AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-10 | October 2022| ISSN: 2583-4797

1. తెలుగు కవిత్వంలో రెక్కల ప్రస్థానం

డా. పసుపులేటి నాగమల్లిక

తెలుగు శాఖాధిపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం,
కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: 7981364632, email: pnmpvs14@gmail.com


ఉపోద్ఘాతం:

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత కేవలం ప్రక్రియగా మాత్రమే కాకుండా సమాజాన్ని చైతన్యం చేయడానికి, వ్యక్తి సాధికారతకు ఊతమిస్తూ అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది.సమాజ పక్షంగా ఆధునిక భావజాలంతో రూపొందించిన వచన కవిత్వం ప్రజాస్వామ్య కవిత్వంగా మన్ననలు అందుకుంటోంది.వస్తు వైవిధ్యాన్ని,రూప నవ్యతను కలిగి కవికి పూర్తి స్వేచ్ఛనిచ్చి సరళత్వం, ఎదలను తాకే సూటితనంతో, సమాజానికి ప్రతిబింబంగా, వాస్తవికతకు నిదర్శనంగా నిలుస్తూ ఎన్నో కొత్త కొత్త ప్రక్రియల రూపకల్పనకు మార్గ దర్శకత్వం వహిస్తూ కొనసాగుతోంది.

ఈ వచన కవితా స్రవంతిలోనే మినీ కవిత్వం, నానీలు, హైకూలు మొదలైనవెన్నో ప్రక్రియలు కొత్త ఒరవడిని సృష్టిస్తూ ప్రజా చైతన్యాన్ని కోరుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపించడంలో కవి పాత్రను తెలుపుతున్నాయి. ఇలాంటి నూతన వచన కవితా ప్రక్రియల్లో రెక్కలు ప్రక్రియ ఒకటి.

ప్రక్రియ రూపకర్త:

రెక్కలు రూపకర్త ఆ నాటి పైగంబర కవి అయిన ఎం.కె. సుగమ్ బాబు. ఇందులో అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్నిచ్చే భావం ఇమిడి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రాకృతిక, తాత్విక, వాస్తవిక, సామాజిక విషయాలు ప్రధానాంశంగా ఉంటాయి. రెక్కలు ప్రక్రియ రెండు భాగాలతో కూడిన రూపం. మొదటి నాలుగు లైన్లు పక్షి శరీరమైతే చివరి రెండు లైన్లు రెండు రెక్కలు. మొదటి భాగం ఒక సాధారణమైన స్టేట్మెంట్ అయితే దానికి తాత్విక వ్యాఖ్యానంగా ఉంటుంది. రెండో భాగం రెక్కలు దీన్ని సాధించే శిల్పం. సాధారణమైన స్టేట్మెంట్తో ఉండే ఒక అతి సాధారణమైన భావాన్ని ఉదాత్తపరిచి అసాధారణ పరిధిలోనికి తీసుకువెళ్లేవే రెక్కలు. దీనిలో జీవన సత్యాలు, తాత్విక భావాలు చోటు చేసుకుంటాయి. తెలిసిన విషయాల నుండి తెలియని విషయంలోకి రెక్క పట్టి నడిపించడమే రెక్కలు ప్రత్యేకతగా కనిపిస్తుంది.

రెక్కలు - లక్షణాలు:

ఈ రెక్కల కవితా ప్రక్రియలో మొత్తం ఆరు పాదాలుంటాయి. పాదాల నియమం తప్ప పదాల నియమం, అక్షరాల నియమం లేదు. విషయ విభజన బట్టి నాలుగు ప్లస్ రెండు పాదాలు ఉంటాయి.పై నాలుగు పాదాల్లో విషయం లక్ష్యంగా ఉండి చివరి రెండు పాదాల్లో లక్షణం ప్రతిపాదించ బడుతుంది. ప్రధానంగా ఈ ప్రక్రియలో కవికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుచేతనే ఒక విషయాన్ని కవి ముందుగా చెప్పి దాన్ని సమర్ధించే సిద్ధాంతాన్ని చెప్పి ముగించటం అనే ఒక ప్రత్యేక శిల్ప లక్షణాన్ని కలిగి ఉంటాడు.

ఈ రెక్కలులో చివరి రెండు పాదాలు వేమన ఆటవెలదిలో మూడో పాదంలాగా ఒక సందేశాన్ని సామాజిక దృక్పధాన్ని కలిగించి పాఠకుల హృదయాలను త్వరగా ఆకట్టుకుంటాయి. వస్తు వైవిధ్యంతో జీవిత సత్యాలను ఎన్నో కోణాల్లోంచి వీక్షించిన వినూత్న ప్రక్రియ రెక్కలు.

