Editor-in-Chief
“Satavadhani”
Dr. Rambhatla Parvatheeswara Sarma
Assistant Professor in Telugu,
Sri Sathya Sai Institute of Higher Learning (SSSIHL)
Executive Editors
Dr. MBSS Narayana
Assistant Professor in Sanskrit,
Sri Sathya Sai Institute of Higher Learning (SSSIHL)
Dr. P. Srinivasa Rao
Faculty of Telugu, Colleges of Arts & Commerce,
Andhra University
Associate Editors
Mrs. G. Yamuna Rani
Assistant Professor in Telugu,
Sri Sathya Sai Institute of Higher Learning (SSSIHL)
Dr. R. Ganapati Rao
Assistant Professor in Telugu,
RGUKT Srikakulam
Dr. P. Mukunda Rao
Assistant Professor in Telugu,
RGUKT Srikakulam
Dr. P. Chiranjeevi Rao
Assistant Professor in Telugu,
RGUKT Srikakulam
Dr. K. Hanumanta Rao
Assistant Professor in Telugu,
RGUKT Srikakulam
AUCHITHYAM | Volume-3 | Issue-11 | October 2022 | Second Anniversary Special Issue - ISSN: 2583-4797
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తేది. 29
ఆగస్ట్ 2022న
"ప్రతిభ డిగ్రీ మరియు పిజి కళాశాల", సిద్ధిపేట ఆధ్వర్యవంలో నిర్వహించిన "మహాభారత ఔచిత్యం"
అంతర్జాలసదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం
3. భారతంలో కుటుంబజీవనచిత్రణ
రమాదేవి ఇడుకోజు
(MA Telugu, TPT, NET, SET,
Ph.D.)
తెలుగు ఉపన్యాసకురాలు, సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ కళాశాల,
భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: 7981199283, E-Mail:
ramanarendra1985@gmail.com
ఉపోద్ఘాతం:
సంస్కృతంలో తొలి సాహిత్యం వాల్మీకి రాసిన రామాయణ కావ్యం ద్వారా ఏర్పడింది. తెలుగులో తొలి సాహిత్యం నన్నయ చేసిన భారతకావ్యఆంధ్రీకరణ ద్వారా ప్రారంభమైంది. సాహిత్యం ఏ భాషలో వెలువడిన అది సమాజానికి హితంచేసేది అయి ఉంటుంది. రామాయణ భారతాలు మానవుడి వ్యక్తిత్వ నిర్మాణానికి రెండు కళ్ళలాంటివి. భారతీయులు ఈ కళ్ళ ద్వారా సమాజాన్ని చూసి ఎలాంటి ప్రవర్తన ఏర్పరుచుకోవాలి, ఎలాంటి ప్రవర్తన విసర్జించాలి అనే విషయాన్ని తెలుసుకొని మసలుకొంటారు. అయితే రామాయణంలో కుటుంబజీవనాన్ని చూడవచ్చు. కానీ భారతంలో కుటుంబజీవనంతో పాటు ఒక సమాజ పోకడను చూడవచ్చు. అందుకే వ్యాసుని భారతంలో చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పబడింది. ఇందులో చెప్పని విషయం మరెచటను చెప్పబడి ఉండదని, లోకంలో ఉన్నదే ఇందులో ఉన్నదని భారతప్రాశస్త్యాన్ని ఒక్కమాటలో తెలియచేశారు. ఈ ఒక్క వాక్యం చాలు భారతం గొప్పతనాన్ని తెలుసుకోవడానికి
ఆదిమానవుడు మొదటగా ఒక వ్యక్తిగా మాత్రమే జీవించాడు. క్రమక్రమంగా పరిణామం చెందుతూ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, తర్వాత సంఘజీవిగా ఎదిగాడు. ఒక వ్యక్తి నుండి సంఘజీవిగా ఎదగడానికి మధ్య వారధి కుటుంబం. అంటే వ్యక్తికి మొదటి సమాజం కుటుంబం. ఈ కుటుంబం అనే చిన్నసమాజంలో బంధాలను పటిష్టం చేసుకుంటే సామాజికబంధాలను కూడా సులువుగా పటిష్టం చేసుకోగలడు. కుటుంబంలో సరైనబంధాలు ఏర్పరుచుకోలేని వ్యక్తి సంఘంలో ఇతరవ్యక్తులతో సరైనబంధాలను ఏర్పరచుకోలేకపోతాడు. అందుకే మనిషి సంఘజీవిగాఎదగాలంటే కుటుంబజీవనాన్ని పరిపుష్టం చేసుకోవాలి. భారతకథలో కుటుంబంలో ఉండే అన్ని మానవసంబంధపాత్రలు మనకు తారసపడతాయి. కుటుంబంలో ఎలాంటి బంధాలు ఉంటాయి. ఆ బంధాలను భారతంలో ఎలా చిత్రీకరించారో ఈవ్యాసంలో తెలుసుకుందాం.కుటుంబ జీవనవికాసంలో మొదటి అడుగు వైవాహికబంధం, రెండవది తల్లితండ్రులు - సంతానం, మూడువది-సహోదరులు, నాలుగవది పెద్దలు వీరందరూ కలిస్తేనే ఒక కుటుంబం ఏర్పడుతుంది.
