AUCHITHYAM | Volume-3 | Issue-11 | October 2022 | Second Anniversary Special Issue - ISSN: 2583-4797
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తేది. 29 ఆగస్ట్ 2022న
"ప్రతిభ డిగ్రీ మరియు పిజి కళాశాల", సిద్ధిపేట ఆధ్వర్యవంలో నిర్వహించిన "మహాభారత ఔచిత్యం" అంతర్జాలసదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం
2. కవిత్రయభారతం : ఆధునికజీవనం
ఏ. మారుతి
తెలుగు పి.జి.టి. ఉపాధ్యాయులు, వేములవాడ,
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: 8142141008, E-Mail: maru.astro@gmail.com
ఉపోద్ఘాతం:
"కథలు కల్లలౌనుకల్పితములునౌను
కథకు కనులు లేవు కాళ్లు లేవు
కాని కథలలోనకల్పింపబడు నీతి
ప్రళయవేళదనుక ప్రగతి నొందు"
అని ఒక అజ్ఞాత కవి అన్నాడు. వేల ఏళ్ల క్రితం రాయబడి, వెయ్యాల క్రితం అనువదించబడిరది మహాభారతం. ఇది మనకథ. మన పూర్వీకకుల కథ. ఇందులోని పాత్రల స్వభావాలు, పరిస్థితులు అచ్చం మనం చూసిన, అనుభవించినట్లుగా ఉంటాయి.
ధర్మశాస్త్రంబని, వేదాంతమని, నీతిశాస్త్రంబని, మహాకావ్యమని, సర్వలక్షణ సంగ్రహమని, ఇతిహాసమని బహుపురాణ సముచ్చయమని అవతారికలో పలురకాలుగా పలురిభావనలుగుదిగ్రుచ్చారు. ఒక్కమాటలో అన్ని అంశాలుగల విజ్ఞానసర్వస్వం భారతం. అటువంటి భారతం నభూతోనభవిష్యతి అనడంలో అతిశయోక్తి లేదు. భారతీయ వాఙ్మయంలో ధర్మములకు ఒక శాస్త్రము, కామమునకు ఒక శాస్త్రము, అర్థమునకు ఒక శాస్త్రము, మోక్షమునకు ఒక శాస్త్రముగా ఉన్న వాఙ్మయము విస్తృతమైనది. అటువంటి విషయరాసిని ఒకే గ్రంధంలో పురుషార్థములను గుదిగుచ్చి, రసస్ఫోరకముగాపాఠకునికి అందించడంలో వ్యాసులవారు, అనువక్తలుగా కవిత్రయము ముఖ్యపాత్ర పోషించారు. కథలో యదార్థం ఎంత ఉంది...? సాక్ష్యములు ఎన్ని ఉన్నాయి..? అనే అంశంమీద జరిగే చర్చకంటే ఇతివృత్తము, బోధ మొదలైన వాటిద్వారా లోకానికి జరుగుతున్న మేలుఎంతఅనివిచారింపవలసినది ఉంది. వర్తమాన, ప్రగతిశీల యువతకు కవిత్రయభారతం కేవలం కథాపరమైన గ్రంథంగానే కాక, భాషాపరమైన కరదీపిక అని కూడా చెప్పవచ్చు.
భాషలో ఎన్నో మనకు తెలియని పదాలు, వాటి వినియోగము పవిత్రమైనభారతం వంటి గ్రంథాలు చదివినప్పుడు మనకు తెలియవస్తుంది. పాత్ర ఔచిత్యము, సంభాషణ, రసపోషణ వంటివి గ్రంథాన్ని కళ్ళకుకట్టినట్టుగా చూపించే శబ్దకావ్యంగామలుచుతాయి. మహాభారతంలో ధార్మిక అంశములు ఉన్నాయని విదురనీతి,నారదబోధమొదలైన విషయాలు ద్వారా తెలియబడుతుంది. శాంతి అనుశాసనిక పర్వముల ద్వారా జీవితానికి కావలసిన లౌకికజ్ఞానమును, పారలౌకిక విజ్ఞానమును, అర్థము విషయాలను భీష్ముని ముఖత వివరించబడ్డాయి. మోక్షమునకు భగవద్గీత, సనత్సుజాతీయముమొదలైన గ్రంథాలు ఇందులో భాగములే కదా...! కాబట్టే ‘యదిహాస్తితదన్యత్ర.....’ అనే శ్లోకము సార్థకమైంది.
ధర్మవిశేషాలు:
మహాభారతంలో కొన్ని ధర్మములు వ్యక్తిగతపరమై ఉన్నాయి. మరికొన్ని సమాజగతమై ఉన్నాయి. అటువంటి అనేక ధర్మములలో వర్తమానకాలమునకు ఉపయోగించే విశేషధర్మములను కొన్ని చర్చించుకుందాం.
