AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797
5. తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి కవిత్వం : ప్రశంస
మేకల శ్రీనివాసరావు
పరిశోధక విద్యార్థి, ఆంధ్రయునివర్సిటి, విశాఖపట్నం.
Cell: 8185070004, E-Mail: mekalasrinivasarao29@gmail.com
ఉపోద్ఘాతం:
చరాచర సృష్టిలో మానవజన్మ అత్యుత్తమైనది. ఇతర జీవులకు లేని అనుభూతులు, తెలివి, అనుభవాలు, ఆలోచనలు, ఆచరణలు అన్నీ మనిషికే సాధ్యం. పుట్టుక, చావు అనేవి వీరికి సర్వసాధారణ జీవిత క్రమం. ఉన్నన్ని రోజులు నలుగురిలో మనిషి, పోయాక మనిషి మట్టిలో కలిసినట్లే అతని జ్ఞాపకాలు అందరినీ వీడుతాయి. కానీ కొందరు మహాభావులు జననం దేన్నో సాధించడానికి అన్నట్లు వారి బ్రతుకు వారి కోసం కాకుండా సమాజం కోసమే అన్నట్లు ఉంటుంది. గొప్ప కార్యసాధకత మాత్రమే అనికాక, వారు గతించినా సమాజం వారు చేసిన ఏదో ఓ మంచిపని ఎప్పటికి చిరస్మణీయులుగా ఉంచుతుంది. వారి కృషి, పట్టుదల, మార్గదర్శకత వారికా ప్రత్యేకతని సంతరించుతాయి. అందుకే పెద్దలు గొప్ప మనిషి పోయేటప్పుడు దేన్ని వెంటబెట్టుకుపోలేడు కానీ అతని కీర్తిమాత్రం దశ దిశలా వ్యాప్తి చెందించి వందల సంవత్సరాలైనా జనులు మరిచిపోలేని తమదైన ముద్రని తరతరాల హృదయల్లో చోటు చేసి వెళ్తారు. అది మహనుభావులకే సాధ్యమయ్యే సార్థకత. అందుకే తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి 'ఎందరో మహానుభావులు' అనే రీతిలో వారిని ప్రశంసిస్తూ వారు చేసిన మహత్కార్యాలను గుర్తుకు తెస్తూ వారెందుకు మహానుభావులు అయ్యారో కవితా రూపంలో తెలియజేసారు. సామాన్య జీవన గమనం పై, సామాజిక స్పృహ పై, సమకాలీన అంశాల పై అవగాహన కలిగిన తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి కవితలను విస్తృత పరిధిలో అధ్యయనం చేసాను.
తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి - పరిచయం:
ఆంధ్రప్రదేశ్ లోని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో, నిడమర్రు మండలం మారుమూల గ్రామమైన పెదనిండ్ర కొలనులో, శ్రీ వేంకటరామ రావు, సుబ్బలక్ష్మి పుణ్య దంపతులకు 16.04.1965న జన్మంచిన తెన్నేటి, పువ్వు పుట్టగానే పరిళిస్తుందన్న చందాన చిన్ననాటి నుండి తెలుగు భాష పై మక్కువ పెంచుకున్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు తమ మండలంలో పూర్తి చేసి, కందుకూరి, స్వామీ వివేకానంద, గుర్రం జాషువా, చిలకమర్తి, నెహ్రూ వంటి వారి వలన తెలుగు భాషపై మక్కువ పెంచుకుని భీమవరం ఓరియంటల్ కళశాలలో బి,ఏ (ఓ.ఎల్) చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఎం.ఏ చేసి అనంతరం బి.యీడి. కూడా పూర్తి చేసారు. తెన్నేటి తమ గురువు గారైన శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారి వద్ద తెలుగు భాషలో పలు మెలుకువలు ఆపోశన పట్టారు. శ్రీ తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి ప్రస్తుతం గణపవరం మండలం అర్ధవరం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా బోధిస్తున్నారు. మాస్టర్ సాహిత్య సేవకు నిరంతరం సహకారం అందిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తున్న వారి శ్రీమతి దర్బా రమా ప్రతిభ గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (పి.యస్)గా పని చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె శ్రీమతి ఘంటసాల సాయి జ్యోత్స్న, అల్లుడు విజయకృష్ట (క్లర్క్) స్టేట్ బ్యాంక్, గూడూరు. ఒక కుమారుడు సాయి తేజ (సి.ఏ.) చదువుతూ, తమవంతు సహకారం తండ్రికి అందిస్తుంటారు.
