AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797
3. అప్సరసలు - వంచిత మానవకాంతలు
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం - 533235
A Block, Harihara residence, Moosapet, Anjaneya Nagar,
Hyderabad – 500018. Telangana, India.
Cell: 9440219338, E-Mail: hydjmlu@gmail.com
ఉపోద్ఘాతం:
అప్సరసలు దేవవేశ్యలుగ పిలవబడ్డారు.మానవకాంతలుదేవదాసీలుగ బలవంతముగ వేశ్యాముద్ర వేయబడినవారు. ఇరువురుకూడ శయనేషు అప్సరసలుగ వ్యధార్తజీవితము గడిపారు. అప్సరసలు దివినివాసులు. కంటికి కనిపించరు. వంచితజీవిత స్త్రీలుగ దేవదాసీలు భువినివాసులు. దేవదాసీ వృత్తి సమాజ కళంకము అంటూనేపవిత్రత వంచన చాటున కొనసాగినసమాజము మనది. ఇపుడు నిషేధము. భువిలో నేరము. కనుమరుగై నట్లు అనిపిస్తూనే దృశ్యా దృశ్యముగ జాతరవంటి వార్తలలో కలవరము కలిగిస్తుంది. అప్సరసలు,దేవదాసీలు వేశ్యా సంస్కృతి మధ్యన గల ఔచిత్యానౌచిత్యాలు సమాజము అంగీకరించిందన్నది వాస్తవము పురాణ మరియు సమాజ స్వార్థనేరప్రవృత్తిగ సాహిత్యము లోకూడ కనిపిస్తుంది. శయనేషు అప్సరసల పీడిత స్త్రీగ ఇప్పుడు బలవంతము లేదన్నది ప్రచారము. ఇంకా లోతుగా అధ్యయనము జరగాలి. వంచితస్త్రీ ఔన్నత్య జీవిత సమాజ ఉద్ధరణకు మరింత ప్రేరణగ ఈవ్యాసము ఆలోచనాశయము ప్రబోధమవ్వాలన్నది ఉద్దేశం ఈవ్యాసం.
అప్సరసలు:
క్షీరసాగరమథనము పురాణగాథ. కూర్మావతార ప్రస్తావనది. అమృతము కోసము దేవదానవులు పాలసముద్రము చిలికిన కథ. పురాణాలన్నింటిలోను కూర్మావతార గాథ కనిపిస్తుంది. అమృత లక్ష్య సాధనకథ. అమృతోద్భవమునకు ముందు అపూర్వవస్తువులు ఉద్భవించాయి. కొందరు దేవతా స్త్రీలు అప్సరోజనంబుగ ఉద్భవించారు’.
క్రొక్కారు మెఱుగుమే నులు,
గ్రిక్కిరిసిన చన్నుగవలు గ్రిస్సిన నడుముల్,
పిక్కటిలియున్న తుఱుములు
జక్కని జూపులును దివిజసతులకు నొప్పెన్’’ (అష్టమస్కందము, భాగవతము 263 పద్యము)
వీరినే అప్సరసలన్నారు. అప్సరసలు క్షీరసాగరోద్భవలు. పాలసముద్ర నివాసిగ ఉన్న చంద్రుడు కూడ ఈ పాలసముద్ర మధనములో దేవలతోబాటు పాల్గొన్నాడు. పాలసముద్రమునుండి మథనానికి ముందే బయటకు వచ్చి క్షీరసాగర మథనంలోఉత్సాహంగాపాల్గొన్నాడని స్కాంద పురాణము చెబుతుంది. కలశపాథోరాశి అని పాలసముద్రానికి అందుకే పేరుంది.
ఆంధ్రకవితాపితామహుడు మనుచరిత్రమును కృష్ణదేవరాయలకు అంకితమిచ్చాడు. చంద్రునితో బుట్టువు లక్ష్మీదేవిని కలశపాథోరాశి గర్భ వీచీమతల్లిగ వర్ణించాడు. ఈ కలశపాథోరాశి నుండి పుట్టిన చంద్రవంశముగ కృష్ణ దేవరాయలది పెద్దనప్రయోగము. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మనుచరిత్రము పీఠికలో సటీకము ఇరవయ్యవపేజీలో ’కలశపాథోధి’ ప్రయోగానికి వివరణ యిచ్చారు.