మ. గురుశుశ్రూషయు, నాగమాధ్యయనమున్, గోష్టీ నిరాసంబుద
త్పరతంబొందొరయంగదాజొరమియున్, భ్కెక్షాశనత్వంబు, ష
డ్వరకర్మంబులయందురాగభరగాఢద్వేషముల్ లేక, యె
వ్వరితోడంబగగాకయున్కియును భవ్య బ్రహ్మచర్యోక్తముల్. (శాంతి.2.230)
ఈనాటి కాలంలో విద్యార్థులు ఎలా ఉండాలో... ఒక పద్యంలో వివరించారు ప్రతి విద్యార్థికి అన్ని కాలముల నందు ఇవి చదువుకునే పిల్లలు ఆచరించవలసినవి. గురువుపట్లభక్తిగౌరవములుకలిగిఉండాలి. గురువులను గేలిచేయకూడదు. ఆధునిక కాలంలో గురువుపట్ల భక్తి కొంత తగ్గినదని చెప్పవచ్చు. బ్రహ్మచారి ఎప్పుడూ బ్రహ్మమునందు చరిస్తూ ఉంటాడు (అంటే బ్రహ్మము అనేమాటకు ఇక్కడ ‘విద్య’ లేదా అన్వయరూపకమైన జ్ఞానము) ఎల్లప్పుడు గ్రంధములో చెప్పబడ్డ విషయాలు, గురువు ద్వారా తెలుసుకున్న విషయాలను మనసులో మననం చేస్తూ ఉండడం ప్రకృతిలో గమనిస్తూ ఉండడం.... ఇదంతా బ్రహ్మమునందు చరించుట అనవచ్చు అందుకే విద్యార్థికి సూతకము, ఉపవాసములు మొదలైన ఆటంకములు వర్తించబడలేదు. అలా ఎల్లప్పుడూ విద్యయందు దృష్టి ఉంచాలి. దానివల్ల సమాజానికి తనకు ఎంతవరకు ఉపయోగఉంటుందని భావించాలి. దాంట్లోని సారాన్ని తెలుసుకోవాలి....
సుఖార్థినఃకుతోవిద్యానాస్తివిద్యార్థినఃసుఖమ్,
సుఖార్థీవాత్యజేద్ విద్యాం విద్యార్థి వాత్యజేద్ సుఖమ్. (వ్యాసభారతం. ఉద్యోగం - 40-6)
సుఖం కోరుకునే వానికి విద్య ఎక్కడ నుండివస్తుంది? (రాదు) విద్యార్థికి అనేవారు సుఖం కోరరాదు. సుఖం కోరుకునేవాడు విద్యను వదిలిపెట్టాలి. లేదా విద్యను కోరుకునే వాడయితే సుఖాన్ని విడవాలి. "చదువదిఎంతగలిగిన రసజ్ఞత ఇంచుకచాలకున్నఆచదువునిరర్థకంబు" అని భాస్కర శతకంలో సారమును తెలియని చదువు పనికిరాదని చెప్పినట్లుగా ఎప్పుడూ విద్యార్థి జ్ఞానముయందు దృష్టిఉంచాలి.
తరువాత ముఖ్యంగా చెప్పిన అంశం సమూహములుగా చేరకూడదు. ఆధునికభాషలో చెప్పుకుంటే ముఠాలు, గ్రూపులుగాచేరి ఉండకూడదు. దానివల్ల కొంతమంది నుంచి వ్యసనాలు తెలియకుండానే అంటుకుంటాయి. అలా జరగకుండా విద్యార్థి తనఆలోచనను తాను నిర్ణయించుకోవాలి. మితాహారం తినాలి. అనడానికి మహాభారతంలో భైంక్షాశనము అనే పదాన్ని వినియోగించాడు. భిక్షఅనడం ఎందుకంటే పూర్వకాలంలో భిక్షాటన చేయడంవలన వచ్చి ఉండవచ్చు కానీ నేటి కాలంలో మితాహారము లేదా జంక్‌ఫుడ్ కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఎదుగుదల, మెదడుకు పోషకపౌష్టికఆహారములవినియోగం అవసరమైన వయస్సులోనే ఎక్కువ చాపల్యానికి లోనట్లయితే విద్యార్థి శరీరాన్నిపాడు చేసుకోవడం ద్వారా రకరకాల అనారోగ్యమునకు గురి కావడమే కాక చదువుకు మరింత భంగం ఏర్పడుతుంది. ఇది నేటి విద్యార్థులు నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశం. వ్యసనాల యందు చెడు పనులమీద మనసుపోకుండా, ఏకాగ్రతతో ఉండటం ఎవరితోనూ కూడా పగలేకుండా ఉండటం, బ్రహ్మచారిగా
ఉండడం పరస్త్రీపట్ల ఆసక్తి లేకుండా ఉండటం మొదలైనవన్నీ కూడా బ్రహ్మచారి ఆచరించవలసినవి కేవలం ఒకే పద్యంలో రాసారు. ఆధునికకాలపు విద్యార్థులకి పాఠ్యపుస్తకాల్లో చేర్చవలసిన ముఖ్యఅంశంగా దీన్ని మనం స్వీకరించవచ్చు. ఇటువంటి స్వీకరించదగిన అంశములు ఎప్పుడూవిద్యార్థి శరీరాన్ని క్రమశిక్షణకు అలవాటు చేయవలసిందిగా మహాభారతం చెబుతుంది.
