AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797
6. తెలుగులో చారిత్రక నవల: విశ్లేషణ
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్)
నిజామాబాద్–503 322, తెలంగాణ
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
Keywords: స్వాతంత్ర్యం, చారిత్రకనవల, ప్రయోజనం, స్వరాజ్యసాధన, స్వరాజ్యస్థాపన, సహాయనిరాకరణోద్యమం, స్వతంత్ర ప్రతిపత్తి, విజయం, రాజ్యప్రాప్తి, జాతీయవాదం, దేశభక్తి, మాతృభూమి, ఆలంబన, సంస్కృతి, ధైర్యసాహసాలు, సమానతాభావం, కథావస్తువు, అభివృద్ధి, ఉపాసన, ఆధారాలు.
ఉపోద్ఘాతం:
19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో భారతదేశం సాంస్కృతికంగా, రాజకీయంగా చాలా మార్పులకు లోనయ్యింది. పాశ్చాత్య సాహిత్య సంస్కృతుల ప్రభావం, ముద్రణా యంత్రాల వ్యాప్తి వల్ల విద్యావిధానంలో ప్రజల ఆలోచనా సరళిలో చాలా మార్పులొచ్చాయి. అప్పటి వరకు ప్రబంధ, ఆఖ్యానాది కావ్యాదులతో కేంద్రీకరింపబడిన రచయిత దృక్పథం వాస్తవికత వైపు మళ్ళింది. తత్ఫలితంగా రచయితల దృష్టి పాశ్చాత్య సాహిత్యంలోని ప్రక్రియలవైపు పరుగెత్తింది. ఈ ప్రక్రియల్లో ఒకటైన నవల క్రమంగా వికసించి ఆదరణను పొందుతూ వచ్చింది. ఈ వ్యాసంలో స్వాతంత్య్రానికి ముందు తెలుగులో 1896 నుండి 1947 వరకు వచ్చిన చారిత్రక నవలల నేపథ్యాన్ని వివరించాను. ‘‘తెలుగులో చారిత్రక నవల నేడు’’ అనే అంశానికి స్వాతంత్య్రం తరువాత తెలుగులో చారిత్రక నవలను నేడుగా భావించి 1947 నుండి నేటి వరకు వచ్చిన చారిత్రక నవలలు సమాజంలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని చెప్పాను. 2011 నుండి భవిష్యత్ తరాల వారు ఆశించిన విధంగా చారిత్రక నవలలు వచ్చే రీతిని తెలిపినాను. ఈ చివరి అంశం కొంత వరకు ఖచ్చితంగా చెప్పలేం. చరిత్ర గతకాలాన్ని గురించి చెబుతుంది. లేదా వర్తమానాన్ని బోధిస్తుంది. భవిష్యత్ గురించి చెబితే అది చరిత్ర కాదు. కాని చారిత్రక నవలలో నేటి చారిత్రకాంశాలను జోడిస్తూ ముందు తరాల వారు చారిత్రక నవలలు రాసే అవకాశాలున్నాయి. అందుకే ఈ అంశాన్ని కూడ చెప్పాల్సి వస్తుంది.
ఈ రెండు కాలాల్లో వచ్చిన చారిత్రక నవలల ప్రయోజనం ఒక్కటే. అందులో ఆద్యంతం ప్రవహించేది జాతీయ చైతన్యమే. మొదటిది స్వరాజ్య సాధన లక్ష్యంగా సాగితే రెండవది సురాజ్య స్థాపనకు ప్రయత్నించిన విధానం. సురాజ్య స్థాపనలో కూడ ఎన్నో చారిత్రక అంశాలు ఉంటాయి. వీటిని వివరించేది మూడవది. ఈ కాలాల్లో వ్రాయబడ్డ నవలల ఇతివృత్తాలను ఆధారం చేసుకొని సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, మనోవైజ్ఞానిక నవలలు, అపరాధ పరిశోధక నవలలుగా విభజించబడ్డాయి. అందులో స్వాతంత్య్రానికి ముందు తెలుగులో ఎన్నో చారిత్రక నవలలు, చారిత్రక కావ్యాలు వెలువడ్డాయి. ఎందుకంటే స్వాతంత్య్రం కోసం సాగించిన సమరంలో జాతి పునరుజ్జీవనములో చారిత్రక నవల ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ వరుసలో చారిత్రక నవలలు వ్రాసిన వారు చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేంకట పార్వతీశ్వర కవులు, పిలకా గణపతిశాస్త్రి, మల్లాది వసుంధర, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి, బి.యన్.శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్, కొర్లపాటి శ్రీరామమూర్తి, ఓగేటి ఇందిరాదేవి, శ్రీనివాసరాజు, తదితరులెందరో చారిత్రక నవలలను వివిధ కోణాల్లో తీర్చిదిద్దారు.
ప్రధాన విషయం:
‘‘రచనా కాలంలోని వాస్తవికములైన జీవితాచార వ్యవహారములను చిత్రించేది’’ - నవల అని నవలపై విస్తృత పరిశోధన చేసిన బొడ్డుపాటి కుటుంబరావు గారు అభిప్రాయపడితే, ‘‘సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ, జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల’’ 1 - అని మొదలి నాగభూషణశర్మ అభిప్రాయపడ్డారు. సమాజంలోని మనుషుల జీవన విధానాన్ని, ఆ జీవన విధానంలో ఉన్న సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను రసవత్తరంగా సహజంగా వర్ణించడానికి నవల చక్కని సాహిత్య సాధనమని చెప్పవచ్చు.
తొలితరం చారిత్రక నవలలు:
చారిత్రక నవలను ప్రత్యేకంగా పరిశీలించినపుడు ‘‘ఒక నిర్దిష్ట చారిత్రక దశలో రాజకీయాలను చిత్రించే సాహిత్య ప్రక్రియయే చారిత్రక నవల’’ అని తేలుతుంది. ‘‘చారిత్రక నవలంటే ఇతివృత్తం పూర్తిగా చరిత్రకు సంబంధించినదై ఉండి, కొన్ని ముఖ్య సన్నివేశాలు విశిష్ట కల్పిత లక్షణాలతో చారిత్రక సన్నివేశాలకు భంగం కలుగకుండా పాత్రపోషణ చేసేదే చారిత్రక నవల’’ 2 అని రుద్రమదేవిపై పరిశోధన చేసిన ప్రమీలారెడ్డి గారు వారి పరిశోధనా గ్రంథంలో అభిప్రాయపడ్డారు.
తెలుగులో తొలి చారిత్రక నవలగా చెప్పబడుతున్న ‘‘హేమలత నుండి హిమబిందు’’ వరకు స్వాతంత్య్రానికి ముందు వచ్చిన చారిత్రక నవలలు. చిత్తూరు రాజు మేవారు రాణాలక్ష్మణ సింగు చరిత్రతో మొదటి చారిత్రక నవలైన ‘‘హేమలత’’ వెలువడింది.
సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా అడవి బాపిరాజు జైల్లో ఉండగా (1922-45) ‘‘హిమబిందు’’ నవలను వ్రాశాడు. ప్రథమాంధ్ర చక్రవర్తులైన శాతవాహనుల చరిత్రను, ఆ కాలంనాటి సామాజిక పరిస్థితులను, నాటి కాలంలోని పరిస్థితులకు (1922-45) అన్వయిస్తూ వ్రాయబడిరది. అంటే మనల్ని పరిపాలించిన మన రాజుల చరిత్రకు, నేడు పరిపాలించబడుతున్న పరదేశీయుల పాలనకు గల తేడాలు పాఠకులు గుర్తించి చైతన్యవంతులవ్వాలనేది నాటి రచయితల ఉద్దేశం. ప్రతి రచనకు స్వరాజ్య సిద్దియే ప్రధాన లక్ష్యం.
