ఉపోద్ఘాతం:

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.    (భాగవతం 1వ స్కం. 19వ పద్యం)
అష్టాదశ పురాణాలలో భాగవత స్థానం పదిలమైంది. సభక్తికంగా, సుమధురంగా, వినయంగా భాగవతాన్ని తెలుగులో అందించిన పోతన కవి చరితార్థుడు.

బమ్మెర పోతన (1) వీరభద్ర విజయం, (2) నారాయణ శతకం, (3) భోగినీ దండకం, (4) భాగవతంలోని ఎనిమిది స్కంధాలు ( 1,2,3,4 మరియు 7 ,8, 9 ,10) రచించాడు. పంచమ స్కంధాన్ని గంగన, షష్ఠ స్కంధాన్ని సింగన, ఏకాదశ ద్వాదశ స్కంధాలను నారయ రచించారని తెలుగు సాహితీ జగతికి తెలిసిన విషయమే.. సుమారు 9 వేల పద్యగద్యాలతో విలసిల్లుతున్న ఆంధ్ర మహా భాగవతం భక్తిరస ప్రధానమైంది. వ్యాస విరచిత సంస్కృత భాగవతాన్ని  యథోచితానుసరణంగా పోతన తెనిగించాడు. సంస్కృత అలంకారికులు పేర్కొన్న రసం, గుణం, ధ్వని, వక్రోక్తి వంటి వాటికి పూర్వ పరిశోధకులు పోతన భాగవతం నుండి ఉదాహరణలు చూపించారు.

అదే వరుసలో కాశ్మీర పండితుడైన క్షేమేంద్రుడు చెప్పిన ఔచిత్యాన్ని పరిచయం చేసి  పోతన భాగవతం నుండి వాక్య సంబంధమైన ఔచిత్యాలను ఈ పరిశోధనా పత్రంలో వివరిస్తున్నాను.  క్రీ.శ. 11వ శతాబ్దికి చెందిన కాశ్మీర పండితుడైన క్షేమేంద్రుడు సుమారు 35 రచనలు చేసినట్లుగా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. వీటిలో 18 రచనలు లభ్యాలు. 17 రచనలు అలభ్యాలు. లభిస్తున్న వాటిలో  "ఔచిత్య విచార చర్చ" ఒకటి.

క్షేమేంద్రుడు పేర్కొన్న ఔచిత్యభేదాలు - లక్ష్యాలు :

క్షేమేంద్రడు ఔచిత్య విచార చర్చలో మొత్తం 27 రకాల ఔచిత్యాలను నిర్వచించి, లక్ష్యాలను పేర్కొన్నాడు.

శ్లో. పదే వాక్యే ప్రబంధార్థే గుణేలంకరణే రసే 

క్రియాయాం కారకే లింగే వచనేచ విశేషణే

ఉపసర్గే నిపాతే చ కాలే దేశే కులేవ్రతే 

తత్త్వే సత్త్వే ప్యభిప్రాయే స్వభావే సారసంగ్రహే

ప్రతిభాయా మవస్థాయాం విచారేనా మ్న్య ధాశిషి 

కావ్యస్యాంగేషుచ ప్రాహురౌచిత్యం వ్యాపిజీవితమ్ (ఔ.వి.చ. 8 -10 శ్లోకాలు)

ఔచిత్యం- భేదాలు:

1. పద, 2. వాక్య, 3. ప్రబంధార్థ,  4. గుణ, 5. అలంకార, 6. రస, 7. క్రియ, 8. కారక, 9. లింగ, 10. వచన, 11.విశేషణ, 12. ఉపసర్గ,  13. నిపాత, 14. కాల, 15. దేశ, 16. కుల, 17. వ్రత, 18. తత్త్వ, 19. సత్త్వ, 20. అభిప్రాయ, 21.స్వభావ, 22. సార సంగ్రహ, 23. ప్రతిభ, 24. అవస్థ, 25. విచార, 26. నామ,  27. ఆశీర్వచనం.

రసౌచిత్యం - భేదాలు:

1. శృంగార, 2. హాస్య, 3. కరుణ, 4. రౌద్ర ,5. వీర,  6. భయానక, 7. బీభత్స, 8. అద్భుత, 9. శాంత రసాలు.


కారకౌచిత్యం- భేదాలు:1.కర్తృ పద, 2. కర్మ పద,3. కరణ, 4. సంప్రదాన, 5 అపాదాన, 6. అధికరణ ఔచిత్యాలు.