స్ఫూర్తి పొందటం - జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం?:
ఒక మహాత్ముడి నుంచి, ఒక గొప్పవ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటన నుంచి లేదా అతనుచెప్పిన కొన్ని అంశములనుండి ఎవరైనా స్ఫూర్తి పొందడం అనేది సహజమే. కానీ అర్జునుని జీవితంలో దానికి భిన్నంగా జరిగింది. అర్జునుడు ఒకరోజు, ఆశ్రమంలో తోటిమిత్రులతోభోజనంచేస్తూ ఉండగా దీపంఆరిపోయింది. అప్పుడు ఆశ్రమవాసులు వెలుగుకోసం ఏర్పాటు చేస్తూండగా, అర్జునుడుమాత్రం వేరేలా ఆలోచించాడు. బయటికి వెళ్లి,చీకట్లోబాణంవేయడం మొదలుపెట్టాడు. దాన్ని గమనించిన ద్రోణాచార్యులు కారణంఅడిగారు. అందుకు అర్జునుడు సమాధానం చెప్పసాగాడు. ‘ఆచార్యా ! నేను భోజనం చేస్తూ ఉండగా, ఒక్కసారిగా చీకటి అయిపోతే అప్పటివరకు విస్తరిలో ఉన్న పదార్థాన్ని నా జ్ఞాపకశక్తి ద్వారా గుర్తుతెచ్చుకొని కలుపుకొని తింటున్నట్టుగానే, మనసు పొరలలో జ్ఞాపకం కింద ఉండిపోయిన వస్తువుని విషయాన్ని అంశాన్ని గుర్తుతెచ్చుకొని జ్ఞాపకం చేసుకోవడం కూడా వీలవుతుందని నేను భావించి ఇదే చోటనిలబడిఇక్కడనుండిరోజుచూసే చెట్టు ఎంతదూరం ఉంటుందో, అని ఆలోచించి చీకటిలో ఊహించి బాణం వేయడం ద్వారా నా లక్ష్యాన్ని కొట్టగలుగుతున్నాను’ అన్నాడు. దీన్ని మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఒకసారి సైకిల్ నేర్చుకుంటే కొన్ని సంవత్సరాల విడంబరంతర్వాతకూడా మళ్లీ అది గుర్తు వస్తుంది. దానికి సంబంధించిన జ్ఞాపకమంతా ఆలోచనల పొరలలో ఉండిపోయినట్టు ప్రతిఅంశము మనసు యొక్క పొరలలో ఉండిపోతుంది. దాన్ని సాధన ద్వారా బయటికి తీసుకురావాలి. అలా తీసుకువచ్చేటు వ్యక్తికి మేధస్సు ఉపయోగపడుతుంది.
అది చెప్పడం అర్జునుడి యొక్క ఈ దృష్టాంతం ద్వారా మనకు తెలుస్తుంది. కేవలం జ్ఞాపకశక్తి కోసం ర్యాంకుల కోసం తాపత్రయపడకుండాచేస్తున్నసాధనలో చిత్తశుద్ధి ఎంతఉందిఅనిసాసధకులు భావించాలి. కొన్నిసార్లు విఫలమైనా మరింత ఏకాగ్రతతో ఎలా పనిచేయాలి. తాను ఎప్పుడూ ఎలా కొత్తగా ఆలోచించాలి అని అర్జునుని ద్వారా మనకు స్ఫూర్తి పొందవచ్చు. అటువంటి స్ఫూర్తిని అర్జునుడు ఎవరినుండో కాకుండా తనలోని చైతన్యాన్ని తన నిత్యజీవితంలోని ఒక విషయం ద్వారా స్ఫూర్తి పొందాడు. ఇది సమాజంలో ప్రతివారూనేర్చుకోవలసిన అంశం. ఎందుకంటే కేవలం మహాభారతం ఏళ్ళ కింద జరిగిపోయిందని కాకుండా ఇటువంటి మార్గదర్శకత్వాన్ని ఇటువంటి ఆదర్శ భావాన్ని మన జీవితంలో మనం కూడా తెచ్చుకోవడం అది ఎల్లవేళలా ఆచరణయోగ్యమైన అంశం.
ఉద్యోగిధర్మాలు:
ఆధునికకాలంలో ప్రతిఉద్యోగము ఒత్తిడితో కూడుకున్నది.? కొందరు మానసికమైన ఒత్తిడికి గురికావడమే కాకుండా, శారీరకమైన రుగ్మతలకు కూడా ఒత్తిడికారణంగా ఏర్పడుతున్నాయని వైద్యులుచెబుతున్నారు. అసలు మనం చేస్తున్న పనిలో లోపంఎక్కడుంది..? అందులో మన పొరపాటు ఎంత ?.మనలో ఏం సవరించుకోవాలి.?. ఎలా ఉండకపోవడం ద్వారా సమస్యవస్తుంది.?. ఎలా ఉండడం ద్వారా సమస్య తీరుతుంది?. అనే అంశాన్ని ధౌమ్యుడు పాండవులకు ఉపదేశించిన సేవాధర్మముల రూపంలో చక్కగా అన్ని కాలాల్లోనూ అన్వయించుకోవచ్చు. ఒకప్పుడు మహారాజు దగ్గర ఎలాఉండాలో చెబితే, ఈరోజుల్లో ఒక ఉద్యోగి తనయజమాని (పై ఆఫీసర్) పట్ల ఎటువంటి విధేయత చూపాలో అనేది మనం అన్వయించుకోవచ్చు.