వైవాహిక బంధం :
అసలు కుటుంబం ఏర్పడేది వైవాహికబంధం ద్వారా. వైవాహిక బంధంలో వ్యక్తులు వివాహానికి ముందు వధువు, వరులు. వివాహం తర్వాత భార్యాభర్తలుగా మారుతారు. కావున భారతంలో వధువు, వరుడు, బార్యభర్తల లక్షణాలను వివరించి వైవాహిక బంధాన్ని పటిష్టం చేశారు. భారతంలో పలు సందర్భాల్లో వధువు వరుడు ఎలా ఉండాలి. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే సంఘంలో గౌరవాన్ని కలిగి ఉంటారో వివరించబడింది. మొదట వరుడు అంటే ఎలా ఉండాలో అష్టావక్రుడి జీవన విధానం ద్వారా తెలుసుకుందాం. అష్టావక్రుడు అనే బ్రహ్మచారి వధాన్యుడనే ముని కుమార్తె సుప్రభను పెళ్లిచేసుకోవాలని తలచుతాడు. వాదాన్యుడు తన కుమార్తెను వివాహం చేసుకోవాలంటే ఉత్తర దిక్కున పార్వతీదేవి తపస్సు చేసే చోటు ఉంటుంది, పవిత్రమైన ఆ ప్రదేశాన్ని దర్శించిరమ్మంటాడు. అలా దర్శించిన పిమ్మట తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అష్టావక్రుడు అలాగే అని ఉత్తరదిక్కుగా ప్రయాణించి వెళతాడు. మొదట కుబేరనగరం వస్తుంది. అక్కడ కుబేరుడు ఎదురుపోయి సాదరంగా ఆహ్వానించి అష్టవకురుడికి అతిథి సత్కారాలు చేస్తాడు. తన రాజ్యంలో ఉండమని వేడుకుంటాడు. రాజభోగాలు, రంభ ఊర్వసుల నాట్యాలు, స్వర్గాన్ని తలపించే సకల సదుపాయాలు కల్పిస్తాడు. కానీ అష్టవకురుడు వాటికి చలించకుండా ఒక సంవత్సరకాలం పాటు అక్కడే గడిపి కుబేరుడి దగ్గర సెలవు తీసుకుని మళ్లీ బయలుదేరుతాడు. హిమాలయాలను ఎక్కి రత్నాలు పొదిగిన మేడను చేరుకుంటాడు. ఒక యవ్వనవతి అయిన యువతి అష్టవక్రుడిని ఆహ్వానిస్తుంది. తన అందచందాలతో, ఐశ్వర్యాలతో అతడిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. అష్టవక్రురుడు సున్నితంగా ఆమెను తిరస్కరించి వెళ్లిపోతాడు. చివరికి తన గమ్యాన్ని చేరుకొని సుప్రభను వివాహం చేసుకుంటాడు. ఈ కథలో మొదట అష్టావక్రుడు కుబేరుడి నగరానికి వెళ్ళాడు. కుబేరుడి నగరం అంటే ధనానికి, భోగభాగ్యాలకి నిలయాలు. కుబేరుడు చూపిన భోగభాగ్యాలకు చలించకుండా అక్కడ ఒక సంవత్సరకాలం పాటుగడిపాడు. అంటే వరుడి గుణగణాల్లో ప్రప్రదమైనది. ఐశ్వర్యమొహితుడు కాకుండా ఉండడం. రెండవ గుణం పరస్త్రీపట్ల అనాసక్తత కలిగి ఉండడం. ఈ రెండు గుణాలు కలిగిన యువకుడు వరుడుగా యోగ్యమైనవాడని అష్టావక్రుడి పాత్ర ద్వారా వరుడు జీవనవిధానం ఎలా ఉండాలో భారతంలో చిత్రీకరించబడింది.
