
భారతీయ శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి నాట్యం గణనీయ స్థానం కలిగివున్నది. "కూచిపూడి" అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక అగ్రహారం పేరు. ఈ గ్రామంలో ఆవిర్భవించడం వలన దీనికి కూచిపూడి నాట్యమని పేరు వచ్చింది. కూచిపూడి కేవలం అంగ విన్యాసాలకే పరిమితం కాకుండా, నాటకీయత, సంభాషణలు (వాచికాభినయం), భావ వ్యక్తీకరణ (సాత్వికాభినయం) వంటి అంశాలతో కలగలిసి ఒక సంపూర్ణ దృశ్యకావ్యంగా పరిణతి చెందింది. ఈ నృత్యానికి శాస్త్రీయ లక్షణాలను రూపొందించి, ఒక ఆకృతిని సమగ్ర రూపాన్ని తీసుకొని వచ్చిన ఖ్యాతి సిద్ధేంద్ర యోగికి దక్కుతుంది. అందుకే సిద్ధేంద్ర యోగిని కూచిపూడి నృత్య కళకు ఆద్యుడని చెబుతారు.
ఈ విషయాన్ని ప్రసిద్ధ నాట్యాచార్యులు, పరిశోధకులు డాక్టర్ నటరాజ రామకృష్ణ:
“సిద్ధేంద్ర యోగి రచించిన 'భామాకలాపం' కూచిపూడి నృత్య నాటక సాహిత్యానికి మూలస్తంభంగా నిలిచింది; నాట్యశాస్త్ర లక్షణాలను తెలుగు సాహిత్యంతో మేళవించి ఆయన ఒక నూతన మార్గాన్ని నిర్దేశించారు” (నటరాజ రామకృష్ణ 132)
అని పేర్కొన్నారు. వీరి ప్రతిపాదనను లోతుగా విశ్లేషిస్తే, కూచిపూడి నృత్య వికాసానికి కేవలం ఆంగిక అభినయాది నాట్య రీతులే కాకుండా, సాహిత్యం ఒక భూమికగా నిలిచిందని స్పష్టమవుతుంది.
కూచిపూడి నాట్యం ఎప్పటికప్పుడు కొత్త మార్పులను చేర్చుకుంటూ, నిత్య నూతనంగా ఉండటం గమనించదగిన అంశం. దీనికి కారణం కూచిపూడి నర్తకులు ప్రదర్శన కళాకారులే కారు, వారు నిరంతర పరిశోధకులు కూడాను. ఈ అంశాన్నే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఇలా పేర్కొన్నారు:
“కూచిపూడి భాగవతులు తమ పూర్వుల నుండి నేర్చిన నృత్య విద్యతోనే సంతృప్తివహించి ఊరుకోలేదు. నిరంతర కృషితో నూతన విషయములెన్నింటినో కనుగొని సంతసించి పూర్వ సంప్రదాయముల ననుసరించి తమ నృత్యకళ నభివృద్దిపరచుకుంటూ వచ్చినారు” (నటరాజ రామకృష్ణ 155)
కాలక్రమేణ, కూచిపూడి భాగవతులు కేవలం భామా కలాపాలు, యక్షగానాలకే పరిమితం కాకుండా, ప్రజల హృదయాలకు చేరువైన వాగ్గేయకారుల రచనలను సైతం తమ నృత్య ప్రదర్శనలలో అంతర్భాగంగా చేసుకున్నారు.
విద్వాన్ చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి గారు కూచిపూడి పరిణామం గురించి వివరిస్తూ:
“కూచిపూడి సంప్రదాయంలో పదాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. వాగ్గేయకారుల గేయాలు వీరి నాట్యానికి పుష్టిని తుష్టిని కలిగించాయి” (చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి 116)
అని పేర్కొన్న మాటలు ఈ అంశాన్ని బలపరుస్తుంది.
లోకంలో కీర్తనలు రచించేవారు గీత రచయితలని, ఆ గీతాలను సుస్వరంతో ఆలపించే వారిని గాయకులని వ్యవహరిస్తుంటారు. అయితే గీతం, సంగీతం రెండింటిని రచించగలిగే వారినే 'వాగ్గేయకారులు' అంటారు. 13వ శతాబ్దానికి చెందిన సంగీత శాస్త్రవేత్త శార్ఙ్గదేవుడు, సంగీత రత్నాకరం గ్రంథంలో:
“వాఙ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిధీయతే. వాచం గేయం చ కురుతే యః స వాగ్గేయకారకః (వాక్కు అనగా సాహిత్యం, గేయం అనగా సంగీతం; ఈ రెండింటిపై సమాన అధికారం కలిగి, రసభావయుక్తంగా రచనలు చేయగలవారే ఉత్తమ వాగ్గేయకారులు)” (శార్ఙ్గదేవుడు 112)
అని నిర్వచించాడు. జయదేవుడు, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, రామదాసు, త్యాగరాజు మొదలగు వాగ్గేయకారుల రచనలు కూచిపూడి నృత్యకారుల అభినయ ప్రతిభను మరింత విస్తృతంగా ప్రదర్శించడానికి దోహదం చేసి, కూచిపూడి నృత్య కళకు పరిపూర్ణతను తెచ్చిపెట్టాయి.
