AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797
6. సంఘసంస్కరణోద్యమం : కందుకూరి వీరేశలింగం పాత్ర
జి. ఓబులకృష్ణ
ఎం.ఏ. టి.పి.టి., టి.వెలమవారిపల్లి, వేంపల్లె, కడప.
Cell: 6303924949, E-Mail: gondikotakrishna@gmail.com
Keywords:కందుకూరి, వీరేశలింగం, సంఘసంస్కరణ, ఉద్యమాలు, పత్రికలు.
ఉపోద్ఘాతము:
రాజమహేంద్రవరం అనగానే మనకు గుర్తుకు వచ్చే కవులు ప్రధానంగా నన్నయ, కందుకూరి వీరేశలింగం పంతులు. నన్నయ తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కోరికతో రాజమహేంద్రలోని గోదావరి తీరాన ఆంధ్రులకు ఆదికావ్యం అయిన ఆంధ్రమహాభారతరచనకు శ్రీకారం చుట్టెను. అలాంటి ప్రాంతమైన రాజమహేంద్రవరంలో కొన్ని శతాబ్దాల తర్వాత ప్రముఖ విమర్శకుడు, ఆంధ్రసాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగంగారు 1848వ సంవత్సరంలో ఏప్రిల్ 16న ‘పున్నమ్మ’, ‘సుబ్బరాయుడు’ పుణ్యదంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు.
కందుకూరికి పుట్టినప్పటి నుండి రోగాలే. అసలు బ్రతకడమే కష్టం అని అనుకున్నారు అందరూ. కాని బ్రతికాడు. కందుకూరి వారు చిన్నతనంలో తండ్రిని కోల్పోయాక పెద్దతండ్రి వద్దకు వచ్చి చేరారు. వీధిబడికి తప్ప ఆడుకోవడానికి బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కందుకూరికి పొద్దు పోకపోవడంతో ఇంట్లో అటకల మీద ఉన్న తాళపత్రాలు తీసి చదవడం ప్రారంభించారు. దానివలన తెలుగు మీద అభిమానం ఎక్కువై కావ్యాలను చదవాలనే కోరిక పెరిగింది.
కందుకూరి గారికి ఎవరైన మంచి గ్రంథం గురించి చెప్పినా దాన్ని చదివే దాక మనస్సు నిలబడదు. ఆ గ్రంథాల వ్యామోహంతో బడికి నామం పెట్టాడు. ఈ విషయం తెలిసి అమ్మ వచ్చి విచారించగా అది నిజమేనని పల్కిన సత్యవాది కందుకూరి.
కందుకూరికి తన 13వ యేట తన మేనకోడలయిన ఏడేళ్ళ పిల్ల అయిన బాపమ్మతో పెళ్ళి చేశారు. తన తల్లి అయిన పున్నమ్మకు ఆ పాత పేరు నచ్చక తన కోడలికి ‘రాజ్యలక్ష్మీ’ అని పేరు పెట్టారు. రాజ్యలక్ష్మి తన భర్త అడుగుజాడల్లో నడిచి, అతను చేసే అన్ని పనులలో సహాయాన్ని అందించిందన్న మాట.
కందుకూరి వారు చిన్నతనం నుండే మంత్రాలన్న, శకునాలన్న ఇవన్ని మూఢనమ్మకాలని తోసిపారేశాడు. అంతేకాక ఎవరైన వీటి గురించి చెప్పినా వినేవాడు కాదు. అలాంటి కందుకూరి సంఘంలో ఉన్న ఈ మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన మహనీయుడు.
సంఘసంస్కరణలు:
భారతదేశంలో ఈ సంఘసంస్కరణోద్యమం మొదట వంగదేశంలో బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజారామ్ మోహన్ రాయ్ ప్రారంభించాడు. ఈ రాజారామ్ మోహన్ రాయ్ మరణించిన (1833) 14 సంవత్సరాల తర్వాత జన్మించాడు కందుకూరి వీరేశలింగం. ఈయన బ్రహ్మ సమాజ ప్రభావంతో పాటు ఈశ్వర చంద్రవిద్యా సాగర్, కేశవ చంద్రసేన్, రాజారామ్ మోహన్ రాయ్ మొదలగు సంఘసంస్కర్తల రచనలచే ప్రభావితులై ఆంధ్రదేశంలో సంఘసంస్కరణోద్యమాన్ని ప్రప్రథమంగా ప్రారంభించిన మహనీయుడు. తన జీవితాన్ని అంతా సంఘ సేవకే అంకితం చేసిన దయార్థ హృదయుడు.
లంచాలు, వేశ్యాంగన సంగమము నీతి కాదని నాయకులకు హితబోధ చేశారు. 1874వ సంవత్సరంలో కొక్కండ వేంకటరత్నం పంతులుగారు ఆంధ్ర భాషా సంజీవనిలో "స్త్రీలు విద్యను నేర్చుకోరాదని వారు చదువుకొంటే లోకానికి హాని” అని రాశారు. దానికి కందుకూరి వారు "స్త్రీలు తప్పకుండా చదువుకోవాలని అప్పటి దాకా దేశానికి మంచి రోజులు రావని” ప్రతిఘటించారు.
