AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-12  |  November 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797

1. కనగల్ మండలంలోని తెలుగు మౌఖికవ్యవహారం: ధ్వనుల మార్పు

Author photo
ఆచార్య పమ్మి పవన్ కుమార్
ఆచార్యులు, తెలుగుశాఖ
హైదరాబాదు విశ్వవిద్యాలయం
హైదరాబాదు, తెలంగాణ.
Cell: 9866486934  |  Email: pavankpammi@uohyd.ac.in
ORCID: 0000-0001-5367-9051
Author photo
బొమ్మగాని నవీన్ కుమార్
పరిశోధకులు, తెలుగుశాఖ
హైదరాబాదు విశ్వవిద్యాలయం
హైదరాబాదు, తెలంగాణ.
Cell: 7288076508  |  Email: bommaganinaveenkumar2001@gmail.com
Received: 20 Oct 2026  |  Accepted: 28 Oct 2026  |  Published: 01 Nov 2026
DOI: https://doi.org/10.5281/zenodo.24032317
Article Perma Link: https://www.auchithyam.com/2026/nov_2026/full_papers/november26_01.phpPDF
Abstract
నల్గొండజిల్లా కనగల్ మండలంలోని ప్రజలు మాట్లాడే మౌఖికభాషలో వినిపిస్తున్న ధ్వనిమార్పులను వివరించడం ఈ వ్యాసం ఉద్దేశం. మౌఖికభాషకు, లిఖితభాషకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఈ అధ్యయనంద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో మౌఖికభాషపై భాషాధ్యయనకోణంలో తక్కువ పరిశోధనలు జరిగాయి. తెలుగు అకాడమి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జిల్లాల భాషావిశేషాలను బులెటిన్ల రూపంలో ప్రచురించింది. ఆచార్య రవ్వా శ్రీహరి రాసిన “నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం”, “నల్లగొండ జిల్లా ప్రజల భాష” పుస్తకాలలో నల్లగొండ జిల్లా ప్రజల భాషపై పరిశోధనాత్మక భాషావిశేషాలున్నాయి. హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో “కట్టా వరదరాజు ద్విపదరామాయణం: భాషాపరిశీలన” అనే అంశంపై పమ్మి పవన్ కుమార్‌ (2003), “తిమ్మాజిపేట మండల మౌఖిక భాష - వర్ణనాత్మక వ్యాకరణం” పై ఎస్. చంద్రయ్య (2017) పరిశోధనలు చేసారు. అప్పం పాండయ్య “మహబూబ్‌నగర్ జిల్లా తెలుగు సామాజిక భాషాశాస్త్ర పరిశీలన” (2007) పుస్తకాన్ని వెలువరించారు. కనగల్ మండలంలో క్షేత్రపర్యటన ద్వారా మౌఖికంగా సేకరించిన భాషాసమాచారం ఈ వ్యాసానికి ప్రధానాకరం. పత్రపరిమితిని దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యవహర్తలను మాత్రమే ఈ వ్యాసపరిశీలనకు గ్రహించి, ఆ వ్యవహర్తల మౌఖికభాషలోని కొన్ని ధ్వనిమార్పులను మాత్రమే పేర్కొనడమైంది.
Keywords: కనగల్ మండలం, మౌఖికవ్యవహారం, వ్యవహర్తలు, క్షేత్రపర్యటన, మాండలికం, భాషాధ్వని, ధ్వని విఙ్ఞానం, ఉచ్చారణ వైవిధ్యం, ధ్వనుల మార్పు.

1. ప్రవేశిక

కనగల్ మండలంలో ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో ధ్వనుల ఉచ్చారణలో కలిగే మార్పులను ధ్వనిశాస్త్రం ఆధారంగా గుర్తించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. క్షేత్రపర్యటనలో వ్యవహర్తల నుండి మౌఖికంగా సేకరించిన సమాచారం ఈ పత్రానికి ప్రధాన ఆకరం. క్షేత్రపర్యటన ద్వారా సేకరించిన మౌఖిక సమాచారంలో ధ్వనిమార్పులు ఇతర భాషామండలాల్లోని (పూర్వ, మధ్య, దక్షిణ, ఉత్తర) వ్యవహర్తల ఉచ్చారణకు భిన్నంగా వినిపిస్తాయి. ఏ భాషావ్యవహార మండలంలోనైనా ఇటువంటి మార్పులు సహజం. వాటిలో కొన్ని ధ్వనిమార్పులను ఈ పత్రంలో గమనిద్దాం.

1.1. ధ్వనిశాస్త్ర నిర్వచనం

“Phonetics is the systematic study of human speech-sounds. It provides means of describing and classifying virtually all the sounds that can be produced by human vocal tracts.” (Catford. J. C. 2001: 01)

మానవ భాషాధ్వనులను క్రమబద్ధంగా అధ్యయనం చేయడాన్ని ధ్వనిశాస్త్రం అంటారు. మానవ స్వరపేటిక నుండి ఉత్పత్తి చేయగలిగే భాషా ధ్వనులను వివరించడానికి, వర్గీకరించడానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.

1.2. ధ్వనిశాస్త్ర నేపథ్యం

ధ్వనిశాస్త్ర ఙ్ఞానం భారతీయులకు కొత్తకాదు. వేదాంగాలలో ఒకటిగా పేర్కొనే ‘శిక్ష’ వర్ణోచ్చారణ, ఉత్పత్తి విభాగాలను వివరిస్తుంది. పాణినీయ శిక్ష, అపిశాలి శిక్ష మొదలైనవి భాషాధ్వనుల ఉత్పత్తికి సంబంధించి భారతీయులు ఏనాడో సాధించిన ఙ్ఞానాన్ని మనకు తెలియజేస్తాయి.