ఉద్యోగి ఎలా ఉండాలి...?:
చ. ధరణిపుచక్కగట్టెదురు దక్కి పిఱుందును గాని యట్లుగా
నిరుగెలనందగంగొలిచి యే మనునో, యెటుసూచునొక్కొ! యె
వ్వరిదెసనెప్పు డే తలపు వచ్చునొయీతనికంచుజూడ్కి సు
స్థిరముగదన్ముఖంబుననచేర్చుచునుండుట నీతి కొల్వునన్.
పై ఆఫీసర్‌కు అస్తమానం ఎదురుగా కానీ, వెనకకానీ, పక్కనే కానీ, ఉండకుండా ఎప్పుడూ ఆయన ఎటుచూస్తాడో గమనిస్తూ ఉండాలి. తద్వారా ఆయన మానసిక స్థితికి అనుకూలంగా మనం నడుచుకోవాలి... ఇవి చాలామందికి అర్థం కాక పరిస్థితిని అర్థం చేసుకోకుండా, ఒక్కోసారి అధికారి కోపంతో ఉన్నప్పుడు కార్యభారాన్నితీసుకువెళ్తే మరింత కోపగించుకోవచ్చు. అటువంటి వాటిని స్వయంగా గమనించమంటున్నాడు. ఆయన ప్రసన్నతను, సుముఖతను ఎరిగి నడుచుకుంటే ఉద్యోగం బాగుంటుంది. ఇది ఆధునిక కాలంలోని ఉద్యోగులు తెలుసుకోవలసిన విషయం.
క. తగజొచ్చి తనకు నర్హంబగునెడగూర్చుండిరూపమవికృతవేషం
బుగసమయమెఱిగి కొలిచిన జగతీవల్లభునకతడుసమ్మాన్యుడగున్
తనకు హోదాకు తగినచోట కూర్చోవడం, తగినరూపధారణ, వేషధారణ (డ్రెస్సింగ్), వస్తుధారణ (గాడ్జెట్)కలిగి ఉండటం మంచిలక్షణం. ప్రస్తుతం చాలామందికి తనతాహతుకు మించి ఖరీదైన ఆభరణాలు, వస్త్రాలు విలాసవంతమైన వాహనాలు భవంతులు మొదలైనవన్నీ ప్రదర్శించడం ద్వారా ఆనందంపొందుతున్నారు. దాని ద్వారా కొన్ని సందర్భాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు లెక్కల్లో ఇరుక్కుపోయి సమస్యలకు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మరీనీచం కాకుండా, మరీ ఆడంబరం కాకుండా సొంపైన విధంగా వస్త్రాన్నిధరిస్తూమంచినడవడితో నడుచుకోవడం ఆ హోదాకి తగినదనిపిస్తుంది.
కొన్ని సందర్భాలలో ఎక్కువ చనువు ఇచ్చిన అధికారితో మనకు అన్ని సన్నిహితమైపోయాయని అనుకున్న పనులన్నీ జరిగిపోతాయని భావిస్తారు అలా అనుకోవడం కూడా మంచిదికాదు. ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిని తెలుసుకొని నడుచుకోవాలి. ఆ పరిమితి తప్పితే తనుపరాయి వాడిలాగే తనకుతాను ఉండాలి.
రాజగృహంబుకంటెనభిరామముగానిలుగట్టగూడ, దే
యోజనృపాలుడాకృతికినొప్పగు వేషము లాచరించు, నే
యోజవిహారముల్ సలుపనుల్లమునంగడువేడ్కసేయు, నే
యోజవిదగ్ధుడై పలుకు నొడ్డులకుందగదట్లుసేయగన్.
అధికారికి ఇంటి ఎదురుగా ఉండకూడదు, అధికారిలాగా వస్త్రాలు ధరించడం, అతనికి ఇష్టము లేనివాటిని పొగడటం లాంటివి చేయకూడదు. వ్యక్తిగతమైన భావస్వేచ్ఛ ఉండవచ్చు. కానీ అధికారిదగ్గర అలా నడుచుకోవడం వల్ల అభిప్రాయం (ఇంప్రెషన్) మారే అవకాశంఉంది. కాబట్టి తగినంత పరిమితమైన మౌనాన్ని పాటించాలి.
చనువాని చేయుకార్యంబునకడ్డముసొచ్చినేరుపునమెలగుచు దా
నునుబయిబూసికొనుట దన మును మెలగిన మెలకువకునుముప్పగుబిదపన్.
చెప్పని పని, తనకుతాను తలమీద వేసుకుని పూసుకుంటే, చేసినప్పటిమెప్పుకంటేచెయ్యనప్పటి నింద మరింత బాధ తెస్తుంది. కాబట్టి చెప్పిన పని వరకు, నిజాయితీతో ఆచరిస్తే సరిపోతుంది. అత్యుత్సాహం... ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది.
ఊరక యుండక, పలువుర తో రవ మెసగంగబలుకదొడరకయు, మదిం
జేరువ గల నాగరికులు దారుగలసిపలుకవలయుధరణీశుకడన్.
అది పై అధికారి దగ్గర ఉండే చనువుతో ఇతరులపట్ల ద్వేషం చూపిస్తే, ఒకనాడు అందరూకలిసి తనకు సమస్యగామారుతారు. ఆధునిక కాలంలోని ఆఫీసులో నడుచుకోవాల్సిన విషయం.