ఈ 27 ఔచిత్యాలను డా.పి సుమతీ నరేంద్ర గారు *తిక్కన చేసిన మార్పులు ఔచిత్యపు తీర్పులు* అనే సిద్ధాంత గ్రంథంలో క్రింది విధంగా ఐదు భాగాలుగా వర్గీకరించారు. 

1. వాక్య సంబంధులు- 12. అవి :  1)పద, 2). వాక్య, 3). క్రియ, 4). కారక, 5 ). లింగ , 6) వచన, 7). కాల 8) నిపాత, 9) నామ,10) ఉపసర్గ, 11) విశేషణ, 12) ఆశీర్వాద.

2. వస్తు సంబంధులు 2. అవి: 1) ప్రబంధార్థ, 2) దేశౌచిత్యాలు.

3. పాత్ర సంబంధులు 5. అవి: 1) కుల 2) వ్రత 3). సత్త్వము 4) స్వభావ, 5) అవస్థ ఔచిత్యాలు.

4 .రస సంబంధులు 3:  అవి: 1) గుణము, 2) అలంకారము 3) రసము.

5. రచనా సంబంధులు 5.  అవి: 1) తత్త్వము 2) అభిప్రాయము, 3)సార సంగ్రహము 4) ప్రతిభా 5) విచార ఔచిత్యాలు. ఈ పత్రంలో పోతన భాగవతం నుండి వాఖ్య సంబంధ 12 ఔచిత్యాలను పరిచయం చేసి వివరిస్తున్నాను.

1. పదౌచిత్యం:

శ్లో. తిలకం బిభ్రతీ సూక్తి ర్భాత్యేకముచితం పదమ్ 

చంద్రాననేవ కస్తూరీ కృతం శ్యామేవ చాందనమ్ - 11


చంద్రుడిలా తెల్లని ముఖమున్న యువతి కస్తూరీతిలకం పెట్టుకున్నట్లు, చామనచాయగా ఉన్న స్త్రీ గంధపు తిలకం పెట్టుకున్నట్లు, తిలకాయమానమైన తగిన పదమున్న కావ్యం శోభిస్తుందని పదౌచిత్యంలో క్షేమేంద్రుడు చెప్పాడు.


పదౌచిత్యంలో ఒక పద్యంలో ప్రయోగించిన పదం సందర్భానికి తగినట్లుగా ఉండాలి. ఆహ్లాదకారిగా ఉండాలి. ఆ సందర్భంలో కవి పాఠకుడికి ఏ అర్ధాన్ని చెప్పదలుచుకొన్నాడో ఆ అర్థస్ఫూర్తిని ఇనుమడింప చేయగలిగిన పద ప్రయోగమే పదౌచిత్యమౌతుంది. క్షేమేంద్రుడు ఈ విధమైన ఔచిత్యానికి లక్ష్యంగా పరిమళ కవి శ్లోకంలో*ముగ్ధా* అన్న పద ప్రయోగ సార్థక్యాన్ని పేర్కొని నిరూపించాడు. భాగవత దశమ స్కంధంలోని ఈ పద్యం ఒక మచ్చుతునక.


ఉ. క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడిఁదాఁకి వీఁక వా

లమ్ముల తెట్టెలన్ పఱవ నడ్డము వచ్చి జయింతు వండ్రు ని

న్నమ్మిన ముగ్ధలన్ రహితనాథల నక్కట! నేఁడు రెండు మూఁ

డమ్ముల యేటుకాఁ డెగువ నడ్డము రాఁ దగదే కృపానిధీ!  (10వ స్కం. పూ. భా. 1057వ పద్యం)


ఓ దయామయా! కృష్ణా! రాక్షసులు ఒక్కపెట్టున చెలరేగి దేవతాసమూహాలను ఎదిరించి పట్టుదలగా వారిపై వాడి బాణాలు గుప్పిస్తుంటే, అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని పెద్దలంటారే. మరి, మేము నిన్ను నమ్ముకున్న ముగ్ధలం, నీ కోసం భర్తలను వదలి వచ్చిన భామలం. ఇలాంటి మమ్మల్ని పంచబాణుడైన మన్మథుడు వేటాడుతుంటే అయ్యో! అడ్డుపడవెందుకు? అని భావం.