1.3. భాషా అధ్యయన పద్ధతులు

ఒక భాష నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా ధ్వని, వర్ణ, పదాంశ, వాక్య విఙ్ఞానాలను అధ్యయనం చేయాలి. ఇది భాషకు సంబంధించిన వర్ణనాత్మక అధ్యయన పద్ధతి. మౌఖిక వ్యవహారంలో వినిపించే శబ్దాలు పలుకుతున్నప్పుడు వాటిని అందరూ ఒకే విధంగా ఉచ్చరించలేరు. ఈ ఉచ్చారణ వైవిధ్యం వ్యక్తి స్థాయిలో గుర్తించడం సులభం. ఒక వ్యక్తి మాటలను రికార్డ్ చేసి శబ్దాల ఉచ్చారణను గమనించినప్పుడు, ఒక సందర్భంలో పలికిన ధ్వనిని వేరే సందర్భంలో మరోలా పలకడానికి అవకాశం ఉంటుంది. దైనందిన వ్యవహారంలో భాషావ్యవహర్తలు భాషను మాట్లాడతారు. కానీ, ఈ పరిశీలనను స్వతహాగా ఎవరికివారు చేయరు. భాషాశాస్త్రఙ్ఞులకు మాత్రం ఇది ఒక అధ్యయనాంశం.

భాషలోని వర్ణాల ఉచ్చారణలో ధ్వనులు మార్పుచెందడానికి అనేకమైన కారణాలున్నాయి. పదాలలోని వర్ణాల కూర్పు, వాటి పరస్పర ప్రభావం, అవి పలికేటప్పుడు ధ్వనులలో ఏర్పడే మార్పులు మొదలైనవి ఉచ్చారణలో ధ్వనుల మార్పులకు కారణమవుతాయి. కొన్ని ధ్వనులు భౌతికమైన పరిసరాల ప్రభావం వల్ల కూడా మార్పులు చెందుతాయి. మానవ ఆస్యాంతర్భాగపు నిర్మాణం వల్ల, అనక్షరాస్యత వల్ల, భావోద్వేగాల వంటి అనేక ఇతర కారణాల వల్ల జనవ్యవహారంలోని ఉచ్చారణలో ఈ రకమైన భేదాలు వినిపిస్తాయి.

మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్క వర్ణాన్ని ఒక్కో పౌనఃపున్యంలో వెలువరిస్తాం. జాగ్రత్తగా గమనిస్తే వాటి ధ్వనుల పౌనఃపున్యంలో అనేకమైన భేదాలను గమనించగలం. ఒక సంభాషణలో ఒక వర్ణాన్ని అదే వ్యక్తి అనేక తావులలో అనేక పౌనఃపున్యాలలో వెలువరిస్తారు. దీనినే భాషాశాస్త్రంలో ‘శ్రుతి ధర్మం’ అంటారు. అన్ని సందర్భాలలోను ఒకేలా ఉచ్చరించడం అన్నది భాషావ్యవహర్తల నియంత్రణలో ఉండదు. దీనికి ఆ వర్ణానికి పూర్వం, ఆ వర్ణానికి తరువాత ఉన్న వర్ణ ఉచ్చారణలు కారణమవుతాయి. ఒకే వర్ణాన్ని వెంటవెంటనే ఉచ్చరించినప్పుడు కూడా వాటి మధ్య ఉచ్చారణలో సూక్ష్మమైన భేదం ఉంటుంది. ఈ సూక్ష్మమైన తేడాలు కలిగిన ధ్వనులన్ని ఆ వర్ణానికి సవర్ణాలవుతాయి. సవర్ణం అంటే పోలిక కలిగిన ఉచ్చారణ. ఒక వర్ణానికి ఇటువంటి పోలిక కలిగిన ధ్వనులు ఎన్ని ఉన్నాయన్నది లెక్కకట్టి చెప్పలేం. అంటే ఒక వర్ణానికి ఉండే సవర్ణాల సంఖ్య అనంతం అన్నమాట. భాషావ్యవహర్తలందరిలో ప్రధానమైన వర్ణ ఉచ్చారణతో ఈ సవర్ణ ధ్వనిని పోల్చుకోగలిగే నేర్పు ఉంటుంది. అంటే, పోలిక కలిగిన ధ్వనులన్నీ ఏ ప్రధానమైన వర్ణాన్ని ఉద్దేశించినవి అని గుర్తించగలిగే నేర్పు. అందుకే సవర్ణాలకు లిపి సంకేతాలను కూర్చవలసిన అవసరం లేదు. సవర్ణాలనేవి ఒక వర్ణానికి ఉండే పోలిక కలిగిన ఉచ్చారణలు కనుక, సవర్ణాల చర్చ ఉచ్చారణకు సంబంధించినది. లేఖనంలో వీటన్నిటిని ఒక ప్రధాన వర్ణంగా గుర్తించి దానికి లిపిచిహ్నాన్ని కూర్చుతాం.

2. వ్యవహర్తల వివరాలు

ఈ పత్రంలో చర్చించిన విషయాలు, ఈ కింది పట్టికలో సూచించిన వ్యవహర్తల మౌఖిక భాష నుండి స్వీకరించబడ్డాయి. సుమారుగా ఒక్కొక్క వ్యవహర్త నుండి 30-45 నిమిషాల వ్యవధిలో రికార్డు చేసిన మౌఖిక వ్యవహార ఖండికలు ఈ పత్రానికి ప్రధానమైన ఆకరాలు. రాతలో ఒక్కొక్క వ్యవహర్త ఇచ్చిన సమాచారం 25 నుంచి 30 పుటలలో ఉంది.