మన్నన కుబ్బక, యవమతిదన్నొందినస్రుక్కఉబడక, ధరణీశుకడన్
మున్నున్నయట్ల మెలగిన యన్నరునకు శుభము లొదవునాపదలడగున్.
ఒకచోట మనం చేయవలసిన చోట రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్త్వాలు కలిగినవారు ఉంటారు అందరూ మనకు అనుకూలంగా ఉండాలి అనుకోవడం తప్పు కదా! అటువంటి వారితో పరిమితంలో నడుచుకోవాలంటున్నారు.
ఆఫీసులోని రహస్యాలు తెలిసిన ఎవరికీచెప్పకుండా హద్దుల్లో ఉండాలి. స్నేహం తక్కువగా ఉంచుకోవాలి. ఎంత పొగిడినా, ఎంత తెగిడినా అన్నిటికి పొంగిపోక, బాధపడకుండా పరిమితుల్లో ఉండాలి.
ఎండకు వాన కోర్చి, తనయిల్లు ప్రవాసపు జోటు నాక, యా
కొండు, నలంగుదున్, నిదురకుందఱిదప్పెడు, డప్పిపుట్టె, నొ
క్కండనయెట్లొకోయనక కార్యము ముట్టినచోటనేలినా
తం డొకచాయచూపిననుదత్పరతంబనిసేయుటొప్పగున్.
ప్రత్యేకించి ఎండకు వానకు ఓర్చుకోమన్నాడు అంటే కొన్ని సందర్భాల్లో శారీరక శ్రమ ఎక్కువైనా భరించాలి. ఇంకొక చోటికి వెళ్లవలసి వస్తే దానివల్ల శ్రమను ఓర్చుకోవాలి. చివరకు దగ్గు, ఆవులింత, తుమ్ములు కూడా ప్రదర్శించేటప్పుడు చాటుగా చేయాలి. పనిచేసే చోటా లేదా యజమానికి ఆప్తులైనదోమతోనైనా, ఏనుగుతోనైనా గొడవలకు దిగవద్దు. పని భద్రతంగా చేసుకోవాలి.
ఆవులింత, తుమ్ము, హాసంబు, నిష్ఠీవనంబు గుప్త వర్తనములు గాగ
జలుపవలయునృపతికొలువున్నయెడల, బాహిరములైనగెలనికెగ్గులగుట.
ఇటువంటి చిన్నచిన్న అంశాలు కూడా ఎప్పుడో కొన్ని వందలఏళ్ళ క్రితం వ్యాసుడు, కవిత్రయం అనువదించినవి కృతకమైనవని, కల్పితమైన అని భావించకుండా ఒకసారి గమనిస్తే ప్రతిఉద్యోగికిప్రతిచదువులోనూ కరదీపిక లాగా పాఠ్యాంశంగా ఉంచవలసిన అనేకఅంశాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి.
క్రియాశీలత:
నిరారంభఃగృహీచైవకార్యవాన్ చైవభిక్షుకః
కంఠేబద్ధ్వాశీలాంగుర్వీంపాతయేశ్చైవ సాగరే - విదురనీతి
కర్మను, తలరాతను నమ్ముకోవడం, దైవాన్ని నమ్ముకోవడం, భక్తి కలిగిఉండటంమొదలైనవన్నీ చాలామంది దృష్టిలో శ్రమించవద్దని చెప్పినట్టుగా అనుకుంటారు. నిజానికి మహాభారతాది గ్రంథమును మాట్లాడినంత గొప్ప క్రియాశీలతను మరి ఎక్కడా చెప్పబడలేదు
కుటుంబ జీవితంకంటే గృహస్థులు ఎప్పుడూ అన్నీ వదిలిపెట్టి ఉండకూడదు. సన్యాసి ప్రవృత్తి మార్గాన్ని అనుభవించకూడదు ఒకవేళ అలా చేస్తే వారిద్దరూ భ్రష్టులు. ఆ ఇద్దరిమెడకొక్కరాయికట్టి సముద్రంలో పడేయమన్నాడు విదురనీతిలో -
కాబట్టి మానవుడు ఎప్పుడూ క్రియాశీలతతో ప్రయత్నంతో జీవిస్తూఉండాలి. ప్రతి మలుపులోనూ కొత్త అనుభవాలను తోడుకుంటూ ఉండాలి. అలా చేతకాని మూర్ఖునికి బాధపడడానికి రోజు వెయ్యి కారణాలు దొరుకుతాయి. భయపడడానికి 100 కారణాలు దొరుకుతాయి. జ్ఞానికి ప్రయత్నం ముఖ్యలక్షణం.
శోకస్థానసహస్రాణి భయస్థానశతానిచ,
దివసే దివసేమూఢమావిశంతినపండితమ్ (వ్యాసభారతం. వన-2-16)
చేసే ప్రయత్నంలో అన్ని సందర్భాల్లోనూ సఫలీకృతులను మనం కాకపోవచ్చు. కొన్నిసార్లు దైవము అనుకున్నది జరుగుతుంది. మరికొన్నిసార్లు జరగదు. ఆ పని ఎందుకు జరగడంలేదు.? జరగనప్పుడు ఎందుకు అలా అవుతుంది అనడంలో, భగవద్గీత వాక్యమైన కర్మణ్యేవాధికారిస్తే..... అనే వాక్యం ఎందుకుచెప్పినట్లుఅని చాలామందికి సందేహం కలుగుతుంది. దాన్ని భారతం చాలా చోట్ల చర్చించింది.