దశమ స్కంధం పూర్వభాగంలో "గోపికా గీతలు"లోని పద్యమిది. ఇది గోపికలు బిడియం లేకుండా శ్రీకృష్ణుడితో తమ పరిస్థితిని వివరిస్తున్న సందర్భం. ఔచిత్యవంతమైన ఈ "ముగ్థలన్ "పదం ఇక్కడ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. "ముగ్ధులన్" పదం స్త్రీ పర్యాయవాచి. "అంతగా జ్ఞానం లేని స్త్రీ" అని అర్థం. ఇక్కడ "ముగ్ధలన్*" కాకుండా తన్వులన్, కాంతలన్ మొదలైన పదాలను వాడినా భావ సమన్వయానికి అర్థ పుష్టికి భంగం కలుగుతుంది. కాబట్టి పోతన ఈ సందర్భానికి తగిన విధంగా "ముగ్ధలన్" అన్న పదప్రయోగంతో పదౌచిత్యాన్ని పాటించాడు.

2. వాక్యౌచిత్యం:

శ్లో॥ ఔచిత్యరచితం వాక్యం సతతం సమ్మతం సతామ్ | 

త్యాగోదగ్రమివైశ్వర్యం శీలోజ్వలమివ శ్రుతమ్ ||12

ఔచిత్యంతో రాసిన వాక్యం కావ్యవివేచనంలో సమర్థులైన వారికి ప్రీతినిచ్చేదిగా ఉంటుంది. భాగవతం గజేంద్రమోక్షం ఘట్టంలో మకరం శిరస్సును సుదర్శన చక్రం ఖండించి గజరాజును విడిపించిన సందర్భంలోని ఈ పద్యంలో వాక్యాలన్నీ ఔచితీమంతంగా ఉన్నాయి.

శా. పూరించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యము

న్భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము

న్సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యము

న్దూరీభూత విపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్.  

విష్ణుమూర్తి విజయసూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని పోగొట్టేది. శత్రువుల సైన్యాలను పారదోలేది....

కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స

త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా

పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం

తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్. (8స్కం. 109 ప.)

దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంపమని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశమండలాన్ని కప్పివేసేది. అనేక విధములైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిన కాపాడేది అని భావం. 

వాక్య విశేషణాలతో కార్యానికి అన్వయించడానికి పద ప్రయోగాలతో వాక్యౌచిత్యం శోభిస్తుంది. ఇందులో "దూరీభూత విపన్నదైన్యమును నిర్దూతద్విషత్సైన్యమున్" అనే వాక్యం ఔచిత్యవంతంగా ఉంది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది పగవారి సైన్యాన్ని పారద్రోలేదైన శంఖధ్వని అని చెప్పడంలో ఔచిత్యం ఉంది. గజేంద్రుడు మొసలితో పెనుగులాడి బలమంతా తగ్గిపోయాకా, తనను రక్షించమంటూ సర్వేశ్వరుని దీనంగా వేడుకుంటే గరుడ వాహనుడే  పరుగుపరుగున వచ్చి చక్రాయుధంతో రక్షిస్తాడు. వెంటనే పాంచజన్యాన్ని పూరించాడు. ఇందులో పోతన ప్రయోగించిన సమాసాంతర్గత వాక్యాలన్నీ  ఔచిత్యవంతంగా ఉన్నాయి. "అర్థ సిద్ధి వాక్య ఫలం" కాబట్టి వాక్య నిర్మాణమే దానికి సాధనం. ఈ ఘట్టంలో విశేష వాక్య రచనను పోతన తీర్చిదిద్దాడు. ఈ విధంగా చక్కని వాక్యౌచిత్యాన్ని నిక్షేపించాడు.

3. క్రియాపదౌచిత్యం:

శ్లో. సగుణత్వం సువృత్తత్వం సాధుతా చ విరాజతే

కావ్యస్య సుజనస్యేవ యద్యౌచిత్యవతీ క్రియా 19

గుణాలు, మంచి వృత్తాలు, సాధుత్వం మొదలైన వాటితోపాటు క్రియౌచిత్యం కూడా కావ్యంలో ఉంటే సత్పురుషిడిలాగ రాణిస్తుంది. మంచి గుణాలు, నడవడిక, మంచితనమున్న వ్యక్తికి అతడు చేసే పనుల్లో కూడా ఔచిత్యం ఉంటే మరింతగా ప్రకాశిస్తాడు. అలాగే గుణవంతమైన, చక్కని వృత్తాలతో కూడిన వ్యాకరణ సాధుత్వమున్న కావ్యంలో క్రియాపదౌచిత్యముంటే ఎక్కువ బాగుంటుందని సూచించాడు.