సాహిత్యం - విశ్లేషణ:
ఒక పక్క పంతులుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో పక్క సమాజంలో చైతన్యన్ని, విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం సామాజిక అవగాహన కల్పించడం కోసం ఎన్నో కవితలు, కథలు, నాటకలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందారు. పాఠకుల అభినందనలు పొందిన తెన్నేటి మాస్టర్ గారు వక్క పొడి, సిగరెట్, అమ్మ అక్షరం, మొదలైన కవితలు 1000 వరకు రాసారు. తెన్నేటి మాష్టర్ కవితలు ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి ,అస్త్రం, నేటి నిజం, స్ఫూర్తి, తెలుగు విద్యార్థి, ఆంధ్ర డైరీ, పూర్ణిమ, భావ తరంగిణి మొదలైన పత్రికలో ప్రచురించబడుతూనే ఉంటాయి.
1. కవులపై ప్రశంస:
సూర్యుడు ప్రపంచానికి ఎంతటి వెలుగులను చిందిస్తాడో సాహితీలోకాన కవులు చేసే పనీ అదే. భావుకత, తెలివి, గ్రాహ్యాత, వ్యక్తీకరణ, నైపుణ్యం వంటివన్నీ వారికి ఉండే విచక్షణా శక్తులు కలాన్ని అలుపెరగని ఆయుధంలా చేసి తమదైన శైలిలో అక్షరాలకు ప్రాణం పోసి ప్రధాన ఉద్దేశాన్ని వివిధ ప్రక్రియల రూపంలో వెలువరించి సాహితీ వినీల ఆకాశంలో ధ్రువతారల్లా నిలిచిపోతారు. తమ ప్రతిభతో అనేక అంశాలను స్పృశిస్తూ జ్ఞానాన్ని పెంచడం, స్ఫూర్తిని రగిలించి ఆలోచింపజేయడం, మార్గదర్శకతను చూపడం వంటి విషయకాలను సమాజానికి అందించడంతో పాటు సమకాలీన చరిత్రను కూడా భవిష్యతరాలకు అందిస్తారు. అలాంటి మహానుభావులు జాతికి మేలిమి రత్నాలు.అలాంటి వారిలో కొందరినైనా స్మరించి ప్రశంసించిన ఘనత తెన్నేటి లక్ష్మీ నరసంహా మూర్తి కవితలకు ఉంది. వాటినోమారు పరికిస్తున్నాను.
'సాహితీ సౌరభాల సూరీడు'గా కవితాకర్తచే కీర్తించబడిన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి చిరస్మరణీయులు. 'ఆంధ్ర రచయితలు' పేరిట ఆది కవి 'నన్నయ' నుండి నేటి ఆధునిక కవుల చరితలను కావ్యకరించారు. ఆధునిక పంచకావ్యాలలో ఒకటైన ఆంధ్రపురాణంను కూడా రాసారు. ' ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు' ను ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. మరెన్నో సేవలను కూడా సాహితీ రంగంలో అందించిన మధునాపంతుల వారు ఎప్పటికి చరిత్ర పుటల్లో నిలిచి ఉంటారని ఈ కవితా పంక్తులను చూస్తే తెలుస్తుంది.
