AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797

4. నండూరి సుందరీనాగమణి కథలు - కుటుంబవిలువలు

బాన్న రాజేశ్వరి

పరిశోధక విద్యార్థిని, ఆంధ్రయునివర్సిటి, విశాఖపట్నం.
Cell: 9493086421, E-Mail: rajeswaribanna1@gmail.com


ఉపోద్ఘాతం:

భారతదేశ ఆచారాలకు జీవన విధానంలోని ఉన్న తత్వానికి ప్రతీకగా కుటుంబవ్యవస్థ ను చెబుతాము. తరతరాలుగా పద్ధతులు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఎంత కఠినంగా పాటించబడుతు ఉన్నాయో ఆ వ్యవస్థ పూర్వాపరాలను పరిశీలిస్తే తెలుస్తుంది. వేద కాలం నుండి ఉన్న సాహిత్యంతో కుటుంబాలు తీరుతెన్నులు నేటి కాలం వరకు ఎలా కొనసాగుతున్నాయో ఎలాంటి మార్పులకు లోనవుతూ వస్తున్నాయో వాటి సాంఘిక చరిత్ర ఏంటో పరిశీలిస్తే అవగతమవుతుంది. మానవ సమాజం మార్పులకు ఆలవాలం. అందుకే అందులోని వ్యవస్థలన్నీ ఆ పరిణామాలకు లో నవ్వక తప్పదు. కుటుంబ వ్యవస్థలో వివాహ విధానాలు సాంఘిక నడతలు, అలవాట్లు అన్ని భాగమై జీవన విధానంలో భాగాలు అవుతాయి. ఇవి సక్రమంగా కొనసాగక పొతే ఆ వ్యవస్థ కూలిపోతుంది. కానీ ఎన్ని మార్పులు వచ్చినా రూపును కొనియాడు కుంటూ ఉనికిని కాపాడుకుంటుంది మన కుటుంబ వ్యవస్థ.

మన భారతీయ కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మార్పు చెంది చిన్న కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఆప్యాయతలు కొరవడ్డాయి ఆప్యాయత స్థానంలో ఆర్థిక బంధాలు బలపడ్డాయి. ఇట్టి ఎన్నో విశేషాలను నండూరి సుందరీ నాగమణి కథల్లో నేను చేసాను.

1963 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో స్వర్గీయ శ్రీ సూర్యనారాయణ గారు మరియు స్వర్గీయ శ్రీమతి కమలమ్మగార్ల ముగ్గురు సంతానంలో రెండవ సంతానంగా జన్మించారు సుందరీ నాగమణి గారు. తండ్రి కుటుంబం సంప్రదాయాలకు విలువనిచ్చే వారు కావడంతో సంప్రదాయ జీవనానికి అలవాటు పడ్డారు సుందరీ నాగమణి గారు. ఈమె బాల్యం విద్యాభ్యాసమంతా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలోనే కొనసాగింది. వివాహానంతరం హైదరాబాదులో స్థిర పడ్డారు. ఈమె ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా వృత్తిరీత్యా స్థిరపడ్డారు. ఈమె ప్రవృత్తి కవితలు కథలు నవలలు రాయడం. చిన్నతనము నుండి సాహిత్యాభిలాష కారణంగా ఈమె అనేక రచనలు చేపట్టారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. ఆమె కథా సంకలనాలు - నువ్వు కడలి వైతే, పూలమనసు, అమూల్యలోని కొన్ని కథలలోని కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం.

కుటుంబ విలువలు:

కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు తల్లిదండ్రులు, అక్క తమ్ముడు,అన్నా చెల్లెలు, అత్తమామలు అందరూ సభ్యులే. వీరిలో ఒకరికి ప్రాధాన్యత ఉండే మరో ప్రాధాన్యత లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం. అటువంటి జీవన ప్రమాణాలు కలిగిన కుటుంబాల కథలను నండూరి సుందరీ నాగమణి గారు ఎంతో చక్కగా మనకు వివరించారు.
అమ్మా! నా వేలు పట్టుకో:
పరిచయం: ఈ కథా నండూరి సుందరీ నాగమణి గారిచే రాయబడిన అమూల్యం అనే కథా సంపుటి లోనిది. జాగృతి వార పత్రిక ఫిబ్రవరి 2014లో ఈ కథనం ప్రచురించింది.

