AUCHITHYAM | Volume-3 | Issue-11 | October 2022 | Second Anniversary Special Issue - ISSN: 2583-4797
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తేది. 29 ఆగస్ట్ 2022న
"ప్రతిభ డిగ్రీ మరియు పిజి కళాశాల", సిద్ధిపేట ఆధ్వర్యవంలో నిర్వహించిన "మహాభారత ఔచిత్యం" అంతర్జాలసదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం
1. మహాభారత ఔచిత్యం
సంపత్ కుమార్ బానోజి
తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (స్వయంప్రతిపత్తి),
సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం.
సెల్: 9666085015, , email: sampathskb7@gmail.com
ఉపోద్ఘాతం:
అచతుర్వదనో బ్రహ్మ, ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభు, ర్భగవా న్బాదరాయణః
వాఙ్మయాన్ని సృష్టి చేసిన బ్రహ్మ,
మానవుని హృదయాంతరాలలో ఉన్న ఆసురీ ప్రవృత్తిని శాస్త్రాలతో దునుమాడే హరి,
జ్ఞాననేత్రాన్ని కలిగిన శంభుడే,
బాదరాయణునిగా పిలవబడే వేదవ్యాసులవారు.
మానవాళి పైన అవ్యాజమైన వాత్సల్య భావనతో వాఙ్మయ సృష్టి చేసిన వారు వేదవ్యాసులవారు. బ్రహ్మమానస పుత్రుడైన బ్రహ్మర్షి వశిష్టుని పరంపరలో జన్మించాడు. వీరు నీలిమేఘచ్ఛాయ కలిగిన వాడగుట చేత కృష్ణునిగా, యమునా ద్వీపంలో పుట్టడం చేత ద్వైపాయనునిగా, ఈ రెండు పేర్లు కలపగా కృష్ణద్వైపాయనునిగా వాసికెక్కారు. ఇక పరాశరుల వారి పుత్రుడవటం చేత పారాశర్యునిగా, సత్యవతీ దేవి కుమారుడవటం చేత సాత్యవతేయునిగా, బదరికాశ్రమంలో ఉండుట చేత బాదరాయణునిగా, వేదాలను విస్తరించి, విభజించి, ఉపదేశించుట చేత వేదవ్యాసునిగా జగత్ప్రసిద్ధులైనారు.
కృష్ణద్వైపాయనులవారు వేద వాఙ్మయ స్వరూపాన్ని బట్టి, ప్రతిపాదించే విషయాలను బట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని నాలుగు విభాగాలుగా విభజించి వాటిలో మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, అరణ్యకములు, ఉపనిషత్తులు అనే విభాగాలు చేశారు. ఇంతటి మహిమాన్విత కృత్యము చేసి వేదవ్యాసులుగా వాసికెక్కారు. అంతేకాక చతుర్ముఖ ప్రోక్తమైన పురాణం శతకోటి ప్రవిస్తరంగా ఉండేది. అలాంటి పురాణాన్ని కూడా కుదించి అందించిన అపరబ్రహ్మ. అట్లే బ్రహ్మసూత్రాలను రచించిన అపాంతరతముడు. ఇలా విస్తారమైన వాఙ్మయాన్ని సృష్టించిన వ్యాసులవారు వేద ప్రతిపాదకములను సులభమైన రీతిలో మానవాళికి అందించాలనే మహోన్నత లక్ష్యంతో మహాభారత రచనను చేపట్టారు. స్థూలంగా మహాభారతాన్ని పరిశీలిస్తే ఇదొక అద్వితీయ ఇతిహాసమని తెలుస్తుంది. ఇతిహాసమునకు ఇతిహ ఆస్తినే అస్తేతి ఇతిహాసః అనే వ్యుత్పత్తి కలదు. దీనిని అనుసరించి ఇతిహాసము అనగా పూర్వమిట్లు జరిగినదని పరంపరాగతంగా చెప్పబడినదని అర్థము. ఇందులో సోమవంశజుల చరిత్ర గలదు. విశేషించి కురుపాండవుల చరిత్రతో భాసించునది. ఈ ఇతిహాసము ఉపదేశ ప్రధానమైనది. పైగా యధార్థముగా జరిగిన గాథ. మానవుని సదాచారునిగా, ధార్మికునిగా తీర్చిదిద్ది మనిషిని మనీషి గా చేయగలిగిన ఉత్తమ గ్రంథము. వివిధ శాస్త్రములకు ఆలవాలము. ఇందులో గల ఒక్కో పాత్ర ఒక్కో పాఠాన్ని నేర్పిస్తుంది. ఒక్కో సంఘటన మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తూ విలువైన సందేశాలనిస్తుంది. అలాంటి భారత ఔచిత్యాన్ని తెలపడం నా వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
భారత పరిణామ క్రమము, వ్యాప్తి:
మహాభారతాన్ని అన్ని వ్యాసమహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు రచించాడని ప్రతీతి. అలాంటి మహాభారతాన్ని జయం, భారతం మరియు మహాభారతం అని వ్యవహరిస్తాము. ఈ మూడు పేర్లకు చరిత్రకారులు ఒక అర్థాన్ని చెప్పగా, ఋషి హృదయాన్ని అర్థం చేసుకున్న ఐతిహాసికులు భారత ప్రాశస్త్యం ఉట్టి పడేలా అంతరార్ధాన్ని తెలియజేశారు.
