంచి / చెమట బిందువులు మోసుకొచ్చిన / ఆకలిస్వప్నం రొట్టె... అమ్మ ముద్దను పిసుకుతుంటే / అమ్మ తన చేతుల్తో / మా కడుపులను నిమురుతున్నట్టుండేది” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 269).

అలాగే గ్రామీణ జీవన సంస్కృతికి అద్దంపట్టే 'వాకిలి' కవితలో

“పొక్కిలి పొక్కిలైన మా వాకిలి / మనుస్సులా వుంది... కల్లోలమై పోయిన మావాకిట్లో / ఎన్ని సముద్రాల కల్లాపి చల్లాలో!?” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 273)

అంటూ మారిపోతున్న జీవన విధానాన్ని, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించారు. శ్రామిక జన సంస్కృతికి, తరతరాల వాత్సల్యానికి ప్రతీకగా ‘బొంత’ను వర్ణిస్తూ

“పాతబట్టలను పొగేసుకొని / మా అమ్మ ఏర్పరచిన సమన్వయవ్యవస్థ ఈ బొంత... తరం నుంచి తరానికి పరుచుకున్న వారసత్వవాత్సల్యం మాబొంత” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 278)

అని పేర్కొన్నారు. ప్రకృతి మార్పులను చిత్రిస్తూ ‘తొలకరి’ కవితలో

“పట్టపగ్గాలులేని సూర్యుణ్ణి పట్టుకొని / ఉతికేసి ఆరేస్తే / బొట్లు బొట్లుగా వర్షం!” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 288)

అనే వినూత్న ప్రతీకను సృష్టించారు. 1995 నాటి కోనసీమ పాశర్లపూడి ఓఎన్జీసీ బ్లో అవుట్ దుర్ఘటనపై

“గోదావరి కొంగుకు నిప్పంటుకుంది... పుత్తడిని చేదుకోబోయి పుండు చేస్తే / అది ఆరని గాయమై మండుతుంది” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 310)

అని మానవ తప్పిదాలను ఎత్తిచూపారు. 1993 లాతూర్ భూకంప విషాదంపై రాసిన ‘ముసురు’ కవితలో

“ఇసుకలో నీళ్ళింకినంత తేలిగ్గా రక్తం ఇంకదు... తెరిచివున్న రెప్పల్ని చూసి సజీవం అనుకుంటున్నాం” (ఎన్. గోపి, గోపి కవిత్వం - I, పుట. 323)

అని ఆధునిక మానవుని ఆంతరిక శిథిలాలను విశ్లేషించారు. సంపుటి శీర్షిక కవిత ‘కాలాన్ని నిద్రపోనివ్వను’లో

“కాలాన్ని నిద్రపోనివ్వక పోవటమే / జీవితం... కాలపత్రం మీద / కాలాతీత సిరాతో రాసినప్పుడు / ఏర్పడిన చిత్రం పేరు / మనిషి” (ఎన్. గోపి, కాలాన్ని నిద్రపోనివ్వను, పుట. 112)

అని మనిషి అస్తిత్వాన్ని, చైతన్యాన్ని శిఖరాయమానంగా నిలిపారు.

ఉపసంహారం

సమగ్ర పరిశీలన ద్వారా డా. ఎన్. గోపి కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన మైలురాయిగా నిలుస్తుందని స్పష్టమవుతోంది. ఆయన కవిత్వంలో స్థానీయత, ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉంటూనే, అవి సంకుచిత పరిధులను దాటి విశ్వమానవ వేదనతో మమేకమయ్యాయి. ‘తంగెడుపూలు’, ‘మంచి తిండి’ వంటి కవితల్లో తెలంగాణ మట్టి వాసన, మాండలిక సొగసు సహజసిద్ధంగా ఒదిగిపోతే, ‘రొట్టె’, ‘బొంత’, ‘వాకిలి’ వంటి కవితల్లో సామాన్య మానవుని శ్రమ సౌందర్యం, కుటుంబ అనుబంధాల వెచ్చదనం పాఠకుల హృదయాలను హత్తుకుంటాయి. వస్తువుకు తగిన రూప శిల్పాన్ని ఎంచుకోవడంలో, క్లిష్టమైన తాత్త్విక భావాలను సైతం సరళమైన, సుకుమారమైన పదచిత్రాలతో వ్యక్తీకరించడంలో గోపి సిద్ధహస్తులు.