కథాకథనం:

రాధ అనే అమ్మాయికి పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఉండేది. పదవ తరగతి చదువుతుండగా పోస్ట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగి అయిన నరసింహం తో పెళ్లి నిశ్చయిస్తారు. పల్లెటూరికి కోడలుగా వెళ్ళటం పట్ల, చదువు ఆగిపోతుందనే భయం తో తన బాధని తల్లితో చెప్పుకున్నా ఉపయోగం లేకపోతుంది. కాపురానికి వెళ్ళిన రాధ అత్తగారింటి ఉమ్మడి కుటుంబ వాతావరణం తీరిక లేని తనాన్ని ఇస్తుంది. పెద్దత్త, చిన్నత్త, విధవరాలు అయినా పెద్ద మామ కూతురు ఆరళ్ళు మాటలకు ప్రేమ చూపని భర్త వైఖరికి మధ్య ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది. రేడియోలో వింటూ పాటలు పాడటం ని ఆపమని రాధను వారంతా నియంత్రిస్తారు. చదువుకుంటాను చదివించండి అని భర్త ని అడిగితే ఆయన గారు అంతెత్తు ఎగిరిపడతాడు. రాధ తల్లికి ఉత్తరం రాయగా ఆమె వచ్చి చదువు సంగతి ఇక ఎత్తోద్దని కూతురికి హితబోధ చేస్తుంది. రాధా ఇద్దరు పిల్లలకు తల్లి అవుతుంది. నరసింహానికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవుతుంది. పట్టణానికి రాగానే రాధా పుస్తకాల కాలక్షేపం సంగీత శ్రవణాలతో పాటు పిల్లలకు చక్కగా చదువు చెప్పుకునేది. ఆమెకు ఉన్న జ్ఞానాన్ని పిల్లలు ఎంతో మెచ్చుకున్న, భర్త మాత్రం గుర్తించే వాడు కాదు. రాధా పిల్లలు స్వాతి సాత్విక్ చదువులో బాగా రాణిస్తారు. సాత్విక్ తల్లిలా బాగా పాడేవాడు అతని ప్రోత్సహించిన రాధా సంగీతం నేర్చుకునే ఏర్పాట్లు చేస్తోంది. స్వాతి ని ఎంబిబిఎస్ చదివించి విదేశీ సంబంధాలు రావడంతో ఆమెకు వివాహం జరిపిస్తారు.సాత్విక్ ఇంజనీరింగ్ చదువుతూ సంగీతం లో శిక్షణ పూర్తి చేసి తనతో పాటు శిక్షణ పొందిన మృదులని వివాహమాడతాడు. రాధా మృదుల అత్త, కోడల్లాలాకాక తల్లి కూతుల్లుగా ఉండేవారు.

సాత్విక్ తల్లిని సంగీతం వైపు మరలించాడు.మృదుల అత్తగారికి శిక్షణనిస్తూ ఉండేది. వారి ఇరువురి ప్రోత్సాహంతో రవీంద్రభారతిలో వందలాది మంది ముందు 50 ఏళ్ల వయసులో తృతీయ బహుమతిని గెలుచుకుంది రాధమ్మ. అందరూ ఆమెని అభినందించిన, నరసింహం మెచ్చుకోడు కదా హేళనగా మాట్లాడుతాడు. సాత్విక్ తల్లి గొప్పతనం గుర్తించమని తండ్రికి హితబోద చేస్తాడు. ఫలితంగా ఆమె ప్రతిభను నరసింహం మనస్ఫూర్తిగా అభినందిస్తాడు.

విశ్లేషణ:

