AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797

2. ఆధునిక తెలుగు కవిత్వంలో రాయలసీమ ఆకలికేకలు, కరువులు

డా. జి. వెంకట రమణ

S.CH.V.P.M.R ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
గణపవరం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్-534198
సెల్: 9000418264, email: gvrhcu09@gmail.com


ఉపోద్ఘాతం:

కడుపు మండినప్పుడు, ఎండినప్పుడు పుట్టే మాటల మంటలే రాయలసీమ కవిత్వం అని చెప్పవచ్చు.  ఇప్పటికి తాగడానికి నీళ్లు దొరకని పల్లెలు కోకొల్లలు. వ్యవసాయం అంతా వర్షధారమే. ఎక్కడో అక్కడక్కడా బోరు బావులు విసిరేసనట్టు ఉంటాయి.అవి కూడా ఎండ కాలం లో తప్పకుండా ఎండిపోవాల్సిందే.  బావుల మాట ఇంక దేవుడెరుగు.  చెరువుల ఊసు వినబడితే ఒట్టు.  ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న ప్రాంతం రాయలసీమ . విద్య వైద్య సాహితీ మేధో విషయాలన్నిటిలో అనుకున్నంత ప్రగతిని సాధించలేదనే చెప్పాలి. ఒక ప్రాంతం విద్యాపరంగా అభివృద్దిని సాధించినప్పుడు మేధోపరమైన వికాసం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో విద్యలో వెనుకబడటానికి గల అనేక కారణాలలో కరువు ప్రప్రథానమైంది.కరువు మనిషిని శాశించి, పీల్చి పిప్పి చేసి  చంపేస్తోంది. ప్రభుత్వాలు కరువు నివారణా చర్యల్ని మొక్కుబడికోసం కాకుండా చిత్త శుద్ధితో చేపట్టిననాడు కరువు ప్రభావాన్ని కొంత అరికట్టవచ్చు. ఈ వ్యాసంలో రాయలసీమ ప్రాంతంలో తాండవిస్తోన్న కరువు సమస్యను,తద్వారా వికసించని విద్యని, మేధో వికాసాన్ని, మేధోపర హక్కుల పోరాటాన్ని   కరువు  ఫలితాల్ని చెప్పడమే ఈ వ్యాసోద్దేశ్యం.          

ఆధునిక రాయలసీమ సాహిత్యంలో ప్రాంతీయతా చైతన్యం బహుశా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ‘పెనుగొండ’ అన్న పాటతో పాటతో ప్రారంభమైంది. ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం పుట-55 గత వైభవం వద్దనే ఆగిపోకుండా వర్తమాన దైన్యం వద్దకు వచ్చిన కావ్యం పుట్టపర్తి నారాయణాచార్యుల ‘పెనుగొండలక్ష్మి’ 1930 ప్రాంతం ఈ కావ్యాన్ని రాశారు.ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం-పుట 56.

ఈ రెండు కావ్యాలు 20 శతాబ్దపు పూర్వభాగంలో రాయబడ్డాయి.  వీటిలో ప్రస్తుతము ‘పెన్నెటి పాట’ పెనుగొండలో ఉన్న దైన్యస్థితి కనిపించదు. ఆనాడు ఈ పెనుగొండ ప్రాంతం ఈ నాటిలా కరువు సీమకాదు. అని విద్వాన్ విశ్వం ‘పెన్నేటిపాట’ పీఠికలో రాళ్ళపల్లి వారు పై విషయాన్ని స్పష్టం చేయడం గమనించదగింది.

పెనుగొండ పక్కనే ఉన్న ‘భోగసముద్రం’ అన్న చెరువు (దీన్ని  బాబయ్య చెరువని కూడా అంటారు)ఎప్పుడూ నిండుగా ఉండేదట. కొండమీద నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులు పుష్కలంగా ఉండేవట. తన చిన్నప్పటి పెనుగొండను తలుచుకొని పుట్టపర్తి వారు “వర్షాకాలంలో ఆ సౌందర్యం వర్ణనాతీతం” అంటూ “ఈనాడు ఆ కొండ కట్టేల కోసం బీడుగా మారిపోయిందని” వాపోయారు. ‘పెనుగొండలక్ష్మి’ లో పెనుగొండ కరువు కాటకాల ప్రాంతంగా కనిపించకపోవటానికి కారణం ఇదే. ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం, పుట-57.