విశ్వకర్మ అబ్దియందు జనించిన యమృతమును బోసియుంచుటకొక కలశమును సృజించెను. అందుచేతనే ఆ కలశమునకు సంబంధించినది గాన కలశపాథోరాశి అని పేరు వచ్చింది.
“శ్లో. సాగరేమధ్యమానేతు పీయూషార్ధం సురాసురైః
పీయూషధారణార్థాయ నిర్మితా విశ్వకర్మణా
కలాకలాస్తుదేవానా మసితాస్తాః పృథక్ పృథక్
యతఃకృతాస్తుకలశాస్తతస్తేసంప్రకీర్తితాః
అని కాళికా పురాణము చెప్పింది. క్షీరసాగరకథ ప్రసిద్ధముగ అప్సర శబ్ద జననానికి భాగవతము ఈ అప్సరసల సౌందర్యమును వర్ణించింది. అప్సరస ప్రయోగముగ స్త్రీలు వేదములలో కూడ ప్రస్తావన చేయబడ్డారు.
శబ్ధవ్యుత్పత్తి:
అప్ శబ్దము నీటిని ధ్వనిస్తుంది. అప్యయోష అనేపదము అప్సరసగ ఋగ్వేదములో ఉంది. అప్సరసలు నీటినుండి పుట్టారని వారికి జలసంబంధమైన అర్థముగ ధ్వనిస్తుంది. ఋగ్వేదములో అప్సరస్త్రీల ప్రశంస ఈ విషయాన్ని దృవీకరిస్తుంది. గంధర్వులు బహువచనము. గంధర్వుడు ఏకవచనముగ ఒక అప్సరస్త్రీకి భర్తగా ఉన్నాడని ఋగ్వేదములో ఉంది. (RoshenDalal. THEVEDAS Religion 223page). వశిష్ఠుడు అప్సరస కు జన్మించిన గాథ, పురూరవుడు ఊర్వశి కథలకు ఉనికి గల ఋగ్వేద గాథలు, అథర్వణవేదముగాథలు కన్న పురాణగాథలుగా క్షీరసాగరోద్భకథకు పురాణ సాహిత్యముగ విలువ..అథర్వణవేదములో అప్సరసలు ప్రసక్తి జలవృక్ష సంబంధము, కనిపిస్తాయి. శతపథ బ్రాహ్మణము ఎటువంటిరూపమైనా పొందగలరంటుంది. జలవిహారము పక్షిరూపాలు యిష్టపడతారు.
పురాణ సంబంధితాంశాలు:
స్కాందపురాణము క్షీరసాగరము కథ పేర్కొంది (స్కాందపురాణము, మాహేశ్వర ఖండము32పేజి). కాని గంధర్వులు, అప్సరసలు గణములు ఇంద్రునితో ఉన్నట్లుకథ సాగింది. అప్పటికే అప్సర గణముల ప్రస్తావన ఉంది కాబట్టి క్షీరసాగరమథనము నుంచి పుట్టిన అప్సరగణము ప్రత్యేకముగా అప్సయోషలుగా సార్ధకనామధేయులు. కాని క్షీరసాగరోద్భవ అప్సరసలు దేవతకు ఉమ్మడిసొత్తుగ దేవవేశ్యగణముగ పేరుపొందారు. నృత్యగాన ప్రతిభా మూర్తులుగ గుర్తింపు. విశ్వనాథవారు నాచన సోమనాథుని సంవిధాన చక్రవర్తిత్వము సమీక్ష వ్యాసములో ఊర్వశి నరకుల సంభాషణ ఈ విషయము ధ్రువీకరిస్తుంది.
చంద్రుడు నీటికి సంబంధించినవాడుగ పాలసముద్రములోనుంచి ముందు సంతోషకరముగా బయటకు వచ్చాడు. దేవతలచేత పూజింపబడి అమృత మథనములో పాల్గొన్నాడని స్కాందపురాణ కథనము. ఇంద్రాది దేవతాసమూహములో చంద్రదేవతగ పాలకడలిమథనములో పాల్గొన్నాడు. తరువాత అమృతపూర్ణుడై నిలిచాడు. రెండుసార్లు కనబడడం పరిశీలనాంశ పురాణ గాథ.
