AUCHITHYAM

An On-line Research Journal of Telugu Language & Literary Studies

ప్రచురణ: డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం-531173.

వ్యాసాలకు ఆహ్వానం

పరిశోధన పత్రాలకు ఆహ్వానం

ఆంధ్రభాషాసాహిత్యాలపై పరిశోధనాత్మకత దినదినాభివృద్ధి చెందుతున్న శుభతరుణమిది. విశ్వవిద్యాలయాల స్థాయిలో, కళాశాలల్లో మన వాజ్మయ విషయంగా ఎన్నెన్నో వైవిధ్యమైన పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. సదస్సులు, సమావేశాలు, కార్యశాలల్లోనూ.. పరిశోధన పత్రికల్లోనూ.. ప్రత్యేకంగా పుస్తకాలరూపంలోను చోటుచేసుకుంటున్న చర్చలు, విశ్లేషణలు, సిద్ధాంతాల నిరంతరాయ కృషితో "తెలుగులో పరిశోధన" ఇప్పటికే ఉత్తమ ఫలితాలనందిస్తూ సమాజోద్ధరణకు దోహదపడుతోంది.

ఈ నేపధ్యంలో అన్నిసమయాలలోను, విశ్వవ్యాప్తంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రామాణికమైన పరిశోధనావ్యాసాలను ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంకల్పంతోనే "ఔచిత్యమ్.కామ్" అనే పేరుతో ఒక పరిశోధనాత్మక అంతర్జాల తెలుగు మాసపత్రికను నిర్వహించాలనే సదుద్దేశంతో - డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్, విశాఖపట్నం శ్రీకారం చుట్టింది.

ఆదివారం తేదీ: 25.10.2020 - విజయదశమి పర్వదినం సందర్భంగా - “ఔచిత్యమ్” - అంతర్జాల తెలుగు మాసపత్రిక తొట్టతొలి సంచికను ప్రచురించాం. అనుభవజ్ఞులైన వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యుల, విషయనిపుణుల పర్యవేక్షణలో e-research Journal గా ఈ మాసపత్రిక పురుడుపోసుకుంది.

విశ్వవిద్యాలయాలలోని సహాయాచార్యులు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించిన మీ కృషిని పరిశోధన వ్యాసాల రూపంలో ‘ఔచిత్యమ్.కామ్’ లో ప్రచురించి వాటికి శాశ్వతత్వాన్ని కల్పించండి..!

ప్రామాణిక పరిశోధన పద్ధతుల్ని, విధివిధానాలను అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాల మాసపత్రికకు మీ వ్యాసాలు పంపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ్యాల్లోని వివిధ భాషాశాఖల సౌజన్యంతో, పరిశోధన వ్యాసాలతో ప్రతిసంచిక పరిపుష్టంగా నెల నెలా సాగాలని ఆకాంక్షిస్తున్నాం.! విశ్వమంతా వ్యాపించి ఉన్న తెలుగు భాషా ప్రేమికులు, పరిశోధకులు కూడా తమతమ ఆలోచనల్ని భాషాసాహిత్యవ్యాసాల రూపంలో పంచుకోగలరని ఆశిస్తున్నాం.!

వ్యాసరచయితలు ఏడు ప్రధానమైన విషయాలను తప్పని సరిగా అనుసరించగలరని విన్నపం:

ఏదైనా UNICODE FONTలో మాత్రమే అక్షరదోషాలు లేకుండా Type చేసిన మీ పరిశోధన పత్రాన్ని ప్రతి నెల 15వ తేదీ లోపు editor@auchithyam.com అనే E-Mail Addressకు పంపాలి. పేజీల పరిమితిలేదు. ఈ అంతర్జాల మాసపత్రిక సంచిక ప్రతి నెల చివరివారంలో విడుదలౌతుంది.

1. పత్రశీర్షిక క్లుప్తంగా, తగినవిధంగా ఉండాలి.

2. మీ పేరు, విద్యార్హతలు, వృత్తివివరాలు, చిరునామా, సెల్ నెంబరు, ఈ మెయిల్ అడ్రసు తప్పనిసరిగా వరుసగా ఉండాలి.

3. ‘ఉపోద్ఘాతం’ పేరుతో వ్యాసం ప్రధానోద్దేశాన్ని సంక్షిప్తంగా రాయాలి.

4. విషయవిభాగాలకు తగిన విధంగా ఉపశీర్షికలను (Side Headings) రాయాలి.

5. ఉల్లేఖాలను (రిఫెరెన్సులు) రాసేటప్పుడు (వ్యాసం మధ్యలో శ్లోకాలు, పద్యాలు, కవితలు, గేయాలు, ఇతరుల ఉటంకింపులు, ఉదాహృతాలు మొదలైనవి) వాటికి
              సంబంధించిన వివరాలను వరుసగా పుస్తకం పేరు, భాగం, సంఖ్య మొ. తప్పని సరిగా సంక్షిప్తాక్షరాలలో బ్రాకెట్లో పేర్కొనాలి (Harvard System of Referencing).

6. ఉపసంహారం లేదా ముగింపు వాక్యాలుగా పరిశోధన ఫలితాలను / సారాంసాన్ని వెల్లడించాలి.

7. ఉపయుక్తగ్రంథసూచిక పేరుతో వ్యాసరచనకు తోడ్పడిన ఆధారగ్రంథాలు (బిబిలోగ్రఫి) అకారాది అనుక్రమణికలో (కవి/రచయిత పేరు, పుస్తకం పేరు, ప్రచురణ వివరాలు               మొదలైనవి) రాయాలి.

వ్యాసకర్తలు ఈ అంశాలన్నీ పరిశీలించి వ్యాసాన్ని పంపగలరని మనవి. వ్యాసాల ప్రచురణ విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయం.

- సంపాదకమండలి

ఔచిత్యమ్ - పరిశోధనాత్మక అంతర్జాల తెలుగుమాసపత్రిక