పుట్టపర్తి “మేఘదూతం”లో మొదటిసారిగా సమకాలీన రాయలసీమ జీవితానికి సంబంధించిన నెగిటివ్ అంశాల ప్రస్తావన బలంగా వినిపిస్తుంది. అక్కడి జీవితాన్ని ఇలా వర్ణించాడు.

క్షామాపీడిత గాత్రములు వణుకాడ/ నీ మొగము వీక్షింత్రు నీరదను/ తెలుగుప్రజ” అన్నాడు. ఇక్కడ తెలుగు ప్రజ అన్నమాట రాయలసీమప్రజలు అన్న అర్థంలో వాడబడింది. అంతేగాక ఆధునికకాలంలో ఫాక్షన్ హింసనూ కరువును కలిపి రేనాడును గురించిన పుట్టపర్తి ఇలా అన్నారు.

పొడిచికొన నేలపై పడుడు రక్తమేకాని / అరుదుగా మేఘజాలమా నేలపై పడును/ రాయలసీమలో ... అని బెళ్ళూరి శ్రీనివాసమూర్తి 1954లో “తపోవనము” అన్న ఖండకావ్యంలో “గంజి కేంద్రము” అన్న ఖండిక ఆనాడు సంచలనం రేపంది. 1948-53 మధ్య రాయలసీమలో వచ్చిన కరువు కాలంలో తిండిలేని వారికోసం ప్రభుత్వం, రామకృష్ణమిషన్ వంటి స్వచ్ఛంద సంస్థలూ, కమ్యునిష్టు పార్టీవంటి వామపక్ష పార్టీలు ఎన్నో గంజి కేంద్రాలను నడిపాయి. అవి లేకపోతే ఎన్నొ వేలమంది ఆకలితో చనిపోయి ఉండేవారు. గంజి కరువు మొదటిగా సాహిత్యంలో పరిచయం చేసిన గౌరవం బెళ్ళూరి శ్రీనివాసమూర్తికే దక్కుతుంది.

శ్రీనివాసమూర్తి తన ‘తపోవనము’ కావ్యంలో ఇలా అన్నాడు -

కనుడోయి యిటు గంజి కేంద్ర మిటులాకర్ణింపు డాక్రందన

ధ్వని హస్తంబుల మట్టి పాత్రలు వహింయింపన్ దీన భావంబులా

నన సీమన్ వహియింపగా ముసురు చున్నారెంత దారిద్య్రమీ

జనతన్ మ్రింగగవేచి యున్నయది దుష్కాలంబు ప్రాప్తింపగన్

పై విధంగా గంజి కేంద్రాలను హృదయ విధారకంగా వర్ణించాడు.

గంజి కరువును గూర్చి బెళ్ళూరి శ్రీనివాసరావు రాసింది ఒక ఖండిక మాత్రమే. సంపూర్ణ కావ్యాన్ని రాసిన గౌరవం బైరపురెడ్డి నారాయణరెడ్డికి దక్కుతుంది. ఇతని 'రాయలసీమ రైతు'అన్న కావ్యం 1976లో ప్రచురించపబడింది. రాయలసీమ రతనాలసీమ కాదు. ఈ ప్రాంతం కరువు కాటకాలకు నిలయం. నా “ఏబైఏళ్ళ అనుభవంలో సమృద్ధిగా పంటలు పండిన కాలమును నేను చూడలేదు”. అనగలిగినంతగా సీమ జీవితాన్ని గురించి తెలిసినవాడు.ఆనాటి విషాదానుభవాలే ఈ కావ్యానికి ప్రేరణనిచ్చినవంటాడు.

తెలుగు సాహిత్య సాహిత్య చరిత్రలో ఆధునిక కవితకు ఒక ప్రత్యేక స్థానం వుంది.అందులోను రాయల సీమ ప్రాంతం నుండి ఆర్త నాదాలతో వెలువడే కవితకు మరింత పదునుందని చెప్పాలి. ఆ కవితల్లో ఆర్ద్రత దుఖం ,ఆకలి కేకలు చావులు, కూలిన కొంపలు కూలిన జీవితాలు ఇలాంటి కల్లోల దృశ్యాలన్నీ కవితల నుండా పరచుకుని ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆధునిక కాలంలోనే ప్రముఖ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, శాంతి నారాయణల సంపాదకత్వంలో వెలువడిన కవితా సంకలనమే ఈ ‘వొరుపు’. ఒకనాటి రాయలసీమ రసికతతో అలరారితే నేటి రాయలసీమ కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఈ కవితా సంకలనంలో 54 కవితలున్నాయి. అనంతపురం జిల్లా రచయితలు ప్రచురించారు. కరువు వికృతిరూపం ఈ కవితల నిండా కనబడుతుంది.