చిలకమర్తి ‘‘హేమలత’’, ‘‘అహల్యబాయి’’, బంకించంద్ర చటర్జీ అనువాద నవలలు ‘‘దుర్గేశ్ నందిని’’, ‘‘చంద్రశేఖర’’, ‘‘ఆనందమఠం’’, ‘‘సీతారాం’’, విశ్వనాథ ‘‘సత్యబాయి’’, ‘‘ఏకవీర’’, బాపిరాజు ‘‘హిమబిందు’’ తదితర నవలలన్నీ స్వాతంత్య్ర వీరులను తయారుచేసే విధంగా రచింపబడ్డవే. ‘‘అందుకే నవల ఇలాగే ఉండాలి - ఇలా ఉండకూడదని చెప్పే నిర్దేశిక సూత్రాలు అదృష్టవశాత్తు నవలలకు లేవు. నవలను వర్ణనాత్మక సూత్రాలతో మాత్రమే విశ్లేషించవలసి ఉంటుంది అంటూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య (నవలా వికాసం) - ‘‘కవిత్వం మీద వచనం చేసిన తిరుగుబాటు నవల” ’’ 3 అని విశ్లేషించారు.
ప్రారంభయుగంలో వచ్చిన నవల్లో కథాకథనములో, నిర్మాణ శిల్పంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంగ్ల సాహిత్య ప్రభావం కనిపిస్తుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో పాటు ఆనాటి నవలల్లో రచయితలు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శించడం గమనించదగ్గ విశేషం. తొలి చారిత్రక నవలయైన ‘‘హేమలత’’లోని కథ మేవారు రాణాలక్ష్మణ సింగు కాలం (1301) నాటిది.
అనువాద నవలలు:
19వ శతాబ్దం ఉత్తరార్థంలో చారిత్రక నవలలు రచింపబడడం, అనుకరించబడడం, అనువదించబడడం వల్ల ఈ యుగాన్ని అనువాద చారిత్రక నవలా యుగం అని కూడా చెప్పవచ్చును. ఈ యుగంలో భోగరాజు నారాయణమూర్తి రాసిన ‘‘విమలాదేవి’’, ‘‘అల్లాహోఅక్బర్’’, ‘‘చంద్రగుప్తుడు’’, ‘‘ఆంధ్రరాష్ట్రం’’ వేలాల సుబ్బరావు గారి ‘‘రాణిసంయుక్త’’ కేతవరపు వేంకటశాస్త్రి వారి ‘‘రాయచూరు యుద్ధం’’ దుగ్గిరాల రాఘవ చంద్రయ్యచౌదరి గారి ‘‘విజయనగర సామ్రాజ్యం’’ ఎ.వి. నరసింహం ‘‘పాతాళభైరవి’’ ఇలా చారిత్రక నవలలెన్నో విదేశీయులు వెళ్లిపోవాలి స్వదేశీయులు బాగుపడాలి అనే నేపథ్యంతో చారిత్రక నవలలు వచ్చాయి. కర్షకులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, స్త్రీలు, విద్యార్థులందరూ బాగుపడాలని ఆశించి చారిత్రక నవలాకారులు చారిత్రక నవలలు వ్రాశారు. సాధించిన ప్రయోజనం అంటే దేశ స్వాతంత్య్రమే.
చారిత్రక వస్తువును ఓ క్రమపద్ధతిలో పెడ్తాడు రచయిత. 1) ఎత్తుగడ 2) పాత్రల పరిచయం 3) పుట్టుపూర్వోత్తరాలు 4) దేశం - కాలం - పరిస్థితులు 5) పోరాటాలు 6) అపజయం 7) సహాయం 8) విజయం 9) రాజ్యప్రాప్తి లేదా నాయికతో వివాహంతో నవల ముగుస్తుంది. కాని, ఒక్కో రచయిత ఒక్కో విధానాన్ని పాటిస్తాడు. సంవిధాన పద్దతులు రచయితల మధ్య వేరువేరుగా ఉంటుంది.
నవలల ద్వారా రసనిష్ఠలు కావచ్చని తమ నవలానుశీలనంలో సాధికారికంగా నిరూపించిన పరిశోధకురాలు డా॥ ముదిగంటి సుజాతారెడ్డి అంటే పాఠకుని స్థాయికి నవలను తీసుకొని వెళ్లి రసగ్నులను చేయడం. చారిత్రక నవలల్లో శృంగార - హస్య - కరుణ - రౌద్ర - వీర - భయానకాదులు కనిపిస్తాయి. వీర భూపతి, రుద్రమదేవి, సువర్ణశ్రీ, శ్రీకృష్ణదేవరాయల వంటి తదితర పాత్రల్లో వీరరసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నవలలో సర్వాలంకార భూషితమై పఠితల ముందు సాక్షాత్కరిస్తాయి. పాత్రల ఆలోచనలు పాఠకునిలో ప్రవేశిస్తాయి. రసానందభరితుడై ఆనందాన్ని పొందుతాడు. చారిత్రక నవలల్లో ప్రధానంగా కనిపించేది పాత్రల మనస్తత్త్వం. ఒక సమస్య వచ్చినప్పుడు, సంతోషం కలిగినపుడు, ప్రత్యర్థులు సవాలు విసిరినపుడు ఆ పాత్ర వ్యవహరించే తీరును బట్టి పాత్ర యోగ్యతను నిర్దారిస్తాం.
ఒక అవిచ్ఛిన్న అఖండ సాంస్కృతిక వాదం మూలం కాగా ఆ చారిత్రక నవల ఆవిర్భవిస్తుందని ప్రముఖ పరిశోధకులు, శతాధిక గ్రంధకర్త, విమర్శకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారంటారు. దేశ, జాతి, భాష, సంస్కారాలు, ఆచారాలు ఇలా ఎన్నో సాంస్కృతికాంశాలు చారిత్రక నవలతో ముడిపడి ఉంటాయి. సాంస్కృతిక పరిరక్షణే ధ్యేయంగా తెలుగు చారిత్రక నవల పుట్టింది.
చారిత్రక నవల–విశ్లేషణ:
శేషాద్రిరమణ కవులు వ్రాసిన ‘‘కొండపల్లి ముట్టడి’’ చరిత్రాత్మకమైన నవల (1928) నాటి సమాజంలోని ప్రజలు మరచిపోయిన ఆంధ్రుల పరాక్రమాన్ని తెలియజేయటమే ఈ నవల ముఖ్యోద్దేశం. ఆనాటి ప్రజల్లో కర్తవ్యజ్ఞానాన్ని పెంపొందింపజేయాలని నవలాకారులు ఆశించారు. కథాకాలంనాటి పరిస్థితులను గమనించి జాతీయవాద నిర్మాణం చేయాలని కోరుకున్నారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణమునకు త్యాగధనులగు శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు తదితర చారిత్రక పురుషులే కారణమని పాఠకులకు చెప్పడం ఈ చారిత్రక నవల ఉద్దేశం.
ఆంధ్రజాతి అందరికి స్వాతంత్య్రం తెచ్చుకోవడంలో సమరోన్ముఖులు కావాలని కోరుకుంటారు రచయితలు. వీరి ‘‘వసుంధర’’ కూడా స్వాతంత్య్ర సాధనకు వ్రాయబడిరదే. శేషాద్రి రమణ కవులు సహజంగా పరిశోధకులు. అందుకే ఈ నవలల్లోని వాతావరణం కథాకాలానికి, పాత్రలకు దగ్గరగా ఉంది. పాఠకులకు పూర్వ చరిత్రపై అభిమానం పెరిగేలా చేసిన వారిలో శేషాద్రి రమణ కవుల కృషి ఎంతో గొప్పది.
పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో పడిపోతున్న వ్యవస్థను, పూర్వుల నైతిక జీవన విధానం వైపుకు త్రిప్పి కొత్త వ్యవస్థను సృష్టించాలని తలంచిన బహుముఖ ప్రక్రియాకర్త విశ్వనాథ సత్యనారాయణ. ఆర్షధర్మానికి వ్యక్తిగత హృదయ స్పందనలకు మధ్య సంఘర్షణలతో వ్రాయబడిన నవల ఏకవీర. ‘‘బద్దన్నసేనాని’’ నవల వేంగీ చాళుక్యులకు చెందినది. కులోత్తుంగ చోళుడు దక్షిణాపథము పాలించే సమయంలో పశ్చిమ చాళుక్యులు ఆ భూభాగాన్ని ఆక్రమించుకొనగా అంత్యకులజులు, ప్రభుభక్తి పరాయణులయిన బద్దన్న, బాదమ్మలు ప్రదర్శించిన దేశభక్తి ధైర్యసాహసాల ద్వారా ఆంధ్రజాతిలో దేశభక్తి పెరుగుతుంది.