ఉ. ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ

బ్బించితి, శస్త్రరాజిఁ బొడిపించితి, మీఁద నిభేంద్రపంక్తి ఱొ

ప్పించితి; ధిక్కరించితి; శపించితి; ఘోరదవాగ్నులందుఁ ద్రో

యించితిఁ; బెక్కుపాట్ల నలయించితిఁ; జావఁ డి దేమి చిత్రమో  (7స్కం.201ప)

“సముద్రాలలో ముంచింపించాను; గదలతో చావ మోదించాను; కొండలమీద నుంచి తోయించాను; కత్తులతో పొడిపించాను; క్రింద పడేసి ఏనుగులతో తొక్కింపించాను; కొట్టించాను; తిట్టించాను; ఎన్నో రకాలుగా బాధింపించాను; నిప్పుల్లోకి పడేయించాను; అయినా ఈ కుఱ్ఱాడు ప్రహ్లాదుడు చచ్చిపోడు. ఇదెంతో వింతగా ఉందే.
భాగవతం సప్తమ స్కంధం లో ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి హింసించిన ఈ సందర్భంలోని ఈ పద్యంలోముంచితి,మొత్తితి,పొడిపించితి,రొప్పించితి, ధిక్కరించి తి,శపించితి,త్రోయించితి, అనేవన్నీ క్రియాపదాలు. కథాగతమైన పరిణామంతో పాటు, తండ్రిగా హిరణ్యకశిపుడి వ్యధను కూడా తెలియజేసే విధంగా ఔచిత్యవంతంగా ఉన్నాయి. 

4. కారకౌచిత్యం :

శ్లో॥ సాన్వయం శోభతే వాక్యముచితైరేవ కారకైః 

కులాభరణమైశ్వర్య మౌదార్యచరితైరివ!! 20

వంశానికి అలంకారమైన ఐశ్వర్యం ఔదార్యంతో కూడిన నడవడికతో ప్రకాశించేటట్లు, కారకాలతో మంచి అన్వయంతో కూడి, వాక్యం కూడా ప్రకాశిస్తుంది. కారకౌచిత్యాన్ని విభక్తి ప్రత్యయాలననుసరించి సునిశితమైన కోణంలో ఔచిత్యపోషణను గూర్చి వివరించాడు.వాక్యం తగిన కారకాలతోనే మంచి అన్వయాన్ని పొంది ప్రకాశిస్తుంది. కారకౌచిత్యంలో క్షేమేంద్రుడు కర్తృపద, కర్మపద, కరణ, సంప్రదాన, అపాదాన, అధికరణౌచిత్యాలకు వివిధగ్రంథాలనుండి లక్ష్యాలను చూపించి వివరించాడు.ఏదైనా పని పూర్తికావడానికి ఎక్కువ ఉపయోగపడే సాధనానికి 'కరణం' అని పేరు. దాన్ని తెలిపే పదానికి కరణపదమని పేరు. ఈ కరణపదం త్వతీయా విభక్తిలో ఉంటుంది.

"క్రియాసిద్దౌ ప్రకృష్టోపకారకం కరణ సంజ్ఞం స్యాత్' అని సిద్ధాంత కౌముది. "క్రియాసిద్ధిం బ్రకృష్టోపకారకంబు కరణంబు" గా బాలవ్యాకరణం చెప్పింది. అంటే పని పూర్తికావడానికి మిగతా కారకాల కంటే ఎక్కువగా ఉపయోగపడేది కరణం.

ఆంధ్రమహాభాగవతం దశమ స్కంధము పూర్వ భాగము లోని కృష్ణుడు శివుడిగా కనిపించే సందర్భంలో చెప్పిన పద్యంలో అనేక కరణ పదాలను ఉపయోగించడం వల్ల కారకౌచిత్యం శోభిల్లింది.

సీ*. తనువున నంటిన ధరణీపరాగంబు;

పూసిన నెఱిభూతి పూఁత గాఁగ;

ముందల వెలుగొందు ముక్తాలలామంబు;

తొగలసంగడికాని తునుక గాఁగ;

ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు;

కాముని గెల్చిన కన్ను గాఁగఁ;

గంఠమాలికలోని ఘననీల రత్నంబు;

కమనీయ మగు మెడకప్పు గాఁగ;

ఆ.వె.హారవల్లు లురగహారవల్లులు గాఁగ;

బాలలీలఁ బ్రౌఢబాలకుండు

శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును

వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు. ( 10.స్కం‌.పూ.భా.297ప)

ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే.దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది, మెళ్ళోవేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి.అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు అన్నారు. ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.

అక్కడ  ఆడుకుంటున్న బాలకృష్ణుడి శరీరానికి అంటుకున్నవి, ఉన్నవి చూస్తుంటే శివుడి లాగా కనిపించాడట. 

