AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-12  |  November 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797

2. రాకమచర్ల కీర్తనలు: భక్తితత్త్వం

Author photo
డా. జి. అనిత
సహా ఆచార్యులు, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సాపూర్,
మెదక్, తెలంగాణ.
Cell: 9849272449  |  Email: agudipelli@gmail.com
Received: 15 Oct 2026  |  Accepted: 22 Oct 2026  |  Published: 01 Nov 2026
DOI: https://doi.org/10.5281/zenodo.24034391
Article Perma Link: https://www.auchithyam.com/2026/nov_2026/full_papers/november26_02.phpPDF
Abstract
భారతీయ సంస్కృతిలో భక్తి మార్గం మానవతావిలువలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, సామాజిక బాధ్యతలను కాపాడటంలో భక్తి తత్వం దిక్సూచిగా నిలుస్తుంది. ఈ పరిశోధనా వ్యాసం రాకమచర్ల వెంకటదాసు కీర్తనలలోని భక్తి తత్వాన్ని విశ్లేషించడం ప్రధాన లక్ష్యంగా రూపొందించబడింది. పోతన భాగవతంలోని భక్తి మార్గాన్ని పుణికిపుచ్చుకున్న వెంకటదాసు, తన కీర్తనల ద్వారా దశావతార వైభవాన్ని, ముఖ్యంగా శ్రీకృష్ణుని బాల్య లీలలను, భగవంతునితో భక్తుని అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పరిశోధనలో భాగంగా వెంకటదాసు కీర్తనలను ప్రాథమిక వనరులుగా, సాహిత్య విమర్శనా గ్రంథాలను ద్వితీయ వనరులుగా స్వీకరించి విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించడం జరిగింది. పూర్వపరిశోధకులు వెలువరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, వెంకటదాసు కీర్తనలలోని ధ్వనితత్వాన్ని, భక్తి పారవశ్యాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది. కీర్తనల ద్వారా సమాజానికి లభించే ఏకాగ్రత, ధైర్యం, పట్టుదల వంటి అంశాలను సోదాహరణంగా వివరించడం జరిగింది. ప్రస్తుతపరిశోధన వెంకటదాసు సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. భవిష్యత్తులో ఈ కీర్తనలపై మరిన్ని తులనాత్మక అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ పరిశోధన ద్వారా భక్తి సాహిత్యం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, భాషానైపుణ్యాన్ని, సాహిత్య అభిరుచిని పెంపొందించే సాధనంగా పనిచేస్తుందని నిరూపితమైంది.
Keywords: భక్తి సాహిత్యం, రాకమచర్ల వెంకటదాసు, కీర్తనలు, పోతన భాగవతం, దశావతారాలు, శ్రీకృష్ణుడు, ధ్వనితత్త్వం, తెలుగు సాహిత్యం, నవవిధ భక్తులు

1. ప్రవేశిక

భారతీయ సంస్కృతి భక్తి మార్గానికి పెట్టింది పేరు. మనిషిని మనిషిని ప్రేమించాలన్నా, జీవులను రక్షించాలన్నా, ఆత్మగౌరవాన్ని చాటుకోవాలన్నా, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలన్నా, మానవతా విలువలు కాపాడుకోవాలన్నా, సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికొరకు కాపాడుకోవాలన్నా మానవ మనుగడలో మానవీయ విలువలు అభివృద్ధి చెందాలి. అదే మార్గంలో పయనం కొన సాగించాలంటే ముఖ్యమైన కారణంగా భక్తి మార్గాన్ని ఎన్నుకోనడానికి ఆస్కారం ఉంది. అలాంటి భక్తి మార్గమును చాటిన మహానుభావులు ఎందరో ఉన్నారు.

నాటి నుండి నేటి వరకు ముఖ్యంగా వాల్మీకి వ్యాసభగవానులకు ఆ భక్తి తత్వం లేనట్లయితే నాడు రామాయణ, భారతాలు వెలుగు చూసేవి కావు. నన్నయ తిక్కన ఎర్రనలకు భక్తితత్వంలో ఏకాగ్రతలు ఉండడం వల్లనే భారతాన్ని అనువదించగలిగారు. శ్రీనాథుడు ఆ శివానుగ్రహం ఉండడం వల్లనే ఎన్నో శైవ సంబంధ కావ్యాలను రాయగలిగాడు. పోతన అటు శివుడిని, ఇటు విష్ణువును ఆరాధించాడు. కనుకనే భోగినీ దండకం భాగవతం రాయగలిగాడు.

నాడు పోతన చెప్పిన భక్తి మార్గాన్ని అనుసరించి తరువాతి కాలంలో రాకమ చర్ల వెంకట దాసు ఎన్నో కీర్తనలను పాడుకుంటూ భవిష్యత్ కాలానికి భక్తి తత్వమును చాటి చెప్పాడు. అలాంటి భక్తి తత్వాన్ని బోధించే కీర్తనలు ఎంతవరకు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం.