వాగ్గేయకారుల రచనలలో కేవలం ఆధ్యాత్మిక, భక్తి భావాలు మాత్రమే కాకుండా, సమకాలీన సామాజిక అంశాలు, మానవీయ కోణాలు, నవరస భరిత కథనాలు, నాటకీయంగా సాగే సంభాషణలు అంతర్లీనంగా ఉంటాయి. కూచిపూడి నర్తకులు వీరి సాహిత్యంలోని అంతరార్థాన్ని గ్రహించి, దానికి తగిన అభినయ రీతులు, ముద్రలను ప్రదర్శించి ప్రేక్షకులకు రసానుభూతిని కలిగిస్తారన్నది అక్షర సత్యం.
“వాగ్గేయకారుల కీర్తనలు, పద సాహిత్యంలోని అంతరార్థాన్ని అభినయ రూపంలోకి మలచడంలో కూచిపూడి భాగవతుల పాత్ర అద్వితీయమని డా. నటరాజ రామకృష్ణ తమ దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్రలో పలు చోట్ల ప్రస్తావించిన అంశాలను క్రోడీకరించగా తెలియవస్తుంది” (నటరాజ రామకృష్ణ 160-170)
దీన్ని బట్టి వాగ్గేయకారుల సాహిత్యం లేకపోతే కూచిపూడిలోని పాత్రాభినయ విభాగం ఇంతగా విస్తరించేది కాదని అవగతమవుతుంది.
ఇప్పటివరకు కూచిపూడి నృత్యంపై జరిగిన అనేక పరిశోధనలలో ప్రధానంగా నృత్య సాంకేతిక అంశాలు, చరిత్ర లేదా కర్ణాటక సంగీత రాగ, తాళాల ప్రయోగంపైనే ఎక్కువ దృష్టి సారించబడింది. అయితే, సంగీత శాస్త్ర అంశాలకు అతీతంగా కేవలం వాగ్గేయకారుల సాహిత్యంలోని వస్తువు, రసం, నాటకీయత, సంభాషణాత్మకత, భావాలు మొదలైన అంశాలు కూచిపూడి అభినయ రీతులను కాలక్రమేణా ఎలా సుసంపన్నం చేసిందో ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కూచిపూడి నృత్యసంప్రదాయం సజీవంగా నిలవడంలో తెలుగు, సంస్కృత వాగ్గేయకారుల సాహిత్యం, పోషించిన కీలకపాత్రను ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. కూచిపూడి నృత్యసంప్రదాయంలో వాగ్గేయకారుల పదసాహిత్యం సాత్వికాభినయం, వాచికాభినయం, సంచారి భావాలు, నవరసాల ప్రకటనపై చూపిన ప్రభావాన్ని సాహిత్యపరంగా గుణాత్మక, విశ్లేషణాత్మక, వివరణాత్మక పరిశోధనాపద్ధతుల్లో విశ్లేషిద్దాం.
కూచిపూడి నృత్య ప్రదర్శనలలో (ముఖ్యంగా అభినయ విభాగంలో) 12వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు వెలసిన ప్రధాన వాగ్గేయకారుల రచనలలోని సాహిత్యం కూచిపూడి నృత్య వికాసానికి ఎలా తోడ్పడినవో, కాల క్రమానుసారంగా సోదాహరణలతో పరిశీలించినప్పుడు స్పష్టమవుతుంది.
12వ శతాబ్దానికి చెందిన జయదేవ మహాకవి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలన్నింటినీ అత్యధికంగా ప్రభావితం చేసిన తొలి వాగ్గేయకారుడు. ఆయన సంస్కృతంలో రచించిన 'గీతగోవిందం' కావ్యంలోని అష్టపదులు కూచిపూడి నృత్యంలో చక్కగా ఒదిగిపోయాయి. దీనికి కారణం అష్టపదులు "లాస్య" ప్రధానమైనవి. ఒక నర్తకి సున్నితంగా, లలితంగా నాట్యం చేసే విధానాన్ని లాస్యం అంటారు.
“సుకుమారతయా జ్ఞేయం లాస్యం మదనవర్ధనమ్” అనగా అత్యంత సుకుమారంగా ఉండి, మన్మథ భావాన్ని (ప్రేమ/శృంగార రసాన్ని) పెంపొందించే నృత్యాన్ని లాస్యం అంటారని నిర్వచనం” (శార్ఙ్గదేవుడు)
కూచిపూడిలో అష్టపదుల ప్రయోగం గురించి వివరిస్తూ డా. నటరాజ రామకృష్ణ:
“అష్టపదులకు అభినయము పట్టుదురు, అభినయమున ఆంగిక ప్రాధాన్య విధానము, సాత్విక ప్రాధాన్య విధానము కలవు. ఈ రెంటినీ ఒకటివెంట నొకటిగా దర్శించు సంప్రదాయ మొకటి ఆంధ్రదేశ నర్తకులు అభివృద్దికి తెచ్చినారు” (నటరాజ రామకృష్ణ 170)
అని పేర్కొన్నారు. దీనిని బట్టి కూచిపూడి నృత్యకారుడి అభినయ పరిణతికి అష్టపదులు దోహదపడినాయని తెలుస్తుంది.
