AUCHITHYAM | Volume-3 | Issue-9 | September 2022| ISSN: 2583-4797
1.'ఊరికే పుట్టవు మన సామెతలు'
సాయికృష్ణ రంగ
తెలుగు ఉపాధ్యాయులు, ది ఆగా ఖాన్ అకాడమీ హైద్రాబాద్
పరిశోధక విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
సెల్: 9666999343, email: rng.saikrishna9@gmail.com
ఉపోద్ఘాతం:
మన తెలుగు భాష సంపద అంతా ఇంత కాదు. చెప్పాలంటే చేట భారతం అంత వుంది. సామెతలు ఆ సంపదలో ఒక భాగం. సామెతలు కొన్ని సూక్తుల్లా ఉంటాయి, కొన్ని దృష్టాంతాలుగా ఉంటాయి, మరికొన్ని అర్దాంతరన్యాసంగా ఉంటాయి. ఏ గాధనో, నమ్మకాన్నో, ఆచారాన్నో, ప్రవృత్తినో, వృత్తినే పురస్కరించుకొని ఉంటాయి. ఫ్రానీస్ బేకెన్ అన్నట్టు 'The genius wit and spirit of a nation are discovered in its proverbs’ అన్నాడు. ఎవరో గాని 'A man’s life often built on proverbs' అన్నారు. ఇవన్నీ సామెతల ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని నొక్కి చెప్తాయి. సామెతలలోని విశేషాలన్నిటిని గ్రహించి, సూక్ష్మంలో మోక్షంలాగ ప్రస్తుతమున్న పరిస్థితులను కొంత వరకు అవగతం చేసుకొనే విహంగవీక్షణం లాగ రాసే ప్రయత్నం చేశాను.
నిరాశపూరితాలు:
వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు వున్నదానితో తృప్తి పడక సంతృప్తి చెందక చైనా వాడి అరాచక బుద్ధితో యావత్ ప్రపంచమంత కరోన బారిన పడింది. ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ, తుమ్ముకు తమ్ముడు లేడు అనుకుంది ఇటలీ ! చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది! మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు ఇటలీ కంటుకుంది కరోనా ! ఆక్కడితి ఆగి పోయిందా లేదే ఇంతింతై, వటుడింతై అన్నట్లు విచ్చలవిడిగా ప్రపంచమంతా విజృంభించింది దానికితోడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రజలు అందరు ఇప్పుడు వారి వారి సొంత లాభానికి జీవించారు. కీడెంచి మేలంచాలనుకుని ప్రభుత్వాలు LOCK DOWN ప్రకటించాయి! వాన రాకడ! ప్రాణం పోకడ ఎవరి కెఱుక మరి! చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? కాబ్బట్టి మనం ఎంత జాగ్రత్తగా వుంటే అంతా మంచిది. మనకు మాత్రమే కాదు అందరికీ. బతికుంటే బలుసాకు తినొచ్చని కొందరూ, ఊపిరుంటే ఉప్పమ్ము కోవచ్చని కొందరూ మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే వుంటున్నారు.
స్వీయదోషాలు:
కానీ కొందరు నలుగురిట్లో నారాయణ, గుంపులో గోవిందా అని అందరు వస్తున్నారు కదా. నేను కూడ బయటకు వస్తానులే అని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొరివితో తల గోక్కోకండిరా అని పోలీసోళ్లు మొదటి రోజు నుండే సుద్దులూ, బుద్ధులూ చెప్పారు! ఐనా వినలేదు ! ఎందుకు వినాలి? ఇక కుదరక దండం దశ గుణం భవేత్ అనుకున్నారు పోలీసులు! వడ్డించే వాడు మనోడైతే అన్నట్టు వడ్డించడం మొదలెట్టారు! వారి స్టయిల్లో. పట్టి పంగానామాలు పెడితే - గోడ చాటుకెళ్లి చెరిపేసుకున్నట్లు కొంత మాది ఏమి పట్టిచుకోకుండా తిరుగుతునే ఉన్నారు! ఒకవైపు కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకడం మొదలై గంగ ప్రవాహంలా ముంచుకొస్తుంది, ఐన ప్రజలు 'అన్నీ తెలిసినమ్మ అమాస నాడు చస్తే - ఏమీ తెలీనమ్మ ఏకాశి నాడు చచ్చినట్లు' దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. పొర్లించి, పొర్లించి కొట్టినా మీసాలకు మన్నంట లేదన్నట్టు తిరుగుతూనే ఉన్నారు. ఇంకొందరు ! అందుకే అన్నారు పెద్దలు - కుక్కతోక వంకర అని!