పత్రికల స్థాపన - రచనలు:
తన భావాలను ప్రచారం చేయడానికి ఒక పత్రిక అవసరమని 1874వ సంవత్సరంలో ‘వివేకవర్ధని’ అనే మాసపత్రికను ధవళేశ్వరం నుండి వెలువరించారు.
ఈ వివేకవర్ధిని పత్రికను ప్రధానంగా రెండు ఉద్దేశాలతో స్థాపించాడు. 1) దేశాభివృద్ధి 2) భాషాభివృద్ధి. ఈ పత్రికలో విద్యావిషయాలు, దేశవ్యవహారాలతో పాటు నీతి, మతానికి సంబంధించిన విషయాలు కూడా ప్రచురణమయ్యేవి. ఈ పత్రికలో స్త్రీ విద్యావశ్యకత గురించి జోరుగా రచనలు చేశారు. తత్ఫలితంగా ధవళేశ్వరంలో ఒక బాలికా పాఠశాలను కూడా స్థాపించాడు.
వీరేశలింగం పంతులు గారు స్త్రీల కోసం ప్రత్యేకంగా “సతీహిత బోధిని” అనే పత్రికను నడివారు. ఈ పత్రికలో 'చంద్రమతి చరిత్ర'ను రాసి స్త్రీలకు విద్యావశ్యకతను నొక్కి మరీ చెప్పాడు. అంతేకాక 1879న ప్రార్థనా సమాజాన్ని స్థాపించి పేదలకు చందాలు ఇచ్చేవాడు. రాత్రి బడిని నడిపి, వారికి చదువు చెప్పాడు. రాజమండ్రిలో స్త్రీల కోసం ప్రార్థనా మందిరం స్థాపించి నిరంతర స్త్రీ సేవ చేశాడు.
“సత్యరాజా పూర్వదేశ యాత్రలు” 1891 సంవత్సరంలో రాశాడు. ఈ రచన ద్వారా స్త్రీలకు విద్యలేని కారణాల వల్ల జరిగే నష్టాల్ని తెలియజేశారు. స్త్రీల శరీరారోగ్య ధర్మాలను బోధించే “దేహారోగ్య ధర్మ బోధిని”, ‘హిత సూచిని’ అనే గ్రంథాలు కూడా రాశారు. ఇలా సంఘసంస్కరణోద్యమం కోసం విభిన్న ప్రక్రియలను ఉపయోగించుకున్న హృదయారవిందుడు కందుకూరి వారే అని చెప్పవచ్చు.
సాంఘిక దురాచారాలు రూపుమాపడం:
కందుకూరి గారు వితంతువులకు పునర్వివాహాలు ధర్మమే అని తమ పత్రికల ద్వారా ప్రచారం చేశారు. ఈయన 1881 డిసెంబరు 11న గోగులపాటి శ్రీరాములు, గౌరమ్మలకు తొలి వితంతువు వివాహం తన ఇంటి వద్ద చేశారు. ఈ పెళ్ళికి ధనసహాయం చేసింది రామకృష్ణయ్య అనే వ్యక్తి. ఇదే తెలుగుదేశంలో మొట్టమొదటి వితంతువు వివాహం. తర్వాత కొన్ని రోజులకు 1881 డిసెంబరు 15న రెండవ స్త్రీ పునర్వివాహం చేశారు. వధూవరులు రత్నమ్మ, రాచర్ల రామచంద్రరావు. ఇలా ఎన్నో వితంతువు వివాహాలు జరిపారు. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామనయ్యే వారి దుశ్చర్యలను బటయపెట్టుటకు అనేక ప్రహసనాలు రాశారు.
ముగింపు:
కందుకూరి వారు ఆంధ్ర దేశంలోనే కాక మద్రాసులో 1897 వితంతువుల కోసం వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. అంతేకాక మద్రాసులో సంఘసంస్కార సమాజ మందిరాన్ని కూడా స్థాపించారు. వీరేశలింగం గారు బాల్యవివాహాలు వద్దని వితంతు పునర్వివాహాలు చేయాలని, విగ్రహారాధన చేయకుండా ఏకేశ్వరోపాసనము మొదలైన వాటి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి. 1919 మే 27 మద్రాసులో వీరేశలింగం మరణించారు.
ఇతని సేవలకు మెచ్చి అనగా ఫ్రాన్స్ దేశంలో ప్రముఖ సంఘసంస్కర్త “వోల్టేరు” వలె ఆంధ్రదేశంలో చేసిన సంఘసంస్కరణలకు మెచ్చి ఆనాటి భారత ప్రభుత్వం 1893లో 'రావు బహుద్దూర్' బిరుదు నిచ్చి గౌరవించారు.
ఆధార గ్రంథాలు:
- డా|| రమాపతి రావు, అక్కిరాజు (1972). వీరేశలింగం పంతులు-సమగ్ర పరిశీలన, శివాజి ప్రెస్, సికింద్రాబాద్.
- యాదగిరి, కె., (సంపా.), (2011). తెలుగులో కవిత్వోద్యమాలు, తెలుగు అకాడమీ, హైదరాబాద్.