‘‘కడిమిచెట్టు’’లో మయూరి పాత్ర ద్వారా ‘‘ధర్మచక్రం’’లో ఇక్ష్వాకుల ద్వారా హైందవ నాగరికతా వైభవాన్ని, సంస్కృతీ సభ్యతలను పాఠకుని హృదయంలో నాటుకునేలా చేసినవాడు విశ్వనాథవారు.
నవరస భరితములై భారతీయధర్మ ప్రబోధాది గుణాలు గల చారిత్రక నవలలు కేతవరపు వేంకటరాయశాస్త్రి గారివి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన చరిత్రలో చారిత్రక నవలలు మొదట వ్రాసింది కేతవరపు వారే. వారి ‘‘రాయచూరు యుద్ధం’’, ‘‘బొబ్బిలి ముట్టడి’’, ‘‘ఆనందాలు’’ ప్రసిద్ధియైన చారిత్రక నవలలు. ఇవి ఊహాజనితమైనవే అయినప్పటికి చరిత్ర మిళితమైన నవలలు.
1937వ సంవత్సరంలో వాసిష్ఠ గణపతిముని ‘‘పూర్ణ’’ పేరుతో ఐతిహాసిక సామాజిక చారిత్రక రాజకీయాత్మకమైన నవలను రెండువందల ప్రకరణాలలో సంకల్పించి సుమారు నలభై ప్రకరణాలు రచించి భారతిలో ప్రకటించారు. వాసిష్ఠ గణపతి ముని మహావిద్వాంసుడు. మంత్రద్రష్ట. అరుణాచల రమణునిగా ప్రసిద్దికెక్కినవాడు. రమణమహర్షిచే సంభావితుడు. ఈయన తెలుగులో నవలా రచనకు పూనుకోవడము, వేదకాలం నాటి సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించడానికి తలపోయడమూ, ఈ నవలా రచనలో విశేషం.
మనమంతా ఒకే జాతి అనే భావనతో పరజాతి పాలనను వ్యతిరేకించే భావంతో భారతీయులు రకరకాల ఉద్యమాలను చేశారు. చారిత్రక నవలాకారులు మన వైభవపూరితమైన చరిత్రను గుర్తుచేస్తూ చారిత్రక నవలల్లో జాతీయవాద భావాలను నింపారు. విశ్వనాథ, అడవి బాపిరాజు గారి చారిత్రక నవలలు కూడా బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా వచ్చినవే.
ఈ నవలను గణపతి ముని రచించడానికి ఆనాటి సామాజిక కారణాలున్నాయి. ప్రేరణలున్నాయి. అప్పటికి జాతీయోద్యమ ప్రభావం బాగా ఉంది. పురాణాధోజ్వల దివ్యచరిత్ర ద్వారా, సమాజంలో అవాంఛనీయమైన అజ్ఞానాన్ని నిర్మూలించి ఇందుకు ఒకనాటి స్థిరమైన విజ్ఞానం, సామాజిక నాగరికతలు ప్రేరకాలు కావాలని ఆయన ఆశించారు. అప్పటికి ముప్పై సంవత్సరాలుగా దివ్యజ్ఞాన సమాజం వారి పురావైభవ స్మరణం, పునరుద్దరణాభిలాషలు కూడా ఈ నవల వ్రాయడానికి ప్రేరణ కావచ్చని డా॥ అక్కిరాజు రమాపతిరావు గారు ‘‘తెలుగు నవల - ప్రమాణాలు - ప్రయోగాలు’’ అనే వ్యాసంలో వెల్లడించారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ‘‘హేమలత’’, అక్కిరాజు ఉమాకాంత గారి ‘‘టిప్పు సుల్తాను’’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘‘రాయచూరు యుద్ధం’’, ‘‘బొబ్బిలి ముట్టడి’’, దుగ్గిరాల రాఘవ చంద్రయ్య గారి ‘‘విజయ నగర సామ్రాజ్యం’’, వేంకట పార్వతీశ్వర కవుల ‘‘ప్రమదావనం’’, వేలాల సుబ్బరావు గారి ‘‘రాణీ సంయుక్త’’ తదితర నవలలన్నీ మాతృభూమి మీద మమకారంతో వ్రాయబడినవే. ఒక్కో చారిత్రక నవల ఒక్కో కాలంలోని చారిత్రకాంశాన్ని తీసుకొని వ్రాయబడిరది. ఒక చారిత్రక నవలాకారుడు నవల వ్రాయాలంటే ఆ ప్రాంత చరిత్రను పూర్తిగా, లోతుగా అధ్యయనం చేయాలి. చారిత్రక నవల రసవత్తరంగా సాగాలంటే మొదట తను నిర్మించే నవలపై ప్రేమను పెంచుకోవాలి. అంటే నవలతో ముడిపడి ఉన్న చారిత్రక ప్రాంతాన్ని పాఠకునికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. పాఠకుడు కూడా తన మాతృభూమిపై అభిమానాన్ని పెంచుకోవాలి. తనకన్న ముందు తరం వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకొని తన జీవితానికి అన్వయించుకోవాలి.
విశ్వనాథ వారి ‘‘ఏకవీర’’ నవల మధురనాయక రాజుల కాలాన్ని ఇతివృత్తంగా తీసుకొని రచించిన కాల్పనిక చారిత్రక నవల. ఈ నవల చరిత్రలోని కథను అనుసరించి, దానికి లోబడి కథాకథనానికి తోడ్పడి, చరిత్రకు, నవలకు గల సంబంధాన్ని నిపుణతను ప్రదర్శించారు. ధర్మానికి, ప్రేమకు మధ్య పుట్టిన సంఘర్షణ దీనిలో ప్రధాన ఇతివృత్తం. విశ్వనాథ వారి ‘‘బద్దన్న సేనాని’’లో వేంగి చాళుక్య ప్రభువుల కథ ఇతివృత్తం. ఇంకా విశ్వనాథ వారు పల్లవ, కదంబులకు చెందిన కథను ఇతివృత్తంగా గ్రహించి ‘‘కడిమిచెట్టు’’ అనే నవలను, విజయపురి నేలిన ఇక్ష్వాకువంశ ప్రభువుల చరిత్రను ఆలంబనగా చేసుకొని ‘‘ధర్మచక్రములు’’ అనే నవలను వ్రాశారు. దీన్ని బట్టి ఆయనకు ఆంధ్రచరిత్రపై, మాతృభూమిపై ఉన్న అభిమానం, మమకారం తెలుస్తుంది.
స్వాతంత్య్రానికి ముందు జాతీయవాద భావ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తూ స్వతంత్య్ర, అనువాద, అనుకరణ చారిత్రక నవలలొచ్చాయి. పాశ్చాత్య నాగరికతా ప్రభావం వల్ల భారతీయుల సంస్కృతిలో మార్పులు రాకుండా ఉండాలని చిలకమర్తి, విశ్వనాథ తదితరులు అభిలషించారు. జాతీయోద్యమానికి ప్రధాన భూమిక అయిన వంగదేశం నుండి బంకించంద్రఛటర్జీ, శరత్‌చంద్రఛటర్జీలు ఆ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ నవలలను వ్రాశారు. ఆ నవలలను తెలుగులోకి అనువాదం చేశారు. ‘‘కపాలకుండల’’, ‘‘ఆనందమఠం’’, ‘‘దుర్గేశనందిని’’, ‘‘టిప్పుసుల్తాను’’, ‘‘దాసీకన్య’’ వంటి అనుకరణ, అనువాద చారిత్రక నవలల ద్వారా ఆంధ్రజాతి మెదళ్ళలో జాతీయ భావాలను రేకెత్తించే ప్రయత్నం చేశారు చారిత్రక నవలాకారులు.
