ఉపోద్ఘాతం:-

నవవిధ భక్తులలో గానం కూడా ఒకటి. గానం ద్వారా దేవుడిని స్తుతిస్తూ ఆత్మానందం పొందటం, తాదాత్మ్యత చెందటం అనేది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక పద్ధతి. గానంలో ఎన్నో విధాలైన ప్రక్రియలు ఉన్నాయి. అయితే నారికేళ పాకలవంటి కొన్ని శాస్త్రీయ ప్రక్రియలు పామరులకి అంతుబట్టవు. అందుకే ఎక్కువశాతం మంది ద్రాక్షాపాకం అయిన సినీ గీతాల వైపు మొగ్గు చూపుతారు. ఈ సినీగీతాలని ఆస్వాదించే వారిలో పండితులూ పామరులూ కూడా ఉంటారు. అందుకే విద్వత్తు ఉన్న కొందరు రచయితలు నారికేళ పాకాలని - ద్రాక్షా పాకాలుగా మార్చి వేదవేదాంగాలలో ఉన్న దైవీ తత్వాలను సినీభక్తి గీతాల ద్వారా పామరులకు అందిస్తుంటారు. అలాంటి రచైతలలో శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారు ఒకరు.


సంగ్రహం:-

సాగరసంగమం చిత్రం లోని “ ఓంనమఃశివయ” గీతం లో భక్తి, వేదాంతం, తాదాత్మ్యత నిబిడీకృతం అయి ప్రతీ అక్షరం ఒక పూజా కుసుమంలా పరిమళిస్తుంది.


ముఖ్యాంశాలు:-

శివ తత్వానికీ, గణిత శాస్త్రానికి ఉన్న లంకె , ఉపనిషత్ సారం, లోక కల్యాణం.

విశ్లేషణ:-

1983 లో, కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో, సంగీత-నాట్యాల మేళవింపుతో రూపుదిద్దుకున్న కళాఖండం “సాగరసంగమం” అనే చిత్రం. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శతదినోత్సవాలు పూర్తి చేసుకుని, రష్యన్ భాష లోకి అనువదింపబడిన తొలి తెలుగు చిత్రం ఇది. మైసూర్ నగరంలో సంవత్సర కాలం పాటు ఆడి, మన హృదయాలలో కలకాలం ఆడుతున్న చిత్రమిది. అంతేకాక సంగీత జ్ఞాననిధి ‘ఇళయరాజకి’ జాతీయ అవార్డు అందించిన సినిమా ఇది. ఇలా ఎన్నో విశేషాలున్న అజరామర చిత్రం సాగరసంగమం.


“సాగర సంగమం” అంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నట్టు కళలన్నీ దైవంలో కలిసిపోతాయని భావన. ఏ కళలోనైనా శిఖరాలు అందుకొని తన్మయత్వం పొంది ఆచరిస్తే, మోక్షం ప్రాప్తిస్తుందనీ, అదే జీవిత పరమార్థం అని ఎలుగెత్తి చాటే చిత్రం ఇది. ఎన్నో కుటుంబాల ఆలోచనా విధానాన్ని మార్చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చూసిన ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకి నాట్య శాస్త్రం నేర్పించారు. సినిమా అనే శక్తిమంతమయిన మాధ్యమం యొక్క ప్రభావం ఇలా అనూహ్యంగానే ఉంటుంది సమాజం మీద. సవ్యసాచి తపస్సు చేసి మరీ పాశుపతం పొందినట్లు కళాతపస్వి సినిమా అనే శక్తిమంతమయిన ఆయుధాన్ని పొంది లోకకల్యాణం కోసం సద్వినియోగం చేసుకున్నారు. ఆనాటి సవ్యసాచికి గాండీవం లా ఈనాటి కళాతపస్వి కి వేటూరి లభించారు. వేటూరి గారి మస్తిష్కం లో పుట్టే అనంతమయిన ఆలోచనలు అక్షయతూణీరాలు, ఆయన గీతాలు గురి తప్పని అర్జున బాణాలు. సాగరసంగమం చిత్రంలో తొలి గీతమయిన” ఓంనమఃశివాయ” లోని అర్థాలు, అంతరార్థాలు, ఆధ్యాత్మిక భావాలు గమనిద్దాం.