2. వెంకటదాసు కీర్తనలలో భక్తి వైవిధ్యం

విష్ణువతారా వైష్ణవ పాలన... కష్టదూర పరమాత్మా! వాసుదేవా హరే.... పండగ చేయనా పాప విమోచన... బుచ్చి దాసు హృదివాసా...1

“విష్ణువతారా వైష్ణవ పాలన... కష్టదూర పరమాత్మా! వాసుదేవా హరే.... పండగ చేయనా పాప విమోచన... బుచ్చి దాసు హృదివాసా...” (సల్గుంటి పెద్ద బుచ్చారెడ్డి 41)

సల్గుంటి పెద్ద బుచ్చారెడ్డి తన కీర్తనలలో పాడుతున్నట్లు తన నామాన్ని చివరి పాదంలో చేర్చడం వల్ల అది తన పాటగా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. వెంకట దాసు మాత్రం తన పేరుకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నిచోట్ల మాత్రమే కీర్తనలకు రాకమచర్ల అంటూ దాసుడిని అంటూ దశావతారాలలోని విష్ణు భగవానుడిని, అటు శైవభక్తిని చాటుతూ అనేక కీర్తనలను పాడుకుంటూ ఉండేవాడు. అందులో కొన్ని మాత్రమే ప్రచురించబడ్డాయి.

వెంకట దాసు కీర్తనలు పోతన భక్తి మార్గాన్ని పోలి ఉన్నాయనుటలో అతిశయోక్తి లేదు. పోతన దశావతారాలలోని భక్తి తత్వాన్ని సమాజానికి చాటి చెప్పారు. అదేవిధంగా వెంకట దాసు కూడా దశావతారాలను స్మరిస్తూ తన కీర్తనలు అనేకం పాడుకుంటూ జీవన విధానాన్ని కొనసాగించాడు.

3. కృష్ణావతారం - బాలకృష్ణ భక్తి

చిన్నపిల్లలను కృష్ణుని అవతారంగా భావించి కృష్ణుని బాల్య చేష్టలతో పోలుస్తూ లాలి పాటలు, జోల పాటలు పాడడం సహజం. అదేవిధంగా భక్తిలో లీనమయ్యే పాటలు కృష్ణునికి సంబంధించినవి అనేకంగా రచించాడు వెంకట దాసు.

“ముద్దు ముద్దుగా ముచ్చటాడు నా వద్దకి రాక హరినేడు ..... దద్దార మొంది నీ దాపు జేరితి తండ్రి రద్దీశాయకు నా ముద్దుల చిన్నికృష్ణ ..., సంకట పడుచుండే వెంకట దాసునింక చంకనేసుకోవు యింకేమిరా తండ్రి ..” (రాకమచర్ల వెంకటదాసు 8)

బాలకృష్ణుడిని ముద్దు బాలుడిలా, చిన్ని బాలుడిలా మార్చి తన వద్దకు రమ్మని జీవన గమనంలో కష్టాలన్నీ అనుభవించి ఆ కష్టాలన్నీ కడతేర్చుటకు కృష్ణుని వద్దకు జేరి పాడుకుంటున్నట్టు, ఇక ఈ జీవితంలో పడిన కష్టాలను పక్కకు తోలుటకు చెంతకు చేరినట్టు ఓ చిన్ని కృష్ణ నన్ను చిన్న బాలుడిగా చేసుకొని నీ చంకలో వేసుకోవయ్యా నీలో నన్ను ఐక్యంచేసుకో అంటూ ప్రార్ధించాడు.

దీనివల్ల సమాజానికి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఇంతటి భక్తి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మానవునిలోపల ఏకాగ్రత, ధైర్యం, పట్టుదల పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

పోతన భాగవతంలో కృష్ణుని బాల క్రీడలను చూసి పూర్తి తన్మయత్వంతో తన మానవ జీవితాన్ని మరిచి భక్తి పారవశ్యుడై జీవితానికి కారుకుడు తానేనంటూ తల్లిదండ్రులు తానే అంటూ

“నీవే తల్లివి తండ్రివి
నీవేనా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!” (భాగవతం అష్టమస్కంధం 10)

“నీ పాదకముల సేవయు
నీ పాదర్చకుల తోడి నెయ్యమును నితాం
తా పారభూత దయయును
తాపస మందార నాకు దయ సేయగదే” (భాగవతం అష్టమస్కంధం 12)

తల్లిదండ్రి గురువులు జీవితాన్ని నేర్పిన గురువు ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆ కృష్ణుడే అంటూ పతిగతి అన్ని తానేనని చెబుతూ, ఆ కృష్ణుని పాద కమలాలను నమస్కరిస్తూ తన జీవితానికి సుమార్గం చూపించమని వేడుకుంటున్న పద్యాలు అనేకం ఉన్నాయి.