కుటుంబంలో అందరు వ్యక్తులు కలిసి మెలిసి ఉండడం ఆ ఇంటికి వన్నె తెస్తుంది. ప్రేమ అభిమానం ఆప్యాయత లు అన్ని కలిసినపుడు అక్కడ సంతోషాలు చోటు చేసుకుని ఆనందనిలయం గా మారి అందరినీ కనువిందు చేస్తుంది. కుటుంబం విలువలు ఎంతో ఉన్నతంగా ఉండాలని తెలియజేస్తున్న కథలు రాదమ్మా ఆమె కొడుకు, కోడళ్లుగా సాత్విక్ మృతులలు విలువలకు ప్రతిబింబాలు. తల్లి -కొడుకు, తల్లి - కూతురు అనేవి రక్తసంబంధాలు వారి నడుమ ప్రేమానురాగాలు సహజంగానే ఉంటాయి.కానీ కోడలిని కూతురులా ఆదరించే కుటుంబాలే అసలు సిసలైన మేలిమి గృహాలు అనవచ్చు. అనాదిగా ఉన్న కుటుంబ వ్యవస్థని గమనిస్తే కోడలిగా ఒక ఇంటికి వచ్చిన యువతి అత్యంత అనిగిమనిగి ఉంటూ అక్కడి పరిస్థితులకు అలవాటు పడుకోవాలి అలాంటప్పుడు సమస్యలు బాధలు ఉన్నా అవి సహజమే అన్నట్టుగా ఆ ఇంటికి అణువుగా మారడం కోడలి గొప్పతనం. తమ ఇంటికి వచ్చిన కోడలును చులకన భావం తో చూడటం కాకుండా ఆమెని తమలో కలుపుకోవడం ఆ కుటుంబ గొప్పతనం. అప్పుడే సమాజంలో ఒక ప్రత్యేకతని శాంతి నివాసం పొంది ఆదర్శవంతంగా ఉండగలదు. రాధమ్మ మృతులలో అత్తాకోడళ్ల గా ఎంతో అన్యోన్యంగా ఉండేవారో సాత్విక్ మాటల ద్వారా తెలపడం ద్వారా ఆ కుటుంబం విలువలు పరిచయాన్ని చిత్రిస్తున్న తీరు ఇలా ఉంది.

"మీరిద్దరూ ఒక్కసారి కూడా మాట మాట అనుకోరా? కోడల్లు అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అమ్మ? " ఈ మాటలబట్టే తెలుస్తుంది. ప్రతిఇల్లు శాంతినివాసం కావాలంటే ఇట్లాంటి అత్తకోడళ్ళు ఉండాలి అప్పుడే ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది.

రెండో బాల్యం:

పరిచయం: నండూరి సుందరీ నాగమణి గారు "నువ్వు కడలివైతే" కథా సంపుటిని రాశారు. అందులోని ఈ కథ తెలుగు వన్ డాట్ కామ్ వెబ్ పత్రిక జనవరి 2016 సంచిక లో వెలువడింది.

కథాకథనం:

ఆనందపురంలో అంబుజా తల్లిదండ్రులతో పాటు ఉండేది. ఆమె అన్నయ్యకు పెళ్ళై ప్రదీప్ అనే అబ్బాయి పుడతాడు. ఆ బాబుని దీపు అని పిలుచుకుంటూ అంబుజ పెంచుతూ ఉండేది. తన కొడుకు ఆడపడుచు చేరుకోవడం నచ్చని అన్న భార్య కొంత దూరం పెంచడం మొదలు పెడుతుంది. అదే ఊరిలో ఉద్యోగస్తులైన సుధాకర్ తో అంబుజ పెళ్లి జరిగిన దీపు కోసం ఆదివారాలు పుట్టింటికి వస్తుండేది. అంబుజకు శ్రీకర్ పుట్టిన అన్న కొడుకుపై వాత్సల్యాన్ని మరవకుండా కానుకలను పంపుతుండేది. సుధాకర్ కి కాకినాడకు బదిలీ కావడం, తల్లిదండ్రులు చనిపోవడంతో అంబుజకు పుట్టిల్లు శాశ్వతంగా దూరం అవుతుంది. శ్రీకర్ పెద్దవాడై ఉద్యోగస్తుడు అయ్యాక పల్లవితో పెళ్లి అవుతుంది. సుధాకర్ చనిపోవడం,కోడలు టీవీ తో, పిల్లలు కంప్యూటర్ తో గడపడ తో దాదాపుగా ఒంటరితనాన్ని అంబుజమ్మ మా అనుభవిస్తోంది. శ్రీకర్ ఇంటి పరిస్థితులు మార్చలేకున్నా తల్లితో అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉండేవాడు.