సంవరణుడు పాత్రద్వారాకూడావరుడిజీవనం, గుణగణాలు ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. సంవరణుడు అరణ్యాలకు వేటకు వెళ్ళాతాడు. అరణ్యంలో ఒక దివ్యసుందరిని చూసి, మనసులో గాఢమైన ప్రేమను ఏర్పరచుకుంటాడు. వెంటనే తన ప్రేమను వ్యక్తం చేయడం కొరకు ఆసుందరి వద్దకు వెళ్లి "ఓ సుందరి నీవెవరు నాకు నీపట్ల మిక్కిలి ప్రేమ కలిగింది." అని తన మనసులోని మాటను తెలియజేస్తాడు. ఆ యువతి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి అదృశ్యమైపోతుంది. అప్పటి నుండి సంవరణుడు తన గాడమైన ప్రేమను మర్చిపోలేక బాధపడుతూ జీవిస్తుంటాడు. సంవర్ణుడి ఇష్టాన్ని గ్రహించి ఆ యువతి తిరిగి అతని వద్దకు వచ్చి, ఓ రాజా నేను సూర్యుడి కుమార్తెను, నా పేరు తపతి. నీలాంటి కీర్తిమంతుడికి భార్యగా కావాలని ఏ స్త్రీ కోరుకోకుండా ఉంటుంది. నిన్ను వివాహం చేసుకోవడం నాకు సమ్మతమే, కానీ నేను వివాహ విషయంలో అస్వతంత్రురాలిని, నా వివాహ విషయం నాతండ్రి బాధ్యత. కావున నీవు నాతండ్రిని ఒప్పించి వివాహం చేసుకోమని కోరుతుంది. సంవరణుడు సరే అని సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు. సూర్యుడు అతని తపస్సుకు మెచ్చి, తపతి మనసును తెలుసుకొని వివాహాన్ని జరిపిస్తాడు. ఇలా కన్యను కన్య తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకొని వివాహం చేసుకోవడం ఉత్తమపురుషుల సంస్కారం అంతే గాని తనను తిరస్కరించిందనే అహంభావంతో నేటిపురుషులు స్త్రీలపట్ల దాడులకు పాల్పడుతున్నారు. అది ఉత్తముల లక్షణం కాదు. మరో సందర్భంలో వరుడు అంటే దుష్యంతుడిలా ఉండకూడదు అని తెలుస్తుంది. దుష్యంత మహారాజు వేట కోసం అరణ్యాలకు వెళతాడు. ముని వస్త్రధారణలో ఉన్న శకుంతలను చూస్తాడు. ఆమె పై అమితమైన ప్రేమ కలుగుతుంది, కానీ మరో పక్క మనసులో బాధ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె ఒక ముని కన్య, తాను క్షత్రియుడు. అందులో ఓదేశానికి రాజు క్షత్రియుడై ఉండి మునికన్యను వివాహం చేసుకోవడం తక్కువతనమని భావిస్తాడు ఆ తర్వాత శకుంతల విశ్వామిత్రుని పుత్రిక అని తెలుసుకుని సంతోషించి వివాహానికి సిద్ధపడతాడు. దుష్యంతుడిలాంటి పురుషులు ప్రేమ కంటే కులమతాలు ఆర్థికస్థితిగతులకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. అలాంటి లక్షణాలు కలిగిన పురుషుడిని భర్తగా ఎంచుకున్న స్త్రీ శకుంతల లాగే వంచించబడుతుంది.
ఇక వధువు ఎలా ఉండాలి అనే విషయాన్ని దమయంతి పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. దమయంతి నలుడిని ప్రేమిస్తుంది. అతనిని భర్తగా పొందాలనుకుంటుంది. నలుడు గొప్పరాజు, ఐశ్వర్యం, అందచందాలు అధికారం కలిగినవాడు. కానీ దమయంతి ఇవేవీ చూసి ఇష్టపడలేదు. హంస ద్వారా నలుడి గుణగణాలను కీర్తిప్రశంసలను పరాక్రమాన్ని తెలుసుకొని ఇష్టపడింది. అంటే వధువు వరుడి గుణగణాలను పరాక్రమాన్ని చూసి ఇష్టపడాలి అంతే కానీ ఐశ్వర్యాన్ని చూసికాదు. దమయంతి స్వయంవరానికి ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారిని కాదని సదామనసులో నలుడినే భర్తగా ధ్యానిస్తుంది. దమయంతి ద్వారా ఉత్తమ వధువు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనసా వాచ కాబోయే భర్తనే స్మరించాలని తెలుస్తుంది వధువు ఎలా ఉండాలో మరొక ఉదాహరణ తపతి. ఈమె తన ప్రేమ పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగిన స్త్రీ సంవరనుడు వివాహ ప్రతిపాదనను తీసుకురాగానే వెంటనే స్పందించలేదు. కొంత కాలం తర్వాత అతనికి నిజంగానే తన పట్ల ప్రేమ ఉందని గ్రహించి అతని వద్దకు వెళ్లి తన తండ్రిని ఒప్పించి వివాహం చేసుకోమని కోరుతుంది. భారతంలో వధూ వరుల గుణగణాలను బట్టి వారి వైవాహికజీవితం ఎలాఉంటుందో కళ్ళకుకట్టినట్లుగా చూపించబడింది.