'గీత గోవిందం'లోని "యాహి మాధవ యాహి కేశవ" అనే అష్టపది కూచిపూడి ప్రదర్శనలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ అష్టపది శ్రీకృష్ణుని రాక కోసం ఎదురుచూస్తూ, పరస్త్రీ సాంగత్యం కలిగిన కృష్ణునిపై అలక వహించిన రాధ మనస్తత్వాన్ని చిత్రిస్తుంది.
“యాహి మాధవ యాహి కేశవ,
మా వద కైతవ వాదం.
తామనుసర సరసీరుహ లోచన,
యా తవ హరతి విషాదం” (గీతగోవిందం 184)
ఓ మాధవా! ఓ కేశవా! ఇక్కడి నుండి వెళ్ళిపో. నన్ను నమ్మించడానికి ఇక కపటపు మాటలు (అబద్ధాలు) చెప్పకు. ఓ పద్మనేత్రుడా! ఎవరైతే నీ బాధను, విచారాన్ని పోగొడుతుందో ఆ స్త్రీ వద్దకే వెళ్ళు అని రాధాదేవి కృష్ణునిపై తన ప్రణయ కోపాన్ని వ్యక్తం చేస్తోంది.
ఇందులో రాధ యొక్క కోపం, అసూయ, ప్రేమ కలగలిపిన 'ఖండిత నాయిక' స్వభావం అత్యంత నాటకీయంగా చిత్రీకరించబడింది. 'యాహి మాధవ' (వెళ్ళు మాధవా) అని పైకి కోపాన్ని వ్యక్తం చేసినా, ఆమె కళ్ళలో మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమను చూపించడం కూచిపూడి అభినయంలోని ప్రత్యేకత. అదేవిధంగా మరో అష్టపది:
“ధీరసమీరే యమునతీరే వసతి వనే వనమాలీ ।
గోపీపీనపయోధరమర్దనచంచలకరయుగశాలీ ॥” (గీతగోవిందం 124)
మన్మథుని వలె మనోహరమైన రూపంతో ఉన్న నీ హృదయేశ్వరుని కలవడానికి ఆలస్యం చేయవద్దు. యమునా నదీ తీరాన చల్లని పిల్లగాలులు వీస్తున్న పొదరింట్లో ఆ వనమాలి (కృష్ణుడు) వేచి ఉన్నాడు.
ఇందులో చెలికత్తె రాధతో కృష్ణుడి విరహ వేదనను వివరించి ఆమెను వెంటనే కృష్ణుని వద్దకు వెళ్ళాలని త్వరపెడుతుంది. ఈ సన్నివేశం నృత్యకారుడికి అటు యమునా తీరంలోని రమణీయ ప్రకృతిని, ఇటు రాధ విరహాన్ని, ఆత్రాన్ని ఏకకాలంలో అభినయించే అవకాశాన్ని ఇస్తుంది. ఈ విధంగా అష్టపదులలోని లాలిత్యం, శృంగార రసంతో కూడిన రాధా కృష్ణుల ప్రణయవృత్తాంతం, కూచిపూడి లాస్య విభాగానికి ఎంతో వన్నె తెచ్చింది.
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు (1408–1503) తెలుగు సాహిత్యంలో సంకీర్తన ప్రక్రియకు ఆద్యుడు. ఆయన రచించిన శృంగార, ఆధ్యాత్మిక సంకీర్తనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలలో విశేష ఆదరణ పొందాయి. అన్నమాచార్యుల కీర్తనల సాహిత్య వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ ప్రముఖ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ:
“అన్నమయ్య సంకీర్తనలలోని అలతి అలతి తెలుగు పదాలు, లోతైన తాత్విక భావాలు అభినయ కళాకారుల ఊహాశక్తికి రెక్కలు తొడుగుతాయి” (రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ)
అని విశదీకరించారు. వీరి అభిప్రాయం ప్రకారం, నర్తకులకు అన్నమయ్య సంకీర్తనలలోని సరళమైన పదజాలం శృంగారంతో పాటు క్లిష్టమైన ఆధ్యాత్మిక భావాలను సైతం సామాన్య ప్రేక్షకులకు సులభంగా చేరవేయడానికి తోడ్పడిందని తెలుస్తోంది.