ఒకరోజు ఆనందపురం తీసుకువెళ్ళమని శ్రీకర్ ని అంబుజము కోరుతుంది. ఆమె జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయని పల్లవికి చెప్పి కార్లో తల్లిని తీసుకుని వెళ్తాడు శ్రీకర్. ఆ ఊరిలోని చెరువుగట్టు, చదివిన బడి, గుడి, బజార్లో పూలమ్మే ఆదెమ్మ మనవరాలు చూసి తర్వాత ఒక నాడు తన ఇంటి పక్కన ఉన్న తన స్నేహితురాలు సరోజిని ఆమె కోడలు విజయ తల్లి కొడుకులు ను ఆదరంగా చూసి భోజనం ఏర్పాట్లు చేస్తారు.అందరితో ఆనందంగా ఉన్న తల్లికి తన ఇంట్లో ఏమి కొరవడిందో శ్రీకర్ కి అర్థమవుతుంది. సాయంత్రానికి అంబుజం స్నేహితులు భారతి, రాఘవరావు, శారద రావడంతో వారిని పరిచయం చేస్తుంది. అంబుజమ్మ తన స్నేహితుల సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుని ఉండిపోతానని చెప్పి ఒప్పిస్తుంది.అందరూ ఆమె కోరికని మన్నించమని శ్రీధర్ కోరుతారు. ఊరెళ్ళి తిరిగి తీసుకు వచ్చి దింపుతానని చెప్పి తల్లితో కలిసి తిరిగి ప్రయాణమవుతారు శ్రీకర్. దీపు ఆనందపురం లోనే ఉన్నాడని తనమీద వాత్సల్యం లేని అతనిపై ప్రేమతో అప్పుడప్పుడు బాధపెట్టాలని బంగారం లాంటి కొడుకు ఉండగా తనకిక ఏ బ్రాంతి వద్దని అంబుజమ్మ శ్రీకర్ తో పలుకుతోంది. తల్లీ కొడుకుల మధ్య ఆప్యాయతలు అనురాగాలు ఎప్పుడూ వెల్లివిరుస్తుండగా వారి ప్రయాణం కొనసాగుతోంది.

విశ్లేషణ:

కుటుంబం అంటే స్వచ్ఛమైన మనుషుల మమతల కలబోత.కాకుంటే ప్రాచీన కాలంలో ఉన్నత విలువలు ఉన్న మనుషులు లేరు. నేడంతా యాంత్రికజీవనం. ఎవరి సంసారం వారిదిగా ఉంటున్నారు. తీరిక లేని ఉద్యోగాలు కూడా ఈ విధంగా ఉండటానికి కారణం. కొందరైతే డబ్బు ఖర్చుని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటున్నారు ఈ కథలో అంబుజమ్మ, శ్రీకర్ కుటుంబ విలువలకు ప్రతికలు. ప్రదీప్ అతని తల్లి పాత్రలో కుటుంబ విలువల ఛాయలు కనిపించవు. కుటుంబాలు ఉండడం బంధుత్వాలు డబ్బుని చూసి ప్రధానము కాదోనని కొందరి వ్యవహారశైలి ఉండటం.కుటుంబ విలువలను ప్రశ్నించే విధంగా ఉంటాయి. అవసరానికి ఏర్పడిన బంధాలుగా అనిపించి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి. పసివాడైన ప్రదీప్ ను చూసుకుంటే తనకు శ్రమ తగ్గుతుంది అని భావించిన ఆమె వదిన, కొడుకు తనకు దూరమవుతున్నాడని,తల్లికి బిడ్డ బాధ్యత ఎప్పుడు భారం కాకూడదు. తల్లి స్పర్శ బిడ్డకు ఎప్పుడూ సుపరిచితంగా ఉండాలి. ఇది ఏం గుర్తించని తల్లులు పుట్టగానే ఆయాల చేతికి అప్పగించడం, బేబీ క్రషర్ లలో చేర్చడం, అల్లరి చేస్తున్నారని వయసు నిండకుండానే ప్లే స్కూల్ లో వేసేయడంతో వాళ్ళ బాల్యం చిదిమేస్తున్నారు. ఆప్యాయతను అందించక పెంచినందువల్లే పెరిగేకొద్దీ యాంత్రికంగా తయారవుతున్నారు. ఆనాటి సమిష్టి కుటుంబాల్లో సమృద్ధిగా పిల్లలకుప్రేమ లు లభించేవి. నేటి చిన్న కుటుంబాల్లో అలాంటి సంస్కారం లేదు. అందుకే తగినంత ప్రేమ కుటుంబ విలువలు నేర్చుకోలేక ముసలివారైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచి వెళ్లిపోతున్నారు.