భార్యాభర్తల బంధాన్ని వివరించే పాత్రలు భారతంలో అనేకం కలవు. భారతంలో బోయ పావురం కథ ద్వారా భార్యాభర్తల బంధం గురించి తెలుస్తుంది. ఈ కథలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు పిట్టలను పట్టి జీవించేవాడు ఒక రోజు వేటకు వెళ్లి వలలో కొన్ని పిట్టెలను పట్టుకున్నాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. పెద్ద గాలివాన రావడంతో ఒక చెట్టు కిందకు చేరాడు. చెట్టును చూసి భక్తితో కాపాడమని శరణుకోరాడు. ఆ చెట్టు మీదే తొర్రలో ఒక పావురం ఉన్నది. మేతకు పోయిన తన భార్య ఇంకా రాలేదని విచారిస్తూ, భార్యను తలుస్తూ, అనుకూలవతి అయిన ఇల్లాలు లేనిది తాను ఎలా జీవించనని బాధపడుతున్నది. బోయవాడి వలలో ఉన్న భార్య పావురం తన ఉనికిని చెట్టు తొర్రలో ఉన్న భర్త పావురానికి తెలిపింది. అంతేకాదు ఆదుకొనమంటూ శరణుకోరిన వారిని ఆదరించడం పుణ్యం, ఆ బోయవాడు శరణుకోరాడు, చలికి వణికి పోతున్నాడు. నీకు చేతనైన సహాయం చేసి కాపాడమంది ఆ ఉత్తమురాలైన ఇల్లాలు. భార్య మాటలు విన్న ఆ మగ పావురం బోయవాని వద్దకు వెళ్లి నీవు మా వద్దకు వచ్చిన అతిధి నిన్ను ఎలా సంతోషపెట్టగలనని అడిగింది. చలికి నా అవయవాలు తీపి పెడుతున్నాయి కనుక ఈ చలిని పోగొట్టవలసింది అని బోయవాడు మగపావురాన్ని కోరాడు. పావురం గబగబా అక్కడి చిదువులన్నీ ఏరి పోగు చేసి నిప్పు పెట్టింది. బోయవాడు ఆమంటలతో చలిని పోగొట్టుకున్నాడు. తర్వాత బోయవాడు తనకు ఆకలిగా ఉందని చెప్పాడు. నా దగ్గర ఎలాంటి ఆహారం లేదు. నా శరీరాన్ని నీకు ఆహారంగా అర్పిస్తాను తీసుకోనమంటూ మగపావురం మంటల్లోకి దూకింది. బోయవాడు నివ్వెరపోయాడు. పరిపరివిధాలా దుఃఖించాడు. ఈ పావురం నాకు తెలివిని తెప్పించింది, అని వలలో ఉన్న పిట్టలన్నింటినీ బయటకు వదిలిపెట్టాడు. వలలో ఉన్న భార్య పావురం జరిగిన విషయాన్ని అంతా గమనిస్తూ రివ్వున ఆకాశంలోకి ఎగిరి తన భర్త పావురాన్ని తలుస్తూ, దుఃఖిస్తూ అతను లేని జీవితం నిరర్థకమని "ఓనాధా! ఇప్పుడే నా ప్రాణాలు తీసుకొని నిన్ను చేరుకుంటాను. నీ లీలలు మరిచిపోవడం నా వల్ల కాదుని పలికి తన భర్త పక్షి పడిన చితిలో పడి మరణిస్తుంది.
భార్యభర్తకి ధర్మాన్ని బోధించడం ద్వారా భార్యను ధర్మపత్నిఅంటారు. ఈ కథలో మగ పావురానికి ఆడపావురం ధర్మాన్ని బోధిస్తుంది. సాధారణంగా మానవులు తమకు బాధ కలిగిన విషయాలలో ధర్మాన్ని విడిచి ప్రవర్తిస్తారు. కానీ ధర్మాన్ని విడిచి ప్రవర్తించకుండ పురుషుడిని నడిపించేది ఉత్తమఇల్లాలు. అంతేకాక బోయపావురం కథ ద్వారా భార్యాభర్తల అన్యోన్యత, ఉత్తమ ఇల్లాలు భర్తను ధర్మమార్గంలో ఎలా నడిపించాలో తెలుస్తుంది.
మార్కండేయుడు ధర్మరాజుకు పతివ్రతమహత్యమును తెలియజేసే కథను వివరిస్తాడు. ఈ కథ ద్వారా స్త్రీకి ధర్మాలలో గొప్పధర్మం భర్తశ్రేయస్సును కాంక్షించడమే అని తెలుసుకోవచ్చు. కౌశికుడు ఒక రోజు ఒక చెట్టు మొదట కూర్చుని వేదాలు వల్లెవేస్తూ ఉండగా ఆ చెట్టు కొమ్మపై ఉన్న కొంగ అతని పైరెట్ట వేస్తుంది. అంతట కౌశికుడికి మిక్కిలి కోపం వచ్చి పక్షి వంక కోపంతో చూస్తాడు. వెంటనే ఆపక్షి ప్రాణాలు కోల్పోతుంది. మరుసటి రోజు కౌశికుడు భిక్షాటన కోసం పల్లెకు వెళ్తాడు. ఒక గృహం ముందు బిక్ష ఆర్జించడానికి నిలుచుని " భిక్షాందేహి.." అని భిక్షను కోరుతాడు, కానీ ఆగృహిణి తన భర్త అప్పుడే గృహానికి రావడం వలన అతనికి కావలసిన సదుపాయాలు