5. లింగౌచిత్యం :

శ్లో॥ ఉచితైరేవలింగేన కావ్యమాయాతి భవ్యతాం 

సామ్రాజ్యసూచకేనేవ శరీరం శుభలక్ష్మణా  21

రాజలక్షణంచేత భవ్యత్వాన్ని పొందే శరీరంలాగ, లింగౌచిత్యంతో కావ్యం కూడా భవ్యత్వాన్ని పొందుతుంది. క్షేమేంద్రుడు తన 'లలిత రత్నమాల' గ్రంథంలో నుండి “నిద్రాం న స్పృశతి త్యజత్యపి ధృతిం ధత్తే స్థితిం నక్వచిత్..... పరాంగనా పరిగతం నామాపి నోసహ్యతే" అన్న శ్లోకాన్ని ఉదాహరణగా పేర్కొన్నాడు.

6. వచనౌచిత్యం :

శ్లో. ఉచితైరేవ వచనైః కావ్యమాయాతి చారుతాం

అదైన్య ధన్యమనసాం వదనం విదుషామివ. 22

దైన్యం లేకపోవడంతో ధన్యమైన మనసున్న విద్వాంసుల ముఖంలాగ, కావ్యం ఉచితమైన ఏక, ద్వి. బహువచనాల చేత శోభిస్తుంది. క్షేమేంద్రుడు తన నీతిలత' నుండి ఉదాహరణగా "తైలోక్యాక్రమణై ర్వరాహ విజయై ర్నిస్సంఖ్య రత్నాప్తిభిః సక్కదుద్యమశ్రమవశాద్వ్యాసక్త నిద్రం హరిం” అన్న శ్లోకాన్ని పేర్కొన్నాడు.

7.విశేషణౌచిత్యం:

విశేషణైస్సముచితై ర్విశేష్యోర్థ: ప్రకాశతే 

గుణాధికైర్గుణోదార: సుహృద్భిరివ సజ్జన: 23

గుణోదారుడైన సజ్జనుడు గుణాధికులైన మిత్రులతో ఎలా ప్రకాశిస్తాడో అలాగే కావ్యంలో విశేష్యార్థం తగిన విశేషణాలతో ప్రకాశిస్తుంది.

ఆంధ్ర మహాభాగవతం దశమస్కంధం ఉత్తర భాగంలోని అనిరుద్ధుణ్ణి  ఉష మందిరానికి తన మాయతో తీసుకొచ్చిన చిత్రరేఖను పొగుడుతున్న సందర్భంలో ఈ పద్యంలోని విశేషణాలు ఔచితీవంతంగా ఉన్నాయి.

సీ. అతివ! నీ సాంగత్య మను భానురుచి నాకుఁ;

గలుగుటఁ గామాంధకార మడఁగెఁ

దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ;

గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి

నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే;

నంగజ సంతాప మార్పఁ గంటి

వనిత! నీ చెలితనం బను రసాంజనముచే;

నా మనోహర నిధానంబుఁ గంటిఁ

తే. గలలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు

వారు నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె?

నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక

కాక గల్గునె మూఁడు లోకములయందు? " (10స్కం.ఉ.భా 370 ప)

భావము:“చెలీ! నీ సాంగత్యం అనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలైపోయింది. సుందరీ! నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖీ! నీ అనుబంధం అనే అమృతవర్షంతో మన్మథతాపం చల్లార్చుకొన గలుగుతున్నాను. మానినీ! నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని చూడ గలుగుతూ ఉన్నాను. కలలో కనిపించిన వానిని చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కానీ, అవును అనగానే వానిని తీసుకువచ్చే వారు ఎవరైనా ఉంటారా? నీవు అంటే నీటిలో జాడలు తీయగల నేర్పుకలదానివి. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవారు ఎవరూ లేరు.”


8. ఉపసర్గౌచిత్యం :

శ్లో. యోగ్యోపసర్గ సంసర్గై ర్నిరర్గల గుణోచితా! 

సూక్తిర్వివర్ధతే సంప త్సన్మార్గ గమనైరివ  24


సన్మార్గంలో ప్రవర్తించడంవల్ల వృద్ధిపొందే ఐశ్వర్యంలాగ, తగిన ప్రాదులు మొదలైన ఉపసర్గలతో కావ్యం ఉన్నతిని పొందుతుంది.


వ్యాకరణపరంగా 'ఉపసర్గలు’ మొత్తం 22 ఉన్నట్లు ఈ కింది శ్లోకం ద్వారా గ్రహించవచ్చు.