అప్సరసలు స్త్రీని పురుషవ్యామోహ ప్రతీకలుగ పురాణలు భావించాయి. అందుచేతనే పాలసముద్రము నుండి పుట్టిన వస్తువులలో వస్తువుగా భావించారు. ఉమ్మడి సొత్తుగ దేవతలందరికీ స్త్రీ సౌఖ్యము అందించే అప్సరసలుగా స్వర్గభూమిలో అందుబాటయ్యారు. ఊర్వశి, పురూరవుడుగ విమోర్వశీయము వంటికథలు అప్సరసలతో మానవులకుగల సంబంధానురక్తికి ప్రచారమయ్యాయి.
శక్తిమంతులైన మునులు స్వశరీరాలతో భూ, స్వర్గలోకాలలో స్వర్గలోక అప్సరస్త్రీ సౌఖ్యము అనుభవించిన పురాణ కథలున్నాయి. మునిముచ్చుల తపస్సు పేరిట మోక్షము సరే! ఈ స్వర్గ కామినుల పొందుకోరిన పురాణ కథలున్నాయి. వ్యాసుడంతటి ముని ఘృతాచి వంటి అప్సరసను చూసి చలించాడు. ఘృతాచి కామరూపము గలది. చిలుకలా కనిపించడము అప్సరస గుణము.
చనిపోయాక లభించే పుణ్యంవల్ల స్వర్గంలో రంభ దొరుకుతుందన్న ఆశ మన సంస్కృతి మోక్షము కన్న ఎక్కువ ప్రలోభపెట్టింది. స్వర్గంలోని దేవవేశ్యలుగ వారు ఖ్యాతిగాంచారు. చనిపోయాక లభించే పుణ్యంవల్ల స్వర్గంలో రంభ దొరుకుతుంది. పూజలూ యజ్ఞాలు ఉందోలేని స్వర్గానికి జరిగాయన్నది వాస్తవం. మహాభారతంప్రకారం వీరస్వర్గమలంకరించినవారికి శరీరానంతర ఆత్మకు అప్సరస పొందు లభిస్తుంది. అప్సరస స్త్రీవ్యామోహ ప్రతీక్షగ వేశ్యా సౌఖ్య సంస్కృతిగ భూలోక వాసులను మోహ పరవశులనుచేసే పురుషస్వార్ధము మానవకాంతలకు దిగుమతయిందా? అన్నది ఆలోచనకు తావిస్తుంది.
మానవస్త్రీలు అప్సరస సౌందర్యవతులుగ పోల్చబడతారు. అంతమాత్రాన వేశ్యాప్రవృత్తి గలవారని చెప్పడం నా ఉద్దేశంకాదు. పెళ్ళికిముందు పురుష సంపర్కం కలిగి సంతానవతులవడం ఉంది. మరోవిషయం పురుషులను మోహ పరవశులను చేసే స్థితిని స్త్రీలు కల్పించగలరు.
దాశరాజు పుత్రికగ మత్స్యగంధి పరాశరుని మోహమునకు గురయింది. యోజనగంధిగా వరము పొంది వ్యాసజన్మకు కారకురాలైంది. ఆమె సౌందర్యము శంతనునికి మోహమైంది. భీష్మచరిత్ర ప్రసిద్ధము. దమయంతివంటిస్త్రీని వివాహము ఆడాలని నలమహారాజుకు దివినుండి దిగివచ్చి దేవతలు పోటీకి వచ్చారు. దమయంతి, సీత ద్రౌపది వంటి స్త్రీలు వీర్యశుల్కలుగ పురుషులు గెలుచుకున్నారు. వారు పతివ్రతలుగ ముద్రపడినా వారిభువనమోహన సౌందర్యము పురుష మోహాతీతము కాలేక పోవడము విపరీతాలకు, ఇతిహాసాలకు దారితీసాయి.