క్షేత్రంబుపురుషకారము
ధాత్రీశ్వర బీజ మరయ దైవము రెండున్
సూత్రపడగూడెనేనియు
బాత్రమగుంగర్మకరుడుఫలమునకెందున్ (అను.1.134)
విను పురుషుడు గావింపని
పనులకు దైవ మది యెట్లు ఫల మొనరించున్
జనములు గార్యమునడుపగ
ననుకూలతనిచ్చుగాకయయ్యయిఫలముల్ (అను.1.135)
వినుముద్యోగమురెంటియందుబరముర్వీనాథయుద్యోగవం
తునకున్ దైవము దోడ్పడంగఫలసిద్ధుల్. . . (శాంతి.2.127)
దీనిని శాంతి అనుశాసనిక పర్వాలు మొదలైన వాటిలో చాలా విస్తృతంగా చర్చించారు. కొన్నిసార్లు ప్రయత్నం గొప్పదంటారు. కొన్నిసార్లు దైవానుగ్రహం గొప్పదంటారు. మరి వాటిలో ఏదిగొప్పదో తెలుసుకోవాలంటే దేని పాత్ర ఎంతో తెలుసుకోమన్నాడు. వ్యవసాయం చేయడానికి యోగ్యమైన మట్టి వంటిదిమానవప్రయత్నం అయితే అందులోని నాటే విత్తనం వంటిదిదైవఅనుగ్రహం.
క్షేత్రబీజములు రెండు కలిస్తే యోగ్యమైన బలమైన వృక్షం మొలుస్తుంది అలాగని మానవుడు చేయని ప్రయత్నానికి ఫలితం ఎలాగూరాదు. ఎప్పుడైతే సూర్యుడు అన్నింటి పట్ల ఒకేరకమైన కాంతిని ప్రసరించినప్పటికీ, పువ్వు సూర్యుడికి అభిముఖంగా నిలబడడం ద్వారా తన చైతన్యమునుపెంచుకుంటుంది. అలాగే ప్రయత్నం ప్రయత్నంచేయని వాడిలో, చేసేవారిలో ఇద్దరి పట్ల దైవానుగ్రహం సమానంగానే ఉంటుంది. కానీ ఆ ఇద్దరిలోఉద్యోగవంతునికి దైవము అనుగ్రహము మరియు ప్రయత్నం రెండు కలిసి ఉండటం చేత ఫలసిద్ధి కలుగుతుంది. కాబట్టి దైవభక్తి ప్రయత్నం రెండు అవసరమే. దైవాధికారాన్ని మనసులో ధిక్కరించి, గొప్ప పరాక్రమం ప్రదర్శించిన అభిమన్యుడిలా కాకుండా, చిత్తశుద్ధితో శ్రీకృష్ణుని బోధన అనుసరించిన అర్జునునిలా నడుచుకోవాలి.
దానము:
దానము ఆధునికకాలంలో రూపాన్ని మార్చుకుంది.గాలి నుంచి, నీరు, సూర్యకాంతి వరకుఅన్నీ ప్రకృతినుండి మానవుడు పొందుతున్నాడు. కానీ ఎవరికి ఏమీ ఇవ్వడం లేదు. ప్రకృతితో ఋణబడ్డ మనము ప్రకృతి స్వరూపమైన జీవులకు సహాయపడటం, జన్మకు కారణమైన తల్లిదండ్రులకు, సంస్కారమునకు కారణమైన పెద్దలకు, ఋషులకుసేవచేయడంమొదలైనవన్నీ దానంలోని అంతరార్థం. దానం చేసే విషయంలో గొప్పతనాన్ని అన్ని సంస్కృతులు అంగీకరించాయి. అనేక కథలు ప్రస్తుతించాయి.
దానంలో ముఖ్య అంశాలు - మూడు.
దాత, ద్రవ్యము, గ్రహీత:
దాతకు, ద్రవ్యముకు, దానంతీసుకునే వారికి ముగ్గురికి యోగ్యతను నిర్ణయించింది మహాభారతం.అన్యాయంతో సంపాదించేధనం, దానంగా ఇవ్వకూడదు. అదిఎటువంటిపుణ్యఫలితాన్ని ఇవ్వరు ధర్మంగాసంపాదించిన ధనంలో ఒకవంతుదానంచేసినాఎన్నోరెట్లపుణ్యఫలితాన్ని ఇస్తుంది. అంటే దీని ఉద్దేశం సమాజంలో దానం ఇవ్వడంకంటే ఆదానం చేయడానికి కావలసిన ధనాన్నిపొందే మార్గము ధర్మ బద్ధమైనదిగా చూసుకోవాలి. మోసాలు, పాపాలు, వస్యనాలనుండివచ్చేడబ్బుకాదు. ధర్మంగా సంపాదిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. యోగ్యమైన వారికి దానం చేస్తున్నామా అనేదిముఖ్యం. రెండవది ద్రవ్యము ఏవస్తువు ఎవరికి ఇవ్వాలని కూడా యోచించి ఇవ్వాలి. విద్యార్థికి బంగారం, కాకుండా పుస్తకాన్నివ్వాలి. కన్యాదానం చేయలేని వారికి బంగారం ఇవ్వాలి. ఆకలితో ఉన్నవాడికి వస్తువులు కాకుండా అన్నాన్ని పెట్టాలి. ఎండాకాలం చలివేంద్రం పెట్టాలి. ఇవి తెలిసినప్పుడుతగినవిధంగా దానం చేయడం, చేయించడం పుణ్యకార్యమవుతుందియోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ దానము మరింత గొప్పఫలితాన్ని ఇస్తుంది.