రెక్కలు రూపకర్త సుగమ్ బాబు 'రెక్కలు'ను హిబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ షుల్మన్ "వింగ్స్ ఆఫ్ హోప్" గా ఆంగ్లంలోకి అనువదించారు. దీని వల్ల అంతర్జాతీయ స్థాయిలో రెక్కలు ప్రక్రియకు మంచి గుర్తింపు వచ్చింది.సుగమ్ బాబు ఎందుకు ఈ కవితలు రాశారో ఇలా చెప్పుకున్నారు. "దుఃఖంలోంచే అవును దుఃఖంలోంచే రెక్కలు రాశాను. చుట్టూ వ్యాపించి ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలనే రాసాను. ఏదీ ఊహించి రాయలేదు. చూసే రాసాను. అనుభవించే రాసాను. మనిషి తన పరిధులు తెలుసుకొని జీవించాలని చెప్పాను అని నొక్కి వక్కాణించారు.

రెక్కలు - మానవజీవిత చిత్రణ:

ఈ రెక్కలు చెరుగ్గడ, జయపతాక సంపుటాలలో బాబు గారు జీవితసత్యాలు, తత్వాలు, సమాజం, ప్రకృతి, వివిధ మనస్తత్వాల ప్రవర్తనల్ని, వాస్తవిక విషయాల్ని ఇలా ఎన్నో తెలిపారు.

     "కొడుకైతే

     కొండలు పిండి కొడతాడా

     ఆడపిల్లంటే అసంతృప్తా

     చిన్న బుద్ధితోనే చిన్న చూపు"

    సమాజం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్ల విషయంలో సంకుచిత భావాలతోనే ఉన్నారని వివరించారు.

    "ఎంత జాగ్రత్తగా

    తొడిగినా

    చిరిగిపోతుంది బట్ట

   మృత్యు ఛాయ వృద్ధాప్యం" 

   పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనే తాత్వికతను చక్కగా తెలిపారు. వారి బాటలోనే యెంతో మంది ఈ ప్రక్రియను చేపట్టారు.

        "ఆకాశం

        నీది కాదు

       నది నీది కాదు

       జీవితం నీది"

అంటూ ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు జీవితం మాత్రమే నీది అన్న వాస్తవిక దృష్టి కోణాన్ని కేశవరెడ్డి ఆనందవనం రెక్కలలో చక్కగా చెప్పారు.

   "అద్భుత ప్రపంచం

    ఎక్కడో లేదు 

    నీ చుట్టూనే

    దృష్టి మార్చుకో

    సృష్టి మారదు"

     అంటూ పద్మకళ గారు మన సమస్యల పట్ల దృష్టి కోణం మార్చితే తప్ప జీవితం మారదనే జీవిత సత్యాన్ని వివరించారు.

     "ఎన్ని గాయాలను

    చేసిందో ఎన్ని గాయాలను  

     మాన్పిందో

     కాలం చమత్కారి"

    అంటూ నరేందర్రెడ్డి 'హంసధ్వని'లో కాలం విలువను వర్ణించారు.

  "రికార్డు స్థాయిలో

  మద్యం టెండర్లు

  డబ్బొకరికి జబ్బొకరికి"

    అంటూ ఎల్లయ్య గారు రెక్కలు కవితా ప్రక్రియలో నూతన వస్తు వైవిధ్యాన్ని సాధించారు.

    "ఆకాశం

   ఎత్తు కందాలని

   కొబ్బరి మొక్క ఆశ

    అందని ఆశ

    నిరాశ అవుతుంది"

   అని ఆశ ఉండవచ్చు కానీ నిరాశను చేకూర్చే ఆశ ఉండరాదని ఎంతో హృద్యంగా తెలిపారు నల్లా నరసింహమూర్తి గారు.

ముగింపు:

ఈ విధంగానే శ్రీనివాస్ గౌడ్, కలిమిశ్రీ, రాధాకృష్ణ, మోపిదేవి, రంగారావు, పరమేశ్వరరావు, కేతవరపు రాజ్యశ్రీ, వెంకటేశ్వర్లు, బృందావనరావు, రామచంద్ర రావు, బొల్లిముంత వెంకట రమణ రావు, వంగర పరమేశ్వరరావు, కైలాసపతి మొదలైన కవులెందరో ఈ ఆధునిక వచన కవితా ప్రక్రియ అయిన రెక్కలతో సమాజాన్ని విహంగవీక్షణం చేస్తూ తాత్విక, ప్రాకృతిక, వాస్తవికతల వైపు పాఠకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. మరేoదరో కవులు వారి ప్రజ్ఞాపాటవాలతో మంచి వచన కవిత్వాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తారని ఆశిద్దాం.

ఆధార గ్రంథాలు:

1. నారాయణరెడ్డి, సి, (2001). ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు; ప్రయోగములు, విశ్వంభర విజయ్ పబ్లికేషన్స్ హైదరాబాద్.

2. సుగమ్ బాబు, ఎం.కె., (2009). చెరుగ్గడ, రెక్కల సంపుటి, ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్.

3. సిమ్మన్న, వెలమల, (2014). తెలుగు సాహిత్య చరిత్ర, మూడో ముద్రణ, దళిత సాహిత్యపీఠం, విశాఖపట్నం.

4. రవి, తెలకపల్లి, (సం.) (2009, 2010, 2011, 2016 సంచికలు). సాహిత్య ప్రస్థానం పత్రికలు, విజయవాడ.

5. నరేందర్ రెడ్డి, ద్యావరి (2011). హంసధ్వని, రెక్కల సంపుటి, విశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాద్.