క్ర. సం. వ్యవహర్త పేరు లింగం వయసు విద్య వృత్తి గ్రామం
1. కన్నెబొయిన శివ పురుషుడు 18 ఇంటర్మీడియట్ విద్యార్థి లచ్చుగూడెం
2. నామ చందు పురుషుడు 19 ఇంటర్మీడియట్ విద్యార్థి తిమ్మన్నగూడెం
3. ఏటెళ్ళి మణికంఠ పురుషుడు 25 ఎమ్మెస్సీ విద్యార్థి కనగల్
4. ఆవుల శివ పురుషుడు 28 చదువుకోలేదు యాచక వృత్తి కనగల్
5. ఎల్గబొయిన భవాని స్త్రీ 30 ఏడవ తరగతి కూలీ లచ్చుగూడెం
6. మర్రి రాజేశ్వరి స్త్రీ 40 ఇంటర్మీడియట్ టైలర్ తిమ్మన్నగూడెం
7. నాగోజు మల్లాచారి పురుషుడు 47 డిగ్రీ అర్చకులు దర్వేశిపురం
8. మాచర్ల వెంకటయ్య పురుషుడు 54 రెండవ తరగతి రైతు కుమ్మరిగూడెం
9. పసుపులేటి యాదమ్మ స్త్రీ 55 చదువుకోలేదు కారం మిల్లు కనగల్
10. ఓరుగంటి ఈశ్వరయ్య పురుషుడు 59 డిగ్రీ షాప్ నిర్వహణ కనగల్
11. దుబ్బ కృష్ణయ్య పురుషుడు 60 రెండవ తరగతి రైతు బొమ్మపల్లి
12. గోగు యాదయ్య పురుషుడు 60 చదువుకోలేదు రైతు కుమ్మరిగూడెం
13. కొత్తమాస్ ప్రభాకర్ పురుషుడు 63 ఏడవ తరగతి కిరాణం షాపు దర్వేశిపురం
14. తాడికొండ భిక్షమయ్య పురుషుడు 70 చదువుకోలేదు రైతు బొమ్మపల్లి
15. కడమంచి మల్లయ్య పురుషుడు 70 పెద్దబాలశిక్ష నాటువైద్యుడు దర్వేశిపురం

3. ధ్వనుల మార్పు

3.1. పదాది/పదమధ్య ‘క కారం’ ‘గ కారం’ గా మారడం

“దానివల్ల మోటర్ గాల్పోయింది.” (నామ చందు)

(దానివల్ల మోటర్ కాలిపోయింది.)

“మల్లా ఇగా కారం మిషిను పెట్కోని కారం గొట్కుట్న.” (పసుపులేటి యాదమ్మ)

(మళ్ళీ ఇంక కారం మిషిను పెట్టుకొని, కారం కొట్టుకుంటున్నాను.)

పై ఉదాహరణలలో ‘గాల్పోయింది, ఇగా, గొట్కుట్న’ వంటి మాటలలో జిహ్వామూలీయ అల్పప్రాణ శ్వాసస్పర్శమైన ‘క’ స్థానంలో జిహ్వామూలీయ అల్పప్రాణ నాదస్పర్శం ‘గ’ చేరింది. శ్వాసం నాదంగా మారడం ఇక్కడ గమనించవచ్చు.

3.2. మహాప్రాణాన్ని అల్పప్రాణంగా పలకడం

“కతం ఇంగ తర్వాత ఓ నువ్వా అనడుగుతరు.” (పసుపులేటి యాదమ్మ)

(ఖతం ఇంక తరువాత ఓ నువ్వా అని అడుగుతారు.)

“కొక్కో ఆడ్త.” (కన్నెబొయిన శివ)

(ఖోఖో ఆడుతా.)

“రామారావు తరవాత రాజశేకర్ కొంచం చేశిండు.” (గోగు యాదయ్య)

(రామారావు తరువాత రాజశేఖర్ కొంచెం చేసాడు.)

“వైద్యంగైతె నేనెంతైన నడిపిస్త, ఎంతైన చెప్త. అది కత.” (కడమంచి మల్లయ్య)

(వైద్యంగ అయితే నేను ఎంతయినా నడిపిస్తాను, ఎంతయినా చెప్తాను, అది కథ.)

“అట్ట ఉంది ఆలది కత.” (తాడికొండ భిక్షమయ్య)

(అలా ఉంది వాళ్ళ కథ.)

“ఆయన కాపలదారి మొత్తం మన దేవస్తానానికి.” (నాగోజు మల్లాచారి)

(మన దేవస్థానానికి మొత్తం ఆయనే కాపలాదారి.)

“ఒకా అర్దగంట గంట బడ్తది, జాకిట్ కుట్టడం.” (మర్రి రాజేశ్వరి)

(జాకిట్ కుట్టడానికి ఒక అర్ధగంట లేదా గంట పడుతుంది.)

“మూడు స్టెప్పులు పాసైతెనే ప్రదాన అర్చక పోస్టన్నట్టు.” (నాగోజు మల్లాచారి)

(మూడు స్టెప్పులు పాసయితేనే ప్రధాన అర్చక పోస్టు వస్తుంది.)

“వాలని ఇన్ని బాదలు పడి సదివిచ్చిన.” (పసుపులేటి యాదమ్మ)

(వాళ్ళని ఇన్ని బాధలు పడి చదివించాను.)

“ఆ ఎల్లమ్మతల్లి బర్తపేరు జమదగ్ని.” (నాగోజు మల్లాచారి)

(ఆ ఎల్లమ్మతల్లి భర్తపేరు జమదగ్ని.)

“నా బార్య ఎవసాయం చేస్తదండి.” (దుబ్బ కృష్ణయ్య)

(నా భార్య వ్యవసాయం చేస్తుందండి.)

“పట్టా బూమి కాబట్టి ఎట్లుంటదండి, ఉంటదా?” (మాచర్ల వెంకటయ్య)

(పట్టా భూమి కాబట్టి ఎలా ఉంటుందండీ, ఉంటుందా?)

“కొమురంబీం ట్రిపులార్ మూవీ రిలీజైనపుడు ఫస్టుఫస్టు మేమేశ్నం.” (కన్నెబొయిన శివ)

(కొమురంభీం ట్రిపులార్ మూవీ రిలీజయినప్పుడు ఫస్టుఫస్టు మేము వేశాము.)