"ఆనాటి తరంవారి సంస్కృతి సంప్రదాయాలను
ఈనాటి తరంవారికీ సాహితీ మెలుకువలుగా నేర్పి
కావ్య భంగిమల ద్వారా తనదైన బాణీతో
కావ్యగానమాలపించిన గానకోకిల మధునాపంతుల;
గాసటబీసట భాషను రాజభాషగా మలచిన
నన్నయ నాటి నుండి నేటి సాహితీ దిగ్గజాల జీవితాలను, చరితలను
తాటాకుల పై నుండి పుస్తకాలకెక్కించి ఆంధ్ర విద్యార్థుల
మస్తకాలకందించిన 'ఆంధ్ర రచయితల'ను
తీర్చిదిద్దిన ఘనులు మధునా పంతులు
ఆకాశవాణి ప్రసంశలు ద్వారా
సాహితీ సభల ద్వారా, ఉపన్యాసాల ద్వారా
పండిత పామర జనరంజకంగా
సాహితీ వనంలో 'ప్రసంగ తరంగాలను' ప్రసరింపచేసిన
సాహితీ సౌరభాల సూరీడు మధునాపంతుల"
విశ్లేషణ:
మధునాపంతులు లాంటి వారి పుట్టుక ఆంధ్ర దేశానికి ఎంతో గర్వకారణం. కొందరి ప్రతిభ అక్షరాలవరకే కాక వక్తగా కూడా కొనసాగి ప్రత్యకమైనవారిగా మిగులిపోతుంటారని వీరిని చూస్తేనే తెలుస్తుంది.' సూర్యరాయనిఘంటువు' రూపొందించిన విశిష్టులు. ప్రాచీన సాహిత్యాన్ని ఆవపోశనపట్టి ఆధునిక కవులనూ చదివిన విజ్ఞులు.ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి అంతుండదు. కొద్దిపాటి తెలివితో ఎంతో సాధిచామని అనుకునే వారికి నిరంతర కావ్య పటిమతో ఓలలాడే మధునా పంతులుగారి నుండి చూసి ఎంతో చైతన్యాన్ని పొందవచ్చు. అలుపులేని కృషి గొప్ప గుర్తింపుని ఇచ్చి స్మరనేయులను చేస్తుంది.అలాంటివారిని తల్చుకావడం విధిగా భావించడం ఓ బాధ్యత అని గుర్తు చేసారు.
2. స్వాతంత్య్రోద్యమ నాయకులపై ప్రశంస:
స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బానిసత్వాన్ని ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ కోరుకోదు. భారతదేశంలో అనాదిగా రాజరికపాలన ఉండేది. తరువాత మొఘల్, ముస్లిం పాలకులు కూడా పరిపాలించారు.అనంతరం వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు పాలనా పగ్గాలను క్రమంగా దొరకబుచ్చుకున్నారు. తెలివిగా తమకు అనుకూలంగా అన్నీ మలచుకున్నారు. ఇక్కడి ముడుసరుకులు,సంపద తరలించి వ్యాపారాన్ని వృధ్ధి చేసుకొని వందల సంవత్సారాలు భారతీయుల పై పెత్తనాన్ని కొనసాగించారు.కొంత కాలానికి తమకు జరుగుతున్న అన్యాయాల పై గొంతువిప్పి బ్రిటిష్ వారిని ఎదురించి నాయకుల పోరాటాలు,త్యాగాల ఫలితంగా ఆగస్ట్ 15, 1947లో స్వాతంత్రం సిద్ధించింది. ఆ త్యాగధనులను, స్వాతంత్య్రోమ నాయకులను గుర్తుకుతెస్తూ తెన్నేటి లక్ష్మీ నరసింహం మూర్తి కవిత రూపంలో ప్రశంసించారు.
'జాతిపిత' గాంధీజీ సత్యవ్రతం గురించి అఖండ స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకత్వం గురించిన ప్రశంస 'గాంధీ… నీ సాయం కావాలి' కవితా పంక్తులో కనిపించింది. స్వాతంత్య్రసమరనాయకునిగానే కాకుండా అతని వ్యక్తిత్వం, జీవన విధానం, ఆలోచనలు అన్నీ స్ఫూర్తిదాయకాలే అంటోన్న కవితని ఆవిష్కరిస్తూ గాంధీజీని కనుల ముందు నిలిపారు.