‘‘రమణీయంగా కథ చెప్పగల చిలమర్తి వారు ‘‘శాపము’’ వంటి ఒకటి రెండు తప్ప ఎక్కువగా ఆంధ్రప్రాంత చరిత్రను చిత్రించే చారిత్రక నవలలు వ్రాయకపోవడానికి కారణముంది. చిలకమర్తి వారి కాలం నాటికి మన చారిత్రక పరిశోధన చాల తక్కువ. అది మన రాష్ట్రంలోని జాతీయ సాంస్కృతికోద్యమాలకు ఉపశ్రుతి అయ్యిందని చెప్పడంలో తప్పుకాదని ప్రసిద్ధ నవల పరిశోధకులు బొడ్డుపాటి కుటుంబరావు వారి పరిశోధనా గ్రంధంలో పేర్కొన్నారు’’.4
చారిత్రక నవల – దేశ సంస్కృతి:
మనం స్వతంత్రులము కావాలి మనం నివసించే గడ్డపై మనకే స్వేచ్ఛ లేకుంటే జీవనం సాగించడం కష్టమని ప్రజలు తెలుసుకునేలా చేయాలని సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు, దేశభక్తులు ఎంతగా ఆశించారో, అంతే సాహిత్యవేత్తలు కూడా కోరుకున్నారు. అందుకే ఆధునిక ప్రక్రియలకు ప్రాధాన్యం పెరిగింది. అందులో భాగంగానే వీరగాధా వస్తు సముపేతములుగా నాటి చారిత్రక నవలలు వెలువడ్డాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహ, కేతవరపు వేంకటశాస్త్రి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య, వేంకట పార్వతీశ్వర కవులు, వేముల సుబ్బారావు, అక్కిరాజు ఉమాకాంతం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, తదితరుల చారిత్రక నవలలు ప్రజలను దేశభక్తులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తాయి.
సామాన్య ప్రజలు దేశ సంస్కృతిని అవగాహన చేసుకోవటానికి కథానిక, నాటకం, వ్యాసం, కవిత్వం ఎంతగా తోడ్పడ్డాయో నవల కూడా అంతే తోడ్పడిరది. తొలి తరం చారిత్రక నవలాకారుల దృష్టి అంతా స్వాతంత్య్ర సముపార్జనయే.
తెలుగు నవల కొత్తగా అవతరించిన సమయంలో కాగితం, ముద్రణ చౌక అవడం వల్ల, చదువరుల సంఖ్య ఎక్కువ కావటం వల్ల గ్రంథమాలలు ఎన్నో వెలసినవి. కొమర్రాజు లక్ష్మణరావు పంతులు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల తరఫున పోటీలు నిర్వహించినపుడు ఈ పోటీల్లో భోగరాజు నారాయణమూర్తి వ్రాసిన విమలాదేవి, అల్లాహోఅక్బర్, చంద్రగుప్తుడు, ఆంధ్రరాష్ట్రం అనే ఉత్తమశ్రేణి నవలలకు బహుమతులు లభించాయి. వేలాల సుబ్బారావు గారి రాణి సంయుక్త, కేతవరపు వారి రాయచూరు యుద్ధం, ఇచ్ఛినీ కుమారి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి ‘‘విజయనగర సామ్రాజ్యం’’, ఎ.వి.నరసింహం ‘‘పాతాళభైరవి’’ తదితర చారిత్రక నవలలకు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల పక్షాన బహుమతులు పొందినవి. రచయితలను ప్రోత్సహించాలని అలా ప్రోత్సహించడం ద్వారా పాఠకుల్లో స్వతంత్య్ర భావాలు పెరుగుతాయని కొమర్రాజు లాంటివారు కోరుకున్నారు.
కొవ్వూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రచారిణి గ్రంథనిలయం, యస్.రామానుజస్వామి, తాపీ ధర్మారావు ఆధ్వర్యంలో వేగుచుక్క గ్రంథమాల, అద్దేపల్లి లక్ష్మణస్వామినాయుడు నిర్వహించిన సరస్వతి గ్రంథమండలి మొదలైనవి చారిత్రక నవలలను ప్రోత్సహించిన సంస్థలు.
విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, ప్రథమాంధ్ర రాజుల చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేయగా, నోరి వారు రాజులతో పాటు రాజుల పోషణలో నున్న ప్రముఖ కవులను కూడా పాఠకులకు తెలియజెప్పాడు. తెలుగులో లిఖిత రూప వాఙ్మయం ఏర్పడిన రాజరాజనరేంద్రుని కాలంలోని నన్నయను, నారాయణభట్టును కథానాయకులుగా చేసుకొని ‘‘నారాయణభట్టు’’ నవలను పాఠకులకు అందించారు. తిక్కన కాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ‘‘రుద్రమదేవి’’, ఎర్రప్రెగడ కాలంలోని రెడ్డి సామ్రాజ్య వైభవమును, పరిస్థితులను చిత్రిస్తూ ‘‘మల్లారెడ్డి’’, శ్రీనాథుని పేరున ‘‘కవిసార్వభౌముడు’’, పోతన పేరున ‘‘కవిద్వయం’’, మహాకవి ధూర్జటిని గురించి తెలుపుతూ ‘‘ధూర్జటి’’ నవలలు వ్రాసారు. ఆంధ్రదేశంలో తెలుగులో సాహిత్యం వచ్చిన కాలం నుండి క్రమంగా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతూ మార్పులకు గురైన విధానం, సాహిత్యాభివృద్ధికి ఆయా కాలాల్లో రాజులు, పండితులు చేసిన కృషిని చెప్తూ పాఠకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేసారు. రుద్రమదేవిలో దేశభక్తిపూరిత వాక్యాలెన్నో చోటుచేసుకున్నాయి.
వీరి తరువాత తరం వారైన బి.యన్.శాస్త్రి, మల్లాది వసుంధర, ముదిగొండ శివప్రసాద్, కాకర్ల వేంకట రామనరసింహం, కొర్లపాటి శ్రీరామమూర్తి, తదితరులు దేశభక్తిపూరిత చారిత్రక నవలలు వ్రాశారు. ఒక శివాజీ, ఒక సోమనాద్రి, ఒక సర్వాయిపాపడు, వీరే మన చరిత్ర నిర్మాతలు, చారిత్రక పురుషులు చారిత్రక పురుషులల్లో కొండలరాయడు ఒకడు. కొండలరాయనిపై దండ యాత్ర చేసిన సమయంలో కొండలరాయుడు వెలిగందల (కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతం) ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. స్వతంత్ర హిందూ రాజ్యం స్థాపనకు ప్రయత్నిస్తూ, పాలనలో శీవాజీని ఆదర్శంగా తీసుకున్నాడు. ‘‘ఒక వేటగాని దాడికి భీతిల్లిన కుందేలు మరో వేటగాని ఇల్లు చొచ్చినట్లు ఉంటుందని’’ ఏ జమీందారును, నవాబును ఆశ్రయించలేదని శ్రీనివాసరాజు కొండలరాయుడు నవలలో వ్రాశారు.
ఇలాంటి ధైర్యసాహసాలతో కూడిన రాజులను పాఠకులకు పరిచయం చేస్తే, వారు చేసే కర్తవ్యనిర్వహణ ఏమిటో వారికి బోధపడుతుంది.
చారిత్రక నవల – సమసమాజ ఆవశ్యకం:
సమసమాజ ఆవశ్యకతను కోరుతూ తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన నవల ప్రజల మనిషి. ఈ నవలను ఆధునిక చరిత్ర (1928-38)తో కూడిన కాల్పనిక చారిత్రక నవలగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనతో పాటు, సంస్థానాధీశుల పెత్తనం కొన్ని వందల సంవత్సరాలు కొనసాగింది. మనిషి ఆత్మగౌరవం కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం, స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం పోరాటం సాగిస్తాడు. కాలమనే చరిత్రలో అలాంటి యదార్ధ కథా ఘట్టంలోని పాత్రలకు, సంఘటనలకు, పోరుబాటకు అద్దంపట్టిన రచన ప్రజల మనిషి. అణచివేత, పీడనల నుండి విముక్తిని కోరుతూ కంఠీరవం, విజయదేవు, కొమురయ్య, వెంకటాచారి, రఘునాథాచార్యుల వంటి సమరశీల శక్తుల వీరోచిత పోరాటాలు ప్రజల మనిషిలో చూస్తాము. సమాజంలో సమానతా భావాన్ని కోరుతున్న అనేక సందర్భాలు ఈ నవలలో కనిపిస్తాయి.
