ఉపోద్ఘాతము:

స్పర్శ అనగా తాకిడి. ఇది జ్ఞానేంద్రియాలలో త్వగింద్రియార్ధం. కళ్ళు లేనివారు సైతము తాకిడి ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. అనగా వారికి చర్మం, కళ్ళువలె పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ స్పర్శను ఆధారంగా చేసుకొని అనేక విశ్వవిద్యాలయాల్లో బోధనాభ్యసన కూడా విరివిగా జరుగుతుంది. నేత్ర దివ్యాంగులు కూడా చక్కగా ఈ విద్యను అభ్యసించవచ్చు. సాధారణ విద్యార్ధుల కళ్లకు గుడ్డను కట్టి, వివిధ వస్తువులను తాకించి, ఈ స్పర్శజ్ఞానాన్ని గూర్చి బోధిస్తారు.

అప్పుడే పుట్టిన ఒక చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే, ఆ పిల్లవాడి ఏడుపును ఆపుదామని అతని తండ్రి, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య మొదలగు బంధువులందరు ఎంత లాలించిన ఆ ఏడుపును ఆపలేరు.  ఒక్కసారి అతని తల్లి ఎత్తుకున్నంత మాత్రాన ఆపిల్లవాడు ఏడుపు ఆపేస్తాడు. అందుకు కారణం ఆ పిల్లవాడు గర్భస్థ శిశువుగా ఉన్నపుడు ఆ తల్లి హృదయ స్పందనకు అలవాటు పడిన ఆ శిశువు తన తల్లి తాకిడి తనకు తగలగానే తగు రక్షణ పొందానని భావించి ఊరడిల్లుతాడు. స్పర్శలో మమకారం, ప్రేమ, సుఖం, సంతోషం, ఆనందం దాగి ఉన్నవని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఇటువంటి అద్భుతమైన స్పర్శసిద్ధాంత ఆనవాళ్ళు మన సాహిత్యంలో విరివిగా కనిపిస్తున్నవి. 

మహాభారతం-స్పర్శ:

మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలో దుష్యంతుడు తనభర్తని నిరూపించడానికి ఆశ్రమధ్రర్మాల్లో గృహస్తాశ్రమధర్మాన్ని గూర్చి, గృహిణి ప్రాధాన్యతను గూర్చి, సత్యవాక్యప్రాథాన్యతను గూర్చి, కుమారుని గొప్పదనమును గూర్చి ఎన్నో విధాలుగా తెలియపరిచింది. కాని దుష్యంతుడు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు శకుంతల స్పర్శసిద్ధాంతాన్ని నమ్మి, తన కుమారుని స్పర్శ వలన కలుగు సుఖము ద్వారా సత్యాన్ని తెలుసుకొంటాడని చెప్పడానికి దిగువ పద్యమును చూడండి.

మ. విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.  ఆ.మ.భా.ఆది. చతుర్థా.(13)
 

ఓరాజా! విరుద్దాలైన వేయిమాటలెందుకు? ఈ పుత్రుణ్ణి కౌగిలించుకొని ఈతడి కౌగిలివలన కలిగే సుఖాన్ని అనుభవించు. చల్లదనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించే ముత్యాలహారాలూ, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధమూ, వెన్నెల… మొదలగు వస్తువులు ఇవ్వలేనంత చల్లదనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని జీవులకు పుత్రుని  కౌగిలి ఇస్తుందని శకుంతల దుష్యంతునితో చెప్పింది. 

ఈ పద్యం నన్నయగారు స్పర్శసిద్దాంతాన్ని ప్రతిపాదించే ఉత్తమ ఉదాహరణంగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. ఇందులో నన్నయగారు జీవులకు అని చెప్పడంలో అర్థం సకలజీవరాసులు తమ సంతానాన్ని కౌగిలించుకోవడంలో ఉన్న సుఖం మరెక్కడా పొందలేరని తెలుస్తుంది.  కేవలం మనుషులకే కాక అన్ని జీవరాశులకు మమకారము, ప్రేమ, సుఖము, ఆనందము మొదలగునవన్ని సమానంగా ఉంటాయని తెలుస్తుంది.

ఆహారనిద్రాభయమైథునఞ్చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ । హితో.౦.౨౫॥ 

ఈ శ్లోకపాదానుసారము తిండి - నిద్ర - భయం - రతిక్రియ అనే ఈ విషయసమూహము మనుష్యులకు పశువులకు సమానమని విజ్ఞులు చెప్పారు. నన్నయగారు పై పద్యంలో జీవులకు అని చెప్పడం ద్వారా ఇప్పుడు వాటితోపాటే పుత్రగాత్ర పరిష్వంగమును కూడా చేర్చవలసి ఉంటుందని నా అభిప్రాయము.