పై ఉదాహరణలలో ‘కతం, కొక్కో, రాజశేకర్, కత, దేవస్తానానికి, అర్దగంట, ప్రదాన, బాదలు, బర్త, బార్య, బూమి, కొమురంబీం’ వంటి మాటలలో మహాప్రాణ లోపం స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క ‘ప్రదాన’ పదం తప్ప మిగిలిన పదాలు అర్థభేదం కలిగించడంలేదు. ‘ప్రదాన’ పదానికి నైఘంటికార్థం ‘ఇవ్వడం’, కానీ ఇక్కడ వాక్యప్రయోగంలో మహాప్రాణంగా గ్రహించినప్పుడు ‘ప్రధాన’ అంటే ‘ముఖ్యమైన’ అనే అర్థం బోధపడుతుంది.

3.3. పదాది చకారం; ‘జ’, ‘స’, ‘శ’ లు గా మారడం

“కొడ్కు పద్ జదివిండు.” (గోగు యాదయ్య)

(కొడుకు పది చదివాడు.)

“దానికి బలంరానీకి పిండి, మందు అయన్ని జల్తం.” (కన్నెబొయిన శివ)

(దానికి బలం రావడానికి పిండి, మందు అవన్నీ చల్లుతాం.)

“ఆయన ఇంటర్ జేశిండు.” (మర్రి రాజేశ్వరి)

(ఆయన ఇంటర్ చేసాడు.)

“ఎన్నుపూసమ్మటి ఓ శిన్న నరం పెరుగుద్దట” (గోగు యాదయ్య)

(వెన్నముక వెంట ఒక చిన్న నరం పెరుగుతుందంట.)

“మేం బతకనీకె శెలకల్లేవ్, బోర్లులేవ్.” (ఆవుల శివ)

(మేం బతకడానికి చేలు లేవు, బోర్లు లేవు.)

“మూడెకరాల శేనుంది నాకు” (మాచర్ల వెంకటయ్య)

(నాకు మూడు ఎకరాల చేను ఉంది.)

“సార్ కొట్టిండు బల్య. కొడ్తే ఒద్దని చెప్పి సదువు బంజేశ్న.” (ఎల్గబొయిన భవాని)

(బడిలో సార్ కొట్టాడు. కొడితే వద్దు అని చెప్పి చదువు ఆపేసాను.)

“ఆయన కరంటుపట్టి సనిపొయిండు.” (గోగు యాదయ్య)

(కరంటుషాక్ కొట్టి ఆయన చనిపోయాడు.)

“మాకు తెలవదుగద, ఇట్ల సూపిచ్చెలిపోతుంటడు.” (కొత్తమాస్ ప్రభాకర్)

(మాకు తెలియదు కదా, ఇలా చూపించి వెళ్ళిపోతుంటాడు.)

పై ఉదాహరణలలో ‘జదివిండు, జల్తం, జేశిండు’ వంటి మాటలలో తాలవ్య అల్పప్రాణ శ్వాసస్పర్శం ‘చ’ స్థానంలో తాలవ్య అల్పప్రాణ నాదస్పర్శం ‘జ’ చేరింది. ‘శిన్న, శెలకల్లేవ్, శేనుంది’ వంటి మాటలలో తాలవ్య అల్పప్రాణ శ్వాసస్పర్శం ‘చ’ స్థానంలో అగ్రతాలవ్య శ్వాసోష్మం ‘శ’ చేరింది. ‘సదువు, సనిపొయిండు, సూపిచ్చెలిపోతుంటడసలే’ వంటి మాటలలో తాలవ్య అల్పప్రాణ శ్వాసస్పర్శం ‘చ’ స్థానంలో దంతమూలీయ శ్వాసోష్మం ‘స’ చేరింది.

3.4. ణ>న

“మన గనపతి పూజ చేస్తరుగ?” (ఎల్గబొయిన భవాని)

(మన గణపతి పూజ చేస్తారు కదా?)

“కార్తీక పురానం కార్తీక మాసంలొ‌ చవుతం.” (నాగోజు మల్లాచారి)

(కార్తిక పురాణం కార్తిక మాసంలో చదువుతాము.)

“ప్రమాన సీకారంనాడు నేనంత మంచే చేస్తనని ప్రమానం చేస్తడు” (దుబ్బ కృష్ణయ్య)

(ప్రమాణ స్వీకారంనాడు నేను అంతా మంచే చేస్తాను అని ప్రమాణం చేస్తాడు.)

పై ఉదాహరణలలోని ‘గనపతి, పురానం, ప్రమానం’ వంటి పదాలలో మూర్థన్య నాదానునాసికం ‘ణ’ అనే ధ్వని దంతమూలీయ నాదానునాసికం ‘న’ గా ఉచ్చరించబడుతున్నది.

3.5. న>డ, ల; మరియు ల>న

“ఆడిమడ్శికి జరిగినా మగమడ్శికి జర్గినా ఆ మరీ కొట్లాడైన నేను దాన్ని న్యాయంజేస్త.” (దుబ్బ కృష్ణయ్య)

(ఆడమనిషికి జరిగినా మగమనిషికి జరిగినా మరీ కొట్లాడైనా నేను న్యాయం జరిగేలా చూస్తాను.)

“ఇగ మడ్శులకేవొఁ దగ్గు, ఆ సర్ది, కడుపునొప్పి.” (గోగు యాదయ్య)

(ఇక మగ మనుషులకేమో దగ్గు, ఆ జలుబు, కడుపునొప్పి.)

“నిన్ను మాట్లాడ్నియరు, నీ పక్కల పెద్దమడ్శులు మాట్లాడ్తరు.” (మాచర్ల వెంకటయ్య)

(నిన్ను మాట్లాడనివ్వరు, నీ పక్కన పెద్దమనుషులు మాట్లాడతారు.)