ఆశావాదాత్మకాలు:
ఐనా మోసేవాడికి తెల్సు కావడి బరువు అన్నట్లు డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల పరిస్థితి మనకు ఎలా అర్ధముతుంది. మనం అదృష్టవంతులం. ఇంట్లోనే వుంటూ నచ్చినవి తింటూ వేడివేడిగా టీ కాఫీ లు తాగుతూ టీవిలో సీరియల్స్ చూస్తూ నెట్లో సిరీస్లు సినిమాలు చూస్తూ, సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు కుదిరితే షేర్లు చేస్తూ కూర్చున్న మనకు ఏమి తెలుసు ఏమి తెలియదు ఎందుకంటే మనం అదృష్టవంతులం. అడిగే వాడికి చెప్పేవాడు లోకువన్నట్లు కరోనా ఎప్పుడు తగ్గుతుంది? వ్యాక్సిన్ అందరికీ వెయ్యడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతారు కొందరు మేధావులు! అనుభవజ్ఞులందరూ మాకు మాత్రం ఏం తెలుసు. ఐతే ఆదివారం, కాకుంటే సోమవారం అంటున్నారు! అగ్నికి, వాయువు తోడైనట్లు A నుండి B కి, B నుండి C కి అది పాకూతువుంది! తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం! కొండల్లే వచ్చిన ఆపద మంచల్లే కరుగు తుందన్నట్లు దేనికైనా TIME రావాలి కదా ! ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మరి ! అందుకే ప్రజలందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా అన్నీ జాగ్రతలు పాటించి ఇంట్లోనే సంతోషంగా సురక్షితంగా ఉండండి!
ముగింపు:
మనం జాగ్రత్తగా వుండడమంటే కేవలం మనం మాత్రమే జాగ్రత్తగా వుండడం కాదు, మనం బాగున్నాము అంటే మన చుట్టూ వున్న వారు కూడ బాగుంటారు అనే పరిస్థితిలోకి మనం వచ్చేసాము. సంతోషమే సగం బలం మరి! ఇప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి శుచి, శుభ్రత పాటిస్తూ, ఆహారపు అలవాట్లు ఆచార, వ్యవహారాలు మార్చుకోండి! ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని అందరూ ఎదురు చూడండి!
ఉపయుక్తగ్రంథాలు:
1. కృష్ణకుమారి, నాయని, తెలుగుసామెతలు, పరిశోధన, (1979) ఆంధ్రసాహిత్యపరిషత్, హైదరాబాద్.
2. గంగాధరం,నేదునూరి, వ్యవసాయసామెతలు, (1956), విశ్వసాహిత్యమాల ప్రచురణలు, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.
3. గోపాలకృష్ణ, రెంటాల, తెలుగుసామెతలు, (1997), నవరత్న బుక్ సెంటర్ ప్రచురణలు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
4. నరసింహారెడ్డి, పాపిరెడ్డి, తెలుగుసామెతలు - జనజీవనం, (1983), శ్రీనివాసమురళి పబ్లికేషన్స్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
5. రామనరసయ్య, టి.వి., తెలుగు సామెతలు - ఒక సవిమర్శక పరిశీలనము, (1994), స్వీయప్రచురణ, హైదరాబాద్.