4. కృష్ణుని కీర్తనలు - ధ్వని తత్వం

“రారా నందకుమార నా కోరిన కోరిక ధీర రారా మనవి గయికోర మొక్కేదన నీరజాక్ష నానేరము లెన్నకు .... ఘణముగా నిను జాడ నీకదలింపుగానే బాడా ..... వసుదేవ నందన వారిజలోచనా వాసుదేవ రసిక మనోహర రాజసన్నిభతేజ వాసుదేవ” (రాకమచర్ల వెంకటదాసు 12)

చెరసాలలో దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించిన శ్రీకృష్ణుడు. వసుదేవనంద అని వాసుదేవా అని కొనియాడ బడ్డాడు. అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు యశోదానందుని చెంతకు చేరుకుంటాడు వేవేల నామాలతో కీర్తించబడే కృష్ణుడిని రారా నందకుమారా అంటూ సంబోధించారు వెంకటదాసు. నందకుమార అంటే యశోద నందనుడని అర్థం.

అటు వాసుదేవా ఇటు నందకుమరా అంటూ కీర్తిస్తూ తాను కోరిన కోర్కెలను తీర్చమని తన మనవి ఆలకించమని తంతరం సేవిస్తానంటూ తప్పులను లెక్కించవద్దని అంటూ కమలముల వంటి కన్నులు కలిగిన ఓ శ్రీకృష్ణ గొప్పగా నీ పాటలను పాడుకుంటాను కరుణించరామయ్య అంటూ ప్రార్థించాడు. ఇక్కడ తన పాటలలో ధ్వని, భక్తి ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతుంది ఆ పాటలలో పూర్తితన్మయత్వంతో వేడిన విధం తర్వాతి తరాల వారికికి అందించడం లాంటిదవుతుంది..

‘ధ్వని తత్వం మాటలకు అందదు. కేవలం సహృదయులు మాత్రమే వాళ్ళయినా తమ హృదయాల చేతనే తెలుసుకోగలుగుతారు’ (పుల్లెల శ్రీరామచంద్రుడు 47)

ఆనందవర్ధనుడు చెప్పినట్లుగా తన పాటలు మాటలకు అందదు. ఇది హృదయానికి మాత్రమే తెలుస్తుంది. వెంకట దాసు కీర్తిస్తున్న సమయంలో తన మనసు, హృదయం ఆ భగవంతుని చెంతకు వెళ్లిన భావాన్ని వ్యక్తపరుస్తూ పాడుకుంటాడు. ఇది అందరికీ సాధ్యం కాదు.

“నంద నందన కృష్ణ నవనీత చోరా మందర ధర దివ్య మనిమయహారా” (రాకమచర్ల వెంకటదాసు 112)

వెన్నెల దొంగిలించిన చిన్ని కృష్ణుడు భక్తుల మనస్సును దొంగిలించిన నందిని కుమారుడైన శ్రీకృష్ణుని మందర పర్వతాన్ని ధరించిన విష్ణువుగా వేనోళ్ల కీర్తించిన వ్యక్తి వెంకట దాసు.

“కంకణ కమనీయాభరణా కింకిణి మంజీర అంకిత చరణా..” (రాకమచర్ల వెంకటదాసు 112)

కంకణ కేయూరాలు ఆభరణాలుగా ధరించిన కృష్ణుని పాదాలు భక్తులకు పూజింపదగినవిగా ఉన్నట్లు.

“పంకజ భవనత భావ విలక్షణ శంకర రూప వశంకర సజ్జన” (రాకమచర్ల వెంకటదాసు 112)

పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడికి కూడా గొప్పవాడైన శివునిచే ప్రార్థించబడిన పరమాత్ముడా అని కీర్తించిన కీర్తనలు అనేకంగా ఉన్నాయి.

ఉపసంహారం

  • భారతీయ సంస్కృతి ముందు తరాల వారికి పరంపరగా అందచేయుటకు భక్తి మార్గంలో పయనించడం ఆత్మస్థైర్యం ఏకాగ్రత ఆలోచన శక్తిని సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు.
  • భాషా నైపుణ్యం భాష సామర్థ్యం అభివృద్ధి పడడం విష్ణు అవతారాలను స్తుతించే నేపథ్యంలో రామాయణ భారత భాగవత హరివంశం ప్రబంధాలు కావ్య గ్రంథాలను చదవాలని కోరిక పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
  • వెంకట దాసు కీర్తనలు భవిష్యత్తు తరాల వారికి ప్రస్తుతం జీవిస్తున్న ప్రజలకి అందేలా ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఉపయుక్త గ్రంథసూచి

  1. భాస్కర యోగి, పి. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన, తుర్లపాటి పౌండేషన్, సికింద్రాబాద్, 2011.
  2. వెంకటదాసు, రాకమచర్ల. రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు, అన్నమ రాజు భాస్కర్ రావ్ ప్రింటింగ్ ప్రెస్, శంకరంపేట, 2002.
  3. వెంకటదాసు, రాకమచర్ల. రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు, శెట్టి బుక్ షెల్లర్, హైదరాబాదు, 2014.
  4. శ్రీరామచంద్రుడు, పుల్లెల. ధ్వన్యాలోకం లోచన సహితం, జయలక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాదు, 1998.
  5. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం, 2013.
How to cite this article:
డా. జి. అనిత (2026). రాకమచర్ల కీర్తనలు: భక్తితత్త్వం. AUCHITHYAM, 7(12), 13–16. https://doi.org/10.5281/zenodo.24034391
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.