“చుట్టుపక్కల ఉన్నది.” (నామ చందు)

(చుట్టుపక్కన ఉన్నది.)

“చుట్టుపక్కల గ్రామాలల్ల వున్నరు.” (కొత్తమాస్ ప్రభాకర్)

(చుట్టుపక్కన గ్రామాలలో ఉన్నారు.)

“మన ఇంగ్లీష్‌కి వాల ఇంగ్లీష్‌కి చాన డిఫరెన్సుంటది.” (ఏటెళ్ళి మణికంఠ)

(మన ఇంగ్లీష్‌కి, వాళ్ళ ఇంగ్లీష్‌కి చాలా డిఫరెన్సుంటుంది.)

“ఇపుడు నా పరిస్తితి చాన దిగజారిపోయున్న.” (కడమంచి మల్లయ్య)

(ఇప్పుడు నా పరిస్థితి చాలా దిగజారిపోయింది.)

“మావోల్ చాన టెన్షన్ పడ్డరు.” (కన్నబొయిన శివ)

(మావాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు.)

పై ఉదాహరణలలో ‘ఆడిమడ్శికి, మగమడ్శికి, మడ్శులకేఁవొ, పెద్దమడ్శులు’ అనే మాటలలో దంతమూలీయ నాదానునాసికం ‘న’ స్థానంలో మూర్ధన్య అల్పప్రాణ నాదస్పర్శం ‘డ’ చేరింది. ‘పక్కల’ అనే మాటలో దంతమూలీయ నాదానునాసికం ‘న’ స్థానంలో దంతమూలీయ నాదపార్శ్వికం ‘ల’ చేరింది. ‘చాన’ అనే మాటలో దంతమూలీయ నాదపార్శ్వికం ‘ల’ స్థానంలో దంతమూలీయ నాదానునాసికం ‘న’ చేరింది.

3.6. పదాంత ‘డ, ర’ అక్షరాలకు షష్ఠీ విభక్తి ‘లో’ పరమైనపుడు ‘ల్య’ గా మారడం

“మా ఊల్య మా బావోల్లు, మీవుఁ రెండిండ్లే ఉన్నయ్.” (ఎల్గబొయిన భవాని)

(మా ఊరిలో మా బావోళ్ళు, మేము రెండిండ్లే ఉన్నాయి.)

“మా నాయినే పట్కుటడు వేరే ఊల్యకు పొయ్ గిట.” (నామ చందు)

(మా నాన్నే పట్టుకుంటాడు వేరే ఊరిలోకి వెళ్ళి కూడ.)

“నా బిడ్డని ఊల్యనె ఇచ్చిన.” (గోగు యాదయ్య)

(నా బిడ్డను ఊరిలోనే ఇచ్చాను.)

“కొడుకైతెనేవొఁ అది ప్రైవేటు బల్య చదివిపిస్తున్న.” (ఆవుల శివ)

(కొడుకు ప్రైవేట్ బడిలో చదివిస్తున్నాను.)

“ఆ అంగన్‌బల్య ఫుడ్డు మంచిగనె పెట్టేది.” (ఎల్గబొయిన భవాని)

(ఆ అంగని బడిలో ఫుడ్డు మంచిగానే పెట్టేవారు.)

“మాకు బల్య కుసబెట్టి సదువు నేర్పినోడు లేడు.” (కడమంచి మల్లయ్య)

(మాకు బడిలో కూర్చోబెట్టి చదువు నేర్పినవాడు లేడు.)

‘ఊరు’ అనే మాటలోని దంతమూలీయ నాదతాడితమైన ‘ర’ కు, ‘బడి’ అన్న మాటలోని మూర్ధన్య అల్పప్రాణ నాదస్పర్శమైన ‘డ’ కు షష్ఠీ విభక్తి ప్రత్యయం ‘లో’ చేరినపుడు ‘ల్య’ గా మార్పుచెంది ‘ఊల్య’, ‘బల్య’ రూపాలు ఏర్పడడం పై ఉదాహరణలలో చూడవచ్చు.

3.7. ప>బ

“షాప్ బెట్కున్న కిరానం.” (మర్రి రాజేశ్వరి)

(కిరాణం షాపు పెట్టుకున్నాను.)

“వూల్లలక్ బొయ్ పొట్టపోస్కోని బత్కుతుంటివఁప్పుడు.” (కడమంచి మల్లయ్య)

(ఊర్లలోకి వెళ్ళి పొట్టపోసుకోని బతికాము అప్పుడు.)

“మీ పర్తగిరికొస్తే అటే బోతున్నరు.” (కొత్తమాస్ ప్రభాకర్)

(మీ పర్వతగిరికి వస్తే అటే పోతున్నారు.)

పై ఉదాహరణలలోని ‘బెట్కున్న, బొయ్, బోతున్నరు’ వంటి మాటలలో ఉభయోష్ఠ్య అల్పప్రాణ శ్వాసస్పర్శం ‘ప’ పూర్వ, పర వర్ణాల ప్రభావంతో ఉభయోష్ఠ్య అల్పప్రాణ నాదస్పర్శం ‘బ’ గా మార్పు చెందింది.

3.8. బ>వ

“ఇప్పుడు దగ్గర దగ్గర ఇర్వయేండ్ల నుంచి కుట్నా గూడ ఎవ్వర్‌దన్న ఒక్కర్ది బ్లౌజు కరావైతెనె ఉంటది” (మర్రి రాజేశ్వరి)

(ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలనుంచి కుట్టినా కూడ, ఎవరిదో ఒకరిది బ్లౌజు కరాబవుతూనే ఉంటుంది.)

“ఆల్ దగ్గరదగ్గర ముప్పై నల్వయేండ్లైతుంది కుట్టవట్టి” (మర్రి రాజేశ్వరి)

(దగ్గరదగ్గర ముప్పై నలబై సంవత్సరాలవుతుంది వాళ్ళు కుట్టి.)