రాధేయ రాసిన ‘చావులరుతువు’ లో -

కాలంగాని కాలం, కరువుకాలం/పల్లెసీమల కనుపాపల్లో / చెరువులన్నీ ఆవిరైనకాలం/ వానజాడలేనికాలం

నీటి చుక్కకైనా నోచుకోని కాలం అని కాలాన్ని గురించి చిత్రిస్తాడు.

తిండిగింజలు లేక ప్రజలుపడే కష్టాల్ని గురించి వాపోతాడు. దస్తగిరి రాసిన ‘ఈ యుద్ధం ఆపొద్దు’ లో అనావృష్టి, అకాలవృష్టి, రాజకీయ సంకుచిత దృష్టి గురించి ప్రపంచీకరణ వల్ల రైతు పడే పాట్లను గురించి తెలియజేస్తాడు. ‘నీ చాకిరంతా వట్టిదిరోరన్నో రైతన్నా’ లో జట్టిజైరం రైతన్నకరువున నలిగిపోయిన స్థితిని, కుటుంబాలు విచ్ఛిన్నమైన పరిస్థితుల్ని చూపిస్తాడు. ఆశావాది ప్రకాశరావు రాసిన ‘జూదమై సీమ సేద్యమ్ము’ లో అనంతరైతు సేద్యపు జీవితం జూదమైపోయిందంటాడు.

జూపల్లి ప్రేంచంద్ రాసిన ‘కసాయి కరువు’ లో

‘కరువులు కాటకాలూ కొత్తకాదు

ధాతుకరువు డొక్కలకరువు

తాతముత్తాతల నుండీ చూసిండాము

రాయలసీమంతా ఒలిస్తే పలుకుతాది కరువు

మా రాళ్ళనంతపురంలో పిలవకనే పలుకుతాది’ అంటాడు (వొరుపు – కసాయికరువు.  పు. 15)

పస్తులు,వలసలు, కూటికోసంమానాలమ్ముకోవడం, ఈతగడ్డలుతినడం, ఆవుల్ని అమ్ముకోవడం... ఇలాంటి దృశ్యాల్ని ‘కసాయి కరువు’లో చూస్తాం. రాత్రివేళ పశువులు నీటికోసం అంబాయని అరుస్తుంటే వాటి దీనావస్థనుచూస్తే కడుపులో ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్లవుతుందటూ వాపోతాడు.

టి. రాజారామ్ తన ‘రేపటి సూర్యులై మండుతారు’ కరువు దుస్థితిని వివరిస్తూ -

ఎవరు చేసిన గాయపు మచ్చలివి? / అప్పుళ గొడ్డళ్ళా / కరువుకాటకాల కరుకు కత్తులా

ఎంతో కోల్పోయింది ఈనేల / మానాన్ని అభిమానాన్ని చివరకు ప్రాణాన్నికూడా / ఇప్పడిక్కడ నాగలి పట్టే రైతులు లేరు”.  అనంటారుప్రజలు కరువువల్ల అప్పులు పాలయ్యారు. మానాన్ని,అభిమానాల్ని ప్రాణాలను సయితం కోల్పోయారు.

‘కాకి రెక్కంత కరి మబ్బుకోసం’ లో బద్వేలి రమేష్ ఎండిపోయిన బావులు, బోరింగులూ, చెరువులూ మాయిని కరువు గాయాలంటాడు.కక్షలు పెరిగిపోయాయి. కరువుతో జరిగే రాజకీయ ప్రయోజనాలను నిలిపేదెవరని ప్రశ్నిస్తాడు. ఎడారి పల్లేకి ఎప్పటిలా భయపెట్టే కరువు చిత్రాలు వెన్నంటే ఉన్నాముకదా.రఘుబాబు రాసిన ‘నిజశత్రువు’ లో కరువిక్కడ అకాల వర్షాలతో రైతుతో జూదం ఆడుకుంటుంది. లక్షల ఎకరాలను ఎండబెట్టి రైతు కన్నీటజలకమాడ్తందని కరువు యొక్క వికృతచేష్టలను చూపిస్తాడు.‘కరువుతో... రణం’ కవితలో వై. శ్రీరాములు రుతువులే మా బీళ్ళ సీమకు ఒకే ఒక ఋతువు... కరువు రుతువు అనంటాడు. భూమిలో విత్తనాలు విత్తితే వేరుశెనగ పండుతుందనుకంటే కరువు కత్తులు మొలిచి మా కుత్తుకలు తెంపాయని ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

చిక్కికృష్ణ రాసిన ‘జలప్రళయం’ నిజంగా కన్నీళ్ళను పెట్టించే కవిత.