ఉదాహరణకు అలమేలుమంగమ్మ లాస్యాన్ని, సౌందర్యాన్ని వర్ణిస్తూ అన్నమయ్య రచించిన "అలరులు కురియగ ఆడెనదే" అనే సంకీర్తన కూచిపూడి ఏక పాత్రాభినయ ప్రదర్శనలలో (Solo Repertoire) అత్యంత ప్రసిద్ధి చెందింది:
“అలరులు కురియగ ఆడెనదే, అలకల గులుకుల అలమేల్మంగ. అరవిరి సొబగుల అతివలు మెచ్చగ, అరతెర మరువున ఆడెనదే” (అన్నమాచార్య సంకీర్తనలు)
ఈ కీర్తనలోని ప్రతి పదం ఒక నృత్య భంగిమకు (కరణం) అద్దం పడుతుంది. 'అలరులు కురియగ' అన్నప్పుడు పుష్పవృష్టి కురుస్తున్నట్లుగా హస్త ముద్రలను ప్రదర్శించడం, 'అలకల కులుకుల' అన్నప్పుడు నుదుట ముంగురులను సవరించుకునే స్త్రీ సహజ లావణ్యాన్ని చూపించడం, 'అరతెర మరువున' అన్నప్పుడు తెరచాటు నుండి తొంగిచూసే నాటకీయతను అభినయించడం కూచిపూడి సంప్రదాయానికి సహజంగా ఒదిగిపోయాయి. అలాగే "బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానె నీ పాదము" (అన్నమాచార్య సంకీర్తనలు) వంటి కీర్తనలు వామనావతార ఘట్టాన్ని, త్రివిక్రమ రూపాన్ని కళ్ళకు కట్టినట్లు అభినయించడానికి వీలు కల్పిస్తాయి.
కూచిపూడి నృత్య సంప్రదాయంలో 'సాత్వికాభినయానికి' (ముఖ కవళికల ద్వారా సూక్ష్మమైన మనోభావాలను పలికించడం) అత్యంత బలమైన సాహిత్య భూమికను అందించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. 17వ శతాబ్దానికి చెందిన క్షేత్రయ్య, మధుర భక్తి తత్వంతో ఆయన రచించిన 'మువ్వగోపాల పదాలు' కేవలం శృంగార గీతాలు మాత్రమే కావు, అవి మానవ మనస్తత్వ శాస్త్రానికి, భక్తి తత్వానికి అద్దం పట్టే నాట్య కావ్యాలు.
క్షేత్రయ్య స్వయంగా తన పదాలను కూచిపూడి వారితో ప్రదర్శనకు ఉపయోగపడేలా రచించడానికి కారణం ఆయనకు సిద్ధేంద్ర యోగితో పరిచయముండటమేనని విద్వాన్ చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి:
“పద రచన చేయు కాలంలో క్షేత్రయ్యకు కూచిపూడి భాగవతులయిన సిద్ధేంద్ర యోగి, శివ నారాయణ తీర్థులతో అనుబంధముండేది” (చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి 123)
అని పేర్కొన్నారు. కూచిపూడి అభినయంలో క్షేత్రయ్య పదాల స్థానాన్ని నాట్య పరిశోధకులు నటరాజ రామకృష్ణ,
“క్షేత్రయ్య నృత్య నాటకములందు రసాభినయము, సాత్వికాభినయము ప్రవేశపెట్టుటకు తోడ్పడినారు. ఆయన గొప్ప పదకర్త మాత్రమే కాక, నాట్యాభినయశాస్త్రములను అసాధారణ ప్రజ్ఞతో అభ్యసించిన ప్రవీణుడైన భరతాచార్యుడు. సాత్వికాభినయానుకూలములైన నాలుగువేల పదముల నాయన రచించినాడు. క్షేత్రయ్య పదాభినయం ప్రవేశపెట్టి దర్బారు నృత్య కళకొక మహా వికాసం చేకూర్చినాడు” (నటరాజ రామకృష్ణ 156)
అని వివరించారు. ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నట్లుగా
“క్షేత్రయ్య పదముల గల విశిష్టోత్క్రృష్టత యేమిటంటే అవి కేవలం సంగీత రీతులందుత్తములై, రాగ భావములతో పరిపూర్ణతను చెందినవి మాత్రమే కావు నాట్య కళాభిజ్ఞులకు సైతం పరమాసక్తిని కలిగించు యోగ్యత గలవి, నాట్య ప్రదర్శనకు యోగ్యమైనవి” (క్షేత్రయ్య పదములు, సంపాదకుడు: జి.సీతాపతి, పుట xxii)
అని సంగీత నాట్య విమర్శకుడు వి. కృష్ణయ్యర్ పేర్కొనడం గమనార్హం. క్షేత్రయ్య పదాలలోని శృంగార, భక్తి భావాలు నర్తకి ముఖ కవళికల ద్వారా రససిద్ధిని కలిగించడానికి అద్భుతమైన వేదికను కల్పించాయని తెలుస్తోంది. దీనిని విశ్లేషిస్తే, కేవలం గానానికే పరిమితమైన పద సాహిత్యం కూచిపూడి భాగవతుల ప్రయోగం వల్ల పరిపూర్ణ దృశ్యకావ్యంగా రూపాంతరం చెందిందని స్పష్టమవుతోంది.