భూలోక స్త్రీ సౌందర్యము వీర్యశుల్కలుగ వైరాలు కలిగించింది. దమయంతి ద్వితీయ స్వయంవరము ధర్మంగా ఆలోచించే ఋతుపర్ణునిలోకూడ ఆశరేపింది. సీతకోసం రావణయుద్ధము పవిత్రగాథ. కౌరవపాండవుల చెల్లెలును దుస్సలను వివాహమాడిన సైంధవుడు వావివరస మరిచి ద్రౌపదిపై మోహపడ్డాడు. కీచకవధకు కారకురాలైన ద్రౌపది భారతకథ స్త్రీ సౌందర్యానికి హెచ్చరిక. పరాంగనలు హరనయనాగ్నులని నిరూపించారు. పాతివ్రత్యము ఆచరనీయమే అయినా దుర్వాసుని వంటి మునులు పరపురుషులను పొందుకాహ్వానించి భర్త అనుమతితో సంతానవతులవడము వరమిచ్చేశక్తి భారతానుమతి. పాతివ్రత్యనియమముగ పరపురుష పొందు సంతానము పొందడములో సడలించారు.జనామోదము. ఆస్త్రీలకు వేశ్యావనిత ముద్ర పురాణాలు వెయ్యలేదు.
దేవదాసీ వ్యవస్థ:
అయినా పురాణకాలము తరువాత రాచరికము పతివ్రత నియమభయముతో అందమైన స్త్రీల సౌఖ్యములకు దూరముకాలేని సమాజము కొత్త కోణము ప్రచారము కోరుకుంది. ఆమ్రపాలి చారిత్రిక నేపధ్యము ఉదాహరణ. ఆమ్రపాలిసౌందర్యము శాపమయింది. వైశాలి ప్రభువు నగర వధువుగ ప్రకటించాడు. ఆమె సౌందర్యము రాజనర్తకిగాను వెల తీసుకుని మేని సుఖమును యిచ్చే పడతిగాను మారిపోయి ఆశలన్నీ అణగిపోయి బ్రతికింది.
ఈ అవకాశవాదము దేవదాసీత్వము పేరిట దైవారాధన పేరిట ఉమ్మడి సమాజ పురుష సౌఖ్య వెలయాల దేవవేశ్యసంస్కృతి వేళ్ళూనుంది. స్వర్గ భామినులులా వ్యభిచారవృత్తి వెలయాళ్ళుగా సౌందర్యవంచితజాతిగ పేరుపడ్డారు. నేడు నిషిద్ధమైనా సిగ్గుపడాల్సిన విశేషాలు దాచినాదాగనివి. విశ్వనాథవారి వేయిపడగలు సమాజము వర్ణన సాక్ష్యము. తొమ్మిది, పది శతాబ్దుల కాలములో మిక్కిలి ప్రాచుర్యమందిన దేవదాసీత్వము మూలాలు చరిత్రకందని కాలమునుంచీ ఉన్నాయి.
దేవదాసీలు అంటే అంటే గుడిసానులని అర్థము. భోగము కులము అనిపేరుపెట్టారు. దేవుడికి భర్తగా అంకితము మొదట. తరువాత స్వచ్చంద వెలయాలు. పైగా ఇది పారంపర్యమై దేవుడిసేవలకు బలవంతముగ అంకితముగ ఆడపిల్లలను ఇవ్వడం జరిగిందిన్నదినిజం. మానని గాయం. దేవదాసికులాల ఆనవాళ్ళుకు వెనుకబడిన జాతిగ ఊరడిగ తప్పుదిద్దుకుంటున్న ప్రయత్నము జరుగుతోంది. భక్తో లేక అసంతృప్తి వైరాగ్యమొ దేవుడికి భార్యగా అంకితమయ్యే మానసి కరోగము దేవదాసీత్వము నకు ప్రోత్సాహము ఇంకాజరుగుతోందన్న నిజంలో నిజం లేదన్నరోజు అవసరానికి కంకణ సమాజసేవకులు రావాలి.