“కరువుసీమలో నీళ్ళులేవన్నదేవరు?

కబేళాలకు వెళుతున్న గోమాత కళ్ళలో చూడునీళ్ళా! కన్నీళ్ళు

కలకత్తా బాంబే వేశ్యాగృహాల్లో పడుపువృత్తితో కడుపు నింపుకుంటున్న

కరువుసీమ చెళ్ళళ్ల కళ్ళలో చూడు నీళ్ళే” అనంటూ ఎంతో ఉద్వేగభరితంగా సాగుతుందీకవిత.

‘ఈ నిశ్శబ్దాన్ని అంతం చేద్దాం’లో నిర్మాలారాణి కరువురక్కసి కోరల్లో ఇరుక్కుని బలైపోయిన ఒక అమ్మాయి అంటే అప్పుడే వికసించిన ఆడపిల్ల జీవితo ఎలా నాసనమయ్యిందో మనకు చూపించారు.

 ‘ఈ నేపథ్యం ఎంత విచిత్రం’ లో ఆర్. శశికళ రైతులు కరువు బాధలు తట్టుకోలేక కుటుంబాలు కుంటుంబాలే పురుగుల మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన సంగతిని వివరించారు.వి.చంద్రశేఖర శాస్త్రి రాసిన ‘గద్దలాడుతున్న దృశ్యం’ అనే కవితలో రైతు కరువు ప్రభావ తీవ్రత వల్ల మరణిస్తే ఆ శవాలపై గద్దలాడుతా దృశ్యాన్ని చూపిస్తాడు.

‘స్వర్ణాంధ్రకు శవమెత్తు సంతకం’ కవితను గుత్తా హరిసర్వోత్తమ నాయుడు రాశాడు. ఇందులో వర్షాల కోసం ఎదురుచూసి వర్షం రాకపోయేసరికి విసుగుచెంది ఆత్మహత్య చేసుకోన్న రైతుజీవితం చిత్రించబడింది.

సడ్లపల్లి చిదంబర రెడ్డి రాసిన ‘పెన్నేటి పదాలు’ లో

ఏనుగట్లా రైతు

ఎగబడి సేద్యంజేసి

ఎండేపంటల్జూసి

పీనిగై పాయ!!” అని రైతు కుంగిపోయిన స్థితిని వివరిస్తాడు.

‘ఆకలి నేల’ అనే కవితలో కెరె జగదీష్ కరువు వల్ల విత్తనాలు చావడం, పూతరాలిపోవడం, మేఘాల చినుకుల కోసం ఎదురుచూపు, విద్యుత్తు కోసం బ్యాంకులో అప్పులు, వడ్డీల మోతలు, ఆకలిమంటల వాతలు హెచ్చవటం వంటి అనర్థాలను చిత్రించాడు. నేల ఆకలిగొన్న రైతు ఆత్మహత్యల్ని కోరుకుంటుందేమో అనేంత వికృత రూపాన్ని కరువు సంతరించుకుంది.‘క్రూరస్పర్శ’లో నందవరం కేశవరెడ్డి కరువు కరుకుదనాన్ని కరువు కరాళ నృత్యాన్ని, క్రూరమైన, కర్కశమైన డొక్కల, ధాతకరువుల్ని గురించి వివరించారు.

‘పగిలిన పలుగు’ అనే కవితలో శ్రీనివాస్ అంకే రైతు యొక్క స్థితినిలా చూపిస్తాడు. రైతు కరువు బరువంతా - 

“భుజాన్నెత్తుకొని/ఎడారిసీమలో తడారిన గొంతుకతో/తిరిగిపంట కోసం పరుగెత్తాడు” అనంటాడు.

కరువు రక్కసి ప్రళయ తాండవానికి పల్టీలు కొడుతూ,క్షామం నిండిన పల్లెటూళ్ళలో క్షేమం గురుతులు లేకుండా,ఆకలికేకల మధ్యనివసిస్తున్న రైతు జీవితాన్ని ‘చితికిన బతుకుల్లో’అనే కవితలో ఉద్దండం చంద్రశేఖర్ రాశారు.