“ఆప్షనుంది గావట్టి మనవందులక్ పొయ్‌నం.” (ఏటెళ్ళి మణికంఠ)

(ఆప్షన్ ఉంది కాబట్టి నేను అందులోకి వెళ్ళాను.)

పై ఉదాహరణలలో ‘కరావైతెనె, కుట్టవట్టి, గావట్టి’ వంటి మాటలలో ఉభయోష్ఠ్య అల్పప్రాణ నాదస్పర్శం ‘బ’ స్థానంలో దంతోష్ఠ్య నాద ఊష్మం ‘వ’ చేరింది.

3.9. ‘మ కారం’ వచ్చే చోట ధ్వనిమార్పులు

“కరోనా సూదులు పాడుగాను అయ్యేస్కోనేవొఁ కాల్జేతులు కీల్లనొప్పులొచ్చి లేవకుంటాయె.” (పసుపులేటి యాదమ్మ)

(కరోనా సూదులు పాడుగాను అవి వేసుకుంటెనేమో కాళ్ళుచేతులు కీళ్ళనొప్పులు వచ్చి లేవలేకుండా అయ్యాను.)

“డిజైన్‌కాల్లెందుకిస్తరు, మేఁవె తీస్కుంటం.” (మర్రి రాజేశ్వరి)

(డిజైన్‌కి వాళ్ళు ఎందుకు ఇస్తారు, మేమే తీసుకుంటాం.)

“వాలకి పక్కెంపటి వేరే మేస్త్రొస్తడు.” (నామ చందు)

(వాళ్ళకి పక్కన నుండి వేరే మేస్త్రి వస్తాడు.)

పై ఉదాహరణలలో ‘అయ్యేస్కోనేవొఁ, మేవెఁ’ వంటి మాటలలో ఉభయోష్ఠ్య నాదానునాసికం ‘మ’ స్థానంలో దంతోష్ఠ్య నాద ఊష్మం ‘వ’ చేరుతోంది. దీనికి ఉచ్చారణలో ఆనునాసిక్యత ఆపాదించబడుతోంది. ‘పక్కెంపటి’ అనే మాటలో ద్విత్వ మకారం స్థానంలో బిందుపూర్వక ఉభయోష్ఠ్య అల్పప్రాణ శ్వాసస్పర్శం ‘ంప’ చేరింది.

3.10. పూర్ణానుస్వారం లోపించడం

“ఎవసాయాల్ చేస్కుటురు.” (తాడికొండ భిక్షమయ్య)

(వ్యవసాయాలు చేసుకుంటున్నారు.)

“కాలువ పనులైతుట్టె కాలువపనులకు పొయిన.” (పసుపులేటి యాదమ్మ)

(కాలువ పనులు అవుతుంటె, కాలువ పనులకు వెళ్ళాను.)

“అప్పుడు లైనింగ్ లేకుట్ట కుడ్తెనేఁవొ అర్వై రూపాలు.” (మర్రి రాజేశ్వరి)

(అప్పుడు లైనింగ్ లేకుండ కుడితేనేమో అరవై రూపాయలు.)

పై ఉదాహరణలలోని ‘చేస్కుటురు, పనులైతుట్టె, లేకుట్ట’ వంటి మాటలలో పూర్ణానుస్వారం లోపించినప్పుడు, పరిసర వర్ణాలకు ద్విత్వం లోపించడం లేదా ద్విత్వం రావడం గమనించవచ్చు.

3.11. ర>ల

“నలగొండ్ల ఎవలు కాలె.” (గోగు యాదయ్య)

(నల్లగొండలో ఎవరికీ రాలేదు.)

“ఎవలు? పెద్దిద్దులు శిన్నిద్దులా?” (దుబ్బ కృష్ణయ్య)

(ఎవరు? పెద్దిద్దులు చిన్నిద్దులా?)

“ఇపుడు వెంకట్రెడ్డి కోమట్రెడ్డి ఎవలో ఉన్నరు.” (తాడికొండ భిక్షమయ్య)

(ఇప్పుడు వెంకట్‌రెడ్డి కోమటిరెడ్డి ఎవరో ఉన్నారు.)

పై ఉదాహరణలలోని ‘ఎవలు, ఎవలో’ వంటి మాటలలో దంతమూలీయ నాద తాడితం ‘ర’ స్థానంలో దంతమూలీయ నాద పార్శ్వికం ‘ల’ చేరింది.

3.12. పదాది ‘వ’ లోపించడం

“యాపమండలు పెట్కోని, మాఁవిడి మండలు పెట్కోని ఆఁవకో బోనాన్ని మట్టికుండకు అలంకారం చేశి, తీస్కొచ్కోని అమ్మవారి పూజ్‌జేశి అమ్మవారి నైవేద్యం పెడ్తం.” (నాగోజు మల్లాచారి)

(వేపకొమ్మలు పెట్టుకోని, మామిడి కొమ్మలు పెట్టుకోని ఆమెకో బోనాన్ని మట్టికుండకు అలంకారం చేసి, తెచ్చుకొని అమ్మవారి పూజచేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం.)

“అమ్మవారి దగ్గరొండుకున్నా నువ్వెక్కడొండుకో కాని కుండల్నె ఒండుకోని రావాలె.” (నాగోజు మల్లాచారి)

(నువ్వు అమ్మవారి దగ్గరగాని, ఎక్కడైనా వండుకో కాని కుండలోనె వండుకొని రావాలి.)

“వాలకవగాహన లేక ఒట్టిగనే ఒరాల మందంటరు.” (ఓరుగంటి ఈశ్వరయ్య)

(వాళ్ళకు అవగాహన లేక ఊరికనే వరాల మందు అంటారు.)