శిలప్పధికారము, మణిమేఖలవంటి బౌద్ధ, శైవ, వైష్ణవ సారస్వతములలోని దేవదాసీలను గుర్తించడము పరిశోధన కాకూడదు. వంచితస్త్రీలగురించిన సమాచారము కొల్లలుగా కనిపిస్తాయని చెప్పడము కాదు కాలసింది. దేవదాసీలు 1. "దత్త" అంటే తమకు తామె అంకితమయ్యేవారు. 2. "విక్రీత"గా తమకు తాము ఖరీదు కట్టుకున్నారు. 3. "భృత్య" అనే పేరుతో కుటుంబసభ్యులు చేత స్వఛ్చందంగ యివ్వబడ్డవారు. ఇంటి ఆడపడుచును దేవదాసీగా మార్చారు. 4. "గుడిచేటి" పేరుతో దేవుని సేవలో తరించాలని భావించారు. ఆమ్రపాలిలా లోకోత్తర సౌందర్యవతి అయితే. 5. "హ్రీత"గ అర్పితము చేసి బంధుత్వము వదులుకునేవారు. 6. "అలంకార" అనేపేరుతో రాజుల, ధనవంతుల పోషణలో దేవదాసీగా నృత్యములు చేసేది. ఇకజీతభత్యాలు తీసుకుని దేవుడి సేవచేసేది. 7. "గోపాల వనిత". దేవదాసీలుగ దేవుని భార్యలుగ ఒకరాత్రి గడిపి కైంకర్యము అనిపించుకునే వృత్తిలోకి ప్రవేశించేవారు. ఆరవ ఏటనే దేవదాసీ తపస్సుగ నృత్యాది విద్యలు నేర్చేవారు. నిషేధము ఉంది.
భగవంతుని నైవేద్యముగ పడుపుకత్తె శాపజీవితము పాలయ్యారు. పడుపుకత్తె రాక్షసరతిగ శ్రీశ్రీ కవిత వ్యధార్త జీవిత వృధాప్రయాసను గుర్తుచేస్తుంది. గుడిసానులుగ రాజనర్తకిలుగ నాట్యాభి నయముతో రాజును కొంగున ముడివేసుకున్న రాజకీయముల కథలు అనేకం. విషకన్యగ ముద్రా రాక్షసమువంటికథలు చెప్పవచ్చు. అష్టాదశవర్ణనలో వేశ్యావర్ణన ప్రబంధలక్షణములలో ఒకటి.
చచ్చేక దొరికే ఆ రంభకన్న ఇపుడు నచ్చినట్టి బల్ అన్నులమిన్నే మిన్న అని సాహిత్యకీర్తి పాట చలనచిత్రాలు మనలోని స్త్రీకాంక్షను చాటుతాయి. శ్రీనాథమహాకవి శృంగారి అవునోకాదో తెలియదు. కాని పల్నాడులో దేవవేశ్యసౌందర్యము కోసము వెదికాడు. ఏకులొడికే స్త్రీని స్వర్గలోకరంభ అందంగా సరిపెట్టుకుని గేలిచేసాడని చాటువు. అంగనా సౌందర్యప్రదర్శనా భోగమేళం లేని పెళ్ళివేడుకుండేది కాదు. ముఖ్యంగా ఐదు రోజుల పెళ్ళిగా నియోగుల ఇళ్ళల్లో లేనివాడయినా సరే ఏర్పాటు చేసి తీరేవాడు. (తెలుగువిజ్ఞానసర్వస్వము పందొమ్మిదవ పేజి జీవన విధానము - కుటుంబ జీవనము)
కాశీమజీలీ కథలు:
కాశీమజలీ కథలలో ఈ స్త్రీ సంబంధి కథలు చెప్పబడ్డాయి. "కులటలు, జారిణులు" శీర్షికన కథాసంవిధాన సిద్ధాంతవ్యాసములో మాదిరాజు బ్రహ్మానందరావుగారు, 217 పేజీలో స్త్రీ సంబంధి అన్నిరకాల మనస్తత్త్వాలను విశ్లేశించారు. స్త్రీ వేశ్యావృత్తిని స్వీకరిస్తే వారిని శిల్పకారికలంటారు. దుష్టులైన వేశ్యలు, వేశ్యమాతలు కనిపిస్తారు. వారిలోశిల్పకారికలైన పతివ్రతలు గణిక, రూపాజీవి, భర్తృ మరణానంతరముమాత్రమే వేశ్యావృత్తిని స్వీకరిస్తారు. వేశ్యాధర్మబోధ ప్రస్తావన ఉంది. మనకు హంసవింశతి కథలలో పరపొందునాశించే స్త్రీల కథలున్నాయి. రంకునేర్చిన స్త్రీ బొంకు నేర్వాలన్న ఆ కథలను నిషేధించాలని వీరేశలింగము కోరినా వెలుగులోకి వచ్చాయి. విజ్ఞాన సర్వస్వమనదగిన సమాజ విశేషాలు ఆ కథల చాటున దాగినవి సిద్ధాంత వ్యాసము కూడ వచ్చింది. కావ్యము నీతిని బోధించకపోయినా అవినీతిని బోధించకూడదు అనిపించినా జారిణి స్త్రీ మనస్తత్త్వానికి హెచ్చరిక ఆ కథలు నీతినే బోధిస్తాయి. నిషేధముకాదు.