సపర్యాలు చేస్తుంటుంది. భర్తకు కావలసిన పనులని చక్కబెట్టి ఆగృహిణి ఆలస్యంగా భిక్షవేయడానికి వచ్చింది. కౌశికుడికి గృహిణి అశ్రద్ధ, ఆలస్యానికి కోపం వచ్చి ఆమె వంక కోపంగా చూస్తాడు, అది గమనించిన గృహిణి " అయ్యా మీరు గొప్పతపస్వి, మునులు శాంతస్వభావాన్ని కలిగి ఉండాలి కానీ మీరు కోపంతో ఒక పక్షి ప్రాణాన్ని హరించారు, అది సబబు కాదు" అని వివరిస్తుంది. కౌశికుడికి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడో జరిగిన సంఘటనను తెలుసుకోగలిగే దివ్యజ్ఞానం ఈ గృహిణికి కలదు. ఈమె సామాన్యమైన స్త్రీ కాదు అని తలచి " ఓ గృహిణి ! నీకు ఈజ్ఞానం ఎలా సంక్రమించింది." అని అడుగుతాడు అప్పుడు గృహిణి ఇలా వివరిస్తుంది" స్త్రీ పాలిట గొప్ప దైవం భర్త మాత్రమే. ఆ స్త్రీ ఎల్లప్పుడూ త్రికరణశుద్ధిగా అంటే మనస్సు చేత, మాటల చేత, కర్మల చేత పతి శ్రేయస్సును కాంక్షించేదిగా ఉండాలి. ఆ విధంగానే తన నడవడికను తీర్చిదిద్దుకోవాలి. ఇదే ధర్మాల్లో గొప్ప ధర్మమని దాని ద్వారానే గృహిణి జ్ఞానాన్ని పొందగలదని" వివరిస్తుంది. ఈ మాటల ద్వారా భార్య సదా భర్త క్షేమాన్ని కాంక్షించాలని తెలుస్తుంది. అరణ్య పర్వంలో ద్రౌపది సత్యభామకు చెప్పిన విషయాలలో కూడా ఉత్తమ ఇల్లాలి జీవన విధానం కనిపిస్తుంది. ద్రౌపది మాటల ద్వార భర్త ప్రేమను పొందాలంటే ఎటువంటి చెడు మార్గాలను అవలంబించకూడదు. సన్మార్గం ద్వారనే ప్రేమను పొందాలని తెలుసుకొనవచ్చును. మరొక సందర్భంలో భర్త భార్య పట్ల ఎలా ఉండాలో శకుంతల మాటల ద్వారా వివరించారు. పురుషుడు భార్యను పొందేటంత వరకు అసంపూర్ణుడు, వివాహం చేసుకొని సంతాన పరంపరను పొందుతాడు. దాని ద్వారానే పరిపూర్ణుడు అవుతాడు. భర్తకు భార్య నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధిస్తుంది, గురుస్థానం భార్య, వంశం నిలవడానికి ఆధారమైనది, మన్ననలకు ముఖ్యహేతువైనది, ఆనందాన్ని కలిగించేది మగనికి ఇల్లాలి కంటే ఇంపైనది మరొకటి లేదు. ఆలుబిడ్డలను ఆప్యాయంగా చూసుకునే వారికి దుఃఖాలు తొలగిపోతాయి కావున పురుషుడు భార్య ప్రాముఖ్యాన్నెరిగి ఆమెకు తగిన స్థానాన్ని ఇవ్వాలి. భారతంలో ద్రౌపది, పాండవుల అన్యోన్య దాంపత్యం ద్వారా భర్త భార్యను ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ద్రౌపది ఎంత సుగుణవతి అయిన ఇల్లాలో పాండవుల అంత భార్య ప్రేమికులు. పాండవులు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. గంధమాదన పర్వతానికి వెళ్లేటప్పుడు రాళ్లలో నడవలేక ద్రౌపది మూర్చపోతుంది. భీముడు ద్రౌపదిని జింకచర్మంపై పరుండబెట్టి అరటాకులతో విసురుతాడు. నకులసహదేవులు ఆమె పాదాల్ని ఒత్తుతారు. స్త్రీలు సుకుమారులు శారీరక కష్టానికి ఓర్వలేరు. కాబట్టి ఉత్తమభర్తలు భార్యలను అపురూపంగా కష్టాన్ని కలిగించకుండా చూసుకుంటారు. మరొక సందర్భంలో జనక మహారాజు రాజ్యపాలనను వదిలి సన్యాసం స్వీకరిస్తానని చెప్పినప్పుడు అతని భార్య సునయన అతనితో పలికిన పలుకుల ద్వారా భర్తకు కర్తవ్యబోధ చేసే భార్య ఉత్తమ ఇల్లాలని తెలుస్తుంది. పురుషులు సంసార బాధ్యతల నుండి పారిపోకుండా భయపడకుండా స్థిరంగా ఉండాలి. మానవులు వ్యసనానికి బానిసలై కష్టాలకు భయపడి భార్యాపిల్లల పట్ల తమ బాధ్యతను విస్మరిస్తుంటారు. అలా కాకుండా వ్యసనాలను దరిచేరనీయక కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే ఉత్తముల లక్షణం.