శాతవాహన నేపథ్య చారిత్రకనవలలు:
శాతవాహన కాలానికి చెందిన శ్రీలేఖ, శ్రావణి, వసంతగౌతమి, నాగానిక తదితర చారిత్రక నవలల్లో స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ‘‘శ్రీలేఖ’’ నవలలో నాగవరదాయిని శ్రీ శాతకర్ణి భార్య. శ్రీ శాతకర్ణి సమాజంలో అల్లకల్లోలాలు చెలరేగకుండా ఉండాలని, కుమారుడైన పుర్ణోత్సంగునిలో పరివర్తన కలగాలనే ఉద్దేశంతో విశ్వేశ్వరస్వామి రూపమెత్తి శాంతి బోధ చేస్తాడు. ఆ సమయంలో నాగవరదాయిని సామ్రాజ్యపాలనా బాధ్యత నిర్వహిస్తుంది. ‘‘శ్రావణి’’ నవలలో రుద్రదామునికి కుమారుడు లేని కారణంతో రాజ్యంలో సామ్రాజ్య సింహాసనానికి ముప్పు వస్తుందని అతని కుమార్తె జయశీలను విషమశీలునిగా పెంచుతాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లియైన గౌతమీ బాలశ్రీ సూచనల ప్రకారమే సామ్రాజ్య బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. ‘‘నవ కళ్యాణం’’ నవలలో లావణ్యవతి, ‘‘ఆవాహన చంద్రకళ’’లో రుద్రమదేవి, చంద్రకళలో సమ్మక్క-సారమ్మ, తదితర పాత్రల ద్వారా సమసమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానత భావాల్ని ప్రజల్లో పెంపొందించాడు శివప్రసాద్.
స్త్రీల ఔన్నత్యం – చారిత్రక నవల:
చరిత్రలో స్త్రీలకున్న ఔన్నత్యాన్ని, గౌరవాన్ని నిరూపించడానికి బి.యన్.శాస్త్రి వాకాటక మహాదేవి అనే చారిత్రక నవల వ్రాశారు. అందులోని పాత్రలైన వాకాటక మహాదేవి, మహాదేవి ఇద్దరూ భిన్న ధర్మాలకు చెందినవారు అయినా విష్ణుకుండిన రాజ్యం సుస్థిరం కావడానికి బౌద్ధ, వైదిక మతాల ద్వారా వారి అసామాన్య ప్రజ్ఞను వెలువరించారు. ఆంధ్రదేశంలో వైదిక మతం క్షీణిస్తున్న సమయంలో వాకాటక మహాదేవి మాధవవర్మను పెండ్లి చేసుకొని వైదిక మతాన్ని అనుసరించేలా చేసి, అతని చేత విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తుంది. ఈ నవల ద్వారా వైదిక, బౌద్ధ మత సమన్వయాన్ని వాకాటక మహాదేవి కోరుకుంటుంది. ప్రజల అభిలాష ప్రకారం వారికిష్టం వచ్చిన మతాన్ని అవలంభించవచ్చని వాకాటక మహాదేవి ద్వారా సందేశాన్ని ఇస్తారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు బి.యన్.శాస్త్రి.
కాకతీయుల పరిపాలనా నేపథ్య చారిత్రక నవలలు:
కొర్లపాటి శ్రీరామమూర్తి ‘‘చిత్రశాల’’ కాకతీయుల ఔన్నత్యాన్ని చెప్పిన చారిత్రక నవల. కాకతీయ రాజులైన గణపతిదేవుడు, రుద్రమదేవి పాలనను వివరించడంతో పాటు హరిహరనాథ తత్త్వాన్ని ప్రబోధించిన తిక్కన సర్వమత సమన్వయం చేయడం ఈ నవలలో ఒక విశేషాంశం. హరిహరాదులు ఒక్కటే అని, వారి ఏకత్వాన్ని వివరించారు. తిక్కన నాటి సమాజంలో అనేక మతాలున్నాయి. అన్ని మతాల వాళ్ళ సారాంశం ఒక్కటేనని చెప్పడం, ఈ రచనా కాలమపుడే బ్రిటీషు పాలనా విముక్తి జరిగింది. కాబట్టి ప్రజల్లో మతకలహాలు రావద్దని కోరుతూ గతవైభవాన్ని వివరించారు కొర్లపాటి శ్రీరామమూర్తి.
అత్యాధునిక కాలం – చారిత్రక నవలలు:
ఆధునిక యుగానికి చెందిన ‘‘రెసిడెన్సీ’’ నవలలో అంతర్జాతీయ మత సంబంధాలు ఉన్నాయి. 1790-1804 ప్రాంతంలో నిజాం ప్రభువులు హైదరాబాద్‌ను పాలిస్తున్న కాంలో బ్రిటీషు రెసిడెంట్‌గా హైద్రాబాద్‌లో విలియం కిర్క్ పాట్రిక్ నియమింపబడుతాడు. నిజాం పాలనలో పాలితులు ఎక్కువగా హిందువులు. పాలకులు ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందినవారు.
చారిత్రక సంఘటన లేదా ఏదైనా దేశ చరిత్రను గాని, సాహసగాథలను గాని గ్రహించి మొన్నటి నాగపూర్ణిమ, పట్టాభి వరకు ఈ రెండు విభాగాల్లోనే చారిత్రక నవలలు వచ్చాయి. దేశ చరిత్రనో లేదా దేశ చారిత్రక నవలలను ఉద్దేశించి చారిత్రక నవలా చక్రవర్తి, శిప్రముని ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారిలా అంటారు ‘‘చారిత్రక నవల ముఖ్య లక్షణం నిర్ధిష్టత, చారిత్రక నవలా రచన అంత సులువైంది కాదు, ఇందులో శృంగార, వీర రసాలతో పాటు అద్భుతరసం ఆద్యంతం ప్రవహిస్తూ ఉండాలి, అందుకని చారిత్రక నవలలో ఉండేది ‘చారిత్రక రసము’’’.
ఈ పదిహేనేండ్ల మధ్య వచ్చిన చారిత్రక నవలలు తక్కువనే చెప్పవచ్చు. చారిత్రక నవలనే ఒక యాగంగా తీసుకొని వ్రాస్తున్నవారు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మాత్రమే. డాక్టర్ ఓగేటి ఇందిరాదేవి, డాక్టర్ ధారా రామనాథశాస్త్రి (కృష్ణ), ఎస్.ఎమ్.ప్రాణ్‌రావ్, పి.చంద్, ఇంద్రగంటి జానకీబాల, సి.శ్రీనివాసరాజు, లోకేశ్వర్, బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై, నందమూరి లక్ష్మీపార్వతి, అల్లం రాజయ్య, ముదిగంటి సుజాతారెడ్డి, కె.రమాదేవి, డా॥ పి.కొండయ్య తదితరులు చారిత్రక నేపథ్యంతో నవలలు వ్రాసినవారు.
వీరు వ్రాసిన నవలల్లో అల్లం రాజయ్య వ్రాసిన కొమురం భీము, పులుగు శ్రీనివాస్ వ్రాసిన అడవితల్లి నవలలు సాంఘిక నవలలుగా, సాహసాన్ని చిత్రించే నవలలుగా కనిపిస్తున్నా అందులోని ఇతివృత్తమంతా జరిగిన చరిత్రనే. చరిత్రలో నిలిచిన వ్యక్తులను కథావస్తువుగా తీసుకొని నవల వ్రాసినపుడు అది చారిత్రక నవలా లక్షణాలను కలిగి ఉంటుందని ఈ వ్యాసకర్త ఉద్దేశం. కొమురం భీం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు. పలు గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తిని అందించిన నాయకుడు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. ఒక ప్రాంతాన్ని పాలించిన రాజునో, రాణినో కథానాయకునిగా చిత్రిస్తూ కథ వ్రాసి చారిత్రక నవల అన్నప్పుడు, ఒక ప్రాంతంలో వీరుడిగా నిలిచి, ఆ ప్రాంత ప్రజలను సంరక్షించాలని కోరినవారి చరిత్ర కూడా చారిత్రక ఇతివృత్తంగా చెప్పవచ్చును. రుద్రమదేవి, చెంఘిజ్‌ఖాన్, ప్రతాపరుద్రుడు పాలన నేపథ్యంతో వచ్చిన నవలలను చారిత్రక నవలలు అన్నప్పుడు ఇవికూడా వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరిస్తూ వచ్చినవే.