#ప# “ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమఃశివాయ
చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ
సాంద్రకళాపూర్ణోదయా లయ నిలయ”

నటరాజు కి వందనం అర్పిస్తూ నాట్యకారిణి “ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ” అనడం లో ఆ పరమశివుడికి వందనం ఘటిస్తున్నట్టు అర్థం అవుతూనే ఉంది కానీ ఇక్కడ శివుడిని “చంద్రకళాధర సహృదయ” అని ఎందుకు అనవలసి వచ్చింది ? శివపురాణం లో ఉన్న కథ ప్రకారం “ చంద్రుడి మామగారైన దక్షుడు తన అల్లుడికి క్షయ వ్యాధి వచ్చి క్షీణించిపోయేలా శాపం ఇవ్వడం, తన తోడల్లుడు అయిన శివుడి దగ్గరకు చంద్రుడు వెళ్లి రక్షించమని కోరుకోవడం, అభయమిచ్చిన శివుడు, చంద్రకళని తాను ధరించి (చంద్రుడి ఆల్టర్ ఈగో ని), క్షయమ్ కలిగి మళ్లీ పరిపూర్ణుడు అయ్యే చంద్రుడిని మాత్రం రోజుకొక కళ తో లోకులకు దర్శనం ఇచ్చేలా వరం ఇవ్వడం” మనకి తెలిసిన కథే, . ఈ కథ ని చిత్ర కథానాయకుడి వేటూరి గారు అన్వయించి అగామి సూచకంగా చెప్పించారు నాట్యకారిణి పాత్రద్వారా. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణించిపోతున్న బాలు అనే కళాకారుడు చంద్రుడిగా, అతను క్షీణించినా అతని ప్రతీరూపంగా(ఆల్టర్ ఇగో) గా కలకాలం వర్ధిల్లే చంద్రకళ గా “నాట్య మయూరి” శైలు గా భావించి రాసిన పల్లవి ఇది.


అలాగే”సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా” అని వేటూరి గారు శివుడిని స్తుతించడంలో “సాంద్రకళా” అంటే లలితకళన్నిటిలో పరిపూర్ణుడు అయి వెలిగే నటరాజ, ఓ లయ కారకుడా నీకు వందనం అంటూ “పూర్ణోదయా” అనే పదం వాడారు వేటూరి. ఈ పదప్రయోగంలో ఒక గమ్మత్తు0ది, సాగరసంగమం చిత్రం పూర్ణోదయా బ్యానర్ పై రూపు దిద్దుకుంది, వారికి వేటూరి గారు కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నారు ఈ పాట ద్వారా. పల్లవిలోనే ఇంత సాంద్రత ఉంటే ఇక చారణాల సంగతి చెప్పేదేముంది?

#చ1#
పంచభూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతీ-పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసప్తకమై
నీ చూపులే అటు అష్టదిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందార నీ మౌనమే
దసోపనిషత్తయ్ ఇల వెలయా ఓంనమః శివాయ” అంటాడు వేటూరి.

గణితశాస్త్రం లో 5 నించీ పది దాకా ఉన్న సంఖ్యలకీ ఆ పరమశివుడికి చమత్కారంగా ముడి పెట్టారు వేటూరి.

పంచ భూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి రూపాలను తన అయిదు ముఖాలలో కలిగి ఉన్నవాడు శివుడు. శివుడి పంచముఖాలని ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత అంటారు.

ఆరు ఋతువులు శివుడి వేషధారణ లోనే ఉన్నాయ్ అంటాడు వేటూరి. సిగలోని గంగ ఇలకు జారే వేళ వర్షఋతువు, ఆ సిగలోనించి చంద్రుడు చల్లగా నవ్వే వేళ శరత్ ఋతువు, శివుడి మూడో కంటి నిప్పు గ్రీష్మ ఋతువు, మంచుకొండల మధ్యనున్న వేళ మంచుకురిసే హేమంత ఋతువు, లోకాలన్నీశివుడి లో లయం అయిపోయి వేళ ఆకురాలే శిశిర ఋతువు, ఆయన వద్దనున్న భాస్మం లోనించి కొత్త ప్రాణం రూపు దిద్దుకునే వేళ వసంత ఋతువు,, ఇలా ఆ భూతనాథుడిలోనే సమస్త ఋతువులు నిక్షిప్తమయి ఉన్నాయట. 

అటువంటి ప్రకృతిరూపం కలిగిన శివుడితో పార్వతి నడచిన ఏడు అడుగుల సవ్వడే మనకు సప్తస్వరాలయినాయిట. శివుడి చూపులే అష్టదిక్కులైనాయిట. శివుడు ఎటు చూస్తే మనకు ఆటే దిక్కు, ఆయన ఏ దిక్కుకైనా ఏ కాలానికైనా చూడగలడు, శివుడి ఎడమకన్ను భూతకాలానికి, కుడి కన్ను వర్తమాన కాలానికి ప్రతీకలు కాగా సదా మూసి ఉండే మూడో నేత్రం భవిష్యత్ కాలానికి ప్రతీక! శివుడి పలుకులు నవరసాలు! ఎప్పుడూ తపస్సు చేసుకునే శివుడు అవసరం అయితేనే మౌనం విడిచి అర్థవంతమయిన మాటలు మాట్లాడతాడు, అందుకే అవి నవరసభరితాలు, నిత్యం నిరుపయోగంగా మాట్లాడే వారి మాటలు రసహీనాలు. 