శ్లో. ప్రపరాపావ సమను నిర్మిసాజ్ దుర్దుసధ్యపి

విన్యతి స్వభ్యుప పరిప్రత్యుత్ర్పాదయ ఈరితాః!

(లఘుసిద్ధాంత కౌముది, అచ్ సంధి ప్రకరణం)


ప్ర, పరా, అప, అవ, సమ్, అను, నిర్, నిస్, ఆజ్, దుర్, దుస్, అధి, అపి వి, ని, అతి, సు, అభి, ఉప, పరి, ప్రతి, ఉత్ - అన్నవి ప్రాదులు. 'ఉపసర్గా: క్రియాయోగే" అన్న సూత్రాన్నిబట్టి ఈ ప్రాదులు క్రియలతో (ధాతువులతో) కలిసి ఉపసర్గలుగా వ్యవహారంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కింది పద్యంలో ఇలాంటి ఉపసర్గౌచిత్యం ఉంది.

కం. సుర లసురాంతకు మీఁద

న్వరమందారప్రసూనవర్షము లోలిం

గురిసిరి తుములంబై దివి

మొరసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌. (10.స్కం.1260ప)


వృకాసుర సంహారం తర్వాత దేవతలు మందార ప్రసూన వర్షం కురిపించారు. ఇందులో ప్ర ఉపసర్గ.. దానవుడి వల్ల అంతవరకు బాధలు పడ్డారు.. ఆ బాధ ఇప్పుడు తొలగించాడు గనుక ప్రసూనాలు కురిపించారు. ఈ సందర్భంలో పోతన సురలు సూనవర్షాన్ని   కురిపించారని చెప్పవచ్చు. అవి ప్రకృష్టమైనవిగా  "ప్ర"అన్న ఉపసర్గ చేర్చి వాటి మహత్తును మరింత పెంచి చెప్పాడు. అందువల్ల ఇక్కడ  ఉపసర్గౌచిత్యం భాసించింది.


9.నిపాతౌచిత్యం:

శ్లో.ఉచితస్థాన విన్యస్తై ర్నిపాతై రర్థసంగతి: 

ఉపాదేయైర్భవత్యేవ సచివైరివ నిశ్చలా  25

ఉత్తమ సచివుల సహాయంతో ధనప్రాప్తిలో సందిగ్ధం లేనట్లే, తగిన స్థానాల్లో 'తు', 'చ' మొదలైన నిపాతల్ని ప్రయోగించడం ద్వారా కావ్యంలో కూడా అర్థసంగతి నిశ్చలంగా ఉంటుంది. క్షేమేంద్రుడు తన 'మునిమతమీమాంస' అన్న గ్రంథం నుండి 

"సర్వే స్వర్గసుఖార్ధినః క్రతుశతైః ప్రాజ్యై ర్యజంతే జడా:

........................ భో: సత్యం చ నిత్యం చ యత్"

అన్న శ్లోకాన్ని లక్ష్యంగా పేర్కొన్నాడు.గ్రహించదగిన, తగిన స్థానాల్లో ఉంచదగిన నిపాతల చేతకూడా కావ్యానికి "అర్ధసంగతి" కలుగుతుందని క్షేమేంద్రుడి భావన. 'అర్థసంగతి' అంటే అర్థం తగిన విధంగా ఉండడం.


సంస్కృతంలో చ, తు, హి మొదలైనవి నిపాతలు. గ్రహించదగిన వీటిని సముచిత స్థానాల్లో ప్రయోగిస్తే కావ్యార్థంలో ఎలాంటి సందిగ్ధత ఉండదని క్లేమేంద్రుడు 'వృత్తి'లో ఇలా పేర్కొనాడు. "ఉపాదేయై శ్చాదిభిః నిపాతై: ఉచితపదవీ నివేశితై కావ్యస్యార్ధసంగతి: అసందిగ్ధా సత్సహాయైరివ భవతి" అని 'చ' మొదలైన నిపాతల ప్రయోగాన్నిబట్టికూడా ఔచిత్యానౌచిత్యాలను విధించాడు. 


కానీ తెలుగుభాషలో వీటికి ప్రయోగాలు లేవు. ’తెలుగులో భావస్ఫూర్తిని కలిగిస్తూ, రసపోషక సాహాయ్యకాలయిన 'కట', 'భళీ' మొదలయిన అవ్యయాలే నిపాతలు” అని క్రీ.శే. చెలమచర్ల రంగాచార్యులు శ్రీ కాళహస్తి మాహాత్మం పీఠికలో రాసిన కొన్ని వాక్యాలను బట్టి తెలుస్తోంది. భాగవతంలో ఈ కింది పద్యంలో ఈ ఔచిత్యముంది.