పి. చంద్ వ్రాసిన శేషగిరి నవల కూడా ఇలాంటిదే. సింగరేణి కార్మికోద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాటయోధుని పోరాటం గురించి, జరిగిన కథనే వస్తువుగా తీసుకొని వ్రాసింది శేషగిరి నవల. స్వయంగా దేవూరి శేషగిరిరావు నిజాం నిరంకుశానికి ఫ్యూడల్ దోపిడికి వ్యతిరేకంగా, బ్రిటీష్‌వారి లాభాపేక్షకు వ్యతిరేకంగా పోరాటంచేసి చరిత్రలో నిలిచినవాడు శేషగిరిరావు. అట్లా గతంలో జరిగిన అంశాలనే తీసుకొని వ్రాసినది శేషగిరి నవల. ఒక సింగరేణి నేల నుండి వందలాది మంది గెరిల్లా పోరాటయోధులు అసువులు బాసారంటే మనకు తెలియని చరిత్ర గురించి ఆశ్చర్యం కలుగక మానదు. ఈ చరిత్ర నిర్మాణానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచిన వాడు శేషగిరి. అతని జీవిత చరిత్రయే చారిత్రక, సాంఘిక నవలగా వ్రాసినవారు వి.యాదగిరి (పి.చంద్). ఈ నవల ‘‘నా మాట’’లో పి.చంద్ ఇలా అన్నారు. ‘‘తొలినాటి సింగరేణి కార్మిక ఉద్యమం గురించి దానికి నాయకుడైన శేషగిరిరావు గురించి రికార్డు చేయాలనే తపన మొదలైంది. ఆ పరిస్థితిలో కొందరు ఆత్మీయ మిత్రులు ‘మన చరిత్ర మనమే తవ్వి తీయాలని’ ప్రోత్సహించారు. ఫలితంగా 1990 మధ్య నుండి అన్వేషణ మొదలై 2001లో ప్రచురితం అవుతున్నది.’’5 ముదిగంటి సుజాతారెడ్డి వ్రాసిన మలుపు తిరిగిన రథ చక్రాలు కూడా అంతే. పాత్రలు సాంఘికం, కథ చారిత్రకమే. ఇది సాంఘిక చారిత్రక నవలగా చెప్పవచ్చు. ముదిగొండ శివప్రసాద్ వ్రాసిన ‘‘ఆవాహన’’ మాదిరిగా ఇందులోని కథ కాకతీయుల కాలం నాటిది. పాత్రలు మాత్రం ఆధునిక కాలం నాటివి. ఆధునిక కాలంనాటి పాత్రల్లోకి కాకతీయుల కాలంనాటి పాత్రలు, సంఘటనలు ప్రవేశించి కథను నడిపించడం ఈ నవలల్లో కనిపించింది.
కె. రమాదేవి వ్రాసిన నెత్తుటిధార బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, గోదావరిఖని ప్రాంతాల్లో సింగరేణి కార్మికులపై యాజమాన్యం ప్రదర్శిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా వచ్చిన పోరాట నవల. పోరాట నవలగా చిత్రీకరించినా కథ జరిగిందే కదా! గతంలో జరిగిన కథను వస్తువుగా తీసుకున్నప్పుడు చరిత్రనే అవుతుంది. నవలల్లో వాస్తవిక జీవితం ఉండి, భవిష్యత్తు తరాలకు సూచికలుగా కనిపిస్తే అది చారిత్రక నవల అవుతుంది. ఈ లక్షణాలు కలిగించే నెత్తుటిధార కూడా. లోకేశ్వర్ వ్రాసిన సలాం హైద్రాబాద్‌లో హైదరాబాదు నగర పూర్వ సంస్కృతి ఈ తరం వాళ్లకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతించబడ్డాయి. నవలకు ముందుమాట వ్రాస్తూ సదాశివ ఇలా అన్నారు. ‘‘ఈ నవలలో అనేక చారిత్రకాంశాలు, మహలఖా బాయి చందా వ్యక్తిత్వం, జాన్ మల్కామ్‌తో ఆమె ప్రేమ వ్యవహారం, పాట్రిక్ ఖైరున్నీసా ప్రేమ వ్యవహారం కూడా ఉన్నాయి ఇందులో. ఇదంతా హైదరాబాదు చరిత్ర.’’ లోకేశ్వర్ కూడా ఈ నవల ఆరంభంలో చరిత్ర రథచక్రాలు ముందుకుపోవడంలో నా వంతు ప్రయత్నమే ఈ నవల అన్నాడు. 1578-1970 మధ్యకాలం ఈ నవలలో ఆవిష్కరించబడిరది. ఆనాటి (16వ శతాబ్దం) ఆచార వ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్ళు, ఏక్ మె దో చాయ్, బిర్యానీ, తందూరి రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, 1857 సిపాయిల తిరుగుబాటు, తెలంగాణ ఉద్యమం తదితర అంశాలున్నాయి.
ఎస్.ఎం. ప్రాణ్‌రావు 2014, సెప్టెంబర్‌లో వెలువరించిన మహామంత్రి మాదన్న కుతుబ్‌షాహీల నాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యం కథా వస్తువుగా ఉన్నది.
మహమ్మద్ కులీకుతుబ్‌షా కూతురు హయత్ బక్షీ బేగమ్ వారి వంశ చరిత్రలోనే ప్రముఖ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. అనేక ఉద్యానవనాలను, సరస్సులను, అన్నదాన సత్రాలను, ప్రార్థనా మందిరాలను, మదర్సాలను స్నానవాటికలను అభివృద్ధి పరచింది. వైద్యశాలలను నిర్మించి, అభివృద్ధిపరచి ఒక వైద్యునికి దానిమిచ్చినదే నేటి హయత్‌నగర్. ఆ కాలంలోనే వారి దగ్గర మహామంత్రిగా పనిచేసిన వాడు మాదన్న. ఆర్థికమంత్రిగా కుతుబ్‌షాహీల కాలంలో చేసిన అనేక పనులను చరిత్ర పుస్తకాల సహాయంతో సేకరించి వ్రాసిన నవల మహామంత్రి మాదన్న. ఈ నవలకు ముందుమాట వ్రాసిన ఆచార్య హైమావతి, చరిత్ర ఆచార్యులు ఇలా అన్నారు. ‘‘కుతుబ్ షాహీల జీవిత విశేషాలు, అక్కన్న మాదన్నల ఆదర్శాలు ముందుతరాల వారికి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో చక్కని శైలితో ఈ చరిత్ర ఆధారిత నవలను రచించి మనముందుంచారు రచయిత. వాస్తవాల పందిరిపై అల్లుకున్న చారిత్రక నవల ఇది.’’ చిన్న వయసులో నెలకి పదిరూపాయల జీతంమీద షరాఫ్‌గా కుదిరిన మాదన్న తన స్వయంకృషి వల్ల మీర్ జుమ్లా అయ్యాడు నవలలో. చరిత్ర కూడా ఇంచుమించుగా ఇదే చెబుతుంది.
‘‘మాదన్న వ్యక్తిత్వం తెలుగుజాతిని గర్వపడేలా చేసి, స్పూర్తి దాయకంగా ఉంటుంది. ఈ నవలాకర్త ఆశించింది కూడా ఇదే. ఈ నవల వల్ల కలిగిన చరిత్ర ప్రయోజనాన్ని పాఠకులకు అందించగల్గాడు రచయిత. అక్కన్న, మాదన్నల హత్యచూసిన ప్రత్యక్ష సాక్షి గీసిన చిత్రాన్ని కూడా జోడిరచి, చారిత్రకతను ఈ నవలకు పెంచే ప్రయత్నం చేశారు రచయిత’’ అన్నారు.