1 . జయ నామౌచిత్యం :
చరిత్రకారుల దృక్కోణం : వేదవ్యాసులవారు 8,800 శ్లోకాలలో జయాన్ని రచించాడని వీరి అభిప్రాయం. పాండవుల విజయగాథను తెలుపే గ్రంథమవటం చేత దీనిని జయం అని అన్నారు.
ఐతిహాసికుల దృక్పథం : మానవుడు తన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను ఏ విధంగా జయించాలని తెలుపుతూ చతుర్విధఫల పురుషార్ధములలో ధర్మార్థకామములను దాటి ఏవిధంగా మోక్షాన్ని జయించాలో వివరించే మోక్ష శాస్త్రము కావున దీనిని జయం అన్నారని వీరి అభిప్రాయం.
2 . భారత నామౌచిత్యం:
చరిత్రకారుల దృక్కోణం : జనమేజయునికి వేదవ్యాసుల వారి శిష్యులలో మొదటివాడైన వైశంపాయనుడు ఈ భారతాన్ని వినిపించాడని చెబుతారు. ఇందులో ఆఖ్యాన సహితంగా 24,000 వేల శ్లోకాలు ఉన్నాయి. ఇందులో భరత వంశీయుల చరిత్ర అభివర్ణించబడినదని కావున దీనిని భారతం అంటారని వీరి అభిప్రాయం.
ఐతిహాసికుల దృక్పథం : భారత్వం కలది కనుక భారతం అని అంటారు. ఈ గ్రంథానికి ఈ భారత్వం రావడానికి కారణం ఇందులో నాలుగు వేదాల సారాన్ని వేదవ్యాసులవారు నిక్షిప్తం చేయడమే! అందువల్లనే దీనిని పంచమ వేదం అని కూడా పిలుస్తాము.ఇందులో వేదాల సారమే కాక వివిధ రకాల ఉపనిషత్తుల, అరణ్యకాల సారము, సాధనా రహస్యాలు మరియు పరబ్రహ్మతత్వం కూడా ప్రతిపాదించబడింది.
3 . మహా భారత నామౌచిత్యం :
చరిత్రకారుల దృక్కోణం : నైమిశారణ్యంలో సత్రయాగం జరుగుతున్నప్పుడు ఉగ్రశ్రవసుడు అనే మహర్షి శౌనకాది మహామునులకు దీనిని వినిపించాడు. ఆఖ్యాన, ఉపాఖ్యాన సహితంగా ఈ గ్రంథం లక్ష శ్లోకాల వరకు విస్తరించింది. ఇంతటి బృహత్తరగ్రంథమైనందున దీనిని మహాభారతం అన్నారు.
ఐతిహాసికుల దృక్పథం : మహా అనగా జీవాత్మకు పరమాత్మను దగ్గర చేయు సాధనము అని అర్థము. దీనిని బట్టి భారతము మోక్షప్రదమని తెలుస్తుంది.
ఇలా చరిత్రకారులు అసలైన భారతం జయం అనే పేరిట వ్యాసులవారి చేత రచించబడిందని తెలియజేస్తూ, ఆ జయానికి వ్యాసుల వారి శిష్యుడైన వైశంపాయనుడు కొన్ని కథలను చేర్చి భారతంగా రూపొందించారని, అటుపిమ్మట సౌతిగా పిలవబడే సూత పౌరాణికుడైన ఉగ్రశ్రవసుడు భారతానికి మరి కొన్ని కథలను చేర్చి మహాభారతంగా మలచాడని వీరి బలమైన వాదన. ఇక ఐతిహాసికుల వాదాన్ననుసరించి లక్షశ్లోకాల భారతాన్ని రచించింది వ్యాసులవారే! ఈ అంశాన్ని వ్యాసుల వారే భారతంలో ధృవీకరించారని ఆది పర్వంలో ఉన్న శ్లోకాలను ఉటంకించిమరి భారత వ్యాప్తిని గూర్చి తెలియజేశారు.