“ఇపుడేదైన కనీసం కూలికన్న పొయినా ఇంత ఇలువుంటుందిగాని, ఆ కులవృత్తి పని అది అస్సల్ రానోడేంచేస్తడు?” (పసుపులేటి యాదమ్మ)

(ఇప్పుడు ఏదైన కనీసం కూలికన్న పొయినా కొంత విలువ ఉంటుంది కాని, ఆ కులవృత్తి పని అసలు రానివాడు ఏం చేస్తాడు?)

పై ఉదాహరణలలో ‘యాప’ మాటలో దంతోష్ఠ్య నాద ఊష్మం ‘వ’ స్థానంలో ‘య’ చేరినపుడు అర్ధసంవృత అగ్ర నిరోష్ఠ్య దీర్ఘాచ్చు ‘ఏ’ వివృత పశ్చాత్ దీర్ఘాచ్చు ‘ఆ’ గా మారింది. ‘ఒండు, ఒరం’ వంటి మాటలలో పదాది “వ” లోపించి అర్ధసంవృత పశ్చాత్ ఓష్ఠ్య హ్రస్వాచ్చు ‘ఒ’ చేరింది. ‘ఇలువ’ అనే మాటలో పదాది వకారం లోపించింది.

3.13. ళ>ల

“అద్దాలో, తాలాలో, దువ్వెన్లో అయ్యో ఇయ్యో అమ్మిర్రు.” (పసుపులేటి యాదమ్మ)

(అద్దాలో, తాళాలో, దువ్వెనలో అవో ఇవో అమ్మారు.)

“ఎవరన్న పెల్లి ఉన్నాగూడ మేమే, గిఫ్ట్ ఇయ్యాలన్న మేం నలుగురమే.” (కన్నెబొయిన శివ)

(ఎవరిదైన పెళ్ళి ఉన్నాకూడ మేమే, గిఫ్ట్ ఇవ్వాలన్నా మేం నలుగురమే.)

“తక్కువున్నందుకే వాల్లు మంచిగ చెప్పాలె.” (ఎల్గబొయిన భవాని)

(తక్కువ ఉన్నందుకే వాళ్ళు మంచిగ చెప్పాలి.)

పై ఉదాహరణలలో ‘తాళాలో, పెళ్ళి, వాళ్ళు’ వంటి మాటలలో మూర్థన్య నాద పార్శ్వికం ‘ళ’ ఇక్కడి ప్రజల వ్యవహారంలో దంతమూలీయ నాద పార్శ్వికం ‘ల’ గా వినిపిస్తుంది.

3.14. వర్ణలోపం

“కార్తీక పురానం కార్తీక మాసంలొ‌ చవుతం.” (నాగోజు మల్లాచారి)

(కార్తిక పురాణం కార్తిక మాసంలో చదువుతం.)

“జేష్టమాసంల జరిగే జాతర మట్కు పర్తగిరి, దరేశ్పురం గ్రామాల్నించొస్తరు.” (నాగోజు మల్లాచారి)

(జ్యేష్ఠమాసంలో జరిగే జాతరకు మాత్రం పర్వతగిరి, దర్వేశిపురం గ్రామాలనుంచి వస్తారు.)

“టాక్టర్ నేన్ నడపలె.” (ఓరుగంటి ఈశ్వరయ్య)

(నేను ట్రాక్టర్ నడపలేదు.)

“ఇగదే పని, అది దప్తే ఇంగేం చేస్తం?” (పసుపులేటి యాదమ్మ)

(ఇక అదే పని, అది తప్పితే ఇంక ఏం చేస్తాం?)

“తర్‌త ఇంగ సెకండియర్‌గిట ఇగా గౌతమి కాలేజిలనే ఏశిర్రు.” (నామ చందు)

(తరువాత ఇంగ సెకండియర్ కూడ గౌతమి కాలేజిలోనే వేసారు.)

“తల్లిపాల్ చీక్తె పిల్లల్ బత్‌తరు.” (దుబ్బ కృష్ణయ్య)

(తల్లిపాలు తాగితే పిల్లలు బతుకుతారు.)

మౌఖికవ్యవహారంలో పదాలలో వర్ణలోపం జరగడానికి అనుకరణ వైఫల్యం, సంయుక్త పదాలని పలకడంలో ఇబ్బంది పడడం, అవిద్య వంటి అనేక కారణాలు ఉన్నాయి.

3.15. పదమధ్య స్వరం లోపించడం

“పత్తిశేలక్ కల్పు తీయబొయిన, పత్తిగింజల్ పెట్టబొయిన.” (పసుపులేటి యాదమ్మ)

(పత్తిచేన్లకు కలుపు తీయడానికి వెళ్ళాను, పత్తిగింజలు పెట్టడానికి వెళ్ళాను.)

“గుర్కులకి రాపిద్దామని చూస్తున్న నేను.” (ఎల్గబొయిన భవాని)

(గురుకులకు రాయిద్దామని చూస్తున్నా నేను.)

“ఎయితునుంచి టెన్తు వర్కు అల్ల చదివిన.” (కన్నెబొయిన శివ)

(ఎయిత్ నుంచి టెన్తు వరకు అందులో చదివాను.)

పై ఉదాహరణలలో ‘కలుపు, గురుకుల’ వంటి మాటలలో పదమధ్య స్వరం ‘ఉ’ లోపించింది. ‘వరకు’ మాటలో పదమధ్య స్వరం ‘అ’ లోపించింది. త్వరితోచ్చారణ వల్ల పదమధ్య స్వరం లోపించడం సహజం.