యాభై సంవత్సరాల తెలంగాణ సాంఘిక, రాజకీయ చరిత్రను (1944-95) నవీన్ కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు అనే మూడు నవలల్లో గ్రంథస్థం చేశారు. గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క పరిణామాలను చిత్రిస్తూ నవీన్ రచించిన రక్తకాసారం కూడా ఈ దశాబ్దిలోనే వచ్చింది. ఇవి సాంఘిక నవలలని చెప్పబడుతున్నా, పాత్రలు కల్పితాలే అయినా తీసుకున్న ఇతివృత్తం మాత్రం జరిగిన సంఘటనలే. తెలంగాణ ప్రాంతపు సంస్కృతీ సంప్రదాయాలను చిత్రిస్తూ యం.వి. తిరుపతయ్య రచించిన జీవనసమరం నవల కూడా ఈ దశాబ్దంలోనే వచ్చింది. తిరుపతయ్య తీవ్రమైన క్యాన్సర్ వ్యాధికి గురై, తానిక ఎక్కువ కాలం బతకనని తెలుసుకున్నా ఈ నవల పూర్తిచేశాడు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు గడచిన కాలంలో ఎలా ఉన్నాయో చిత్రిస్తూ వ్రాసి, నవలావిష్కరణ జరిగిన కొంత కాలానికే మరణించాడు.
సి. శ్రీనివాసరాజు (చరిత్రోపన్యాసకులు) కాకతీయ అనంతర కాలపు కాపయనాయనిపై ‘‘బహదూర్ కొండల రాయుడు’’ (2004) అనే చారిత్రక నవల వ్రాశాడు. ఇది కరీంనగర్ ప్రాంత చరిత్రను చెబుతుంది. సర్వాయిపాపడు గోల్కొండపైకి దండయాత్ర చేసిన సమయంలో వెలమదొర కొండలరాయడు వెలిగొందల అనబడే నేటి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని గోల్కొండ సుల్తాన్‌పై కత్తిగట్టాడు. శివాజీని ఆదర్శంగా తీసుకొని పాలన చేశాడు.
బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై నెల్లూరును పాలించిన బోయవారి చరిత్రను తెలుపుతూ బోయకొట్టములు వ్రాశాడు. నెల్లూరును పాలించిన పన్నెండు బోయకొట్టములు 9, 10 శతాబ్దాల్లో ప్రసిద్ధి పొందినవి.
తెలుగులో చారిత్రక నవలలు రాసిన అతికొద్ది మంది మహిళల్లో నందమూరి లక్ష్మీపార్వతి ఒకరు. ఈమె వ్రాసిన శ్రమణకము (2001) ప్రసిద్ధిపొందిన చారిత్రక నవల. గౌతమబుద్ధుడు జీవించి ఉన్నకాలంలోనే బౌద్ధం రెండు ప్రధాన మార్గాలుగా చీలింది. ఒకటి సర్వసంగ పరిత్యాగ మార్గం. రెండవది శ్రమణక మార్గం. అంటే గృహస్థులుగా జీవిస్తూనే బౌద్ధ ధర్మాన్ని అనుసరించడం, గౌతముడు, నందుడు, మాలిక, మౌద్గల్యుడు, సుందరి ఈ నవలలోని ప్రధాన పాత్రలు. సుందరి ఈ నవలలో ప్రధానపాత్ర. బుద్ధునితో శాస్త్ర చర్చలు చేసిందీ సుందరి. ఒక మహిళ వ్రాసిన నవల- మహిళను కేంద్రబిందువు (సుందరి)గా తీసుకున్న చారిత్రక నవల శ్రమణకం. ఈ నవలలో గౌతమునిపై సుందరి సాధించిన ధర్మవిజయం స్పష్టంగా కనబడుతుంది.
డా॥ ఓగేటి ఇందిరాదేవి రచించిన చారిత్రక నవల ఆనందధార. ఇది రుద్రమదేవి కథ. ఈమె శాసనములపై ఆధారపడి చరిత్ర పరిశోధన చేసి ఈ నవల వ్రాశారు. 1977లో ఈ ఆనందధార వ్రాస్తే ప్రచురితమైంది 2004 సంవత్సరంలో. క్రీ॥శ॥ 1210-1257 మధ్య కాల చిత్రణ ఈ రచనలో ఉంది. వీరు వ్రాసిందే మరో నవల అమృతవర్షిణి (2000). పంప మహాకవి నుండి నన్నయభట్టు వరకూ సాగిన కాలాన్ని అనుసరించి వచ్చింది. తిక్కన గురించి ఆనందధార, నన్నయ గురించి అమృతవర్షిణి వ్రాశారు. ఎఱ్ఱన గురించి కళ్యాణవాణి వీరు వెలువరించవలసి ఉన్నది. చరిత్రతో ఆధునికతను జోడిరచి ప్రియ! ప్రియతమా అనే నవలను ప్రతాపరుద్రుడు, మాచలదేవి కథను ఆధారం చేసుకొని వ్రాశారు ఇందిరాదేవి. ఇందిరాదేవి స్వయాన వీరి రచనల గురించి ఇలా అన్నారు. ‘‘చారిత్రక నవలల్లో నేను కాక ఇంకే స్త్రీ అయినా రుద్రమదేవి చరిత్రను గ్రంథరూపంగా వెలువరించారో బహుశా లేదనుకుంటాను. తిక్కనామాత్యులను గురించి, పంపకవి గురించి ఎవరన్నా వ్రాశారా అంటే తెలియదు. ఈ విషయాల్లో నేను చేసిన కృషికి నాకు ఆనందకారణం. మాతృదేశం, మాతృభాష, చరిత్ర వీటికోసం నేను బతికినన్నాళ్ళూ తపిస్తూనే ఉంటాను’’. వీరి ఇందిరా మందిరం (2002) రఘునాథ నాయకుని కాలంనాటిది. ఇందిరా మందిరం రఘునాథ నాయకుని సభపేరు.
ఇంద్రకంటి జానకీబాల వ్రాసిన సామాజిక చారిత్రక నవల ‘‘కనిపించే గతం’’ (2001), దీనిలో 1947 నుండి కథ ప్రారంభమవుతుంది. స్వాతంత్య్రోద్యమం, ఆనాటి కాల పరిస్థితులు కన్నులకు కట్టినట్లుగా చూపించబడ్డాయి. డా॥ ధారా రామనాథశాస్త్రి కృష్ణ పేరుతో ఐతిహాసిక చారిత్రక నవల వ్రాశాడు. రాధాకృష్ణ అనడానికి బదులు ధారాకృష్ణ అనడం మంచిది. లాలిత్యంలో ఈ రచన బాపిరాజు హిమబిందుకు జయదేవుని గీత గోవిందానికి సన్నిహితంగా ఉంటుంది.
చారిత్రక నవలా చక్రవర్తి – ముదిగొండ శివప్రసాద్:
పూర్తిగా చారిత్రక నవలా రచనయే తన జీవితంగా భావిస్తూ నవలలు వ్రాస్తున్నవారు ఆచార్య ముదిగొండ శివప్రసాద్. వీరు 2000 సంవత్సరం తరువాత రెసిడెన్సీ, వసంతగౌతమి, పట్టాభి, విద్యాధర చక్రవర్తి, నాగపూర్ణిమ, తదితర చారిత్రక నవలలు వ్రాశారు. చారిత్రక నవలా రచనలో వీరికి ముగ్గురు గురువులు. వారు బాపిరాజు, నోరి, విశ్వనాథలు. భావ శబలత, చారిత్రక ప్రామాణ్యం, రచనా శిల్పం ఈ మూడు వరుసలో వీరి లక్షణాలు. ఈ మూడిరటిని తనలో కలుపుకొని చారిత్రక నవలలు వ్రాస్తున్నవారు శివప్రసాద్‌గారు. 2001లో వచ్చిన రెసిడెన్సీ అంతర్జాతీయ ప్రేమకథ. హైదరాబాదు నడిబొడ్డున కోటగోడల వెనుక సువిశాలమైన పచ్చికబయళ్ళ మధ్య నగిషీలు తీర్చిదిద్దిన భవనం రెసిడెన్సీ. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ నూరు హెరిటేజ్ భవనాల్లో ఒకటి. ఈ భవన నిర్మాణం వెనుక రెండు శతాబ్దాల చరిత్ర ఉన్నది. ఆనాటి బ్రిటీష్ రెసిడెంట్ అకిలెస్ కిర్క్ ప్యాట్రిక్‌కు చెందినది. ఈ కథ ఆధారంగా వెలువడినదీ రెసిడెన్సీ.