ఇక ముఖ్యమయిన పాదం ఈ చరణం చివరన ఉంది. “ తాపస మందార నీ మౌనమే దసోపానిషత్తయ్ ఇల వెలయా” అనడంలో వేదాంత సారం ఉంది. ఉపనిషత్తులు అనేవి వేదాల చివర వస్తాయి, అవే వేదాంతములు, వేదాంతములు పూర్తిగా జ్ఞానకాండ అయి బ్రహ్మ విద్యగా భాసిస్తూ పరమాత్మ, ఆత్మజ్ఞానం, మోక్షము వంటి వాటిగురించి బోధిస్తుంది. 4 వేదాలకి గాను, 1180 ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిల్లో 108 మరింత ముఖ్యం అయినవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ముఖ్యం అయినవి, ఈ దసోపనిషత్తుల గురించి తత్వ బోధనలలో పదేపదే చెబుతుంటారు తత్వజ్ఞులు. శివుడి ఆనంతమయిన మౌనంలో ఇంత తత్వం ఉంది. ఎంతో లోతయిన వేద వేదాంత ఆత్మజ్ఞాన సారం ఎరిగిన కర్మయోగి వేటూరి.అందుకే ఆయన రాసే ఇలాంటి పాటలు వింటే ఆత్మ జ్ఞానం పొందాలని కైవల్యామృతం గ్రోలాలనిపిస్తుంది.

రెండో చరణంలో -

#2# త్రికాలములు నీ నేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమాధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతికలయా
ఓం నమః శివాయ”

ముందే చెప్పుకున్నట్టు మూడు నేత్రాలు మూడు కాలాలకి ప్రతీకలు అయి ఉంటాయి. అగ్నినేత్రం భవిష్యత్ కాలానికి ప్రతీక, ఎడమ కన్ను భూత కాలానికి, కుడి కన్ను వర్తమాన కాలానికి ప్రతీకలు. . అందుకే త్రికాలములు నీ నేత్ర త్రయమై అన్నాడు వేటూరి. విశ్వమంతా వ్యాపించి ఉన్న శివుడికి నాలుగు గోడల కట్టేశాడు వేటూరి! నాలుగు వేదాలు అనే ప్రాకారాల మధ్య విహరించేవాడా అంటాడు!”చతుర్వేదములు ప్రాకారములై” అని రాశాడు. అంటే వేదాలలో నిక్షిప్తమయి ఉన్న ఓ వేద విహారా అని ప్రణమిల్లుతున్నాడు.

శివుడి ప్రమధ గణాలు, అలాగే పుత్రులయిన వినాయకుడు కుమారస్వామి ఋత్విజవరులై (ఋక్కులు వల్లించే వేదం పండితులై) శివుడి సంకల్పానికి దోహద పడుతున్నారట. ఏమిటా సంకల్పం అంటే లోక కళ్యాణం. అలాంటి శివుడికి ఆదియోగమ్ ఏది? అద్వైతమే(జీవాత్మ పరమాత్మ కీ అబేధం చూపడం) శివుడి అడుగుల లయలో కాలం నడుస్తోందిట, ఆయన గానంలో జతకలిపి పాడుతున్నాయిట జంత్ర(వాయిద్యాలు) గాత్రాలు అన్నీ, ఈ లోకకల్యాణం నెరపే నేపథ్యంలో.

ముగింపు:-

ఎంతో భక్తిరస ప్లావితంగా ఉన్న ఇలాంటి పాట రాయలంటే ఆ పరమశివుడిని లోతుగా అర్థం చేసుకుని, ఆయన కరుణకి పాత్రులైతేనే తప్ప సాధ్యం కాదు! ఈ పాటొక పంచామృతాభిషేకం. వెల కట్టలేని అమూల్యమయిన ఈ భక్తి గీతానికి ముకుళిత కమలహస్తాలతో కైమోడ్పులు అర్పించడం తప్ప ఇంకెలా సత్కరించగలం? వెలికితీసే కొద్దీ,విశ్లేషించేకొద్దీ, ఈ గీతం లో ఆనంతమయిన భావాల కెరటాలు మన మనసుని తడుపుతూనే ఉంటాయి. ఈ కార్తీకమాసం లో ఈ గీతికా కుసుమాన్ని ఆ పరమశివుడికి సమ్పర్పించుకుని ధన్యులం అవుదాము.
స్వస్తి.

ఆధారాలు:

1. youtube”సాగరసంగమం” చిత్రం.

2. Youtube “ ఓం నమః శివాయ “ గీతం.

3. వికీపీడియా:- 1983 సాగరసంగమం.

4. గూగుల్:- “ఓం నమఃశివాయ” పూర్తి సాహిత్యం.