"అక్కట వచ్చి పెద్దతడ వయ్యెను; హోమమువేళ దప్పె; నే

నిక్కడనేల యుంటి; ముని యేమనునో" యని భీతచిత్త యై

గ్రక్కునఁ దోయకుంభము శిరస్థలమందిడి తెచ్చియిచ్చి వే

మ్రొక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్చె నల్కుచున్.   ( 9 స్కం.468ప)

“అయ్యో! ఇక్కడకు వచ్చి చాలాసేపు అయింది. హోమం చేసే సమయం దాటిపోయింది. నేను ఎందుకిలా ఉండిపోయాను. ఋషి ఏమంటాడో?” అని రేణుక భయపడింది. వెంటనే నీటికుండ నెత్తికెత్తుకు వచ్చింది. భర్త ఎదురుగ చేతులు జోడించి బెదురుతూ నిలబడింది అని భావం.

నవమ స్కంధంలో పరశురామ చరిత్రలో రేణుకాదేవి అనుకున్నటువంటి పద్యం ఇది.. నీళ్లు తెస్తానని నదికి వెళ్లి అక్కడ గంధర్వులను చూసిన కాసేపటికి ఇలా అనుకుంటుంది! ఇక్కడ  పోతన "అక్కట"అనే నిపాతను ప్రయోగించాడు. ఇది రేణుకాదేవి మనసులోని భావాన్ని ధ్వనింపచేస్తోంది. ఈ నిపాతతోనే కరుణ రస పోషక సాహాయ్యకంగా వ్యక్తమవుతోంది కాబట్టి ఇక్కడ నిపాత ఔచిత్య వంతమైంది.


10. కాలౌచిత్యం : 

శ్లో. కాలౌ చిత్యేన యాత్యేవ వాక్యమర్థేన చారుతాం

జనావర్జన రమ్యేణ వేషేణేవ సతాం వపు:  26

సమయానికి తగిన వేషంతో సౌందర్యాన్ని పొందే సత్తురుషుల శరీరంలాగ, కాలానుగుణంగా ఏర్పడిన ఔచిత్యంతో కూడిన వాక్యం కూడా అందంగా ఉంటుంది. క్షేమేంద్రుడు కాలౌచిత్యాన్ని నిరూపించడానికి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు మూడింటికీ వేరు వేరుగా లక్ష్యాలను చూపించాడు. భాగవతంలో ఈ కాలౌచిత్యం ఈ క్రింది విధంగా ఉంది..

భూతకాలం:

పాండవుల రాజసూయయాగంలో  శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తున్న సందర్భంలో భూతకాలం ఔచిత్యం శోభిల్లింది.

సీ! గురుదేవశూన్యుండు కులగోత్రరహితుండు;

దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన

మప్పులఁ బొరలెడు నాదిమధ్యావసా;

నంబులం దరయ మానంబు లేదు

బహురూపియై పెక్కుభంగుల వర్తించు;వా

వి వర్తనములు వరుస లేవు

పరికింప విగతసంబంధుండు తలపోయ;

మా నిమిత్తంబున మాని సయ్యెఁ

బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి

వాసి కెక్కదు యీ యదువంశమెల్ల

బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు

బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు? (10.ఉ.భా.790 ప)

పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలన్నిటినీ శిశుపాలుడు గుర్తు చేస్తూ యయాతి శాప వృత్తాంతాన్ని కూడా ఉటంకించండంతో ఇక్కడ భూతకాలౌచిత్యం శోభిల్లింది.


భవిష్యత్ కాలం:

వామన చరిత్రలో వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మూడు అడుగుల నేలను దానమిమ్మని అడిగినప్పుడు,వామనుడు బలి చక్రవర్తితో ఆడిన మాటల్లో భవిష్యత్ కాలం ఉంది.

మ. గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. ( 8.స్కం.572 ప)

గొడుగో మరొక్కటో నాకెందుకు? నేన డిగిన మూడు అడుగుల నేల మాత్రం ఇప్పిస్తే అదే నా పాలిట బ్రహ్మాండం.. అని పలికిన వామనమూర్తి మాటల్లో బ్రహ్మాండం మొత్తం ఆక్రమించబోతున్నట్లుగా స్ఫురిస్తుంది.. ఈ పద్యం భవిష్యత్ కాలౌచిత్యానికి చక్కని  ఉదాహరణ.