నాట్యశాస్త్రంలో భరతముని ప్రతిపాదించిన 'అష్టవిధ నాయికల' (ఎనిమిది రకాల నాయికల మనస్తత్వాలు) లక్షణాలను అభినయించడానికి క్షేత్రయ్య పదాలు అత్యుత్తమ సాహిత్య ఆధారాలుగా నిలిచాయి.
(అ) ముగ్ధ నాయిక - ఆశ్చర్య రస పోషణ
క్షేత్రయ్య పదాలలో నాయిక తన సఖితో మువ్వగోపాలుని (శ్రీకృష్ణుని) రూప లావణ్యాన్ని వర్ణించే తీరు అత్యంత నాటకీయంగా ఉంటుంది.
ఉదాహరణకు: "సామికి సరి ఎవ్వరే" అనే పదం.
పల్లవిలో నాయిక తన చెలికత్తెను ఉద్దేశించి 'ఎవ్వడే' అన్నప్పుడు ఆశ్చర్యాన్ని, సాత్విక శృంగార రసాన్ని ఒకే పల్లవిలో పలు రకాలుగా అభినయించవచ్చు.
(ఆ) వాసకసజ్జిక - విరహోత్కంఠిత నాయిక చిత్రణ
ప్రియుని రాక కోసం ఎదురుచూసే నాయిక ఆరాటాన్ని, అలంకరణను క్షేత్రయ్య అత్యంత రమణీయంగా చిత్రీకరించారు:
“మగువ తన కేళికా మందిరము వెడలెన్, వగకాడైన మువ్వగోపాలుని రాకకై” (క్షేత్రయ్య పదాలు)
అను ఈ పదంలో నాయిక తన మందిరాన్ని అలంకరించుకోవడం, అద్దంలో తన రూపాన్ని చూసుకోవడం, తలుపు చాటు నుండి దారి వైపు తొంగి చూడటం వంటి సన్నివేశాలు కూచిపూడి నృత్యకారుడికి ఆంగిక, సాత్వికాభినయాలను మేళవించడానికి చక్కని అవకాశాన్నిస్తాయి. ఇలాగే ఖండిత నాయిక మరియు స్వాధీనపతిక భావాలను కూడా క్షేత్రయ్య పదాలలో అభివ్యక్తీకరించడానికి దోహదం చేస్తాయి. ఈ విధంగా క్షేత్రయ్య పద సాహిత్యం కూచిపూడి అభినయాన్ని సామాన్య ప్రేక్షకులకు సైతం అత్యంత చేరువ చేశాయి.
కూచిపూడి నృత్య సంప్రదాయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన అంశాలలో 'తరంగం' అగ్రగణ్యమైనది. 17వ శతాబ్దానికి చెందిన యతివరేణ్యులు నారాయణ తీర్థులు రచించిన 'శ్రీకృష్ణ లీలా తరంగిణి' అనే సంస్కృత గేయ రూపకంలోని కీర్తనలనే 'తరంగాలు' అంటారు. భాగవత పురాణంలోని దశమ స్కంధం (శ్రీకృష్ణుని జననం నుండి రుక్మిణీ కల్యాణం వరకు) ఆధారంగా పన్నెండు తరంగాలుగా ఈ గ్రంథం రచించబడింది. ఇవి సాక్షాత్తు నాట్య ప్రదర్శన కోసమే రచించబడ్డాయని విద్వాన్ చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి వివరిస్తూ,
“నారాయణ తీర్థుల తరంగాలలోని లయబద్ధమైన సంస్కృత సమాసాలు, కథా గమనం నృత్యకారుడి అడుగులకు, జతులకు సహజంగా ఒదిగిపోతాయి; ఇవి కేవలం శ్రవ్య కావ్యాలు కావు, దృశ్య కావ్యాలు” (చింతా లక్ష్మీనరసింహ శాస్త్రి 124)
అని స్పష్టం చేశారు. ఇత్తడి పళ్ళెం (తాంబూల పళ్ళెం) అంచులపై పాదాలను ఉంచి, తలపై నీటి కుండను పెట్టుకుని నృత్యం చేసే క్లిష్టమైన 'తరంగ నృత్య' విన్యాసానికి ఈ సాహిత్యంలోని లయ, శబ్ద సౌందర్యం ఎంతో తోడ్పడతాయి.
(అ) వీర, అద్భుత రసాల పోషణ (కాళీయ మర్దన ఘట్టం)
శ్రీకృష్ణ లీలా తరంగిణి, నాలుగవ తరంగంలో శ్రీకృష్ణుని రూపలావణ్యం, కాళీయ మర్దనం వంటి వీరోచిత ఘట్టాలు అత్యంత నాటకీయంగా వర్ణించబడ్డాయి.