ఆచార్య నాగార్జునుని జీవితంపై భారతీయ సాహిత్యంలో వచ్చిన మొదటి ప్రామాణిక చారిత్రక నవల నాగపూర్ణిమ. ఆచార్య నాగార్జునుడు, విజయశ్రీలు ఈ నవలలో ప్రధానపాత్రధారులు. ఒకరు ఆదర్శవాదం చేసే వారైతే మరొకరు యథార్థవాదం కలిగినవారు. ఈ రెండిరటిలోనే అర్థ- పరమార్థాలున్నాయని రచయిత నాగపూర్ణిమలో చెబుతారు. 18వ శతాబ్దంలో పాలించిన కమ్మ సామ్రాజ్యంపై వచ్చిన సాంఘిక చారిత్రక నవల ఇది. కొంత ఎలకుర్రు, కొంత అన్నవరం, పొన్నూరు, అమరావతి గురించి ఈ నవలలో చెప్పబడ్డది. వీరిదే సముద్రగుప్తుని పాలనను తెలుపుతూ వచ్చిన చారిత్రక నవల విద్యాధర చక్రవర్తి. ఇది ప్రామాణిక ఐతిహాసిక చారిత్రక నవల. హాలుని సంకలనం గాథాసప్తశతిని ఆధారం చేసుకొని వ్రాసిన నవల వసంత గౌతమి. 2006లో ఆంధ్రభూమిలో ధారావాహికగా వెలువడిరది. హాలుడు, లీలావతి ప్రధాన నాయికా నాయకులు. ఈ చారిత్రక నవలను వ్రాస్తూ రచయిత ఇలా చెప్పుకున్నారు. ‘‘నాటి ధాన్యకటకమే నేటి ధరణికోట. ఇది అమరావతికి దగ్గరలో ఉంది. నా పూర్వీకుల స్వగ్రామం తాడికొండ, అమరావతికి సమీపంలో ఉంది. ఈ విధంగా మన తొలి తెలుగురాజులైన శాతవాహనుల ఋణం తీర్చుకొన్నాను.’’(6) ఇందులోని తార, డాకిని, కృత్య వంటి స్త్రీ మూర్తులను బౌద్ధులు ఉపాసించారని చెప్పడానికి రచయితకు ఆధారాలు కూడా దొరికాయి.
ముగింపు:
గతాన్ని రికార్డు చేస్తూ, భవిష్యత్తులో వచ్చే చారిత్రక నవలలకు పునాదిగా ఇప్పటివరకు వచ్చిన నవలలు నిలిచాయి. చరిత్ర అధ్యయనాన్ని రసాత్మకంగా, కథన రీతిలో రచయిత చెప్పటం వల్ల పాఠకులకు చరిత్రను సులభంగా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందిస్తుంది చారిత్రక నవల. ఇప్పటి వరకు రికార్డు కాని అంశాలను కలుపుకొని ముందొచ్చే కాలంలో చారిత్రక నవలలు వస్తాయని ఆశిద్దాం. వాటిపైన భావి పరిశోధకులు దృష్టి సారిస్తారని ఆశిద్దాం. ఆధునిక కాలంలో వచ్చిన ఈ సాహిత్య ప్రక్రియ ఇంకా సుదీర్ఘ కాలం సాహిత్య చరిత్రలో బలంగా రికార్డు అవుతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
పాదసూచికలు:
- తెలుగు నవల – పుట: 26
- నోరి నరసింహాశాస్త్రి రుద్రమదేవి నవల – విమర్శనాత్మక పరిశీలన – పుట: 32
- నవలా వికాసం – పుట: 52
- ఆంధ్ర నవలా పరిణామం – పుట: 35
- శేషగిరి నవల – పుట: 5
- ఆచార్య నాగార్జున నవల – పుట: 6
ఉపయుక్తగ్రంథసూచి:
- ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి - తెలుగు నవల నూరు సంవత్సరాలు. 1973.
- కుంటుంబరావు, బి.వి., ఆంధ్ర నవలాపరిణామం. గాయత్రీ ప్రచురణ. 1971.
- చంద్. పి., శేషగిరి, విజేత పబ్లికేషన్స్. గోదావరిఖని: 2001.
- నవీన్ అంపశయ్య. తెలుగు నవల (సంక్షిప్త చరిత్ర). తెలుగు అకాడమి. హైదరాబాదు: 2012.
- నాగభూషణ శర్మ, మొదలి. తెలుగు నవల. ఆంధ్ర సారస్వత పరిషత్తు: హైద్రాబాద్. 1979.
- పరిశోధన పత్రిక, వివేచన. తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం. 2006.
- ప్రతాపరెడ్డి కాసుల, తెలంగాణ నవలావికాసం. తెలంగాణ సాహిత్య అకాడమి. హైదరాబాదు: 2017.
- ప్రమీలారెడ్డి, యం., యం.ఫిల్ సిద్ధాంతవ్యాసం. నోరినరసింహశాస్త్రి రుద్రమదేవి, నవల-విమర్శనాత్మక పరిశీలన-ఉస్మానియా విశ్వవిద్యాలయం - హైద్రాబాదు.
- ప్రసన్నాంజనేయులు., యం. విశ్వనాథ నవలాశిల్పం. హైద్రాబాదు.
- ప్రాణ్‌రావు ఎస్.ఎం., మహామంత్రి మాదన్న. హైదరాబాదు: 2014.
- మల్లారెడ్డి తూర్పు, తెలంగాణ సాహిత్యం- జీవిత చిత్రణం (జాతీయ సదస్సు సంచిక), తెలుగుశాఖ, శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళాశాల, భువనగిరి: 2017.
- లావణ్య, కరిమిండ్ల. (Ph.D. Thesis) ముదిగొండ శివప్రసాద్ చారిత్రకనవలానుశీలనం. సమగ్ర పరిశీలన, జాతీయ సాహిత్య పరిషత్, హైదరాబాదు: 2010.
- లోకేశ్వర్. సలాం హైదరాబాద్. తెలంగాణ నవల. గాంధీ ప్రచురణలు, హైదరాబాదు: 2005.
- విద్యావతి, కె., యం. ఫిల్ సిద్ధాంత వ్యాసం. వేంకట పార్వతీశ్వర కవుల నవలానుశీలనం. 1984.
- వెంకటేశ్వర్లు పంతంగి (సం). తెలంగాణ తెలుగునవల. తెలుగు విభాగం, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్: 2014.
- శివప్రసాద్, ముదిగొండ (సం). సుచరిత. విజ్ఞాన దీపిక ప్రచురణలు. హైదరాబాదు: 2006.
- శివప్రసాద్, ముదిగొండ. నాగపూర్ణిమ. హైదరాబాదు: 2009.
- శివప్రసాద్, ముదిగొండ. రెసిడెన్సీ. హైదరాబాదు: 2002.
- శివప్రసాద్, ముదిగొండ. వసంతగౌతమి. హైదరాబాదు: 2006.
- సుచరిత, విజ్ఞాన దీపిక ప్రచురణ. హైద్రాబాద్: 2006.
- సుజాతరెడ్డి, ముదిగంటి. తెలుగు నవలానుశీలనం. హైద్రాబాద్.
- సుబ్రహ్మణ్యం, జి.వి., సమాలోచన. ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియలపై సమీక్ష. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి: హైద్రాబాద్.
- సుబ్రహ్మణ్యం, జి.వి., సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, తెలుగు అకాడమీ: 2002
- స్యాతంత్య్రానికి ముందు వచ్చిన కొన్ని చారిత్రక నవలల పరిశీలన.
- స్వాతంత్య్రానంతర చారిత్రక నవలల పరిశీలన.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.