తల్లిదండ్రులు - సంతానం :
శిశువుకు మొదటి గురువు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు వీరి పెంపకం పై ఆధారపడి ఉంటుంది. తల్లి దండ్రులు సంతానం పట్ల ఎలా ప్రవర్తించాలో భారతంలో పలు సందర్భాల్లో కలదు. ఇంద్రసురభి సంవాదాన్ని పరిశీలించిన సురభి మాటలను బట్టి తల్లిదండ్రుల హృదయం ఎలాంటిదో తెలుస్తుంది. దేవలోకంలో ఉన్న ఆవు పేరు సురభి. ఒకసారి ఇంద్రుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటుంది. తన పుత్రులు భూమి మీద పడుతున్న అవస్థలను వివరిస్తుంది. భూమి మీద మానవులు తన పుత్రులను వ్యవసాయపనులకు ఉపయోగించి, సరిగ్గా తిండి పెట్టక, బరువులను మోయిస్తూ భారమైన పనులు చేయిస్తున్నారని దుఃఖిస్తుంది. సురభి మాటలలో తల్లిదండ్రులు తమ సంతానంపై కలిగి ఉండే ప్రేమమమకారాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు తమ సంతానంపై అమితమైన ప్రేమను పెట్టుకుంటారు. సంతానమే తమజీవితంగా భావిస్తారు. తమ సంతానం పొందే సుఖమే తమ సుఖంగా భావిస్తారు. వారుబాధను పొందితే తాము బాధపడతారు.
తల్లిదండ్రులకు పిల్లల పై ప్రేమఅనురాగాలు ఉండవచ్చు కానీ, తల్లిదండ్రుల అతిప్రేమ, వ్యామోహం వల్ల సంతానం ఎలా పతనమవుతుందో భారతంలో కలదు. భారతంలో తల్లిదండ్రుల పాత్రలను ధృతరాష్ట్రుడు, గాంధారి శుక్రాచార్యుడు, కుంతీ మొదలైనవారు పోషించారు.
శిశువు యొక్క ప్రవర్తనను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే గర్భస్థదశ నుండి ప్రయత్నించాలి. గర్భంలోని శిశువు పై తల్లి యొక్క ఈర్ష్యాద్వేషాల ప్రభావం ఎలాఉంటుందో గాంధారి పాత్ర ద్వారా తెలుస్తుంది. కావున సంతానాన్ని కోరే స్త్రీపురుషులు ఈర్ష ద్వేషాలను వదిలి ఉత్తములుగా జీవించాలి. భర్తను కోల్పోయీనా, రాజ్యాన్ని కోల్పోయినా తమ సంతానాన్ని ఉత్తమములుగా తీర్చిదిద్దిన పాత్రలో కుంతీ కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో నీచుడైన దుర్యోధనుడు ఎట్లా నడిస్తే అట్లాగే నడవనిచ్చాడు, మార్చడానికి ప్రయత్నించలేదు. దాంతో దుర్యోధనుడు పలు అధర్మాలకు పాల్పడ్డాడు. రాజ్యకాంక్షతో పాండవులపై పలు హత్యా ప్రయత్నాలు చేశాడు, పెద్దలను దూషించాడు, నిండు సభలో ఒక స్త్రీని అత్యంత హేయంగా అవమానించాడు. దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పును ధృతరాష్ట్రుడు వెనకేసుకురావడానికి కారణం సంతానం పట్ల అతనికి గల వ్యామోహం. సమాజంలో ఇలాంటి తల్లిదండ్రులు పెక్కుమంది ఉంటారు. తమ సంతానం హంతకులైన, దొంగలైన, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని వారించరు. ఏ తల్లిదండ్రులైతే కొడుకు చెడు మార్గంలో సంచరిస్తుంటే చూసి వారించక చోద్యం చూస్తారో ధృతరాష్ట్రుడిలా ఏదో ఒక రోజు తమ సంతానాన్ని పోగొట్టుకొని దుఃఖించక తప్పదు. పిల్లలు కోరింది కాదనకుండా ఇచ్చి వారి భవిష్యత్తును పాడుచేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు. శుక్రాచార్యుడు ఆ కోవకు చెందినవాడే. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అతనికి ఒక్కగానొక్క కుమార్తె దేవయాని. గారాబంగా పెంచుతాడు. పెద్దలు చేసే గారాబం పిల్లల చెడు ప్రవర్తనకు ఎలా దారితీస్తుందో వివరించే పాత్రలు శుక్రాచార్యుడు, దేవయాని పాత్రలు. ఒక్కగానొక్క కుమార్తె అని ఆమె మొండి చేసిన ప్రతిసారి కోరిన కోరికను తీర్చేవాడు. దేవయాని ఆ మొండితనంతోనే రాకుమారి అయిన శర్మిష్టను దాసీగా చేసుకుంటుంది, శర్మిష్టను ప్రేమించిన యయాతిని తన భర్తగా చేసుకుంటుంది, ప్రేమించిన కచుడిని శపిస్తుంది, వివాహం చేసుకున్న యయాతిని తండ్రి చేత శాపగ్రస్తుడిని చేస్తుంది. ఇలా దేవయాని మొండి పట్టుదలతో తన జీవితాన్ని తానే దుర్భరంగా చేసుకుంటుంది. సంతానం చేసే ఈ మొండితనమే అటు సంతానాన్ని ఇటు తల్లిదండ్రులను ఇక్కట్ల పాలుచేస్తుంది. కావున ఇలాంటి చెడుప్రవర్తనకు పిల్లలు పెద్దలు దూరంగా ఉండాలి. భారతంలో ఉండే పుత్రుల పాత్రలు సమాజంలో పుత్రులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నిరూపిస్తున్నాయి తన కుతంత్రాలకు తండ్రి ప్రేమను ఉపయోగించుకున్న చెడ్డ కొడుకుగా దుర్యోధనుడు కనిపిస్తాడు. తండ్రి కోసం ఆజన్మబ్రహ్మచారిగా మిగిలిన ఉత్తమపురుషుడిగా భీష్ముడు కనిపిస్తాడు. తండ్రి అయిన యయాతి కోసం తన యవ్వనం ఇచ్చి తాను వృద్ధాప్యం తీసుకున్న ఉత్తమ పుత్రుడిగా పూరుడు దర్శనమిస్తాడు. తల్లిని గౌరవించి అనుసరించే ఉత్తమ వ్యక్తులుగా పాండవులు కనిపిస్తారు.