శా. అన్యాయార్జితమైనవిత్తమునజేయంబూనుదానంబు మూ
ర్ఖన్యాయంబదిదానజేసిఫలపాకంబేమియున్ లేదు . . . . . . . . ( ఆరణ్య.6.112 )
ధర్మలబ్ధమైన ధనము పాతికయేని
బహుళ ఫలమునిచ్చుబాపవృత్త్యు
పార్జితంబుకోటియైననిష్ఫలమండ్రు
దానశాస్త్రవిదులు మానవేంద్ర ( శాంతి.5.492 )
గ్రహీత అంటే దానం తీసుకునేవాడు. దానం తీసుకునే వ్యక్తి కేవలం వస్తువులు తీసుకుని వినియోగించుకోవడమే కాకుండా లాభాపేక్ష కాకుండా వస్తువుతో అవసరం ఉన్నంతవరకే వినియోగించుకోవాలి. మరొకరికి దానం చేసే బుద్ధికూడా కలిగి ఉన్నవాడే ద్రవ్యాన్ని స్వీకరించమంటున్నాడు. కాబట్టి దానం స్వార్థం కోసంకాదు. అవసరానికి మాత్రమే. దానం లోకానికి మేలు జరగడం కోసం ఎల్లప్పుడూ చేయాలి.. ప్రస్తుతం చాలామంది తమకు కలిగిన ధనం ప్రదర్శించడం కోసం, డాంబికానికి దానాలు ఇస్తున్నట్టు చూస్తున్నాం. అదియోగ్యమైన మార్గం కాదు. "శ్రద్ధయాదేయం అశ్శ్రద్ధయా2దేయం శ్రియాదేయంహ్రియాదేయం..." అని వేదం చెప్పింది. శ్రద్ధతో కలిగిన దానిని ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాననేపరితాపంతోఇవ్వాలి. శక్తివంచన లేకుండా ఇవ్వాలి. కలిగిదానికి తక్కువ ఇవ్వకూడదు. అని వేదంలోని ఉపనిషత్‌వాక్యాలు చెప్పాయి. తుచ్ఛ మార్గములు వీడి ఉన్నతమైన దాన మార్గాన్ని అనుసరించమన్నారు.
మోసాన్ని గుర్తించడం:
మోసం జరగని చోటు లేదు. మోసం జరగని విషయము లేదు. మోసం జరగని కాలము లేదు. అటువంటి కాలంలో మోసాన్ని ఎలా గుర్తించాలి.? లేదా మోసం జరగకుండా మరింత నష్టపోకుండా ముందే తనకుతాను ఎలా జాగ్రత్తపడాలి ? అనడానికి మూషికమార్గాల సంవాదం రూపంలో భీష్ముడు ఒక చిన్న ఉపాఖ్యానాన్ని చెప్పాడు.
పరస్పరం జాతి వైరులైన పిల్లి ఎలుకలు ఒక సందర్భంలో ఒకరినొకరు సహాయం చేసుకోవడం ద్వారా ప్రాణరక్షణ పొందుతారు. మరుసటి రోజు పిల్లి, ఎలుక దగ్గరికివచ్చి స్నేహం చేయడానికి ఆహ్వానిస్తే ఎలుక చెప్పిన మాటలు నేటి యువతకు నేటి బాలబాలికలకు బాగా ఉపయోగపడతాయి...
అరులనుమిత్రులందెలియనారయుటెంతయుసూక్షకృత్యము
అవ్వెర వతి దుర్లభం బరులు వీరననుండియుమిత్రభావముం
బొరయుటయున్ సుహృజ్జనులపోలికిగల్గియుశత్రుతాగుణ
స్ఫురణ యొకప్డుసూపుటయుజూతుము గాదె ధరిత్రి నెల్లెడన్.
శత్రువుల్ని స్నేహితుడిని గుర్తుపట్టడం, వేదాన్ని గుర్తించడం ఎంతో కష్టం. అది దుర్లభమైన మార్గం. ఒకవేళ కొన్ని సందర్భములలో దుష్టుడు,స్నేహితుడుగా కనిపించినా తనలో ఉండే స్వాభావికమైన క్రూరబుద్ధిలోపలనిద్రాణంగా ఉంటుంది. మరొక సందర్భంలో అది వ్యక్తమవుతుంది. దుర్మార్గుడితో తప్పక ఒకసారి స్నేహం చేయవలసి వచ్చినా, లేదా కొన్ని సందర్భాల్లో ఒక పని నిమిత్తంగా కలిసి ఉండవలసి వచ్చినా, ఆ పని వరకే పరిమితమై ఉండి ప్రయోజనము పొందేవరకు తనతో కలిసిఉండి ఆపైనఅలానడుచుకోకుండా అంతకుమించి స్నేహంతో ఉండకుండా ఉంటే కీడు రాకుండా నడిచే ఉత్తమమైన మార్గమవుతుంది.