“బంధనాన్ మోచయ కాళీయకృత - బంధనాన్ మోచయ” (శ్రీకృష్ణ లీలా తరంగిణి 176)
ఇందులో 2వ చరణంలో:
"బాలచాపలతయా తవానఘ లీలయాలమిహ |
కాళీయ విషమాశు వినాశయ కల. గోకుల కల్యాణ మథ భో ||”
పాపరహితుడవైన ఓ కృష్ణా! నీ ఈ బాల్య చాపల్యపు లీలలు ఇక చాలు. వెంటనే ఈ కాళీయుని విషాన్ని నశింపజేసి, గోకులానికి శుభాన్ని కలిగించు అని అభినయించేటప్పుడు నర్తకుడు కాళీయుని పడగలపై కృష్ణుడు తాండవం చేసే వీర రస భంగిమను, అనంతరం "తామపి ఆనందపయా" అన్నప్పుడు కృష్ణుని కరుణామయ దృష్టిని ముఖకవళికల ద్వారా కరుణ రస భంగిమను అభినయిస్తారు.
వాత్సల్య, హాస్యరసాల మేళవింపు: ద్వితీయ తరంగంలో కృష్ణుని చిలిపి చేష్టలను యశోదకు గోపికలు వివరించే సన్నివేశం కూచిపూడి నృత్య నాటకాలలో అత్యంత ఆకర్షణీయమైన భాగం:
“కలయ యశోదే తవ బాలం, ఖల బాలక ఖేలన లోలం. అపహృత బహుతర నవనీతం, అనుపమ లీలా నటన చణం” (శ్రీకృష్ణ లీలా తరంగిణి 101)
ఈ పంక్తులలో 'అపహృత బహుతర నవనీతం' (వెన్న దొంగిలించాడని) అంటూ గోపికలు ఆవేశంగా ఫిర్యాదు చేయడం, దానికి కృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టడం, యశోదమ్మ కోపంతో దండించబోయి చివరకు పుత్ర వాత్సల్యంతో కరిగిపోవడం వంటి బహుళ పాత్రల అభినయాన్ని ఒకే నర్తకుడు (ఏకపాత్రాభినయంలో) ప్రదర్శించడానికి ఈ సాహిత్యం వీలు కల్పిస్తుంది.
(ఆ) శృంగార, భక్తి రస సమన్వయం (రుక్మిణీ కల్యాణ ఘట్టం)
రుక్మిణీ దేవి శ్రీకృష్ణునికి తన ప్రేమ సందేశాన్ని పంపే ఘట్టంలోని తరంగ సాహిత్యం కూచిపూడి 'రుక్మిణీ కల్యాణం' యక్షగానానికి ప్రాణం పోసింది:
“అమిత భాగ్యవతార, కమనీయ కరుణా కరం.
విమత మద విచారకరం, శమిత భూరి భూభారం” (శ్రీకృష్ణ లీలా తరంగిణి 506)
ముఖ్యంగా శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఆలోకయే శ్రీ బాల కృష్ణం, కృష్ణం కలయసఖి సుందరం మొదలైన తరంగాలు కూచిపూడి నాట్యం నేర్చుకొనే విద్యార్థులకు పాఠ్యాశాలుగా ఉండటం వీటి ప్రాధాన్యం తెలియజేస్తున్నాయి.
డా. ఎం. శ్రీ రవళి మనోహరం అనే పరిశోధక విద్యార్థి తరంగాల సాహిత్య విలువలను ప్రశంసిస్తూ:
“నారాయణ తీర్థుల తరంగాలలో శ్లోకం, దరువు, చూర్ణిక అనే మూడు సాహిత్య ప్రక్రియలు కలగలిసి ఉండటం వల్ల, నృత్యకారుడికి కథా కథనానికి, శుద్ధ నృత్తానికి సమపాళ్ళలో అవకాశం లభించింది” (శ్రీ రవళి మనోహరం)
అని విశ్లేషించారు. ఈ విధంగా నారాయణ తీర్థుల సాహిత్యం కూచిపూడి నృత్య నిర్మాణానికి ఒక పరిపూర్ణమైన ఆకృతిని అందించింది.
భద్రాచల రామదాసు రచించిన కీర్తనలలోని ఆర్తి, వేదన నృత్యకారుడిలో కరుణ, భక్తి రసాలను సహజంగా ప్రేరేపిస్తాయి.