గోపి కవిత్వం సామాజిక ప్రయోజనాన్ని, నైతిక విలువలను ఏనాడూ విస్మరించలేదు. యుద్ధ విముఖత, పర్యావరణ పరిరక్షణ, వృత్తి కళాకారుల సంక్షేమం, యువత ఆత్మబలిదానాల నివారణ వంటి అంశాల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యతను ఆయన కవిత్వం సమర్థవంతంగా నిర్వహించింది. వ్యక్తిగత విషాదాలను సైతం నిర్లిప్త దృష్టితో కళాత్మకంగా మలిచి స్మృతి కవిత్వానికి కొత్త గౌరవాన్ని ఆపాదించారు. భాషాపరంగా వ్యవహారిక సరళత, మాండలిక జీవద్భాష, వినూత్న ఉపమానాలు, ప్రతీకల మేళవింపుతో ఎన్. గోపి కవిత్వం తెలుగు సాహిత్యానికి పరిపుష్టిని చేకూర్చి, భావి తరాల కవులకు, పరిశోధకులకు నిరంతర స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

పాదసూచికలు

  1. శ్రీశ్రీ, మహాప్రస్థానం, పుట. 29
  2. శరత్ జ్యోత్స్నారాణి, స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత, పుట. 25
  3. ఎన్. గోపి, చిత్రదీపాలు, పుట. 26
  4. ఎన్. గోపి, జలగీతం, భూమిక
  5. రావికంటి వసునందన్, ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం, పుట. 6
  6. ఎన్. గోపి, గోపి కవిత్వం - ఈ, పుట. 108
  7. ఎన్. గోపి, వంతెన, పుట. 255
  8. ఎన్. గోపి, గోపి కవిత్వం - ఈ, పుట. 203-204
  9. ఎన్. గోపి, మా ఊరుమహాకావ్యం, పుట. 52

ఉపయుక్త గ్రంథసూచి

  1. అప్సర్. కాలాన్ని నిద్రపోనివ్వను - ఒక పరిశీలన, గోపి సాహిత్య దర్శనం (సంపా. కడియాల రామ్మోహన రాయ్), హైదరాబాద్, 1998.
  2. అయిలయ్య, బన్న. ఎన్. గోపి కవిత్వంలో తెలంగాణ గుండెచప్పుళ్ళు, నిరంతర (సంపా.), హైదరాబాద్, 2018.
  3. గోపి, ఎన్. కాలాన్ని నిద్రపోనివ్వను, చైతన్య ప్రచురణలు, హైదరాబాద్, 1998.
  4. గోపి, ఎన్. గోపి కవిత్వం - I, II, III సంపుటాలు, ఆనంద్ బుక్స్, హైదరాబాద్, 2006.
  5. గోపి, ఎన్. పురివిప్పిన ఊపిరి, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2014.
  6. గోపి, ఎన్. మళ్ళీ విత్తనంలోకి, ఆనంద్ బుక్స్, హైదరాబాద్, 2017.
  7. గుడిపాటి. విభిన్న భాషల్లో గోపి కవితా ప్రతిభ, నిరంతర (సంపా.), హైదరాబాద్, 2018.
  8. నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు - ప్రయోగములు, విశ్వంభర విజయ్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.
  9. రఘు, ఎస్. ఎన్. గోపి ప్రత్యేక ముఖాముఖి, తంగేడు అంతర్జాల పత్రిక, 2023.
  10. లక్ష్మీకాంతం, పింగళి. సాహిత్య శిల్పసమీక్ష, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1996.
  11. వసునందన్, రావికంటి. ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత, హైదరాబాద్, 2005.
  12. శరత్ జ్యోత్స్నారాణి, ఎస్. స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత: వస్తువు, రూపం, శిల్పం, జ్యోత్స్నా ప్రచురణలు, హైదరాబాద్, 2004.
  13. శ్రీనివాసరావు, శ్రీరంగం. మహాప్రస్థానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1950.
How to cite this article:
డా. బి. బాలకృష్ణ (2026). ఎన్. గోపి కవిత్వం: వస్తువైవిధ్యం. AUCHITHYAM, 7(12), 28–35. https://doi.org/10.5281/zenodo.24360551
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.