డి. శిరీష రాసిన బదులు చెప్పేదాక జి.వి. సాయిప్రసాద్ రాసిన ఆకలిరాగం చిలుకూరి దీవెన అందించిన చినుకు నారాయణస్వామి రాసిన ఆవేదన, మోక్షప్రసూన రాసిన కలగంటున్నా, సిద్దగిరి శ్రీనివాస్ ఎదురుచూపులు, ముక్తారం స్నేహలత అనంతకరువు, ఆకుల రఘురామయ్యజీవంలేని ఉగాదులు,రైతు జీవితాన్ని అందించిన హిమబిందు, బి. నాగిరెడ్డి రాసిన ఎన్నాళ్ళు, తరిమెల అమరనాథరెడ్డి అందించిన అనంత రైతన్నా ఐక్యంగా తిరగబడరన్నా, ఎన్.నాగేశ్వర రావు రాసిన కాగితపు జూటూరి షరిఫ్ రాసిన పల్లె ఎప్పుడు నవ్వుతుందో మరి, డి. క్రిష్టమూర్తి రాసిన నిషిద్ధరైతు, క్రాంతికూమార్ రాసిన అనంత ఉగాదికవితలానిండా కరువు దృశ్యాలే.

హేమామాలిని రాసిన పూలమ్మిన చోట, పేరిందేవి రాసిన అనంతరైతన్న, నువ్వల నరేంద్రకుమార్ రాసిన ఆకలిదప్పుల అంచున అనంత, గాదిరాజు మధుసూదనరాజు రాసిన ఏకరువు, కె. గాయత్రి ఆనంద్ రాసిన అన్నదాత ఆర్తనాదం, యశోదాదేవి రాసిన అనంత క్షామం, కంబదూరు షేక్ నబీరసూల్ రాసి కరువు రక్కసి కాలనాగై కసిదీరా కాటేసింది, కరణం రాజేశ్వరావు రాసిన రాయలసీమ రైతు, జి. నరసమ్మ రాసిన కూలిన ఆశల చెట్టు, సోమిశెట్టి సరళ రాసిన మా సేవ ఎల్లుట్ల, ఉదయ్ కుమార్ రాసి ఎదురుచూపు, కె. రామిశేషయ్య రాసిన కాల కూట కరాళ కరువు, కె. ఎమ్. రాయుడుగారి అతడు తగలబెడుతాడు, శాంతినారాయణ చినుకే మాకు చిరకాల స్వప్నం, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అదృశ్యమవుతున్న దృశ్యం, కేతుబుచ్చిరెడ్డిగారి పల్లె చిత్రం, సింగమనేని నారాయణరావు అనంతపురం, ఇనాక్ గారి అనంతపురంలో ఆకాశం అనే కవితల్లో కరువు వల్ల కుటుంబాలు, రైతులు ఎలా నష్టపోయారో, నాశనమయ్యారోననే విషయాల్ని హృదయ విదారకంగా చిత్రించారు.

ముగింపు:

రాయలసీమలో విత్తనాన్ని మొలకెత్తించే రైతు, ఒక్కచిక్కిన ఎద్దు, వాన చినుకుకోసం ఎదురు చూసే వేరుశనగ మొక్క, వలస బాటలో పయనించిన బాలింతా, ఆత్మహాత్యల ఆర్తనాదమూ మాత్రమే కవితా వస్తువులవుతాయి. ఇక్కడ కవిత్వం లలితంగా, సుకుమారంగా ఉండదు.  ఇక్కడ కవిత్వం ఒక విస్ఫోటనం అది తన్ను ధ్వంసించే వాడెవరైనా అతణ్ణి క్షమించదు. మాట చాలా కటువుగా కఠినంగా ఉంటుంది. కాబట్టి రాయలసీమలో ఉన్న కవులు రచయితలు కళాకారులు మేధావులందరూ పలికేది కరువు మాటే.

ఉపయుక్త గ్రంథ సూచిక :

1. చంద్రశేఖర్రెడ్డి, రాచపాలెం, (సం.) (2009). వొరుపు, అనంతపురం ప్రచురణలు, అనంతపురం.

2. వెంకట సుబ్బయ్య, వళ్ళంపాటి, (2004). ఆధునిక తెలుగు సాహిత్యంలో రాయలసీమ చైత్యన్యo, మదనపల్లె.

3. రాయలసీమ రచయితల చరిత్ర (2002). అనంతపురం ప్రచురణలు, అనంతపురం.

4. రామకృష్ణ, ఆచార్య తుమ్మల, (2008). అవగాహన, చంద్రకలా పబ్లికేషన్స్, హైదరబాద్.

5. వెంకట రమణ, జి. (2014). ప్రాచీన తెలుగు సాహిత్యం - కరువు ప్రభావ చిత్రణ, (సి.గ్రం.) హైదరబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాద్.