ఉదాహరణకు:
“ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవె రామచంద్రా,
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా” (రామదాసు కీర్తనలు)
ఈ కీర్తనలో రామదాసు చెరసాలలో అనుభవించిన వేదనను, రామునిపై ఉన్న అచంచలమైన భక్తిని సూటియైన తెలుగు పదాలలో సంభాషణాత్మకంగా, ఏకపాత్రాభినయంగా వ్యక్తపరిచారు. ఆభరణాలను చేయించి సమర్పించిన తీరును వర్ణించే చరణాలను అభినయించేటప్పుడు, నృత్యకారుడు ఒక భక్తుని నిస్సహాయతను, భగవంతుని పట్ల ఉన్న ఆక్రోశాన్ని సాత్వికాభినయం ద్వారా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ప్రదర్శించగలడు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యుడైన సద్గురు త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలలో 'భక్తి రస' ప్రధాన అభినయానికి బలమైన ఆధారాలుగా నిలిచాయి. శృంగార రస ప్రధానమైన పదాలకు భిన్నంగా, ఈ కీర్తనలు భక్తుని ఆత్మ నివేదనను, ఆర్తిని, శరణాగతి తత్వాన్ని ఆవిష్కరిస్తాయి. త్యాగరాజస్వామి కృతులు కూచిపూడి నృత్య కచేరీలలో శాస్త్రీయ సంగీత గౌరవాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా త్యాగరాజు రచించిన పంచరత్న కృతులు, 'నౌకాచరిత్రం', 'ప్రహ్లాద భక్తి విజయం' వంటి గేయ నాటకాలు కూచిపూడి నృత్య రూపకాలకు గొప్ప ఇతివృత్తాలుగా నిలిచాయి.
త్యాగరాజ కీర్తనల శైలిని వివరిస్తూ, బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి:
“త్యాగరాజు కీర్తనలలోని జాను తెనుగు నుడికారములు, లోకోక్తులు, దేశ్య ప్రయోగాలు, సంభాషణాత్మకత సహృదయులను అలరిస్తుంది” (కల్లూరి వీరభద్ర శాస్త్రి xxxix)
అని పేర్కొన్నారు. శ్రీరాముని రూప వైభవాన్ని, గుణగణాలను వర్ణిస్తూ త్యాగరాజు రచించిన ఈ కీర్తన కూచిపూడి అభినయ రీతులకు చక్కని ఉదాహరణ:
“రామ నీ సమానమెవరు, రఘువంశోద్ధారక. భామా మరువంపు మొలక, భక్తితో నీ పాదముల నమ్మితిని” (త్యాగరాజ కీర్తనలు 529)
ఈ కీర్తనలో త్యాగరాజు సీతమ్మ అనురాగాన్ని రాముని ఉత్తమ గృహస్థుగా వర్ణించే తీరు నర్తకుడికి అనేక సంచారి భావంలో చూపించడానికి అవకాశం ఇస్తుంది. శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని, నడక తీరును వర్ణిస్తూ త్యాగరాజు రచించిన కృతి:
“నగుమోము గనలేని నా జాలి తెలిసి,
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ” (త్యాగరాజ కృతులు 112)
ఈ కృతిలో భక్తుని యొక్క ఆర్తి, వేదన, శరణాగతి భావం అత్యున్నత స్థాయిలో వ్యక్తమయ్యాయి. కూచిపూడి నర్తకులు ఈ కృతిని అభినయించేటప్పుడు భక్తి రసాన్ని (శాంత, కరుణ రసాల సమ్మేళనం) ప్రధానంగా పోషిస్తారు.
త్యాగరాజ కృతులలోని సంగతులు, రాగ భావం నర్తకి యొక్క ఆంగిక కదలికలకు ఒక గంభీరమైన, ఆధ్యాత్మికమైన నడకను ప్రసాదిస్తాయి. త్యాగరాజ స్వామి వారి 'నౌకాచరిత్రం'లో గోపికలు, కృష్ణుడు యమునా నదిలో విహరించే ఘట్టాన్ని కూచిపూడి కళాకారులు బృంద నాట్య రూపకంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు.
వాగ్గేయకారుల సాహిత్యం కూచిపూడి నృత్యాన్ని ఆంగిక చలనాల స్థాయి నుండి దృశ్యరూపకం తాలూకు రసాత్మక స్థాయికి తీసుకెళ్ళింది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక సజీవ చలన చిత్రం వలె అన్ని వర్గాలను అలరించే విధంగా పరిణమించింది. భరతముని నాట్యశాస్త్రం ప్రకారం నృత్యానికి రససిద్ధి కలగాలంటే సాహిత్యంలో నాటకీయ గుణం ఉండాలి.
దీనిని వివరిస్తూ డా. శ్రీరామ పోణంగి అప్పారావు గారు:
“కూచిపూడి నృత్యంలో 'సంచారి భావం' వికసించడానికి వాగ్గేయకారుల పదాలలోని ఉపమానాలు, లోకోక్తులే ప్రధాన కారణం; ఒకే పదాన్ని భిన్న కోణాలలో ఆవిష్కరించే శక్తి ఈ సాహిత్యానికి ఉంది” (శ్రీరామ పోణంగి అప్పారావు 120)
అని స్పష్టం చేశారు. ఈ సాహిత్య ప్రభావాన్ని మూడు ప్రధాన కోణాలలో విశ్లేషించవచ్చు:
కూచిపూడి సంప్రదాయంలో నృత్యకారుడే స్వయంగా సంభాషణలు పలకడం (వాచికాభినయం) ఒక ప్రత్యేకత. క్షేత్రయ్య పదాలలో నాయిక తన సఖితో మాట్లాడటం, నారాయణ తీర్థుల తరంగాలలో గోపికలు యశోదతో సంభాషించడం, త్యాగరాజ కీర్తనలలో భక్తుడు భగవంతుడిని నిలదీయడం వంటివి కూచిపూడి నాటకీయ శైలికి సరిగ్గా సరిపోయాయి. దీనివల్ల ఏకపాత్రాభినయంలో సైతం ఇద్దరు లేదా ముగ్గురు పాత్రల మధ్య సంభాషణ జరుగుతున్న భ్రమను నర్తకుడు కలిగించగలడు.