ఉపసంహారం

ధ్వని పరిణామంలో ప్రధానంగా చర్చించుకొనే వర్ణసమీకరణం, వర్ణవిభేదం, వర్ణలోపం వంటి అనేక మార్పులు కనగల్ మండలంలోని ప్రజల మౌఖిక భాషలో వినపడుతున్నాయి. వాక్యం త్వరగా పూర్తి చేసే క్రమంలో పదాలను వెంటవెంటనే పలకడం సహజం. హలంత పదాలు అధికంగా ఉండడం ఇక్కడి ప్రజల వ్యవహారంలో గమనించవచ్చు. పదాలను కలిపి పలికే క్రమంలో పూర్వపదాంతాచ్చు లోపించి పరపదంతో సంధి జరగడం సాధారణం. ఇటువంటి రూపాలు కనగల్ మండలంలోని భాషావ్యవహారంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

“వాలకవగాహన లేక ఒట్టిగనే ఒరాల మందంటరు.”(ఓరుగంటి ఈశ్వరయ్య) ఈ వాక్యాన్ని విద్యావంతుల భాషలో(పుస్తకభాష) రాస్తే ఇలా ఉంటుంది; “వాళ్ళకు(>వాలకు) అవగాహన లేక ఊరికనే(>ఒట్టిగనే) వరాల(>ఒరాల) మందు అంటారు(>మందంటరు)”. ఈ వాక్యంలో ‘వరాలు’ అంటే ‘పొలం చుట్టూ ఉండే గట్లు’ అని అర్థం. ‘వరాల మందు’ అంటే ‘గట్లపై పెరిగే అనవసర గడ్డిని నివారించే రసాయనం’ అని అర్థం. 

భాషావ్యవహారంలో సంహితోచ్చారణం సహజం.  పైన ఉదహరించిన ఒక్క వాక్యంలోనే ఇన్ని ధ్వనిమార్పులున్నాయి. కాబట్టి, భాషలో ఇటువంటి ధ్వనిమార్పులను గుర్తించి ధ్వనిసూత్రాలను ప్రతిపాదించడానికి మరింత కృషి చేయవలసి ఉంటుంది. 
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు చేసిన భాషామండలాల విభజనని నేటికీ ప్రామాణికంగా గ్రహిస్తున్నాం. పూర్వ, దక్షిణ, ఉత్తర, మధ్య అనే నాలుగు మండలాల విభజనలో అంతర్విభాగాలు చేసి మౌఖికభాషను అధ్యయనం చేయడం నేటి అవసరం. భాషాభేదాల పరిశీలన చేయడానికి ముందు, ప్రాథమికంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మండల స్థాయిలో మౌఖికభాషపై భాషావిషయిక పరిశోధనలు జరిపినప్పుడు, వ్యవహార భేదక రేఖలతో సహా మార్పులను గుర్తించడం సులభమౌతుంది. ఇందువల్ల, మౌఖిక ఉచ్చారణలో ఒక తరంలో జరుగుతున్న మార్పులను సునిశితంగా గమనించవచ్చు. మౌఖిక ఉచ్చారణ సరిచేసుకోడం అన్నది ప్రతి తరంలో, ప్రతి భాషావ్యవహర్త ప్రయత్నించి సాధించవలసిన ఒక కౌశలం.

ఉపయుక్త గ్రంథసూచి

  1. కృష్ణమూర్తి, భద్రిరాజు. భాష-సమాజం-సంస్కృతి, నీల్ కమల్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2000.
  2. కృష్ణమూర్తి, భద్రిరాజు. తెలుగు భాషా చరిత్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2018.
  3. చంద్రయ్య, ఎస్. తిమ్మాజిపేట మండల మౌఖిక భాష - వర్ణనాత్మక వ్యాకరణం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2017.
  4. దక్షిణామూర్తి, పోరంకి. భాష-ఆధునిక దృక్పథం, పి. వరలక్ష్మి పబ్లిషర్స్, హైదరాబాదు, 1992.
  5. పవన్ కుమార్, పమ్మి. కట్టా వరదరాజు ద్విపద రామాయణం: భాషాపరిశీలన, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2003.
  6. పవన్ కుమార్, పమ్మి. తెలుగు మౌఖికవ్యవహారభాష: పరిశోధనావశ్యకత, మూసీ మాసపత్రిక, హైదరాబాద్, 2024.
  7. పవన్ కుమార్, పమ్మి & నవీన్ కుమార్, బొమ్మగాని. సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం: ప్రయోజనాలు, నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక, హైదరాబాద్, 2025.
  8. పవన్ కుమార్, పమ్మి & నవీన్ కుమార్, బొమ్మగాని. కనగల్ మండల మౌఖికవ్యవహారం: విలక్షణత, Language in India, హైదరాబాద్, 2025.
  9. మల్లేశ్, మంత్రి. తెలంగాణ మాండలిక నవలలు: భాషాపరిశీలన, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2019.
  10. రామారావు, చేకూరి. భాషానువర్తనం, చేరా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2000.
  11. రామారావు, చేకూరి. భాషాంతరంగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2000.
  12. రామారావు, చేకూరి. తెలుగు వాక్యం, కావ్య ప్రచురణలు, హైదరాబాద్, 2022.
  13. శ్రీహరి, రవ్వా. నల్లగొండ జిల్లా ప్రజలభాష, పతంజలి పబ్లికేషన్స్, హైదరాబాద్, 1986.
  14. సుబ్రహ్మణ్యం, పి.ఎస్. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2019.
  15. Catford, J. C. A Practical Introduction to Phonetics, Oxford University Press, England, 2001.
  16. Ladefoged, Peter & Johnson, Keith. A Course in Phonetics, Cengage Learning, Wadsworth, 2011.
  17. Pammi Pavan Kumar. Introduction to General Linguistics Course Lectures.
How to cite this article:
ఆచార్య పమ్మి పవన్ కుమార్, & బొమ్మగాని నవీన్ కుమార్ (2026). కనగల్ మండలంలోని తెలుగు మౌఖికవ్యవహారం: ధ్వనుల మార్పు. AUCHITHYAM, 7(12), 1–12. https://doi.org/10.5281/zenodo.24032317
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.