భారత ఔచిత్యం:
ధర్మేచార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్
ధర్మం విషయంలో, అర్థం విషయం లో కామం విషయంలో మరియు మోక్షం విషయంలో ఇందులో ఏదైతే ఉందో అదే ఇతరత్రా ఉంది. ఇందులో లేనిది ఎందులోనూ ఉండదు. అని భారతాదిలో వ్యాసుల వారే ప్రకటించారు. దీనిని బట్టి భారతం మానవజీవన దర్పణమని గ్రహించాలి. భౌతికంగా పరిశీలిస్తే భారతం లోనే భగవద్గీత, విష్ణు సహస్రనామం, భీష్మస్తవరాజము, సనత్సుజాతీయం వంటి అంశాలు పొందుపరచబడ్డాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే భారత అరణ్య పర్వంలో రామాయణం కూడా కనిపిస్తుంది. అంతేకాక నీతిశాస్త్రము, ధర్మ శాస్త్రము, రాజనీతి శాస్త్రము, యుద్ధ తంత్రము మొదలైన అంశాలు కూడా ఇందులో కనబడతాయి. అందువల్ల భారతాన్ని విజ్ఞానసర్వస్వంగా భావించవచ్చు.
భారత సావిత్రి:
భారత సారాన్ని తెలియజేసే శ్లోకరాజమే భారత సావిత్రి
న జాతు కామాన్న భయాన్న లోభాద్
ధర్మం త్యజేజ్జీవితస్యాపి హేతోః
నిత్యోధర్మః సుఖదుఃఖే త్వనిత్యే
జీవోనిత్యః హేతురస్య త్వనిత్యః (స్వర్గా. 5-63)
‘ధర్మం నిత్యం, సుఖదుఃఖాలు అనిత్యాలు. జీవుడు నిత్యుడు. జీవత్వకారణమైన అవిద్య అనిత్యం. కనుక, భోగాభిలాషచే గాని, భయంచే గాని, లోభం వల్ల గానీ, చివరకు ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మం తప్పరాదు’ అని మానవ జాతిని హెచ్చరిస్తూ వ్యాసుడు స్వర్గారోహణ పర్వంతో భారతాన్ని ముగిస్తాడు. ఇలా ధర్మ, అధర్మపరుల రెండు జీవితాలు చిత్రించి మహర్షి అధర్మపరిణామం ఇంత దారుణంగా ఉంటుంది కావున దానిని త్యజించాలి. సుఖశాంతిప్రదాయకమైన ధర్మపురుషార్థమే గ్రహించి బాగుపడాలి అని ఆద్యంతాలలో భారత సంహితా పరమార్థసారం బోధిస్తాడు.
ఇంతటి మహత్తరమైన మహాభారతాన్ని అతి ప్రాథమిక స్థాయిలో అధ్యయనం చేయడం వల్ల కురు వంశజుల చరిత్రను తెలుసుకోవచ్చు. అట్లే మంచిచెడుల విచక్షణను పెంపొందించుకోవచ్చు. ఇక ప్రాథమిక స్థాయిలో అధ్యయనం చేయడం వల్ల జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అట్లే నాటి సామాజిక స్థితిగతులను, వ్యవహార శైలిని తెలుసుకోవచ్చు. అటు పిమ్మట మాధ్యమిక స్థాయిలో అధ్యయనం చేయడం వల్ల ధర్మము పట్ల అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఇక ఉన్నత స్థాయిలో అధ్యయనం చేయడం వల్ల శాస్త్ర రహస్యాలను ఒడిసి పట్టుకోవచ్చు. చివరిగా అత్యున్నత స్థాయిలో భారతాన్ని అధ్యయనం చేయడం వల్ల విష్ణు యజ్ఞ ప్రతిపాదకమైన భారతం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఇలా భిన్న స్థాయిలలో భారతాన్ని అధ్యయనం చేసి తరించవచ్చు.
సంప్రదింపు గ్రంథాలు
- ఇదీ యథార్థ మహాభారతం - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు - ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ - 2020
- వ్యాస మహర్షి - ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు - సంస్కృత భాషా ప్రచార సమితి - 2006
- వ్యాస భారత వరివస్య - బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు - శ్రీ వ్యాసపీఠం - 2009
- శ్రీ మహాభారతము - డా. తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి గారు - గీతాప్రెస్ , గోరఖ్ పూర్ - 2021
- శ్రీ మహాభారత సారోద్ధారము - బ్రహ్మశ్రీ ముల్లుకుట్ల నరశింహావధానీ పాకయజీ గారు - మారుతీ పబ్లికేషన్స్.