వాగ్గేయకారులు ఒకే పదాన్ని లేదా ఒకే వాక్యాన్ని లోతైన అంతరార్థంతో ప్రయోగించడం వల్ల, నర్తకుడు ఒకే పల్లవిని పదేపదే పాడుతున్నప్పుడు ప్రతిసారీ ఒక కొత్త పౌరాణిక కథను లేదా కొత్త భావాన్ని అభినయించే వెసులుబాటు కలిగింది. ఉదాహరణకు 'కమల దళాయత లోచన' అన్నప్పుడు కేవలం కళ్ళను వర్ణించడమే కాకుండా, గజేంద్ర మోక్షం లేదా కుచేలోపాఖ్యానం వంటి సన్నివేశాలను సంచారి భావంలో ప్రదర్శించడానికి సాహిత్యం అనుమతిస్తుంది.
జయదేవుడు, అన్నమాచార్యులు, క్షేత్రయ్యల రచనల ద్వారా శృంగార (మధుర భక్తి) రసం; నారాయణ తీర్థుల తరంగాల ద్వారా వీర, అద్భుత, హాస్య రసాలు; భద్రాచల రామదాసు, త్యాగరాజుల కీర్తనల ద్వారా కరుణ, శాంత రసాలు కూచిపూడి సాహిత్యంలో పరిపూర్ణంగా పోషించబడ్డాయి. ఈ విధంగా నవరసాల సమాహారంగా కూచిపూడి రూపుదిద్దుకోవడానికి వాగ్గేయకారుల సాహిత్య వైవిధ్యమే మూలకారణంగా నిరూపితమవుతుంది.
నేటి ఆధునిక కాలంలో కూచిపూడి నృత్యం సంప్రదాయ పరిధులను దాటి సమకాలీన ఇతివృత్తాలను కూడా స్వీకరిస్తోంది. అయినప్పటికీ, ప్రాచీన వాగ్గేయకారుల కృతులే నేటికీ ప్రదర్శనలకు మూలస్తంభాలుగా ఉన్నాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి సంగీత విద్వాంసులు ప్రాచీన వాగ్గేయకారుల కృతులకు నూతన రాగాలను సమకూర్చడం ద్వారా కూచిపూడి నర్తకులకు కొత్త ప్రయోగాలు చేసే అవకాశం కలిగింది. వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, యామినీ కృష్ణమూర్తి, శోభానాయుడు వంటి దిగ్గజ నర్తకులు వాగ్గేయకారుల సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
కూచిపూడి నృత్య సంప్రదాయ వికాసంలో వాగ్గేయకారుల సాహిత్యం పోషించిన పాత్ర అద్వితీయ మైనదని స్పష్టమవుతోంది. 12వ శతాబ్దపు జయదేవుని నుండి 19వ శతాబ్దపు త్యాగరాజు వరకు వెలసిన వాగ్గేయకారుల రచనలు కూచిపూడి నృత్యకారులకు కేవలం పాడుకోవడానికి పదాలు మాత్రమే కాకుండా, అభినయించడానికి అవసరమైన సజీవపాత్రలను, నాటకీయ సన్నివేశాలను అందించాయి.
సంగీత శాస్త్రంలోని సాంకేతిక అంశాలకు అతీతంగా పరి శీలించినప్పటికీ, కేవలం ఈ వాగ్గేయకారుల 'పద సాహి త్యం'లోని నాటకీయత, వ్యావహారిక తెలుగు పలుకుబడులు, సంస్కృత పదలాలిత్యం, భావగంభీరతలే కూచిపూడిని ఒక పరిపూర్ణ దృశ్యకావ్యంగా నిలబెట్టాయి. సాత్వికాభినయానికి, సంచారి భావ ప్రకటనకు ఈ సాహి త్యం అందించిన ఊతం మరే ఇతర అంశం ద్వారా సాధ్యం కాదు. భవిష్యత్ తరం నృత్యకారులు, పరిశోధకులు ఈ వాగ్గేయకారుల సాహిత్యంలోని అంతరార్థాలను, సాహిత్య విలువలను అధ్యయనం చేసినప్పుడే కూచిపూడి అభినయసంప్రదాయం తన అసలైన ఆత్మను, వైభవాన్ని నిలుపుకోగలుగుతుంది.