సర్వజన కామాన్ని కాసులుతీసుకుని కామము తీర్చిన కథలు కనుమరుగవుతూనే మళ్ళీ పుట్టుకు రాకూడదు. జారిణీ వ్యవస్థ మనస్తత్త్వము కులకాంతలలో రాకూడదు. వేశ్యాప్రవృత్తి నిషేధింపబడింది. ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రభ్త్వం1988లో అంకితీకరణ నిషేధ చట్టము తెచ్చింది. 1947లోనె మద్రాసు చట్టము ఆలయ వ్యభిచార దురాచారాన్ని అరికట్టాలని చట్టము చేసింది.
జాయింట్ ఉమెన్ ప్రోగ్రాం ప్రాంతీయకేంద్రం బెంగుళూరు దేవదాసీ పునరావాస ఆవశ్యకత జాతీయ మహిళా కమిషనుకు నివేదిక సమర్పింది. ఇవి వెలుగులోకి వస్తే జీవితాలలో వెలుగులు నిండుతాయి. దేవదాసీ వృత్తాంతాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో కల్యాణమంటపము. ఇటీవలి శ్యాం సింఘారాయ్ 2021లో సినిమా పేర్కొనదగినవి. ఈ ఆలయ వ్యభిచారం బ్రిటిష్ కాలం లోనే 1929లోనిషేధింపబడింది. గ్రామదేవతారాధనలో జోగినీ వ్యవస్థ, గణాచారి గమనించ్దగ్గవి. తెలంగాణాలో 1988 జస్టిస్ రఘునాథరావు ఏకసభ్య కమిషను వచ్చింది.
ముగింపు:
మానవలోకంలో స్త్రీలు అప్సరసలు అని చెప్పితమకుతామే వంచించుకుని మానవవేశ్యాకాంతలుకు స్ఫూర్తిగవేశ్యావృత్తి ప్రారంభము సమర్ధనీయముకాదని చెప్పడం నా ఉద్దేశం. నిందార్ధకముగ ప్రత్యేక కులాచారములు, కట్టుబాట్లుతో సమాజదూరము వాస్తవములేకుందా చూడాలి.
“My whole soul rose in rebellion against the custom of dedicating minor girls for immoral purposes. Calling them devadasis, we insist God himself on the name of religion’’ గాంధిగారు దేవదాసీలు గురించి పడిన ఆవేదన యిది.
దేవదాసీలు అంటే గుడిసానులు అనిఅర్ధము. ఏకవచనము గుడిసాని. దేవునిసేవకు అంకితమైన స్త్రీలు . సానిశబ్దము వేశ్యార్ధమును ధ్వనిస్తుంది. పేరుకు దేవుని సేవకురాండ్రు. కాని దైవాని కంకితమైన ఈస్త్రీలపై వేశ్యాకులము ముద్రవేసారు. బహిరంగ విపణిలో వెలయాలు అని పిలిచారు. ఇంకా గ్రామదేవతాచారాలలో గోచరింపబడుతున్నా అన్యాయం జరిగే వాస్తవాలు ప్రత్యేక కులాచారములు, కట్టుబాట్లు నుంచి ఉన్నతస్థితి జీవిత దిశగ అభివృద్ధి పథకాలు ప్రభుత్వము చేపడుతున్నవి సరిపోవని ఈ వ్యాసము మరిన్ని మెరుగైన ఆలోచనలు వీరికి మేలు చేయాలన్నది ఆశ ఈవ్యాస సారాంశము.
గ్రంథ రచనకు సహకరించినవి:
THE VEDAS (ROSHEN DALAL),
1. మనుచరిత్రము, వావిళ్ళ్రామశాస్త్రులు & సన్స్, ౨౦౦౧
2. స్కాందపురాణము
3. కాశీమజిలీకథలు కథాసంవిధానము, డా. మాదిరాజు బ్రహ్మానందరావు
4. తెలుగు విజ్ఞానసర్వస్వము (తెలుగుసంపుటి 3వ భాగము)