కుటుంబం అంటే బంధాలు కలిగి ఉండటంతోపాటు బంధుత్వాలు ఉంటాయని అవి సంపూర్ణ కుటుంబాలు అందరిలోనూ కలిసిపోయే తేడాలు లేక బంధాలు ఉండాలి కానీ కొందరు అంబుజా వదిన లాంటివాళ్ళు "అత్త వాళ్ళ పేదవాళ్ళు మనం వాళ్ళతో ఎక్కువ గా చనువుగా ఉండ కూడదు" అని చెప్పేవారు ఉంటారు. ఆర్థిక పరిస్థితిని ప్రేమ బంధాలని ముడిపెట్టి చూడకూడదు.అవి కుటుంబ విలువలు అనిపించుకోవు. పసి మనసుల్లో పేద గొప్ప అనే విషబీజాలు నాటడం సరికాదు మనుషులంతా ఒక్కటే అన్నది మానవత్వం. భేదాలు ఎంచని బంధాలు బంధుత్వాలు. ఇది తెలియని వారు ఆర్థిక సంబంధాలకే చేస్తున్నారు ఇలాంటి వాతావరణంతో పెంచబడిన ప్రదీప్ వంటి పిల్లలు పెరిగి పెద్దయ్యాక అనుబంధాల రుచి తెలియని మరబొమ్మలు అవుతారు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు అందుకే కృష్ణుడికి దేవకీ కన్నా యశోద ఎక్కువైంది. అలా అని తల్లికి దూరం కావాలని కాదు.అందరినీ గుర్తుంచుకుని బాధ్యతలను నిర్వర్తించాలి అన్నది కుటుంబ సారం.కానీ ప్రదీప్ వంటి వారు డబ్బు సంపాదనయావ లో సంపాదనలో పడి తల్లిలా పెంచిన అంబుజమ్మని మనసారా పలకరించ లేనివాడై బంధుత్వాలకు విలువ లేని బండరాయి అయ్యాడు. ఇలా అయిన వారిని మరిచే మనుషులు తమ పిల్లలకు ఎలాంటి కుటుంబ విలువలు నేర్పుతారో తెలియరాలేదని రచయిత్రి వేదన పడుతున్నారు. సొంత మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు కుటుంబాలు ఉండగా ఎలాంటి బందుత్వంలు లేని పరిచయస్తులు, ఆత్మీయులు అంబుజమ్మ స్నేహితులు లాంటి వారు ఆదరిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆనందం కలిగిన, కుటుంబ విలువలు కనిపించకపోవడం బాధపెడుతోందని అంటున్నారు.

కుటుంబ విలువలని శ్రీకర్ పాత్రలో చూపి "కొడుకు గా తల్లి కోరిక తీర్చడం ధర్మం" అని పలికించారు కానీ అతని భార్య పల్లవి, పిల్లల లో మాత్రం నేటి ఆధునిక కుటుంబ పరిస్థితులను చూపారు. వాటిని అనుసరించి కుటుంబాలలో వృద్ధులైన పెద్ద వారి పరిస్థితిని అంచనా వేయవచ్చు. ప్రాచీన కాలంలో "పెద్దలమాట చద్దన్నం మూట" కానీ నేడు మాత్రం "నీకేం తెలియదు" అని "పిల్లొచ్చి గుడ్డుని వెక్కిరించినట్లు" పెద్దవారిని కసిరి కొడుతున్నారు. ఇంటి కోడళ్ళు, కూతుళ్ళూ టీవీ సీరియల్లో, ఫోన్ కబుర్లలో కాలక్షేపం చేస్తున్నారు. వృద్ధులకు చూపు ఆనదు వారితో కబుర్లు చెప్పి కాలక్షేపం చేయించేవారు కరువు. పూర్వం పిల్లలు బామ్మ తాతయ్య కథలతో గడుపుతూ తన మాటల్ని సందేహాలని తీర్చుకుంటే ఇరువురు బోసినవ్వుల నడుమ అలరారే వారు. తల్లిదండ్రుల కన్నా వారిని కన్న పెద్దవారికి చేరికై బుడిబుడి అడుగులలోనే నీతిని, మానవత్వాన్ని, విషయ జ్ఞానాన్ని తెలుసుకునేవారు. అవి వారిలో కుటుంబ విలువల్నిపెంపొందించి తీర్చిదిద్దేవి. నేటి ఆధునిక కాలంలో వీడియో గేమ్స్ కార్టూన్ ఛానల్ లో నిమగ్నమై పోయారు. వృద్ధులు కథలు వారి చెవికెక్కడం లేదు కానీ బుద్ధిబలాన్ని పెంచలేని రంగుల బొమ్మలు కళ్ళు చిట్లించి చూస్తున్నారు. కాలం మారి కుటుంబ విలువలు తరగడం అనేది సమర్థనీయం కాదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం.