బలవంతుడైనశత్రుని
వలన ప్రయోజనము గలిగి వలను కలిమిదా
కలిసియునదిగడచనగా
తొలగవలయునమ్మెనేనితుదికీడొలయన్
కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీలను వశపరచుకుని బాలికలను రకరకాల ఇబ్బందులకు గురి చేసే వ్యక్తుల గురించి వార్తాపత్రికల్లో వార్తలద్వారా మనకు తెలుస్తూనేఉంది. అటువంటి వ్యక్తిఅనిమనకుతెలిసినా పెద్దలకు ముందే చెప్పడం. వారితో పరిమితుల్లోఉండటం ఎంతదూరం వెళ్లకూడదు, ఆ పరిమితిని తెలుసుకొని ఆ హద్దులోనే నడుచుకుని ఉండటం, అవతలివ్యక్తిమంచివాడైనా మంచివాడిలా నటిస్తున్నా మనకు సమస్యరాకుండా ముందు నుంచి జాగ్రత్త పడటం మంచిది.
ఈ అంశాన్ని ఒక్కసారి గమనిస్తే ఈఅంశాన్ని మన పిల్లలకు గనకచెబితే ఆడపిల్లల పైన జరుగుతున్నట్లు కొన్ని అయినా నిగ్రహించవచ్చు నివారించవచ్చు. ఇది మోసపోయే స్త్రీలగురించేకాక, చింతామణి, విప్రనారాయణ వంటికథలలాగా పురుషులకూ గుణపాఠం అవుతుంది.
దేశభక్తి:
శాంతికాముకుడైన శ్రీకృష్ణుడు రాయబారంలో ‘ ధర్మగ్లాని జరిగినపుడు, సమర్థులైన వారు చొరవ తీసుకోకపోతే అది వారికికీడుఅవుతుం’దని హెచ్చరించిన సందర్భం ఉద్యోగపర్వంలో చోటుచేసుకుంది. ప్రతి దేశంలోని సంస్కృతి ఆ జీవనవిధానము వారియొక్క తత్త్వమునకు ప్రతీకగానిలబడుతుంది. కొన్ని సందర్భాలలో అంతఃకలహం రావచ్చు. మరొక సందర్భాల్లో బయటి నుంచి సమస్యరావచ్చుఅటువంటిచోట దక్షులుఉపేక్ష చేయకూడదు. మేధావులు సహించరాదు. అది వారికిచేటు అవుతుందన్నాడు శ్రీకృష్ణుడు. దేశానికి, సమాజానికి, సంఘానికి సమస్య వచ్చినప్పుడు లేదా దేశంలో సమస్య వచ్చినప్పుడు మేధావులు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడాలి. చేయవలసినచర్యలు చేయాలి. అలా చేయనప్పుడు అంతచదువువ్యర్థం. అంత జ్ఞానం నిరర్థకం కదా!
ప్రపంచంలో అన్నిమౌనాలకంటే మేధావి మౌనం చాలా ప్రమాదకరం అందరి స్వార్థం కంటే మేధావి స్వార్థం చాలా సమస్యాయుతమైనదిఅని మేధావులు చెప్పిన గొప్పగొప్ప తత్వవేత్తలు చెప్పినఅంశాన్నిఉద్యోగపర్వం మనకు చెబుతుంది.అందుకే..
ఉ. ‘సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేతబొంకుచే
బారముబొందలేకచెడబాఱినద్కెనయవస్థదక్షు లె
వ్వారలుపేక్షసేసిరదివారలచేటగుగానిధర్మని
స్తారకమయ్యుసత్యశుభ దాయక మయ్యునుద్కెవముండెడున్’ అన్నాడు. (ఉద్యోగ 3 -273)
అందుకోసం మోసాన్ని మోసంతోనే నివారించాలని, సాధుగుణాన్ని గౌరవించాలని శ్రీకృష్ణుడు వ్యాసభారతంలో బోధించాడు. మాయాచారౌమాయయావారణీయఃసాద్ధ్వాచారౌసాధునాప్రత్యుపేయః కాబట్టి మహాభారతంలోని సార్వకాలీనమై, సార్వజనీనమై పాటించే అనేక అంశములలో భక్తి, జ్ఞానం, నీతి మొదలైనఅనేకవిషయాలను మహాభారతం ప్రస్తావించింది. అందులో కొన్నింటినివివరించే ప్రయత్నంచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.స్వస్తి.
ఉపయుక్త గ్రంథాలు:
- ఆంధ్ర మహాభారతం - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ - 2013.
- సంస్కృత వ్యాస భారతం - డాక్టర్ తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి, గీతాప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ - 2017.
- మారద వెంకయ్య - భాస్కర శతకం - జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ , రాయల్ అండ్ కో. కడప వారి ప్రచురణ - 1954.
- తైత్తిరీయ ఉపనిషత్తు - దశిక కృష్ణమోహన్ , నరసాపురం (స్వయం ప్రచురణ) 1988.