సహోదరులు :
భారతంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు, పాండవులు, కౌరవులు అన్నదమ్ములుగా ఎలా మెలగాలో వారి మధ్య ఎలాంటి బాంధవ్యం ఉండాలో తెలియజేసే ఘట్టాలు చాలా ఉన్నాయి. దృతరాష్ట్రుడు పుట్టుక తోనే అంధుడు రాజ్యానికి అనర్హుడు. అంధుడుని దృతరాత్రుడిని పాండురాజు ఎప్పుడు చిన్నచూపు చూడలేదు. పాండురాజు అన్న పట్ల నిస్వార్ధ సోదరభావం కలిగి ఉండి నేటి సమాజంలో సోదరులకు ఆదర్శప్రాయం అయ్యాడు. తన అన్నని సింహాసనం మీద కూర్చోబెట్టి శత్రురాజులను జయించి, రాజ్యాలను విస్తరించి అశేషధనాన్ని అన్నకు సమర్పించేవాడు. పాండవుల విషయానికి వస్తే ఐక్యమత్యానికి సంకేతం వారి జీవనం లోకంలో సోదరులకు పాండవులు ఆదర్శం. నలుగురు తమ్ముళ్లు ధర్మరాజు మాటను జవదాటక అతని ఆజ్ఞానుసారం నడుచుకుంటూ సమాజానికి ఆదర్శమయ్యారు. ధర్మరాజుకు తమ్ములంటే ప్రాణం. తమ్ముళ్లు నలుగురు యక్షుని వలన ముర్చపోతే వారిని చూసి ధర్మరాజు మూర్చపోతాడు. తమ్ముళ్ల దుస్థితిని చూసి చలించి మా తల్లి కుంతీ దేవి మేము అడవులకు వెళ్ళినప్పటి నుండి ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది. నేను తిరిగి వెళ్తే తమ్ములేరి? అంటే నేనేం చెప్పేది అని కుమిలిపోతాడు. సోదరులకు కష్టం కలిగినా అన్న పడే బాధ ఇక్కడ కనిపిస్తుంది. ఇలా అన్నదమ్ములు ఒకరిపై ఒకరికి మిక్కిలి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. తండ్రి తర్వాత తండ్రివంటివాడు అన్న కావున అన్న తమ్ముళ్ల పట్ల మిక్కిలి బాధ్యతను కలిగి ఉండాలి. వారిని సన్మార్గంలో నడ.పాలి. ధర్మరాజు తమ్ముళ్ల ఆవేశాలకు ఎప్పటికప్పుడు ఆనకట్టవేసేవాడు. సమయ సందర్భాలను బట్టి తమ్ముళ్లను నడిపించేవాడు. భారతంలో అర్జునుడు, భీముడు ధర్మరాజు పట్ల తిరగబడిన సందర్భాలు కలవు. తమ్ముళ్లు చిన్నవారవటం చేత ఒక్కోసారి అన్న మీద తిరగబడటం కోపగించటం, నిందించడం, సహజమే అయినా మళ్లీ పాండవుల లాగా సర్దుకుపోయి జీవనాన్ని సాగించడమే ఆదర్శ సోదరుల స్వభావం. అన్నదమ్ములు ఈ విధంగా తమలో తాము పొందికగా ఉండాలి అనే విషయాన్ని భీష్ముడు ధర్మరాజుతో వివరించాడు తమ్ముళ్లు అన్నల ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అన్న తండ్రితో సమానుడు కనుక తండ్రి వలె గౌరవ మర్యాదలను చూపవలెను. తప్పు చేస్తే తండ్రి ఎలా అయితే దండిస్తారో అలాగే తమ తప్పులను అన్న కూడా సరిదిద్దుతూ ఉండాలి. అదే విధంగా అన్న తమ్ముళ్లను మన్నిస్తూ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే అన్నదమ్ములు సంపదలతో ప్రకాశిస్తూ లోకంలో జీవిస్తారు.
అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయతలు భారతంలో కలవు. కృష్ణుడు సుభద్ర అన్నా చెల్లెళ్ళు. సుభద్ర వివాహ విషయంలో చెల్లెలి మనసెరిగి ప్రవర్తిస్తాడు. అర్జునుడు అరణ్యవాసం పాలైనప్పుడు సుభద్రను, ఆమె కుమారుడిని ఆదరించి ఆశ్రయన్ని కల్పిస్తాడు. తోడబుట్టిన వారిని సదాకాపాడటం ఉత్తమ సోదరుల లక్షణం అంతే కాదు కృష్ణుడు తన చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువగా ద్రౌపదికి అన్నివేళలా తోడుగా ఉన్నాడు. వీరులైన పతులు ఐదుగురు ఉన్నప్పటికీ తన మానాన్ని కాపాడలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు ద్రౌపదికి గుర్తుకు వచ్చింది సోదరసమానుడైన శ్రీకృష్ణుడే. ద్రౌపది తలవగానే ఎంత దూరంలో ఉన్నా ఆమెకు వస్త్రాలు అందించి, మానరక్షణ చేసినవాడు కృష్ణుడు. ఇలా సమాజంలో ఆపదలో ఉన్న ప్రతి సోదరికి ఆపన్నహస్తం అందించడానికి ఎప్పుడూ యువకులు సోదర భావంతో సిద్ధంగా ఉండాలి. ఇలాంటి యువకులు సమాజంలో కీర్తిని పొందుతారు. సమాజంలో వావివరుసలు లేకుండా ప్రవర్తించే నీచులు సైంధవుల వంటివారు కూడా ఉంటారు. కౌరవుల చెల్లెలు దుస్సల భర్త సైంధవుడు. ద్రౌపదికి వరుసకు సోదరుడు అవుతాడు. కానీ కామంతో కళ్ళు మూసుకున్నవాడై ద్రౌపది మీద అత్యాచారం చేయబోయాడు. సమాజంలో ఉన్న ఇలాంటి వారికి సైంధవుడికి పట్టిన గతేపడుతుంది.
పెద్దలు :
కుటుంబానికి పునాది ఆ కుటుంబ పెద్దలు (వృద్ధులు) భారతంలో సత్యవతి, భీష్ముడు, వ్యాసుడు, విదురుడు మొదలైన పాత్రలు కుటుంబ పెద్దలుగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన త్యాగాలు నేటి సమాజానికి ఒక తోవను చూపుతున్నాయి. పెద్దలు వారి జీవనానుభవంతో తమ తరువాత తరానికి మంచి చెడుల జ్ఞానాన్ని బోధిస్తారు. కుటుంబ పెద్దలను అనుసరించక, గౌరవించక మసలుకొనేవారికి దుర్యోధనుడిలాగే దుర్గతి కలుగుతుంది. ధర్మరాజునిలాగా భీష్ముడి వంటి పెద్దల బోధనలు విని తమ జీవనమార్గన్ని సుగమం చేసుకోవడం ఉత్తమ పురుషుల లక్షణం.
ఆధార గ్రంధాలు:
- ఉమాదేవి, ముదిగొండ, (2018). మహాభారత ఉపఖ్యానములు.
- జయదేవ్. ఎమ్., (2017). మహాభారతంలో జానపద కథాంశకథలు.
- నిర్మల, తమ్మారెడ్డి, (2021). ఆంధ్రమహాభారతం - స్త్రీ ప్రతిపత్తి, ఆనందవల్లి గ్రంథమాల, రాజమహేంద్రవరం.
- వెంకట సుబ్బయ్య, అప్పజోడు, (2012). భారతీయుడా మహాభారతం చదివావా.
- వెంకట సుబ్బయ్య, అప్పజోడు (2019). మహా భారతం మానవ స్వభావ చిత్రణ. స్వీయప్రచురణ, హైదరాబాద్.
- శాంతమ్మ. ఎన్., (2010). మహాభారతం - మహిళా దర్శనం.
- శ్రీనివాసరాయ, యల్లంరాజు, (2001). మహాభారతవైభవం.
Editorial Advisory Board
Dr. (Mrs.) M. Praphulla
Director & Former Dean of Education
Associate Professor in Telugu,
Sri Sathya Sai Institute of Higher Learning (SSSIHL)
Prof. Rani Sadasiva Murty
Professor, Dept. of Sahitya,
National Sanskrit University.
Prof. C. S. Rama Chandra Murty
Professor in Telugu,
Banaras Hindu University.
Prof. Darla Venkateswara Rao
Professor & Head, Dept. of Telugu,
The University of Hyderabad.
Dr. B. Bhujanga Reddy
Asst. Professor, Dept. of Telugu,
The University of Hyderabad.
Legal Advisor
Sri N.V. Anantha Krishna
Advocate, Hyderabad.