వయసు ఉండగా కుటుంబాన్ని తీర్చిదిద్ది సమాజంలో స్థానాన్ని కల్పించిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లలున్నా అనాథలవుతున్న యదార్థ ఘటనలు ఉన్నాయి.వాటి ప్రభావం ఫలితాలతో విలువ లేని ఇల్లు కాంక్రీట్ జంగిల్స్ నిండా ఉన్నాయి. వాటి నడుమ ఏదో ఒక గది మూలల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చావుని ఆహ్వానిస్తున్న పెద్దవారు ఉన్నారు. ఆధునికత వంటబట్టించు కోవడం అంటే కుటుంబ సంప్రదాయాలను బాధ్యతల్ని విస్మరించడం కాదని. కథా రూపంలో వివరించి తెలియపరిచి ఆలోచింప చేశారు. అంతేకాకుండా బంధుత్వాలు బంధాలు కొనసాగింపే కుటుంబం ధర్మమని సోదాహరణంగా చూపారు. ఈ విలువలు నశించి ఇలాగే కొనసాగితే తరువాత తరాల కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నత వైపు కి దారి తీస్తుందనే అంతర్గత యోచన కు తెరతీసారు.విలువల పరిరక్షణకై పునః సమీక్షించుకుని నడవాలని తప్పులను సరిదిద్దుకుని కుటుంబధర్మ పునరుద్ధరణ గావించాలనే ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు.

ముగింపు:

బంధాలకు అనుబంధాలకు నిలయమైన కుటుంబ వ్యవస్థ అతిపురాతన సంప్రదాయక వ్యవస్థ తరతరాల మార్పులను తనలో కలుపుకుంటూ కాపాడుకుంటుంది. ఏ వ్యవస్థ అయినా కొన్ని సూత్రాలు నిబంధనలు ఉంటాయి వాటిని పరిరక్షించుకునే జీవితంలో అనుసరించాలి తిరిగి వారసులకు విలువలే ఆస్తులుగా అందించాలి. అలా అందించాలంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఈ వ్యవస్థ పటిష్టంగాఉండుటకు రచయిత్రి తన వంతుగా కథా రచన ద్వారా సందేశాన్ని సమాజానికి అందించారు.

పరిశీలనా గ్రంథాలు:

1. అక్కిరెడ్డి. ఎస్, (1989). అనువాద సిద్ధాంతాలు, సమత పబ్లికేషన్స్, మద్రాస్,
2. తెలుగు కథా రచయితలు, (1982). ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
3. చంద్రశేఖర్ రెడ్డి, డి, (2001). సంహిత సాహిత్య విమర్శ వ్యాసాలు.
4. దక్షిణామూర్తి, పోరంకి, (1986). కథానిక స్వరూపస్వభావాలు, హైదరాబాద్.
5. శాస్త్రి, ద్వానా, (2001). తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
6. నరసింహారావు, ఆర్, (1992). అభ్యుదయ కవిత్వంలో ఆరుద్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
7. ముద్దు కృష్ణ (1935). వైతాళికులు.
8. ఉదయం, (ఫిబ్రవరి 1991). నవతరం వారపత్రిక.
9. సుప్రభాతం, (ఆగస్టు 2003).
10. ప్రగతి వారపత్రిక, (ఏప్రిల్ 1990).
11. సుందరీ నాగమణి, నండూరి, (2016). అమూల్యం, కథాసంపుటం, జె.వి. పబ్లిషర్స్.
12. సుందరీ నాగమణి, నండూరి, (2016). నువ్వు కడలివైతే, కథా సంపుటం, జె.వి. పబ్లిషర్స్.
13. సుందరి నాగమణి, నండూరి, (2018). పూల మనసులు, కథా సంపుటం, జె.వి. పబ్లిషర్స్.