ఎన్ని మాటలు చెప్పిన దుష్యంతుడు ఒప్పుకోలేదు. శకుంతల  తన దుస్థితిని చింతిస్తు తన కుమారుని తీసుకొని వెళ్లిపోతున్న సందర్భంలో ఆకాశవాణి వచ్చి శకుంతల ఇంతవరకు చెప్పినది సత్యమని భార్యాబిడ్డలను ఆదరణతో చూడమని సభలోనున్నవారందరికి తెలిసేవిధంగా చెప్పింది. అప్పుడు దుష్యంతుడు సంతోషముతో ఈ క్రింది విధంగా చేసెను.

వ. మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి, (31) ఆ.మ.భా.ఆది.చతుర్థా.

దుష్యంతుడు అమిత ప్రేమతో కొడుకును ఎత్తుకొని సంతోషంగా కౌగిలించుకొన్నాడు. నిజానికి ఒక వ్యక్తి తన ప్రేమను తనవారికి తెలియపరచాలన్నా, తాను సంతృప్తి పొందాలన్నా వారిని ఆప్యాయతతో పలకరిస్తాడు. అరుదైన, అవసరమైన, విలువైన బహుమతులిస్తాడు. ఇలా అనేక రకాలుగా తెలియపరచినా పూర్తి సంతృప్తి పడలేడు . ఆవ్యక్తి నూటికి నూరు శాతం సంతృప్తి పడాలంటే కేవలం తనవారిని కౌగిలించుకోవడం వల్ల మాత్రమే తన ప్రేమాతిశయాన్ని తెలియపరచి సంతృప్తి పడగలడని పైన తెలిపిన వాక్యం ద్వారా తెలియుచున్నది.

రామాయణం - స్పర్శ:

మొల్ల రామాయణంలోను ఈ స్పర్శసిద్ధాంత ఆనవాళ్ళు విరివిగా కనిపిస్తున్నవి. లక్ష్మణసమేత సీతారాములు అరణ్యవాసానికి వెల్తున్నపుడు సరయునదిని దాటునపుడు కవయిత్రి మొల్ల ఈ స్పర్శను గూర్చి గుహుని ద్వారా చమత్కారంగా తెలియపరిచన పద్యమును చూడుము.

చ. సుడిగొని రాముపాదములు సోకినధూళివహించి ఱయెయే
యేర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగనీతని పాదరేణువి
య్యెడవడి నోడసోకనిది యేమగునోయని సంశయాత్ముడై 
కడిగె గుహుండు రామపదకంజయుగంబుభయమ్మ పెంపునన్  - మొ.రా.అయో.32

ఓ రామ! పూర్వము గౌతమాశ్రమంలో నీ పాదము తాకి ధూళి స్త్రీ (అహల్య) గా మారిందట. ఇప్పుడాపాదములు నా ఓడను తాకనున్నవి. అప్పుడు నా ఓడ ఏమౌతుందోనని గుహుడు భయపడుతున్నాడని మొల్ల చెప్పింది.


విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవ స్సహ లక్ష్మణః I
విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమ మథావిశత్ I I  - వా.రా.బా.కా.49వ సర్గ-12

దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ I
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురా సురైః I I  -  వా.రా.బా.కా.49వ సర్గ-13

ముగింపు:

గౌతముని భార్యయైన అహల్య పుణ్యపురుషుడైన శ్రీరామచంద్రుని పాదస్పర్శకోసం వేచిచూడటం, చివరకు అతని స్పర్శ తగలగానే అహల్యకు శాపవిమోచనమవడం మరియు రాముని పాదస్పర్శ తగిలితే ఈ ఓడ ఏమౌతుందోనని గుహుడు భయపడడం ఇవన్ని స్పర్శసిద్ధాంత ఆనవాళ్ళే.  ఇలాంటి  స్పర్శసిద్ధాంత ఆనవాళ్ళు మన సాహిత్యంలో ఇంకా చాలా ఉన్నవి.

ఉపయుక్త గ్రంథసూచి:

1) ఆంధ్రమహాభారతము – ఆదిపర్వం – నన్నయ.
2) మొల్లరామాయణము -  కుమ్మర మొల్ల – రామా అండ్ కో – ఏలూరు.
3) వాల్మీకి రామాయణమ్ – వాల్మీకి – గీతాప్రెస్ – గోరక్పూర్.
4) హితోపదేశః - నారాయణపండితః