11. నామౌచిత్యం:

నామ్నా కర్మానురూపేణ జ్ఞాయతే గుణదోషయోః

కావ్యస్య పురుషస్యేవ వ్యక్తి: సంవాదపాతినీ  38

కర్మానురూపంగాపురుషుడికి నామం కలిగే విధంగా కావ్యానికి కూడా కలిగి ఔచిత్యం వికసిస్తుంది.
మహాభాగవతంలో బలరామకృష్ణులకు పేరు పెట్టే సందర్భంలో నామౌచిత్యం ఇలా ఉంది.


కం.“జనులు రమియింపఁ దిరిగెడి

యనువు కలిమి రాముఁ డనియు యదు సంకర్షం

బున సంకర్షణుఁ డనియును

ఘన బలమున బలుడు ననియు గణుతించె నృపా!”. (10.స్కంపూ.భా-287.)

మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి “యీ శిశువు ధవళారుణపీత వర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె; వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె; నీ పాపనికి గుణరూపకర్మంబు లనేకంబులు గలుగుటం జేసి నామంబు లనేకంబులు గల; వీ శాబకునివలన మీరు దుఃఖంబులఁ దరియింతు; రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబు సజ్జనరక్షణంబు నగు నీ కుమారుండు నారాయణ సమానుం” డని చెప్పి; తన గృహంబునకు నమ్మునీశ్వరుండు జనియె; నందుండును బరమానందంబున నుండె; అంత.(10స్కం.పూ.భా.-288-వ).

నారాయణ సముడౌతాడని కృష్ణుడి పేర్ల ను గర్గుడు వివరించిన ఈ సందర్భంలో నామౌచిత్యం చక్కగా పాటించబడింది.

12. ఆశీర్వచనౌచిత్యం :

శ్లో. పూర్ణార్థదాతు: కావ్యస్య సంతోషిత మనీషిణ 

చితాశీర్నృ పస్యేవ భవత్యభ్యుదయావహా 39

తగిన ఆశీఃపదం అభ్యుదయకారణమౌతుంది. భాగవతంలో వామన చరిత్ర లో వామనుడు వస్తూనే చక్రవర్తిని ఆశీర్వదించిన విధానంలో ఈ ఔచిత్యం భాసించింది.

ఉ. స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి

ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం

ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ

న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.!  (8.స్కం. 545 ప)

“ముల్లోకాలనూ శాశించే అధికారం కలవాడా నీకు స్వస్తి! అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెల పోయేలా చేసినవాడా! ఉన్నత పదవిలో మెలిగేవాడా! మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా! దేవతాస్త్రీల మెడలలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా! సమస్త రాక్షసలోక సార్వభౌముడా! నీకు శుభ మగుగాక.”ముల్లోకాలనూ శాసించే అధికారం ఉన్నా నీకు స్వస్తి అని ఆశీర్వదించడం లోనే ఔచిత్యం శోభిల్లింది.

ముగింపు:

ఈ విధంగా పోతన భాగవతంలోని వాక్య సంబంధమైన 12  ఔచితీ మర్యాదల్ని ప్రస్తావించి, క్షేమేంద్రుడు పేర్కొన్న  ఔచిత్యరీతులకు లక్ష్యాల్ని గుర్తించి లక్షణాలతో సమన్వయించాను.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. ఆంధ్ర కవుల ఔచిత్య విచారణ - కాశీ భొట్ల సత్యనారాయణ-సాహిత్య అకాడమీ ప్రచురణ.
2. ఆంధ్ర మహాభాగవతము రస పోషణము -తాత వెంకటలక్ష్మిస్వీయ ప్రచురణ విజయనగరం.
3. ఔచిత్య ప్రస్థానము చారిత్రక సమీక్ష-స్ఫూర్తిశ్రీ టి భాస్కరరావు
4. ఔచిత్య విచార చర్చ-జమ్మలమడక మాధవరామ శర్మ- అభినవభారతి ప్రచురణలు గుంటూరు
5. కావ్యాలంకార సంగ్రహం-రామరాజభూషణుడు.
6. తెలుగు ప్రాచీన పంచకావ్యాల్లో ఔచిత్య సిద్ధాంతం పరిశీలన (సి.గ్రం) రాంభట్ల పార్వతీశ్వర శర్మ విశాఖపట్నం
7. పోతన భాగవతము 5 సంపుటాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు.. తిరుపతి
8. శ్రీనాథుని సాహిత్య ప్రస్థానం (సి.గ్రం)-జంధ్యాల జయకృష్ణ బాపూజీ గుంటూరు.