"గ్రామాభివృద్ధితో, సుపరిపాలనతో గ్రామ స్వరాజ్యం గాంధీ ఆశయం,
సత్యం,అహింస,ధర్మాల ఆచరణేగాంధీ జీవన మార్గం
క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో భావితరాల కాచరణీయం గాంధీ జీవితం
స్వశక్తి,సత్యసూక్తి గాంధీ బోధించిన ఆదర్శం
హాయినిస్తూ స్వచ్ఛతకు చిరునామా గాంధీ చూపిన ఖద్దరు
శ్రమైక జీవన సౌందర్యం,కష్టించే తత్త్వం గాంధీ మార్గం
వ్యక్తిస్వాతంత్య్రం , స్థానిక పరిపాలన గాంధీయిజం
అహింసాయుధంగా గాంధీ సాధించిన స్వాతంత్ర్యం
నేటి మనజాతికందిన స్వేచ్ఛ ఫలం"
విశ్లేషణ:
గాంధీ కలలు కన్నది స్వరాజ్యం గురించి, స్వపరి పాలన గురించి, గ్రామాభ్యుదయం తద్వారా దేశ ప్రగతిని గురించి మాత్రమేకాదు. ఇదంతా జరగాలంటే వ్యక్తిత్వంలో మార్పు రావాలని ఆకాంక్షించారు ఏ చిన్ని స్వార్దం కూడా లేకుండా అందరూ బాగుండాలని కోరుకున్నారు. గాంధేయ మార్గాలు ఎప్పటికి ఆదర్శనీయాలేనని నెల్సన్ మండేలా కూడా ఆహింస మార్గాన్నే దక్షిణాఫ్రికా స్వాతంత్య్రాన్ని సంపాదించాడు. అంత శక్తి వంతమైన ఈ గాంధీ యిజం. అతని మాటల్ని ఏమాత్రం నిర్లక్యం చేయకుండా అనుసరించి ఉంటే ఎప్పుడో అగ్రస్థాయికి దేశం దూసుకెల్లేది. ఏ పనిలోనైన నిబద్దత ఉండాలని ఆశించి బాపూజీ తిరిగి జన్మిస్తేగానీ దేశ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటే గాని బాగుపడలేమని తేల్చి చెప్పి పదవిలో ఉండేవారు గాంధీ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న వారై ఉండాలని రచయిత ఆశించారు.దేశం సుఖశాంతి సౌభాగ్యలతో అప్పుడు వర్ధిల్లుతుందని స్పష్టం చేయడానికే గాంధీ ఆశల్ని, ఆశయాలను, మార్గాలను గుర్తు చేసారు.
ముగింపు:
సమాజానికి కొందరు చేసే సేవలు, త్యాగాలు, సహాయాలు, సంస్కరణలు, మార్గద్శకతలు, పనులు, ఉపయోగాలు, ప్రణాళికలు వంటివి చేస్తుంటారు. అలాంటివారిని స్మరించడం, పోగడటం, జ్ఞప్తికి తెచ్చుకొవడం వంటివి మనం వారికి ఇచ్చే గౌరవం, గుర్తింపు. ఏ స్వార్దం లేకుండా చేసేపనులు ప్రజోపయోగాలై వారికి సంతోషాన్ని చ్చేవి అయినప్పుడు ఆ జనులు అలాంటి మహనీయులను పూజ్య భావంతో చూస్తూ ఎప్పటికి దేవునిలా కొలుస్తారు. ఆ స్థాయికి ఎదగడం అంతటి వ్యక్తిత్వన్ని వారిని ప్రశంసించడంలో దాదాపు అన్ని రంగాలవారినీ స్మరించి వారి గొప్పతనాన్ని అందరికీ కవితా రూపంలో విశదపరిచారు. ఒక గొప్ప సంస్కారాన్ని ప్రదర్శించి పాటింపజేసారు.
పరిశీలనా గ్రంథాలు:
1. లక్ష్మీ నరసింహం మూర్తి, తెన్నేటి, (2012). కవిత గోదావరి (కవితాసంపుటి), గోదావరి సాహితీ ప్రభ ప్రచురణలు, గణపవరం.
2. లక్ష్మీ నరసింహ మూర్తి, తెన్నేటి, (2012). తల్లీ - నిన్ను తలంచి (కవితాసంపుటి), చర్ల గణపతి శాస్త్రి సాహిత్య కళావేదిక ప్రచురణలు, నిడదవోలు.
3. లక్ష్మీ నరసింహ మూర్తి, తెన్నేటి, (2022). కవిత కిరణాలు (కవిత్వ సంపుటి), గోదావరి సాహితీ ప్రభ ప్రచురణలు, గణపవరం.
4. లక్ష్మీ నరసింహ మూర్తి, తెన్నేటి, (2018). వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు (కవితాసంపుటి), గోదావరి సాహితీ ప్రభ ప్రచురణలు, గణపవరం.